మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ దక్కని గెలుపు
ఆధిక్యంలో ఉన్నా సరిపడా ఓట్లు సాధించని తీన్మార్ మల్లన్న
గెలవాలంటే కావాల్సిన ఓట్లు 1,55,095
మల్లన్నకు 1,22,813 ఓట్లు.. రాకేశ్‌రెడ్డికి 1,04,248
నేడు రెండో ప్రాధాన్యతలో వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల విజేత వెల్లడి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం రెండో ప్రాధాన్యత ఓట్లతోనే తేలనుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో గెలుపునకు సరిపడా ఓట్లు ఎవరికీ రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అత్యధిక ఓట్లు (1,22,813) వచి్చనా, 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నా.. గెలుపునకు సరిపడా ఓట్లు మాత్రం సాధించలేకపోయారు. గెలుపు కోసం 1,55,095 ఓట్లు సాధించాల్సి ఉంది. దీంతో గురువారం రాత్రి 10 గంటలకు ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
గెలుపెవరిదో?
హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 18,565 మాత్రమే ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే రెండో ప్రాధాన్యత ఓట్లలో 32,282 ఓట్లు సాధించాల్సి ఉంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యతలో 1,04,248 ఓట్లు రాగా, ఆయన గెలవాలంటే 50,847 ఓట్లు రెండో ప్రాధాన్యతలో రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులతో పాటు స్వంతంత్ర అభ్యర్థి అశోక్‌కు కూడా భారీగానే ఓట్లు లభించాయి. మొత్తం 52 మంది అభ్యర్థులలో ఈ నలుగురు అభ్యర్థులకు 3,00,071 ఓట్లు వచ్చాయి.
మిగిలిన అభ్యర్థులందరికీ 10,118 ఓట్లు లభించాయి. ఇవన్నీ ఎలిమినేషన్‌లో క్రమంగా పోనున్నాయి. ఈ ఓట్లను లెక్కించినా గెలుపు టార్గెట్‌ను అభ్యర్థులు చేరుకునే అవకాశం లేదు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు 29,697 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆయన్ను ఎలిమినేట్ చేసి, ఆయనకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించినా గెలుపు కష్టంగానే కనిపిస్తోంది. చివరగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తరువాతే ఫలితం వెల్లడి కానుంది.
రెండు రోజులుగా కౌంటింగ్
ఈ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం ఓట్లు 4,63,839 కాగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ పత్రాలను బండిల్స్‌గా కట్టడానికే సరిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గురువారం రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఆ తరువాత గెలుపునకు టార్గెట్ 1,55,096 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత శుక్రవారం తుది ఫలితం తేలనుంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
నాలుగు హాళ్లలో 96 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో టేబుల్‌పై వేయి ఓట్ల చొప్పున గురువారం రాత్రి వరకు నాలుగు రౌండ్లలో 3,36,013 ఓట్లను లెక్కించారు. అందులో 3,10,189 ఓట్లు చెల్లినవిగా తేల్చారు. 25,824 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ఈ లెక్కింపు ఒకటో రౌండ్ ఫలితం బుధవారం రాత్రి 12:45 గంటలకు వెలువడగా, రెండో రౌండ్ ఫలితం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడైంది.
మూడో రౌండ్ ఫలితం సాయంత్రం 5 గంటలకు వెల్లడించగా, 4వ రౌండ్ ఫలితం రాత్రి 9 గంటలకు వెల్లడైంది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కు అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటరి్నంగ్ అధికారి దాసరి హరిచందన నేతృత్వంలో సిబ్బందికి మూడు షిప్టులలో వి«ధులు కేటాయించి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment