నల్లగొండలో పారిశ్రామిక పార్కు కోసం టీజీఐఐసీకి 61 ఎకరాలు
ఖమ్మంలో 34 ఎకరాలు మెడికల్ కాలేజీకి.. 13 ఎకరాలు స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు..
జూబ్లీహిల్స్ రోడ్ నం.78లో క్రికెటర్ సిరాజ్‌కు ఉచితంగా 600 గజాలు కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్‌ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్‌ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది.
ఏ సంస్థకు ఎంత భూమి అంటే..
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.
మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉచిత కేటాయింపులు ఇలా..
⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు.
⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం.
Comments
Please login to add a commentAdd a comment