అంతా గ్యాస్..! | Corruption in Gobar gas plants | Sakshi
Sakshi News home page

అంతా గ్యాస్..!

Published Wed, Apr 6 2016 2:05 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Corruption in Gobar gas plants

    గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలు
     గేదెలు, బ్యాంకు లోన్లు వస్తాయంటూ మోసం
     ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు వసూలు
     అధికారులు, ఎస్‌ఈడబ్ల్యూల కుమ్మక్కు
     యథేచ్ఛగా వాటాల పంపకం

 
 నల్లగొండ టౌన్ :  తెలంగాణ నూతన పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణాల్లో పలు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. నాసిరకంగా పనులు చేయడం, లబ్ధిదారుల నుంచి డబ్బుల వసూళ్ల పర్వం కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్లాంట్‌ల నిర్మాణాలు చేయకుండానే సబ్సిడీని నొక్కేసినట్లు తెలిసింది. అప్పనంగా లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్న డబ్బులను అధికారులు, సెల్ఫ్‌ఎంప్లాయ్‌మెంట్ వర్కర్(ఎస్‌ఈడబ్ల్యూ)లు వాటాలుగా పంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  
 
 జిల్లాలో గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలను అధికారులు    
 సెల్ఫ్ ఎంప్లాయి వర్కర్‌లకు అప్పగించారు. ఒకప్లాంట్ నిర్మించుకుంటే        రెండు బర్రెలతో పాటు రెండు లక్షల రూపాయల బ్యాంక్‌లోన్ వస్తుందని లబ్ధిదారులకు సెల్ఫ్‌ఎంప్లాయి వర్కర్లు ఆశచూపుతున్నారు. వారి మాటలు నమ్మిన లబ్ధిదారులు అడిగినంత ముట్టజెప్పి ప్లాంట్ నిర్మించుకున్నట్లు సమాచారం.మూడేళ్లుగా ఈ వ్యవహారం కొనసాతున్నా పట్టించుకునేవారే లేరు.జిల్లాలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1314 యూనిట్లు మంజూరయ్యాయి.
 
 నూటికి నూరుశాతం నిర్మాణాలు పూర్తి చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అదే విధంగా 214-15 ఆర్థిక సంవత్సరంలో 1314 యూనిట్లు మంజూరు కాగా అవి కూడా నూటికి నూరు శాతం నిర్మాణాలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు  1350 యూనిట్లు మంజూరు కాగా అందులో మార్చి 31 నాటికి 540 యూనిట్ల నిర్మాణాలు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చూపుతున్నాయి.
 
 యూనిట్ల కేటాయింపులు ఇలా..
 జిల్లాకు మంజూరైన యూనిట్లలో ఎస్సీలకు 25శాతం, ఎస్టీలకు 30 శాతం, ఇతరులకు 45 శాతం యూనిట్‌లను మంజూరు చేయాలి. ఒక్కో యూనిట్ విలువ రూ.20 వేలు కాగా లబ్ధిదారుడి వాటా ఎస్సీ,ఎస్టీలకు రూ.9 వేలు(అందులో రూ.1000 సంస్థకు డీడీ రూపంలో చెల్లించాలి), మిగతా రూ.8 వేలలో గుంత తవ్వకం, ఇటుకలు, ఇతర సామగ్రికి ఖర్చు చేయాలి. ఇతరులు రూ. 11 వేలు భరించాల్సి ఉంటుంది.
 
 అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ రూ.11వేలు, ఇతరకులకు రూ.9వేలు అందజేస్తారు. జిల్లాలో ముఖ్యంగా చందంపేట, పీఏపల్లి, దేవరకొండ, చింతపల్లి, నాంపల్లి, మునగాల , కోదాడ, డిండి, హాలియా, నేరేడుచర్ల, మిర్యాలగూడ, దామరచర్ల, గుర్రంపోడు తదితర మండలాలో గోబర్‌గ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టారు. అమాయక గిరిజన దళిత లబ్ధిదారుల నుంచి ప్లాంట్ ఒక్కంటికి రూ.1000 డీడీ కోసం కాగా రూ. 3 వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేసి లక్షలాది రూపాయలను వాటాలుగా పంచుకుని అప్పన ంగా మింగేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం నిర్మించిన ప్లాంట్‌లు అనేకచోట్ల పనిచేయకుండా పాడైపోయినట్లు తెలుస్తోంది. అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారితో పాటు అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
 
 నా దృష్టికి కూడా వచ్చింది
 బర్రెలు, బ్యాంకు లోన్ వస్తాయంటూ లబ్ధిదారులకు ఆశలు చూపినట్లు నా దృష్టికి కూడా వచ్చింది. కోదాడ మండలంలో ప్లాంట్ల నిర్మాణాలపై తనిఖీకి వెళ్లినప్పుడు కొందరు లబ్ధిదారులు మాకు లోన్ ఎప్పుడు వస్తుందని అడిగారు. నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు, నాణ్యతలోపించినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
 - ఎన్. భాను,                             సంస్థ జిల్లా కోఆర్టినేటర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement