ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు..!
ముంబయి: ముంబయిలో శనివారం ఓ ఘోర ప్రమాదం తప్పిపోయిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు మోనో రైళ్లు ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా రావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందన, అదృష్టవశాత్తూ అతి సమీపంలో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని పోస్టులు చేస్తున్నారు. ఘోర ప్రమాదం ఇలా తప్పిందంటూ సోషల్ మీడియాలో రైళ్ల ఫొటోలను షేర్ చేస్తున్నారు. ముంబై మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్‌డీఏ) మాత్రం ఇది ప్రమాదం కాదని అందుకు వివరణ ఇచ్చుకుంది.
చెంబూరు ఏరియాలో శనివారం సాయంత్రం ఒకే ట్రాక్‌పైకి రెండు మోనో రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో దీనిపై వదంతులు ప్రచారం కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు. సాంకేతికలోపం కారణంగా ట్రాక్‌పైనే నిలిచిపోయిన రైల్లోని ప్రయాణికులను తరలించేందుకు మరో రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోనోరైలులో పదే పదే ఇలాంటి సమస్యలు తలెత్తుతుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2011లో నిర్మాణ సమయంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 2012 జూలైలో వాదాలా ఏరియాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే.