ఇదేం పాలన!
సాక్షి, ముంబై: పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల అన్ని వనరులున్నా మహారాష్ర్టలో అభివృద్ధి తిరోగమనంలో ఉందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. బాంద్రా కుర్లా కాం ప్లెక్స్ సమీపంలోని ముంబై మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ(ఎమ్మెమ్మార్డీయే) మైదానంలో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన మహాగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రజాస్వామ్య కూటమి అసమర్థత వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. బాంబే రాష్ట్రం నుంచి 1960 మే ఒకటో తేదీన మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు.
అప్పుడు మహారాష్ట్రతో పోలిస్తే ఓ పక్కన ఏడారిలా తాగేందుకు సరిగా నీరు లేక తదితర ఇబ్బందులతో గుజరాత్ ఎలా అభివృద్ధి చెందుతుందోనని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే మహారాష్ట్ర కన్నా గుజరాతే అభివృద్ధి చెందిందన్నారు. శివసేన, బీజేపీ పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లిన మహారాష్ట్ర, డీఎఫ్ కూటమి పాలనలో మళ్లీ వెనక్కి వెళుతోందని మోడీ ఆరోపించారు. గుజరాత్‌లో సంవత్సరం పాటు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తుంటే...మహారాష్ట్రలో మాత్రం విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొన్ని గ్రామాలు అంధకారంలో ఉన్నాయన్నారు. దీంతో గుజరాత్ నుంచి షిర్డీ వెళ్లే సమయంలో మహారాష్ట్ర వచ్చిందని ఎలా గుర్తించాలని అడిగితే చీకటిగా ఉండే గ్రామాలు వస్తే అదే మహారాష్ట్ర అని చెబుతున్నారన్నారు.
కుర్చీ కోసమే రాజకీయాలు...
రాష్ట్రాలు అవతరించిన అనంతరం ఇప్పటివరకు గుజరాత్‌లో కేవలం 14 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అదే మహారాష్ట్రలో మాత్రం ఏకం గా 26 మంది ఇప్పటివరకు ముఖ్యమంత్రులయ్యా రు. దీన్నిబట్టి ఇక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. ఇక్కడ ఎవరైన ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆయనను ఎలాగైన దించడానికి మరో నాయకుడు సిద్దంగా ఉంటాడు. ఇవి కాంగ్రెస్ మార్కు రాజకీయాలని మోడీ ఎద్దేవా చేశారు.
గుజరాతీ భాషకు పుట్టినిల్లు ముంబై...
ముంబైలో గుజరాతీ భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముంబైని గుజరాతీ భాషకు పుట్టినిల్లుగా మోడీ అభివర్ణించారు. మహారాష్ట్రలో అంతర్భాగమైన తాము గుజరాత్‌గా అవిర్భవించాం. దీంతో మహారాష్ట్ర పెద్ద అన్నగా భావిస్తామని చెప్పారు.
ఎల్‌బీటీతో బాదుడు...
రాష్ట్రాలు విడిపోయిన అనంతరం గుజరాత్‌లోనూ అక్ట్రాయ్ సమస్య వచ్చిందన్న మోడీ దానిని రద్దు చేశామన్నారు. కానీ మహారాష్ట్రలో ఇటీవలే ఆక్ట్రాయిని రద్దు చేశామని చెప్పిన ఇక్కడి ప్రభుత్వం.. మరో రకంగా లోకల్ బాడీ టాక్స్ (ఎల్‌బీటీ)ని ప్రారంభించింది. ఇలా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఎల్‌బీటీ అంటే ‘లూట్ బాట్ టెక్నిక్’గా అభివర్ణించారు.
బాల్‌ఠాక్రేకు శ్రద్ధాంజలి...
శివసేన అధినేత బాల్ ఠాక్రేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. దేశంలోని సమస్యలపై ముంబై గడ్డపై నుంచి పులిలా ఆయన గాండ్రించేవారని రాజ్‌నాథ్ అన్నారు.
జేబులను కత్తిరిస్తున్న కాంగ్రెస్ : గడ్కరి
మహారాష్ట్రలో డీఎఫ్ పాలన కారణంగా రైతులు ఆత్మహత్యలు పెరిగాయి. అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. ప్రపంచంలో అవినీతి కుంభకోణాలపై ఏదైన పోటీ ఉంటే కాంగ్రెస్‌కు ప్రథమ బహుమతి లభిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. పేదల నేస్తం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రస్తుతం పేదల జేబులు కత్తిరిస్తుందన్నారు.
33 సీట్లు వస్తాయి...
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి(శివసేన, బీజేపీ, ఆర్పీఐ)కి 33 లోక్‌సభ సీట్లు వస్తాయని బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే ఆశాభావం వ్యక్తం చేశారు. వీటిలో ముంబైలోని ఆరు సీట్లు తమకే దక్కుతాయని చెప్పారు. ఆదర్శ్, జలవనరుల కుంభకోణం, ఆకాశాన్ని అంటుతున్న ధరలన్నింటినిప్రజలు గమనిస్తున్నారు. దీంతో వీరు ఓటుతో కాంగ్రెస్‌కు బుద్దిచెబుతారన్నారు.
రూ. 25 కోట్ల పార్టీ ఫండ్...
పార్టీ ఫండ్‌తోపాటు రాబోయే ఎన్నికల కోసం మహారాష్ట్ర బీజేపీ నిధులను సేకరించింది. ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. ఇలా సేకరించిన మొత్తం రూ. 25 కోట్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్, ముంబై బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శెలార్ అందించారు.
సైడ్‌లైట్స్
ముంబైకి ఉదయం 11.15 గంటల ప్రాంతంలో చేరిన నరేంద్ర మోడీ, రాజ్‌నాథ్ సింగ్‌లు..
ఏడంచెల భద్రతతో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో లీలా ఇంటర్‌నేషన్ హోటల్‌కు చేరారు.
11.45 గంటలకు నరేంద్ర మోడీ మైనపు విగ్రహం అవిష్కరించారు
భోజన అనంతరం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో మహాగర్జనకు చేరుకున్నారు
మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రసంగం ప్రారంభించిన మోడీ
మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రసంగం పూర్తి
జనసాగరంగా మారిన బీకేసీ పరిసరాలు