పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్ రంజన్ స్పష్టం చేశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెట్టుబడులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐఐసీ) మేనేజింగ్ డెరైక్టర్ జయేశ్ రంజన్ స్పష్టం చేశారు. జిల్లాలో పారిశ్రామిక పార్కులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్లతో పరిశ్రమల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్పులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు. జిల్లాలో 58,840 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేశామని, దీంట్లో 19,383 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావు వివరించారు.
అలాగే 16,365 ఎకరాలు కొండలు, గుట్టలతో మిళితమై ఉన్నట్లు సర్వేలో తేలిందని, మిగతా 23 వేల ఎకరాలు బిట్లు బిట్లుగా(తక్కువ విస్తీర్ణంలో) ఉందని తెలిపారు. కుల్కచర్ల, నవాబ్‌పేట, మోమిన్‌పేట, బషీరాబాద్, మర్పల్లి, తాండూరు, వికారాబాద్, యాచారం మండలాల్లో సగటున వేయి ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించామని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణ్, పరిశ్రమల శాఖ మేనేజర్ ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.