MMRDA
-
Mumbai Monorail: ఆర్థిక నష్టాల్లో మోనో రైలు.. గట్టేక్కేదెలా?
దాదర్: భారతదేశంలో మొదటిసారి ముంబైలో ప్రవేశ పెట్టిన మోనో రైలు ప్రారంభించిన నాటి నుంచి తీవ్ర ఆర్థిక నష్టాల్లో నడుస్తోంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయాణికులను అనుకున్నంత మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో పీకల లోతు నష్టాల్లో కూరుకుపోయిన మోనోను గట్టెక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ట్రాన్స్‌పోర్టు రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా మోనో రైలులో ప్రతీ ప్రయాణికుడికి సగటున రూ.200 ఖర్చవుతోంది. కానీ టికెట్టు రూపంలో కనీస చార్జీలు రూ. 20 వసూలు చేయగా గరిష్ట చార్జీలు రూ.50–60 వరకు వసూలు చేస్తున్నారు. దీన్ని బట్టి మోనోకు ఏ స్ధాయిలో నష్టాలు వస్తున్నాయో ఇట్టే తెలుస్తోంది. దేశంలోనే ప్రథమంగా... ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించిన మోనో రైలు దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎనిమిదేళ్ల కిందట ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) రూ.343 కోట్లు ఖర్చు చేసింది. కానీ గడచిన ఎనిమిదేళ్లలో ఈ రైళ్ల ద్వారా ఎమ్మెమ్మార్డీయేకు కేవలం రూ.29.73 కోట్ల ఆదాయం వచ్చింది. నష్టం మాత్రం రెట్టింపు కంటే ఎక్కువే ఉంది. ప్రారంభంలో చెంబూర్– వడాల మధ్య (9.8 కి.మీ.) తిరిగిన ఈ రైళ్లు విస్తరించడంతో ఇప్పుడు సాత్‌రాస్తా వరకు (20 కి .మీ.దూరం) వెళుతున్నాయి. ఈ మార్గంలో మొత్తం 18 స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రైళ్లు జనవాసాల మధ్యలోంచి వెళుతున్నాయి. అయినప్పటికీ ప్రయాణికుల నుంచి స్పందన అనుకున్నంత రావడం లేదు. ప్రతీరోజూ 123 మోనో రైలు ట్రిప్పులు తిరగ్గా అందులో సరాసరి 10 వేల మంది ప్రయాణిస్తున్నారు. అంటే నెలకు సరాసరి మూడు లక్షల చొప్పున ఎనిమిదేళ్లలో 24 లక్షల వరకు రాకపోకలు సాగించినట్లు అమ్ముడుపోయిన టికెట్లను బట్టి తెలుస్తోంది. అదే ఎనిమిదేళ్ల కిందట ప్రారంభించిన వర్సోవా–అంధేరీ–ఘాట్కోపర్ మెట్రో–1 ప్రాజెక్టుకు ప్రయాణికుల నుంచి ఊహించని విధంగా స్పందన వస్తోంది. గడచిన ఎనిమిదేళ్లలో అందులో ఏకంగా 72 కోట్లకు పైనే మంది ప్రయాణించారు. దీన్ని బట్టి మోనో, మెట్రో మధ్య ఆదాయపరంగా చాలా వ్యత్యాసముందని స్పష్టమవుతోంది. మెట్రో మార్గంలో రెండు రైళ్ల మధ్య 4–5 నిమిషాల వ్యత్యాసముండగా, అదే మోనోలో 18–20 నిమిషాల వ్యత్యాసముంది. అంటే ఒక రైలు వెళ్లిపోయిందంటే ప్రయాణికులు మరో రైలు కోసం సుమారు 20 నిమిషాలు ప్లాట్‌ఫారంపై పడిగాపులు కాయాల్సిందే. అదేవిధంగా మోనో రైలు దిగిన ప్రయాణికులకు అనేక స్టేషన్ల బయట ట్యాక్సీ, ఆటోలు, బెస్ట్ బస్సులు తదితర రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్ధులు, సామాన్య ప్రజలు మోనోలో ప్రయాణించడానికి ముఖం చాటేస్తున్నారు. మోనో నష్టాల్లో నడవడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి. ట్రిప్పుల సంఖ్య పెంచడం, రైలు దిగిన ప్రయాణికులకు స్టేషన్ నుంచి బయటకురాగానే మెరుగైన రవాణా సౌకర్యాలుంటే తప్ప మోనో రైలు ఆర్ధిక పరిస్ధితి గాడిన పడదని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: జేఈఈ టాపర్స్ దృష్టి... ఐఐటీ బాంబే వైపే) -
వాణిజ్య రాజధానికి టాటా స్టార్‌బస్సులు
సాక్షి, ముంబై: దేశీయ కార్ల దిగ్గజం టాటామోటార్స్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ముంబై నగరానికి అందించింది. ఈ బస్సు సర్వీసులను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ప్రారంభించారు. ముంబై మెట్రోపాలిటిన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ) స్థానిక రవాణాశాఖకు 25 హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను టాటా మోటార్స్ అందజేసింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీత్ సమక్షంలో వీటిని ఎంఎంఆర్‌డీఏకు అప్పగించింది. దేశీయంగా అభివృద్ధి చెందిన ఈ టాటా-స్టార్‌బస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బస్సులు , గ్లోబల్ డిజైన్ స్టాండర్డ్స్ తో రూపొందించామని టాటా మోటార్స్ వెల్లడించింది. పట్టణ రవాణా కోసం గణనీయమైన సహకారం అందించే దిశగా తక్కువ-ఉద్గార బస్సులను అభివృద్ధి చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని టాటా మోటార్స్ వాణిజ్య వాణిజ్య వాహనాల అధ్యక్షుడు గిరీష్ వాగ్ చెప్పారు. డ్యూయల్ పవర్ (డీజిల్ మరియు ఎలక్ట్రిక్), లిథియం అయాన్ బ్యాటరీలతో ఇవి పనిచేస్తాయన్నారు. విద్యుదీకరణ, ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాలపై తమకృషి కొనసాగుతుందని, వీటి ప్రోత్సాహానికిగాను ప్రభుత్వం,ఇతర రెగ్యులేటరీ అధికారులతో కలిసి పనిచేస్తామన్నారు. నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ 2020లో భాగంగా ఈ హైటెక్ బస్సుల తయారీని చేపట్టారు. కాగా ఈ బస్సు ప్రొడక్షన్ కాస్ట్ 1.7 కోట్లుగా ఉంది. -
ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు..!
ముంబయి: ముంబయిలో శనివారం ఓ ఘోర ప్రమాదం తప్పిపోయిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు మోనో రైళ్లు ఒకే రైల్వే ట్రాక్‌పై ఎదురెదురుగా రావడం ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసిందన, అదృష్టవశాత్తూ అతి సమీపంలో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారని పోస్టులు చేస్తున్నారు. ఘోర ప్రమాదం ఇలా తప్పిందంటూ సోషల్ మీడియాలో రైళ్ల ఫొటోలను షేర్ చేస్తున్నారు. ముంబై మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) మాత్రం ఇది ప్రమాదం కాదని అందుకు వివరణ ఇచ్చుకుంది. చెంబూరు ఏరియాలో శనివారం సాయంత్రం ఒకే ట్రాక్‌పైకి రెండు మోనో రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఆగిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో దీనిపై వదంతులు ప్రచారం కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు. సాంకేతికలోపం కారణంగా ట్రాక్‌పైనే నిలిచిపోయిన రైల్లోని ప్రయాణికులను తరలించేందుకు మరో రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోనోరైలులో పదే పదే ఇలాంటి సమస్యలు తలెత్తుతుండటంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2011లో నిర్మాణ సమయంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, 2012 జూలైలో వాదాలా ఏరియాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డ విషయం తెలిసిందే. -
పలు మార్గాల్లో ఏసీ బస్సులు
- ఆర్ఎఫ్పీలను ఆహ్వానించిన ఎమ్మెమ్మార్డీయే - తొలుత కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య.. - 25 బస్సుల బాధ్యతలను అప్పగించాలని నిర్ణయం - వివిధ బస్సు తయారీ కంపెనీలకు లేఖ సాక్షి, ముంబై: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటి (ఎమ్మెమ్మార్డీఏ) పలు మార్గాల మధ్య ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తోంది. ఏసీ బస్సులను కొనుగోలు చేసి నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిందిగా ఎమ్మెమ్మార్డీఏ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)ను ఆహ్వానించింది. ఈ బస్సులను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్యలో అదేవిధంగా కుర్లా, బాంద్రా, సైన్ ప్రాంతాల మధ్య వీలైనంత త్వరగా నడిపేందుకు యోచిస్తోంది. ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల మధ్య రోజు ఉద్యోగ రీత్యా ప్రయాణించే వారికి మరింత మెరుగైన కనెక్టివిటీ ఇచ్చేందుకు ఈ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. అయితే 10 ఏళ్ల కోసం వివిధ నమూనాలు గల 25 బస్సులను ఈ మార్గాల మధ్య నడిపేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. దీంతో తాము అర్హత గల ఆర్ఎఫ్పీలను ఆహ్వానించామన్నారు. పేరొందిన జాతీయ అంతర్జాతీయ బస్సు ఉత్పత్తి దారుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. గతేడాది ఎమ్మెమ్మార్డీఏ టాటా మోటార్స్, వోల్వోలకు ఈ బస్సుల కొనుగోలు నిర్వహణ విషయమై ఓ లేఖ రాసింది. అయితే వీరి నుంచి స్పందన కరువవడంతో ఎమ్మెమ్మార్డీ ఆర్ఎఫ్పీని ఆహ్వానించేందుకు నిర్ణయించింది. బెస్ట్ అయితే బాంద్రా, కుర్లా, సైన్ల మధ్య కనెక్టివిటి సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయనీ ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ మార్గాల మధ్య సరైన కనెక్టివిటీ లేకపోవడంతో ఆటోలు, ట్యాక్సీలకు అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోందన్నారు. ప్రయాణికులు బస్సు ద్వారా బీకేసీ వెళ్లాలంటే సమీప బస్టాపుకు కనీసం కిలో మీటర్ మేర నడవాల్సి వస్తోందని, వారికార్యాలయాలు మెయిన్ రోడ్ నుంచి చాలా దూరంలో ఉన్నాయయని చెప్పారు. దీంతో ప్రయాణికుల నుంచి డిమాండ్లు వెలువెత్తుతుండడంతో ఏసీ బస్సులను నడిపేందుకు యోచిస్తున్నామని అధికారి వెల్లడించారు. ఇదిలా వుండగా, 2012లో బీకేసీ మధ్య కనెక్టివిటీపెంచేందుకు దాదాపు 15 నుంచి 20 బస్సులను బెస్ట్‌కు అందజేసేందుకు ఎమ్మెమ్మార్డీఏ నిర్ణయించింది. అయితే ఈ బస్సులను నడిపేందుకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్లు వరకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ బస్సుల చార్జీలు బెస్ట్ బస్సుల కంటే కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. అయితే అలా చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
మోనో రైలుతో రూ.18 కోట్ల నష్టం
త్వరలోనే మంచిరోజులు వస్తాయన్న ఎమ్మెమ్మార్డీయే అధికారి సాక్షి, ముంబై: దేశంలోనే మొట్ట మొదటిసారిగా ముంబైలో ప్రారంభించిన మోనో రైలువల్ల మహానగర ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే)కు సంవత్సర కాలంలో ఏకంగా రూ.18 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చెంబూర్-వడాల మధ్య 8.9 కి.మీ. దూరం ఉన్నమార్గంపై ఉదయం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకు మోనో రైళ్లు సేవలు అందిస్తున్నాయి. రోజుకు అవి తిరిగే 64 ట్రిప్పుల్లో 36,352 మంది ప్రయాణికులను అవి చేరవేయగలవు. కానీ వాటిలో ప్రతిరోజు సగటున 10-13 వేల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మోనోరైలుకు ప్రయాణికుల ఆదరణ తగ్గడానికి ఎమ్మెమ్మార్డీయే డిప్యూటీ డెరైక్టర్ దిలీప్ కవట్కర్ పలు కారణాలను వివరించారు. మోనోరైలు ప్రయాణించే మార్గం చుట్టుపక్కల ప్రాంతాలు ఇంకా అభివృద్ధి కావాల్సి ఉందన్నారు. ఈ మార్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఇతర వాణిజ్య, వ్యాపార భవనాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని చెప్పారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పైన మోనో రైలు దిగిన ప్రయాణికులు అక్కడి నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు అవసరమైన బస్సు, ట్యాక్సీ, ఆటోలు తగినంత సంఖ్యలో అందుబాటులో లేవన్నారు. దీంతో చాలా మంది మోనో రైలుకు బదులుగా ఆటో, ట్యాక్సీ, బెస్ట్ బస్సులనే ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఇదిలాఉండగా, ప్రస్తుతం (చెంబూర్-వడాల) మోనో రైలు చాలా తక్కువ దూరం ప్రయాణిస్తోంది. వడాల నుంచి సాత్‌రాస్తా మార్గం పనులు పూర్తయితే ఏకంగా ఈ మార్గం 20 కి.మీ. దూరం పెరుగుతుంది. అప్పుడు ప్రయాణికుల నుంచి స్పందన వస్తుందని దిలీప్ కవట్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతవరకు ఈ నష్టాలు తప్పవని అన్నారు. మోనో రైలుకు ప్రస్తుతం లోకల్ రైళ్ల కనెక్టివిటీ లేకపోవడం కూడా తమ నష్టాలకు కారణమని కవట్కర్ అన్నారు. ఈ సంవత్సరం చెంబూర్-వడాల- సాత్‌రాస్తా మార్గం పనులు పూర్తయితే, వడాల స్టేషన్లో హార్బర్, కరీరోడ్ స్టేషన్లో సెంట్రల్ రైలు మార్గాలు కనెక్టివిటీ అవుతాయి. అప్పుడు మోనోకు మంచి రోజులు వస్తాయని దిలీప్ కవట్కర్ అన్నారు. -
కార్ షెడ్‌ను తరలించాల్సిందే!
నిర్మాణ పనులను వ్యతిరేకిస్తున్న సేవ్ గ్రూప్ సుమారు 2,300 చెట్లు కూల్చివేయనున్న ఎమ్మెమ్మార్డీయే పర్యావరణానికి ముప్పు అని ఆందోళన మెట్రో-3 ప్రాజెక్టు పనులపై వివాదం సాక్షి, ముంబై: కొలాబా-బాంద్రా-సీఫ్జ్(సీబీఎస్) మెట్రోలైన్-3 ప్రాజెక్టు పనులపై స్వచ్ఛంద సేవా సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నగరంలో సుమారు 2,300 చెట్లను నరికివేయాల్సి ఉంటుం దని, దానివల్ల పర్యావరణానికి త్రీవముప్పు తప్పదని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. చెట్ల నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెమ్మార్డీయే, బీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా ఎవరూ స్పందిం చడం లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, మెట్రో-3 పనుల్లో భాగంగా చెట్ల నరికివేతను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ప్రాజెక్టు నిధులను అందజేస్తున్న జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ)కే నేరు లేఖ రాయనున్నట్లు ప్రకృతి ప్రేమికుడు రిషీ అగర్వాల్ తెలిపారు. ఇదిలా ఉండగా, మెట్రో-3 కార్ షెడ్‌ను ఆరే కాలనీలో 30 హెక్టార్లలో నిర్మాణం చేపట్టారు. కాగా,ఈ నిర్మాణ పనులను ద సేవ్ ఏఎంసీ గ్రూప్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ షెడ్‌ను ముంబై పోర్ట్ ట్రస్ట్ (ఎంబీపీటీ)లోని బహిరంగప్రదేశంలోకి మార్చాల్సిందిగా ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్‌తో వారు ఈ నెల నాలుగున కలిసి విన్నవించారు. కాకుంటే మహాలక్ష్మీ, సీఎస్టీకి అనుసంధానం చేస్తూ భూగర్భ టన్నెల్ నిర్మించాలని సూచించారు. కాగా, తమ సూచనలకు ఎలాంటి స్పందన లభించలేదని సేవ్ గ్రూప్ పేర్కొంది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్ డిపోను మార్చడం సాధ్యం కాదని తెలిపారు. ఆరే కాలనీలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. అలాగే ఎంబీటీపీకి కార్ షెడ్‌ను మార్చడం కోసం వివిధ రకాల అనుమతులు, ఆమోదాలు అవసరమని తెలిపామన్నారు. ఇందుకు గాను కొన్ని నెలలు లేదా యేళ్లు పట్టవచ్చని అధికారి అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను మెట్రో 3 పనుల్లో తీవ్ర జాప్యం జరిగి, అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోయే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈ విషయమై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసినట్లు సేవ్ గ్రూప్‌సభ్యులు తెలిపారు. మెట్రో-3 ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తాము కోరడంలేదని, కేవలం కార్‌షెడ్‌ను మాత్రం మార్చాలని కోరుతున్నామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో అనుమతులకు జాప్యం జరగదని భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. -
కలిసి చేద్దాం!
భారీ ప్రాజెక్టుల పూర్తికి ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో సంయుక్త కార్యాచరణ ముంబై : నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ముంబై ట్రాన్స్- హార్బర్ లింక్(ఎంటీహెచ్ఎల్), మల్టీ మోడల్ కారి డార్ ప్రాజెక్టులను సంయుక్తంగా పూర్తిచేసేందుకు ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో నిర్ణయించినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. సుమారు రూ.12,975 కోట్ల అంచనా వ్యయంతో 126 కి.మీ.ల మేర విస్తరించిన విరార్-అలీబాగ్ మల్టీ-మోడల్ కారిడార్ అభివృద్ధికి, రూ.9,630 కోట్ల అంచనావ్యయంతో 22 కి.మీ. మేర విస్తరించిన ఎంటీహెచ్ఎల్ ప్రాజెక్టుకు ప్రస్తుతం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ప్రణాళికలు సిద్ధం చేసింది. కాగా, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ భారీ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు ఎమ్మెమ్మార్డీయే తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) వైస్‌చైర్మన్, ఎండీ అయిన సం జయ్ భాటియా తెలిపారు. ఎంటీహెచ్ఎల్లో భాగస్వాములయ్యేందుకు తమ సంస్థ ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) నుంచి నిధుల అనుమతుల కోసం ఆ ప్రాజెక్టు ఎదురుచూస్తోందన్నారు. జేఐసీఏ నుంచి ఆ ప్రాజెక్టుకు అనుమతులు లభించడం ఆలస్యమవుతున్న దరిమిలా తాము నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చామన్నా రు. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్టు కోసం 70 శాతం నిధులను జేఐసీఏ నుంచి పొందేందుకు, మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సాయంతో సమకూర్చుకునేందుకు ఎమ్మెమ్మార్డీయే నిర్ణయించిందని ఆయన తెలిపారు. అయితే జేఐ సీఏ నుంచి నిధుల అనుమతులు అందేందుకు ఏడాదికిపైగానే సమయం పట్టే అవకాశముండటంతో దాన్ని నివారించేందుకు తాము 50 శాతం వాటా నిధులను స్థానికంగానే సమకూర్చేందుకు ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టులో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సైతం భాగస్వామి కానున్నదని భాటియా తెలిపా రు. ప్రస్తుత ప్రతిపాదిత నవీముంబై ఎయిర్పోర్ట్ వరకు మల్టీ మోడల్ కారిడార్‌ను అనుసంధానం చేసేం దుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించా రు. దీనిపై ఎమ్మెమ్మార్డీయేతో ఇప్పటికే చర్చించామని, సంబంధిత పనులను ఆ సంస్థ ప్రారంభిస్తే తాము దానికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చామన్నారు. ఇదిలా ఉండగా, ఈ రెండు భారీ ప్రాజెక్టుల కోసం ఎమ్మెమ్మార్డీయే ఒక్కొక్కదానికి రూ.25 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. ఇదే సమయంలో ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో సంస్థల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18వ తేదీన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఎమ్మెమ్మార్డీయే అదనపు మెట్రోపాలిటన్ కమిషనర్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులున్న ఈ కమిటీ పనిచేస్తుంది. ఆయా రీజియన్లలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల అమ లు, ప్రణాళిక రూపకల్పన విషయంలో ఈ రెండు సంస్థలకు సదరు కమిటీ సహాయపడుతుందని భాటియా తెలిపారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టేందుకు ఈ రెండు సంస్థలు ఐక్యంగా ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు గత కొంతకాలంగా ప్రారంభానికి నోచుకోకపోవడంతో అభివృద్ధి కుం టుపడుతోందని, ఫలితంగా ఉపాధి అవకా శాలు కూడా దెబ్బతింటున్నాయని, తాజాగా తీసు కున్న నిర్ణయంతో అభివృద్ధి పనుల వేగం పెరు గుతుం దని, ఉపాధి అకాశాలు కూడా మెరుగుపడ తాయని నగరవాసులు భావిస్తున్నారు. -
రవాణా వ్యవస్థ మెరుగుకు కృషి
సాక్షి, ముంబై: ఠాణేతోపాటు చుట్టుపక్కల ప్రాంతా ల్లో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేం దుకు ‘ముంబై మెట్రోపాలిటన్ రిజన్ డెవలప్మెంట్ అథారిటీ’ (ఎమ్మెమ్మార్డీయే) కీలకనిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా అనేక రోజులుగా డిమాండ్ ఉన్న అనేక ప్రాజెక్టులకు అమోదం తెలిపింది. దీంతో ఠాణేతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో ఆనంద ం వ్యక్తమవుతోంది. ఠాణే జిల్లాలో ఠాణే, నవీముంబై, కల్యాణ్-డోంబివలి, ఉల్లాస్‌నగర్, భివండీ, మీరా-బయిందర్, వసాయి-విరార్ వంటి ఏడు కార్పొరేషన్లతోపాటు అంబర్నాథ్, బద్లాపూర్ తదితర మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. జిల్లాలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని అనేక సంవత్సరాలుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో డోంబివలి-మాణ్కోలి, ఠాణే-కళ్యాణ్ రైల్వేమార్గానికి సమాంతర రోడ్డు, కాటయి-డోంబివలి-కళ్యాణ్-టీట్‌వాలా రింగురోడ్డు మొదలగు మూడు కీలక ప్రాజెక్టులకు ఎమ్మెమ్మార్డీయే ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకున్నారు. ఠాణే నుంచి డోంబివలికి వెళ్లాలంటే ప్రస్తుతం కల్యాణ్ లేదా ముంబ్రా శిల్ఫాటా మీదుగా తిరిగి వెళ్లాల్సివస్తోంది. డోంబివలి-మాణ్కోలి రోడ్డు నిర్మిస్తే కల్యాణ్, శిల్ఫాటాలు వెళ్లకుండా చాల తక్కువ సమయంలో డోంబివలికి చేరుకునేందుకు ఆస్కారం ఏర్పడనుంది. ఈ మార్గం కోసం అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఠాణే-కల్యాణ్‌ల మధ్య రైల్వేసేవలకు అంతరాయం ఏర్పడితే కళ్యాణ్ - ఠాణేల మధ్య ప్రయాణం చాలా ఇబ్బం దికరంగా ఉంటుంది. దీంతో ఠాణే-కళ్యాణ్ రైల్వేమార్గానికి సమాంతరంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు నిర్లక్ష్యం చేశారు. అయితే శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ లభిం చింది. దీంతో పాటు కాటయి-డోంబివలి-కళ్యాణ్-టీట్‌వాలా రింగ్రూట్ ప్రాజెక్టుకు కూడా అమో దం లభించింది. -
భద్రత ఖర్చు తడిసి మోపెడు!
భారంగా మారుతోందంటున్న ఎమ్మెమ్మార్డీఏ సాక్షి, ముంబై: నగరంలో సేవలు అందిస్తున్న మోనోతో పోలిస్తే ప్రయాణికుల భద్రత కోసం మెట్రో భారీగానే ఖర్చు చేస్తోంది. కేవలం భద్రత కోసం చేస్తున్న ఖర్చే నెలకు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని మెట్రో అధికారులు అంచనా వేశారు. ఈ విషయమై ఎమ్మెమ్మార్డీఏ డెరైక్టర్ దిలీప్ కవట్కర్ మాట్లాడుతూ... ‘మెట్రో రైళ్ల వల్ల నెలకు వచ్చే ఆదాయంలో దాదాపు 25-50 శాతం భద్రతకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 4,321 కోట్లు రుణాలు, ఈ మొత్తానికి వడ్డీ ఎమ్మెమ్మార్డీయే ఎలా చెల్లిస్తుందో తెలియడంలేదు. మెట్రో ప్రయాణికుల భద్రతకు వెచ్చిస్తున్న వ్యయం నెలకు రూ. రెండు కోట్ల వరకు అవుతుందని అంచనా వేశారు. వర్సోవా-ఘాట్కోపర్-అంధేరీ మెట్రోరైలు మార్గంలో మొత్తం 11 స్టేషన్లు ఉన్నాయి. స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్‌ఫారాలపై, బోగీలలో 700 సీసీ కెమెరాలు, స్టేషన్లోకి ప్రవేశించగానే ప్రయాణికులను తనిఖీ చేసే సిబ్బంది, వారివద్ద హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, డోరు మెటల్ డిటెక్టర్లు, ప్రతీ స్టేషన్లో ఆరు డాగ్ స్కాడ్‌ల చొప్పున మొత్తం 72 డాగ్ స్కాడ్లు, 730 మంది వివిధ రకాల భద్రత దళాలు, సాయుధ పోలీసులు... ఇలా భారీ భద్రతకు ఎమ్మెమ్మార్డీయే నెలకు దాదాపు రూ. రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. అయితే మోనో, మెట్రో భద్రత బాధ్యతలు ‘మహారాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్’ (ఎమ్మెస్సెసీ) కి అప్పగించింది. దీంతో మోనోతో పోలిస్తే మెట్రోకు భద్రత ఖర్చే తడిసి మోపెడవుతోంది. మోనో రైల్వే పరిధిలో 550 మంది భద్రతా సిబ్బంది, 500పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. అందుకు నెలకు సుమారు కోటి రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా మెట్రో, మోనోతో కలిపి ప్రతినెలా రూ.మూడు కోట్లు కేవలం భద్రత కోసం ఎమ్మెమ్మార్డీయే ఎమ్మెస్సెసీకి చెల్లించాల్సి ఉంటుంది.nn -
‘మోనో’కు ముహూర్తం ఖరారు
సాక్షి, ముంబై: నగరవాసులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని నగరవాసులంతా ఎదురుచూస్తున్న మోనో రైలు ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీనుంచి మోనో రైలు సేవలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. వాయిదాలపై వాయిదాలు పడుతున్న ఈ నెల 13వ తేదీన ఈ రైలుకు చివరిసారిగా ప్రయోగాత్మక పరుగు నిర్వహించనున్నారు. వాస్తవానికి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ రైలు సేవలు ఏడాదిన్నర క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అనేక పర్యాయాలు వాయిదా వేయకతప్పలేదని ఎమ్మెమ్మార్డీయే వర్గాలు పేర్కొన్నాయి. మొదటి విడతలో భాగంగా చెంబూర్-వడాలా మధ్య పనులు పూర్తయ్యాయి. గతంలో నిర్వహించిన వివిధ రకాల పరీక్షలు సఫలీకృతమయ్యాయి. అయితే రైల్వే బోర్డు అనుబంధ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ నుంచి భద్రతాపత్రం మంజూరు కాకపోవడంతో ఈ రైళ్లన్నీ యార్డులకే పరిమితమయాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు అసిస్టెంట్ కమిషనర్ అశ్వినిభిడే చెప్పారు. సాధ్యమైనంత త్వరగా భద్రతాపత్రం మంజూరు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. -
ఎమ్మెమ్మార్డీయేతో బీఎంసీకి చిక్కులు
సాక్షి, ముంబై: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) చేపడుతున్న మెట్రో, మోనోరైల్వే ప్రాజెక్టులు నగర పాలక సంస్థ (బీఎంసీ)కి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇరు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో బీఎంసీకి నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం మెట్రో, మోనో రైల్వే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగడంతో వంతెన, పిల్లర్ల పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ప్లాట్‌ఫారాలు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు మెట్లు, ఇతర నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించే ముందు ఎమ్మెమ్మార్డీయే అధికారులు బీఎంసీతో సంప్రదించకుండానే తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో భూగర్భంలో ఉన్న నీటి పైపులు, మురుగునీరు, మరుగుదొడ్ల పైపులేన్లు దెబ్బతింటున్నాయి. పలు చోట్ల అవి ధ్వంసమవడంతో నీళ్లు సాఫీగా వెళ్లలేకపోతున్నాయి. ఫలితంగా మ్యాన్‌హోల్స్ నుంచి బయటకు వచ్చిన మురుగునీరు నగర రహదారులపై పారుతున్నాయి. మెట్లు నిర్మించేందుకు ఫుట్‌పాత్‌లను వెడల్పు చేస్తుండడంతో రహదారులు కొంతమేర ఇరుగ్గా మారాయి. ఇప్పటికే పనులు జరుగుతున్న చోట విపరీతమైన ట్రాఫిక్‌జామ్ ఉంటోంది. దీనికి తోడు రోడ్లు ఇరుకుగా మారడం, వాటిపై నీళ్లు ప్రవహించడంతో సమస్య మరింత జటిలంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఏటా వర్షాకాలానికి ముందు నాలాలు, మురుగుకాల్వలు శుభ్రం చేస్తున్నప్పటికీ, రహదారులన్నీ జలమయమవుతున్నాయి. దీనికి తోడు భూగర్భంలో పగిలిపోయిన పైపుల వల్ల... వచ్చే వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా మారే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. వాటికి మరమ్మతులు చేపట్టాలంటే బీఎంసీ ఖజానాపై అదనపు భారం పడనుంది. -
ఇదేం పాలన!
సాక్షి, ముంబై: పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అన్ని వనరులున్నా మహారాష్ర్టలో అభివృద్ధి తిరోగమనంలో ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. బాంద్రా కుర్లా కాం ప్లెక్స్ సమీపంలోని ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) మైదానంలో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన మహాగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రజాస్వామ్య కూటమి అసమర్థత వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. బాంబే రాష్ట్రం నుంచి 1960 మే ఒకటో తేదీన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. అప్పుడు మహారాష్ట్రతో పోలిస్తే ఓ పక్కన ఏడారిలా తాగేందుకు సరిగా నీరు లేక తదితర ఇబ్బందులతో గుజరాత్ ఎలా అభివృద్ధి చెందుతుందోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే మహారాష్ట్ర కన్నా గుజరాతే అభివృద్ధి చెందిందన్నారు. శివసేన, బీజేపీ పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లిన మహారాష్ట్ర, డీఎఫ్ కూటమి పాలనలో మళ్లీ వెనక్కి వెళుతోందని మోడీ ఆరోపించారు. గుజరాత్లో సంవత్సరం పాటు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుంటే...మహారాష్ట్రలో మాత్రం విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయన్నారు. దీంతో గుజరాత్ నుంచి షిర్డీ వెళ్లే సమయంలో మహారాష్ట్ర వచ్చిందని ఎలా గుర్తించాలని అడిగితే చీకటిగా ఉండే గ్రామాలు వస్తే అదే మహారాష్ట్ర అని చెబుతున్నారన్నారు. కుర్చీ కోసమే రాజకీయాలు... రాష్ట్రాలు అవతరించిన అనంతరం ఇప్పటివరకు గుజరాత్లో కేవలం 14 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అదే మహారాష్ట్రలో మాత్రం ఏకం గా 26 మంది ఇప్పటివరకు ముఖ్యమంత్రులయ్యా రు. దీన్నిబట్టి ఇక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. ఇక్కడ ఎవరైన ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆయనను ఎలాగైన దించడానికి మరో నాయకుడు సిద్దంగా ఉంటాడు. ఇవి కాంగ్రెస్ మార్కు రాజకీయాలని మోడీ ఎద్దేవా చేశారు. గుజరాతీ భాషకు పుట్టినిల్లు ముంబై... ముంబైలో గుజరాతీ భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముంబైని గుజరాతీ భాషకు పుట్టినిల్లుగా మోడీ అభివర్ణించారు. మహారాష్ట్రలో అంతర్భాగమైన తాము గుజరాత్‌గా అవిర్భవించాం. దీంతో మహారాష్ట్ర పెద్ద అన్నగా భావిస్తామని చెప్పారు. ఎల్బీటీతో బాదుడు... రాష్ట్రాలు విడిపోయిన అనంతరం గుజరాత్‌లోనూ అక్ట్రాయ్ సమస్య వచ్చిందన్న మోడీ దానిని రద్దు చేశామన్నారు. కానీ మహారాష్ట్రలో ఇటీవలే ఆక్ట్రాయిని రద్దు చేశామని చెప్పిన ఇక్కడి ప్రభుత్వం.. మరో రకంగా లోకల్ బాడీ టాక్స్ (ఎల్బీటీ)ని ప్రారంభించింది. ఇలా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎల్బీటీ అంటే ‘లూట్ బాట్ టెక్నిక్’గా అభివర్ణించారు. బాల్‌ఠాక్రేకు శ్రద్ధాంజలి... శివసేన అధినేత బాల్ ఠాక్రేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. దేశంలోని సమస్యలపై ముంబై గడ్డపై నుంచి పులిలా ఆయన గాండ్రించేవారని రాజ్‌నాథ్ అన్నారు. జేబులను కత్తిరిస్తున్న కాంగ్రెస్ : గడ్కరి మహారాష్ట్రలో డీఎఫ్ పాలన కారణంగా రైతులు ఆత్మహత్యలు పెరిగాయి. అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. ప్రపంచంలో అవినీతి కుంభకోణాలపై ఏదైన పోటీ ఉంటే కాంగ్రెస్‌కు ప్రథమ బహుమతి లభిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. పేదల నేస్తం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రస్తుతం పేదల జేబులు కత్తిరిస్తుందన్నారు. 33 సీట్లు వస్తాయి... ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి(శివసేన, బీజేపీ, ఆర్పీఐ)కి 33 లోక్‌సభ సీట్లు వస్తాయని బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఆశాభావం వ్యక్తం చేశారు. వీటిలో ముంబైలోని ఆరు సీట్లు తమకే దక్కుతాయని చెప్పారు. ఆదర్శ్, జలవనరుల కుంభకోణం, ఆకాశాన్ని అంటుతున్న ధరలన్నింటినిప్రజలు గమనిస్తున్నారు. దీంతో వీరు ఓటుతో కాంగ్రెస్‌కు బుద్దిచెబుతారన్నారు. రూ. 25 కోట్ల పార్టీ ఫండ్... పార్టీ ఫండ్‌తోపాటు రాబోయే ఎన్నికల కోసం మహారాష్ట్ర బీజేపీ నిధులను సేకరించింది. ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఇలా సేకరించిన మొత్తం రూ. 25 కోట్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శెలార్ అందించారు. సైడ్‌లైట్స్ ముంబైకి ఉదయం 11.15 గంటల ప్రాంతంలో చేరిన నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లు.. ఏడంచెల భద్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లీలా ఇంటర్నేషన్ హోటల్‌కు చేరారు. 11.45 గంటలకు నరేంద్ర మోడీ మైనపు విగ్రహం అవిష్కరించారు భోజన అనంతరం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో మహాగర్జనకు చేరుకున్నారు మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రసంగం ప్రారంభించిన మోడీ మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రసంగం పూర్తి జనసాగరంగా మారిన బీకేసీ పరిసరాలు -
నత్తకు నడక నేర్పిస్తున్న ఎస్‌సీఎల్‌ఆర్..
సాక్షి, ముంబై: పశ్చిమ శివారు, సెంట్రల్ శివారు ప్రాంతాలను కలిపేందుకు పదేళ్ల కిందట ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన శాంతాక్రజ్-చెంబూర్ లింకు రోడ్ (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రాజెక్టు పనులు వాయిదాలకే పరిమితమవుతున్నాయి. తరచూ డెడ్లైన్లు వాయిదా పడుతుండడంతో ఇంతకీ ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఇచ్చిన డెడ్‌లైన్ మరోసారి వాయిదా పడింది. ఈ పనులు 2014 మార్చిలో పూర్తయ్యే అవకాశాలున్నాయని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే), మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎమ్మెస్సార్డీసీ) ప్రకటించాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు ఎమ్మెమ్మార్డీయే, ఎమ్మెస్సార్డీసీ సంస్థలు సంయుక్తంగా చేపడుతున్నాయి. జాప్యంపై విమర్శలు.. ఈ వంతెన పనులు ప్రారంభించి పదేళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఇంకా పూర్తికాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక సమయం తీసుకున్న వంతెనలో దీనికి మొదటి స్థానం లభించింది. ఇప్పటికీ 11 సార్లు డెడ్‌లైన్ వాయిదా పడింది. రుణాలు అందజేసిన ప్రపంచ బ్యాంకుల నుంచి అవమానాలు తప్పలేదు. ముంబైలో ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించడంతోపాటు పశ్చిమ శివారు, సెంట్రల్ (మధ్య) శివారు ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం చేసేందుకు ఎమ్మెమ్మార్డీయే 2003లో ఎస్‌సీఎల్‌ఆర్ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ఎమ్మెమ్మార్డీయేకు చెందినదే అయినప్పటికీ నిర్మాణ పనులు ఎమ్మెస్సార్డీసీ ద్వారా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులు చేపట్టిన నాటి నుంచి అనేక అడ్డంకులు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, పునరావాసం, స్థానిక నాయకుల అభ్యంతరం ఇలా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీన్ని బట్టి ఎలాంటి ముందస్తు ప్రణాళికలు, అధ్యయనం పనులు చేపట్టకుండానే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. కాని ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, స్థలసేకరణ, భూగర్భంలో ఉన్న నీటి పైపులు, టెలిఫోన్, విద్యుత్ కేబుళ్ల స్థల మార్పిడి, ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో జాప్యం వల్ల ప్రాజెక్టు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. వాయిదాల ప్రాజెక్టుగా పేరు రావడంతో ఇప్పటికే రుణాలు ఇచ్చిన వివిధ బ్యాంకులు మళ్లీ రుణం ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నాయి. అలాగే ఎమ్మెమ్మార్డీయే పనితీరు కూడా విమర్శలకు గురవుతోంది. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తిచేయాలని బ్యాంకులు ఎమ్మెమ్మార్డీయేను ఆదేశించినా ఉపయోగం లేదు. ఆ సంస్థ పనితీరు మార లేదు. తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా పనులు శీఘ్రగతిన పూర్తిచేసేందుకు యత్నించడంలేదు. ఇటీవల జారీచేసిన డెడ్‌లైన్ ప్రకారం డిసెంబర్ ఆఖరు వరకు ఈ ప్రాజెక్టు పనులు పూర్తికావాల్సి ఉంది. కాని తిరిగి 2014 మార్చికి వాయిదా వేశారు. పదేళ్ల కిందట ఈ ప్రాజెక్టు వ్యయం రూ.116 కోట్లు కాగా ఇప్పుడది ఏకంగా రూ.500 కోట్లకు చేరుకోవడంతో ఎమ్మెమ్మార్డీయేపై అదనపు భారం పడుతోంది. -
మిల్లు కార్మికుల దీక్ష విరమణ
సాక్షి, ముంబై: నూతన సంవత్సరంలో మిల్లు కార్మికులకు ఇళ్లు కేటాయించడానికి ‘ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ’ (ఎంఎంఆర్డీయే) ఒప్పుకోవడంతో వారు తమ పోరాటాన్ని గురువారం విరమించారు. ఎంఎంఆర్డీయే నిర్మిస్తున్న వాటిలో 50 శాతం ఇళ్లను మిల్లు కార్మికులకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఈ ఇళ్లను ఇచ్చేందుకు అవసరమైన అనుమతులు రావడానికి కొంత సమయం పట్టనుంది. దీంతో నూతన సంవత్సరంలో మిల్లు కార్మికులకు 50 శాతం ఇళ్లు కేటాయించడం ఖాయమేనని ఎంఎంఆర్డీయే వర్గాలు తెలిపాయి. ఇళ్ల కేటాయింపు డిమాండ్‌తో 25 మంది మిల్లు కార్మికులు ఆజాద్ మైదాన్‌లో బుధవారం ఉదయం నుంచి అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం విదితమే. ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న 1.48 లక్షల మంది మిల్లు కార్మికులకు ఇళ్లు ఇవ్వడం, ఎంఎంఆర్డీయేకి చెందిన 50 శాతం ఇళ్లు కార్మికులకు కేటాయిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలనే డిమాండ్‌తో కార్మికులు ఆందోళనకు దిగడం తెలిసిందే. ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం వీరితో చర్చలు జరిపింది. ఎట్టకేలకు మిల్లు కార్మికుల డిమాండ్లన్నంటినీ నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో వారు నిరాహారదీక్షతోపాటు ఆందోళనలను విరమించుకున్నారు. దీక్షలో పాల్గొన్న మరాఠీ దినపత్రిక నవకాల్ సంపాదకురాలు జయక్ష ఖాడీల్కర్-పాండే, ‘గిర్నీ కామ్‌గార్ సంఘర్ష్ సమితి’ అధ్యక్షులు దత్తా ఇస్వాల్కర్, ‘సెంచరీ మిల్ కామ్‌గార్ ఏక్తామంచ్’కు చెందిన నందూ పార్కర్ తదితరులు ఓ వయోధిక మహిళ కార్మికురాలు అందించిన పానీయం సేవించి దీక్ష విరమించారు. ఎంఎంఆర్డీయే నిర్మిస్తున్న ఇళ్లను చౌకగా అద్దెకు ఇస్తామని గతంలో ఈ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామితో మిల్లు కార్మికులకు ఇళ్లపై 50 శాతం యాజమాన్య హక్కులు కూడా దక్కుతాయి. -
స్పందించని సర్కారు... నిర్లక్ష్యమే మూలకారణం
సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు సేవలు డిసెంబరు మొదటివారంలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయని, నవంబరు మొదటివారంలో రైలు సేవలు ప్రారంభిస్తామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) వర్గాలు ఇదివరకే ప్రకటించాయి. యథావిధిగా తాజా డెడ్‌లైన్ కూడా వాయిదా పడింది. ఎమ్మెమ్మార్డీయే గతంలోనూ ఇలాంటి డెడ్లైన్లు పలుసార్లు ప్రకటించి విఫలమయింది. ఇదే చివరి డెడ్‌లైన్ అని, డిసెంబరు మొదటివారంలో మెట్రో సేవలు ప్రారంభమవుతాయని మళ్లీ ప్రకటించింది. కానీ చైనా నుంచి ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్టుట్రస్ట్‌కు (జేఎన్పీటీ) వచ్చిన మెట్రోరైళ్లను బయటకు తీసుకొచ్చేందుకు కస్టం డ్యూటీలో రాయితీ ఇవ్వాలని ఎమ్మెమ్మార్డీయే చేసుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాయితీ వచ్చేంతవరకు ఆ రైళ్లను కార్డిపోకు తీసుకురాకూడదని ముంబై మెట్రో-1 ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ (రిలయన్స్ మెట్రో) కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో డిసెంబరులో సేవలు ప్రారంభమవుతాయా? లేక మళ్లీ వాయిదా పడుతాయా? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ ఎమ్మెమ్మార్డీయే తన పరువు కాపాడుకునేందుకు డిసెంబరులోనే రైలుసేవలు ప్రారంభినా... రైళ్లను మాత్రం టైంటేబుల్ ప్రకారం నడిపేందుకు ఆస్కారం లేదు. ఇందుకు ప్రధాన కారణం కస్టం డ్యూటీ చెల్లించలేక జేఎన్‌పీటీలో ఐదు రైళ్లు అలాగే పడి ఉండడమే. చైనా నుంచి తీసుకొచ్చిన 16 మెట్రోరైళ్లకు కస్టం డ్యూటీలో రాయితీ ఇవ్వాలని 2009లో ఎమ్మెమ్మార్డీయే కస్టమ్స్‌శాఖకు విజ్ఞప్తి చేసింది. ఆ శాఖ మాత్రం రాయితీ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో జేఎన్పీటీలోకి వచ్చిన చేరిన ఈ ఐదు రైళ్లను స్వాధీనం చేసుకుని కార్ షెడ్డుకు తరలించాలంటే భారీగా కస్టం శాఖకు భారీగా డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది గిట్టుబాటు కావడంలేనందున రాయితీ ఇచ్చేంతవరకు వాటిని తరలించే ప్రసక్తే లేదని మెట్రో-1 ప్రాజెక్టు (రిలయన్స్ మెట్రో) నిర్ణయం తీసుకుంది. చట్టం వర్తింపుపై గందరగోళం రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని మెట్రో రైల్వేలు (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) చట్టం 2002 ప్రకారం గుర్తించపోవడం వల్ల కూడా ప్రాజెక్టు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గాన్ని డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని పృథ్వీరాజ్ చవాన్ సర్కారు ప్రకటించినా, అది ఆచరణ సాధ్యం కాదని నిర్మాణ సంస్థ ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) చెబుతోంది. అన్ని అనుమతులు వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించడం వీలువుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని ట్రామ్వేస్ చట్టం 1886 ప్రకారం గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2009లో జారీ చేసిన ఉత్తర్వుల్లో అన్ని మెట్రోప్రాజెక్టులకు మెట్రో రైల్వేలు (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) చట్టం 2002 వర్తిస్తుందని తెలిపింది. ఈ రెండింటిలో వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ ప్రాజెక్టుకు ఏ చట్టం వర్తిస్తుందో తెలియజేయాల్సిందిగా ఎంఎంఓపీఎల్ 2010 నుంచి ఎమ్మెమ్మార్డీయేను కోరుతున్నా ఇంత వరకు అది స్పష్టత ఇవ్వలేదు. ‘చట్టం విషయంలో స్పష్టత రానంత వరకు ఏ ఒక్క అనుమతిని పొందడం సాధ్యపడదు. రైలు సేవలను అందించడం కూడా అక్రమమే అవుతుంది. చట్టం విషయంపై ప్రభుత్వం స్పందించనంత వరకు ఈ ప్రాజెక్టులో జాప్యం తప్పదు. దీనికి మమ్మల్ని బాధ్యులను చేయకూడదని కూడా మేం ఎమ్మెమ్మార్డీయేకు స్పష్టీకరించాం’ అని ఎంఎంఓపీఎల్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన సమస్యలపై అధ్యయనం చేస్తున్నందున వల్లే ఈ విషయంలో నిర్ణయంలో జాప్యమవుతోందని, అయితే డిసెంబర్ మాసాంతంలోపు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఎమ్మెమ్మార్డీయే అధిపతి యూపీఎస్ మదన్ వివరణ ఇచ్చారు. -
ఈస్టర్న్ ఫ్రీవేపై స్పీడ్గన్లు
సాక్షి, ముంబై: ఇటీవల ఈస్టర్న్ ఫ్రీవేపై రెండు రోడ్డు ప్రమాదాలు జరగడంతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ), ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ మార్గంపై స్పీడ్ గన్లను అమర్చాలని యోచిస్తున్నారు. స్పీడ్గన్ల ఏర్పాటు వలన మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలపై నిఘా ఉంచేందుకు వీలు కలుగుతుందని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ మార్గంపై 20 సీసీటీవీలను కూడా అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్రేవేపై వేగ పరిమితిని ఉల్లఘించిన వారిపై ఇక మీదట కఠిన చర్యలు తీసుకోనున్నామని పోలీసులు తెలిపారు. ఒకోసారి వాహనదారులు ఈ స్పీడ్ గన్‌లో నమోదైన వేగాన్ని అంగీకరించడంలేదు. తాము వాహనాన్ని అంత వేగంగా నడపలేదని బుకాయించి పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో ఈ స్పీడ్గన్లను సీసీటీవీ కెమరాలతో అనుసంధానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వేగంగా వచ్చే వాహనాల దృశ్యాలు ఈ కెమరాలో నమోదు కావడంతో సదరు వాహన దారుడు తప్పించుకోలేడని డిప్యూటి పోలీసు కమీషనరు (ట్రాఫిక్) సుభాష్ నిలేవడ్ తెలిపారు. ఇదిలా వుండగా ఈ స్పీడ్ గన్ల కోసం నిధులను సమకూర్చేందుకు ఎంఎంఆర్డీఏని పోలీసులు ఆశ్రయించారు. దీంతో ఈ సంస్థ ఎనిమిది స్పీడ్ గన్లను కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. వీటితోపాటు ఎంఎంఆర్డీఏ 20 సీసీటీవీలను అమర్చేందుకు నిధులను కేటాయించనుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ ఫ్రీవేను అనుక్షణం పరిశీలించడం సాధ్యం కావడం లేదనీ, అయితే ఈ ఫ్రీవేను ఉపయోగిస్తున్న ద్విచక్రవాహన దారులను నిషేధించడానికి ప్రవేశ ద్వారం వద్ద ఇద్దరు పోలీసులను నియమించామన్నారు. రాత్రి వేళలో పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించని సమయం చూసి ద్విచక్ర వాహన దారులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో రాత్రి వేళలో ఈ ఫ్రీవేలను పర్యవేక్షించమని సివిల్ పోలీసులను కోరనున్నట్లు నిలేవడ్ తెలిపారు. -
ఊహలకు ‘ఊపిరి’!
సాక్షి, ముంబై: ప్రతిపాదిత 4.25 కి.మీ. వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ మార్గం నిర్మించేందుకు ఐదు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఎమ్మెమ్మార్డీయే ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. కాని వర్లీ-శివ్డీ ప్రాజెక్టు చేపట్టేందుకు పలు కంపెనీలు అసక్తి కనబర్చడంతో శివ్డీ-నవశేవ సీ లింక్ ప్రాజెక్టుకు కూడా త్వరలో మంచిరోజుల వస్తాయని అథారిటీ భావిస్తోంది. వర్లీ సీ ఫేస్వద్ద ఎక్కడైతే బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెన ముగుస్తుందో.. అక్కడి నుంచి ఈ ఎలివేటెడ్ మార్గం మొదలై ఎల్ఫిన్స్టన్ రోడ్ రైల్వే స్టేషన్, పరేల్, వడాల మీదుగా శివ్డీకి చేరుకుంటుంది. దీంతో బాంద్రా నుంచి వచ్చిన వాహనాలు నేరుగా ఈ ఎలివేటెడ్ మార్గం మీదుగా శివ్డీకి చేరుకుంటాయి. అక్కడి నుంచి నేరుగా సీ లింక్ మీదుగా నవశేవా చేరుకుంటాయి. వాహనదారులు ఇలా సులభంగా నగరం నుంచి బయటపడితే విలువైన సమయం, ఇంధనం ఆదా అవుతాయని ఎమ్మెమ్మార్డీయే భావించింది. కాని అనుకున్నదొక్కటి జరిగింది మరొకటి అన్నట్లు శివ్డీ-నవశేవా సీ లింక్ ప్రాజెక్టు పనులకు ఏ కంపెనీ కూడా టెండర్ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఈ ప్రాజెక్టుతోపాటు వర్లీ-శివ్డీ ఎలివేటెడ్ ప్రాజెక్టు కూడా నీరుగారిపోవడం ఖాయమని అథారిటీ భావిస్తున్న తరుణంలో ఐదు కంపెనీలు ముందుకు రావడంతో ఎమ్మెమ్మార్డీయేలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.450 కోట్లు ఖర్చవుతాయని అంచనా. గెమన్ ఇండియా లి. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, లర్సన్ అండ్ టూబ్రో లి. ఎన్.సీ.సీ. లి., సింప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఎలివేటెడ్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆసక్తి కనబర్చాయి. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే ప్రతీ రోజు దాదాపు 20వేలకుపైగా వాహనాలు ఈ వంతెనను వినియోగిస్తాయని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్వినీ భిడే పేర్కొన్నారు. సదరు ఐదు కంపెనీల ప్రతిపాదనలను పరిశీలించి, అర్హత ను బట్టి ఎంపికచేసిన కంపెనీకి ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించనున్నారు. ప్రత్యక్షంగా పనులు ప్రారంభమైన తర్వాత నాలుగేళ్ల కాలవ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనలో ఉంది. ఇక్కడ స్థల సేకరణ పనులు ఇబ్బందికరంగా మారడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. వర్లీ-శివ్డీ ఎలివేటెడ్, శివ్డీ-నవశేవా సీ లింక్ ఈ రెండు ప్రాజెక్టులు ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఒక ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ఐదు కంపెనీలు ముందుకు రావడంతో, మిగిలిన పనులకు కూడా స్పందన వచ్చే అవకాశం ఉంటుందని అశ్వినీ భిడే ఆశాభావం వ్యక్తం చేశారు. -
వడాలా - చెంబూరు మార్గంలో ‘మోనో’రైలు మొదటి సేవలు
సాక్షి, ముంబై: నవంబర్ చివరిలో వడాలా-చెంబూరు మధ్య 8.8 కి.మీ. మేర దూరంలో ప్రారంభమయ్యే మోనోరైలు ప్రారంభ దశలో కేవలం ఐదు గంటలు మాత్రమే నడుపనున్నారు. ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒక రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వీటి పూర్తి స్థాయి కార్యకలాపాలకు మరికొంత సమయం పట్టనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అయితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఎంఎంఆర్డీఏ), ప్రాజెక్ట ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మోనోరైలు ప్రాజెక్టు మొత్తం పూర్తి అయిన వెంటనే వీటి సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో మోనోరైలు ఐదు గంటలు మాత్రమే నడపాలని నిర్ణయించామన్నారు. తర్వాత ఈ మార్గంలో పనులు సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాత రెండు నెలల్లోనే ఈ రైలు సేవలు 10 గంటల వరకు పొడిగిస్తామని అధికారి తెలిపారు. అయితే చివరగా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉందన్నారు. 20 కి.మీ. మోనోరైల్ కారిడార్ ఎస్జీఎం చౌక్ నుంచి చెంబూర్ వరకు వయా వడాలా మీదుగా నడిచే విధంగా ప్రణాళికను తయారుచేసిన విషయం తెలిసిందే. అయితే 11.2 కి.మీ దూరమైన ఎస్జీఎం చౌక్-వడాల మార్గంపై పెండింగ్ పనులు పూర్తి కావడానికి మరి కొన్ని నెలలు పడుతుందని, దీంతో ప్రయాణికులు ఈ మార్గంపై రైలు సేవల కోసం మరి కొన్ని నెలలు వేచి చూడక తప్పదని అధికారి తెలిపారు. కాగా ఈ రైలు సేవలను ప్రారంభ దశలో నాలుగు నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు గతంలో నిర్ణయించినప్పటికీ ఇప్పుడు తొమ్మిది నిమిషాలకు ఒక రైలును అందుబాటులో ఉంచనున్నట్లు వారు వెల్లడించారు. అయితే కాంట్రాక్ట ఒప్పందం ప్రకారం.. తొమ్మిది నిమిషాలకు ఒక రైలు నడిపే విధంగా ఉందని అడిషినల్ మెట్రోపాలిటన్ కమిషనర్ అశ్విని భిడే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రజా స్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని మరో అధికారి అభిప్రాయపడ్డారు. అయితే ఇది కొత్త విధానం కావడంతో ప్రారంభంలో ఈ రైలు సేవలను ఎంత మంది ప్రయాణికులు వినియోగించుకుంటారనేది ముందుగానే అంచనా వేయలేమన్నారు. ఇదిలా ఉండగా ఈ రైలు మార్గంలో ఇతర మార్గాలతో పోల్చితే వడాలా-చెంబూర్ మార్గం చాలా ప్రఖ్యాతి గాంచిందన్నారు. దీంతో ఈ మార్గంలోనే నవంబర్ ఆఖరు వరకు రైలు ప్రారంభించాలని నిర్ణయించామని అధికారి వెల్లడించారు. -
ఖేర్వాడి ఫ్లైఓవర్‌కు మోక్షం
సాక్షి, ముంబై: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఖేర్వాడి ఫ్లైఓవర్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల చివరి వరకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిర్ణయించింది. ట్రాఫిక్ పోలీస్ శాఖ నుంచి అనుమతి వచ్చిన వెంటనే చకచక పనులు జరుగుతాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ‘ఈ ఫ్లై ఓవర్‌ను ఆరు లేన్లతో నిర్మించనున్నారు. 2.5 కి.మీ మేర చేపట్టనున్న దీని నిర్మాణం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి బాంద్రాలోని కలానగర్ జంక్షన్‌కు 100 మీటర్ల దూరం వరకు ఉంటుంద’ని చెప్పారు. ఇది వినియోగంలోకి వస్తే ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రయాణ సమయం కూడా భారీగా ఆదా అవుతుందని తెలిపారు. అయితే ఈ నిర్మాణ సమయంలో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని, రద్దీ సమయంలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ అధికారులతో చర్చిస్తున్నాం ఈ ఫ్లైఓవర్ నిర్మాణం విషయమై ట్రాఫిక్ అధికారులతో చర్చిస్తున్నామని, వీరి నుంచి త్వరలోనే అనుమతి లభిస్తుందని ఎమ్మెమ్మార్డీయే అదనపు కమిషనర్ అశ్విని భిహ్డే తెలిపారు. ఈ నెల 15వ తేదీన నిర్మాణ పనులు చేపట్టే అవకాశముందన్నారు. ఈ పనుల కోసం వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే మార్గంలో రెండులేన్లను మూసివేయనున్నామని పేర్కొన్నారు. కల్యాణ్ దిశగా వెళ్లే వాహనచోదకులను సర్వీస్ రోడ్ మీదుగా మళ్లించాలని నిర్ణయించామన్నారు. కొంత సమయం తీసుకుంటుంది ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతిచ్చేందుకు మరికొంత సమయం తీసుకుంటుందని ట్రాఫిక్ పోలీస్ యూనిట్ సీనియర్ ఇన్స్పెక్టర్ పీపీ టేమ్కర్ తెలిపారు. ఎమ్మెమ్మార్డీయే తమకు ట్రాఫిక్ మళ్లింపు పత్రాలతోపాటు అవసరమున్న ఇతర పత్రాలను తమకు అందజేయలేదని అన్నారు. దీంతో వాహన చోదకులకు ప్రత్యామ్నాయ మార్గాలను ఖరారు చేయలేదని పేర్కొన్నారు. అయితే నవంబర్‌కు ముందు మాత్రం ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతిని ఇవ్వబోమని వారు తెలిపారు. ‘రద్దీ సమయంలో కలానగర్ జంక్షన్ నుంచి వకోలా ఫ్లైఓవర్ వరకు నిత్యం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఖేర్వాడి సిగ్నల్ వద్ద ఇరు ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలు నిలిచిపోతాయి. దీంతో ఇక్కడ అధిక సమయం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంద’ని టేమ్కర్ తెలిపారు. -
సొరంగ మెట్రో రైలు లైన్ క్లియర్
సాక్షి, ముంబై: నగరంలోనే మొదటి సొరంగ మెట్రో రైలు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య ప్రతిపాదిత 33.5 కి.మీ. సొరంగ మెట్రో రైలు మార్గ నిర్మాణానికి అవసరమైన రుణం మంజూరుకు జపాన్ బ్యాంకులు ముందుకు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవసరమైన వివిధ శాఖల నుంచి తీసుకునే అనుమతుల ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ సొరంగ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.23 వేల కోట్లు ఖర్చవుతాయని అధికారుల అంచనా. ఇందులో రూ.13 వేల కోట్లను రుణాల రూపంలో అందజేసేందుకు జపాన్ బ్యాంకులు అంగీకరించాయి. మొదటి విడతగా రూ.4,553 కోట్లు చెల్లించేందుకు రెండు రోజుల కిందట ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. దీనిపై ఢిల్లీకి చెందిన ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి రాజేశ్ ఖుల్లార్, జపాన్ బ్యాంకుకు చెందిన భారతదేశ ప్రధాన ప్రతినిధి శిన్యా ఎజిమా తదితరులు సంతకాలు చేశారు. ఈ రుణాలను తిరిగి జపాన్ బ్యాంకులకు 30 ఏళ్లలో చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో మెట్రో-3 ప్రాజెక్టు పనుల ప్రతిపాదన కూడా ముందుకు సాగింది. దీంతో ఈ ప్రాజెక్టు పనులు కూడా త్వరలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రాజెక్టును ఏడు ప్యాకేజీల్లో మొదలుపెడతారు. గత అర్హత, అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన కంపెనీల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆరు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. 2014 నుంచి పనులు ప్రత్యక్షంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) కమిషనర్ యు.పి.ఎస్.మదన్ అన్నారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్ జామ్ సమస్య నుంచి గట్టిక్కించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలక పాత్ర పోషించనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు వివరాలు.... కొలాబా-బాంద్రా-సీప్జ్ మధ్య 33.5 కి.మీ. సొరంగ మార్గం ఈ మార్గంపై మొత్తం 26 స్టేషన్లు ఉంటాయి. ముందుగా కఫ్ పరేడ్ నుంచి పనులు ప్రారంభమై వర్లీ, బాంద్రా ప్రాంతాలను తాకుతూ సీప్జ్ వరకు వెళుతుంది. కార్ డిపో కోసం గోరేగావ్‌లోని ఆరే కాలనీలో స్థలం కేటాయించారు. ఈ ప్రాజెక్టు పనులు పారదర్శకంగా కొనసాగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డెరైక్టర్లతో కూడిన సంయుక్త కంపెనీ స్థాపించనున్నారు. -
డిసెంబర్లో ‘మెట్రో’ పరుగులు
సాక్షి, ముంబై: తరచూ వాయిదాపడుతూ వస్తున్న ‘వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్’ మెట్రోరైలు ఈ ఏడాది డిసెంబరులో కచ్చితంగా పరుగులు తీస్తుందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) భరోసా ఇచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమలు చేసేందుకు అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను మరింత వేగవంతం చేయాలని ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ముంబై మెట్రో-వన్ (రిలయన్స్ ఇన్ఫ్రా) కంపెనీని ఎమ్మెమ్మార్డీయే హెచ్చరించింది. కనీసం డిసెంబరు ఆఖరు వరకు మెట్రోరైళ్లను పరుగులు తీయించాలనే ధృడసంకల్పంతో ఈ సంస్థ ఉంది. దీనిపై చర్చించేందుకు బుధవారం పలువురు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మెట్రోరైలు డిసెంబరు నుంచి కచ్చితంగా పరుగులు తీస్తుందని సమావేశం అనంతరం ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యు.పి.ఎస్.మదన్ స్పష్టం చేశారు. మెట్రోరైలు ప్రాజెక్టుపై ఇప్పటికే అధికారులు అనేక డెడ్లైన్లు విధించిన విషయం తెలిసిందే. అయితే ఏ ఒక్క డెడ్లైన్నూ రిలయన్స్ పాటించలేకపోయింది. అనుకున్న విధంగా పనులు పూర్తికాకపోవడంతో మెట్రోరైలు ప్రారంభం తరచూ వాయిదా పడుతుండడం తెలిసిందే. మోనో రైలు ప్రాజెక్టు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. అసలు ఈ మెట్రో, మోనో రైళ్లు పరుగెత్తుతాయా..? అనే సందిగ్ధంలో ముంబైకర్లు పడిపోయారని బాంద్రావాసి ఒకరు అన్నారు. ఈ నేపథ్యంలో రెండు కీలక ప్రాజెక్టుల్లో ఒకటి డిసెంబరులోపే అందుబాటులోకి వస్తుందని ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ మదన్ స్పష్టంగా ప్రకటించారు. మోనోరైలు కూడా లేటే మోనోరైలు ప్రాజెక్టు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. అనుమతులు రాకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులకు కూడా పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకపోవడంతో సమస్యలు ఎదరవుతున్నాయి. ఇదిలా ఉంటే డెడ్లైన్లు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎల్ అండ్ టీ కాంట్రాక్టు కంపెనీకి ఎమ్మెమ్మార్డీయే ఇటీవల రూ.25 వేలు జరిమానా విధించింది. అంతటితో ఊరుకోకుండా షోకాజ్ నోటీసు జారీచేసింది. చెంబూర్-వడాలా-సాత్‌రాస్తా మోనోరైలు ప్రాజెక్టు పనులు నగరంలో అక్కడక్కడ జరుగుతున్నాయి. అందులో భాగంగా జూలైలో బోయివాడ ప్రాంతంలో రెండు క్రేన్ల ద్వారా మోనో రైలు పిల్లర్లపై ఓ భారీ దిమ్మెను అమరుస్తుండగా అది అదుపుత ప్పి నేలపై పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఆ భారీ దిమ్మె క్రేన్‌పై పడడంతో అది పాక్షికంగా దెబ్బతింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తూ ఎల్ అండ్ టీకి జరిమానా, షోకాజ్ నోటీసు జారీచేసినట్లు ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు వివరించారు. -
‘మూడో’ మెట్రో ముమ్మరం
సాక్షి, ముంబై: మూడోదశ మెట్రోరైలు నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది చివరిలోగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వచ్చే ఏడాది జనవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) యోచిస్తోంది. కొలాబా నుంచి సీప్జ్ వరకు సుమారు 34 కిలోమీటర్ల మేర మెట్రో-3 ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను రుణంగా తీసుకునేందుకు రా్రష్ట్ర ప్రభుత్వం జపాన్ సహకార బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చోవడం తెలిసిందే. దీంతో టెండర్లు ఆహ్వానించేందుకు మార్గం సుగమమయిందని అధికారులు భావిస్తున్నారు. శివ్డీ-నవశేవా ముంబై ట్రాన్స్‌హార్బర్ లింకు ప్రాజెక్టు కోసం ఇటీవల టెండర్లు ఆహ్వానించినా ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించకపోవడం తెలిసిందే. దీంతో ఆ ప్రాజెక్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతానికి దీనిని పక్కనబెట్టి, మెట్రో-3 ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని అథారిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సొరంగమార్గం, స్టేషన్లు, రైల్వేట్రాక్స్, సిగ్నల్ పరికరాలు, రైళ్ల కొనుగోలుకు మొత్తం 23 రకాల టెండర్లను ఆహ్వానించనున్నారు. ఒకేసారి ఏడు వేర్వేరు చోట్ల పనులు ప్రారంభించనున్నారు. చార్కోప్ ప్రాంతంలో కేంద్ర ప్రజాపనులశాఖ స్థలాన్ని కాస్టింగ్ యార్డ్ కోసం తాత్కాలికంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వసాయంతో ప్రయత్నాలు చేస్తున్నామని ఎమ్మెమ్మార్డీయే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇదిలా ఉండగా జపాన్ బ్యాంకులు ఈ ప్రాజెక్టు కోసం నాలుగుశాతం వడ్డీకి రుణాలు అందజేసేందుకు అంగీకరించాయి. అందుకు సంబంధించిన ఒప్పందపత్రాలు ప్రస్తుతం కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటికి ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. మెట్రో-3 ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. గోరేగావ్, కఫ్ పరేడ్ ప్రాంతాల్లో స్థల సేకరణ పూర్తికావడంతో 2014 జనవరిలో ఇక్కడ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగతా చోట్ల స్థల సేకరణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు వారు వివరించారు.