కమల వ్యూహం | Telangana Election BJP Leaders Election Campaign Nalgonda | Sakshi
Sakshi News home page

కమల వ్యూహం

Published Sun, Sep 23 2018 2:42 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Telangana Election BJP Leaders  Election Campaign Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ఒంటిరి పోరుతో బరిలోకి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ వ్యూహాల్లో మునిగింది. జిల్లాలోని నాలుగు స్థానాల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నా.. కేవలం సూర్యాపేట స్థానం పైనే ఆపార్టీ ఆశలు పెట్టుకుంది. మిగతా మూడు స్థానాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటామని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. అభ్యర్థులను ప్రకటించకున్నా హుజూర్‌నగర్‌లో ఆపార్టీ నిర్వహించిన సభకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాంను తీసుకొచ్చి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. జిల్లాలో నాలుగు స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వాలన్న యోచనతో బీజేపీ పావులు కదుపుతోంది. గతంలో పొత్తులు, ఒంటరిగా పోటీ చేసిన సందర్భాలను అనుసరించి జిల్లాలో ఏ మండలంలో బలంగా ఉన్నాం.. ఏ నియోజకర్గంలో సత్తా చాటుతాం అన్న కోణంలో ఆపార్టీ నేతలు ముందస్తు ఎన్నికల్లో భాగంగా విశ్లేషణ చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా చూస్తే సూర్యాపేట నియోజకవర్గం పైనే ఆపార్టీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాలోనే ఇదొక్క స్థానంపై అంచనాలు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల పథకం ఇటీవల జిల్లా కేంద్రంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌తో ప్రారంభోత్సవం చేయించారు. ఈ సభకు బీజేపీ జన సమీకరణ చేసి ఇతర పార్టీలకు సవాల్‌ విసిరింది. అలాగే వారం రోజుల క్రితం హుజూర్‌నగర్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను ఆపార్టీ నిర్వహించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాంను తీసుకొచ్చి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రాష్ట్ర నాయకత్వం సారథ్యంలో జిల్లాలో నాలుగు చోట్ల కేంద్ర మంత్రులను తీసుకొచ్చి ఎన్నికల సభలను నిర్వహించాలన్న ఆలోచనలో ఆపార్టీ ఉంది. సూర్యాపేట నుంచి ఆపార్టీ నుంచి బరిలో దిగేందుకు సంకినేని సన్నద్ధమవుతున్నారు. తనకున్న వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు పార్టీ పరంగా బలంగా ఉన్నామని ఈ ఎన్నికల్లో విజయం తనదేనన్న ధీమాలో ఆయన ఉన్నారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో తనకున్న అనుచర గణం, కేడర్‌తో ఎన్నికల్లో టీఆర్‌ఎస్, మహాకూటమిని ఎదుర్కోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

పోటీ చేసి సత్తా చాటాలని..
తుంగతుర్తి, హుజూర్‌నగర్, కోదాడలో ఆ పార్టీ పోటీ చేసి గెలుపు, ఓటములను ప్రభావితం చేయాలని.. తమ బలం ఎంతో తెలుసుకునేందుకు అభ్యర్థులను బరిలో దించాలని చూస్తోంది.. ఒంటరి పోరు కావడంతో ఈ మూడు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. కోదాడ నియోజవకర్గంలో నేతలు వందనపు సురేష్, బొలిశెట్టి కృష్ణయ్య, నూనె సులోచన, యాదా రమేష్‌లు ఎవరికి వారు తమకే టికెటన్న ఆశల పల్లకిలో ఉన్నారు. గతంలో 1999, 2004లో ఆపార్టీ తరఫున అభ్యర్థులు కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇక హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో జిల్లేపల్లి వెంకటేశ్వర్లు, బొబ్బా భాగ్యారెడ్డి టికెట్‌ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభకు ఇరువర్గాలు జన సమీకరణ చేశాయి. భాగ్యారెడ్డిది చింతపాలెం మండలం, వెంకటేశ్వర్లుది మేళ్లచెరువు మండలం కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా తమకున్న వ్యక్తి గత పరిచయాలతో ఈ ఎన్నికల్లో సత్తా చాటుతామనుకుంటున్నారు.
 
తుంగతుర్తి నుంచి కడియం..?
ఇక తుంగతుర్తి నుంచి రిటైర్డ్‌ మైనింగ్‌ అధికారి కడియం రామచంద్రయ్యను బరిలో దింపేందుకు ఆపార్టీ కసరత్తు చేస్తోంది. ఆయన ఇటీవల బీజేపీలో చేరారు. ఆయన స్వస్థలం నాగారం కావడంతో నియోజకవర్గ వ్యాప్తం గా పరిచయాలు ఉన్నాయని ఆపార్టీ భావిస్తోంది. ఆయన సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచనలో కడియంను పోటీలో దింపాలన్న ఆలోచనను పార్టీ చేస్తోంది. అంతేకాకుండా సంకినేని అనుచర గణం కూడా ఆయనతో కలిసి వస్తారని ఆశిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement