నిర్మాణ పనులను వ్యతిరేకిస్తున్న సేవ్ గ్రూప్
సుమారు 2,300 చెట్లు కూల్చివేయనున్న ఎమ్మెమ్మార్డీయే
పర్యావరణానికి ముప్పు అని ఆందోళన
మెట్రో-3 ప్రాజెక్టు పనులపై వివాదం
సాక్షి, ముంబై: కొలాబా-బాంద్రా-సీఫ్జ్(సీబీఎస్) మెట్రోలైన్-3 ప్రాజెక్టు పనులపై స్వచ్ఛంద సేవా సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నగరంలో సుమారు 2,300 చెట్లను నరికివేయాల్సి ఉంటుం దని, దానివల్ల పర్యావరణానికి త్రీవముప్పు తప్పదని పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. చెట్ల నరికివేతను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెమ్మార్డీయే, బీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినా ఎవరూ స్పందిం చడం లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, మెట్రో-3 పనుల్లో భాగంగా చెట్ల నరికివేతను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ప్రాజెక్టు నిధులను అందజేస్తున్న జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ)కే నేరు లేఖ రాయనున్నట్లు ప్రకృతి ప్రేమికుడు రిషీ అగర్వాల్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మెట్రో-3 కార్ షెడ్‌ను ఆరే కాలనీలో 30 హెక్టార్లలో నిర్మాణం చేపట్టారు. కాగా,ఈ నిర్మాణ పనులను ద సేవ్ ఏఎంసీ గ్రూప్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ షెడ్‌ను ముంబై పోర్ట్ ట్రస్ట్ (ఎంబీపీటీ)లోని బహిరంగప్రదేశంలోకి మార్చాల్సిందిగా ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్‌తో వారు ఈ నెల నాలుగున కలిసి విన్నవించారు. కాకుంటే మహాలక్ష్మీ, సీఎస్టీకి అనుసంధానం చేస్తూ భూగర్భ టన్నెల్ నిర్మించాలని సూచించారు. కాగా, తమ సూచనలకు ఎలాంటి స్పందన లభించలేదని సేవ్ గ్రూప్ పేర్కొంది. ఈ సందర్భంగా ఎమ్మెమ్మార్డీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం కార్ డిపోను మార్చడం సాధ్యం కాదని తెలిపారు. ఆరే కాలనీలో ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు.
అలాగే ఎంబీటీపీకి కార్ షెడ్‌ను మార్చడం కోసం వివిధ రకాల అనుమతులు, ఆమోదాలు అవసరమని తెలిపామన్నారు. ఇందుకు గాను కొన్ని నెలలు లేదా యేళ్లు పట్టవచ్చని అధికారి అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను మెట్రో 3 పనుల్లో తీవ్ర జాప్యం జరిగి, అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోయే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఈ విషయమై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసినట్లు సేవ్ గ్రూప్‌సభ్యులు తెలిపారు. మెట్రో-3 ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని తాము కోరడంలేదని, కేవలం కార్‌షెడ్‌ను మాత్రం మార్చాలని కోరుతున్నామన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉండటంతో అనుమతులకు జాప్యం జరగదని భావిస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు.
కార్ షెడ్‌ను తరలించాల్సిందే!
Published Sun, Dec 7 2014 10:13 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement