పీఎం కిసాన్ పథకం కింద 4 వేల మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర సర్కారు నిర్ణయం
రైతులు తమ అవసరాలకు వాడుకోగా మిగిలిన విద్యుత్ డిస్కంలకు విక్రయించే చాన్స్
ఒక్కో యూనిట్‌కు రూ.3.13 చొప్పున చెల్లించనున్న విద్యుత్ సంస్థలు
యూనిట్ల కేటాయింపులో మహిళా సంఘాలకు తొలి ప్రాధాన్యం
పొలాలను లీజుకు తీసుకుని ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పంట పొలాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్) పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేస్తారు.
ఈ పథకానికి సంబంధించి తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఏడాదిలో 300 రోజుల పాటు సౌరవిద్యుత్ ఉత్పాదనకు అనుకూలత ఉంది.
చిన్న చిన్న ప్లాంట్లతో..
పీఎం కుసుమ్ పథకం కింద 2026 డిసెంబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా 30,800 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంట్లను రైతుల పంట పొలాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
పొలాల్లో 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నా.. రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, ఉత్తర్వులు జారీ చేసింది.
త్వరలో సబ్‌స్టేషన్ల వారీగా నోటిఫికేషన్
రాష్ట్రంలోని అన్ని 33/11 కేవీ సబ్ స్టేషన్ల వారీగా ఎంత స్థాపిత సామర్థ్యంతో కొత్త సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయో వెల్లడిస్తూ త్వరలో డిస్కంలు నోటిఫికేషన్ ఇస్తాయి. ఆయా సామర్థ్యం మేరకు సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు రైతుల నుంచి రెడ్కో దరఖాస్తులను స్వీకరించనుంది. రైతులు వ్యక్తిగతంగా, సంఘాలుగా, సహకార సంఘాలుగా ఏర్పడి వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
మహిళా గ్రూపులకు ప్రాధాన్యత
స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), మండల సమాఖ్యలు కూడా రైతుల నుంచి పొలాలను లీజుకు తీసుకుని సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. ప్లాంట్ల మంజూరులో వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సౌర విద్యుత్ కేంద్రాల స్థాపనకు అవకాశమిచ్చి సంఘాల మహిళలను కోటీశ్వరులు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలు రైతు కుటుంబాల వారేకావడంతో.. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు రైతుల చేతుల్లోనే ఉండనుంది. ఎస్‌హెచ్‌జీలకు పావలా వడ్డీకే రుణాలు లభిస్తాయి.
ఒక మెగావాట్ ప్లాంట్ నుంచి ఏడాదికి సగటున 15 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. అంటే సుమారు రూ.45 లక్షల ఆదాయం వస్తుంది. మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆరు ఎకరాల స్థలం, రూ.3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ఈ మేరకు బ్యాంకులు రుణం ఇవ్వనున్నాయి.
కరెంటు కొననున్న డిస్కంలు
రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కొనుగోలు చేస్తాయి. ఒక్కో యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 ధరను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఇప్పటికే ఖరారు చేసింది.
సోలార్ ప్లాంట్లలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో రైతులు తమ వ్యవసాయ అవసరాలకు వాడుకోగా.. మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించవచ్చు. డిస్కంలు ప్రస్తుతం సౌర విద్యుత్ ప్లాంట్ల నుంచి సగటున యూనిట్‌కు రూ.2.58 ధరతో విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నాయి. రైతులకు మాత్రం కాస్త ఎక్కువగా యూనిట్‌కు రూ.3.13 ధర చెల్లించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment