ముంబై: ఠాణే-భివండీ-కల్యాణ్ మార్గంలో మోనోరైలు ఏర్పాటుకు నిర్వహించిన సాధ్యాసాధ్యాల సర్వేలో వ్యతిరేక ఫలితాలు రావడంతో ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బదులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి పర్చడానికి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్‌టీఎస్) ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. అయితే ఈ ప్రాంతంలోని ప్రయాణ అవసరాలు, రద్దీ, ఆర్థిక, సాంకేతిక విషయాలపై అధ్యయనం నిర్వహించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) టెండర్లను కూడా ఆహ్వానించింది.
ఠాణే-భివండీ-కల్యాణ్ ప్రాంతం కోసం ఎంఆర్‌టీఎస్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గత నెల సంకేతాలు ఇచ్చారు. ఇక మోనోరైలు ఏర్పాటు కోసం ఎమ్మెమ్మార్డీయే..రైట్స్ అనే సంస్థ సాయంతో 2011లోనే సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహించింది. ఈ మార్గంలో 25 కిలోమీటర్ల మేర మోనోరైలు ఏర్పాటు వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని, రాబడులకు ఎక్కువ అవకాశాలు లేవని సర్వే తేల్చింది. దీనికి బదులు రోడ్డు మార్గాల అభివృద్ధికి ప్రాజెక్టులు ప్రారంభించాలని సిఫార్సు చేసింది.
ఈ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడం, విరార్ నుంచి అలీబాగ్ ప్రత్యేక రవాణా మార్గం ఏర్పాటు ప్రతిపాదన నేపథ్యంలో ఎంఆర్‌టీఎస్ ఏర్పాటుకు తాజాగా సర్వే నిర్వహిస్తున్నామని ఎమ్మెమ్మార్డీయే వివరించింది. ఠాణే, భివండీ, కల్యాణ్‌లో ప్రయాణికుల రద్దీని అంచనా వేయడం ద్వారా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపింది.
ఠాణేలో మోనోరైలుకు నో
Published Sun, Aug 17 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement