Industrial parks
-
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక పార్క్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలతో పాటు, రాయితీలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. అత్యధిక ఉద్యోగాలు కల్పించడానికి అనువుగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను) కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో భట్టి మాట్లాడారు. డెయిరీ అభివృద్ధికి అవకాశాలు రాష్ట్రంలో పాల ఉత్పత్తికి, వినియోగానికి మధ్య వ్యత్యాసం అధికంగా ఉందని, అందువల్ల పాడి పరిశ్రమ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించేలా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులను మూసీకి అనుసంధానం చేసి మూసీలో స్వచ్ఛమైన నీరు పారే విధంగా ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలిపారు. నది పరివాహక ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్‌లు, బోటింగ్ తదితర అభివృద్ధి పనులు పీపీపీ విధానంలో చేపడతామని వివరించారు. నగర శివార్లలో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టెక్స్టైల్, గ్రానైట్, ఐటీ సెక్టార్, మైన్ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటివరకు 18.50 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నట్లు భట్టి తెలిపారు. -
ఏపీలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు
-
విస్తృతంగా వసతులు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూ పెట్టుబడులను ఆకర్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం పారిశ్రామిక పార్కులు, టౌన్‌షిప్స్‌ను అభివృద్ధి చేసేలా నూతన పారిశ్రామిక విధానం 2023–27లో పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే పార్కుల్లో అన్ని రకాల మౌలిక వసతులతో పాటు నివాసానికి అనువుగా టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయనున్నారు. నివాసం నుంచి ఆఫీసుకు నడుచుకుంటూ వెళ్లే విధంగా వాక్ టు వర్క్ విధానంలో పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో ఉన్న 10 పారిశ్రామిక పార్కుల్లో కనీసం ఐదు పార్కులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. కేవలం భారీ పారిశ్రామిక పార్కులే కాకుండా పీపీపీ విధానంలో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్ పార్కులు, కోల్డ్ చైన్లను అభివృద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన విధివిధానాలను పారిశ్రామిక పాలసీలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ పారిశ్రామిక పార్కులు ప్రైవేట్ రంగంలో పార్కులు అభివృద్ధి చేసేందుకు కనీస ప్రారంభ పెట్టుబడి రూ.200 కోట్లుగా నిర్ణయించారు. ప్రతిపాదిత పారిశ్రామిక పార్కు కనీసం 50 ఎకరాలకుపైగా ఉండాలి. అదే ఏపీఐఐసీ, ప్రభుత్వ భాగస్వామ్యంతో నెలకొల్పోతే కనీస పరిమితిని 100 ఎకరాలుగా నిర్ణయించారు. అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కులో నివాస, వాణిజ్య సముదాయాల పరిమితి 33 శాతం మించి అనుమతించరు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మొక్కల పెంపకం, వాననీటి సంరక్షణ కోసం 33 శాతం కేటాయించాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రైవేట్ రంగంలో పార్కును అభివృద్ధి చేస్తే ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ) ఏర్పాటు చేసి భూమిని బదలాయించాలి. ఒకవేళ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటే ఎస్పీవీలో పెయిడ్ క్యాపిటల్‌గా 2 – 11 శాతం వాటా ప్రభుత్వానికి కేలాయించాల్సి ఉంటుంది. ఈ పార్కులో 90 శాతం వినియోగంలోకి వచ్చిన తర్వాత వాటాను ప్రభుత్వం విక్రయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ డెవలపర్ పార్కును అభివృద్ధి చేయడానికి వస్తే దీర్ఘకాలిక లీజు విధానంలో భూమిని కేటాయిస్తారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రైవేట్ డెవలపర్‌ను ఎంపిక చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా పార్కును అభివృద్ధి చేయడంలో డెవలపర్ విఫలమైతే ఒప్పందాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భారీ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి పారదర్శకంగా బిడ్డింగ్ విధానంలో ఎంపిక చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పీపీపీ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ డెవలపర్స్ ఎంపిక జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్కులు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగంలో కూడా ప్రైవేట్ పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 25 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు కానున్నాయి. రెడీ టు బిల్డ్.. అంటే తక్షణం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించుకునే విధానంలో డిజైన్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లను కనీనం 50,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ పార్కుల మౌలిక వసతుల నిర్మాణ వ్యయంలో 25 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. స్టాంప్ డ్యూటీ, భూ వినియోగ మారి్పడి చార్జీలు (నాలా) వంద శాతం రీయింబర్స్చేస్తారు. రుణాలపై మూడేళ్లపాటు మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తారు. అభివృద్ధి చేసిన పారిశ్రామిక పార్కులో 50 శాతం వినియోగంలోకి రాగానే 50 శాతం ప్రోత్సాహకాలు అందిస్తారు. 100 శాతం వినియోగంలోకి వస్తే మిగిలిన 50 శాతం కూడా చెల్లిస్తారు. లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా వ్యయం తగ్గించే విధంగా లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, శీతల గిడ్డంగుల్లో ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేలా నూతన పారిశ్రామిక విధానంలో పలు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ రంగంలో లాజిస్టిక్ పార్కులు, ఇన్లాండ్ కంటైనర్ డిపోలను అభివృద్ధి చేయడానికి కనీస పెట్టుబడిని రూ.50 కోట్లుగా నిర్ణయించారు. గోడౌన్ల నిర్మాణానికి రూ.5 కోట్లు, శీతల గిడ్డంగులకు రూ.3 కోట్లుగా నిర్ణయించారు. లాజిస్టిక్స్ వేర్‌హౌసింగ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడంతోపాటు 100 శాతం స్టాంప్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. పేటెంట్ల రిజిస్ట్రేషన్స్ వ్యయంలో 75 శాతంతో పాటు పారిశ్రామిక పాలసీ 2020–23లో పేర్కొన్న రాయితీలను వర్తింపచేస్తారు. -
రాష్ట్ర ఆర్థికాభివృద్థిలో పారిశ్రామికపార్కులే కీలకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక పార్కుల పాత్ర కీలకమని, పారదర్శక విధానాలతో పారిశ్రామిక వాడల ప్రగతికి నిరంతరం కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లోగోను సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రగతిలో ఏపీఐఐసీ కీలక భూమిక పోషిస్తూ ముందుకు సాగాలని సీఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జేవీఎన్ సుబ్రహ్మణ్యం, ఏపీఐఐసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదిపాటు నిర్వహించే ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి తెలియచేశారు. రాష్ట్రంలో శరవేగంగా పారిశ్రామికాభివృద్ధి మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో ఏపీఐఐసీ స్వర్ణోత్సవ వేడుకలను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఏపీఐఐసీ పాత్ర మరువలేనిదని చెప్పారు. ప్రస్తుతం ఏపీఐఐసీ చేతిలో ఉన్న 1.50 లక్షల ఎకరాలను వినియోగించుకుంటూ మరింత పారిశ్రామిక ప్రగతి సాధిస్తామన్నారు. సీఎం జగన్ నాయకత్వలో రాష్ట్రం పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తోందని తెలిపారు. ఏపీఐఐసీలో ఉత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగులకు ఈ సందర్భంగా మంత్రి అవార్డులను అందచేశారు. ఏపీ ఎకనామిక్ బోర్డు (ఏపీఈడీబీ) కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఏడాది పాటు ఉత్సవాలు 2023 సంవత్సరాన్ని ఏపీఐఐసీ గోల్డెన్ జూబ్లీ ఇయర్‌గా ప్రకటించి ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఏపీఐఐసీ ద్వారా 21 లక్షల మందికి ఉపాధి కల్పించడంతోపాటు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పారు. సింగిల్ డెస్క్ విధానంలో భాగంగా ఏపీఐఐసీ ప్రవేశపెట్టిన 14 రకాల ఆన్లైన్ సేవలకు మంచి స్పందన వస్తోందని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. రూ.20 కోట్లతో మొదలై రూ.5,000 కోట్లకు రూ.20 కోట్లతో ప్రారంభమైన సంస్థ ఇప్పుడు రూ.5,000 కోట్ల స్థాయికి చేరుకుందని ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి హాజరై అత్యుత్తమ పనితీరు కనపరచిన ఏపీఐఐసీ ఉద్యోగులకు అవార్డులు అందచేసి అభినందించారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి.సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో షన్ మోహన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
సీఎం ఆదేశాలు.. ప్రైవేట్‌కు ధీటుగా వాటి రూపురేఖలు మారనున్నాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు కాలుష్యం, అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా ఉన్న వీటిని ప్రైవేటు పార్కులకు దీటుగా హరిత పారిశ్రామికవాడలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఏపీఐఐసీ చేపట్టింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏపీఐఐసీ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తొలుత పారిశ్రామిక పార్కుల్లో వ్యర్థాలను తొలగించి పచ్చదనాన్ని పెంచే విధంగా ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఇంప్రూవ్మెంట్ డ్రైవ్ పేరుతో 15 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 20న మొదలైన ఈ కార్యక్రమం జులై 5 వరకు జరుగుతుందని.. తొలిదశలో వ్యర్థాల తొలగింపు, వరద కాలువల అభివృద్ధి, అంతర్గత రహదారులకు మరమ్మతులపై దృష్టిసారించామని.. రానున్న రోజుల్లో మురుగు నీరు, వ్యర్థాల శుద్ధి, నీటి సదుపాయం వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించనున్నట్లు ఏపీఐఐసీ వీసీ–ఎండీ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలోని 168 ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా)లను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థలతో సమన్వయం రాష్ట్రంలోని 168 ఐలాలకు ఏటా రూ.120 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా వీటి నిర్వహణపై గత ప్రభుత్వాలు దృష్టిసారించలేదు. ఐలాలకు వచ్చే ఆదాయంలో 35 శాతం స్థానిక పురపాలక, గ్రామ పంచాయతీలకు వెళ్తుంది. పారిశ్రామికవాడల్లో వ్యర్థాల తొలగింపునకు సంబంధించి స్థానిక సంస్థలు, ఐలాల మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. స్థానిక సంస్థలతో కలిసి వ్యర్థాలను తొలగించి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ డ్రైవ్ ప్రారంభించిన మూడ్రోజుల్లోనే 100 కి.మీ పైగా రోడ్ల పక్కన పిచ్చిమొక్కలు, తుప్పలను తొలగించింది. అలాగే.. 14,000 మీటర్ల అంతర్గత రహదారులకు మరమ్మతులు, 33,543 మీటర్ల మేర వరద కాలువల్లో చెత్తను తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ప్రస్తుతం ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని జులై 5కల్లా రాష్ట్ర పారిశ్రామిక పార్కుల రూపురేఖలు మారతాయన్న ఆశాభావాన్ని సుబ్రమణ్యం వ్యక్తంచేశారు. ఐపీఆర్‌ఎస్‌లో చోటే లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణలో ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) కీలకపాత్ర పోషిస్తుంది. ఐపీఆర్‌ఎస్ ర్యాంకింగ్‌లో ప్రభుత్వ రంగ పారిశ్రామిక పార్కులు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. పారిశ్రామిక పార్కుల్లో మౌలిక వసతులు పెంచడం ద్వారా ఐపీఆర్‌ఎస్ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఏపీలోని ఏపీఐఐసీ పార్కుల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటుకు 50వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మౌలిక వసతులు లేకపోవడంతో చాలా చోట్ల యూనిట్లు పెట్టడానికి ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఇప్పుడు మౌలిక వసతులు కల్పించడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చదవండి: మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్ -
‘లాజిస్టిక్స్’కు పరిశ్రమ హోదా
సాక్షి, అమరావతి: సరుకు రవాణాలో కీలకమైన లాజిస్టిక్ రంగానికి పరిశ్రమ హోదాను కల్పిస్తూ ఇందులోకి భారీగా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ లాజిస్టిక్ పాలసీ 2022–27ను రూపొందించింది. రాష్ట్రం మీదుగా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులను అనుసంధానిస్తూ లాజిస్టిక్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీలో పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ రంగంలో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను ఈ ముసాయిదా పాలసీలో పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం.. రవాణాను చౌకగా అందించడం ద్వారా లాజిస్టిక్ రంగంలోనూ మొదటిస్థానంలో ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గోడౌన్ల సామర్థ్యం నాలుగురెట్లు పెంపు లాజిస్టిక్ రంగంలో కీలకమైన గోడౌన్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పాలసీ కాలపరమితిలోగా నాలుగు రెట్లు పెంచనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13.38 లక్షల టన్నులుగా ఉన్న గోడౌన్ల సామర్థ్యాన్ని 2027 నాటికి 56 లక్షల టన్నులు చేయనుంది. ముఖ్యంగా విజయవాడ, కాకినాడ, నెల్లూరు వంటి పట్టణాల్లో డిమాండ్ అధికంగా ఉందని.. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. ఆక్వా, హార్టికల్చర్ రంగాల ఎగుమతులు పెరుగుతుండటంతో శీతల గిడ్డంగుల డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. దీంతో.. ప్రస్తుతం రాష్ట్రంలో 15.67 లక్షల టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగులు మాత్రమే ఉన్నాయి. అపెడా, ఎంపెడా సహకారంతో ఈ రంగంలో భారీగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకూ ప్రణాళికలను సిద్ధంచేసింది. వీటితో పాటు ఇన్లాండ్ కంటైనర్ స్టోర్లు, ఫ్రీ ట్రేడ్వేర్ హౌసింగ్ జోన్లు వంటి సౌకర్యాలను ప్రోత్సహించనుంది. పోర్టులపై భారీ పెట్టుబుడులు మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ.20,000 కోట్ల వరకు వ్యయం చేయనుంది. ఇదే సమయంలో ఇన్లాండ్ వాటర్ వేస్ ద్వారా సరుకు రవాణాను 5 టన్నుల నుంచి 10 టన్నులకు పెంచనుంది. అలాగే, విశాఖ భోగాపురం వద్ద 2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, నెల్లూరు దగదర్తి వద్ద 1,868 ఎకరాల్లో సరకు రవాణా లక్ష్యంగా మరో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇక కంటైనర్లు వేగంగా ప్రయాణించేందుకు జాతీయ రహదారులను భారీగా విస్తరించడంతో పాటు 16, 65, 48, 44 జాతీయ రహదారుల పక్కన ట్రక్కులు నిలుపుకోవడానికి ట్రక్ పార్కింగ్ బేలను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థలాలను గుర్తించింది. ఇక్కడ డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, రిపేర్లు, ఇంథనం నింపుకోవడం వంటి మౌలిక వసతులూ కల్పిస్తారు. కేవలం సరుకు రవాణా కోసం ఖరగ్‌పూర్–విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ–నాగపూర్–ఇటార్సి (975కి.మీ)లను డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోంది. అలాగే, ప్రధాన పారిశ్రామికవాడలైన కొప్పర్తి, ఓర్వకల్లు, శ్రీకాళహస్తిలను రైల్వేలైన్లతో అనుసంధానం చేస్తోంది. ఎంఎంఎల్‌పీల అభివృద్ధి ఒక వస్తువు ధరలో 13 శాతంగా ఉన్న సరుకు రవాణా వ్యయాన్ని మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల (ఎంఎంఎల్పీ) ఏర్పాటు ద్వారా 8 శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం.. ► కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రం, ప్రైవేటు రంగంలో వాటిని అభివృద్ధి చేయనున్నారు. ► ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, అనంతపురంలలో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయనుండగా, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద మరో ఎంఎంఎల్పీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ► వీటితో పాటు పారిశ్రామికవాడల్లో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేసి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఏపీఐఐసీ ఆహ్వానిస్తోంది. ► అలాగే, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులతో పాటు ఓర్వకల్లు, హిందూపురం, దొనకొండ, ఏర్పేడు–శ్రీకాళహస్తి నోడ్ల వద్ద ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలనూ సిద్ధంచేస్తోంది. ► ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో 5 శాతం భూమిని ఎంఎంఎల్‌పీలకు కేటాయించడమే కాకుండా 2020–23 పారిశ్రామిక పాలసీ ప్రకారం ఇతర రాయితీలను అందించనుంది. ప్రతీ 50–60 కి.మీ ఒక పోర్టు ప్రస్తుతం విశాఖ మేజర్పోర్టుతో కలిపి ఆరు పోర్టుల కార్యకలాపాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నిర్మించనున్న భావనపాడు, కాకినాడ సెజ్, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులతో మొత్తం పోర్టుల సంఖ్య 10కి చేరుతుంది. ఇలా ప్రతీ 50–60 కి.మీ.కు ఒక పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అనుగుణంగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు లాజిస్టిక్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ లాజిస్టిక్ ప్రమోషన్ పాలసీ–2022–27ను తీసుకొస్తున్నాం. – గుడివాడ అమరనాథ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మరిన్ని ఎంఎంఎల్‌పీల అభివృద్ధికి ప్రణాళిక సరుకు రావాణా వ్యయంలో లాజిస్టిక్స్ చాలా కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని విశాఖ, అనంతపురంలో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు రాష్ట్రంలో మరిన్ని మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో లాజిస్టిక్స్ గణాంకాలు.. ► రాష్ట్రంలో రహదారుల దూరం : 13,500 కి.మీ ► జాతీయ రహదారుల్లో 7 శాతం వాటాతో వాటి దూరం : 7,340 కి.మీ ► మన రాష్ట్రంలో రైల్వే లైన్ల దూరం : 7,715 కి.మీ ► ఏపీలో వేర్ హౌసింగ్ గిడ్డంగుల సామర్థ్యం : 13.38 లక్షల టన్నులు ► శీతల గిడ్డంగులవి : 15.67 లక్షల టన్నులు ► కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు మొత్తం : 17 ► ఇన్లాండ్ కంటైనర్ డిపోలు (ఐసీడీఎస్) : 3 ► ఎయిర్ కార్గో టెర్మినల్స్ : 5 ► రైల్–రోడ్ గూడ్స్ షెడ్లు : 283 ► లాజిస్టిక్ ట్రైనింగ్ సెంటర్లు : 16 ► మన పోర్టుల సరుకు నిర్వహణ సామర్థ్యం : 172 మిలియన్ టన్నులు -
లేడీస్ స్పెషల్... ఇండస్ట్రియల్ పార్క్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - ఎఫ్ఎల్వో( లేడీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పార్క్ రూపుదిద్దుకుంది. నగర శివార్లలో ఉన్న సూల్తాన్‌పూర్ ఏరియాలో 50 ఎకరాల్లో సిద్దమైన ఈ పార్కుని ప్రారంభించనున్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 8న ఈ పార్కుని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఫిక్కీ ఎఫ్ఎల్వో జాతీయ అధ్యక్షురాలు ఉజ్వలా సింఘానియా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇరవై ఏళ్ల కిందట యాభై మంది మహిళా పారిశ్రామికవేత్తలతో ఫిక్కీ ఎఫ్ఎల్వో ప్రారంభం అయ్యింది. తాజాగా ఫిక్కీ ఎఫ్ఎల్వో 800ల మంది సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. -
రాష్ట్రంలో పెట్టుబడులకు డీపీ వరల్డ్ ఆసక్తి
సాక్షి, అమరావతి: పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పారిశ్రామిక పార్కులు నిర్వహించే దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న నాలుగు పోర్టుల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. దుబాయ్ ఎక్స్పో 2020లో భాగంగా దుబాయ్ పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం డీపీ వరల్డ్ అభివృద్ధి చేసిన జెబెల్ అలీ పోర్టును పరిశీలించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎగుమతుల కోసం ఒకేసారి 10 లక్షల కార్లను నిలిపే సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు.. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి డీపీ వరల్డ్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి మేకపాటి తెలిపారు. భారత రాయబార కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్ షో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రి మేకపాటి అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలను వివరించారు. రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల కల్పనలో ఉన్న ముబదల గ్రూపు, ఐటీ రంగానికి చెందిన జీ42 ప్రతినిధులు మంత్రితో సమావేశమై రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, మిడిల్ ఈస్ట్ అండ్ ఫార్ ఈస్ట్ ప్రత్యేక ప్రతినిధి జుల్ఫీ రావ్జీ, ఏపీఐఐసీ ౖచైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, పరిశ్రమల శాఖ, ఏపీఈడీబీ, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు. తబ్రీవ్ ఏషియాతో ఒప్పందం దుబాయ్ ఎక్స్పో 2020లో రూ.3,000 కోట్ల విలువైన పెట్టుబడులకు ఇప్పటికే మూడు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు, గోడౌన్ల నిర్మాణం, ఉష్ణోగ్రతలను తగ్గించే టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసేందుకు అబుదాబీకి చెందిన తబ్రీవ్ ఏషియా పరిశ్రమతో మరో కీలక ఒప్పందాన్ని కుదర్చుకుంది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ సమక్షంలో ఏపీఈడీబీ సీఈవో సుబ్రహ్మణ్యం జవ్వాది, తబ్రీవ్ ఏషియా సీడీవో (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) ఫ్రాన్ కో–యిస్ జావియర్ బాల్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అనంతరం మంత్రి అబుదాబీలోని ఉక్కు కంపెనీ కొనరస్ను సందర్శించారు. ఉక్కు తయారీ విధానాన్ని పరిశీలించారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్‌తో పాటు రాష్ట్రంలో ఇతర పెట్టుబడుల అవకాశాలను కొనరస్ ప్రతినిధులకు మంత్రి వివరించారు. ఇంక్యుబేషన్ సెంటర్లు సహా వెబినార్, రోడ్ షోల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌కు సహకరించేందుకు అబుదాబీ గ్లోబల్ మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ ఏజీడీఎం సంసిద్ధత వ్యక్తం చేసింది. -
కోశలనగరం పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు
సాక్షి, అమరావతి: ఆటోమొబైల్, ఇంజినీరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో చిత్తూరు జిల్లా కోశలనగరం వద్ద ఏపీఐఐసీ ప్రతిపాదిత పారిశ్రామిక పార్కుకు పర్యావరణ అనుమతులు లభించాయి. చెన్నై, తిరుపతి, చిత్తూరు నగరాలకు దగ్గరగా ఉండే విధంగా సుమారు 2,300 ఎకరాల్లో ఏపీఐఐసీ ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనుంది. ఇందులో 1,371.52 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు, మిగిలిన స్థలాన్ని మౌలికవసతుల కల్పనకు వినియోగించనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 17 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ పారిశ్రామిక పార్కుకు కీలకమైన పర్యావరణ అనుమతులు రావడంతో మౌలికవసతుల అభివృద్ధి కోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. -
రాష్ట్ర సెజ్‌లు, పారిశ్రామిక పార్కుల్లో ‘ఇంద్రధనస్సు’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు)లో మన రాష్ట్రం ఏడు రంగాల్లో మంచి ప్రతిభ చూపింది. ఆయా రంగాలకు పారిశ్రామిక పార్కులు, సెజ్‌లు చేసిన భూకేటాయింపులకు సంబంధించి రసాయనాలు, ఫార్మా, లోహాలు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, లెదర్, జెమ్స్–జ్యుయెలరీ రంగాల్లో మొదటి మూడు స్థానాలను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల పనితీరును అంచనా వేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్–2 సర్వే నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వేకు ఈ ఏడాది ఆగస్టు నాటి వరకు ఉన్న డేటాను తీసుకున్నారు. తాజాగా ఈ సర్వే నివేదికను కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఓవరాల్ ర్యాంకుల కోసం 449 పార్కులు/సెజ్‌లు పోటీపడ్డాయి. వ్యక్తిగత విభాగంలో 1,614 పార్కులు పోటీలో నిలిచాయి. మన రాష్ట్రం నుంచి 18 పారిశ్రామిక పార్కులు, 14 సెజ్‌లు ఈ ర్యాంకుల కోసం పోటీపడ్డాయి. గుజరాత్ అత్యధికంగా 28 పారిశ్రామిక పార్కులు, 8 సెజ్లతో మొదటి స్థానంలో నిలవగా, మహారాష్ట్ర 30 పారిశ్రామిక పార్కులు, 4 సెజ్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 18 పారిశ్రామిక పార్కులు, 14 సెజ్లతో మూడో స్థానంలో నిలిచింది. అదే సెజ్‌లు పరంగా చూస్తే 14 సెజ్లతో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది. ఈ ఏడు రంగాలే కీలకం.. దేశవ్యాప్తంగా అన్ని సెజ్‌ల్లో ఆయా రాష్ట్రాలు ఏ రంగానికి చెందిన పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తే ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఉన్న సెజ్లతో పోలిస్తే మన రాష్ట్రం ఏడు రంగాలకు చెందిన పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. రసాయనాలు, ఫార్మా రంగాలకు అత్యధిక భూములు కేటాయించడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ రెండు రంగాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. భూ కేటాయింపుల్లో లోహాలు, నిర్మాణ రంగాలు రెండో స్థానంలో నిలిస్తే, ఇంజనీరింగ్, లెదర్, జెమ్స్–జ్యుయెలరీ రంగాలు మూడో స్థానంలో నిలిచింది. సెజ్‌లు, పారిశ్రామిక పార్కులు ఆయా రంగాలకు కేటాయించిన భూముల వివరాలు.. రసాయనాలు రసాయనాల రంగానికి చెందిన పెట్టుబడులను ఆకర్షించడంలోరాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఈ రంగానికి చెందిన పార్కులు/సెజ్‌లు మొత్తం 118 పోటీ పడ్డాయి. ఇవన్నీ కలిపి 6,258.76 హెక్టార్ల భూమిని రసాయనాల రంగానికి కేటాయించాయి. ఇందులో 2,248.77 హెక్టార్ల (35.93 శాతం) భూమిని కేటాయించడం ద్వారా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (24.62 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (14.20 శాతం) స్థానాలను దక్కించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్ ఫార్మాస్యూటికల్స్ విభాగంలో కూడా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ రంగంలో మొత్తం 41 పార్కులు/సెజ్‌లు పోటీ పడ్డాయి. ఇవన్నీ కలిసి ఫార్మా రంగానికి 1,871.40 హెక్టార్ల భూమిని కేటాయించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఫార్మారంగానికి 623.73 హెక్టార్లు (33.33 శాతం) భూమిని కేటాయించడం ద్వారా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ (22.76 %), కర్ణాటక (15.90 %) ఉన్నాయి. లోహాలు లోహాల రంగంలో దేశవ్యాప్తంగా మొత్తం 156 పార్కులు/సెజ్‌లు పోటీపడ్డాయి. ఇవన్నీ కలిసి 42,339.18 హెక్టార్ల భూమిని కేటాయించాయి. ఇందులో 55.40 శాతం వాటాతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. 24.66 శాతంతో ఏపీ రెండో స్థానం, 14.07 శాతంతో తమిళనాడు మూడో స్థానం దక్కించుకున్నాయి. నిర్మాణ రంగం నిర్మాణ రంగానికి సంబంధించి మొత్తం 8 పారిశ్రామిక పార్కులు మాత్రమే పోటీపడ్డాయి. ఈ 8 పార్కులు నిర్మాణ రంగానికి 366.69 హెక్టార్లు కేటాయించాయి. ఇందులో 36.92 శాతంతో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఏపీ 36.40 శాతం, మధ్యప్రదేశ్ 23.18 శాతంతో నిలిచాయి. జెమ్స్ అండ్ జ్యుయెలరీ ఈ రంగంలో మొత్తం తొమ్మిది పార్కులు పోటీ పడ్డాయి. మొత్తం 129.06 హెక్టార్లలో రాజస్థాన్ 63.57%, గుజరాత్ 23.22%, ఏపీ 13.20% చొప్పున భూములు కేటాయించాయి. లెదర్ లెదర్ పరిశ్రమకు సంబంధించి 10 పార్కులు పోటీపడ్డాయి. ఈ 10 కలిపి 1,685.23 హెక్టార్ల భూమిని కేటాయించాయి. ఇందులో హరియాణా 57.97 శాతం, తమిళనాడు 30.08 శాతం, ఏపీ 7.89 శాతం చొప్పున భూములు ఇచ్చాయి. ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ రంగంలో అత్యధికంగా 529 పార్కులు/సెజ్‌లు పోటీపడ్డాయి. ఈ రంగానికి 26,725.93 హెక్టార్ల భూమిని కేటాయించగా.. ఇందులో ఒక్క కర్ణాటక రాష్ట్రమే 80.53 శాతం భూమిని కేటాయించింది. తమిళనాడు 5.22 శాతం, ఆంధ్రప్రదేశ్ 5.05 శాతం భూమిని కేటాయించాయి. -
కేంద్రం రేటింగ్స్: 'లీడర్'లుగా 41 ఇండస్ట్రీయల్ పార్క్‌లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 41 పారిశ్రామిక పార్క్‌లు ’లీడర్’ గుర్తింపు దక్కించుకున్నాయి. వీటిలో 98 శాతం పార్క్‌లు పశ్చిమ (మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్) ఉత్తరాది (ఉత్తరాఖండ్) ప్రాంతాల్లో ఉన్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రెండో విడత పారిశ్రామిక పార్క్‌ల రేటింగ్స్ సిస్టమ్ (ఐపీఆర్‌ఎస్) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి 90 పార్క్‌లు చాలెంజర్లుగాను, 185 ఆశావహ పార్క్లుగాను రేటింగ్‌లు దక్కించుకున్నాయి. ప్రస్తుత ప్రమాణాలు, మౌలిక సదుపాయాల ప్రాతిపదికన ఈ రేటింగ్స్ ఇచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ తెలిపారు. ఈ రేటింగ్ ప్రక్రియ దేశాభివృద్ధికి దోహదపడగలదని, ఇటు పరిశ్రమకు అటు దేశ పురోగతికి తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్వెస్టర్లు తాము పెట్టుబడి పెట్టేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకునేందుకు ఉపయోగపడే ఇండియా ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ (ఐఐఎల్‌బీ – ఇది జీఐఎస్ ఆధారిత 4,400 పైచిలుకు పారిశ్రామిక పార్క్‌ల డేటాబేస్)కు రేటింగ్ నివేదిక కొనసాగింపు అని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, వ్యాపారానికి అవసరమైన సేవల లభ్యత, పర్యావరణ.. భద్రతా ప్రమాణాలు తదితర అంశాల గురించి తెలుసుని, తగు నిర్ణయం తీసుకునేందుకు ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగపడగలదని మంత్రి వివరించారు. 2020లో ఐపీఆర్‌ఎస్ 2.0పై కసరత్తు ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాలు, 51 సెజ్‌లు (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) ఇందులో పాల్గొన్నాయి. 478 నామినేషన్లు రాగా 449కి సంబంధించి 5,700 మంది కిరాయిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. మరోవైపు, 30–40 దేశాలకు మించి .. సుమారు 5.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పారిశ్రామిక పార్క్‌ల వివరాలను ఐఐఎల్బీలో ఒక్క క్లిక్‌తో పొందవచ్చని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ సెక్రటరీ అనురాగ్ జైన్ తెలిపారు. -
కరువు సీమలో.. ‘కొప్పర్తి’ కాంతులు
కొప్పర్తి నుంచి సాక్షి, ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు: రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి రూపు రేఖలను మార్చే మరో భారీ పారిశ్రామిక పార్కు శరవేగంగా అందుబాటులోకి వస్తోంది. శంకుస్థాపనలు, ఎంవోయూలు అంటూ ఆర్భాటాలు, హడావుడి లేకుండా నేరుగా కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించే విధంగా వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో భారీ పారిశ్రామిక పార్కును రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఒకపక్క కోవిడ్ సంక్షోభం ఉన్నప్పటికీ కేవలం 9 నెలల్లోనే యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రభుత్వ చొరవతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కడప నగరానికి కూతవేటు దూరంలో సుమారు 6,914 ఎకరాల్లో ఏకకాలంలో నాలుగు పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నిధులతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేయనుండగా మిగిలిన 4,318 ఎకరాల్లో ఏపీఐఐసీ మూడు పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. 3,164 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 104 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులుగా ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ మూడు పార్కులకు విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా 132 కేవీ సబ్‌స్టేషన్, రహదారులు, మురుగునీటి కాలువలు లాంటి మౌలిక వసతులను ఏపీఐఐసీ అభివృద్ధి చేయడంతో పలు సంస్థలు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. మిగతా 249 ఎకరాల భూమిని ఇతర పారిశ్రామిక ఎకరాలకు వినియోగించనున్నారు. దసరా నాటికి కొప్పర్తి పారిశ్రామిక పార్కులో ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఐఐసీ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 6,914 ఎకరాలు అందుబాటులోకి వస్తే కొప్పర్తిలో సుమారు రూ.60,200 కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. క్యూ కడుతున్న కంపెనీలు బాగా వెనుకబడిన ప్రాంతమైన వైఎస్సార్ కడప జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కొప్పర్తిలో పారిశ్రామిక పార్కును ప్రతిపాదించారు. ఆయన హఠాన్మరణం అనంతరం ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే కొప్పర్తి పారిశ్రామిక పార్కుపై దృష్టి సారించారు. ఒకపక్క మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే మరోపక్క పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తిలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక రాయితీలు కల్పించారు. దీంతో పలు సంస్థలు ఈ ప్రాంతంపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ ఇప్పటికే 47 కంపెనీలకు 430 ఎకరాలను కేటాయించారు. ఇందులో నాలుగు భారీ యూనిట్లు ఉండగా మిగిలిన 43 ఎంఎస్ఎంఈ రంగానికి చెందినవి. 47 యూనిట్ల ద్వారా రూ.1,837 కోట్ల మేర పెట్టుబడులు, 8,941 ఉద్యోగాలు రానున్నాయి. వైఎస్సార్ ఈఎంసీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు భారీ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. ముఖ ద్వారం నమూనా కొప్పర్తికి కలిసొచ్చే అంశాలివే.. రోడ్లు, రైలు మార్గం, విమానాశ్రయం, పోర్టు.. ఇలా అన్ని ప్రధాన రవాణా మార్గాలు ఉండటం కొప్పర్తి పారిశ్రామిక పార్కులో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జాతీయ రహదారి 40గా వ్యవహరించే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవేకి ఆనుకొని కడప–పులివెందుల రహదారికి ఇరువైపులా కొప్పర్తి పారిశ్రామికపార్కు విస్తరించి ఉంది. కేవలం పది కిలోమీటర్ల లోపే కడప విమానాశ్రయం ఉంది. ఈ పారిశ్రామిక పార్కు గుండా కడప–బెంగళూరు రైల్వేలైన్ ఉంది. 200 కి.మీ దూరంలో కృష్ణపట్నం పోర్టు, 270 కి.మీ దూరంలో చెన్నై పోర్టు ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీటన్నిటికంటే వైఎస్సార్ కడప జిల్లాలో బెరైటీస్, ఐరన్ ఓర్, క్వారŠజ్ట్, వైట్ క్లే లాంటి అనేక ఖనిజాలు లభ్యం కావడం కూడా వీటి ఆథారిత యూనిట్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. 2011 లెక్కల ప్రకారం వైఎస్సార్ కడప జిల్లా జనాభా 28,82,469 కాగా 9 పాలిటెక్నిక్ కాలేజీలు, 24 ఇంజనీరింగ్ కాలేజీలు, 49 డిగ్రీ కాలేజీలు ఉండటం వల్ల పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏర్పాటు చేసే యూనిట్లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం అదనపు ఆకర్షణ. ఇక్కడ నెలకొల్పే యూనిట్లకు గండికోట రిజర్వాయర్ నుంచి శాశ్వత ప్రాతిపదికన ఒక టీఎంసీ నీటిని తరలించేలా ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలుత సోమశిల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాలని ప్రతిపాదించినా పెన్సుల నరసింహస్వామి అభయారణ్యం ద్వారా పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో అనుమతుల్లో జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో గండికోట నుంచి తరలించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఏడాదిలోగా శాశ్వత నీటి వసతి కల్పించే విధంగా ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటోంది. కొప్పర్తి సమీపంలోనే పాపాగ్ని, పెన్నా నదులు ఉండటంతో భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండదు. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా కంపెనీ వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్‌తో 2.5 లక్షల మందికి ఉపాధి వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో 3,164 ఎకరాలను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ పార్కు ద్వారా కనీసం రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇక్కడ నెలకొల్పే యూనిట్లకు ప్రత్యేక రాయితీలతో పాటు తొలి ఐదు యాంకర్ కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలను అందిస్తున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ఇన్వెస్ట్ చేసే తొలి ఐదు కంపెనీలు లేదా యాంకర్ యూనిట్లకు తక్కువ ధరకే భూమి కేటాయింపు, స్టాంపు డ్యూటీ, ఎస్జీఎస్టీ పూర్తి మినహాయింపుతో పాటు వడ్డీ, విద్యుత్ సబ్సిడీ లాంటి అనేక రాయితీలు కల్పిస్తున్నారు. రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను కేటాయించారు. ఈ యూనిట్ ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. రూ.486 కోట్ల పెట్టుబడితో 2,030 మందికి ఉపాధి కల్పించడానికి ముందుకొచ్చిన ప్రముఖ ఫర్నిచర్ తయారీ సంస్థ నీల్ కమల్‌కు 105 ఎకరాలను కేటాయించారు. బల్క్‌డ్రగ్స్, మెట్రోరైల్ విడిభాగాలు తయారీ, సిమెంట్ పైపుల నిర్మాణం, స్టేషనరీ లాంటి అనేక యూనిట్లకు ఇప్పటికే భూములు కేటాయించారు. ఇందులో చాలావరకు ఎస్సీ, ఎస్టీ మహిళలకు చెందిన యూనిట్లు ఉండటం గమనార్హం. వైఎస్సార్ ఈఎంసీలో నిర్మించిన ఫ్యాక్టరీ షెడ్లు రూ.748 కోట్లతో వైఎస్సార్ ఈఎంసీ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకటించిన ఎలక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)–2 పథకంలో భాగంగా దేశంలో అనుమతులు పొందిన తొలి ప్రాజెక్టు వైఎస్సార్ ఈఎంసీ. మొత్తం 801 ఎకరాల్లో విస్తరించిన వైఎస్సార్ ఈఎంసీలో తొలిదశలో రూ.748 కోట్లతో 540 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో యూనిట్లు తక్షణం ఉత్పత్తి ప్రారంభించే విధంగా ఒకొక్కటి 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం నాలుగు రెడీ టు బిల్డ్ షెడ్లు సిద్ధమయ్యాయి. ఇందులో రెండు షెడ్లను డిక్సన్ కంపెనీకి, రెండు షెడ్లను కార్బన్ మొబైల్స్‌కు కేటాయించనున్నారు. ఇవేకాకుండా సోలార్ పీవీ మాడ్యూల్స్, ఈవీ బ్యాటరీస్, మొబైల్ ఫోన్ ప్యానల్స్, ఏసీలు, వాషింగ్‌మెషీన్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎంఎస్ఎంఈ పార్కు సూక్ష్మ, చిన్న పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా 104 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఎంఎస్ఈ–సీడీపీ కింద రూ.14 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 98 ప్లాట్స్‌ను అభివృద్ధి చేసి యూనిట్లకు కేటాయించనున్నారు. ఈ పార్కు ద్వారా రూ.200 కోట్ల విలువైన పెట్టుబడులు, 3,000 మందికిపైగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిక్‌డిక్ట్ నిధులతో పారిశ్రామిక పార్కు కొప్పర్తి సౌత్ నోడ్‌లో 2,595.74 ఎకరాల్లో నిక్‌డిట్ నిధులతో భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి మాస్టర్ పాŠల్న్ సిద్ధమైంది. ఆమోదం కోసం దీన్ని నిక్డిట్కు సమర్పించారు. మాస్టర్‌ప్లాన్ ఆమోదం తర్వాత కొప్పర్తి సౌత్ నోడ్ పనులు ప్రారంభమవుతాయి. ఈ పార్కు ద్వారా సుమారు రూ.25,000 కోట్ల పెట్టుబడులు, రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రాధమికంగా అంచనా వేశారు. 250 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ సిటీ.. కొప్పర్తిలో పనిచేసే అన్ని తరగతుల ఉద్యోగులు అక్కడే నివాసం ఉండే విధంగా అన్ని వసతులతో కూడిన ఇంటిగ్రేటెడ్ సిటీ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. డార్మెటరీల దగ్గర నుంచి లగ్జరీ అపార్ట్మెంట్ల వరకు అన్ని తరగతులు వారు నివసించేలా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు ఆస్పత్రులు, మాల్స్, స్కూల్స్, 3 స్టార్ నుంచి 5 స్టార్ దాకా హోటళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. సుమారు 250 ఎకరాల్లో రూ.1,500 కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేడ్ సిటీ అభివృద్ధికి పలు సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయి. పారిశ్రామిక పార్కును ప్రారంభించే రోజే సీఎం చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షల మందికి ఉపాధి ... పరిశ్రమలకు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించి కొప్పర్తి పారిశ్రామికవాడను శరవేగంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టగా మరికొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. గత సర్కారు మాదిరిగా హంగులు, ఆర్భాటాలు లేకుండా భారీ పారిశ్రామిక పార్కును సిద్ధం చేస్తున్నాం. లక్షల మందికి ఉపాధి కల్పించే శక్తి కొప్పర్తికి ఉంది. రానున్న రోజుల్లో కొప్పర్తి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయనడంలో సందేహం లేదు. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి నిర్వహణ వ్యయం చాలా తక్కువ.. ఇక్కడ ఏర్పాటయ్యే యూనిట్ల నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండేలా వైఎస్సార్ ఈఎంసీని అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈఎంసీలో యూనిట్ రూ.4.50కే విద్యుత్ అందిస్తున్నాం. ఈ ధరకే నేరుగా బిల్లింగ్ చేయడం వల్ల ప్రతి యూనిట్‌కు నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. తక్కువ ధరకే భూమి, నీటిని కూడా అందించడం కలిసొచ్చే అంశం. కోవిడ్ సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ తుది అనుమతులు పొందిన నాలుగు నెలల్లోనే ఈఎంసీని అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. – నందకిషోర్, సీఈవో, వైఎస్సార్ ఈఎంసీ సొంత ప్రాంతంలో యూనిట్ గత 30 ఏళ్లుగా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫార్మా కంపెనీల్లో పనిచేశా. ఆ అనుభవంతో సొంతంగా బల్క్ డ్రగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నా. తెలంగాణాలో ఎకరం భూమి రూ.50 లక్షల నుంచి 70 లక్షలు పెడితే కానీ దొరికే అవకాశం లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొప్పర్తిలో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేస్తుండటం, ఇది మా సొంత ప్రాంతం కావడంతో ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించా. తొలిదశలో రూ.6 కోట్లతో బీఎస్ ల్యాబ్‌రేటరీస్ పేరుతో బల్క్ డ్రగ్ ఫార్మాను ఏర్పాటు చేశా. ప్రభుత్వం త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంతో కేవలం ఆరునెలల్లోనే యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ యూనిట్ ద్వారా కనీసం 150 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. –బి.శ్రీనివాసులురెడ్డి, బీఎస్ ల్యాబ్స్ మేనేజింగ్ పార్టనర్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ స్వర్ణముఖి కాంక్రీట్స్ పేరుతో కొప్పర్తిలో 2 ఎకరాల్లో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నా. ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.6 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 25 మందికి ఉపాధి లభించనుంది. రెండేళ్లలోనే కొప్పర్తి పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందింది. – ఎన్.మహేందర్‌రెడ్డి, ఎండీ, స్వర్ణముఖి కాంక్రీట్స్ -
పరిశ్రమలకు పుష్కలంగా నీటి వసతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు శాశ్వత నీటి వసతి కల్పన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అభివృద్ధి చేస్తున్న వివిధ పారిశ్రామిక పార్కులకు పుష్కలంగా నీటిని అందించేలా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది. కృష్ణపట్నం వద్ద నెలకొల్పే క్రిస్ సిటీతో పాటు నాయుడుపేట సెజ్, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి – ఏర్పేడు నోడ్, నెల్లూరు జిల్లా మాంబట్టు సెజ్, చిత్తూరు జిల్లా చిన్నపండూరు పారిశ్రామిక వాడ, శ్రీసిటీ సెజ్‌లకు పూర్తిస్థాయిలో నీటి సదుపాయం కలగనుంది. ప్రస్తుతం తొలి దశలో అభివృద్ధి చేస్తున్న పార్కుల అవసరాలకు తగినట్లుగా రోజూ 111.93 మిలియన్ లీటర్ల నీటిని అందించేలా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. కండలేరు రిజర్వాయర్ నుంచి కృష్ణపట్నం, శ్రీసిటీ వరకు సుమారు 205 కి.మీ పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించనున్నారు. ఆయా పారిశ్రామిక పార్కుల వద్ద ఆరు భూగర్భ రిజర్వాయర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సుమారు రూ.550 కోట్లు వ్యయం కానుంది. ప్రత్యామ్నాయ మార్గాలకు డీపీఆర్‌లు... కండలేరు నుంచి నీటి తరలింపు పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 30 శాతానికిపైగా పనులు పూర్తైనట్లు ఏపీఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. తొలుత ప్రతిపాదించిన మార్గంలో కొన్ని చోట్ల అనుమతులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కోసం ఏపీఐఐసీ టెండర్లు పిలిచింది. సెప్టెంబర్ 7లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీసిటీలోని పరిశ్రమలతో పాటు చిన్నపండూరు వద్ద ఏర్పాటైన హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి సంస్థల నీటి అవసరాలు తీరనున్నాయి. -
పెట్టుబడులను ఆకర్షించేలా..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన పారిశ్రామిక పార్కుల్లోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జాతీయ రహదారులతో పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేయబోతోంది. జాతీయ రహదారులతో అనుసంధానం వల్ల పారిశ్రామిక పార్కులు విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. చైనాలోని టాంజిన్ ఎకనామిక్ టెక్నలాజికల్ డెవలప్మెంట్ ఏరియా, సింగపూర్ సుజోహు పారిశ్రామిక పార్క్, తైవాన్ హిసించు సైన్స్ పార్క్‌ల విజయంలో రహదారుల అనుసంధానం కీలకపాత్ర పోషించినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. చైనాలో టాంజిన్ పార్కును 10 ప్రధాన రహదారులతో అనుసంధానం చేయగా, సింగపూర్‌లో 5 ఎక్స్‌ప్రెస్ హైవేలు, తైవాన్‌లో 2 ప్రత్యేక హైవేలతో పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేశారు. ఇదే విధానాన్ని ఏపీలో కూడా అమలుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏపీ మీదుగా వెళ్తున్న విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాద్ కారిడార్లలో చేపట్టిన పారిశ్రామిక పార్కులను అనుసంధానం చేసేందుకు ఆరు రహదారులను ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. పారిశ్రామిక పార్కుల నుంచి వేగంగా హైవేల మీదకు చేరుకునేలా 1,318 కి.మీ. రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి, శ్రీకాళహస్తి–ఏర్పేడు పారిశ్రామిక పార్కులకు ప్రయోజనం చేకూరే విధంగా కడప–తడ మధ్య 208 కి.మీ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. విశాఖ నోడ్‌కు ప్రయోజనం చేకూరే విధంగా ఎన్‌హెచ్16ను ఎన్‌హెచ్ 30తో అనుసంధానం చేస్తారు. ఇందుకు విశాఖ–చింటూరు మధ్య 238 కి.మీ మేర రహదారిని అభివృద్ధి చేస్తారు. మచిలీపట్నం నోడ్‌కు ప్రయోజనం చేకూరేలా ఎన్‌హెచ్ 16ను ఎన్‌హెచ్ 44తో అనుసంధానం చేస్తారు. ఇందుకు బాపట్ల–గుంటూరు (49 కి.మీ), గుంటూరు–కర్నూలు(281కి.మీ), గుంటూరు–అనంతపురం(370 కి.మీ) రహదారులను ప్రతిపాదించారు. కాకినాడ్ నోడ్‌కు ప్రయోజనం చేకూర్చేలా ఎన్‌హెచ్ 16ను ఎన్‌హెచ్ 65తో అనుసంధానం చేస్తారు. ఇందుకు దేవరపల్లి–సూర్యాపేట మధ్య 172 కి.మీ రహదారిని అభివృద్ధి చేయనున్నారు. -
42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అన్ని రకాల వసతులు ఒకేచోట కల్పించే విధంగా అయిదు భారీ పారిశ్రామిక పార్కులను ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇండ్రస్టియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నిధులతో అయిదు మల్టీ ప్రొడక్ట్ పార్కులను అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడు పారిశ్రామిక కారిడార్లలో వీటిని అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ–చెన్నై ఇండ్రస్టియల్ కారిడార్ (వీసీఐసీ)లో ఏడీబీ రుణంతో చేపడుతున్న ప్రాజెక్టులకు అదనంగా మూడు పార్కులు, చెన్నై–బెంగళూరు కారిడార్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో ఒక్కొక్కటి వంతున అభివృద్ధి చేస్తున్నారు. విసీఐసీలో నక్కపల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి, చెన్నై–బెంగళూరు కారిడార్‌లో కృష్ణపట్నం, హైదరాబాద్–బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను 42,313 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసింది. దీన్లో తొలిదశగా 13,292 ఎకరాల్లో మల్టీ ప్రొడక్ట్ పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు నిక్‌డిట్ సూత్రప్రాయం అంగీకారం తెలిపింది. కృష్ణపట్నం పార్కులో 2,500 ఎకరాల్లో అభివృద్ధికి రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలపడమే కాకుండా రూ.1,314 కోట్లు మంజూరు చేసింది. త్వరలోనే కృష్ణపట్నం పార్కు పనులకు టెండర్లు పిలవనున్నట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అదేవిధంగా శ్రీకాళహస్తిలో 2,500 ఎకరాల్లో, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో, నక్కపల్లిలో 3,196 ఎకరాల్లో పార్కులను అభివృద్ధి చేయడానికి నిక్‌డిట్ నిధులతో మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు, ఓర్వకల్లుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు. 24 గంటలూ నీరు నాణ్యమైన విద్యుత్, నీరు అందిస్తే ఎంత ధరైనా చెల్లించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. రాయితీల కంటే మౌలికవసతులు ప్రధానమని సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ పారిశ్రామిక పార్కుల్లో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యుత్, నీరు నిరంతరాయంగా అందించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొప్పర్తి, శ్రీకాళహస్తి పారిశ్రామిక పార్కులకు సోమశిల జలాశయం నుంచి, ఓర్వకల్లుకు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి, విశాఖపట్నంలోని పరిశ్రమలకు పోలవరం ద్వారా నీరందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పారిశ్రామిక పార్కులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారుల అభివృద్ధి, ఉమ్మడి మురుగునీటి శుద్ధి వంటి ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. -
ఐటీ పార్కులు.. పారిశ్రామిక వాడలు!
⇒ జిల్లాలో 38 ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు ⇒ టీఐఐసీ బృహత్తర ప్రణాళిక ⇒ గుర్తించిన 9,166 ఎకరాలు బదలాయించాలి ⇒ పెండింగ్ ప్రతిపాదనలు తక్షణమే పరిష్కరించాలి ⇒ భూ నిధిని అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి టీఐఐసీ లేఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐటీ కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, ఫార్మాసిటీలు.. ఇవన్నీ మన జిల్లాలో కొలువుదీరనున్నాయి. తెలంగాణకు తలమానికంగా జిల్లా నిలిచేలా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఐఐసీ) బృహత్తర ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో 38 పారిశ్రామిక పార్కులు (ఐపీ) ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన టీఐఐసీ.. భూముల అప్పగించాలని రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి పెంచింది. ఇప్పటికే గుర్తించిన 9,166 ఎకరాలను తక్షణమే బదలాయించాలని ఆ సంస్థ కోరుతోంది. దీంట్లో కూడా చాలావరకు సర్కారు భూములనే టీఐసీసీకి కేటాయించినప్పటికీ, కొన్నిచోట్ల అసైన్డ్‌దారులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, పరిహారం ఎక్కువగా ఇవ్వాలనే డిమాండ్‌తో భూ బదలాయింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మరికొన్ని చోట్ల పట్టా భూములను సేకరించడం రెవెన్యూ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి వెల్లువలా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్న కేసీఆర్ సర్కారు.. సాధ్యమైనంత త్వరగా ల్యాండ్ బ్యాంక్(భూనిధి)లను అందుబాటులో ఉంచుకోవాలని టీఐఐసీని ఆదేశించింది. దీంతో భూముల వేటను కొనసాగిస్తున్న ఆ సంస్థ.. బదలాయించకుండా పెండింగ్‌లో పెట్టిన భూములనూ తమకు అప్పగించాలంటూ జిల్లా యంత్రాంగానికి లేఖలు రాస్తోంది. గతంలో ప్రతిపాదించిన హార్డ్‌వేర్, రైస్హాబ్, బీడీఎల్ సంస్థ, ఏరో స్పేస్ జోన్ సహా తాజాగా ఫార్మాసిటీ, ఏరో పార్కు, హార్డ్‌వేర్ విస్తరణకు అదనంగా భూములు కావాలని నివేదించింది. దీంతో నిర్దేశిత భూములను అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిర్వాసితుల నుంచి రైస్‌హబ్‌కు వ్యతిరేకత ⇒ మహేశ్వరం మండలం కొంగర కలాన్‌లో ప్రకటించిన రైస్‌హబ్‌కు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్ధారించిన పరిహారంచాలదని, ఎకరాకు రూ.6.50 లక్షలు ఇస్తేనే భూములిస్తామని ఆక్రమణదారులు భీష్మించడంతో రైస్‌హబ్ పనులు నిలిచి పోయాయి. 146 మంది మిల్లర్లు ఇక్కడ రైస్‌మిల్లులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినా అప్రోచ్ రోడ్డు లేకపోవడం ప్రాజెక్టు ఆగేందుకు కారణమైంది. ఇటువంటి బాలారిష్టాలను అధిగమిస్తేగానీ పెట్టుబడులకు మార్గం సుగమంకాదని టీఐసీసీ వాదిస్తోంది. ⇒ తెలంగాణ సర్కారు కొలువుదీరిన తర్వాత తొలిసారి ప్రకటించిన ‘ఫార్మాసిటీ’కి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఔషధనగరిని నిర్మిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినా.. ఇప్పటికే టీఐఐసీకి భూ బదలాయింపు జరగకపోవడం గమనార్హం. ము చ్చర్ల, తాడిపర్తి, కుర్మిద్ద, ముద్విన్, కడ్తాల్ గ్రామాల్లోని 11,000 ఎకరాలను తక్షణమే ఫీల్డ్ సర్వే చేయాలని, అటవీశాఖ భూమిని డీనోటి ఫై చేయాలని కోరినా స్పందన రావడంలేదని టీఐఐసీ వాపోతుంది. ⇒ సరూర్‌నగర్ మండలం నాదర్గుల్ సర్వే నం.519,523లలో ఏరోస్పేస్ జోన్‌ను విస్తరించాలనుకున్నారు. ఇదే రెవెన్యూ పరిధిలోని సర్వే నం.520,521లలో హార్డ్‌వేర్ పార్కు విస్తరణకు అడ్డంకిగా మారిన పట్టాభూముల వివాదాన్ని త్వరగా తేల్చాలి. పారిశ్రామిక ‘పట్నం’ టీసీఎస్, కాగ్నిజెంట్ తదితర సంస్థలతో ఐటీ హబ్‌గా రూపాంతరం చెందుతున్న ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి మరిన్ని పార్కులు తరలిరానున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్టు అదనంగా ఏరోస్పేస్ జోన్, హార్డ్‌వేర్ పార్కుల విస్తరణ, ఏరో పార్కులు ఈ ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయి. వాటిలో కొన్ని... ⇒ మంచాల మండలం ఖానాపూర్ సర్వేనం.79లో 421 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క రానుంది. ⇒ ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ సర్వే నం.45లో 176.28 ఎకరాలు పోచారంలోని సర్వేనం.255లో 92.28 ఎకరాల్లో పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ⇒ ఎలిమినేడు, కప్పపహాడ్లోని సర్వే నం.512,166,492,421లోని 572.15 ఎకరాలను పారిశ్రామిక వాడగా ప్రతిపాదించారు. ⇒ కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 1083.26 ఎకరాలను ప్లాస్టిక్సిటీగా అభివృద్ధి చేయనున్నారు. దీంట్లో 52.30 ఎకరాల మేర పట్టాభూములను రైతుల నుంచి సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
300 కోట్ల డాలర్ల కొనుగోలు ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్‌లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు కోసం చైనా కంపెనీలు 650 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. అంతేకాకుండా భారత కంపెనీలతో 300 కోట్ల డాలర్ల విలువైన కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల చైనా అధ్యక్షుడు ఝి జిన్‌పింగ్ భారత పర్యటనలో ఈ మేరకు ఒప్పందాలు జరగనున్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. వాణిజ్యం, ఆర్థిక వృద్ధి, ఫార్మా, తదితర రంగాల్లో 16 వరకూ ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఆటోమొబైల్ పారిశ్రామిక పార్క్‌ను, గుజరాత్లో విద్యుత్ ట్రాన్సిమిషన్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని చైనా ప్రతిపాది స్తోంది. ఈ పర్యటనలో భాగంగా సముద్ర ఆహారం, కాటన్ నూలు, పారిశ్రామిక ఉప్పు, పాలీప్రొపలీన్, కాపర్ కాధోడ్ తదితర వస్తువుల కొనుగోళ్ల కోసం భారత కంపెనీలు 12కు పైగా చైనా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. -
జిల్లాలో పారిశ్రామిక పార్కులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. జిల్లాలో పారిశ్రామిక పార్కులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్లతో పరిశ్రమల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు. జిల్లాలో 58,840 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేశామని, దీంట్లో 19,383 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు వివరించారు. అలాగే 16,365 ఎకరాలు కొండలు, గుట్టలతో మిళితమై ఉన్నట్లు సర్వేలో తేలిందని, మిగతా 23 వేల ఎకరాలు బిట్లు బిట్లుగా(తక్కువ విస్తీర్ణంలో) ఉందని తెలిపారు. కుల్కచర్ల, నవాబ్‌పేట, మోమిన్‌పేట, బషీరాబాద్, మర్పల్లి, తాండూరు, వికారాబాద్, యాచారం మండలాల్లో సగటున వేయి ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణ్, పరిశ్రమల శాఖ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌లో చైనా పారిశ్రామిక పార్కులు
అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాలు వాణిజ్య లోటు భర్తీ దిశగా చర్యలు బీజింగ్: భారత్‌లో చైనా సంస్థలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. అలాగే, బ్రహ్మపుత్ర నది వరదల గణాంకాలను ఇచ్చిపుచ్చుకునేందుకు, పాలన సంబంధ అంశాలపై ఇరుదేశాల అధికారులు తరచూ చర్చించుకునేందుకు మరో రెండు ఒప్పందాలు కుదిరాయి. పంచశీల్ 60వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు చైనా పర్యటనకు వచ్చిన భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, చైనా ఉపాధ్యక్షుడు లి యువాన్చావోల సమక్షంలో సోమవారం ఈ ఒప్పందాలు కుదిరాయి. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల సహకారం, రెండు దేశాల వాణిజ్య సంస్థల మధ్య సహకారం పెంపొందించడాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. రెండు పొరుగు దేశాలు ఏక కాలంలో శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతుండటం చాలా అరుదుగా జరుగుతుందని అన్సారీ పేర్కొన్నారు. భారత్, చైనాల మధ్య వాణిజ్య లోటు ఏకంగా 35 బిలియన్ డాలర్ల మేర ఉంటున్న నేపథ్యంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటు అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గతేడాది 65.47 బిలియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుతం భారత్‌లో చైనా పెట్టుబడులు 1.1 బిలియన్ డాలర్ల మేర మాత్రమే ఉన్నాయి. వాణిజ్య లోటును తగ్గించేందుకు, భారత్‌లో చైనా పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు ప్రతిపాదిత పారిశ్రామిక పార్కులు దోహదపడగలవు. ఇరు దేశాల్లోనూ పెట్టుబడుల విషయంలో పరస్పర సహకారం అందించుకోవడానికి ఈ ఎంవోయూ ఉపయోగపడగలదు. ఈ ఒప్పందం విషయంలో అన్సారీ వెంట వచ్చిన భారత ప్రతినిధి బృందంలోని వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, చైనా వాణిజ్యమంత్రి గావో హుచెంగ్తో సమావేశమయ్యారు. వాణిజ్య లోటుతో పాటు వజ్రాభరణాలు, ఫార్మా, ఐటీ తదితర భారత ఉత్పత్తుల విక్రయానికి చైనా మార్కెట్లో అవకాశాలు కల్పించడం తదితర అంశాల గురించి ఇందులో చర్చించినట్లు ఆమె తెలిపారు. చైనాకు ఎగుమతి చేస్తున్న వాటికన్నా ఎక్కువగా భారత్ దిగుమతి చేసుకుంటోందని నిర్మల వివరించారు. భారత్‌లో చైనా పెట్టుబడులు పెరిగితే ఈ అసమానతలు కొంత మేర అయినా తగ్గగలవని ఆమె పేర్కొన్నారు. తయారీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే వంటి అనేక రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు చైనా కంపెనీలకు అపార అవకాశాలు ఉన్నాయని నిర్మల తెలిపారు. కేంద్రంలో కొత్తగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సమావేశం కావడం ఇదే ప్రథమం. అటు, బ్రహ్మపుత్ర నది వరదలకు సంబంధించిన ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా చైనా.. మే 15 నుంచి అక్టోబర్ 15 దాకా సంబంధింత డేటాను భారత్‌కు అందించనుంది. వరదలను అంచనా వేసేందుకు ఇది భారత్‌కు ఎంతగానో తోడ్పాటును అందించనుంది. దీనికోసం చైనా వైపున ఉన్న హైడ్రోలాజికల్ సెంటర్ల మెయింటెనెన్స్‌కి అయ్యే వ్యయాలను భారత ప్రభుత్వం భరిస్తుంది. ఇక, మూడో ఒప్పందం కింద.. రెండు దేశాల ప్రభుత్వ పాలనా యంత్రాంగం అధికారులు పాలన సంబంధిత విధానాల గురించి చర్చించుకుంటారు. భారత్-చైనా సాంస్కృతిక సంబంధాల ఎన్సైక్లోపీడియా ఆవిష్కరణ దాదాపు రెండు వేల ఏళ్ల కాలం నుంచీ గల సాంస్కృతిక సంబంధాలపై తొలి ఎన్సైక్లోపీడియాను భారత్-చైనా ఆవిష్కరించాయి. రెండు దేశాల పరిశోధకులు దీన్ని సంయుక్తంగా రూపొందించారు. ఏడో దశాబ్దంలో చైనా పరిశోధకుడు హ్యుయన్ సాంక్ భారత్‌లో పర్యటించి బౌద్ధ గ్రంధాలను చైనాకు తీసుకెళ్లిన కాలం నుంచి ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల సర్వస్వంగా ఈ ఎన్సైక్లోపీడియాను రూపొందించడం జరిగింది. వాణిజ్య, దౌత్య సంబంధాల వివరాలను కూడా ఇందులో పొందుపర్చారు. ఇంగ్లిష్ చైనీస్ భాషల్లో ప్రచురించిన ఈ పుస్తకాలను అన్సారీ, యువాన్ చావోలు సంయుక్తంగా ఆవిష్కరించారు.