solar plants
-
ఆర్సెడో సిస్టమ్స్‌తో సైయంట్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్ సొల్యూషన్స్ అందించే ఆర్సెడో సిస్టమ్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు సైయంట్ డీఎల్ఎం వెల్లడించింది. దీని ప్రకారం, సైయంట్ డీఎల్ఎంకి చెందిన మైసూర్ యూనిట్లో ఆర్సెడో 500 కేడబ్ల్యూపీ సామర్ద్యం గల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది.ప్లాంటు డిజైన్, ఇంజినీరింగ్, ఇన్స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలు తీసుకుంటుంది. దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ఉంటుంది. ఇందులో ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను సైయంట్ డీఎల్ఎం కొనుగోలు చేస్తుంది. విద్యుత్ వ్యయాలను గణనీయంగా తగ్గించుకునేందుకు, పర్యావరణ అనుకూల విధానాల వినియోగాన్ని పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుందని సైయంట్ డీఎల్ఎం సీఈవో ఆంథోనీ మోంటల్బానో, ఆర్సెడో సిస్టమ్స్ సీఈవో సందీప్ వంగపల్లి తెలిపారు. -
రైతుల పొలాల్లో సోలార్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పంట పొలాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్) పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజుల పాటు సౌరవిద్యుత్ ఉత్పాదనకు అనుకూలత ఉంది. చిన్న చిన్న ప్లాంట్లతో.. పీఎం కుసుమ్ పథకం కింద 2026 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 30,800 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంట్లను రైతుల పంట పొలాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పొలాల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నా.. రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది.త్వరలో సబ్స్టేషన్ల వారీగా నోటిఫికేషన్ రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్ల వారీగా ఎంత స్థాపిత సామర్థ్యంతో కొత్త సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయో వెల్లడిస్తూ త్వరలో డిస్కంలు నోటిఫికేషన్ ఇస్తాయి. ఆయా సామర్థ్యం మేరకు సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు రైతుల నుంచి రెడ్కో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతులు వ్యక్తిగతంగా, సంఘాలుగా, సహకార సంఘాలుగా ఏర్పడి వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మహిళా గ్రూపులకు ప్రాధాన్యత స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), మండల సమాఖ్యలు కూడా రైతుల నుంచి పొలాలను లీజుకు తీసుకుని సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. ప్లాంట్ల మంజూరులో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవకాశమిచ్చి సంఘాల మహిళలను కోటీశ్వరులు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలు రైతు కుటుంబాల వారేకావడంతో.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు రైతుల చేతుల్లోనే ఉండనుంది. ఎస్‌హెచ్‌జీలకు పావలా వడ్డీకే రుణాలు లభిస్తాయి. ఒక మెగావాట్ ప్లాంట్ నుంచి ఏడాదికి సగటున 15 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అంటే సుమారు రూ.45 లక్షల ఆదాయం వస్తుంది. మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆరు ఎకరాల స్థలం, రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ మేరకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి. కరెంటు కొననున్న డిస్కంలు రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తాయి. ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 ధరను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇప్పటికే ఖరారు చేసింది. సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించవచ్చు. డిస్కంలు ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి సగటున యూనిట్‌కు రూ.2.58 ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. రైతులకు మాత్రం కాస్త ఎక్కువగా యూనిట్‌కు రూ.3.13 ధర చెల్లించనున్నాయి. -
నీటిపై తేలాడే సోలార్ వెలుగులు.. దేశంలోని ప్రాజెక్ట్‌లు ఇవే..
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి దేశంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో సిద్ధం చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌కు ఇటీవల ప్రధాన నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.800 కోట్లతో 176 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఇందులో 56 మెగావాట్లు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ద్వారా, మరో 120 మెగావాట్ల పవర్‌ను గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ద్వారా సమకూర్చాలని ప్రతిపాదించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్ట్ పొందింది.ఇదీ చదవండి: ‘పర్యావరణం కోసం వాటికి నేను దూరం’గ్రౌండ్మౌంట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సాధారణంగా అధిక విస్తీర్ణంలో భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. అదే నీటిపై తేలాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఈ ఇబ్బంది ఉండదు. రెండింటిలో ఏ ప్లాంటైనా మౌలిక సదుపాయాల ఖర్చు ఎలాగూ ఉంటుంది. దాంతో తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్‌లకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ రామగుండం: స్థాపిత సామర్థ్యం-100 మెగావాట్లు, ఇది 500 ఎకరాల్లో విస్తరించి ఉంది.ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కాయంకులం: స్థాపిత సామర్థ్యం-92 మెగావాట్లు. కేరళలో ఉన్న ఈ ప్రాజెక్ట్ 450 ఎకరాల సరస్సుపై ఏర్పాటు చేశారు.రిహాండ్ డ్యామ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్: స్థాపిత సామర్థ్యం-50 మెగావాట్లు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.సింహాద్రి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్: దీని స్థాపిత సామర్థ్యం-25 మెగావాట్లు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 ఏకరాల్లో ఇది విస్తరించి ఉంది.ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్: దీని అంచనా సామర్థ్యం-600 మెగావాట్లు. మధ్యప్రదేశ్‌లో దీని ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
రాజస్తాన్‌లో సింగరేణి సోలార్ ప్లాంట్
గోదావరిఖని (రామగుండం): రాజస్తాన్‌లో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సన్నా హాలు చేస్తోంది. ఈ మేరకు సంస్థ సీఎండీ ఎన్.బలరాం గురువారం రాజస్తాన్ రాజధా ని జైపూర్‌లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్‌కో సీఎండీ అలోక్‌ను కలిశారు. సింగరేణి ఆధ్వర్యంలో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే రాజస్తాన్ ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని అలోక్ తెలిపినట్లు వెల్లడించారు. అనంతరం రాజస్తాన్ జెన్కో సీఎండీ దేవేంద్రశ్రింగి, రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నథ్‌మల్, డిస్కమ్స్ చైర్మన్ భానుప్రకాశ్ ఏటూరును కలిసి ప్లాంట్ ఏర్పాటు, తర్వాత విద్యుత్ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నట్లు సంస్థ చైర్మన్ బలరాం.. రాజస్తాన్ ఉన్నతాధికారులకు వివరించారు. సోలార్ పార్కులో సింగరేణి ప్లాంట్‌కు అనుకూలమైన స్థలాన్ని పరిశీలించిన తర్వాత పూర్తి ప్రతిపాదనలతో మరోసారి సమావేశం అవుతామని బలరాం తెలిపారు. సీఎండీ వెంట డైరెక్టర్ సత్యనారాయణరావు, సోలా ర్ ఎనర్జీ జీఎం జానకీరాం, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు ఉన్నారు. -
నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్
మనదేశంలోని పలు ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లు కనిపిస్తాయి. వీటిని ఇంటి పైకప్పులపైన, మైదాన ప్రాంతాల్లో చూడవచ్చు. అయితే నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్‌ను ఎప్పుడైనా చూశారా? త్వరలో నీటిపై తేలియాడే 15 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్‌ను మనం చూడబోతున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో గల భిలాయిలో సెయిల్ భిలాయి స్టీల్ ప్లాంట్ తాజాగా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్టును చేపట్టింది. దీనిలో భాగంగా ముందుగా 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధిత అధికారులు మరోదా-1 జలాశయంలో శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు.ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటవుతున్న తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్. కర్బన ఉద్గారాలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను చేపడుతోంది. ఈ ప్లాంట్ ఏడాదికి 34.26 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నదనే అంచనాలున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టు కారణంగా ఏటా 28,330 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నాయి. -
సోలార్‌ప్యానెల్స్ పెట్టుకుంటేనే...గ్రేటర్లో ఇళ్లకు అనుమతి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్లపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటేనే ఇంటి అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకోనుంది. సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతీ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలనే కచ్చితమైన నిబంధన తీసుకురావాలనుకుంటోంది. తద్వారా నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న విద్యుత్ అవసరాలను స్థానికంగానే ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గ్రామాలను కూడా సోలార్ ఎనర్జీ హబ్‌లుగా మార్చాలని భావిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ నాలుగైదు ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే సబ్స్టేషన్లకు వీటిని అనుసంధానిస్తారు. తద్వారా ఆ గ్రామాలకు విద్యుత్ సమస్య ఎదురుకాకుండా చూడాలన్న అభిప్రాయానికి వచ్చారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రోడ్‌మ్యాప్ రూపొందించారు. ఎన్నికల తర్వాత ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనూ పూర్తిస్థాయిలో చర్చించిన అనంతరం మంత్రివర్గంలో ఈ కీలక నిర్ణయం తీసుకొని అమలు చేయాలని భావిస్తున్నారు. విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. సోలార్ ఎనర్జీనే ప్రధానం అన్న అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం థర్మల్, హైడల్ జనరేషన్తోపాటు సౌర, పవనవిద్యుత్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. హైడల్ పవర్ అందుబాటులో లేని సమయంలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు బయట నుంచి ఎక్కువ మొత్తానికి విద్యుత్ కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లలోనూ..: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లోనూ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పాదనతోపాటు, నీరు ఆవిరవ డాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నీరు వెళ్లే కాలువ గట్లపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల వేలాది మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లంపల్లి రిజర్వాయర్‌లో ఇప్పటికే సింగరేణి సంస్థ ఫ్లోటింగ్ సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో బొగ్గు తవ్విన తర్వాత ఆ ప్రాంతాలనూ ఈ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రీనర్ ఎనర్జీకి స్కాండినేవియన్ దేశాలు అధిక ప్రా ధాన్యం ఇస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ఆ మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, బొగ్గు ధరలు ఏటేటా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ ధర పెరుగుతూ వస్తోంది. ఇది ప్రభుత్వంపైనే కాకుండా వినియోగదారులకు మోయలేని భారంగా మారుతున్న తరుణంలో సోలార్ పవర్‌ను ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చింది. థర్మల్ కేంద్రాలతో భారీగా వెలువడే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి వీలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రంలో జలాశయాలపై సోలార్‌ప్లాంట్లు..? ఎక్కడో తెలుసా..
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తెలిపారు. ఇటీవల సింగరేణి భవన్లో విద్యుత్ విభాగానికి చెందిన సంస్థ ఎలక్ట్రికల్ మెకానికల్ శాఖ డైరెక్టర్ డి.సత్యనారాయణ రావుతోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భారీ జలాశయాలపై సౌర ఫలకల ఏర్పాటుతో విద్యుదుత్పత్తి పెంపునకు కృషి చేయాలని ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోయర్ మానేరు డ్యాం నీటిపై 300 మెగావాట్లు, మల్లన్న సాగర్ నీటిపై 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎండీ ఆదేశించారు. అయితే లోయర్ మానేరు డ్యాంపై 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మల్లన్న సాగర్ జలాశయంపైనా రెండు 250 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటుకు డీపీఆర్‌ను వెంటనే రూపొందించాలని అధికారులకు సీఎండీ సూచించారు. మరోవైపు రాజస్థాన్‌లో సింగరేణి ఏర్పాటు చేయాలనే యోచనలో భాగంగా 500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై కూడా అధికారులతో చర్చించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తిచేసి నిర్మాణం మొదలుపెట్టాలన్నారు. ఇదీ చదవండి: విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే.. మరోవైపు వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పవన విద్యుదుత్పత్తి కేంద్రాలకు అనువైన ప్రాంతాలను సందర్శించాలని, దీనికి సంబంధించి ఒక నివేదికనూ రూపొందించాలని అధికారులను సంస్థ సీఎండీ బలరాం ఆదేశించారు. -
ఫ్రీ కరెంట్ కావాలంటే ఇలా చేయండి.. డబ్బులు కూడా ఇస్తారు!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం 'పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజన'కు ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేయడానికి గరిష్ఠంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. ఈ కొత్త స్కీమ్ ద్వారా ప్రజలు నెలకు 300 యూనిట్ల కరెంటును ఉచితంగానే పొందవచ్చు. కేంద్రం ఈ కొత్త పధకం కోసం ఏకంగా రూ.75000 కోట్లు వెచ్చిస్తోంది. సబ్సిడీ వివరాలు కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రీ విద్యుత్ పథకాన్ని పలు విధాలుగా విభజించి సబ్సిడీ అందిస్తోంది. దీని కింద ఒక కిలోవాట్ సిస్టమ్‌కు రూ. 30000, రెండు కిలోవాట్ల సిస్టమ్‌కు రూ. 60000, మూడు కిలోవాట్ల సిస్టమ్‌కు ఏకంగా రూ.78000 సబ్సిడీ అందిస్తోంది. రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి సుమారు రూ.1.45 ఖర్చు అవుతుంది. ఇందులో సగం వరకు రాయితీ లభిస్తుంది. రాయితీ కాకుండా మిగిలిన డబ్బు కూడా బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే అందిస్తాయి. ఉదాహరణకు 3 కిలోవాట్ సిస్టమ్‌కు రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవడానికి రూ.1.45 ఖర్చు అయిందనుకున్నప్పుడు, అందులో రూ. 78000 రాయితీ లభిస్తుంది. కాబట్టి మిగిలిన రూ. 67000 కూడా బ్యాంకు నుంచి తక్కువ వడ్డీకే పొందవచ్చు. నెలకు 50 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 1 కిలోవాట్ నుంచి 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే 150 యూనిట్ల నుంచి 300 యూనిట్లను ఉపయోగించుకునే వారికి 2 కిలోవాట్స్ నుంచి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిం రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పీఎం సూర్య ఘర్ - ముఫ్త్ బిజిలీ యోజనకు అప్లై చేసుకునే విధానం 👉స్టెప్-1 అధికారిక వెబ్సైట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి. మీ రాష్ట్రం, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎంచుకోండి. ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్ (వినియోగదారు) నెంబర్, మొబైల్ నెంబర్ & ఈ-మెయిల్ వంటి వాటిని ఎంటర్ చేయండి. 👉స్టెప్-2 వినియోగదారు నంబర్ & మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఫామ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోండి. 👉స్టెప్-3 డిస్కమ్ నుంచి అనుమతి వచ్చిన తరువాత, రిజిస్టర్డ్ విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. 👉స్టెప్-4 ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోండి. 👉స్టెప్-5 నెట్ మీటర్‌ను ఇన్స్టాల్ చేసిన తర్వాత, డిస్కమ్ అధికారులు చెక్ చేసి, తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. 👉స్టెప్-6 కమిషనింగ్ సర్టిఫికెట్ పొందిన తరువాత బ్యాంక్ వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన 30 రోజుల లోపల సబ్సడీ అమౌట్ మీ అకౌంట్లోకి జమ అవుతుంది. -
సౌర వెలుగుల దిశగా సింగరేణి
సాక్షి, హైదరాబాద్/ సింగరేణి(కొత్తగూడెం): దేశ వ్యాప్తంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పడానికి సింగరేణి సంస్థ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తితోపాటు ఇప్పటికే థర్మల్ విద్యుత్కేంద్రాలు, సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి ఇతర రాష్ట్రాల్లో సౌర ఇంధన ప్రాజెక్టులు చేపట్టాలని సంస్థ సీఎండీ ఎన్.బలరాం అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజస్తాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో సౌర ఇంధ న రంగంలో వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టడానికి అధ్య యనం చేయాలని, వీలైతే సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు (జాయింట్ వెంచర్)లు చేపట్టాలని ఆదే శించారు. దీనిపై త్వరలోనే అధికారుల బృందం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలన్నారు. ఈ ఏడాది సింగరేణిలో ప్రారంభించే నాలుగు కొత్త గనులతో పా టు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మరికొన్ని బొగ్గు బ్లాకుల సాధనకు కృషి చేస్తామని బలరామ్ తెలి పారు. ఒడిశాలో చేపట్టిన నైనీ బ్లాక్ చివరి దశ అను మతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసర మని చెప్పారు. ఈ విషయంలో ఒడిశా ముఖ్యమంత్రితో చర్చించేందుకు డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఈనెల మూడో వారంలో భువనేశ్వర్ వెళ్లనున్నట్లు తెలి పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారు లను ఆదేశించారు. మొదటి దశలో సింగరేణి నిర్దే శించుకున్న 300 మెగావాట్ల సౌర ఇంధన ప్లాంట్లలో ఇంకా పూర్తి చేయాల్సిన 76 మెగావాట్ల ప్లాంట్లను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సోలార్ ప్రాజెక్టులకు పూర్తి సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జలాశయాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు కాలువలపైనా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రెండో దశలో 232 మెగావాట్ల ప్లాంట్లను చేపడు తున్నట్లు డైరెక్టర్ (ఈఅండ్ఎం) డి.సత్యనారా యణరావు వివరించగా.. ఇందుకు అవసరమైన టెండర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బలరామ్ సూచించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలిగితే సంస్థ విద్యుత్ అవసరాలను సోలార్ ప్లాంట్ల ద్వారానే తీర్చుకోగలుగుతామని.. తద్వారా తొలి జీరో ఎనర్జీ బొగ్గు కంపెనీగా గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సీఎండీ సూచించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు. -
సౌర గ్రామాలు పెరిగేనా?
దేశంలోనే తొలిసారిగా సంపూర్ణమైన సోలార్ గ్రామంగా గుజరాత్‌లోని మొడేరా గ్రామాన్ని తీర్చిదిద్దడానికి పోయిన ఏడాది కార్యాచరణ మొదలైంది. అభివృద్ధి, పరిణామాలపై సమీక్ష జరగాల్సివుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 24×7 అన్నట్లుగా అన్నివేళలా అంతటా సౌరశక్తి వెలుగాలన్నది లక్ష్యం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న కాలుష్యం, భయానకంగా మారుతున్న పర్యావరణం, ప్రబలుతున్న వింత వింత వ్యాధులు, అంతకంతకు పెరుగుతున్న విద్యుత్ ధరలు, తరిగిపోతున్న సహజవనరుల నడుమ సౌరశక్తిని సద్వినియోగం చేసుకొనే దిశగా వేసే ప్రతి అడుగూ ప్రశంసాపాత్రమే. దేశంలో సూర్యదేవాలయాలున్న అతి కొద్ది గ్రామాల్లో మొడేరా ఒకటి. సౌర దీప్తులు దేశంలోని ప్రతి గ్రామంలో విరగబూసినప్పుడే జాతి జ్యోతి మరింతగా వెలుగుతుంది. గుజరాత్ అభివృద్ధి నమూనాను అన్ని రాష్ట్రాలలో ప్రతిస్పందించేలా కేంద్రం కార్యాచరణ చేపట్టాలి. ప్రధాని సొంత రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలోనూ సౌర గ్రామాల సంఖ్య పెరగాలి. 2014లో మోదీని దేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్న కారణాలలో గుజరాత్ అభివృద్ధి కూడా ఒక ముఖ్యమైన అంశం. 2014, 2019లో వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఆయనకు ప్రజలు పట్టం కట్టారంటే ఆయనపై పెట్టుకున్న విశ్వాసం మరో ముఖ్య కారణం. దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయనపై నేడు మరింతగా వుంది. మరి కొన్ని నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోపు అనుకున్న అభివృద్ధిని సాధించి, ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల్లో భరోసా నింపడం కీలకం. ఈ తొమ్మిదేళ్లలో దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా బిజెపి వశమయ్యాయి. దానికి కారణాలు అనేకం ఉండవచ్చు, తమకు గెలుపునిచ్చిన ప్రజలు కూడా జీవితంలో గెలిచేట్లు, జీవనాలు వెలిగేట్లు చూడడం ఏలికల ముఖ్య బాధ్యత. చాలా వరకూ సహజవనరులను మనిషి తన ఆర్ధిక స్వార్థంతో మట్టుపెట్టాడు. అయినా ఇంకా ఎంతో అమూల్యమైన సహజ సంపద మన చుట్టూ వుంది. ప్రణాళికా బద్ధంగా దానిని సద్వినియోగం చేస్తే జాతి ప్రగతి వేగం ఎన్నోరెట్లు ఊపందుకుంటుంది. సహజ వనరులను సద్వినియోగం చేసుకొని పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం అత్యంత ముఖ్యం. ఇప్పటికీ విద్యుత్ సమస్యలు తీరడం లేదు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చినా, వర్షాలు పెరిగినా పల్లెలు చీకట్లోనే మగ్గుతున్నాయి. విద్యుత్ సంస్కరణలు జరగాలని నిపుణులు మొరపెట్టుకుంటున్నా అది అరణ్యరోదనగానే మిగులుతోంది. ఈ క్రమంలో సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటూ సౌరవిద్యుత్ వాడకం పెరిగితే ఖర్చులు కూడా అదుపులోకి వస్తాయి. వృధా డబ్బు ఆదా అవుతుంది. సౌర శక్తి వాడకంపై ఇంకా చాలినంత అవగాహన ప్రజల్లో రాలేదు. సూర్యరశ్మి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను సౌరవిద్యుత్ అంటారు. 1980దశకం నుంచే సౌర విద్యుత్ వినియోగంపై అడుగులు పడడం మొదలయ్యాయి. ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి.ఇందులో కర్ణాటకలోని పావగడ ప్రాంతం తలమానికంగా నిలుస్తోంది. మనిషి మొదలు అనేక జీవరాసులకు అందే శక్తిలో ఎక్కువ భాగం సూర్యుడిదే.ఈ శక్తి అపారమైంది. దీనిని ఇంకా ఎన్నో రెట్లు వాడుకోవాల్సివుంది. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయి. కాలుష్యం తగ్గిపోతుంది. పర్యావరణం పచ్చగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మనం ఒక సంవత్సరం పాటు ఉపయోగించే శక్తి కంటే ఒక గంటలో వెలువడే సౌరశక్తి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సోలార్ వస్తువుల ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉత్పత్తుల వినియోగం పట్ల ఎక్కువమంది శ్రద్ధ చూపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. సోలార్ కార్లు, బైకులు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. సౌరశక్తిని నిల్వవుంచే వ్యవస్థలు పెరగాలి. పారిశ్రామికవేత్తలను, శాస్త్రవేత్తలను, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజలను సౌరశక్తి వినియోగం దిశగా అనుసంధానం చేయడంలో కేంద్రం మరింతగా కదలాలి. ఉత్పాదకతకు ప్రోత్సాహకాలను పెంచాలి. గుజరాత్ లోని మొడేరా తరహా గ్రామాలను దేశంలో పెద్ద స్థాయిలో తయారు చెయ్యాలి.ముఖ్యంగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత ఆరోగ్యకరంగా సాగాలి. ప్రత్యక్ష నారాయణుడి ప్రభ దేశంలో ప్రకాశమాన మయ్యేలా గట్టి అడుగులు పడాలి -మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
కరెంట్ ఇచ్చే పార్కింగ్ షెడ్
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ–కలెక్టరేట్)లో మొదటగా ఖమ్మంలో సోలార్షెడ్ ఏర్పాటు చేశారు. ఐడీవోసీలో 38కిపైగా శాఖల ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తుండగా వారి వాహనాల పార్కింగ్‌కు ఎలాంటి సౌకర్యం లేదు. దీంతో అధికారులు సోలార్ ప్యానళ్లతో కూడిన పార్కింగ్ షెడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.1.78 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఇప్పటికే పూర్తికాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు. 200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఈ సోలార్ ప్యానళ్ల ద్వారా రోజుకు 800 నుంచి వెయ్యి యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. ఈ మొత్తాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేసి కలెక్టరేట్ అవసరాలు పోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లు చెల్లించనున్నారు. సోలార్ షెడ్‌తో నెలకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు విద్యుత్‌చార్జీలు ఆదా కావడమే కాక ఉద్యోగులకు చెందిన వందలాది వాహనాల పార్కింగ్‌కు సౌకర్యం కల్పించినట్లవుతోంది. సోలార్ ప్లాంట్‌తో ఐడీవోసీ భవనమంతా గ్రీన్ బిల్డింగ్‌గా మారనుంది. ఈవిధంగా రాష్ట్రంలోనే తొలి కలెక్టరేట్‌గా ఖమ్మం ఐడీవోసీ నిలుస్తోంది. -
ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్
-
జల నిధిలోనూ సౌర కాంతులు
సాక్షి, అమరావతి: భూమిపై మనం ఉపయోగిస్తున్న శక్తికి మూలాధారం సూర్యుడే. సూర్యుడంటే ఒక ఆదర్శ శక్తి జనకం. మూడు వేల సంవత్సరాల క్రితమే సూర్యుడి నుంచి విద్యుత్ పుట్టించవచ్చనే విషయాన్ని మానవుడు ఆవిష్కరించినట్టు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. విజ్ఞానం ఎప్పుడూ ఆవిష్కరణ చోటే ఆగిపోదు. అక్కడి నుంచి మరో కొత్త అన్వేషణ మొదలవుతూనే ఉంటుంది. అప్పటినుంచి సౌర శక్తిని ఒడిసి పట్టుకోవడానికి విశ్వవ్యాప్తంగా అనేక పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఆ యజ్ఞంలోంచి ఆవిర్భవించిన సరికొత్త సాంకేతికతే నీటిలో తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి 100 గిగావాట్ల విద్యుత్‌ను వీటి ద్వారా ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. విశాఖలో మొదలై.. విశాఖ జిల్లా ఎన్టీపీసీ సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 75 ఎకరాల్లోని నీటి వనరుల్లో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తొలుత ప్రారంభించింది. ప్రారంభించే నాటికి దేశంలోనే ఇదే అతిపెద్దది. ఇందులో లక్షకుపైగా ఉన్న సోలార్ పలకల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అదే విశాఖలో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్‌పై 2.41 మెగావాట్ల ప్లాంట్‌ను జీవీఎంసీ నెలకొల్పింది. ఆ తరువాత తెలంగాణలో రామగుండం వద్ద ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్‌లో ఎన్టీపీసీ ఇలాంటి ఓ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో 450 ఎకరాల మేర విస్తరించి ఉన్న సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులో 4.50 లక్షల సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లోనూ.. కేరళలోని కయంకుళం గ్యాస్ ప్లాంట్‌లో 92 మెగావాట్ల ఫ్లోటింగ్ యూనిట్ మొదలైంది. కేరళలోని కయంకుళం (100 కిలోవాట్లు), గుజరాత్‌లోని కవాస్ వద్ద ఒక మెగావాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాయి. మరికొన్ని చోట్ల ఈ తేలియాడే సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ (600 మెగావాట్ల) సౌర శక్తి ప్రాజెక్ట్ మనదేశంలో రాబోతోంది. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని నర్మదా నదిపై ఓంకారేశ్వర్ ఆనకట్ట వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2022–23లోనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఆనకట్టలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 2 వేల హెక్టార్ల నీటి ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అనేక ప్రయోజనాలు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఫ్లోటో–వోల్టాయిక్స్ అని కూడా పిలుస్తారు. వీటి ఏర్పాటుకు భూమి అవసరం లేదు. నీటిపైనే అమరుస్తారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇవి సంప్రదాయ సోలార్ ప్యానల్స్ కంటే ఖరీదైనవి. అయితే, ఫ్లోటింగ్ సోలార్ ఇన్న్టలేషన్ల పెట్టుబడిపై రాబడి కూడా నేలపై నిర్మించే (గ్రౌండ్ మౌంటెడ్) వాటి కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రాంతంలో విస్తరిస్తాయి. నిర్వహణ కూడా భారీగా ఉంటుంది. అయితే, తేలియాడే సోలార్ ప్యానల్స్ ఎక్కువగా తుప్పు పట్టవు. లోడ్ కెపాసిటీ, సుదీర్ఘ జీవితకాలం ఉంటుందని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధన విభాగం నిపుణులు చెబుతున్నారు. ప్యానల్స్ సహజ శీతలీకరణ కారణంగా అవి నేలపై వాటి కంటే ఐదు నుండి ఏడు శాతం మెరుగైన ఫలితాలను ఇస్తాయి. 25 సంవత్సరాలకు పైగా నీటిలో ఉన్నా ఈ ప్యానళ్లకు ఏమీ కాదు. రిజర్వాయర్లు, సరస్సులు, నీటిపారుదల కాలువలు వంటివి తేలియాడే సోలార్ ప్యానెల్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయి. వీటిపై ఏర్పాటు చేయడం వల్ల వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. నీటి మట్టాల హెచ్చుతగ్గులకు తగ్గట్టుగా సోలార్ ప్యానెల్స్ పైకీకిందికి కదులుతాయి తప్ప మునిగిపోయే అవకాశం లేదని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. -
దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ ప్లాంట్
-
దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: రామగుండం (ఎన్టీపీసీ)లో ఏర్పాటు చేసిన భారతదేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సౌర విద్యుత్ ప్లాంట్ శుక్రవారం నుంచి పూర్తి సామర్థ్యంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టగా, ఇప్పటికే 80 మెగావాట్ల మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. తాజాగా మిగిలిన 20 మెగావాట్ల పనులను కూడా పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించారు. ఇక్కడి థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే జలాశయం (500 ఎకరాల విస్తీర్ణం)పై రూ.423 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఏర్పాటు చేసింది. బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరిగాయి. సాధారణంగా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా భూమి అవసరం అవుతుంది. ఫ్లోటింగ్ ప్లాంట్ల ఏర్పాటుతో పెద్ద మొత్తంలో భూసేకరణ ఖర్చు తగ్గుతుంది. అలలపై తేలియాడుతూ.. ఫ్లోటింగ్ ప్లాంట్ అంటే.. ఫోటో వోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ (సౌర ఫలకాలు) మాత్రమే కాదు.. ఇన్వర్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, హెచ్‌టీ బ్రేకర్లు, స్కాడా వంటి పరికరాలతో ఏర్పాటైన మొత్తం సౌర విద్యుదుత్పత్తి వ్యవస్థ అంతా నీటిపైనే తేలియాడుతూ ఉంటుంది. హైడెన్సిటీ పాలిథిలీన్ మెటీరియల్‌తో తయారైన ఫ్లోటర్స్‌పై సోలార్ ప్యానెల్స్‌ను బిగించారు. ఒక్కొక్కటి 2.5 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 40 బ్లాకులుగా (తేలియాడే వేదికలు) విభజించి దీన్ని నిర్మించారు. ప్రతి తేలియాడే వేదిక (ఫెర్రో సిమెంట్ ఫ్లోటింగ్ ప్లాట్ఫార్మ్)పై 11,200 సోలార్ ప్యానెల్స్‌తో పాటు ఒక ఇన్వర్టర్, ట్రాన్స్ఫార్మర్, హెచ్‌టీ బ్రేకర్ ఉంటాయి. మొత్తం వ్యవస్థ నీటిపై తేలియాడుతూ ఒకేచోట ఉండేలా రిజర్వాయర్ అడుగున ఉన్న కాంక్రీట్ బ్లాకులకు లంగరు వేశారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను 33 కేవీ అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా దగ్గర్లోని స్విచ్‌యార్డ్‌కు సరఫరా చేస్తారు. ప్రయోజనాలెన్నో.. ►భారీ భూసేకరణ ఖర్చు తగ్గడంతో పాటు ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అన్ని రకాలుగా పర్యావరణ అనుకూలతను కలిగి ఉంటుంది. ►జలాశయంపై సౌర విద్యుత్ వ్యవస్థకు సంబం ధిం చిన బ్లాకులు తేలియాడుతూ ఉండడంతో జలాశ యంలో నీటి ఆవిరి నష్టాలు తగ్గుతాయి. అంటే ఇది జల సంరక్షణకు దోహదపడుతుందన్న మాట. ఏటా 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరి నష్టాలను నివారించవచ్చని ఎన్టీపీసీ అంచనా వేసింది. ►సోలార్ ప్యానెల్స్ కింద నీళ్లు ఉండడంతో వాటి పరిసరాల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. దీంతో వాటి పని సామర్థ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. ►థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుండడంతో ఏటా 1.65 లక్ష టన్నుల బొగ్గు వినియోగాన్ని, 2.1 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను నివారించవచ్చు. దక్షిణాదిలో 217 మె.వా. ఫ్లోటింగ్ పవర్ రామగుండంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో దక్షిణాదిలో తమ ఫ్లోటింగ్ ప్లాంట్ల సామర్థ్యం 217 మెగావాట్లకు పెరిగిందని ఎన్టీపీసీ ప్రాంతీయ సంచాలకులు (దక్షిణ) నరేష్ ఆనంద్ వెల్లడించారు. కాయంకులం (కేరళ)లో 92 మెగావాట్లు, సింహాద్రి (ఏపీ)లో 25 మెగావాట్ల ఫ్లోటింగ్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. -
వేల కోట్ల సోలార్ స్కామ్: భర్తకి 30 ఏళ్లు.. భార్యకి 11 ఏళ్ల జైలు శిక్ష!
లాస్ ఏంజెల్స్: యూఎస్‌లోని భార్యభర్తలిద్దరు సోలార్ పిరమిడ్ స్కామ్‌కి పాల్పడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. సోలార్ జనరేటర్ల అభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని చెప్పి దాదాపు 20 మంది పెట్టుబడిదారులును మోసం చేశారని న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పాలెట్ కార్పస్ అనే 51 ఏళ్ల మహిళ తన భర్త జెఫ్‌తో కలిసి దాదాపు 7 వేల కోట్ల రూపాయిల స్కామ్ తెరలేపారని స్పష్టం చేసింది. ఈ మేరకు కోర్టు కార్పస్‌కి 11 ఏళ్ల మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతకముందు ఆమె భర్తకి ఇదే స్కాంలో సుమారు 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ జంట ప్రాథమిక విచారణలో నేరాన్ని అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఈ స్కాంలో ఈ జంట సుమారు 17 మంది పెట్టుబడుదారుల నుంచి రూ. 7 వేల కోట్లు తీసుకున్నారు. ఈ డబ్బుల్లో కొంత భాగాన్ని ఈ జంట తమ విలాసాలకు ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: తండ్రి తుపాకితో ఆడుకుంటూ...పసికందుని కాల్చి చంపిన మైనర్) -
వెలుగుదారులు.. అసామాన్యులు
సోలార్ పవర్.. సౌరశక్తి. ఎంత కావాలంటే అంత. పూర్తిగా ఉచితం. చిన్న పెట్టుబడితో పర్యావరణానికి మేలు చేసే ఎంతో శక్తిని ఉచితంగా పొందవచ్చు. దీనికంతటికీ మూలం సౌర వ్యవస్థ. సూర్యుడి బాహ్య వాతావరణ పొరలో 11 లక్షల డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రత ఉంది. అంటే భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటా వాట్ల శక్తి గల సూర్యకిరణాలు వెలువడతాయి. వీటిలో సుమారు 30 శాతం అంతరిక్షంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. మిగతా వేడిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. ఇలా ప్రకృతి ఉచితంగా అందించే సౌర శక్తిని ఫొటో వోల్టాయిక్ ఘటాల ద్వారా విద్యుత్తుగా మార్చుతారు. చాలా కాలం క్రితమే సోలార్ విద్యుత్‌ను గుర్తించినా.. అమల్లో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. సులభంగా దొరుకుతుంది కదా.. అని బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలపై అతిగా ఆధారపడ్డాం. హైడ్రో పవర్ అంటే జలవిద్యుత్ ఉన్నా.. దానిపై పూర్తిగా ఆధారపడలేని పరిస్థితి. అందుకే సోలార్ విద్యుత్‌పై దృష్టి పెట్టింది లోకం. అందుకే ఇప్పుడు కొత్త నినాదం ఊపందుకుంది. ఒకే సూర్యుడు – ఒకే ప్రపంచం – ఒకే గ్రిడ్. అంటే వీలైనంత సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి.. అన్ని దేశాల విద్యుత్ వ్యవస్థలను అనుసంధానం చేయగలిగితే.. పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లమవుతాం. ఎండకాసే దేశాల్లో ఉత్పత్తయ్యే విద్యుత్.. చీకట్లు నిండిన చోట వెలుగులు నింపుతాయి. ప్రపంచవ్యాప్తంగా సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ ఇండియా డాటా పోర్టల్ ప్రకారం గత ఏడున్నరేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 2.6 గిగా వాట్ల నుంచి 46 గిగావాట్ల సామర్థ్యం స్థాయికి చేరింది. ఇక పవన విద్యుత్ ఉత్పత్తి 5.5 గిగా వాట్లకు చేరింది. ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ఏకంగా 26 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. రైతుల సాగు కోసం వినియోగించే సోలార్ పంప్‌లు 20 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్లలో మూడు మన దేశంలో ఉన్నాయి. అన్నింటికంటే పెద్ద ప్లాంట్, మొదటి స్థానంలో నిలిచింది రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో భాడ్లా అనే గ్రామంలో నిర్మించిన ప్లాంట్. దీన్ని 2,700 మెగావాట్ల సామర్థ్యంతో 14 వేల ఎకరాలలో నిర్మించారు. ఇక కర్ణాటకలో 13 వేల ఎకరాలలో 2,050 మెగవాట్ల సామర్థ్యంతో నిర్మించిన ప్లాంట్‌కు నాలుగో స్థానం దక్కింది. ఏపీలోని అనంతపురం జిల్లా నంబులపులకుంటలోనూ భారీ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మించారు. దీని సామర్థ్యం 1200 మెగావాట్లు. ఇటీవల స్మార్ట్ సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్ మెంట్ విభాగంలో కైలాసగిరి రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ 3వ ర్యాంక్‌ను సాధించింది. 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి రావడంతో తిరుపతి కార్పొరేషన్ కు భారీగా బిల్లు తగ్గింది. ఏకంగా రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండడంతో మరిన్ని సోలార్ ప్లాంట్లకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. సూర్యశక్తిని ఒడిసి పట్టుకుంటున్నది ప్రభుత్వాలే కాదు.. సంస్థలతో పాటు వ్యక్తులు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ సమస్యలకు పరిష్కారం కనిపెట్టి, ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తీసుకొచ్చే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ ప్రిన్స్ విలియం ఈ ‘ఎర్త్ షాట్ ప్రైజ్’ను నెలకొల్పారు. గతేడాది ప్రారంభించిన ఈ ప్రైజ్ ఫైనలిస్టుల జాబితాలో మన దేశానికి చెందిన వాళ్లు ఇద్దరున్నారు. అందులో ఒకరు తిరువణ్ణామళైలోని 9వ తరగతి విద్యార్థిని వినీష. చిన్నప్పటి నుంచే తనకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. దీనికి తోడు సైన్సుపై ఆసక్తి. ఈ రెండింటి కలబోతగానే సోలార్ ఐరన్ కార్ట్‌ను తయారు చేసిందీ టాలెంటెడ్ గర్ల్. ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ ఇంటి దగ్గర ఇస్త్రీ బండి వ్యాపారిని చూసింది వినీష. బాగా మండించిన బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో వేసి దుస్తులు ఇస్త్రీ చేస్తున్న పద్ధతిని గమనించింది. ఇంటికొచ్చాక బొగ్గు మండించడం వల్ల కలిగే నష్టాలను ఇంటర్నెట్లో వెతికింది. బొగ్గును ఉత్పత్తి చేయాలంటే చెట్లను నరకాలి. కట్టెలను కాల్చాలి. ఆ పొగతోపాటు కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు వెలువడుతుంది. ఇవన్నీ తెలుసుకున్నాక.. వినీషలో కొత్త ఆలోచన మొదలయింది. ఆ తపన నుంచి వచ్చిన ఆవిష్కరణే ‘సోలార్ ఐరన్ కార్ట్’. ఈ మొబైల్ ఇస్త్రీ బండి సోలార్ విద్యుత్‌ను ఉపయోగించుకుని పని చేస్తుంది. ఈ ప్రయత్నానికి ఎర్త్ షాట్ ప్రైజ్ దిగి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 750 ఎంట్రీల్లో తుది అంచెకు చేరుకున్న 15లో మరొకటి ఢిల్లీకి చెందిన ‘విద్యుత్ మోహన్’ ప్రాజెక్టు. విద్యుత్ మోహన్ .. గత కొన్నాళ్లుగా దేశ రాజధాని ఎదుర్కొంటున్న వాయు కాలుష్యాన్ని గమనిస్తున్నాడు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఓ వైపు ఉత్తరాది పొలాల్లోని మంటల నుంచి వచ్చే పొగ.. దానికి ఢిల్లీ రోడ్లపై తిరిగే వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం.. అన్నీ కలగలసి ఊపిరాడకుండా చేస్తున్నాయి. టకా అంటే డబ్బు, చార్ అంటే బొగ్గు లేదా కార్బన్ .. కాలుష్యం నుంచి డబ్బు అన్న కాన్సెప్ట్‌లో టకాచార్ అనే ఓ సంస్థను ప్రారంభించాడు మోహన్ . దీని ప్రధాన ఉద్దేశం కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాయు కాలుష్యాన్ని నియంత్రించడం. ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఈ ప్రాజెక్టును నడుపుతున్నారు. వ్యవసాయంలో ఉత్పత్తయ్యే చెత్త, చెదారం, పంట కోసిన తర్వాత ఉండే మొదళ్లు, ఇతర వ్యర్థాలను సాధారణంగా చాలా మంది రైతులు తగులబెడతారు. అలా తగులబెట్టే బదులు ఈ వ్యవసాయ వ్యర్థాలన్నింటినీ ఓ యంత్రంలో వేయడం ద్వారా బయోచార్గా మారుతాయి. బయోచార్ను భూసారాన్ని పెంచే ఎరువుగా రైతులు తిరిగి వాడుకోవచ్చు. తద్వారా పంట వ్యర్థాలు మళ్లీ భూమిలోకి చేరడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. (క్లిక్: రోజుకు ఎన్ని వేల లీటర్ల గాలిని పీల్చుకొని వదులుతామో తెలుసా?) ముంబైకి చెందిన మధురిత గుప్తాది మరో విజయగాథ. ముంబైలో వెటర్నరీ డాక్టర్ అయిన మధురిత గుప్తా ఓ వైల్డ్ లైఫ్ సంస్థలో వ్యవస్థాపక సభ్యురాలిగా కూడా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శానిటరీ ప్యాడ్స్‌ను తగులబెట్టడం లేదా భూమిలో పారేయడాన్ని గమనించారు. దీని వల్ల పర్యావరణానికి జరుగుతున్న హానిని నివారించాలన్న ఆలోచన కలిగింది. శానిటరీ ప్యాడ్స్ అంత త్వరగా భూమిలో కలవకపోవడం వల్ల అటు పర్యావరణానికి, ఇటు జంతువులకూ కూడా హాని జరుగుతోంది. ఐఐటీలో చదివి ఇంజినీర్‌గా పని చేస్తోన్న తన తమ్ముడు రూపన్ తో కలిసి సోలార్ లజ్జా అనే యంత్రాన్ని రూపొందించారు మధురిత. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్‌ను ఈ మెషీన్ లో వేయడం వల్ల క్షణాల్లో వాటిని బూడిదగా మార్చవచ్చు. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తితో పనిచేస్తుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకపోగా దీని ద్వారా వెలువడే బూడిదను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ మెషిన్ . సోలార్ శక్తితో నడుస్తుంది. ఒకసారి మెషిన్‌ను అమర్చితే దాని నిర్వహణకు ఎటువంటి ఖర్చు ఉండదు. మిషన్ పై ఉన్న సోలర్ ప్యానల్స్ సూర్యరశ్మి ద్వారా ఎప్పటికప్పుడు మెషిన్ ను రీచార్జ్ చేస్తాయి. శానిటరీ ప్యాడ్స్కే కాకుండా, పీపీఈ కిట్లు, ట్యాంపోన్స్, డయపర్లు, ఒకసారి వాడిపడేసే మాస్కులను సైతం ఈ మెషిన్ బూడిద చేస్తుంది. ప్రకృతికి మంచి చేసే మెషిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చినందుకు మధురిత, రూపన్ లకు అనేక అవార్డులు వచ్చాయి. వీటిలో టాప్‌టెన్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ లో ‘ఇన్ స్ప్రెన్యూర్ 3.0’, యూనైటెడ్ నేషన్స్ అందించే టాప్‌టెన్ ఇన్నోవేషన్స్ విమెన్ అవార్డులు ఉన్నాయి. అంతేగాక మహారాష్ట్ర స్టేట్ ఇన్నోవేషన్ సొసైటీ అందించే టాప్ టెన్ ఇన్నోవేషన్స్‌లో కూడా సోలార్ లజ్జా చోటు దక్కించుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ, ఉత్తరాఖండ్, హరియాణా, సిక్కింలలో ఈ మెషిన్లను అమర్చారు. ఇప్పుడు జర్మనీ, స్వీడన్, స్పెయిన్ నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. (క్లిక్: ఆర్ఓ నీటిపై ఆసక్తికర విషయాలు.. టీడీఎస్ 500 ఎం.జీ దాటితే!) గుజరాత్ వడోదర జిల్లాకు చెందిన నీల్ షా వయస్సులో చిన్నోడయినా.. సమాజానికి పెద్ద పరిష్కారం చూపించే పనిలో పడ్డాడు. ఇంటర్ చదువుతున్న నీల్‌ది ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబం. అయితే మాత్రం ఆవిష్కరణలపై ఆసక్తి తగ్గించుకోలేదు నీల్‌షా. ఓ సారి స్కూల్లో ప్రాజెక్ట్ కింద అసైన్ మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా సోలార్ సైకిల్ రూపొందించాడు. రూ. 300లతో పాత సైకిల్ కొనుగోలు చేసిన నీల్‌షా.. దానికి రెండు సోలార్ ప్యానెళ్లను అమర్చాడు. ఒక సారి చార్జింగ్ చేస్తే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు ఈ సైకిల్. 40 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ సైకిల్.. పల్లెల్లో పేద వర్గాలకు ఎంతో ఉపయోగకరం. తమిళనాడులోని మధురైకి చెందిన ధనుష్ కూడా ఇలాంటి సైకిల్‌నే తయారు చేశాడు, కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చదివిన ధనుష్.. తాను తయారు చేసిన సైకిల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చూపించాడు. కిలోమీటర్‌కు అయ్యే ఖర్చు రుపాయి కన్నా తక్కువే. కేరళ పోలీసులకు వినూత్న ఆలోచన వచ్చింది. రోడ్లపై గంటల కొద్దీ నిలబడి డ్యూటీ చేసే ట్రాఫిక్ పోలీసులకు సోలార్ గొడుగులు ఇచ్చింది ప్రభుత్వం. ఈ గొడుగు రెండు రకాలుగా పని చేస్తుంది. మండుటెండల్లో డ్యూటీ చేసే పోలీసులకు నీడ ఇస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేలా అందులోనే ఫ్యాన్ ఉంటుంది. అంటే గొడుగుపైన సోలార్ ప్యానెల్, గొడుగు కింద బ్యాటరీ. ఇదే టెంట్లో కింద లైటింగ్ సౌకర్యం కూడా ఉంది. రాత్రి పూట కూడా పోలీసులకు ఇది ఉపయోగపడుతుంది. ఎర్నాకుళం జిల్లాలో మొదలైన ఈ ప్రాజెక్టును మరిన్ని జిల్లాలకు విస్తరించారు కేరళ పోలీసులు. (క్లిక్: 2050 నాటికి సగం ప్రపంచ జనాభా నగరాల్లోనే.. అదే జరిగితే!) ఇప్పుడంటే ఎలక్ట్రిక్ కార్ల గురించి మాట్లాడుతున్నారు కానీ.. అయిదేళ్ల కిందటే సోలార్ కార్‌ను తయారు చేశారు కర్ణాటకలోకి మణిపాల్ యూనివర్సిటీ విద్యార్థులు. పూర్తిగా సౌర విద్యుత్‌తో నడిచే ప్రోటో టైప్ సోలార్ ఎలక్ట్రిక్ కార్‌ను రూపొందించారు. సోలార్ మొబిల్ పేరిట రూపొందించిన ఈ కారుకు టాటా పవర్ తమ వంతుగా సహకారం అందించింది. అనుదీప్ రెడ్డి, జీత్ బెనర్జీ, వరుణ్ గుప్తా, శివభూషణ్ రెడ్డి, సులేఖ్ శర్మలు కలిసి రూపొందించిన ఈ కారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒకసారి చార్జింగ్ పూర్తయితే 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే సమయంలో చార్జింగ్ చేసుకోగలదు. సూర్యరశ్మితో నడిచే కార్లను అభివృద్ధి చేసేందుకు విశ్వవ్యాప్తంగా విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి రెండేళ్ల కోసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి అనేక మంది ఔత్సాహికులు తాము రూపొందించిన కార్లతో పాల్గొంటున్నారు. ఆస్ట్రేలియాలో డార్విన్ నుంచి అడిలైడ్ వరకు 3021 కిలోమీటర్ల పాటు ఈ పోటీ జరుగుతుంది. (చదవండి: ఉప్పు నీరు ఎందుకు చొచ్చుకొస్తున్నట్లు?) ఇవే కాదు.. సౌరశక్తితో మరెన్నో వినూత్న ఆవిష్కరణలు మన చుట్టున్నవాళ్లు చేస్తున్నారు. భవిష్యత్తులో మనకెన్నో పర్యావరణ అనుకూల పరిష్కారాలు చూపించనున్నారు. - శ్రీనాథ్ గొల్లపల్లి సీనియర్ అవుట్‌పుట్ ఎడిటర్, సాక్షి టీవీ g.srinath@sakshi.com -
సహారా ఎడారిలో సౌర విద్యుత్ ఉత్పత్తి .. ఇదంతా అయ్యే పనేనా?
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పేరు మార్మోగుతోంది. బొగ్గు, పెట్రోల్, డీజిల్ లాంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నారు. సౌర, పవన, అలల శక్తి లాంటి పునరుత్పాదక ఇంధనాల వాడకం పెంచాలంటున్నారు. మరి ఆ ప్రకారమే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే సహారా ఎడారిని సౌర విద్యుత్ ఉత్పత్తికి వాడుకుంటే? ఎడారంతా సోలార్ ప్యానళ్లు పెట్టేసి కరెంటు ఉత్పత్తి చేస్తే? కనీసం కొంతభాగంలోనైనా ప్యానళ్లు పెడితే? ఇసుకలో ఇదంతా అయ్యే పనేనా? ఒకవేళ అయితే ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయగలం? ఎన్ని దేశాలకు సరిపోతుంది? లాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ మీ కోసం.. ఇంతకీ ఎడారి విస్తీర్ణమెంత? ప్రపంచంలోని అతి పెద్ద ఎడారి సహారా. ఆఫ్రికాలోని 11 దేశాల్లో విస్తరించి ఉంది. ఒకవేళ సహారా కనుక దేశమైతే ప్రపంచంలోనే ఐదో పెద్ద దేశమయ్యేది. ఈ ఏడారి విస్తీర్ణం 90 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే మన ఇండియాకు మూడింతలు పెద్దది. బ్రెజిల్ కన్నా పెద్దది. చైనాతో పోలిస్తే కాస్త చిన్నది. చదవండి: గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్ ప్రపంచానికంతా 254 చ.కి.మీ.లు చాలు సహారా ఎడారి ప్రతి సంవత్సరం 22 బిలియన్ గిగావాట్స్ అవర్ సూర్యశక్తిని గ్రహిస్తుంది. అంటే ప్రతి చదరపు మీటర్‌కు 2 వేల నుంచి 3 వేల కిలోవాట్ అవర్ శక్తి అన్నమాట. సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే జర్మనీ దేశం పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చడానికి సహారాలోని కేవలం 45 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సూర్యశక్తిని వాడుకుంటే చాలు. యూరప్‌లోని 25 దేశాల విద్యుత్ అవసరాలకు 110 చదరపు కిలోమీటర్లు చాలు. ఇక ప్రపంచమంతా కావాల్సిన విద్యుత్ కోసం 254 చదరపు కిలోమీటర్ల ప్రాంతం సరిపోతుంది. 2005 నాటి నడిన్ రీసెర్చ్‌లో ఇవన్నీ వివరించారు. 350 వాట్ల సోలార్ ప్యానళ్లను సహారాలోని 1.2 శాతం ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే 5,100 కోట్ల ప్యానళ్లు కావాలి. ఈ 1.2 శాతం న్యూ మెక్సికో ప్రాంతం విస్తీర్ణంతో సమానం. మొత్తం సహారానే ప్యానళ్లతో కప్పేస్తే? సహారాలో ఏర్పాటు చేసిన ప్యానళ్లన్నీ 20 శాతం సామర్థ్యం వరకే పని చేసినా ఏడాదికి 2,760 ట్రిలియన్ కిలోవాట్ అవర్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ అవసరాలకు మాత్రం ఏడాదికి 23 ట్రిలియన్ల కిలోవాట్ అవర్ విద్యుత్ సరిపోతుంది. సహారాతో చాలా పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు కదా. నిపుణులు కూడా సహారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచనా వేశారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు 4 రెట్లు ఎక్కువగా ఎడారి ఉత్పత్తి చేయగలదని అంటున్నారు. చదవండి: Parag Agrawal: సీఈవోగా చిన్నవయస్సే! కానీ.. మరి ప్యానళ్లు పెట్టడానికి ఇబ్బందేంటి? ఇంతలా సహారాను వాడుకోవచ్చు కదా? మరి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అంటే తొలి కారణం రాజకీయపరమైన చిక్కులు. రెండోది భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసే సోలార్ ప్యానళ్ల నిర్వహణ కష్టంతో కూడున్నపని. ఇక ఎడారిలో రోడ్లు వేయడమంటే సాహసమే. అయితే ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయి. సహారా వ్యాప్తంగా సోలార్ జనరేటర్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని డిసర్టిక్ ఫౌండేషన్ ప్రతిపాదించింది. కానీ అందుకు ముందడుగు పడలేదు. అయితే సహారాలో రోడ్లు వేయడం మాత్రం ఆ ఫౌండేషన్ మొదలుపెట్టింది. మనతో పాటు సహారాకూ ప్లస్సే.. సహారాలో భారీ స్థాయిలో సోలార్ ప్యానళ్లు, గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే టర్బైన్లు ఏర్పాటు చేస్తే ఇంకో ఉపయోగం కూడా ఉందండోయ్! మనం గనక ఈ పని చేస్తే ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువవుతుందంట. వృక్ష సంపద కూడా 20 శాతం పెరుగుతుందట. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సోలార్ ఓపెన్ యాక్సెస్ ఇన్స్టలేషన్ల జోరు
న్యూఢిల్లీ: భారత్‌లో సోలార్ ఓపెన్ యాక్సెస్ ఇన్స్టలేషన్లు ఈ ఏడాది రెండో త్రైమాసికంలో (2021 ఏప్రిల్–జూన్) 209 మెగావాట్లుగా ఉన్నట్టు మెర్కామ్ ఇండియా రీసెర్చ్ తెలిపింది. ‘మెర్కామ్ ఇడియా సోలార్ ఓపెన్ యాక్సెస్ మార్కెట్ క్యూ2 2021’ నివేదిక మంగళవారం విడుదలైంది. 2020 రెండో త్రైమాసికంలో 27 మెగావాట్ల మేర ఇన్స్టాలేషన్లు నమోదైనట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. దీంతో మొత్తం మీద ఓపెన్ యాక్సెస్ మార్కెట్లో సోలార్ విద్యుత్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యం 4.5 గిగావాట్లకు చేరుకున్నట్టు వివరించింది. అభివృద్ధి, ఏర్పాటుకు ముందస్తు దశల్లో ఒక గిగావాట్ మేర సోలార్ ఓపెన్యాక్సెస్ ఇన్స్టాలేషన్లు ఉన్నట్టు తెలిపింది. తాజా నివేదికలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా మార్కెట్లకూ కవరేజీని విస్తరించినట్టు ఈ సంస్థ పేర్కొంది. ఓపెన్ యాక్సెస్ మార్కెట్ అన్నది.. ఒక మెగావాట్ కంటే ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకునే కంపెనీలు బహిరంగ మార్కెట్ నుంచే తమకు నచ్చిన సంస్థ నుంచి కొనుగోలు చేసుకునేందుకు వీలు కల్పించేది. ఈ మార్కెట్ కోసం ఏర్పాటయ్యే ఇన్స్టాలేషన్లను.. ఓపెన్ యాక్సెస్ సోలార్ ఇన్స్టాలేషన్లుగా అర్థం చేసుకోవాలి. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల త్రైమాసికం వారీగా చూస్తే (ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్) సోలార్ ఇన్స్టాలేషన్లు జూన్ త్రైమాసికంలో 50 శాతం తగ్గినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జనవరి–మార్చి కాలంలో 628 మెగావాట్ల మేర సోలార్ ఓపెన్ యాక్సెస్ ఇన్స్టాలేషన్లు నమోదైనట్టు తెలిపింది. రాష్ట్రాల వారీగా.. 2021 జూన్ నాటికి ఉత్తప్రదేశ్ రాష్ట్రం సోలార్ ఓపెన్ యాక్సెస్ ఇన్స్టాలేషన్ల సామర్థ్యంలో ముందుంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాలు మొత్తం ఓపెన్ యాక్సెస్ ఇన్స్టాలేషన్లలో 83 శాతం వాటా కలిగి ఉన్నాయి. సోలార్ ఓపెన్ యాక్సెస్‌కు కర్ణాటక అతిపెద్ద రాష్ట్రంగా ఉంటే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలు కలసి మొత్తం ఓపెన్ యాక్సెస్ మార్కెట్లో 73 శాతం వాటాను ఆక్రమించాయి. ఒక్కో యూనిట్‌కు సగటు టారిఫ్ రూ.3.50–5 రూపాయల మధ్య ఉన్నట్టు మెర్కామ్ నివేదిక తెలియజేసింది. చదవండి: తిరుపతిలో సౌరకాంతులు -
గురుకులాల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల విద్యాసంస్థల్లో సోలార్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అదనంగా గీజర్ సౌకర్యం కూడా కల్పించనుండడంతో విద్యార్థులకు నిరంతరం వేడి నీరు కూడా అందించే వీలుంటుంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించిన గిరిజన గురుకుల సొసైటీ.. తాజాగా టెండర్లు పిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 110 గిరిజన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల్లో ముందుగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. కరెంటు చార్జీల పొదుపు: వేసవి సీజన్ మినహాయిస్తే.. మిగతా రోజుల్లో గురుకుల విద్యాసంస్థల్లో వేడినీటి వినియోగం ఎక్కువే. శీతాకాలంలో వాడకం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో కరెంటుతో నడిచే గీజర్లతో విద్యుత్ చార్జీల భారం తడిసి మోపెడవుతోంది. కొన్ని స్కూళ్లలో నెలకు వచ్చే కరెంటు బిల్లుల్లో గిజర్ వినియోగానికే రూ.25 వేలకుపైగా చెల్లిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ బిల్లుల భారాన్ని తగ్గించుకునే ఉద్దేశంతో సోలార్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లు, గీజర్లను ఏర్పాటు చేయడంతో విద్యుత్ బిల్లుల్లో దాదాపు 30 శాతం ఆదా అయ్యింది. దీంతో అన్ని స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వారంలోగా టెండర్లు ఖరారైతే పక్షం రోజుల గడువు విధించి వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు గిరిజన గురుకుల సొసైటీ అధికారి ఒకరు తెలిపారు. విద్యా సంస్థలు ప్రారంభమయ్యే నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు. -
మార్చికి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రిజర్వాయ ర్‌పై తలపెట్టిన నీటిపై తేలియాడే 15 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఇందులో తొలి విడతగా 5 మెగావాట్ల ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచిం చారు. గురువారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో మూడు దశల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొదటి దశలో మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్ (రామగుండం– 3), రెండవ దశలో మిగిలిఉన్న కొత్తగూడెంలోని 37 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. అలాగే కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశ యంపై నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల తేలి యాడే సోలార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలో టెండర్లు పిలవడా నికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది దేశంలోని అత్యుత్తమ విద్యుత్ కేంద్రాల్లో ఏడవ స్థానం సాధించినందుకు ఆయన అధికారులను అభినందించారు. ఈ ఏడాది 93 నుంచి 94 శాతం సామర్థ్యం (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని, దేశంలో అత్యుత్తమ 25 ప్లాంట్లలో మొదటి ఐదు స్థానాల్లో ఈ కేంద్రం నిలిచేలా కృషి చేయాలని అన్నారు. కాగా, సింగరేణి సంస్థ త్వర లోనే 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించబోతోందని తెలిపారు. -
రెన్యువబుల్ ఎనర్జీలో తెలంగాణలో నెంబరు2గా ఉంది : కేటీఆర్
-
సింగరేణికి సోలార్ సొబగులు
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న సింగరేణికి చెందిన భూములిప్పుడు సౌరకాంతులు విరజిమ్మనున్నాయి. సింగరేణి వ్యాప్తంగా మూసేసిన భూగర్భ గనులు, ఓపెన్ కాస్టులు, నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఆ సంస్థ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో 1,500 ఎకరాల భూమి వినియోగంలోకి రానుంది. విద్యుత్ అవసరాల కోసం సంస్థ ఏటా రూ.486 కోట్లు ఖర్చు చేస్తోంది. 300 మెగావాట్ల సౌర విద్యుత్ వినియోగంలోకి వస్తే ఏటా రూ.300 కోట్ల భారం తగ్గనుంది. 25 ఏళ్ల జీవిత కాలంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్లకు మొత్తం రూ.1,399 కోట్ల పెట్టుబడి అవుతోంది. అయితే.. ఏటా రూ.300 కోట్ల ఆర్జనతో మొదటి ఐదేళ్లలోనే ఈ పెట్టుబడి తిరిగి రానుంది. మొదటి దశ బీహెచ్ఈఎల్ నిర్మాణ పనులు చేస్తుండగా.. మిగతా రెండు దశల ప్లాంట్ల నిర్మాణం అదాని సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. వచ్చే 25 ఏళ్లు ఈ సంస్థలే ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. సింగరేణి సౌర్యం సౌర విద్యుత్ ఉత్పాదనలో కొత్తపుంతలు తొక్కుతున్న ‘సింగరేణి’.. వచ్చే రెండేళ్లలో మూడు దశల్లో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా పనులు ముమ్మరం చేసింది. రెండేళ్ల క్రితం మొదలైన ఈ పనుల్లో ఈ ఏడాది కరోనాతో జాప్యం జరగగా.. మళ్లీ పనులు పుంజుకున్నాయి. మొదటి దశలో మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లోని 50 ఎకరాల్లో 10 మెగావాట్లు, మణుగూరులో 150 ఎకరాల్లో 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో చాలాచోట్ల పనులు పూర్తయి ఉత్పత్తికి సిద్ధంగా ఉండగా.. రెండు, మూడో దశ పనులు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పరిధిలో జేకే–5 ఓపెన్ కాస్ట్ పరిసరాల్లో 230 ఎకరాల్లో 39 మెగావాట్లకు గాను 15 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మరో 24 మెగావాట్లు ఈ నెలాఖరులో పూర్తి కానుంది. ప్రాజెక్టులపై 500 మెగావాట్లు ఈ మూడు దశలు విజయవంతమైతే సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్ సోలార్) ఫలకాలతో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ ప్రణాళిక రూపొందించింది. గోదావరి, అనుబంధ నదులపై భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ఆలోచనలున్నాయి. ప్రయోగాత్మకంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్‌లో మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న రెండు రిజర్వాయర్లపై 10 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పనులు మొదలయ్యాయి. వీటితో పాటు ఓసీపీల్లో నీటి ఉపరితలాల పైనా తేలియాడే సౌర ఫలకాలు బిగించి సౌర విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. -
సింగరేణిలో ‘సౌర’ కాంతులు
గోదావరిఖని (రామగుండం): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై దృష్టిసారించింది. తాజాగా శనివారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో మరో 81 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 129 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరో 90 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ప్రారంభ దశలో ఉన్నా యి. మరో 81 మెగావాట్ల సోలార్ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. సంస్థ పరిధిలోని 1,500 ఎకరాల్లో మొత్తం 300 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల కోసం రూ.1, 350 కోట్లు ఖర్చు చేయాలని బోర్డు నిర్ణ యించింది. ఒక మెగావాట్ విద్యుత్ కోసం రూ.4.28 కోట్ల బడ్జెట్, నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించి ప్లాంట్లు ఏర్పా టు చేస్తోంది. మణుగూరులో 30 మెగావా ట్లు, జైపూర్ థర్మల్ ప్లాంట్ ఆవరణలో 10 మెగావాట్లు, ఆర్జీ–3 ఏరియాలో 50 మెగావాట్లు, ఇల్లెందులో 39 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల పనులు జరుగుతున్నా యి. వీటిని భారత్‌హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ నిర్మి స్తోంది. మణుగూరు ఏరియాలో నిర్మించిన 30 మెగావాట్లు, సింగరేణి థర్మల్ ప్లాంట్‌లో నిర్మించిన 10 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాయి. రెండోదశ కేంద్రాలు వేగవంతం రెండోదశలో నిర్మాణం 90 మెగావాట్ల సో లార్ విద్యుత్ కేంద్రాలు ప్రారంభ దశలో ఉన్నాయి. వీటిలో 10 మెగావాట్లు భూపాలపల్లి, 43 మెగావాట్లు మందమర్రి, 37 మెగావాట్ల ప్లాంట్‌ను కొత్తగూడెంలో ఏర్పా టు చేయనున్నారు. వీటిని అదానీ సంస్థ నిర్మిస్తోంది. మూడో దశలో 81 మెగావాట్లు.. మూడో దశలో 81 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 32 మెగావాట్లు ఓసీపీ డంప్‌యార్డులపై, 15 మెగావాట్లు సింగరే ణి ప్రాంతంలోని జలాశయాలపై, 34 మెగా వాట్ల ప్లాంట్లు సంస్థలోని స్థలాల్లో నిర్మించనున్నారు. జలాశయాలపై 500 మెగావాట్లు.. రాష్ట్రంలో ఉన్న భారీ జలాశయాలపై మరో 500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజ మాన్యం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో కలసి సంస్థ నివేదిక రూపొందించింది. త్వరలో దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. -
3 కోట్ల 65 లక్షలతో కార్మికులకు యూనిఫాం
సాక్షి, కరీంనగర్ : సింగరేణి కార్మికులకు యూనిఫాం కొనుగోలు, 4 భూగర్భ గనుల మైనింగ్ ప్లానులకు, ఒక కొత్త ఓ.సి. గనికి అనుమతితో పాటు సింగరేణిలో 3వ దశ సోలార్ పవర్ ప్లాంటుల నిర్మాణం కాంట్రాక్టులకు సిఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శనివారం జరిగిన 555వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఎన్.శ్రీధర్ అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. రానున్న కాలంలో నిర్దేశించుకొన్న అధికోత్పత్తి లక్ష్యాల సాధనకు అనుగుణంగా కొత్తగూడెం ఏరియా పరిధిలో మరో ఓపెన్ కాస్ట్ గని నిర్మాణానికి ఏర్పటు చేయనున్నామన్నారు. అలాగే ప్రస్తుత భూగర్భ గనుల విస్తరణలో భాగంగా కాసీపేట, ఆర్.కె.-1 ఎ, శ్రీరాంపూర్ 1, శ్రీరాంపూర్ 3, 3ఎ గనుల మైనింగ్ ప్లానులకు బోర్డు అనుమతించిందన్నారు. దీంతోపాటు సింగరేణి కార్మికులకు రెండు జతల యూనిఫాంలను 3 కోట్ల 65 లక్షల రూపాయలతో యూనిఫాంలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు తెలంగాణా రాష్ట్ర చేనేత సహకార సంస్థ నుంచి నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి బోర్డు అనుమతించింది. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా చేపట్టిన 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంటుల నిర్మాణంలో చివరిదైన 3వ దశ నిర్మాణం పనుల కాంట్రాక్టుల అప్పగింతకు బోర్డు అనుమతించిందన్నారు. ఈ 3వ దశలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం వాటర్ రిజర్వాయర్ పైన 10 మెగావాట్లు, మూతపడిన బెల్లంపల్లి డోర్లీ ఓ.సి. గని క్వారీ నీటిపై 5 మెగావాట్ల సామర్థ్యంతోనీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులతో పాటు కొత్తగూడెం, చెన్నూరు లో నేలపై నిర్మించే సోలార్ ప్లాంటు, ఆర్.జి. ఓ.సి.-1, డోర్లీ ఓ.సి.-1 ఓవర్ బర్డెన్ డంపుల మీద నిర్మించే సోలార్ ప్లాంటుల నిర్మాణం పనుల అప్పగింత ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయన్నారు. రానున్న రెండేళ్లకు ఓ.సి. గనుల్లో వాడే పేలుడు పదార్ధాల కొనుగోలుకు, కంపెనీ నిర్వహిస్తున్న పేలుడు పదార్ధాల ఉత్పత్తి ప్లాంటులకు కావాలసిన అమ్మోనియాం నెట్రేట్, మొదలగు వాటి కొనుగోలుకు, రూఫ్ బోల్టుల కొనుగోలు తదితర పనులకు బోర్డు తన అంగీకారం తెలిపిందని వెల్లడించారు. సింగరేణి సిఎండి ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (డైరెక్టర్ ఆపరేషన్స్ & పా), ఎన్.బలరామ్ (డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పి&పి), డి.సత్యనారాయణ రావు (డైరెక్టర్ ఇ&ఎం) పాల్గొనగా, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఢిల్లీ నుంచి బొగ్గు శాఖ సహాయ కార్యదర్శులు పి.ఎస్.ఎల్.స్వామి, అజితేష్ కుమార్, నాగపూర్ నుండి వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ ఛైర్మన్ ఆర్.ఆర్.మిశ్రా లు పాల్గొన్నారు. కార్యక్రమంలో జి.ఎం. (సి.డి.ఎన్.) కె.రవిశంకర్, కంపెనీ వ్యవహారాల కార్యదర్శి మురళీధర్ రావులు పాల్గొన్నారు.