
‘సోలార్’ సబ్సిడీకి కత్తెర
బడ్జెట్ లేదని చేతులెత్తేసిన కేంద్ర ప్రభుత్వం
రూఫ్ టాప్ ప్లాంట్లకు రాయితీలో సగానికి కోత
30 శాతాన్ని 15 శాతానికి తగ్గిస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ
సాక్షి, హైదరాబాద్: భవనాలపై ఏర్పాటు చేసే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లకు ప్రస్తుతమిస్తున్న సబ్సిడీని కొనసాగించలేమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రాయితీని సగానికి సగం తగ్గించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతమున్న 30 శాతం సబ్సిడీ ఇకపై 15 శాతానికి తగ్గిపోనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగం తాజాగా సమాచారమిచ్చింది. తగినంత బడ్జెట్ లేనందున ప్రస్తుత సబ్సిడీని కొనసాగించడం సాధ్యం కాదని తన లేఖలో పేర్కొంది. ‘గ్రిడ్ కనెక్టెడ్ రూఫ్ టాప్ అండ్ స్మాల్ సోలార్ పవర్ ప్లాంట్స్ ప్రోగ్రాం’ పేరుతో కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
దీనికింద కిలోవాట్ నుంచి 500 కిలోవాట్ వరకు సామర్థ్యమున్న ప్లాంట్లకు రాయితీ ఇస్తోంది. అయితే ఇకపై అన్ని కేటగిరీల వారికి సబ్సిడీని కొనసాగించే అవకాశం లేదని కూడా తాజాగా కేంద్రం స్పష్టంచేసింది. ఎక్కువ విద్యుత్ చార్జీలు చెల్లిస్తున్న వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదని, సబ్సిడీతో నిమిత్తం లేకుండానే సోలార్ ప్లాంట్లను కొనుగోలు చేసే స్థోమత వారికి ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. అల్పాదాయ కేటగిరీలు, గృహ వినియోగదారులకు మాత్రం 15 శాతం రాయితీ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.
అలాగే లబ్ధిదారులకు నేరుగా పెట్టుబడి రాయితీ ఇవ్వడమో, ఆధార్ ఖాతాలతో అనుసంధానం చేయడమో లేక బ్యాంకు రుణం తిరిగి చెల్లించే పద్ధతిలో చేయూతనివ్వడం వంటి ప్రతిపాదనలున్నట్లు కూడా కేంద్రం స్పష్టం చేసింది. కేటగిరీలవారీగా ప్రాధాన్యత క్రమంలో సబ్సిడీ కేటాయింపు ఉంటుందంటూ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలను మొదటి కేటగిరీలో చేర్చింది. అలాగే ప్రభుత్వ, సామాజిక సంఘ భవనాలు, పంచాయతీ భవనాలు, వృత్తి కార్మికులు, కళాకారుల వర్క్‌షాపులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భవనాలు, ప్రజోపయోగ సంస్థలు, నివాస గృహాలు, భవనాలను కూడా వరుస క్రమంలో ఈ జాబితాలో పొందుపరిచింది. ముందుగా వీటికి సబ్సిడీ అందించిన తర్వాతే ప్రభుత్వ, ప్రైవేటు ఇండస్ట్రియల్, కమర్షియల్ భవనాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 356 మెగావాట్ల రూఫ్ టాప్ ప్లాంట్లను మంజూరు చేసినట్లు వెల్లడించింది.
హైదరాబాద్ పరిధిలోనే రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి ఇటీవల ఒక మెగావాట్‌కు చేరినట్లు ఎన్‌ఆర్‌ఈడీసీ అధికారులు తెలిపారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సోలార్ విద్యుత్‌పై దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం ఇచ్చే 30 శాతం సబ్సిడీతో పాటు రాష్ర్టం 20 శాతం అదనపు సబ్సిడీని ప్రకటించింది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా డిస్కంలు కొనుగోలు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సబ్సిడీలో కోత వల్ల సోలార్ ప్లాంట్లకు ఆదరణ తగ్గే ప్రమాదముందని అధికారులు అంటున్నారు.