
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు)లో మన రాష్ట్రం ఏడు రంగాల్లో మంచి ప్రతిభ చూపింది. ఆయా రంగాలకు పారిశ్రామిక పార్కులు, సెజ్‌లు చేసిన భూకేటాయింపులకు సంబంధించి రసాయనాలు, ఫార్మా, లోహాలు, నిర్మాణ రంగం, ఇంజనీరింగ్, లెదర్, జెమ్స్–జ్యుయెలరీ రంగాల్లో మొదటి మూడు స్థానాలను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్ల పనితీరును అంచనా వేస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇండస్ట్రియల్ పార్క్ రేటింగ్–2 సర్వే నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సర్వేకు ఈ ఏడాది ఆగస్టు నాటి వరకు ఉన్న డేటాను తీసుకున్నారు. తాజాగా ఈ సర్వే నివేదికను కేంద్రం విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఓవరాల్ ర్యాంకుల కోసం 449 పార్కులు/సెజ్‌లు పోటీపడ్డాయి. వ్యక్తిగత విభాగంలో 1,614 పార్కులు పోటీలో నిలిచాయి. మన రాష్ట్రం నుంచి 18 పారిశ్రామిక పార్కులు, 14 సెజ్‌లు ఈ ర్యాంకుల కోసం పోటీపడ్డాయి. గుజరాత్ అత్యధికంగా 28 పారిశ్రామిక పార్కులు, 8 సెజ్‌లతో మొదటి స్థానంలో నిలవగా, మహారాష్ట్ర 30 పారిశ్రామిక పార్కులు, 4 సెజ్‌లతో రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 18 పారిశ్రామిక పార్కులు, 14 సెజ్‌లతో మూడో స్థానంలో నిలిచింది. అదే సెజ్‌లు పరంగా చూస్తే 14 సెజ్‌లతో ఏపీ మొదటి స్థానం దక్కించుకుంది.
ఈ ఏడు రంగాలే కీలకం..
దేశవ్యాప్తంగా అన్ని సెజ్‌ల్లో ఆయా రాష్ట్రాలు ఏ రంగానికి చెందిన పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తే ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా ఉన్న సెజ్‌లతో పోలిస్తే మన రాష్ట్రం ఏడు రంగాలకు చెందిన పరిశ్రమలకు పెద్దపీట వేస్తూ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. రసాయనాలు, ఫార్మా రంగాలకు అత్యధిక భూములు కేటాయించడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ రెండు రంగాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. భూ కేటాయింపుల్లో లోహాలు, నిర్మాణ రంగాలు రెండో స్థానంలో నిలిస్తే, ఇంజనీరింగ్, లెదర్, జెమ్స్–జ్యుయెలరీ రంగాలు మూడో స్థానంలో నిలిచింది.
సెజ్‌లు, పారిశ్రామిక పార్కులు ఆయా రంగాలకు కేటాయించిన భూముల వివరాలు..
రసాయనాలు
రసాయనాల రంగానికి చెందిన పెట్టుబడులను ఆకర్షించడంలోరాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఈ రంగానికి చెందిన పార్కులు/సెజ్‌లు మొత్తం 118 పోటీ పడ్డాయి. ఇవన్నీ కలిపి 6,258.76 హెక్టార్ల భూమిని రసాయనాల రంగానికి కేటాయించాయి. ఇందులో 2,248.77 హెక్టార్ల (35.93 శాతం) భూమిని కేటాయించడం ద్వారా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్ (24.62 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (14.20 శాతం) స్థానాలను దక్కించుకున్నాయి.
ఫార్మాస్యూటికల్స్
ఫార్మాస్యూటికల్స్ విభాగంలో కూడా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ రంగంలో మొత్తం 41 పార్కులు/సెజ్‌లు పోటీ పడ్డాయి. ఇవన్నీ కలిసి ఫార్మా రంగానికి 1,871.40 హెక్టార్ల భూమిని కేటాయించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఫార్మారంగానికి 623.73 హెక్టార్లు (33.33 శాతం) భూమిని కేటాయించడం ద్వారా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో తెలంగాణ (22.76 %), కర్ణాటక (15.90 %) ఉన్నాయి.
లోహాలు
లోహాల రంగంలో దేశవ్యాప్తంగా మొత్తం 156 పార్కులు/సెజ్‌లు పోటీపడ్డాయి. ఇవన్నీ కలిసి 42,339.18 హెక్టార్ల భూమిని కేటాయించాయి. ఇందులో 55.40 శాతం వాటాతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. 24.66 శాతంతో ఏపీ రెండో స్థానం, 14.07 శాతంతో తమిళనాడు మూడో స్థానం దక్కించుకున్నాయి.
నిర్మాణ రంగం
నిర్మాణ రంగానికి సంబంధించి మొత్తం 8 పారిశ్రామిక పార్కులు మాత్రమే పోటీపడ్డాయి. ఈ 8 పార్కులు నిర్మాణ రంగానికి 366.69 హెక్టార్లు కేటాయించాయి. ఇందులో 36.92 శాతంతో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఏపీ 36.40 శాతం, మధ్యప్రదేశ్ 23.18 శాతంతో నిలిచాయి.
జెమ్స్ అండ్ జ్యుయెలరీ
ఈ రంగంలో మొత్తం తొమ్మిది పార్కులు పోటీ పడ్డాయి. మొత్తం 129.06 హెక్టార్లలో రాజస్థాన్ 63.57%, గుజరాత్ 23.22%, ఏపీ 13.20% చొప్పున భూములు కేటాయించాయి.
లెదర్
లెదర్ పరిశ్రమకు సంబంధించి 10 పార్కులు పోటీపడ్డాయి. ఈ 10 కలిపి 1,685.23 హెక్టార్ల భూమిని కేటాయించాయి. ఇందులో హరియాణా 57.97 శాతం, తమిళనాడు 30.08 శాతం, ఏపీ 7.89 శాతం చొప్పున భూములు ఇచ్చాయి.
ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ రంగంలో అత్యధికంగా 529 పార్కులు/సెజ్‌లు పోటీపడ్డాయి. ఈ రంగానికి 26,725.93 హెక్టార్ల భూమిని కేటాయించగా.. ఇందులో ఒక్క కర్ణాటక రాష్ట్రమే 80.53 శాతం భూమిని కేటాయించింది. తమిళనాడు 5.22 శాతం, ఆంధ్రప్రదేశ్ 5.05 శాతం భూమిని కేటాయించాయి.
Comments
Please login to add a commentAdd a comment