Gobar gas plants
-
పల్లెల్లో మళ్లీ గోబర్ గ్యాస్!
కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం కారణంగా వచ్చే పొగతో మహిళలు అనారోగ్యం బారినపడి దేశంలో ఐదు లక్షల మంది మరణించినట్టు ప్రపంచ ఆర్యోగ సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. కట్టెల పొయ్యిల మీద వంట వల్ల మహిళలతో పాటు లక్షలాది కుటుంబాల్లో చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై వారి వైద్యానికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించింది. సాక్షి, అమరావతి: కట్టెల పొయ్యిపై వంట స్థానంలో పేదలు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో వంట చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి గ్రామీణ ప్రాంత ప్రజలను గోబర్ గ్యాస్ (పశువుల పేడ ద్వారా గ్యాస్ తయారు చేసుకునే విధానం) వినియోగం వైపు మళ్లించేందుకు మళ్లీ కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో గ్రామాల్లో రైతులు గానీ, ఇతరులెవరైనా వ్యక్తిగతంగా ఎవరికి వారు పశువుల పేడ ద్వారా తామే గోబర్ గ్యాస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తే ప్రభుత్వం ఆ ప్లాంట్ నిర్మాణానికయ్యే ఖర్చులో అత్యధిక సబ్సిడీ చెల్లించింది. ప్లాంట్లను తర్వాత లబ్ధిదారులు పలు కారణాలతో వినియోగించుకోకపోవడంతో ఈ కార్యక్రమం విఫలమైంది. ఇప్పుడు తాజాగా వ్యక్తిగత గోబర్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు స్థానంలో సహకార విధానంలో, వ్యాపారాత్మక ధోరణిలోనూ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టారు. 10 సహకార ప్లాంట్లు, ఒక కార్పొరేట్ ప్లాంటు.. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా ఈ ఆర్థిక ఏడాదికి సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలిచ్చేందుకు జిల్లాకు రూ.50 లక్షల చొప్పున 13 జిల్లాలకు కలిపి రూ.6.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సహకార విధానంలో 10 చోట్ల, వ్యాపార ధోరణితో కార్పొరేట్ సంస్థలతో ఒక ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గోబర్ గ్యాస్ ఉత్పత్తి ఇలా సహకార విధానంలో అంటే? 20–50 మంది సంఘంగా ఏర్పడి మధ్యస్థ గోబర్ గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా ఉత్పత్తయ్యే గ్యాస్‌ను ఆ 20–50 మంది వంటకు వినియోగించుకునే వీలు కల్పించడం. ఈ విధానంలో గోబర్ గ్యాస్ ప్లాంటు ఏర్పాటుకు ఒక్కొక్క వ్యక్తిగత లబ్ధిదారునికి ప్రభుత్వం అందజేసే రూ.10 వేల సబ్సిడీ అందరి డబ్బులు కలిపి ఈ ప్లాంట్ నిర్మాణానికి ఖర్చు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తారు. వ్యాపారాత్మక ధోరణిలో.. ఆసక్తి ఉన్న ఒక కార్పొరేట్ సంస్థను ఎంపిక చేసుకొని, వారి ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో ఉత్పిత్తయ్యే గ్యాస్‌ను ఆ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరకు సరఫరా చేస్తారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట ఈ తరహా ప్లాంట్ ఏర్పాటుకు ఉపక్రమించారు. గ్రామాలూ పరిశుభ్రం పశువులు రోడ్లపై వేసే పేడ చాలా చోట్ల తొలగించక అనేక గ్రామాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. పేడను గోబర్ గ్యాస్ ప్లాంట్లకు వినియోగించడానికి ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు గ్యాస్ తయారీ అనంతరం వచ్చే పదార్థాలను రైతులు ఎరువుగా ఉపయోగించుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు. గోబర్ గ్యాస్ ప్లాంట్ల ద్వారా అతి తక్కువ ధరకే గ్యాస్ దొరకడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం దక్కుతుందని చెబుతున్నారు. ఆధ్యయనం చేస్తున్నాం.. – పి.సంపత్‌కుమార్, ఎండీ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సహకార పద్ధతిన, వ్యాపార ధోరణితో గోబర్ గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు గేదెలు, ఆవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నాం. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకొని, ఆ మేరకు వ్యాపార విధానంలో ప్లాంట్ ఏర్పాటుకు అసక్తి ఉన్న సంస్థ ఎంపికకు ఈవోఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) నిర్వహిస్తాం. -
సౌర వెలుగుల్లో అవినీతి చీకటి
సాక్షి, మంచిర్యాల: సౌర వెలుగుల్లోని అవినీతి చీకట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో గోబర్‌గ్యాస్ నిర్మాణాల్లో బయటపడిన అవినీతి తరహాలోనే సోలార్ యూనిట్లలోనూ రూ. లక్షల సబ్సిడీ సొమ్ము మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్లింది. 2014–15 మధ్యకాలంలో పంపిణీ చేసిన సౌర యూనిట్లలో చోటుచేసుకున్న ఈ అవినీతిపై సీఐడీ, సంబంధిత అధికారులు విచారణ చేపడుతుండటంతో జరిగిన అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆడిట్లో ఈ తతంగం బయటపడగా.. ఇప్పటికే కొంతమంది అధికారులు, డీలర్లపై కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సీఐడీ, తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీఎస్ఆర్ఈడీసీవో) అధికారులు లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి జరిగిన అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పక్కదారి పట్టిన సబ్సిడీ సొమ్ము ప్రతి ఇంటా సౌర విద్యుత్ వినియోగం పెంపొందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సోలార్ ప్లాంటును సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేశాయి. ఒక్కో సౌర యూనిట్ ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించాయి. మొదట్లో లబ్ధిదారుడు మొత్తం యూనిట్ విలువ చెల్లిస్తే ఆ తర్వాత సబ్సిడీ అందించేలా నిబంధన ఉండేది. ఆ తర్వాత సబ్సిడీ పోను రూ. 60 వేలు చెల్లిస్తే చాలని కేంద్రం నిబంధన సడలించడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే ఇక్కడే కొందరు ఏజెన్సీదారులు తమ చేతివాటం చూపించారు. ఫొటోలు, వివరాలు మార్చి.. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి ఇళ్లలో సోలార్ యూనిట్లు అందజేయకున్నా.. తప్పుడు వివరాలతో డబ్బులు స్వాహా చేశారు. కొంతమంది ఏజెన్సీదారులు అనేకమంది వివరాలు సేకరించి ఒకే యూనిట్‌ను ఫొటోలు తీసి.. వేర్వేరుగా కనిపించేలా పెట్టి లబ్ధిదారుల పేర్లను వాడుకుని సబ్సిడీని పక్కదారి పట్టించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్, కొమురంభీం జిల్లాల పరిధిలో మొత్తం 91 యూనిట్లు మంజూరు కాగా ఇందులో సగానికి సగం బోగస్ ఉన్నట్లు, మంచిర్యాల పట్టణ పరిధిలో 19 యూనిట్లకు పదింటిలో అవకతవకలు జరిగినట్లు తేలింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 40 యూనిట్లలో 20 యూనిట్ల సబ్సిడీ సొమ్మును 2 ఏజెన్సీలు కాజేసినట్లు గుర్తించారు. మరో రెండు మూడు రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు కూడా చేయలేదు. నేను సోలార్ ప్లాంట్ కోసం దరఖాస్తు చేయలేదు. ఎక్కడా డబ్బులు చెల్లించలేదు. నాకు సోలార్ పరికరాలు కూడా రాలేదు. నా పేరు మీద సబ్సిడీ వచ్చినట్లు అధికారులు చెప్పేదాకా నాకు తెలియదు. – పి.రాజేశ్వర్, సర్వాయిపేట, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా -
అంతా గ్యాస్..!
గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు గేదెలు, బ్యాంకు లోన్లు వస్తాయంటూ మోసం ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు అధికారులు, ఎస్ఈడబ్ల్యూల కుమ్మక్కు యథేచ్ఛగా వాటాల పంపకం నల్లగొండ టౌన్ : తెలంగాణ నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణాల్లో పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నాసిరకంగా పనులు చేయడం, లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్ల పర్వం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్లాంట్ల నిర్మాణాలు చేయకుండానే సబ్సిడీని నొక్కేసినట్లు తెలిసింది. అప్పనంగా లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్న డబ్బులను అధికారులు, సెల్ఫ్ఎంప్లాయ్మెంట్ వర్కర్(ఎస్ఈడబ్ల్యూ)లు వాటాలుగా పంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలను అధికారులు సెల్ఫ్ ఎంప్లాయి వర్కర్లకు అప్పగించారు. ఒకప్లాంట్ నిర్మించుకుంటే రెండు బర్రెలతో పాటు రెండు లక్షల రూపాయల బ్యాంక్‌లోన్ వస్తుందని లబ్ధిదారులకు సెల్ఫ్ఎంప్లాయి వర్కర్లు ఆశచూపుతున్నారు. వారి మాటలు నమ్మిన లబ్ధిదారులు అడిగినంత ముట్టజెప్పి ప్లాంట్ నిర్మించుకున్నట్లు సమాచారం.మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాతున్నా పట్టించుకునేవారే లేరు.జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1314 యూనిట్లు మంజూరయ్యాయి. నూటికి నూరుశాతం నిర్మాణాలు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా 214-15 ఆర్థిక సంవత్సరంలో 1314 యూనిట్లు మంజూరు కాగా అవి కూడా నూటికి నూరు శాతం నిర్మాణాలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 1350 యూనిట్లు మంజూరు కాగా అందులో మార్చి 31 నాటికి 540 యూనిట్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చూపుతున్నాయి. యూనిట్ల కేటాయింపులు ఇలా.. జిల్లాకు మంజూరైన యూనిట్లలో ఎస్సీలకు 25శాతం, ఎస్టీలకు 30 శాతం, ఇతరులకు 45 శాతం యూనిట్లను మంజూరు చేయాలి. ఒక్కో యూనిట్ విలువ రూ.20 వేలు కాగా లబ్ధిదారుడి వాటా ఎస్సీ,ఎస్టీలకు రూ.9 వేలు(అందులో రూ.1000 సంస్థకు డీడీ రూపంలో చెల్లించాలి), మిగతా రూ.8 వేలలో గుంత తవ్వకం, ఇటుకలు, ఇతర సామగ్రికి ఖర్చు చేయాలి. ఇతరులు రూ. 11 వేలు భరించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ రూ.11వేలు, ఇతరకులకు రూ.9వేలు అందజేస్తారు. జిల్లాలో ముఖ్యంగా చందంపేట, పీఏపల్లి, దేవరకొండ, చింతపల్లి, నాంపల్లి, మునగాల , కోదాడ, డిండి, హాలియా, నేరేడుచర్ల, మిర్యాలగూడ, దామరచర్ల, గుర్రంపోడు తదితర మండలాలో గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టారు. అమాయక గిరిజన దళిత లబ్ధిదారుల నుంచి ప్లాంట్ ఒక్కంటికి రూ.1000 డీడీ కోసం కాగా రూ. 3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసి లక్షలాది రూపాయలను వాటాలుగా పంచుకుని అప్పన ంగా మింగేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం నిర్మించిన ప్లాంట్లు అనేకచోట్ల పనిచేయకుండా పాడైపోయినట్లు తెలుస్తోంది. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారితో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నా దృష్టికి కూడా వచ్చింది బర్రెలు, బ్యాంకు లోన్ వస్తాయంటూ లబ్ధిదారులకు ఆశలు చూపినట్లు నా దృష్టికి కూడా వచ్చింది. కోదాడ మండలంలో ప్లాంట్ల నిర్మాణాలపై తనిఖీకి వెళ్లినప్పుడు కొందరు లబ్ధిదారులు మాకు లోన్ ఎప్పుడు వస్తుందని అడిగారు. నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు, నాణ్యతలోపించినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. - ఎన్. భాను, సంస్థ జిల్లా కోఆర్టినేటర్