నల్లగొండ టూటౌన్ : అవినీతిపై పార్లమెంట్‌లో చర్చ జరగకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని, దానిపై మాట్లాడే హక్కు వారికి లేదని బీజేపీ శాసనసభాపక్షనేత జి. కిషన్‌రెడ్డి అన్నారు. సమర్పణ దివాస్ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అంటేనే దేశం, ప్రజల కోసం పనిచేసే పార్టీ అన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్ఫూర్తితో పార్టీ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి వచ్చాయని, నేతలు ధనవంతుల చేతుల్లో ఉండకూడదని పేర్కొన్నారు. రూ.1000, 500 నోట్లను రద్దు చేసి అవినీతిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసినట్లు చెప్పారు.
దేశంలో 12 వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అంతకు ముందు పండిట్ దీన్‌దయాళ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పండిట్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కిషన్‌రెడ్డి సమర్పణ దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. పార్టీ సీనియర్ నాయకులను సన్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కంకణాల శ్రీధర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఓరుగంటి రాములు, వీరెళ్లి చంద్రశేఖర్, శ్రీరామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, నూకల వెంకట్‌నారాయణరెడ్డి, పోతెపాక సాంబయ్య, బంటు సైదులు, యాస అమరేందర్‌రెడ్డి, కూతురు సత్యవతి, నూకల సంధ్యారాణి, రావెళ్ల కాశమ్మ పాల్గొన్నారు.
అవినీతిపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు
Published Sun, Feb 12 2017 2:39 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement