floating solar power plant
-
సింగరేణిలో తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
జైపూర్ (చెన్నూర్)/ సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ (ఎస్టీపీపీ) కేంద్రానికి సంబంధించిన జలాశయంపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్ డి.సత్యనారాయణరావు ఈ ప్లాంట్‌ను ప్రారంభించి తెలంగాణ ట్రాన్స్‌కో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీంతో సింగరేణి సంస్థ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 224 మెగావాట్లకు చేరింది. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఉద్యోగులు, అధికారులను అభినందించారు. ఇక్కడే ఏర్పాటు చేస్తున్న మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, 3 దశల్లో మొత్తం 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కు సింగరేణి సంస్థ మూడేళ్ల కార్యాచరణ ప్రారంభించింది. మొదటి రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం–3, మందమర్రి ఏరియాల్లో నిర్మించింది. వీటి ద్వారా 540 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, సంస్థ విద్యుత్ ఖర్చుల్లో రూ.300 కోట్లను సింగరేణి సంస్థ ఆదా చేసింది. మూడో దశ కింద 81 ప్లాంట్ల నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రాంగణంలోని రెండు జలాశయాలపై నిర్మించే బాధ్యతలను నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్ట మ్స్ సంస్థకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీటీసీ సంజయ్‌కుమార్, జీఎం డీవీఎస్ఎన్ సూర్యనారాయణ రాజు, జీఎం (సోలార్) జానకి రాం, ఎస్వోటు డైరెక్టర్ సూర్యకు మార్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శేషారావు, జీఎం పీసీఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఏజీఎం సత్యనారాయణప్రసాద్, సీఎంవో ఏఐ కేంద్ర ఉపాధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, టీబీజీ కేఎస్ ఉపా«ధ్యక్షుడు చుక్కల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
15న 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రాంగణంలో నిర్మించిన 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటును ఈనెల 15న ప్రారంభించను న్నారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ శుక్రవా రం సింగరేణి భవన్లో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్ల కాలంలో 8 చోట్ల ఏర్పాటు చేసిన 219 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఇప్పటి వరకు 505 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో సంస్థకు రూ.300 కోట్లు ఆదా అయ్యాయి. మూడో దశలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రిజర్వాయర్‌పై 15 మెగావాట్ల సామ ర్థ్యంతో 2 ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మిస్తుండగా, అందులో సిద్ధమైన 5 మెగా వాట్ల ప్లాంట్లను సంక్రాంతి సందర్భంగా 15న ప్రారంభిస్తారు. తొలి, రెండు దశల్లో 219 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన సింగరేణి మూడో దశ కింద 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నిర్మిస్తోంది. -
జల నిధిలోనూ సౌర కాంతులు
సాక్షి, అమరావతి: భూమిపై మనం ఉపయోగిస్తున్న శక్తికి మూలాధారం సూర్యుడే. సూర్యుడంటే ఒక ఆదర్శ శక్తి జనకం. మూడు వేల సంవత్సరాల క్రితమే సూర్యుడి నుంచి విద్యుత్ పుట్టించవచ్చనే విషయాన్ని మానవుడు ఆవిష్కరించినట్టు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. విజ్ఞానం ఎప్పుడూ ఆవిష్కరణ చోటే ఆగిపోదు. అక్కడి నుంచి మరో కొత్త అన్వేషణ మొదలవుతూనే ఉంటుంది. అప్పటినుంచి సౌర శక్తిని ఒడిసి పట్టుకోవడానికి విశ్వవ్యాప్తంగా అనేక పరిశోధనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఆ యజ్ఞంలోంచి ఆవిర్భవించిన సరికొత్త సాంకేతికతే నీటిలో తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి 100 గిగావాట్ల విద్యుత్‌ను వీటి ద్వారా ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. విశాఖలో మొదలై.. విశాఖ జిల్లా ఎన్టీపీసీ సింహాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 75 ఎకరాల్లోని నీటి వనరుల్లో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తొలుత ప్రారంభించింది. ప్రారంభించే నాటికి దేశంలోనే ఇదే అతిపెద్దది. ఇందులో లక్షకుపైగా ఉన్న సోలార్ పలకల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది. అదే విశాఖలో మేఘాద్రిగడ్డ రిజర్వాయర్‌పై 2.41 మెగావాట్ల ప్లాంట్‌ను జీవీఎంసీ నెలకొల్పింది. ఆ తరువాత తెలంగాణలో రామగుండం వద్ద ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్‌లో ఎన్టీపీసీ ఇలాంటి ఓ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. 100 మెగావాట్ల సామర్థ్యంతో 450 ఎకరాల మేర విస్తరించి ఉన్న సోలార్ ఫోటో వోల్టాయిక్ ప్రాజెక్టులో 4.50 లక్షల సోలార్ ప్యానల్స్ ఉంటాయి. ఇతర రాష్ట్రాల్లోనూ.. కేరళలోని కయంకుళం గ్యాస్ ప్లాంట్‌లో 92 మెగావాట్ల ఫ్లోటింగ్ యూనిట్ మొదలైంది. కేరళలోని కయంకుళం (100 కిలోవాట్లు), గుజరాత్‌లోని కవాస్ వద్ద ఒక మెగావాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేశాయి. మరికొన్ని చోట్ల ఈ తేలియాడే సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ (600 మెగావాట్ల) సౌర శక్తి ప్రాజెక్ట్ మనదేశంలో రాబోతోంది. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని నర్మదా నదిపై ఓంకారేశ్వర్ ఆనకట్ట వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టు 2022–23లోనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. ఆనకట్టలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు 2 వేల హెక్టార్ల నీటి ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అనేక ప్రయోజనాలు ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఫ్లోటో–వోల్టాయిక్స్ అని కూడా పిలుస్తారు. వీటి ఏర్పాటుకు భూమి అవసరం లేదు. నీటిపైనే అమరుస్తారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇవి సంప్రదాయ సోలార్ ప్యానల్స్ కంటే ఖరీదైనవి. అయితే, ఫ్లోటింగ్ సోలార్ ఇన్న్టలేషన్ల పెట్టుబడిపై రాబడి కూడా నేలపై నిర్మించే (గ్రౌండ్ మౌంటెడ్) వాటి కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రాంతంలో విస్తరిస్తాయి. నిర్వహణ కూడా భారీగా ఉంటుంది. అయితే, తేలియాడే సోలార్ ప్యానల్స్ ఎక్కువగా తుప్పు పట్టవు. లోడ్ కెపాసిటీ, సుదీర్ఘ జీవితకాలం ఉంటుందని ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధన విభాగం నిపుణులు చెబుతున్నారు. ప్యానల్స్ సహజ శీతలీకరణ కారణంగా అవి నేలపై వాటి కంటే ఐదు నుండి ఏడు శాతం మెరుగైన ఫలితాలను ఇస్తాయి. 25 సంవత్సరాలకు పైగా నీటిలో ఉన్నా ఈ ప్యానళ్లకు ఏమీ కాదు. రిజర్వాయర్లు, సరస్సులు, నీటిపారుదల కాలువలు వంటివి తేలియాడే సోలార్ ప్యానెల్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటాయి. వీటిపై ఏర్పాటు చేయడం వల్ల వరదల వల్ల ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. నీటి మట్టాల హెచ్చుతగ్గులకు తగ్గట్టుగా సోలార్ ప్యానెల్స్ పైకీకిందికి కదులుతాయి తప్ప మునిగిపోయే అవకాశం లేదని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. -
అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అందుబాటులోకి..
గోదావరిఖని/కందుకూరు: దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్(నీటిపై తేలియాడే) సోలార్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. 100 మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 ఎకరాల్లో రూ.423 కోట్లతో ఈ ప్లాంట్‌ను నెలకొల్పారు. అనంతరం జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ సందర్భంగా అధికారులు రామగుండం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఫంక్షన్హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెద్ద డిజిటల్ డిస్ప్లే ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రారంభించిన అనంతరం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ మాట్లాడుతూ ఈ ప్లాంట్‌ను దశలవారీగా విస్తరించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ఆవరణలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ ప్రాజెక్టు స్టేజీ–1లో రెండు యూనిట్ల పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. సెప్టెంబర్ రెండోవారంలో ట్రయల్‌కు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. భారత్ అగ్రగామిగా నిలవాలి: కిషన్‌రెడ్డి. విద్యుత్ సంస్కరణలతో రానున్న 25 ఏళ్లల్లో విద్యుత్ ఉత్పాదనలో ప్రపంచ దేశాల్లోనే మనదేశం అగ్రగామిగా నిలిచేలా ప్రధాని మోదీ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఉజ్వల్ భారత్, ఉజ్వల్ భవిష్య పవర్ 2047 పేరుతో పీఎం మోదీ, కేంద్ర విద్యుత్ మంత్రి రాజ్‌కుమార్‌సింగ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల పరిషత్ సమావేశ మందిరం నుంచి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్‌కు 40 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు. బోరుబావులకు ఎలాంటి మీటర్లు పెట్టడం లేదని, అయినా కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా రైతులకు యూరియా బాధలు తప్పాయని చెప్పారు. కార్యక్రమంలో పవర్‌గ్రిడ్ ఈడీ రాజేశ్ శ్రీవాత్సవ, సీనియర్ జీఎంలు హరినారాయణ, జీవీ రావు, పీవీఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
30న ఎన్టీపీసీ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ జాతికి అంకితం
జ్యోతినగర్ (రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్‌లో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ఈనెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణానికి అనుకూలంగా రూ.423 కోట్ల వ్యయంతో ఈ ప్లాంట్‌ను నిర్మించారు. ప్రాజెక్టు రిజర్వాయర్‌లో దాదాపు 500 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేశారు. ఒక్కోటి 2.5 మెగావాట్ల చొప్పున 40 బ్లాకులుగా ఈ ప్లాంట్‌ను విభజించారు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి సుమారు 32.5 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి ఆవిరిని నివారించవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. కాగా, వర్చవల్ పద్ధతిలో ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నందున అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. -
వికసించిన ‘సౌర’ పుష్పం
సహజ వనరుల వినియోగంలో జీవీఎంసీ రోల్ మోడల్‌గా వ్యవహరిస్తోంది. తన పరిధిలోని అన్ని వ్యవస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తోంది. వినూత్నంగా ఆలోచిస్తూ విద్యుత్ బిల్లులు ఆదా చేయడంతో పాటు కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముడసర్లోవలో రిజర్వాయర్‌లో దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసిన కార్పొరేషన్.. తాజాగా మేహాద్రిగెడ్డపై మరో ప్లాంట్‌ను పూర్తి చేసింది. రూ.14.04 కోట్లతో 3 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ నుంచి విద్యుదుత్పత్తి గత నెల 30 నుంచి ప్రారంభమైంది. సాక్షి, విశాఖపట్నం : సోలార్ విద్యుత్‌పై నగర ప్రజలకు అవగాహన కల్పించి.. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు జీవీఎంసీ ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా ఏకంగా 7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తయ్యేలా వివిధ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. తమ పరిధిలో ఉన్న జీవీఎంసీ భవనాలపై విద్యుత్ ‘సౌర’భాలు పూయిస్తోంది. నీటిపై సౌర ఫలకలు తేలియాడుతూ విద్యుత్ ఉత్పత్తి చేసేలా దేశంలోనే అతి పెద్ద తొలి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ముడసర్లోవలో రిజర్వాయర్‌లో రూ.11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు నిర్మించింది. దేశంలో తొలి అతి పెద్ద ప్రాజెక్టుకు బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ అవార్డు దక్కింది. ఇప్పుడు దానికంటే పెద్ద ప్రాజెక్టును మేహాద్రి గెడ్డపై ఏర్పాటు చేసి.. ఔరా అనేలా చేసింది. రూ.14.04 కోట్లు.. 3 మెగావాట్లు 2019 డిసెంబర్లో పనులు ప్రారంభించి, ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. రూ.14.04 కోట్లతో మొత్తం 3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టు సిద్ధమైంది. తడిచినా తుప్పుపట్టని, జర్మన్ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. రెండు మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు కలిగిన 9,020 ఫోమ్ టెక్నాలజీతో కూడిన ఎల్లో ట్రూపర్స్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుర్గావ్కు చెందిన రెన్యూ సోలార్ సిస్టమ్ ప్రై. లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(వీసీఐసీడీపీ)లో భాగంగా ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్‌కి సంబంధించి అర్బన్ క్లైమేట్ చేంజ్ రెసిలియన్స్ ట్రస్ట్ ఫండ్(యూసీసీఆర్టీఎఫ్) నిధులతో ప్రాజెక్టు పూర్తి చేసింది. 12 ఎకరాలు.. 40 శాతం నీరు ఆదా సాధారణంగా 3 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్ నిర్మించేందుకు 12 ఎకరాల విస్తీర్ణం అవసరం ఉంటుంది. కానీ మేహాద్రి రిజర్వాయర్‌లో నీటి ఉపరితలంపై ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో 12 ఎకరాలు ఆదా చేయగలిగారు. రిజర్వాయర్‌లోని 0.1 శాతం విస్తీర్ణంలో అంటే 0.005 చ.కి.మీ విస్తీర్ణంలో సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్ నీటి ఉపరితలంపై ఉండటంతో రిజర్వాయర్‌లోని నీరు ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా 40 శాతం వరకూ నీటిని కూడా ఆదా చేస్తుంది. మరో మైలురాయి అధిగమించాం.. ఇటీవల కాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్‌పై దృష్టిసారించాం. విద్యుత్ ఆదా చేస్తే ప్రజలతో పాటు నగరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయంలో నగరవాసులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా జీవీఎంసీ నుంచే సోలార్ విద్యుత్ వినియోగం ప్రారంభిస్తున్నాం. మేహాద్రిగెడ్డపై రెండో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు మంచి ఫలితాలందిస్తోంది. – గొలగాని హరి వెంకటకుమారి, నగర మేయర్ ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కమిషనర్ సూచనల మేరకు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాం. మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల పాటు అప్పగించాం. 20 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఆధునిక సాంకేతికతతో ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాజెక్టులతో దాదాపు 20 వేల టన్నులకు పైగా కర్బన ఉద్గారాల్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాం. – రవికృష్ణరాజు, జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ -
మార్చికి ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రిజర్వాయ ర్‌పై తలపెట్టిన నీటిపై తేలియాడే 15 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఇందులో తొలి విడతగా 5 మెగావాట్ల ప్లాంట్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సూచిం చారు. గురువారం ఆయన సింగరేణి భవన్లో సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో మూడు దశల్లో సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం చేపట్టగా, ఇప్పటికే 172 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొదటి దశలో మిగిలి ఉన్న 10 మెగావాట్ల ప్లాంట్ (రామగుండం– 3), రెండవ దశలో మిగిలిఉన్న కొత్తగూడెంలోని 37 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ నెలాఖరుకల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. అలాగే కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశ యంపై నిర్మించతలపెట్టిన 250 మెగావాట్ల తేలి యాడే సోలార్ ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని వచ్చే ఏడాది మార్చిలో టెండర్లు పిలవడా నికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది దేశంలోని అత్యుత్తమ విద్యుత్ కేంద్రాల్లో ఏడవ స్థానం సాధించినందుకు ఆయన అధికారులను అభినందించారు. ఈ ఏడాది 93 నుంచి 94 శాతం సామర్థ్యం (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని, దేశంలో అత్యుత్తమ 25 ప్లాంట్లలో మొదటి ఐదు స్థానాల్లో ఈ కేంద్రం నిలిచేలా కృషి చేయాలని అన్నారు. కాగా, సింగరేణి సంస్థ త్వర లోనే 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి రికార్డు సృష్టించబోతోందని తెలిపారు. -
ఆ సోలార్ ప్లాంట్ నదిపై తేలుతుంది!
విద్యుత్.. ఇది లేని పపంచాన్ని ప్రస్తుతం ఊహించలేం. అంత ప్రాధాన్యమున్న విద్యుత్‌ను ఇప్పుడు వివిధ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. థర్మల్, హైడల్, న్యూక్లియర్. కానీ వీటి వల్ల లాభాలెన్ని ఉన్నాయో అదేస్థాయిలో నష్టాలూ ఉన్నాయి. అంతేకాక థర్మల్, న్యూక్లియర్ ప్లాంట్ల వల్ల విపరీతమైన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ప్రపంచం ఇప్పుడు సౌరశక్తిపై దృష్టి పెట్టింది. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఉండదు. మెయింటనెన్స్ కాస్ట్ కూడా ఉండదు. ఎప్పటికీ తరిగిపోదు. మరి పెద్ద స్థాయిలో సోలార్ ప్లాంట్లు పెట్టాలంటే మాటలు కాదు. వందలు, వేల ఎకరాలు భూములు అవసరమవుతాయి. అందుకు వ్యవసాయ, అటవి భూములను ధ్వంసం చేయాల్సి వస్తుంది. ఇక జపాన్ లాంటి దేశాల్లోనైతే ఇది మరింత కష్టం. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా 'ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్' ముందుకొచ్చింది. రిజర్వాయర్లు, ఆనకట్టలపై సోలార్ పవర్ ప్లాంట్లను నిర్మించడమే ఈ పద్ధతి. నీటిపై తేలియాడుతూ ఉండే ఈ సౌరవిద్యుత్ కేంద్రాల వల్ల ఎలాంటి భూ అవసరం ఉండదు. జపాన్ వంటి దేశాలు ఇప్పటికే వీటి నిర్మాణంలో ఎంతో ముందంజలో ఉన్నాయి. జపాన్ ఇప్పటికే ఇలాంటి ఫ్లోటింగ్ సౌరవిద్యుత్ కేంద్రాలను మూడింటిని విజయవంతంగా నిర్మించి.. సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటున్నది. ఇక మన దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పశ్చిమ బెంగాల్లో నిర్మించారు. పది కిలోవాట్ల సామర్థ్యంతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. జపాన్‌కు చెందిన క్యోసెరా సోలార్ పవర్ కంపెనీ ఇప్పుడు ఏకంగా ప్రపంచంలో అత్యంత ఎక్కువ సామర్థ్యం కల్గిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను నిర్మిస్తోంది. 13.7 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ జపాన్ రాజధాని టోక్యో కి తూర్పున ఉన్న యమకురా డామ్ రిజర్వాయర్‌లో 1,80,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది ఏడాదికి 16,170 మెగావాట్-అవర్స్ విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుందని క్యోసెరా కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్ పూరైయితే 4,970 గృహాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఏడాదిలో ఉత్పత్తి అయ్యే కార్బన ఉద్గారాలు కూడా ఇది భారీగా తగ్గించనుంది. అయితే ఈ ప్లాంట్ నిర్మాణవ్యయం మామూలు సోలార్ ప్లాంట్లతో పోలిస్తే కాస్త ఎక్కువే ఉంటుంది.