
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రిజర్వాయ ర్‌పై తలపెట్టిన నీటిపై తేలియాడే 15 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఇందులో తొలి విడతగా 5 మెగావాట్ల ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచిం చారు. గురువారం ఆయన సింగరేణి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో మూడు దశల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మొదటి దశలో మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్ (రామగుండం– 3), రెండవ దశలో మిగిలిఉన్న కొత్తగూడెంలోని 37 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. అలాగే కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశ యంపై నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల తేలి యాడే సోలార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలో టెండర్లు పిలవడా నికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది దేశంలోని అత్యుత్తమ విద్యుత్ కేంద్రాల్లో ఏడవ స్థానం సాధించినందుకు ఆయన అధికారులను అభినందించారు. ఈ ఏడాది 93 నుంచి 94 శాతం సామర్థ్యం (పీఎల్‌ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని, దేశంలో అత్యుత్తమ 25 ప్లాంట్లలో మొదటి ఐదు స్థానాల్లో ఈ కేంద్రం నిలిచేలా కృషి చేయాలని అన్నారు. కాగా, సింగరేణి సంస్థ త్వర లోనే 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించబోతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment