సాక్షి, ముంబై : మోనోరైలు ప్రయాణికులకు శుభవార్త! వీరికి ఇక నుంచి రిటర్న్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. ఫలితంగా టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీ కొంత మేర తగ్గనుందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఒకే టికెట్‌తో గమ్యస్థానం చేరుకొని తిరిగి రావచ్చు.
ఎంత మంది ప్రయాణికులు మోనోరైలులో వెళ్లి ఇందులోనే తిరుగు ప్రయాణమవుతున్నారన్న (రిటర్న్ జర్నీ) విషయమై సంస్థ ఓ అధ్యయనం నిర్వహించింది. అయితే చాలా మంది ప్రయాణికులు తిరిగి వస్తుండడంతో రిటర్న్ టికెట్ సదుపాయం కూడా కల్పిస్తే బాగుంటుందని అధికారులు భావించారు. ఈ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెమ్మార్డీఏ కమిషనర్ యూపీఎస్ మదన్ పేర్కొన్నారు. ఇదిలా వుండగా ముంబై మెట్రోకు జూలై నుంచి రిటర్న్ టికెట్ సదుపాయం కల్పించారు. దీనికి ప్రయాణికుల నుంచి మంది స్పందన వస్తోందని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. జాయ్‌రైడ్ల కోసం మెట్రోరైళ్లు ఎక్కేవారు ఈ సదుపాయాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు.
మోనో రైలు ప్రయాణికులకు నెలసరి పాస్‌ను కూడా ప్రారంభించాలని ఎమ్మెమ్మార్డీఏ యోచిస్తోంది. ఇందుకోసం ప్రయాణికుల రద్దీపై అధ్యయనం నిర్వహించనున్నారు. ఈ రైలులో ఎంత మంది తిరుగుప్రయాణమవుతున్నారనే దానిపై అధ్యయనం నిర్వహించనున్నారు. ఎక్కువమంది ఈ రైలులో వెనక్కి వచ్చినట్లయితే నెలసరి పాస్‌లను కూడా జారీ చేస్తామని మదన్ తెలిపారు.
ఎమ్మెమ్మార్డీఏ అందజేసిన గణాంకాల మేరకు.. మోనో రైలు ప్రయాణికుల్లో దాదాపు 50 శాతం మంది ప్రయాణికులు ఇదే రైలులో తిరుగు ప్రయాణం అవుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. మోనోతో పోల్చితే మెట్రో రైలులో 70 శాతం మంది తిరుగు ప్రయాణం అవుతారని తేలింది. 8.8 కిలోమీటర్ల పొడవుతున్న చెంబూర్-వడాలా కారిడార్‌ను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రైలుకు అనుకున్నంత మేర స్పందన లభించడం లేదని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రైలు మార్గాన్ని విస్తృతపర్చకపోవడంతోపాటు రద్దీ స్టేషన్లను ఈ మార్గంలో చేర్చకపోవడంతో కూడా స్పందన తక్కువగా ఉంది. రెండోదశ ప్రాజెక్టులో మోనోరైలును జాకబ్ సర్కిల్ వరకు విస్తరించనున్నారు. దీని వల్ల ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్య రైల్వేస్టేషన్లు అయిన చెంబూర్, వడాలా, కర్రీరోడ్, మహాలక్ష్మి వంటి స్టేషన్లతో మోనో రైలు సేవలను అనుసంధానించనున్నారు. అంతేగాక మోనోరైలును తూర్పు శివారు ప్రాంతాల నుంచి పశ్చిమ శివారు ప్రాంతాలకు త్వరలోనే అనుసంధానిస్తామని మదన్ పేర్కొన్నారు.
మోనోరైలుకు రిటర్న్ టికెట్
Published Wed, Aug 27 2014 10:44 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement