future generations
-
అంబానీ ఫ్యామిలీ ఫోటో అదిరిందిగా : ఫోటోలు వైరల్
రిలయన్స్అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె, అనంత్ ప్రేయసి రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకులు ఘనంగా ముగిసాయి. గుజరాత్‌లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. అంబానీ పెద్దకోడలు, ఆకాశ్ భార్య శ్లోకా అంబానీ మన దేశం నెక్స్ట్ జనరేషన్ లీడర్లు ఒకే ఫ్రేమ్‌లో అంటూ ఈ ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. జామ్‌నగర్‌లో డిన్నర్ సందర్భంగా తీసుకున్న ఫోటోకి ఆకాష్, శ్లోక ఇషా, ఆనంద్, అనంత్, రాధికల బెస్ట్ ఫోటో అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. రిలయన్స్ అంబానీ కుటుంబం రేపటి తరం అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీ ‘హమ్ సాథ్ సాథ్ హై’ పోస్టర్‌తో పోస్టింగ్‌లు వెల్లువెత్తాయి. మరోవైపు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఫౌండర్ చైర్మన్‌గా ఉన్న ఎన్ఎంఏసీసీకి చెందిన ట్విటర్ ఖాతా కూడా వేడుకలు ఘనంగా ముగిసాయి అంటూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి రెండు ఫోటోలను కూడా షేర్ చేసింది. Ambani family and their furry family member ‘Happy’, strike a relaxed pose at the successful completion of the pre-wedding celebrations of Anant and Radhika which started with Anna Seva for nearby village communities, followed by three day festivities with friends and family. pic.twitter.com/crLugfuX2y — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 8, 2024 View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) -
భవిష్యత్ తరాల కోసం సర్కారు చర్యలు
* వెల్లడించిన స్పీకర్ మధుసూదనాచారి * ‘యునిసెఫ్’ నివేదిక ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, గర్భస్థ శిశువులను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేపడుతోందని శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలల పరిస్థితిపై ‘యునిసెఫ్’ రూపొందిం చిన 2016 నివేదికను మంగళవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల జీవన ప్రమాణాల స్థాయిని పెంచేందుకు యునిసెఫ్ కృషి చేస్తోందని, ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు చేసి సూచనలు చేస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ వస్తున్న మార్పులకు అనుగుణంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని, గర్భిణులకు పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన బాలలను దేశానికి అందిస్తోందన్నారు. బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ‘కేజీ టు పీజీ’ విధానం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందిస్తోందన్నారు. గత ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం వల్ల తన సొంత నియోజకవర్గం భూపాలపల్లి పరిధిలో చెంచులకు ఎలాంటి సౌకర్యాలనూ ఏర్పాటు చేయలేదని, పౌష్టికాహార లోపంతో గర్భిణులు, పిల్లలు చనిపోయే వారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, వ్యత్యాసాలు, వాటిని పూరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోడానికి యునిసెఫ్ నివేదిక ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల యునిసెఫ్ చీఫ్ రూత్ లియోని... ప్రపంచ బాలలకు సమాన అవకాశాల కోసం అనేక సూచనలు చేశామన్నారు. యునిసెఫ్ కమ్యూనికేషన్ అధికారి ప్రసోన్సేన్, శాసనసభా కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు. -
నిజాం వారసుల సందడి
దారుషిఫా, న్యూస్‌లైన్: నిజాం కుటుంబసభ్యుల సందడితో చౌమొహల్లా ప్యాలెస్ మురిసింది. సుదీర్ఘ కాలం తరువాత 8వ నిజాం కుటుంబసభ్యులంతా ఖురాన్ గ్యాలరీని ప్రారంభించే నిమిత్తం వచ్చారు. ముఖరంజా భార్య ప్రిన్సెస్ అస్రా, ఆమె కుమారులు ప్రిన్స్ అజ్మత్‌జా, ఆజంజా, కుమార్తె షహకార్ ప్యాలెస్ మొత్తం కలియతిరిగారు. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించిన కుటుంబానికి చెందిన వారు కావడంతో వారిని చూసేందుకు పలువురు తరలివచ్చారు. తమ పూర్వీకులు రాజ్యమేలిన ప్రాంతంలో సామాన్యుల మాదిరిగా వీరంతా తిరగడం ఆసక్తి కలిగించింది. నిజాం ఆస్తుల, సంస్కృతి పరిరక్షణ, తమ పూర్వీకులు వాడిన అరుదైన, అపురూపమైన సంపదను సేకరించి భవిష్యత్ తరాల కోసం భద్రపరిచే కార్యక్రమంలో భాగంగా.. శుక్రవారం ఖురాన్ గ్యాలరీని ప్రారంభించడానికి వచ్చినట్టు ప్రిన్సెస్ అస్రా తెలిపారు. ఖురాన్ గ్యాలరీ ప్రారంభం చౌమొహల్లా ప్యాలెస్‌లో ఖురాన్ గ్యాలరీని 8వ నిజాం, ప్రిన్స్ ముఖరంజా బహదూర్ పెద్ద కూమారుడు ప్రిన్స్ అజ్మత్‌జా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చౌమొహల్లా ప్యాలెస్‌లో ప్రపంచంలోనే అరుదైన ఖురాన్‌లను ప్రదర్శించడం విశేషమన్నారు. కుటుంబ సమేతంగా ఇక్కడకు రావడం ఆనందాన్నిస్తోందన్నారు. కాగా, గ్యాలరీలో.. ఇరాన్, ఇరాక్, ఉత్తర భారతదేశం, కాశ్మీర్ నుంచి బంగారపు పూతతో, చేతితో, సిరాతో లిఖించిన ఖురాన్‌లను ప్రదర్శనకు ఉంచారు. కాశ్మీర్ నుంచి సేకరించిన కాగితంపై లిఖించిన ఖురాన్ చాలా పురాతనమైనది. కుఫిక్, నస్క్, నస్తాలిఖ్, ముహాఖ్ఖాక్, తులుత్ తదితర రాత శైలిలో గల అర బ్బీ ఖురాన్లు కొలువుదీరాయి. 36 రకాల ఖురాన్లు.. మూడు ఇంచుల నుంచి 10 అడుగుల సైజు గల సైజు ఖురాన్‌లను గ్యాలరీలో ఉంచారు. కార్యక్రమంలో నిజాం కుటుంబ ప్రముఖులు, చౌమహల్లా ప్యాలెస్ డెరైక్టర్ కిషన్‌రావు పాల్గొన్నారు. సందర్శన వేళలు: ఉదయం 10-సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశ రుసుము: రూ.40 -
ఆకాశవీధిలో...
మన రూట్లోనే అన్ని మెట్రోలు =పూర్తిస్థాయి తొలి ఎలివేటెడ్ మెట్రో మనదే =కొచ్చి, నవీ ముంబైలకు హైదరాబాద్ ఆదర్శం =అంతర్జాతీయ ప్రమాణాలతో హెచ్ఎంఆర్ నిర్మాణ పనులు =ఢిల్లీ కాకుండా మరో ఏడు నగరాల్లో మెట్రోల నిర్మాణం =బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్లలో భూగర్భ నిర్మాణాలు =భవిష్యత్‌కు ఎలివేటెడే బెటర్ అంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కనిపిస్తున్న ఏకైక సమాధానం మెట్రోరైలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు దీని వైపే చూస్తున్నాయి. ప్రస్తుతం అధునాతన మెట్రోరైలు ఢిల్లీ నగరంలో పూర్తిస్థాయిలో సేవలందిస్తుండగా.. మరో ఏడు నగరాల్లో మెట్రోరైలు నిర్మాణపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటిలో రూ. 14వేల కోట్ల అంచనా వ్యయంతో నగర ంలోని మూడు లేన్లలో 72 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ప్రత్యేకత సంతరించుకుంది. మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే పూర్తిస్థాయి ఎలివేటెడ్ (ఆకాశమార్గం) కావడం. ఇది భూగర్భ మెట్రోలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మెట్రో ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలవడమే గాక.. భవిష్యత్ ప్రతిపాదిత ప్రాజెక్టులూ ఇదే మార్గాన్ని అనుసరించడానికి కారణమైందని చెప్పవచ్చు. పూర్తిస్థాయి తొలి ఆకాశమార్గ మెట్రో మనదే దేశంలో మెట్రోరైలు స్వాతంత్య్రానికి ముందే కోల్‌కతా, చెన్నై నగరాల్లో భూగర్భ మార్గాన ఉంది. ఢిల్లీలో తలెత్తిన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 2002లో మెట్రో రైలు ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. తొలి ఆకాశ మార్గ(ఎలివేటెడ్) మెట్రో రైలు ఇక్కడే మొదలైంది. అయితే అది పాక్షికమే. తొలిదశలో ఢిల్లీలో 65.11 కిలోమీటర్ల మెట్రో మార్గం రూపొందించగా, అందులో 13 కిలోమీటర్లు భూగర్భ మార్గమే. ఢిల్లీ తరువాత 2005 నుంచే హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మెట్రోరైలుకు హైదరాబాద్ నగ ర పాలక సంస్థ అదనపు కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత మెట్రోరైలు ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి ప్రాజెక్టును రూపొందించారు. నగరంలో నెలకొన్న పరిస్థితులు, భూగర్భ మార్గాన వెళితే ఎదురయ్యే కష్టనష్టాలు అధ్యయనం చేసిన ఆయన పూర్తిస్థాయి ఎలివేటెడ్ రైలుకు రూపకల్పన చేశారు. మూడు రూట్లలో 2006లో రూపొందించిన ప్రణాళిక కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా... 2010 నుంచి ఆకాశమార్గానికి అంకురార్పణ చేసింది. దీంతో దేశంలో పూర్తిగా ఆకాశమార్గాన రూపకల్పన చేసిన తొలి ప్రాజెక్టు మనదే అయింది. భూగర్భ మార్గాలు ఇవే... ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, జైపూర్, ముంబైలలో నిర్మిస్తున్న మెట్రోలు ఎలివేటెడ్‌తో పాటు భూగర్భ మార్గాలుగా రూపొందుతున్నాయి. తద్వారా నిర్మాణ పనుల్లో ఆలస్యంతో పాటు ఆర్థికంగా అధిక భారం పడుతోంది. బెంగళూరులో విధానసభ ముందు నిర్మిస్తున్న భూగర్భ మార్గం అంబేద్కర్ విగ్రహం తరలించే విషయంలో ఏర్పడ్డ వివాదం సందర్భంగా 9 నెలలుగా పనులు ఆగిపోయాయి. ముంబై, చెన్నై, బెంగళూరులలో ‘ఎలివేటెడ్’కు ఉన్నంత వేగం భూగర్భ మార్గానికి లేదు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి ఎలివేటెడ్ మెట్రో మార్గాల పైనే పడుతోంది. భూగర్భ మార్గంలో కష్టాలెన్నో... నిరంతరం ట్రాఫిక్‌తో నిండిపోయే రోడ్లను తవ్వి భూగర్భ మెట్రోలను రూపకల్పన చేయడం కష్టసాధ్యమైన పనిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎలివేటెడ్ మెట్రో నిర్మాణానికి ఒక కిలోమీటరుకు అయ్యే ఖర్చు భూగర్భ మార్గాన మూడు రెట్లకు పెరుగుతుంది. హైదరాబాద్ వంటి నగరంలోని భూగర్భం రాళ్లు, గుట్టలతో కూడినది కావడంతో భూగర్భంలో దాదాపు 80 అడుగుల లోతుకు తవ్వాల్సి రావడం కష్టమే. అలాగే స్టేషన్ ఏర్పాటు చేయాలంటే భూగర్భంలో కనీసం రెండు ఎకరాల స్థలం అవసరం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే మెట్రో నగరాలతో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర రాష్ట్రాల రాజధానుల్లో ఎలివేటెడ్ మెట్రోకు ప్రభుత్వాలు మెగ్గు చూపుతున్నాయి. ఇతర నగరాలకు ఆదర్శంగా... హైదరాబాద్ మెట్రో రూపకల్పన, అధునాతన పద్ధతిలో ఆకాశమార్గాన వంతెనలు, గడ్డర్లు, స్లాబ్‌లు, రైల్వేలైన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు... మహారాష్ట్రలోని నవీ ముంబై, కేరళలోని కొచ్చిన్ నగరాలకు ఆదర్శమయ్యాయి. కొచ్చిలో ప్రతిపాదిం చిన 25 కి.మీ. మెట్రోలైన్ పూర్తిగా ఆకాశమార్గాన రూపొందిస్తున్నదే. ఈ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అలాగే నవీముంబై మెట్రోరైలూ 106.4 కి.మీ. మేర ఆకాశమార్గాన్నే వె ళ్లేలా రూపకల్పన చేశారు. మెట్రోరైలు ప్రతిపాదిత నగరాలు అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, ఇండోర్, కాన్పూర్, లక్నో, లుథియానా, నాగ్‌పూర్, నాసిక్, పాట్నా, పుణే, సూరత్, గౌహతిలలోనూ ఎలివేటెడ్ రూట్లకే ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు మెగ్గు చూపుతున్నాయి. -
భవిష్యత్ తరాల కోసమే తపన
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలకు ఎదురయ్యే ఇబ్బందులపైనే తమ బాధ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. సమైక్యాం ధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో తుడా సర్కిల్లోని వైఎస్ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఇత్తడి పాత్రలకు రిపేర్లు చేసి, కళాయి పనులతో నిరసన తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారు ప్రకృతి, సాగునీటి వనరుల కోసం ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిన నేపథ్యంలో రాష్ట్ర విభజన అంత సులభం కాదని అన్నారు. ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనపై విభిన్న ప్రకటనలు చేస్తూ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. 60 రోజులుగా సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు జరుగుతుంటే ఏ మాత్రమూ ఖాతరు చేయకుండా ప్రజలను మోసగించే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల మొండి వైఖరి వల్ల రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని కోట్లాది మంది విద్యార్థులు చేతివృత్తులు చేసుకుని బతకాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దుస్థితి కలగకూడదనే ఏకైక లక్ష్యంతో తమ పార్టీ పోరాడుతోందని వెల్లడిం చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇవ్వడం వల్లే విభజన ప్రక్రియకు కాంగ్రెస్ పెద్దలు ధైర్యం చేశారని తెలిపారు. జగన్ ఫోబియాతోనే సీఎం సమైక్య నినాదం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ, అభిమానాన్ని చూసి సీఎం నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి సమైక్య నినాదం ఆలపిస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు చేసిన రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకునేందుకు రాజీనామాను ప్రయోగించకుండా ప్రజ లను మోసం చేసేందుకు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణలో రాజ కీయ పార్టీల విధానాలు తెలుసుకునేందుకు తక్షణమే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఆదికేశవరెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ చెలికం కుసుమ, మాజీ జెడ్పీటీసీ వెంకటమునిరెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, మబ్బు నాదమునిరెడ్డి, మెడికల్ అసోసియేషన్ నాయకులు బీ.రాజేంద్రరెడ్డి, నాగేంద్ర, మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలి
వడ్డెపల్లి,న్యూస్‌లైన్: ప్రకృతి సంపదను భావితరాలకు అందించడాన్ని మన కర్తవ్యంగా భావించాలని కలెక్టర్ కిషన్ అన్నారు. ప్రపంచ పర్యాటక వారోత్సవాలను పురస్కరించుకుని పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల నుంచి వడ్డెపల్లి చెరువు వరకు ‘2కే రన్’ నిర్వహించారు. జిల్లా అధికారి శివాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ సందర్భంగా చెరువుపై ఏర్పాటు చేసిన సదస్సులో ‘టూరిజం-నీరు’ అంశంపై కలెక్టర్ మాట్లాడారు. కాకతీయులు నిర్మించిన లక్నవరం, పాకాల, రామప్ప సరస్సులతో పాటు వేయిస్తంభాల దేవాలయం, కోటగుళ్లు, రామప్ప లాంటి శిల్పకళాసంపదను రక్షించుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు చాలా ఉన్నాయన్నారు. నగర కమిషనర్ వివేక్‌యాదవ్ మాట్లాడుతూ కాకతీయుల శిల్పకళా సంపదతో వరంగల్ నగరానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే వాతావరణం ఎంతో ఉంద ని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌లోని టౌన్హాల్లో ఏర్పాటు చేసిన టూరిజం ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ కిషన్ ప్రారంభించారు. 27 వరకు పర్యాటక వారోత్సవాలు 27వ తేదీ వరకు నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో టూరిజం-నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు టూరిజం శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికారి శివాజీ తెలిపారు. జిల్లాలో ముఖ్య పర్యాటక ప్రాంతాలైన రామప్ప, లక్నవరం, గణపురం కోటగుళ్లు, ఖిలా వరంగల్, వేయిస్తంభాల దేవాలయాలను కలుపుతూ ఆదివారం ప్రత్యేక టూర్ ప్యాకేజీతో టూరిస్ట్ బస్‌ను నడుపుతున్నట్టు తెలిపారు. కాకతీయ ఉత్సవాల్లో భాగంగా 24,25,26 తేదీల్లో గణపురం కోటగుళ్లు వద్ద గ్రామీణ పర్యాటక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 23న చిన్నవడ్డెపల్లి చెరువులో ఆర్చరీ, అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, 27న పబ్లిక్ గార్డెన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లా టూరిజం శాఖపై పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్హాల్లో ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులతోపాటు జిల్లా ముఖ్య అధికారులు 2కే రన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
తిరునగరిలో సమైక్య భేరి
తిరుపతి నగరం శుక్రవారం సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష గళ సమైక్య భేరి మోగింది. జై సమైక్యాంధ్ర నినాదంఢిల్లీని తాకేలా ఉద్యమకారులు గర్జించారు. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. సాక్షి, తిరుపతి: సమైక్యగళంతో తిరునగరి అట్టుడికింది. ఉద్యమ వేడి ఢిల్లీని తాకేలా కుల, మత భేదం లేకుండా లక్షగళ ఘోషతో సమైక్య నినాదాన్ని వినిపించారు. వేర్పాటువాదాన్ని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. ఐక్యకార్యాచరణ సమితి, సాప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో లక్షగళ సమైక్య భేరి మోగింది. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. వివిధ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యజమానులు తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు లక్ష గళ సమైక్యభేరికి హాజరయ్యారు. ఉదయం 9గంటల నుంచి సమైక్యవాదులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విద్యార్థులు వివిధ వేషధారణలో వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనలు చేశారు. పుంగనూరు నుంచి వచ్చిన చిన్నారులు కోలాటాలు అడుతూ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కార్వేటినగరం సంస్థానం సంప్రదాయాలతో కళాకారులు కత్తులు చేతబట్టి ప్రదర్శన చేశారు. మిన్నంటిన జై సమైక్యాంధ్ర నినాదాలు లక్షగళ సమైక్య భేరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో గర్జించారు. జ్వోతి ప్రజ్వలన అనంతరం ఒక్కొక్కరు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేర్పాటు వాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్య భేరికి కొందరు విద్యార్థులు భారీ జాతీయ జెండాతో హాజరయ్యారు. మరికొందరు సమైక్యాంధ్ర టోపీలు పెట్టుకుని తరలిరావడం కనిపించింది. రైల్యేస్టేషన్, గాంధీరోడ్డు, భవానీ నగర్, లీలామహల్, తుడా కూడలి సమైక్యవాదులతో కిక్కిరిసిపోయాయి. సమైక్య భేరికి హాజరైన వారికి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. రెండుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సమైక్య భేరికి కాంగ్రెస్ నేత అడ్డుచక్రం తిరుపతిలో శుక్రవారం చేపట్టిన లక్ష గళ సమైక్య భేరిని కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ నియోజకవర్గ నేత ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా గ్రూపు సభ్యులెవరూ సమైక్య భేరిలో పాల్గొనకూడదని హుకుం జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే మహిళా సభ్యులు ఉద్యమంలో పాల్గొనలేదనే ప్రచారం సాగింది. తన మాట వినకుండా పాల్గొంటే ఇంటి పట్టాలు, రుణాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నాయకుడ్ని తిరుపతికి రాకుండా అడ్డుకోవాలని సమైక్యవాదులకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాప్స్ జేఏసీ నాయకులు అశోక్‌రాజు, కేఎల్.వర్మ, శేషగిరిరావు, మహ్మద్ఫ్రీ, సింధూజ, దినకర్, ఆనంద నాయుడు, శ్రీనివాస చౌదరి, హరినాథ్‌శర్మ, రంజిత్‌కుమార్, కేవీ.రత్నం, వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మా గుండెలతో చలిమంట వేసుకుంటారా? తెలుగుజాతిని విభజన పేరుతో విడగొట్టి మండుతున్న మా గుండెలతో చలి మంటేసుకుంటారా?. చిన్నారులు, వయోవృద్ధులు సైతం రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు తప్పించుకుని తిరుగుతుండడం బాధాకరం. వేర్పాటువాదుల స్వార్థానికి తెలుగుజాతిని రెండు ముక్కలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ధన, రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్న వారిని తరిమితరిమి కొడతాం. - సాప్స్ జేఏసీ తిరుపతి కన్వీనర్ డాక్టర్ సుధారాణి తెలంగాణలోనూ ఎక్కువ మంది సమైక్యాంధ్రే కోరుతున్నారు సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ అత్యధికంగా సమైక్యాం ధ్రను కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఈ విషయం తెలుస్తుంది. విభజన వల్ల ఇరు ప్రాంతాల వారు నష్టపోతారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. - ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి విభజనతో విద్యార్థుల భవిత అంధకారమే రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 17 సెంటర్ యూనివర్సిటీలు, ఐఐటీ, త్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాలలు వంటి ఉన్నత విద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రం ముక్కలైతే సీమాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్య, టెక్నికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాలకులు రాష్ట్ర సమైక్యతను ప్రకటించాలి. - ఎన్.విశ్వనాథరెడ్డి, రాయలసీమ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రతినిధులు అడ్డుకోకపోవడం సిగ్గుచేటు తెలుగుజాతి, సీమాంధ్ర ప్రజల ఉనికికే ప్రమాదకరంగా మారిన విభజనను ప్రజాప్రతినిధులు అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధులు గల్లీకొస్తే ఢిల్లీ దాక తరిమికొట్టాలి. సమైక్య ప్రకటన వచ్చేవరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. - సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం యుద్ధ వాతావరణం సృష్టించడం బాధాకరం ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని విభజిస్తూ యుద్ధ వాతావరణం సృష్టిస్తుండడం బాధాకరం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విభజన పేరుతో చిచ్చురేపిన నాయకులకు బుద్ధి వచ్చేలా ఉద్యమం ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలి. - సాప్స్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి భవిష్యత్తు తరాల కోసమే ఉద్యమం సీమాంధ్రలో ఉద్యోగులు టీఏ, డీఏల కోసమే లేక వ్యాపారాల కోసమే ఉద్యమాలు చేయడం లేదు. భవిష్యత్తు తరాల కోసం రోడ్డుపైకి వచ్చారు. ఈవిషయాన్ని గుర్తించి ప్రజాప్రతినిధులు వారికి అండగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు. -జేఏసీ నేతలు విశ్వనాథ్‌రెడ్డి, రమేష్‌బాబు, కేఎస్.వాసు, వేంకటేశ్వర్లు -
సకలం బంద్
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. విశాఖ నుంచి గ్రామం వరకు నిరసనలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరాహార దీక్షలు, బంద్‌లతో జిల్లా హోరెత్తిపోతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మరింత ఉధృతం కానుంది. ఉద్యోగుల సమ్మె బాటతో జిల్లాలో పాలన పూర్తిగా స్తం భించనుంది. అన్ని కార్యాలయాల్లో పౌర సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర విభజనపై యూపీఏ ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల 11 రోజులుగా జిల్లాలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్న సమైక్యాం ధ్ర ఆందోళనకు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. వారం రోజులుగా విభిన్న రీతిలో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం విభజన నిర్ణయాన్ని వెన క్కు తీసుకోకపోవడంతో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతానికి నిర్ణయించాయి. పాలన స్తంభింప చేయడం ద్వారా యూపీఏ మెడలు వంచాలన్న భావనకు వచ్చాయి. అన్ని ఉద్యోగ సంఘాలు సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సమ్మెబాట పడుతున్నాయి. ప్రధానంగా జిల్లాలో ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండడంతో పాటు, అత్యధికం గా పౌర సేవలు అందించే ఏపీఎన్జీవోలు, రెవె న్యూ, పంచాయతీ ఉద్యోగులు సమ్మెకు దిగుతుండడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడనుంది. గ్రామా టల్లో పనిచేసే వీఆర్వోల నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్లతో పాటు తహశీల్దార్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ మూడు విభాగాల నుంచి సుమారుగా 25 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. దీంతో జిల్లాలో ఉన్న 43 తాలూకాఫీసులతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. గ్రామాల్లో మండల కార్యాలయాల్లో పౌర సేవలు స్తంభించనున్నాయి. కలెక్టరేట్లో కూడా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ మినహా మిగిలిన అధికారులు, సిబ్బంది విధులకు హాజరుకారు. ఇబ్బందులు తప్పవు : సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులందరూ సమ్మె బాట పడుతుండడంతో ఇబ్బందులు తప్పవు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోను ఎటువంటి పనులు జరగవు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నుంచి రెవెన్యూ భూముల వ్యవహారాల వరకు అన్ని పనులు స్తంభించనున్నాయి. ఫలితంగా ప్రజలు అవస్థలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రజల సంపూర్ణ మద్దతు సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది. రాష్ట్ర విభజన వల్ల భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలనే సమ్మె చేస్తున్నాం. దీనికి ప్రజల సహకారం పూర్తిగా ఉంది. - ఎస్.నాగేశ్వరరెడ్డి, ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు విభజన వల్ల అందరికీ నష్టం రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఆ విషయం జిల్లా ప్రజలకు పూర్తిగా అర్ధమైంది. అందుకే నగరంలోనే కాకుండా గ్రామాల్లో కూడా సమైక్యాంధ్ర ఉద్యమం పెల్లుబుకుతోంది. - కె.ఈశ్వరరావు, ఏపీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు