సీఐఐ సదస్సులో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలతో పాటు, రాయితీలు అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. అత్యధిక ఉద్యోగాలు కల్పించడానికి అనువుగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈలను) కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో భట్టి మాట్లాడారు.
డెయిరీ అభివృద్ధికి అవకాశాలు
రాష్ట్రంలో పాల ఉత్పత్తికి, వినియోగానికి మధ్య వ్యత్యాసం అధికంగా ఉందని, అందువల్ల పాడి పరిశ్రమ అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. స్వచ్ఛమైన పాలను ప్రజలకు అందించేలా డెయిరీ ఇండస్ట్రీని ఏర్పాటు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గోదావరి, కృష్ణా నదులను మూసీకి అనుసంధానం చేసి మూసీలో స్వచ్ఛమైన నీరు పారే విధంగా ప్రక్షాళన చేయబోతున్నట్లు తెలిపారు.
నది పరివాహక ప్రాంతంలో ఫ్లై ఓవర్లు, చెక్ డ్యామ్, చిల్డ్రన్ పార్క్, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లు, బోటింగ్ తదితర అభివృద్ధి పనులు పీపీపీ విధానంలో చేపడతామని వివరించారు. నగర శివార్లలో ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. టెక్స్‌టైల్, గ్రానైట్, ఐటీ సెక్టార్, మైన్ తదితర క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటివరకు 18.50 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నట్లు భట్టి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment