సాక్షి, మంచిర్యాల: సౌర వెలుగుల్లోని అవినీతి చీకట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో గోబర్‌గ్యాస్ నిర్మాణాల్లో బయటపడిన అవినీతి తరహాలోనే సోలార్ యూనిట్లలోనూ రూ. లక్షల సబ్సిడీ సొమ్ము మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లింది. 2014–15 మధ్యకాలంలో పంపిణీ చేసిన సౌర యూనిట్లలో చోటుచేసుకున్న ఈ అవినీతిపై సీఐడీ, సంబంధిత అధికారులు విచారణ చేపడుతుండటంతో జరిగిన అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆడిట్‌లో ఈ తతంగం బయటపడగా.. ఇప్పటికే కొంతమంది అధికారులు, డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఐడీ, తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్‌ఆర్‌ఈడీసీవో) అధికారులు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి జరిగిన అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పక్కదారి పట్టిన సబ్సిడీ సొమ్ము
ప్రతి ఇంటా సౌర విద్యుత్ వినియోగం పెంపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సోలార్ ప్లాంటును సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేశాయి. ఒక్కో సౌర యూనిట్ ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించాయి. మొదట్లో లబ్ధిదారుడు మొత్తం యూనిట్ విలువ చెల్లిస్తే ఆ తర్వాత సబ్సిడీ అందించేలా నిబంధన ఉండేది. ఆ తర్వాత సబ్సిడీ పోను రూ. 60 వేలు చెల్లిస్తే చాలని కేంద్రం నిబంధన సడలించడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే ఇక్కడే కొందరు ఏజెన్సీదారులు తమ చేతివాటం చూపించారు.
ఫొటోలు, వివరాలు మార్చి..
దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి ఇళ్లలో సోలార్ యూనిట్లు అందజేయకున్నా.. తప్పుడు వివరాలతో డబ్బులు స్వాహా చేశారు. కొంతమంది ఏజెన్సీదారులు అనేకమంది వివరాలు సేకరించి ఒకే యూనిట్‌ను ఫొటోలు తీసి.. వేర్వేరుగా కనిపించేలా పెట్టి లబ్ధిదారుల పేర్లను వాడుకుని సబ్సిడీని పక్కదారి పట్టించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్, కొమురంభీం జిల్లాల పరిధిలో మొత్తం 91 యూనిట్లు మంజూరు కాగా ఇందులో సగానికి సగం బోగస్ ఉన్నట్లు, మంచిర్యాల పట్టణ పరిధిలో 19 యూనిట్లకు పదింటిలో అవకతవకలు జరిగినట్లు తేలింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 40 యూనిట్లలో 20 యూనిట్ల సబ్సిడీ సొమ్మును 2 ఏజెన్సీలు కాజేసినట్లు గుర్తించారు. మరో రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తు కూడా చేయలేదు.
నేను సోలార్ ప్లాంట్ కోసం దరఖాస్తు చేయలేదు. ఎక్కడా డబ్బులు చెల్లించలేదు. నాకు సోలార్ పరికరాలు కూడా రాలేదు. నా పేరు మీద సబ్సిడీ వచ్చినట్లు అధికారులు చెప్పేదాకా నాకు తెలియదు.
– పి.రాజేశ్వర్, సర్వాయిపేట, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా
సౌర వెలుగుల్లో అవినీతి చీకటి
Published Thu, Feb 27 2020 2:09 AM | Last Updated on Thu, Feb 27 2020 2:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment