అడ్డంకిగా మారిన స్థల సేకరణ
సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రరూపం దాల్చిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కొలాబా-బాంద్రా-సిబ్జ్ ప్రాంతాల మధ్య చేపట్టిన మెట్రో-3 ప్రాజె క్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుకు సంబంధించిన రైలు మార్గం జనావాసాల మధ్యనుంచి వెళ్తుండటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు కోసం బీఎంసీ కార్యాలయాలు, గోదాములు, రిజర్వుడు స్థలాలు, క్రీడా మైదానాలు, ఉద్యానవనాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల స్థలాలు సేకరించాల్సి ఉంటుంది. వీటికోసం ఆయా శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది.
బాధితుల ప్రత్యామ్నాయాలకు ఇబ్బంది
ట్రాఫిక్ సమస్యను చెక్ పెట్టడానికి మెట్రో-3 నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాజెక్టు పనులకు ‘పబ్లిక్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు’కు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో స్థల సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజె క్టుకు సంబంధించి మెట్రో రైలు పిల్లర్లకు, రైల్వే స్టేషన్‌ల నిర్మాణాలకు, మెట్లు, ఎస్కలేటర్ల నిర్మాణానికి భారీగా స్థలం సేకరించాల్సి ఉంటుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి స్థానికులనుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించినా, స్థలాలు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురవనుండటంతో ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు సఫలీకతమైతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
అడ్డంకులు ఎదురయ్యే ప్రాంతాలు
⇒ వర్లీ-ఇంజినీరింగ్ హబ్ భవనం ఎదురుగా బీఎంసీకి చెందిన భద్రత శాఖ భవనం ఉంది. ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చేవరకు భవనం కూల్చివేసేందుకు బీఎంసీ అనుమతివ్వదు.
⇒ వర్లీ-సస్మీరా ఇన్‌స్టిట్యూట్ పరిసరాల్లో ఉన్న బీఎంసీ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు బిల్డర్‌కు అప్పగించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన న్యాయ శాఖ వద్ద పెండింగులో ఉంది. ఇది క్లియర్ అయితే తప్ప మెట్రోకు స్థలం లభించదు.
⇒ ప్రభాదేవి-సిద్ధివినాయక్ మందిరం స్టేషన్ నిర్మాణం కోసం 15,254 చ.మీ. స్థలం కావాలి. అందుకు మందిరం పక్కనే ఉన్న నర్దుల్లా ట్యాంక్ మైదానం స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది.
⇒ లోయర్‌పరేల్-సైన్స్ మ్యూజియం స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలో ఉండడంతో దాన్ని స్వాధీనం చేసుకునే ప్రతిపాదన పెండింగులో ఉంది.
⇒ ముంబెసైంట్రల్-నాయర్ ఆస్పత్రి విస్తరణ, ఆస్పత్రిలో ఎల్పీజీ గ్యాస్ చాంబర్ స్థలాన్ని మెట్రో-3 కి ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతున్నారు.
⇒ చర్చిగేట్-హుతాత్మ చౌక్ వద్ద ఉన్న పే అండ్ పార్కింగ్ స్థలాన్ని ఇచ్చేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి.
⇒ రాజకీయ పార్టీ కార్యాలయాలు-అసెంబ్లీ హాలు, మంత్రాలయ పరిసరాల్లో అనేక రాజకీయ పార్టీల కార్యాలయాలున్నాయి. మెట్రో-3 నిర్మాణానికి ఆ స్థలాలని ఖాళీ చేయించాలి.
మెట్రో-3 పూర్తయ్యేనా?
Published Thu, Feb 12 2015 10:34 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement