రైతుల బతుకుల్లో.. సోలార్ చీకట్లు
– పరిహారం కోసం 3 ఏళ్లుగా రైతుల ఎదురుచూపులు
– పరిహారం అందక ఓ సాగు రైతు ఆత్మహత్య
– పట్టించుకోని టీడీపీ సర్కార్
రైతు పేరు మౌలాలి (68). ఊరు ఎన్‌పీ కుంట. ఇతనికి ఎన్‌పీకుంట పంచాయతీ పరిధిలో కావమ్మ ఆలయానికి సమీపంలో 10 ఎకరాల సాగుభూమి ఉంది. అందులో బోరు వేసుకొని వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించే వాడు. ఆ భూమికి పట్టాతో పాటు పాసుపుస్తకాలు మంజూరు చేయమని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసమని ఈ రైతుకు సంబంధించిన మొత్తం భూమిని టీడీపీ సర్కారు లాగేసుకుంది. 10 ఎకరాలకు కలిపి కేవలం రూ.1 లక్ష ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మూడేళ్లు పూర్తయినా ఇప్పటిదాకా అది కూడా చెల్లించలేదు. వరుస కరువులతో పెట్టుబడులు కూడా చేతికందక, భూమికి పరిహరం అందక చివరకు ఇల్లు కూడా అమ్మేశాడు. అయినా తాను చేసిన అప్పులు తీరలేదు. చివరికి తనకు వేరేదారి లేక ఈ ఏడాది జూన్ 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కదిరి: ఒక్క మౌలాలి మాత్రమే కాదు. సోలార్ పవర్ ప్రాజెక్టు కారణంగా తమ సాగుభూములను కోల్పోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులు 1156 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరు కాకుండా ఇంకా పలువురు రైతులు తాము కూడా అక్కడ ఏళ్లతరబడి సాగుచేసుకుంటున్నామని, తమకు ఎటువంటి నోటీసులు, పరిహారం కూడా ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కున్నారని ఎన్నో సార్లు అధికారులకు అర్జీలు కూడా ఇచ్చుకున్నారు. మౌలాలి మృతితోనైనా టీడీపీ సర్కారులో మార్పు వస్తుందేమోనని అనుకున్నా అలాంటి సంకేతాలు ఏమాత్రం కన్పించడం లేదు. ఎందుకంటే మౌలాలి ఆత్మహత్య చేసుకొని ఇప్పటికే మూడు నెలలు దాటి పోయింది. ఇప్పటి దాకా దానిపై కనీస విచారణ కూడా జరపలేదు.
ఎన్‌పీ కుంట మండల కేంద్రంలో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఈ బా«ధ్యతను ఎన్‌టీపీసీ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్‌పీ కుంట, పీ కొత్తపల్లి పంచాయతీల పరిధిలో మొత్తం 9,015.02 ఎకరాల భూమిని రైతుల నుండి బలవంతంగా సేకరించారు. ఏపీ నూతన రాజధాని అమరావతి ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షల నుండి రూ. 50 లక్షలు దాకా ఇస్తున్నారు. కానీ ఎన్‌పీకుంటలో మాత్రం పట్టా భూమికి రూ 3 లక్షల నుండి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుండి రూ. 2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ 44.44 కోట్లు చెల్లించారు.
ఇంకా పట్టా, అసైన్డ్ భూములు కోల్పోయిన 103 మంది రైతులు రూ. 6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఏళ్ల తరబడి అక్కడ భూములు సాగుచేసుకుంటూ తెలిసో, తెలియకో వివిధ కారణాలతో పట్టాలు పొందని 1156 మంది రైతుల భూములను సోలార్ ప్రాజెక్టు కోసం బలవంతంగా లాక్కున్నారు. అయితే ఆ రైతులకు మాత్రం ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు సాగుచేసుకుంటున్నప్పటికీ సాగు రైతులకు ఒక్కొక్కరికి రూ1 లక్ష చెల్లిస్తామని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ డబ్బు కూడా ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. సాగురైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పినట్లు తెలిసింది.
రైతుల తరపున పాదయాత్ర చేస్తా - డా.పివి సిద్దారెడ్డి, వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త
సోలార్‌ప్లాంట్ కోసం రైతుల నుంచి ప్రభుత్వం లాక్కున్న భూములు చాలా సారవంతమైనవి. ఒక్కరూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కోవడం దేశంలో ఎక్కడా జరగలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు మౌలాలి కుటుంబంతో పాటు అక్కడ భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం జరగాలన్నది మా పార్టీ ధ్యేయం. నెల రోజుల్లో వారికి న్యాయం జరక్కపోతే ఆ రైతుల తరపున ఎన్‌పీ కుంటలోని సోలార్ ప్రాజెక్టు వద్ద నుండి కదిరి ఆర్‌డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తాను.