తిరునగరిలో సమైక్య భేరి | Tirunagari united drum | Sakshi
Sakshi News home page

తిరునగరిలో సమైక్య భేరి

Published Sat, Sep 7 2013 4:29 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

Tirunagari united drum

తిరుపతి నగరం శుక్రవారం సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష గళ సమైక్య భేరి మోగింది. జై సమైక్యాంధ్ర నినాదంఢిల్లీని తాకేలా ఉద్యమకారులు గర్జించారు. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు.   
 
సాక్షి, తిరుపతి: సమైక్యగళంతో తిరునగరి అట్టుడికింది. ఉద్యమ వేడి ఢిల్లీని తాకేలా కుల, మత భేదం లేకుండా లక్షగళ ఘోషతో  సమైక్య నినాదాన్ని వినిపించారు. వేర్పాటువాదాన్ని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. ఐక్యకార్యాచరణ సమితి, సాప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో లక్షగళ సమైక్య భేరి మోగింది. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

వివిధ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యజమానులు తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు లక్ష గళ సమైక్యభేరికి హాజరయ్యారు. ఉదయం 9గంటల నుంచి సమైక్యవాదులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విద్యార్థులు వివిధ వేషధారణలో వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనలు చేశారు. పుంగనూరు నుంచి వచ్చిన చిన్నారులు కోలాటాలు అడుతూ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కార్వేటినగరం సంస్థానం  సంప్రదాయాలతో కళాకారులు కత్తులు చేతబట్టి ప్రదర్శన చేశారు.

 మిన్నంటిన జై సమైక్యాంధ్ర నినాదాలు

 లక్షగళ సమైక్య భేరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో గర్జించారు. జ్వోతి ప్రజ్వలన అనంతరం ఒక్కొక్కరు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేర్పాటు వాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్య భేరికి కొందరు విద్యార్థులు భారీ జాతీయ జెండాతో హాజరయ్యారు. మరికొందరు సమైక్యాంధ్ర టోపీలు పెట్టుకుని తరలిరావడం కనిపించింది. రైల్యేస్టేషన్, గాంధీరోడ్డు, భవానీ నగర్, లీలామహల్, తుడా కూడలి సమైక్యవాదులతో కిక్కిరిసిపోయాయి. సమైక్య భేరికి హాజరైన వారికి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. రెండుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.
 
 సమైక్య భేరికి కాంగ్రెస్ నేత అడ్డుచక్రం

 తిరుపతిలో శుక్రవారం చేపట్టిన లక్ష గళ సమైక్య భేరిని కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ నియోజకవర్గ నేత ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా గ్రూపు సభ్యులెవరూ సమైక్య భేరిలో పాల్గొనకూడదని హుకుం జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే మహిళా సభ్యులు ఉద్యమంలో పాల్గొనలేదనే ప్రచారం సాగింది. తన మాట వినకుండా పాల్గొంటే ఇంటి పట్టాలు, రుణాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నాయకుడ్ని తిరుపతికి రాకుండా అడ్డుకోవాలని సమైక్యవాదులకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాప్స్ జేఏసీ నాయకులు అశోక్‌రాజు, కేఎల్.వర్మ, శేషగిరిరావు, మహ్మద్ఫ్రీ, సింధూజ, దినకర్, ఆనంద నాయుడు, శ్రీనివాస చౌదరి, హరినాథ్‌శర్మ, రంజిత్‌కుమార్, కేవీ.రత్నం, వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
 
 మా గుండెలతో చలిమంట వేసుకుంటారా?

 తెలుగుజాతిని విభజన పేరుతో విడగొట్టి మండుతున్న మా గుండెలతో చలి మంటేసుకుంటారా?. చిన్నారులు, వయోవృద్ధులు సైతం రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు తప్పించుకుని తిరుగుతుండడం బాధాకరం. వేర్పాటువాదుల స్వార్థానికి తెలుగుజాతిని రెండు ముక్కలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ధన, రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్న వారిని తరిమితరిమి కొడతాం.
 - సాప్స్ జేఏసీ తిరుపతి కన్వీనర్ డాక్టర్ సుధారాణి
 
 తెలంగాణలోనూ ఎక్కువ మంది  సమైక్యాంధ్రే కోరుతున్నారు
 సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ అత్యధికంగా సమైక్యాం ధ్రను కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఈ విషయం తెలుస్తుంది. విభజన వల్ల ఇరు ప్రాంతాల వారు నష్టపోతారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.
 - ఉద్యోగ జేఏసీ చైర్మన్
 ఆర్డీవో రామచంద్రారెడ్డి

 
 విభజనతో విద్యార్థుల భవిత అంధకారమే
 రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 17 సెంటర్ యూనివర్సిటీలు, ఐఐటీ, త్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాలలు వంటి ఉన్నత విద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రం ముక్కలైతే సీమాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్య, టెక్నికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాలకులు రాష్ట్ర సమైక్యతను ప్రకటించాలి.
 - ఎన్.విశ్వనాథరెడ్డి, రాయలసీమ
 ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి

 
ప్రజాప్రతినిధులు అడ్డుకోకపోవడం సిగ్గుచేటు
 తెలుగుజాతి, సీమాంధ్ర ప్రజల ఉనికికే ప్రమాదకరంగా మారిన విభజనను ప్రజాప్రతినిధులు అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధులు గల్లీకొస్తే ఢిల్లీ దాక తరిమికొట్టాలి. సమైక్య ప్రకటన వచ్చేవరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి.
 - సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు
 డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం      

 
 యుద్ధ వాతావరణం సృష్టించడం బాధాకరం
 ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని విభజిస్తూ యుద్ధ వాతావరణం సృష్టిస్తుండడం బాధాకరం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విభజన పేరుతో చిచ్చురేపిన నాయకులకు బుద్ధి వచ్చేలా ఉద్యమం ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలి.
 - సాప్స్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి
 
 భవిష్యత్తు తరాల కోసమే ఉద్యమం

 సీమాంధ్రలో ఉద్యోగులు టీఏ, డీఏల కోసమే లేక వ్యాపారాల కోసమే ఉద్యమాలు చేయడం లేదు. భవిష్యత్తు తరాల కోసం రోడ్డుపైకి వచ్చారు. ఈవిషయాన్ని గుర్తించి ప్రజాప్రతినిధులు వారికి అండగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు.  -జేఏసీ నేతలు విశ్వనాథ్‌రెడ్డి, రమేష్‌బాబు, కేఎస్.వాసు, వేంకటేశ్వర్లు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement