సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని నగరవాసులంతా ఎదురుచూస్తున్న మోనో రైలు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీనుంచి మోనో రైలు సేవలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. వాయిదాలపై వాయిదాలు పడుతున్న ఈ నెల 13వ తేదీన ఈ రైలుకు చివరిసారిగా ప్రయోగాత్మక పరుగు నిర్వహించనున్నారు. వాస్తవానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రైలు సేవలు ఏడాదిన్నర క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అనేక పర్యాయాలు వాయిదా వేయకతప్పలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి విడతలో భాగంగా చెంబూర్-వడాలా మధ్య పనులు పూర్తయ్యాయి. గతంలో నిర్వహించిన వివిధ రకాల పరీక్షలు సఫలీకృతమయ్యాయి. అయితే రైల్వే బోర్డు అనుబంధ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ నుంచి భద్రతాపత్రం మంజూరు కాకపోవడంతో ఈ రైళ్లన్నీ యార్డులకే పరిమితమయాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు అసిస్టెంట్ కమిషనర్ అశ్వినిభిడే చెప్పారు. సాధ్యమైనంత త్వరగా భద్రతాపత్రం మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
‘మోనో’కు ముహూర్తం ఖరారు
Published Wed, Jan 8 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement