లక్నో : కైరానా లోక్‌సభ ఉపఎన్నికలో విపక్షాల చేతిలో బీజేపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పార్టీలోని అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని కూడా వార్తలు వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ హర్దోయి ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ సొంత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారు. రైతులు ప్రభుత్వం పట్ల వ‍్యతిరేకత కలిగి ఉన్నారు. ఇలాంటి ఇంకెన్నో కారణాల వల్లే మేం ఓటమి చవిచూడాల్సి వచ్చింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయిందంటూ శ్యామ్ ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా కైరానా ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేస్తూ తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పద్యం కూడా పోస్ట్ చేశారు. ‘మోదీ హవా కారణంగానే మీకు అధికారం దక్కించుకోగలిగారు గానీ ప్రజల మనసుల్ని గెలవలేకపోయారు. పగ్గాలు సంఘ్ చేతిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రైనా నిస్సహాయులుగా మారారు. అధికారులు అవినీతిలో కూరుకుపోయారు. దాంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు విసుగెత్తిపోయారు. ప్రభుత్వం గాడి తప్పింది. పాలన విఫలమైంది’ అంటూ సాగిన పద్యానికి తెలివైన వారికి ఇందులో కావాల్సిన సమాధానం దొరుకుతుందంటూ శ్యామ్ ప్రకాశ్ ముగింపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment