అవినీతిపై విచారణ జరిపించాలి
అవినీతిపై విచారణ జరిపించాలి
Published Sun, Oct 2 2016 10:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
నల్లగొండ టూటౌన్ : జిల్లాకు మంజూరైన ట్రాక్టర్లు, లక్ష రూపాయల లోపు వ్యవసాయ పనిముట్ల పంపిణీలో భారీ అవినీతి జరిగిందని.. ఇందులో జిల్లా కలెక్టర్‌కు భాగస్వామ్యం లేకుంటే తక్షణమే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా మంత్రికి కలెక్టర్ ఏజెంట్‌లా మారి వత్తాసు పలుకుతున్నారని ఘాటుగా విమర్శించారు. ట్రాక్టర్ల పంపిణీలో జేడీఏ కూడా ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. గత ఏడాది 600 ట్రాక్టర్లు, ఈ ఏడాది మరో 600 ట్రాక్టర్లు టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకే మంజూరయ్యాయన్నారు. ఈ నెల 5వ తేదీలోపు కలెక్టర్ స్పందించకుంటే అదేరోజు బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం’ అని సంకినేని హెచ్చరించారు. ఈ విషయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ అవినీతిని తాను ఆధారాలతో సహ మీడియా సమక్షంలో నిరూపిస్తానన్నారు.
నష్టం అంచనా వేసి పరిహారం అందించాలి
భారీ వర్షాలతో జిల్లాలో పంటలు నష్ట పోయాయని, అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేసి రైతాంగానికి పరిహారం అందించాలని సంకినేని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించ లేదన్నారు. గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీనే నేటికీ రైతులకు చెల్లించలేదన్నారు. జిల్లా మంత్రి వెంటనే స్పందించి, పంట నష్టం అంచనా వేయించాలని, కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా అదనంగా నిధులు కేటాయించి రైతులకివ్వాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నాయకులు పోతెపాక సాంబయ్య, బండారు ప్రసాద్, కూతురు లక్ష్మారెడ్డి, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొజ్జ శేఖర్, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, బొజ్జ నాగరాజు, భీపంగి జగ్జీవన్, యాదగిరాచారి, కాశమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement