
ప్లాంటుకు అనుబంధంగా ఏర్పాటైన సోలార్ ప్యానెల్స్
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కృష్ణా, గోదావరి(కేజీ) బేసిన్‌లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) విద్యుత్ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. స్వీయ అవసరాలతోపాటు కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాల్లో స్థానికులకు విద్యుత్తు సరఫరాలో భాగస్వామ్యం వహించే దిశగా చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాటిపాక ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్‌లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మన రాష్ట్రంలో తొలి ప్రయోగాన్ని ఇది వరకే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చేసింది. అదీ కూడా కేవలం విద్యుత్ సరఫరా మాత్రమే. నగరం గ్రామంలో రెండో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. కేరళలో ఇదివరకే ఏర్పాటైన అగ్రిసోలార్ ప్లాంట్(పైన సోలార్ ప్యానల్స్, భూమిపై వ్యవసాయం) మాదిరిగానే ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటవుతోంది.
23.50 ఎకరాలు.. రూ.24 కోట్లు
విద్యుత్ ప్లాంట్ కోసం ఓఎన్‌జీసీ సుమారు రూ.24 కోట్లు వెచ్చిస్తోంది. 23.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్స్‌కు అప్పగించింది. ఈ ప్లాంట్‌కు అనుబంధంగా 33 కేవీ సబ్‌స్టేషన్, రెండు మెగావాట్ల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన మూడు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, 18,450 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆరు మెగావాట్స్ డీసీ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దానిని ఇన్వర్టర్ల ద్వారా ఐదు మెగావాట్స్ ఏసీ విద్యుత్‌గా మార్చే విధంగా డిజైన్ చేశారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు 20 వేల నుంచి 25 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఓఎన్‌జీసీ లక్ష్యం.
ఆ పల్లెల్లో ఇక సోలార్ వెలుగులు...
రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని 12 గ్రామాల్లో సౌర వెలుగులు ప్రసరించనున్నాయి. తాటిపాక, పొదలాడ, మామిడికుదురు, గెద్దాడ, పెదపట్నంలంక, పెదపట్నం, నగరం, మొగలికుదురు, పాశర్లపూడి, పాశర్లపూడిలంక, అప్పనపల్లి, బి.దొడ్డవరం తదితర గ్రామాల్లో ఈ ప్లాంట్ వెలుగులు ప్రసరించనున్నాయి.
ఆనందంగా ఉంది
మా గ్రామంలో ప్లాంట్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ తరహా సమస్యలు తొలగనున్నాయి.
– మట్టపర్తి రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగి, నగరం
గ్రామం అభివృద్ధి చెందుతుంది
ప్లాంట్ ఏర్పాటు వల్ల మా గ్రామం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. మా విద్యుత్ అవసరాలు తీరడంతోపాటు నాణ్యమైన విద్యుత్‌ను పొందే అవకాశం దక్కుతుంది.
– బత్తుల ప్రకాశం, నగరం, టీచర్
Comments
Please login to add a commentAdd a comment