సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మెట్రో రైలు సేవలు డిసెంబరు మొదటివారంలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయని, నవంబరు మొదటివారంలో రైలు సేవలు ప్రారంభిస్తామని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) వర్గాలు ఇదివరకే ప్రకటించాయి. యథావిధిగా తాజా డెడ్‌లైన్ కూడా వాయిదా పడింది. ఎమ్మెమ్మార్డీయే గతంలోనూ ఇలాంటి డెడ్‌లైన్లు పలుసార్లు ప్రకటించి విఫలమయింది. ఇదే చివరి డెడ్‌లైన్ అని, డిసెంబరు మొదటివారంలో మెట్రో సేవలు ప్రారంభమవుతాయని మళ్లీ ప్రకటించింది.
కానీ చైనా నుంచి ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుట్రస్ట్‌కు (జేఎన్‌పీటీ) వచ్చిన మెట్రోరైళ్లను బయటకు తీసుకొచ్చేందుకు కస్టం డ్యూటీలో రాయితీ ఇవ్వాలని ఎమ్మెమ్మార్డీయే చేసుకున్న దరఖాస్తుపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాయితీ వచ్చేంతవరకు ఆ రైళ్లను కార్‌డిపోకు తీసుకురాకూడదని ముంబై మెట్రో-1 ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ (రిలయన్స్ మెట్రో) కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో డిసెంబరులో సేవలు ప్రారంభమవుతాయా? లేక మళ్లీ వాయిదా పడుతాయా? అనే దానిపై సందిగ్ధం నెలకొంది.
ఒకవేళ ఎమ్మెమ్మార్డీయే తన పరువు కాపాడుకునేందుకు డిసెంబరులోనే రైలుసేవలు ప్రారంభినా... రైళ్లను మాత్రం టైంటేబుల్ ప్రకారం నడిపేందుకు ఆస్కారం లేదు. ఇందుకు ప్రధాన కారణం కస్టం డ్యూటీ చెల్లించలేక జేఎన్‌పీటీలో ఐదు రైళ్లు అలాగే పడి ఉండడమే. చైనా నుంచి తీసుకొచ్చిన 16 మెట్రోరైళ్లకు కస్టం డ్యూటీలో రాయితీ ఇవ్వాలని 2009లో ఎమ్మెమ్మార్డీయే కస్టమ్స్‌శాఖకు విజ్ఞప్తి చేసింది. ఆ శాఖ మాత్రం రాయితీ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో జేఎన్‌పీటీలోకి వచ్చిన చేరిన ఈ ఐదు రైళ్లను స్వాధీనం చేసుకుని కార్ షెడ్డుకు తరలించాలంటే భారీగా కస్టం శాఖకు భారీగా డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది గిట్టుబాటు కావడంలేనందున రాయితీ ఇచ్చేంతవరకు వాటిని తరలించే ప్రసక్తే లేదని మెట్రో-1 ప్రాజెక్టు (రిలయన్స్ మెట్రో) నిర్ణయం తీసుకుంది.
చట్టం వర్తింపుపై గందరగోళం
రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని మెట్రో రైల్వేలు (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) చట్టం 2002 ప్రకారం గుర్తించపోవడం వల్ల కూడా ప్రాజెక్టు ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గాన్ని డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని పృథ్వీరాజ్ చవాన్ సర్కారు ప్రకటించినా, అది ఆచరణ సాధ్యం కాదని నిర్మాణ సంస్థ ముంబై మెట్రోవన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) చెబుతోంది. అన్ని అనుమతులు వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించడం వీలువుతుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2007లో ఈ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని ట్రామ్‌వేస్ చట్టం 1886 ప్రకారం గుర్తిస్తున్నట్టు ప్రకటించింది.
అయితే కేంద్ర ప్రభుత్వం 2009లో జారీ చేసిన ఉత్తర్వుల్లో అన్ని మెట్రోప్రాజెక్టులకు మెట్రో రైల్వేలు (ఆపరేషన్స్, మెయింటెనెన్స్) చట్టం 2002 వర్తిస్తుందని తెలిపింది. ఈ రెండింటిలో వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ ప్రాజెక్టుకు ఏ చట్టం వర్తిస్తుందో తెలియజేయాల్సిందిగా ఎంఎంఓపీఎల్ 2010 నుంచి ఎమ్మెమ్మార్డీయేను కోరుతున్నా ఇంత వరకు అది స్పష్టత ఇవ్వలేదు. ‘చట్టం విషయంలో స్పష్టత రానంత వరకు ఏ ఒక్క అనుమతిని పొందడం సాధ్యపడదు. రైలు సేవలను అందించడం కూడా అక్రమమే అవుతుంది. చట్టం విషయంపై ప్రభుత్వం స్పందించనంత వరకు ఈ ప్రాజెక్టులో జాప్యం తప్పదు. దీనికి మమ్మల్ని బాధ్యులను చేయకూడదని కూడా మేం ఎమ్మెమ్మార్డీయేకు స్పష్టీకరించాం’ అని ఎంఎంఓపీఎల్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన సమస్యలపై అధ్యయనం చేస్తున్నందున వల్లే ఈ విషయంలో నిర్ణయంలో జాప్యమవుతోందని, అయితే డిసెంబర్ మాసాంతంలోపు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఎమ్మెమ్మార్డీయే అధిపతి యూపీఎస్ మదన్ వివరణ ఇచ్చారు.
స్పందించని సర్కారు... నిర్లక్ష్యమే మూలకారణం
Published Wed, Oct 30 2013 12:26 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM
Advertisement
Advertisement