private institutions
-
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
4జీ, 5జీ సర్వీసులు లేకుంటే కష్టమే.!
న్యూఢిల్లీ: 4జీ, 5జీ సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ పోటీపడలేకపోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్‌లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పా టించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది. అవి లాభాల్లోనే ఉన్నప్పటికీ తాజాగా రేట్లను పెంచడం సరికాదని పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది. మూడు టెల్కోలు – రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా – టారిఫ్‌లను 10–27 శాతం మేర పెంచిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీ యూ) తక్కువగా ఉండటం వల్లే టారిఫ్‌లను పెంచాల్సి వచి్చందంటూ ప్రైవేట్ టెల్కోలు తప్పుదారి పట్టిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది. 2023–24లో జియో రూ. 20,607 కోట్లు, ఎయిర్‌టె ల్ రూ. 7,467 కోట్ల లాభాలు ఆర్జించాయని, ఈ నే పథ్యంలో సామాన్యులపై భారం పడేలా టారి ఫ్లను పెంచడం సరికాదని పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సత్వరం తగు చర్యలు తీసుకోవాలని, సామా న్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. -
అతడు బోనెక్కాల్సిందే!
నారాయణ చేసింది కూడా నరమేధమే. జినోసైడ్ కంటే తక్కువ పాపమేమీ కాదు. ఈ నారాయణ నలుగురితో నారాయణ మాత్రం కాదు. పరిచయం అక్కర్లేని పేరు. దయ్యాన్ని దయ్యం అనే అంటాం. ఇంకో రకంగా చెప్పలేము. నారాయణ కూడా... నారాయణే! గడిచిన పాతికేళ్లుగా ఒఖ్ఖటి.. ఒఖ్ఖటి... ఒఖ్ఖటి అంటూ కర్ణకఠోరంగా వినిపిస్తున్న పేరు. ఇంకో ఒకరిద్దరితోపాటు ఈ నారాయణ చేసిన నేరాలపై ఇప్పుడు తెలుగు సమాజంలో ఒక చర్చ నడుస్తున్నది. ఎటువంటి నేరాలవి? రెండు తరాలకు ప్రాతినిధ్యం వహించే లక్షలాదిమంది యువతీ యువకుల మేధోవికాసాన్ని దారుణంగా చిదిమేసిన యుద్ధనేరం. ఉరిమే ఉత్సాహంతో పరుగులు తీయవలసిన ప్రభాత కిరణాలకు సంకెళ్లు వేసిన నేరం. ఆ కిరణాలను బ్రాయిలర్ కోళ్లుగా మార్చిన ఘోరం. కాలేజీ విద్యను కోళ్లఫారాల వ్యాపారంగా ఏమార్చిన వైనం. జైలు గదులకు బడి పేరు పెట్టి బాల్యాన్ని బంధించిన రౌరవకార్యం. నారాయణాదుల కరెన్సీ చదువుల యాగంలో లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు సమిధలుగా మారాయి. అమాయక తల్లిదండ్రుల ఆశల్ని నోట్ల కట్టలుగా తర్జుమా చేసుకున్న విద్యా వ్యాపారం నారాయణ చేసిన నేరం. జాతి భవితను పణంగా పెట్టి లాభాలు పిండుకున్న దేశద్రోహం. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు చేసిన నేరాల కంటే ఈ ‘చైనా’జీ కార్పొరేట్ల నేరాలు ఎక్కువ ప్రమాదకరమైనవి. న్యూరెన్బర్గ్ ప్రత్యేక కోర్టుల కంటే పటిష్ఠమైన ప్రత్యేక న్యాయస్థానాల్లో ఈ యుద్ధ నేరస్థులపై విచారణ జరగాలి. ఎందుకంటే నారాయణాదులు చాలా పవర్ఫుల్. దయ్యాలకంటే పవర్ఫుల్. ఎంతో పవర్ఫుల్ కాకపోతే అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ను కోర్టు మెట్లు ఎక్కించకముందే బెయిల్ ఎట్లా ఖాయమవుతుంది? అంత గట్టి లాయర్లుంటారు నారాయణకు! దరఖాస్తు చేయకుండానే బెయిల్ ఎట్లా వచ్చిందని అదనపు అడ్వొకేట్ జనరల్ నోరు వెళ్లబెట్టాల్సి వచ్చింది. నూతన ఆర్థిక విధానాల గాలులు గేట్‌వే ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించక ముందు విద్యారంగంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పట్నించి ఇంకో లెక్కని అన్ని రంగాల్లోనూ ప్రైవేట్ వీరులు తొడలుగొట్టారు. విద్యారంగం లోనూ కొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఆ సమయంలో చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం ఉన్నారు. ప్రైవేటీకరణపై ఆయనకున్న పిచ్చి వ్యామోహానికి మెచ్చి, ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే బిరుదును కూడా ప్రదానం చేశారు. ఆయన దన్నుతో విద్యారంగం మార్పులు కూడా శరవేగంగా వినాశ కరంగా పరుగులు తీశాయి. ఈ మార్పులకు ముందు విద్యారంగంలో ప్రభుత్వానిదే పెద్దవాటా. క్రమక్రమంగా చదువుకునేవారి సంఖ్య పెరుగు తుండడంతో సర్కార్ విద్యాసంస్థల సంఖ్య సరిపోక ప్రైవేట్ ఎయిడెడ్ సంస్థలను కూడా ప్రోత్సహించేవారు. అయితే ఈ సంస్థలేవీ కూడా విద్యార్థులపై పెద్దగా ఆర్థిక భారాన్ని మోపేవి కావు. చదువుతోపాటు ఆటపాటలు, అందుకు తగిన వసతులు, క్రీడా మైదానాలు, సాంస్కృతికోత్సవాలు విద్యార్థులకు అందు బాటులో ఉండేవి. సరస్వతీ విద్యామందిర్లు, క్రిస్టియన్ మిష నరీ స్కూళ్లు విద్యార్థుల చదువుపై ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఇటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించేవి. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి ప్రభుత్వ సంస్థలకు దీటుగా ప్రైవేట్ సంస్థలు కూడా దోహదపడేవి. డెబ్బయ్యో దశకంలో సీవిఎన్ ధన్ అనే ఆయన గుంటూరులో ఒక కొత్త ట్రెండ్‌కు ఆద్యుడయ్యారు. ఇంటర్మీ డియట్ చదువును మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల సాధనంగా ఆయన మార్చివేశారు. ఫీజు కొంచెం ఎక్కువ. అందుకని బాగా డబ్బున్నవాళ్లు, రాజకీయ నాయకుల పిల్లలు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్లి చదువు కోవడం ప్రారంభమైంది. క్రమంగా ఈ తరహా కాలేజీలు కొన్ని విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మొలకెత్తాయి. అయితే మొత్తంగా విద్యావ్యవస్థను తలకిందులు చేసేంత ప్రభావాన్ని మాత్రం అవి చూపెట్టలేదు. నారాయణ, శ్రీచైతన్య కాలేజీల కార్పొరేట్ శకారంభంతో విద్యారంగం రూపురేఖలు మారి పోయాయి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన అండదండలతో ఈ విద్యాసంస్థలు చెలరేగిపోయాయి. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడం కార్పొరేట్ సంస్థలకు వరంగా మారింది. విద్యారంగాన్ని ఈ శక్తులు క్యాన్సర్ వ్రణంలా ఆక్రమించుకున్నాయి. ఫలితం వ్యవస్థ విధ్వంసం. కార్పొరేట్ విద్యావ్యవస్థ దుష్ఫలితాలు సమాజంలోని అనేక రంగాల్లో మనం చూడవచ్చు. ఇందులో ఒక ఏడు అంశాలైతే స్పష్టంగా మన అనుభవంలోకి వచ్చాయి. 1. సామాజిక విభజన – రెండు గ్లాసుల పద్ధతి వంటి రెండు క్లాసుల విధానం. 2. భవిష్యత్ తరాల సర్వతోముఖ వికాసానికి స్వస్తి. 3. భాషా, సామాజిక శాస్త్రాలపై అలక్ష్యం. 4. విద్యార్థుల్లో ఒత్తిడి, పలాయనవాదం, ఆత్మహత్యల ధోరణి. 5. ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యం. 6. నాలెడ్జి సొసైటీ దివాళా. 7. భవిష్యత్ ఉత్తమశ్రేణి రాజకీయ నాయకత్వానికి సమాధి. రెండు గ్లాసుల పద్ధతి మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. గ్రామాల్లో హోటళ్లకు, టీ దుకాణాలకు వచ్చే దళితుల కోసం ఒక గ్లాసు, ఇతరుల కోసం మరో గ్లాసు కేటాయించే సాంఘిక దురాచారం అక్కడక్కడా కనిపించేది. అనేక పోరాటాల తర్వాత అది అంతరించింది. అది మాయమైందో లేదో మరో అనాచారానికి కార్పొరేట్ విద్యాసంస్థలు అంటుకట్టాయి. అదే రెండు క్లాసుల వ్యవస్థ. ఒక మెరుగైన సమాజ నిర్మాణానికి కామన్ స్కూలింగ్ను తొలి మెట్టుగా అన్ని నాగరిక దేశాలు భావిస్తున్నాయి. మనదేశంలో మాత్రం కార్పొరేటు విద్యా సంస్థలు రెండు క్లాసుల బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టాయి. ఇది రెండు దశల్లో అమలవుతుంది. కార్పొరేట్ బడుల్లో చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని సగటు తల్లిదండ్రులు భావించేలా ఊదరగొట్టిన కారణంగా దిగువ మధ్యతరగతి వారు సైతం తల తాకట్టుపెట్టయినా అక్కడికే పంపించడానికి అలవాటుపడ్డారు. అప్పటికే ప్రభుత్వం వారు పాడుపెట్టిన కాలేజీలు, స్కూళ్లలో నిరుపేదల పిల్లలు మాత్రమే మిగిలిపోయారు. ఇదొక విభజన. ఇక రెండో విభజన – కార్పొరేట్ సంస్థల్లోనే రెండు క్లాసులు. మంచి ర్యాంకులు రాబట్టవచ్చని ఎంపిక చేసుకున్న ఓ పిడికెడు మందిని ఒక ప్రత్యేక క్లాసులో వేస్తారు. కొంచెం మ్యాథ్స్నూ, కొంచెం సైన్స్‌నూ రోజూ గ్రైండర్లో వేసి బాగా రుబ్బిన తర్వాత స్పెషల్ క్లాస్ పిల్లల మెదళ్లలోకి గరాటా పెట్టి పోస్తారు. ఇక మిగిలిన సబ్జెక్టుల కోసం పేపర్ లీకేజీ విధానం. ఇందుకు చేయవలసిన ఏర్పాట్ల కోసం నారాయణ వంటి అధిపతుల ఆధ్వర్యంలోనే ప్రత్యేక సమావేశాలు జరుగుతాయట. ఇతర క్లాసుల్లో ఉండే 90 శాతం మంది విద్యార్థులకు గరాటా, లీకేజీ సౌకర్యాలు ఉండవు. చదువు చెప్పడం కూడా అంతంత మాత్రమే! వీరి కోసం వందల సంఖ్యలో ఉన్న డబ్బా ఇంజనీరింగ్ కాలేజీలు ఎదురు చూస్తుం టాయి. విద్యార్థి దశ నుంచే యువతరం ఆలోచనల్లో సామాజిక విభజనకు బీజం వేసి ఈ కార్పొరేట్ కాలేజీలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు యథేచ్ఛగా పాల్పడు తున్నాయి. ఇక ఈ సంస్థల్లో మనిషి సర్వతోముఖ వికాసానికి ఎటు వంటి అవకాశమూ ఉండదు. ఆటలు పాటలంటే అవేవో బూతుల్లా వినిపిస్తాయిక్కడ! ఈ తరంలోనే పుట్టి పెరిగి, అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ఒక సానియా మీర్జా (సెయింట్ మేరీస్)ను గానీ, ఒక పీవీ సింధు (సెయింట్ ఆన్స్)ను గానీ, ఒక మిథాలీరాజ్ (కీస్ హైస్కూల్)ను గానీ ఈ కార్పొరేట్ సంస్థలు సృష్టించలేకపోయాయి. ఒక సంగీత విద్వాంసుడిని, ఒక చిత్ర కారుడిని, ఒక కవిని, కళాకారుడిని ఈ సంస్థల నుంచి మనం ఊహించలేము. రోజూ క్రమం తప్పకుండా మ్యాథ్స్, సైన్స్ అనే విటమిన్ ఇంజక్షన్లు పొడిపించుకొని బరువు పెరగడమే ధ్యేయంగా బతికే బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తే ఈ సంస్థల లక్ష్యం. ఆ రకంగా యువతరాల సృజనశీలత మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ సంస్థలు దేశద్రోహానికి పాల్పడుతున్నాయి. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషలు, సోషల్ స్టడీస్ – ఇక్కడ నిషేధిత జాబితాలో ఉంటాయి. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హిస్టరీ సబ్జెక్టే అనవసరమని బహిరంగంగా ప్రకటించారు. ఈ సూక్తిని కార్పొరేట్ విద్యా సంస్థలు శిరోధార్యంగా స్వీకరించాయి. అప్పటి నుంచి ఈ సబ్జెక్టుల్లో నూటికి 99 మార్కులు తెప్పించడం కోసం పేపర్ లీకేజీ మార్గాన్ని ఈ సంస్థలు ఎంచుకున్నాయి. దేశ చరిత్రను, సంస్కృతిని, భాషలను మరుగుపరిచే ప్రయత్నం చేయడం జాతీయ పతాకాన్ని అవమానించడంతో సమానం. ఈ సంస్థల్లో చదివే విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని అనేక అధ్యయనాలు, సర్వేలు ఘంటా పథంగా చాటి చెప్పాయి. వీటి నిర్వహణ తీరుతెన్నులు మారాలని నివేదికలు ఇచ్చాయి. ఈ కాలేజీల ధనప్రభావం వల్ల అవన్నీ అటకెక్కాయి. ఆసక్తులన్నింటిని బలవంతంగా అణిచి వేసుకొని, ర్యాంకుల ఒత్తిడిలో నలిగి, విద్యార్థులు జీవితంపై విరక్తి ఏర్పరచుకుంటున్నారు. ఎదిరించి పోరాడలేని అశక్తతను ఈ విద్యాసంస్థల కోళ్ల ఫారం సంస్కృతి నరాల్లోకి ఎక్కిస్తుంది. ఫలితంగా ఆత్మహత్యల బాట పడుతున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క నారాయణ సంస్థల్లోనే 400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. సామూహిక హత్యలకు ఏ సెక్షన్ల కింద కేసులు పెడతారో, ఆత్మహత్యలకు పురికొల్పడంపై ఏ కేసులు పెడతారో అవన్నీ ఈ సంస్థల మీద పెట్టనవసరం లేదా? ఆర్థిక సంస్కరణల తొలిదశలో అధికారంలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విద్యాసంస్థలను అలక్ష్యం చేసి కార్పొరేట్ సంస్థల వృద్ధికి సహకరించారు. ఫలితంగా వెనుక బడిన పేదవర్గాల ప్రజలు గడిచిన 30 ఏళ్లుగా మెరుగైన విద్యను పొందలేకపోయారు. వెనుకబడిన జాబితాలో మరో రెండు తరాలు కూడా కలిసిపోయాయి. ప్రభుత్వ విద్యాసంస్థలను పాడుపెట్టడమంటే – ఈ దేశ ప్రజల విద్యా హక్కును ఉల్లంఘించడం! మెరుగైన సమాజానికి బాటలు వేసే కామన్ స్కూలింగ్ను అడ్డుకోవడం! కలవారు, లేనివారు అనే రెండు రకాలుగా ఈ జాతిని విడదీయడం! ఇండియా – భారత్‌లుగా ఈ దేశాన్ని విభజించడం! ఈ దారుణమైన దురాగతాలకు శిక్ష ఎవరికి వేయాలో సమాజం ఆలోచించాలి. కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్లలో ఇంతవరకూ ఒక గొప్ప శాస్త్రవేత్త పుట్టలేదు. దేశం గర్వించదగ్గ మేధావి పుట్టలేదు. ఒక అబ్దుల్ కలామ్‌ను ఆశించలేము. ఒక సీవీ రామన్‌ను కలగనలేము. ఈ కార్పొరేట్ కాలేజీల తరంలోనే చదువుకొని ప్రపంచస్థాయికి ఎదిగిన సత్య నాదెళ్ల గానీ, సుందర్ పిచాయ్ గానీ ఈ సంస్థల్లో చదవలేదు. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, మణిపాల్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. సుందర్ పిచాయ్ గవర్నమెంట్ స్కూళ్లలో, ఐఐటీలో చదువుకున్నాడు. కార్పొరేట్ బట్టీయం పద్ధతిలో ప్రతిభ వికసించదు. పువ్వు సహజంగా విచ్చుకునే విధానం ఉండదిక్కడ. మొగ్గ రేకుల్ని బలవంతంగా విప్పి పువ్వుగా చూపించే అనాగరిక పద్ధతి. ఇక్కడ మేధస్సు జనించదూ, జ్వలించదూ. ముప్ఫయ్యేళ్లుగా భారతీయ నాలెడ్జి సొసైటీకి తీరని ద్రోహం చేస్తున్న ఈ విద్యాసంస్థలు దేశద్రోహ నేరానికి ఒడిగట్టాయి. దేశానికి ఆదర్శప్రాయమైన రాజకీయ నాయకత్వం రాకుండా ఈ విద్యా వ్యవస్థ అడ్డుపడుతున్నది. విలువలతో, ఆదర్శాలతో ఉత్తేజితులైన విద్యార్థులు పూర్వం రోజుల్లో ప్రజా జీవితాలతో మమేకమయ్యేవారు. అటువంటి ఆదర్శాలతోనే నాయకులుగా ఎదిగిన కొందరు రాజకీయాల్లోనూ రాణించారు. వారిలో ఎక్కువమంది రాజకీయ విలువలను కూడా కాపాడారు. గడిచిన ముప్పయ్యేళ్లుగా మెజారిటీ విద్యార్థులు ఇంజనీరింగ్ చట్రంలో, కార్పొరేట్ విద్యా ప్రపంచంలో ఇరుక్కునిపోయారు. వీరికి చరిత్రతో పనిలేదు. సామాజిక శాస్త్రాల అధ్యయనం లేదు. ప్రజలంటే పట్టింపు లేదు. టార్గెట్ – క్యాంపస్ రిక్రూట్మెంట్. మంచి జీతం ప్యాకేజీ. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఫలితంగా బాగా బలిసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల కొడుకులు యువనేతలుగా రంగప్రవేశం చేస్తున్నారు. వాడికి ఎటువంటి విలువలు లేకున్నా సరే యువనేతగా బలవంతంగా దూరిపోతున్నాడు. ఇది ఈ దేశ రాజకీయ భవిష్యత్తు మీద కుట్ర. అడ్డగోలు సంపాదనతో రాజకీయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్న కార్పొరేట్ విద్యా వ్యాపారస్థులను కంట్రోల్ చేయగలమన్న విశ్వాసం సన్నగిల్లే స్థితి ఏర్పడింది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ లాబీదే పెత్తన మంతా! నారాయణ మునిసిపల్ మంత్రిగా ఉంటూ రెవిన్యూ అధికారాలను కూడా చలాయించేవాడు. ఆయన వియ్యంకుడు విద్యాశాఖ మంత్రి. మూడు జిల్లాల టీడీపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చంతా ఆయనదే! అటువంటప్పుడు ఆ ప్రభుత్వం ఈ లాబీ ఆగడాలను అదుపు చేయగలదని ఎట్లా భావించగలం? నోట్ల కట్టలతో రాజకీయ నాయకత్వాన్ని, అడ్వర్టయిజ్మెంట్ ఎరలతో మీడియాను నోరు మూయిస్తూ బతికేస్తున్న ఈ లాబీకి ఇప్పుడు సరైన దెబ్బ పడింది. నారాయణ సంస్థల పేపర్ లీకేజీని సాక్ష్యాలతో సహా పట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి అభినందనలు. సాంకేతిక కారణాల వల్ల బెయిల్ దొరకవచ్చు. రివిజన్ పిటీషన్ వేశారు. ఏం జరుగుతుందో చూద్దాం. ప్రజాకోర్టులో ఇప్పటికే విచారణ మొదలైంది. కూలడం మొదలైన తర్వాత ఇంకెంతో కాలం ఆ కోట నిలబడదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
విద్యావ్యవస్థలో తక్షణ మార్పులు అవసరం
‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’పై ఏర్పాటైన కమిటీ అభిప్రాయం న్యూఢిల్లీ: నిర్లక్ష్య లేదా అవినీతితో కూడిన నియంత్రణ వ్యవస్థలు నాణ్యత లేని ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తికి కారణమవుతున్నాయని కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ)పై ఏర్పాటైన నిపుణుల బృందం అభిప్రాయపడింది. ప్రస్తుత విధానంలో లోపాలతో పాటు ‘న్యూ ఎడ్యుకేషన్ పాలసీ’ తయారీ కోసం మానవ వనరుల అభివృద్ధి శాఖకు కమిటీ కొన్ని సూచనలు చేసింది. విద్యపై ఏ మాత్రం ఆసక్తిలే కుండా, కేవలం డబ్బుతో ప్రభావితం చేసే వ్యక్తుల వల్ల అనేక ప్రైవేట్ వర్సిటీలు, కాలేజీలు వర్ధిల్లుతున్నాయని, అవినీతిలో కూరుకున్న నియంత్రణ వ్యవస్థల్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారని కమిటీ అభిప్రాయపడింది. ఇలాంటి అస్తవ్యస్త ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాప్తిని అడ్డుకునేం దుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో పారదర్శకత లేని ఆర్థిక నిర్వహణను ప్రస్తుత వ్యవస్థ ప్రోత్సహిస్తోం దని, ఇది పరోక్షంగా నల్లధనాన్ని వినియోగానికి కారణమవుతోందని వెల్లడించింది. తాత్కాలిక, గెస్ట్ టీచర్లపై ఎక్కువగా ఆధారపడడం నాణ్యమైన విద్య వ్యవస్థకు వ్యతిరేకమని కమిటీ తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో సిబ్బంది నియామకాలపై కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఐదు సంవత్సరాలకోసారి సమీక్ష జరగాలని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ద్వారా అధ్యాపకుల నియామకాల వల్ల కూడా భర్తీ ఆలస్యమవుతోందని వెల్లడిం చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని అన్ని ఉన్నత విద్యాసంస్థలకు గుర్తింపు తప్పనిసరి చేయాలంది. సాంకేతిక, వైద్య, వ్యవసాయ విద్యాసంస్థలకూ యూజీసీ గుర్తింపు తప్పనిసరని పేర్కొంది.ఈ కమిటీ నివేదికను కేంద్ర మానవ వనరులశాఖ అధికారులు పరిశీ లించి ఎన్ఈపీ తయారీలో పరిగణనలోకి తీసుకుంటారు. -
విద్యా సంస్థలపై దాడులా?: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థలపై పోలీసుల దాడులు నిలిపివేయాలని సీపీఐ నేత కె.నారాయణ విజ్ఞప్తి చేశారు. బోగస్ కాలేజీలు, స్కాలర్షిప్లు, అటెం డెన్స్ పేరుతో విద్యాసంస్థల్లో భయానక వాతావరణం కల్పిస్తున్నారని మంగళవా రం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. విద్యా సంస్థల తనిఖీలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించి విద్యాసంస్థల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లోకి పోలీసులు ప్రవేశించడమేంటని ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులు, విద్యావ్యవస్థను ఒకేగాటన కట్టి కర్ర పెత్తనం చేయడం సమంజసం కాదని దుయ్యబట్టారు. -
‘లక్ష మంది’ లక్ష్యం నెరవేరేనా?
చిత్తూరు(ఎడ్యుకేషన్): ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెన వేసిందన్న చందంగా ఉంది సర్వశిక్ష అభియాన్ నూతనంగా తలపెట్టిన మళ్లీ మనబడికి కార్యక్రమం. సర్కారు పాఠశాలల్లో చేరేందుకు పిల్లలకు సవాలక్ష ఆటంకాలు, అనుమానాలు ఎదురవుతున్నాయి. వీటిని బూచిగా చూపించి ప్రైవేటు విద్యాసంస్థలు పిల్లలను ఆకర్షించి వేలాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న లక్షమంది విద్యార్థులను రాను న్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని కలెక్టర్ ఎస్ఎస్ఏ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. సర్కారు బడుల బలోపేతానికి కలెక్టర్ ఆలోచన ఆహ్వానించదగినదే అయినప్పటికీ దానికి తగిన సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 5,98,676మంది విద్యార్థులు చ దువుతున్నారు. 5,009 ప్రభుత్వ పాఠశాలల్లో 3,67,356మంది, 1,187 ప్రైవేటు పాఠశాలల్లో 2,31,320మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 0-10మంది లోపు విద్యార్థులు 180 పాఠశాలలు, 11-20 మధ్య విద్యార్థులు ఉన్న పాఠశాలలు 713 ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నా యి. 1,744 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోం ది. ప్రయివేటు పాఠశాలల్లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయని తెలిసినా విధిలేని పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను అందులోనే చేర్చాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలపై చర్యలేవీ? జిల్లాలో ప్రమాణాలను పాటిస్తున్న ప్రై వేటు పాఠశాలలను వేళ్లమీద లెక్కపెట్టొ చ్చు. ప్రమాణాలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ చేపట్టిన చర్యలు శూ న్యమనే చెప్పాలి. దీనికితోడు కొత్తగా ప్రైవేటు స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. కనీస విద్యార్హత లేనివారు కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. విద్యాశాఖకు సమర్పిం చే రికార్డుల్లో మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు చూపుతున్నారు. బలవంతపు టార్గెట్లు సంస్థాగతంగా అనేక లోపాలున్న సర్కా రు బడుల వైపు విద్యార్థులను క్యూకట్టించడం అధికారులకు కత్తిమీద సాము లాంటిదే. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకు బలవంతపు టార్గెట్లను నిర్ణయించి చేయమనడంపై అంతర్మథనం మొదలైంది. ఏదేమైనప్పటికీ ఈ బాధ్యతను విద్యా శాఖ ఏ మేరకు నెరవేరుస్తుందో తేలాలంటే జూన్ వరకు ఆగాల్సిందే. -
సర్వేకు సహకరించాలి
18న ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు పాఠశాలలు, కళాశాలల యూజమాన్యాలకు డీఈఓ సూచన బస్సులతో తహసీల్దార్లకు రిపోర్ట్ చేయాలి డీటీసీ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఖిలావరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ విజయ్‌కుమార్ కోరారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం విద్యాశాఖ, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎంవీఐలకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమకు సంబంధించిన బస్సులను సమగ్ర సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు కేటారుంచి... వారిని మండల కేంద్రం నుంచి ఆయా గ్రామాలకు తరలించాలని సూచించారు. కలెక్టర్ జి,కిషన్ ఆదేశాల మేరకు సమగ్ర సర్వేలో భాగస్వామ్యులయ్యేందుకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నెల 18న సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు వేల స్కూల్ బస్సులు, ఇతర వాహనాలకు సమాచారం అందించామన్నారు. జిల్లాలోని వడుప్సా, టీచర్స్, విద్యా సంస్థల ఆసోసియేషన్స్ బాధ్యులు స్వచ్ఛందంగా పాల్గొంటామని చెప్పారన్నారు. 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వహిస్తున్న సమగ్ర సమాజిక కుటుంబ సర్వేలో జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సెలవు దినంగా పాటించాలన్నారు. బస్సులను సమగ్ర సర్వేకు ఉపయోగించేకునేందుకు సహకరించాలని కోరారు. విద్యా సంస్థ యాజమాన్యాలు డ్రైవర్స్, క్లీనర్ల వివరాలతో బస్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో 18వ తేదీన 2 గంటలకు బస్సుల వివరాలతో రిపోర్ట్ చేయాలన్నారు. కుటుంబంతో లేకుంటే ప్రభుత్వ పథకాలకు దూరమైతామనే భయం డ్రైవర్లు, క్లీనర్లకు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు బస్సుల వెంట పింపించే డ్రైవర్లు, క్లీనర్లకు సర్వేలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఇవ్వాలని విద్యాసంస్థల యూజమాన్యాలకు సూచించారు. జిల్లాలో విద్యా సంస్థల బస్సులు, ఇతర వాహనాల పర్యవే క్షకులుగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఆయన వెల్లడించారు. వీరు బస్సులను అందుబాటులో ఉంచడంతోపాటు ఎప్పటికప్పుడు సర్వే సిబ్బందికి వివరాలు అందజేస్తారని డీటీసీ చెప్పారు. సమావేశంలో ఎంవీఐలు సత్యనారాయణ, నాగలక్ష్మి, ఎస్కే.మాసూద్ అలీ, వై.కొండల్రావు, ఈజే.జయకుమార్, జి.వేణుగోపాల్, శివస్వప్న, ఎల్.రాంచందర్, ఫహీమ సుల్తాన పాల్గొన్నారు. -
సీఎం సభా.. మజాకా!
* డ్వాక్రా మహిళల్ని తరలించేందుకు స్కూల్ బస్సుల వినియోగం * ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు * అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో నిర్వహించిన సభలను విజయవంతం చేసేందుకు అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారు. మండు వేసవిలో ప్రైవేటు స్కూళ్లలో తరగతులు నిర్వహించడంతో పిల్లలు అవస్థలు పడుతూనే హాజరుకావాల్సి వచ్చింది. అప్పట్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినా పట్టించుకోని విద్యాశాఖ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు స్కూళ్లకు బుధ, గురువారాల్లో సెలవులు ఇచ్చేసింది. ఇదేదో విద్యార్థులపై మమకారంతో చేసిన పని కాదు. ముఖ్యమంత్రి నిర్వహించిన సభలకు రైతులను, డ్వాక్రా మహిళలను తరలించేందుకు బలవంతంగా స్కూల్, కాలేజీ బస్సులను విద్యాశాఖ తీసుకెళ్లిపోయింది. దీంతో రెండు రోజులపాటు ప్రైవేటు స్కూళ్లు, కళాశాలలు దాదాపుగా మూతపడ్డారుు. దీనివల్ల పిల్లలు రెండు రోజులపాటు పాఠాలకు దూరమయ్యూరంటూ స్కూల్ యూజమాన్యాలు ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. డ్వాక్రా సదస్సుకు భారీగా వాహనాలు కొయ్యలగూడెంలో గురువారం నిర్వహించిన డ్వాక్రా మహిళల సదస్సుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 20వేల మంది డ్వాక్రా మహిళలను తరలించారు. ఇందుకోసం జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన 700 బస్సులు, వ్యాన్లను వినియోగించారు. విద్యాసంస్థల వాహనాలను సీఎం పర్యటన కోసం పంపించి తీరాలని డీఈవో ఆర్.నరసింహరావు హుకుం జారీ చేయడంతో విద్యాసంస్థల యూజమాన్యాలు కాదనలేకపోయూరు. అప్పటికప్పుడు స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించి ఉదయం 7 గంటలకల్లా ఆ వాహనాలను సమీపంలోని పట్టణాలు, మండల కేంద్రాలకు పంపించారు. ప్రతి మండలం నుంచి 500 నుంచి వెయి మంది డ్వాక్రా మహిళలు ఆ బస్సుల్లో తరలి వెళ్లారు. ఇలా వెళ్లిన వాహనాల్లో వేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. ఏదైనా ప్రమాదం జరిగిఉంటే అందుకు బాధ్యలెవరనే విమర్శలు చెలరేగారుు. ఆర్టీసీ బస్సులను తీసుకుని ఉంటే సదస్సుకు వెళ్లిన డ్వాక్రా మహిళలకు భద్రత ఉండేదని, ఆర్టీసీకి ఆదాయం కూడా లభించేదని పలువురు వ్యాఖ్యానించారు. -
విద్యాసంస్థల బంద్ సక్సెస్
ఖమ్మం వైరారోడ్: ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యం లో మంగళవారం చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం అయింది. నగరంలో వివిధ ప్రైవేట్ పాఠశాలలను మూసి వేయించిన ఆ యూనియన్ నాయకులు పెవి లియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు వేలకువేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఉపేందర్, ఎల్. బాలరాజు ఆరోపించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రైవేట్ విద్యాసంస్థలలో చదువు అందని ద్రాక్షలా మారిందన్నారు. జీవో నంబర్ 42ప్రకారం ఫీజుల వివరాలను విద్యాసంస్థల నోటీసుబోర్డులో పెట్టాలనే నిబంధన ఉన్నా దాన్ని ఎవ రూ పట్టించుకోవడం లేదన్నారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నందువల్లనే ఇలా చేయడం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉన్నా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల యా జమాన్యం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. మౌలికవసతుల కల్పన విషయాన్ని మాత్రం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో విస్మరిస్తున్నారన్నారు. ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల పేరుతో అనుమతి తీసుకొని..విచ్చలవిడిగా క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సులను నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాల తో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ బంద్‌తోనైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు టి. నాగరాజు, ఖమ్మం, వైరా డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.కిరణ్, సిహెచ్.రమేష్, ప్రశాంత్, అశోక్, బాలికల కన్వీనర్ ఎస్.రజని, రమ్య, భవాని పాల్గొన్నారు. -
బడి బస్సులు భద్రమేనా.!
ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కొన్ని విద్యాసంస్థలు కాలం చెల్లిన బస్సులను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సైతం చాలా బస్సుల్లో కానరావడంలేదు. వాహన ఫిట్నెస్ సరిగా లేకనో, డ్రైవర్, సిబ్బంది నిర్లక్ష్యంతోనో తరచూ స్కూల్ బస్సులు ప్రమాదాలకుగురవుతున్నా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలేదు. రవాణా శాఖ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు జరిపి అయ్యిందనిపిస్తున్నా రనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీఏ మార్గదర్శకాలకు అనుగుణంగా స్కూల్ బస్సులను నడిపించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమవు తున్న నేపథ్యంలో పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. పాఠశాలల యాజమాన్యాలు కూడా మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో చాలా వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల నియామకంలో తగిన శ్రద్ధ చూపడంలేదు. కండీషన్ కలిగిన బస్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను కొన్ని యాజమాన్యాలు విస్మరిస్తున్నాయి. పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం వరకే శ్రద్ధ చూపిస్తున్న తల్లితండ్రులు బస్సుల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడం యాజమాన్యాలకు కలిసి వస్తుంది. వివరాలు పొందుపరచాల్సిందే పాఠశాల బస్సుపై తప్పనిసరిగా తగిన వివరాలు పొందుపర్చాలి. బస్సును ఫలానా పాఠశాల అవసరాలకు ఉపయోగిస్తున్నట్టు బస్సు ముందు భాగంపై 400 ఎంఎం పొడవు, 400 ఎంఎం వెడల్పు పరిమాణంలో స్పష్టంగా కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలి. ఆ బోర్డుపై 250 ఎంఎంకు తగ్గని ఎత్తులో బాలిక, బాలుడి చిత్రాలు నల్ల రంగులో చిత్రీకరించాలి. ఆ చిత్రాల కింద స్కూల్, కళాశాల బస్సు అని కనీసం 100 ఎంఎం సైజు అక్షరాల్లో రాయించాలి. పాఠశాల బస్సుకు నాలుగు వైపులా పైభాగం మూలల్లో బయట వైపు పసుపు పచ్చని రంగుతో ఫ్లాషింగ్ లైట్లు బిగించాలి. విద్యార్థులు బస్సులో నుంచి కిందికి దిగేటప్పుడు, బస్సు ఎక్కేటప్పుడు ఆ లైట్లను తప్పనిసరిగా వెలిగించాలి. బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో అనివార్యంగా ఒక అగ్నిమాపక యంత్రాన్ని, పొడిని రోజువారీగా అందుబాటులో ఉంచుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరి విద్యాసంస్థల బస్సుల్లో చాలా వరకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు కనిపించడంలేదు. అత్యవసర మందులు, పరికరాలు బస్సుల్లో అందుబాటులో ఉండటంలేదు. ప్రథమ చికిత్స పెట్టె (ఫస్ట్ ఎయిడ్ బాక్స్)ను బస్సులో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. ప్రతి పాఠశాల యాజమాన్యం రవాణా, పోలీస్, విద్యా శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏడాదిలో కొన్ని సార్లు రహదారి భద్రతపై తరగతులు నిర్వహించాలి. ప్రమాదాలు జరిగే తీరు, నివారణ, ప్రథమ చికిత్స వంటి అంశాలపై అవగాహన కల్పించాలి. రెండు వైపులా అద్దాలు : విద్యార్థులను తీసుకెళ్లే పాఠశాల బస్సులు తగిన సదుపాయాలతో ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు విద్యార్థులు డ్రైవర్‌కు కనిపించేలా బస్సుకు రెండు వైపులా అద్దాలు అమర్చాలి. బస్సు అంతర్భాగంలోనూ భారీ సైజు అద్దాన్ని ఏర్పాటు చేయాలి. తద్వారా విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా నివారించడానికి వీలుంటుంది. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఉంటుంది. పటిష్టంగా ఫుట్‌బోర్డు : బస్సు ఫుట్‌బోర్డు మొదటి మెట్టు భూమి నుంచి 325 ఎంఎం ఎత్తుకు మించకుండా చూసుకోవాలి. ఫుట్బోర్డును లోహంతో పటిష్టంగా తయారు చేయించాలి. విద్యార్థులను తీసుకెళ్లే బస్సుకు రవాణా కమిషనర్ జారీ చేసిన విద్యాసంస్థ బస్సు పర్మిట్, ఆ బస్సు జీవిత కాలం తేదీ తప్పనిసరిగా పొందుపర్చాలి. విద్యాసంస్థకు చెందిన బస్సు డ్రైవర్ ఏడాదిలో ఒకేసారి జేటీసీ/డీటీసీ/ఆర్టీవో ద్వారా నిర్వహించే ప్రత్యేక శిక్షణకు హాజరవ్వాలి. బస్సు సైడ్ విండోలకు అడ్డంగా మూడు లోహపు కడ్డీలు ఏర్పాటు చేసి విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. ఎమర్జెన్సీ ద్వారం ఏర్పాటు చేయాలి. దానిపై అత్యవసర ద్వారమని ప్రత్యేకంగా కనిపించేలా రాయించాలి. విద్యార్థుల బ్యాగ్‌లను బస్సులో భద్రపరుచుకోవడానికి సీట్ల కింద అరలు ఏర్పాటు చేయాలి. ఇవి తప్పక పాటించాలి స్కూల్ బస్సు ముందు భాగంలో ఎడమవైపున పాఠశాల పేరు, ఫోన్ నంబర్, ఇతర పూర్తి వివరాలు పెద్ద అక్షరాలతో స్పష్టంగా కనిపించేలా పెయింటింగ్‌తో రాయించాలి. పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తి వయసు 60 ఏళ్లకు మించరాదు. డ్రైవర్‌కు రక్తపోటు, మధుమేహం, కంటి చూపు వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను ప్రతి మూడు నెలలకోసారి సదరు పాఠశాల యాజమాన్యం చేయించాలి. ఆ రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి. డ్రైవర్ మత్తుపానీయాలు సేవించి డ్రైవింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. బస్సు డ్రైవర్ ను నియమించే ముందు అతడి డ్రైవింగ్ లెసైన్స్ సరైనదో.. లేదో నిర్ధారించుకోవాలి. బస్సు బాహ్య పరికరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేవో నెలకోసారి వాటి పనితీరును యాజమాన్యం, డ్రైవర్, విద్యార్థుల తల్లితండ్రులు తెలుసుకోవాలి. విండ్ స్క్రీన్, వైఫర్స్, లైటింగ్, హారన్ తదితర భాగాల పరిస్థితిని పరిశీలించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలి. పిల్లలు పట్టుకునేందుకు వీలుగా బస్సులో అక్కడక్కడ లోహపు స్తంభాలు అమర్చాలి. బస్సులలో ఫిర్యాదుల పుస్తకాన్ని ఏర్పాటు చేయాలి. ఏమైనా ఫిర్యాదులు వస్తే పాఠశాల ప్రిన్సిపాల్ పరిశీలించి పరిష్కరించేందుకు పాటుపడాలి. బస్సుల పార్కింగ్ కోసం పాఠశాల, కళాశాల ఆవరణలో తగిన స్థలం కేటాయించాలి. విద్యార్థుల పేర్లు, తరగతి, ఇంటి చిరునామా, తల్లితండ్రుల ఫోన్ నంబర్లు, విద్యార్థి దిగాల్సిన స్థలం వంటి వివరాలు నమోదుచేసుకోవాలి. విద్యార్థుల పేరుకు ఎదుట ఆయా వివరాలు సూచిస్తూ రూట్‌ప్లాన్ బస్సులో ఏర్పాటు చేసుకోవాలి. -
పలు కార్యాలయాలపై లేబర్ కమిషనర్ దాడులు
నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో సెలవు రోజున తెరచి ఉంచిన కార్యాలయాలపై డిప్యూటీ లేబర్ కమిషనర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా తలుపు మూసి సిబ్బందితో పని చేయిస్తున్న కార్వీ కన్సల్టేన్సీతోపాటు నారాయణ టెక్నో స్కూల్‌పై కేసు నమోదు చేసి.... సిబ్బందిని బయటకు పంపారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బుధవారం సెలవు ప్రకటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఉన్నతాధికారుల ఆదేశాలను కొన్ని సంస్థలు పెడచెవిన పెట్టి... కార్యాలయాలు యాథావిధిగా పని చేస్తున్నాయి. దాంతో కార్యాలయాలపు పని చేస్తున్నట్లు సమాచారం రావడంతో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. -
కదంతొక్కిన విద్యార్థులు
తణుకు అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోరుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు కదం తొక్కారు. విభజనతో ఇరు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. అసెంబ్లీ నుంచి తెలంగాణ బిల్లును తిప్పి పం పాలంటూ నినాదాలు చేశారు. తణుకులో 60 బస్సుల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నరేంద్ర సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ప్రైవేటు విద్యాసంస్థల నాయకులు బసవ రామకృష్ణ, అనపర్తి ప్రకాశరావు మాట్లాడుతూ విభజనతో విద్య, వైద్య, వ్యవసాయరంగాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వెంటనే బిల్లును వెనక్కి పంపించాలని కోరారు. కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులు మేకా నరేంద్రకృష్ణ, ఎన్.రాజేంద్రప్రసాద్, అనపర్తి ఉమ, జి.సత్యనారాయణ, ఎం.సుబ్బారావు, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భీమవరంలో... భీమవరం : ఇంజినీరింగ్ కళాశాలల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రకాశంచౌక్ వద్ద మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. అసెంబ్లీలో ఓటింగ్ పెట్టి ఎమ్మెల్యేలంతా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి సమైక్యవాదాన్ని చాటిచెప్పాలని విద్యార్థులు కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్రం కలిసి ఉంటే విద్యార్థి, యువకులకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందువలన యువత ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగించి సమైక్యాంధ్ర సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్థల జేఏసీ నేతలు ఉద్దరాజు వేణుగోపాలరాజు, సీతా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బీవీ సుబ్బారావు, సమైక్యాంధ్ర జేఏసీ నేతలు ఎన్వీఆర్ దాసు, గంటా సుందరకుమార్, వడ్డి సుబ్బారావు, కోళ్ళ నాగేశ్వరరావు, నల్లం గంగాధరరావు, సయ్యద్ నసీమా బేగం, బోడపాటి పెదబాబు, జంపన ఫణిబాబు, వేగి రాము, టీవీవీ ప్రసాద్, ఇందుకూరి శివాజీ వర్మ, కమ్మంపాటి బాబ్జీ పాల్గొన్నారు. నేడు ఎమ్మెల్యే, ఎంపీల ఇళ్ల వద్ద ధర్నా తెలంగాణ బిల్లును వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ గురువారం భీమవరం, ఉండి ఎమ్మెల్యేల ఇళ్లతోపాటు ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంటి వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యవాదులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. -
నేడు జిల్లా బంద్
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన బిల్లుకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో చేపట్టే బంద్‌ను విజయవంతం చేయాలని అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో డివిజన్ కన్వీనర్లతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాలతో పాటు, అన్ని మండల కేంద్రాల్లో బంద్ చేపట్టాలన్నారు. మొదటి నుంచి సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించాలన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా కార్యోన్ముఖులవ్వాలన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్, టీడీపీలు బోగస్ ఓటర్లను సృష్టించడమే కాక, అర్హులైన ఓటర్లను తొలగించేలా ఫిర్యాదులు చేస్తున్నాయని వాటిపై నిఘా ఉంచాలన్నారు. డివిజన్ కమిటీలను పూర్తి చేయాలన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం అందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నిత్యం ప్రజాసమస్యలపై ఉద్యమించాలని కన్వీనర్లకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ అనుంబంధ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఉపాధ్యక్షురాలు ప్రమీలమ్మ, మైనార్టీ విభాగ ం రాష్ట్ర కార్యదర్శి షెక్షావలి, యువజన విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి పరుశురాం, నగరాధ్యక్షుడు మారుతీప్రకాష్, యువజన విభాగం నగరాధ్యక్షుడు మారుతీనాయుడు, నాయకులు గోవింద్‌రెడ్డి, మహానందరెడ్డి, విజయశాంతి, లక్ష్మీశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తిరునగరిలో సమైక్య భేరి
తిరుపతి నగరం శుక్రవారం సమైక్య నినాదాలతో హోరెత్తింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష గళ సమైక్య భేరి మోగింది. జై సమైక్యాంధ్ర నినాదంఢిల్లీని తాకేలా ఉద్యమకారులు గర్జించారు. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. సాక్షి, తిరుపతి: సమైక్యగళంతో తిరునగరి అట్టుడికింది. ఉద్యమ వేడి ఢిల్లీని తాకేలా కుల, మత భేదం లేకుండా లక్షగళ ఘోషతో సమైక్య నినాదాన్ని వినిపించారు. వేర్పాటువాదాన్ని తరిమి కొడదాం అని పిలుపునిచ్చారు. ఐక్యకార్యాచరణ సమితి, సాప్స్ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో లక్షగళ సమైక్య భేరి మోగింది. సాప్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి హాజరయ్యారు. వివిధ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, యజమానులు తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు శాఖల అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కళాకారులు, వ్యాపారులు, కార్మికులు, కర్షకులు లక్ష గళ సమైక్యభేరికి హాజరయ్యారు. ఉదయం 9గంటల నుంచి సమైక్యవాదులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. విద్యార్థులు వివిధ వేషధారణలో వేదిక వద్దకు చేరుకుని ప్రదర్శనలు చేశారు. పుంగనూరు నుంచి వచ్చిన చిన్నారులు కోలాటాలు అడుతూ జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కార్వేటినగరం సంస్థానం సంప్రదాయాలతో కళాకారులు కత్తులు చేతబట్టి ప్రదర్శన చేశారు. మిన్నంటిన జై సమైక్యాంధ్ర నినాదాలు లక్షగళ సమైక్య భేరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు జై సమైక్యాంధ్ర నినాదాలతో గర్జించారు. జ్వోతి ప్రజ్వలన అనంతరం ఒక్కొక్కరు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేర్పాటు వాదులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమైక్య భేరికి కొందరు విద్యార్థులు భారీ జాతీయ జెండాతో హాజరయ్యారు. మరికొందరు సమైక్యాంధ్ర టోపీలు పెట్టుకుని తరలిరావడం కనిపించింది. రైల్యేస్టేషన్, గాంధీరోడ్డు, భవానీ నగర్, లీలామహల్, తుడా కూడలి సమైక్యవాదులతో కిక్కిరిసిపోయాయి. సమైక్య భేరికి హాజరైన వారికి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేశారు. రెండుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సమైక్య భేరికి కాంగ్రెస్ నేత అడ్డుచక్రం తిరుపతిలో శుక్రవారం చేపట్టిన లక్ష గళ సమైక్య భేరిని కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ నియోజకవర్గ నేత ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మహిళా గ్రూపు సభ్యులెవరూ సమైక్య భేరిలో పాల్గొనకూడదని హుకుం జారీచేసినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే మహిళా సభ్యులు ఉద్యమంలో పాల్గొనలేదనే ప్రచారం సాగింది. తన మాట వినకుండా పాల్గొంటే ఇంటి పట్టాలు, రుణాలు రాకుండా చేస్తానని బెదిరించినట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ నాయకుడ్ని తిరుపతికి రాకుండా అడ్డుకోవాలని సమైక్యవాదులకు పిలుపునివ్వడం గమనార్హం. ఈ కార్యక్రమంలో సాప్స్ జేఏసీ నాయకులు అశోక్‌రాజు, కేఎల్.వర్మ, శేషగిరిరావు, మహ్మద్ఫ్రీ, సింధూజ, దినకర్, ఆనంద నాయుడు, శ్రీనివాస చౌదరి, హరినాథ్‌శర్మ, రంజిత్‌కుమార్, కేవీ.రత్నం, వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మా గుండెలతో చలిమంట వేసుకుంటారా? తెలుగుజాతిని విభజన పేరుతో విడగొట్టి మండుతున్న మా గుండెలతో చలి మంటేసుకుంటారా?. చిన్నారులు, వయోవృద్ధులు సైతం రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు తప్పించుకుని తిరుగుతుండడం బాధాకరం. వేర్పాటువాదుల స్వార్థానికి తెలుగుజాతిని రెండు ముక్కలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ధన, రాజకీయ స్వార్థం కోసం ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడుతున్న వారిని తరిమితరిమి కొడతాం. - సాప్స్ జేఏసీ తిరుపతి కన్వీనర్ డాక్టర్ సుధారాణి తెలంగాణలోనూ ఎక్కువ మంది సమైక్యాంధ్రే కోరుతున్నారు సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ అత్యధికంగా సమైక్యాం ధ్రను కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ఈ విషయం తెలుస్తుంది. విభజన వల్ల ఇరు ప్రాంతాల వారు నష్టపోతారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. - ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఆర్డీవో రామచంద్రారెడ్డి విభజనతో విద్యార్థుల భవిత అంధకారమే రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలోని విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 17 సెంటర్ యూనివర్సిటీలు, ఐఐటీ, త్రిపుల్ ఐటీ, మెడికల్ కళాశాలలు వంటి ఉన్నత విద్యాలయాలు ఉన్నాయి. రాష్ట్రం ముక్కలైతే సీమాంధ్ర విద్యార్థులకు ఉన్నత విద్య, టెక్నికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాలకులు రాష్ట్ర సమైక్యతను ప్రకటించాలి. - ఎన్.విశ్వనాథరెడ్డి, రాయలసీమ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రతినిధులు అడ్డుకోకపోవడం సిగ్గుచేటు తెలుగుజాతి, సీమాంధ్ర ప్రజల ఉనికికే ప్రమాదకరంగా మారిన విభజనను ప్రజాప్రతినిధులు అడ్డుకోలేకపోవడం సిగ్గుచేటు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధులు గల్లీకొస్తే ఢిల్లీ దాక తరిమికొట్టాలి. సమైక్య ప్రకటన వచ్చేవరకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. - సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం యుద్ధ వాతావరణం సృష్టించడం బాధాకరం ఒక్కటిగా ఉన్న తెలుగుజాతిని విభజిస్తూ యుద్ధ వాతావరణం సృష్టిస్తుండడం బాధాకరం. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విభజన పేరుతో చిచ్చురేపిన నాయకులకు బుద్ధి వచ్చేలా ఉద్యమం ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ అలుపెరగని పోరాటాలకు సిద్ధం కావాలి. - సాప్స్ ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి భవిష్యత్తు తరాల కోసమే ఉద్యమం సీమాంధ్రలో ఉద్యోగులు టీఏ, డీఏల కోసమే లేక వ్యాపారాల కోసమే ఉద్యమాలు చేయడం లేదు. భవిష్యత్తు తరాల కోసం రోడ్డుపైకి వచ్చారు. ఈవిషయాన్ని గుర్తించి ప్రజాప్రతినిధులు వారికి అండగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదు. -జేఏసీ నేతలు విశ్వనాథ్‌రెడ్డి, రమేష్‌బాబు, కేఎస్.వాసు, వేంకటేశ్వర్లు