పల్లెల్లో మళ్లీ గోబర్‌ గ్యాస్‌! | Gober Gas Again In Villages | Sakshi
Sakshi News home page

పల్లెల్లో మళ్లీ గోబర్‌ గ్యాస్‌!

Published Mon, Dec 7 2020 4:49 AM | Last Updated on Mon, Dec 7 2020 5:23 AM

Gober‌ Gas Again In Villages - Sakshi

కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడం కారణంగా వచ్చే పొగతో మహిళలు అనారోగ్యం బారినపడి దేశంలో ఐదు లక్షల మంది మరణించినట్టు ప్రపంచ ఆర్యోగ సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది. కట్టెల పొయ్యిల మీద వంట వల్ల మహిళలతో పాటు లక్షలాది కుటుంబాల్లో చిన్న పిల్లలు అనారోగ్యానికి గురై వారి వైద్యానికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించింది. 

సాక్షి, అమరావతి: కట్టెల పొయ్యిపై వంట స్థానంలో పేదలు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో వంట చేసుకునేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనికి గ్రామీణ ప్రాంత ప్రజలను గోబర్‌ గ్యాస్‌ (పశువుల పేడ ద్వారా గ్యాస్‌ తయారు చేసుకునే విధానం) వినియోగం వైపు మళ్లించేందుకు మళ్లీ కార్యాచరణ సిద్ధం చేసింది. గతంలో గ్రామాల్లో రైతులు గానీ, ఇతరులెవరైనా వ్యక్తిగతంగా ఎవరికి వారు పశువుల పేడ ద్వారా తామే గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తే ప్రభుత్వం ఆ ప్లాంట్‌ నిర్మాణానికయ్యే ఖర్చులో అత్యధిక సబ్సిడీ చెల్లించింది. ప్లాంట్లను తర్వాత లబ్ధిదారులు పలు కారణాలతో వినియోగించుకోకపోవడంతో ఈ కార్యక్రమం విఫలమైంది. ఇప్పుడు తాజాగా వ్యక్తిగత గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటు స్థానంలో సహకార విధానంలో, వ్యాపారాత్మక ధోరణిలోనూ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టారు.

10 సహకార ప్లాంట్లు, ఒక కార్పొరేట్‌ ప్లాంటు..
స్వచ్ఛ భారత్‌ పథకం ద్వారా ఈ ఆర్థిక ఏడాదికి సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలిచ్చేందుకు జిల్లాకు రూ.50 లక్షల చొప్పున 13 జిల్లాలకు కలిపి రూ.6.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సహకార విధానంలో 10 చోట్ల, వ్యాపార ధోరణితో కార్పొరేట్‌ సంస్థలతో ఒక ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
గోబర్‌ గ్యాస్‌ ఉత్పత్తి ఇలా 

సహకార విధానంలో అంటే?
20–50 మంది సంఘంగా ఏర్పడి మధ్యస్థ గోబర్‌ గ్యాస్‌ ప్లాంటును ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా ఉత్పత్తయ్యే గ్యాస్‌ను ఆ 20–50 మంది వంటకు వినియోగించుకునే వీలు కల్పించడం. ఈ విధానంలో గోబర్‌ గ్యాస్‌ ప్లాంటు ఏర్పాటుకు ఒక్కొక్క వ్యక్తిగత లబ్ధిదారునికి ప్రభుత్వం అందజేసే రూ.10 వేల సబ్సిడీ అందరి డబ్బులు కలిపి ఈ ప్లాంట్‌ నిర్మాణానికి ఖర్చు పెట్టుకోవడానికి అనుమతి ఇస్తారు.

వ్యాపారాత్మక ధోరణిలో..
ఆసక్తి ఉన్న ఒక కార్పొరేట్‌ సంస్థను ఎంపిక చేసుకొని, వారి ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. అందులో ఉత్పిత్తయ్యే గ్యాస్‌ను ఆ ప్రాంత ప్రజలకు అతి తక్కువ ధరకు సరఫరా చేస్తారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏదో ఒక చోట ఈ తరహా ప్లాంట్‌ ఏర్పాటుకు ఉపక్రమించారు.

గ్రామాలూ పరిశుభ్రం
పశువులు రోడ్లపై వేసే పేడ చాలా చోట్ల తొలగించక అనేక గ్రామాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి. పేడను గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్లకు వినియోగించడానికి ఎప్పటికప్పుడు సేకరించడం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు గ్యాస్‌ తయారీ అనంతరం వచ్చే పదార్థాలను రైతులు ఎరువుగా ఉపయోగించుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు. గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల ద్వారా అతి తక్కువ ధరకే గ్యాస్‌ దొరకడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం దక్కుతుందని చెబుతున్నారు.

ఆధ్యయనం చేస్తున్నాం..
– పి.సంపత్‌కుమార్, ఎండీ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ 
సహకార పద్ధతిన, వ్యాపార ధోరణితో గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గేదెలు, ఆవులు ఎక్కడ ఎక్కువ ఉన్నాయన్న దానిపై అధ్యయనం చేస్తున్నాం. వీటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకొని, ఆ మేరకు వ్యాపార విధానంలో ప్లాంట్‌ ఏర్పాటుకు అసక్తి ఉన్న సంస్థ ఎంపికకు ఈవోఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) నిర్వహిస్తాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement