ఆకాశవీధిలో... | The root of the Metro Rail | Sakshi
Sakshi News home page

ఆకాశవీధిలో...

Published Sun, Dec 8 2013 5:10 AM | Last Updated on Tue, Oct 16 2018 5:04 PM

The root of the Metro Rail

మన రూట్‌లోనే అన్ని మెట్రోలు
 =పూర్తిస్థాయి తొలి ఎలివేటెడ్ మెట్రో మనదే
 =కొచ్చి, నవీ ముంబైలకు హైదరాబాద్ ఆదర్శం
 =అంతర్జాతీయ ప్రమాణాలతో హెచ్‌ఎంఆర్ నిర్మాణ పనులు
 =ఢిల్లీ కాకుండా మరో ఏడు నగరాల్లో మెట్రోల నిర్మాణం
 =బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్‌లలో భూగర్భ నిర్మాణాలు
 =భవిష్యత్‌కు ఎలివేటెడే బెటర్ అంటున్న నిపుణులు

 
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కనిపిస్తున్న ఏకైక సమాధానం మెట్రోరైలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు దీని వైపే చూస్తున్నాయి. ప్రస్తుతం అధునాతన మెట్రోరైలు ఢిల్లీ నగరంలో పూర్తిస్థాయిలో సేవలందిస్తుండగా.. మరో ఏడు నగరాల్లో మెట్రోరైలు నిర్మాణపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటిలో రూ. 14వేల కోట్ల అంచనా వ్యయంతో నగర ంలోని మూడు లేన్‌లలో 72 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ప్రత్యేకత సంతరించుకుంది. మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే పూర్తిస్థాయి ఎలివేటెడ్ (ఆకాశమార్గం) కావడం. ఇది భూగర్భ మెట్రోలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మెట్రో ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలవడమే గాక.. భవిష్యత్ ప్రతిపాదిత ప్రాజెక్టులూ ఇదే మార్గాన్ని అనుసరించడానికి కారణమైందని చెప్పవచ్చు.
 
పూర్తిస్థాయి తొలి ఆకాశమార్గ మెట్రో మనదే

దేశంలో మెట్రోరైలు స్వాతంత్య్రానికి ముందే కోల్‌కతా, చెన్నై నగరాల్లో భూగర్భ మార్గాన ఉంది. ఢిల్లీలో తలెత్తిన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 2002లో మెట్రో రైలు ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. తొలి ఆకాశ మార్గ(ఎలివేటెడ్) మెట్రో రైలు ఇక్కడే మొదలైంది. అయితే అది పాక్షికమే. తొలిదశలో ఢిల్లీలో 65.11 కిలోమీటర్ల మెట్రో మార్గం రూపొందించగా, అందులో 13 కిలోమీటర్లు భూగర్భ మార్గమే. ఢిల్లీ తరువాత 2005 నుంచే హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రతిపాదనలు ఊపందుకున్నాయి.

అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మెట్రోరైలుకు హైదరాబాద్ నగ ర పాలక సంస్థ అదనపు కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత మెట్రోరైలు ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి ప్రాజెక్టును రూపొందించారు. నగరంలో నెలకొన్న పరిస్థితులు, భూగర్భ మార్గాన వెళితే ఎదురయ్యే కష్టనష్టాలు అధ్యయనం చేసిన ఆయన పూర్తిస్థాయి ఎలివేటెడ్ రైలుకు రూపకల్పన చేశారు. మూడు రూట్లలో 2006లో రూపొందించిన ప్రణాళిక కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా... 2010 నుంచి ఆకాశమార్గానికి అంకురార్పణ చేసింది. దీంతో దేశంలో పూర్తిగా ఆకాశమార్గాన రూపకల్పన చేసిన తొలి ప్రాజెక్టు మనదే అయింది.
 
భూగర్భ మార్గాలు ఇవే...

ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, జైపూర్, ముంబైలలో నిర్మిస్తున్న మెట్రోలు ఎలివేటెడ్‌తో పాటు భూగర్భ మార్గాలుగా రూపొందుతున్నాయి. తద్వారా నిర్మాణ పనుల్లో ఆలస్యంతో పాటు ఆర్థికంగా అధిక భారం పడుతోంది. బెంగళూరులో విధానసభ ముందు నిర్మిస్తున్న భూగర్భ మార్గం అంబేద్కర్ విగ్రహం తరలించే విషయంలో ఏర్పడ్డ వివాదం సందర్భంగా 9 నెలలుగా పనులు ఆగిపోయాయి. ముంబై, చెన్నై, బెంగళూరులలో ‘ఎలివేటెడ్’కు ఉన్నంత వేగం భూగర్భ మార్గానికి లేదు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి ఎలివేటెడ్ మెట్రో మార్గాల పైనే పడుతోంది.
 
భూగర్భ మార్గంలో కష్టాలెన్నో...

నిరంతరం ట్రాఫిక్‌తో నిండిపోయే రోడ్లను తవ్వి భూగర్భ మెట్రోలను రూపకల్పన చేయడం కష్టసాధ్యమైన పనిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎలివేటెడ్ మెట్రో నిర్మాణానికి ఒక కిలోమీటరుకు అయ్యే ఖర్చు భూగర్భ మార్గాన మూడు రెట్లకు పెరుగుతుంది. హైదరాబాద్ వంటి నగరంలోని భూగర్భం రాళ్లు, గుట్టలతో కూడినది కావడంతో భూగర్భంలో దాదాపు 80 అడుగుల లోతుకు తవ్వాల్సి రావడం కష్టమే. అలాగే స్టేషన్ ఏర్పాటు చేయాలంటే భూగర్భంలో కనీసం రెండు ఎకరాల స్థలం అవసరం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే మెట్రో నగరాలతో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర రాష్ట్రాల రాజధానుల్లో ఎలివేటెడ్ మెట్రోకు ప్రభుత్వాలు మెగ్గు చూపుతున్నాయి.
 
 ఇతర నగరాలకు ఆదర్శంగా...

 హైదరాబాద్ మెట్రో రూపకల్పన, అధునాతన పద్ధతిలో ఆకాశమార్గాన వంతెనలు, గడ్డర్లు, స్లాబ్‌లు, రైల్వేలైన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు... మహారాష్ట్రలోని నవీ ముంబై, కేరళలోని కొచ్చిన్ నగరాలకు ఆదర్శమయ్యాయి. కొచ్చిలో ప్రతిపాదిం చిన 25 కి.మీ. మెట్రోలైన్ పూర్తిగా ఆకాశమార్గాన రూపొందిస్తున్నదే. ఈ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అలాగే నవీముంబై మెట్రోరైలూ 106.4 కి.మీ. మేర ఆకాశమార్గాన్నే వె ళ్లేలా రూపకల్పన చేశారు. మెట్రోరైలు ప్రతిపాదిత నగరాలు అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, ఇండోర్, కాన్పూర్, లక్నో, లుథియానా, నాగ్‌పూర్, నాసిక్, పాట్నా, పుణే, సూరత్, గౌహతిలలోనూ ఎలివేటెడ్ రూట్‌లకే ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు మెగ్గు చూపుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement