నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సంచలనం సృష్టించిన దేవరకొండ సహకార బ్యాంకు బ్రాంచ్ అవినీతి అక్రమాల కేసు మరుగున పడింది. రూపాయి కాదు రెండు రూపాయలు కాదు.. ఏకంగా రూ.18 కోట్లు స్వాహా చేసినట్లు తేలింది. అక్రమాలు జరిగి ఆరేళ్లు గడిచినా నేటికీ నయాపైసా అక్రమార్కులనుంచి రికవరీ చేయలేదు. 2011 నుంచి 2013 సంవత్సరం వరకు మూడేళ్లు నిధులు పక్కదారి పట్టినా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అక్కడి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
చేయి కాలాకా..ఆకులు పట్టుకున్నట్లు..అంతా అయిపోయాక.. అక్రమార్కులపై పోలీస్ కేసులు నమోదు చేయించి సస్పెండ్ మాత్రం చేయించారు. ఇక..అంతటితోనే ఆపేశారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన ఉన్నతాధికారులు.. పక్కదారి పట్టినసొమ్మును మాత్రం రికవరీ చేయించలేదనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధుల విషయంలో నిగ్గుతేల్చాల్సిన పాలకమండలి మాత్రం రెండు గ్రూపులుగా విడిపోయి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడంతోనే సరిపుచ్చుకుంటున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మూడేళ్లపాటు అక్రమాల పరంపర..
దేవరకొండ, తిమ్మాపూర్, మల్లెపల్లి, చిత్రియాల, డిండి, పీఏపల్లి, తవక్లాపూర్ సహకార సొసైటీల్లో 2011 నుంచి 2013 సంవత్సరం వరకు రుణాల మంజూరులో సిబ్బంది, అధికారులు చేతివాటం ప్రదర్శించారు. మొత్తంగా రూ.18 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంలో పాలకవర్గం, అధికారులు, రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌లు నాన్చుడు దోరణికి పాల్పడుతున్నారని గతంలో కొందరు డైరెక్టర్లు లోకాయుక్తాలో పిటిషన్ దాఖలు చేశారు. నాన్చుడు ధోరణికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమాలు వెలుగు చూసిన తొలుతలో దానికి బాధ్యుడిని చేస్తూ బ్రాంచ్ మేనేజర్‌ను సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసిన పాలకవర్గం.. తరువాత దానిపై అంత దృష్టి సారించలేదని ఆరోపణలు వచ్చాయి.
అందరి ‘సహకారం’తోనే..
రూ.18 కోట్ల మేర జరిగిన అక్రమాలలో పాలకమండలి సభ్యులతో పాటు డీసీసీబీలో కీలకపాత్ర పోషిస్తున్న అధికారులకు కూడా సంబంధం ఉందనే అనుమానాలను పలువురు డైరెక్టర్లు వ్యక్తం చేసి ఆందోళన కూడా చేశారు. దీనికి పాలకవర్గం ఐదుగురు డైరెక్టర్‌లతో కూడిన ఫ్రాడ్ కమిటీని వేసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి నివేదికను ఇవ్వాలని సూచించింది. కమిటీ దేవరకొండ, తిమ్మాపూర్, మల్లెపల్లి, చిత్రియాల, డిండి, పీఏపల్లి, తవక్లాపూర్ సొసైటీలలోని సభ్యులతోపాటు రుణాలను పొందినట్లు రికార్డులలో నమోదైన వారందరినీ విచారించింది. మొత్తం 17,91,44,139 రూపాయల మేరకు అక్రమాలు జరిగాయని తేల్చింది.
ఆ నివేదికను డీసీసీబీకి అందించింది. అధికారులు, పాలకవర్గం అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారని, నాలుగేళ్లుగా అక్రమాలు జరుగుతుంటే పర్యవేక్షించిన అధికారులు చేసిన నిర్వాకం, సొమ్మును రికవరీ చేయడానికి బాధ్యులందరి ఆస్తులను అటాచ్ చేయాలని, వారిని ఉద్యోగాల నుంచి తప్పించి విచారణ చేయాలని పలు సందర్భాల్లో పాలకమండలి సమావేశాల్లో సభ్యులు ఆందోళన కూడా చేశారు. విచారణను సీబీఐకి గాని సీబీసీఐడీకి గాని అప్పగించాలని బోర్డు సమావేశంలో తీర్మానం చేసి పంపించినా ఫలితం లేకుండా పోయింది,. చివరకు కేసు రాష్ట్ర సహకార కమిషనర్ పరిధిలోకి రెండేళ్ల క్రితం వెళ్లింది. కానీ ఇప్పటివరకు కేసు.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందనే వాదన వినిపిస్తోంది.
డీసీసీబీకి మాయని మచ్చ
బాధ్యులనుంచి దుర్వినియోగం చేసిన ప్రజాధనాన్ని రికవరీ చేయడంలో ఎలాంటి పురోగతి లేదన్న ఆరోపణలను సహకార శాఖ ఎదుర్కొంటోంది. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు దేవరకొండ అక్రమాల కేసు చెరిపివేయలేని మచ్చని మిగిల్చింది. ఇప్పటికైన అధికారులు స్పందించి పక్కదారి పట్టించిన వారినుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment