ఆ సోలార్ ప్లాంట్ నదిపై తేలుతుంది!
విద్యుత్.. ఇది లేని పపంచాన్ని ప్రస్తుతం ఊహించలేం. అంత ప్రాధాన్యమున్న విద్యుత్‌ను ఇప్పుడు వివిధ పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. థర్మల్, హైడల్, న్యూక్లియర్. కానీ వీటి వల్ల లాభాలెన్ని ఉన్నాయో అదేస్థాయిలో నష్టాలూ ఉన్నాయి. అంతేకాక థర్మల్, న్యూక్లియర్ ప్లాంట్‌ల వల్ల విపరీతమైన వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ప్రపంచం ఇప్పుడు సౌరశక్తిపై దృష్టి పెట్టింది. దీనివల్ల వాతావరణ కాలుష్యం ఉండదు. మెయింటనెన్స్ కాస్ట్ కూడా ఉండదు. ఎప్పటికీ తరిగిపోదు. మరి పెద్ద స్థాయిలో సోలార్ ప్లాంట్లు పెట్టాలంటే మాటలు కాదు. వందలు, వేల ఎకరాలు భూములు అవసరమవుతాయి. అందుకు వ్యవసాయ, అటవి భూములను ధ్వంసం చేయాల్సి వస్తుంది. ఇక జపాన్ లాంటి దేశాల్లోనైతే ఇది మరింత కష్టం.
అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా 'ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్' ముందుకొచ్చింది. రిజర్వాయర్లు, ఆనకట్టలపై సోలార్ పవర్ ప్లాంట్‌లను నిర్మించడమే ఈ పద్ధతి. నీటిపై తేలియాడుతూ ఉండే ఈ సౌరవిద్యుత్ కేంద్రాల వల్ల ఎలాంటి భూ అవసరం ఉండదు. జపాన్ వంటి దేశాలు ఇప్పటికే వీటి నిర్మాణంలో ఎంతో ముందంజలో ఉన్నాయి. జపాన్ ఇప్పటికే ఇలాంటి ఫ్లోటింగ్ సౌరవిద్యుత్ కేంద్రాలను మూడింటిని విజయవంతంగా నిర్మించి.. సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటున్నది. ఇక మన దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పశ్చిమ బెంగాల్‌లో నిర్మించారు. పది కిలోవాట్ల సామర్థ్యంతో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
జపాన్‌కు చెందిన క్యోసెరా సోలార్ పవర్ కంపెనీ ఇప్పుడు ఏకంగా ప్రపంచంలో అత్యంత ఎక్కువ సామర్థ్యం కల్గిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను నిర్మిస్తోంది. 13.7 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ జపాన్ రాజధాని టోక్యో కి తూర్పున ఉన్న యమకురా డామ్ రిజర్వాయర్‌లో 1,80,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇది ఏడాదికి 16,170 మెగావాట్-అవర్స్ విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుందని క్యోసెరా కంపెనీ తెలిపింది. ఈ ప్లాంట్ పూరైయితే 4,970 గృహాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని పేర్కొంది. అంతేకాకుండా ఏడాదిలో ఉత్పత్తి అయ్యే కార్బన ఉద్గారాలు కూడా ఇది భారీగా తగ్గించనుంది. అయితే ఈ ప్లాంట్ నిర్మాణవ్యయం మామూలు సోలార్ ప్లాంట్లతో పోలిస్తే కాస్త ఎక్కువే ఉంటుంది.