np kunta
-
ఘోర ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
సాక్షి, ఎన్పీకుంట: జాతర నుంచి ఇళ్లకు బయల్దేరిన ఇద్దరిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. వివరాల్లోకెళ్తే... ఎన్పీకుంట మండలం మండెంవారిపల్లికి చెందిన పలువురు ఆదివారం తలుపుల మండలం పంతులోల్లపల్లిలో గంగమ్మ జాతరకు వెళ్లారు. సోమవారం ట్రాక్టర్లో తిరుగుపయనమయ్యారు. ఎన్పీకుంటలోని కొత్తరోడ్డు సమీపాన సీతారామ్ బావి వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో హరినాయుడు (33), గిరినాయుడు (12) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. కదిరి రూరల్ సీఐ రెడ్డప్ప, స్థానిక ఎస్ఐ యతీంద్ర తన సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను 108 ద్వారా కదిరి ఆస్పత్రికి తరలించారు. -
రైతుల బతుకుల్లో.. సోలార్ చీకట్లు
– పరిహారం కోసం 3 ఏళ్లుగా రైతుల ఎదురుచూపులు – పరిహారం అందక ఓ సాగు రైతు ఆత్మహత్య – పట్టించుకోని టీడీపీ సర్కార్ రైతు పేరు మౌలాలి (68). ఊరు ఎన్పీ కుంట. ఇతనికి ఎన్పీకుంట పంచాయతీ పరిధిలో కావమ్మ ఆలయానికి సమీపంలో 10 ఎకరాల సాగుభూమి ఉంది. అందులో బోరు వేసుకొని వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించే వాడు. ఆ భూమికి పట్టాతో పాటు పాసుపుస్తకాలు మంజూరు చేయమని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసమని ఈ రైతుకు సంబంధించిన మొత్తం భూమిని టీడీపీ సర్కారు లాగేసుకుంది. 10 ఎకరాలకు కలిపి కేవలం రూ.1 లక్ష ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మూడేళ్లు పూర్తయినా ఇప్పటిదాకా అది కూడా చెల్లించలేదు. వరుస కరువులతో పెట్టుబడులు కూడా చేతికందక, భూమికి పరిహరం అందక చివరకు ఇల్లు కూడా అమ్మేశాడు. అయినా తాను చేసిన అప్పులు తీరలేదు. చివరికి తనకు వేరేదారి లేక ఈ ఏడాది జూన్ 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కదిరి: ఒక్క మౌలాలి మాత్రమే కాదు. సోలార్ పవర్ ప్రాజెక్టు కారణంగా తమ సాగుభూములను కోల్పోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులు 1156 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరు కాకుండా ఇంకా పలువురు రైతులు తాము కూడా అక్కడ ఏళ్లతరబడి సాగుచేసుకుంటున్నామని, తమకు ఎటువంటి నోటీసులు, పరిహారం కూడా ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కున్నారని ఎన్నో సార్లు అధికారులకు అర్జీలు కూడా ఇచ్చుకున్నారు. మౌలాలి మృతితోనైనా టీడీపీ సర్కారులో మార్పు వస్తుందేమోనని అనుకున్నా అలాంటి సంకేతాలు ఏమాత్రం కన్పించడం లేదు. ఎందుకంటే మౌలాలి ఆత్మహత్య చేసుకొని ఇప్పటికే మూడు నెలలు దాటి పోయింది. ఇప్పటి దాకా దానిపై కనీస విచారణ కూడా జరపలేదు. ఎన్పీ కుంట మండల కేంద్రంలో దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఈ బా«ధ్యతను ఎన్టీపీసీ సంస్థకు అప్పగించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్పీ కుంట, పీ కొత్తపల్లి పంచాయతీల పరిధిలో మొత్తం 9,015.02 ఎకరాల భూమిని రైతుల నుండి బలవంతంగా సేకరించారు. ఏపీ నూతన రాజధాని అమరావతి ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షల నుండి రూ. 50 లక్షలు దాకా ఇస్తున్నారు. కానీ ఎన్పీకుంటలో మాత్రం పట్టా భూమికి రూ 3 లక్షల నుండి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుండి రూ. 2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ 44.44 కోట్లు చెల్లించారు. ఇంకా పట్టా, అసైన్డ్ భూములు కోల్పోయిన 103 మంది రైతులు రూ. 6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఏళ్ల తరబడి అక్కడ భూములు సాగుచేసుకుంటూ తెలిసో, తెలియకో వివిధ కారణాలతో పట్టాలు పొందని 1156 మంది రైతుల భూములను సోలార్ ప్రాజెక్టు కోసం బలవంతంగా లాక్కున్నారు. అయితే ఆ రైతులకు మాత్రం ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు సాగుచేసుకుంటున్నప్పటికీ సాగు రైతులకు ఒక్కొక్కరికి రూ1 లక్ష చెల్లిస్తామని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఆ డబ్బు కూడా ఇచ్చే పరిస్థితి కన్పించడం లేదు. సాగురైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పినట్లు తెలిసింది. రైతుల తరపున పాదయాత్ర చేస్తా - డా.పివి సిద్దారెడ్డి, వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త సోలార్‌ప్లాంట్ కోసం రైతుల నుంచి ప్రభుత్వం లాక్కున్న భూములు చాలా సారవంతమైనవి. ఒక్కరూపాయి కూడా పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కోవడం దేశంలో ఎక్కడా జరగలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు మౌలాలి కుటుంబంతో పాటు అక్కడ భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం జరగాలన్నది మా పార్టీ ధ్యేయం. నెల రోజుల్లో వారికి న్యాయం జరక్కపోతే ఆ రైతుల తరపున ఎన్పీ కుంటలోని సోలార్ ప్రాజెక్టు వద్ద నుండి కదిరి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తాను. -
భూములు లాక్కొని.. పరిహారం ఎగ్గొట్టి..
- ఎన్పీకుంట సోలార్ బాధిత రైతులకు తీరని అన్యాయం - మూడేళ్లు పూర్తయినా అందని పరిహారం - ప్రకటించింది అరకొరే.. దాన్నీ ఎగ్గొడుతున్న ప్రభుత్వం! - సర్వం కోల్పోయిన సాగుదారులు - పరిహారం రాదన్న ఆవేదనతో ఇటీవల ఓ రైతు ఆత్మహత్య - అయినా చలనం లేని సర్కారు సోలార్ ప్లాంటు కోసం సేకరించిన భూములు భూమి వివరము ఎకరాలు ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు పట్టా భూమి 290.11 ఎకరాలు అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు సాగుభూమి 1840.77 ఎకరాలు మొత్తం 9,015.02 ఎకరాలు వారంతా కష్టజీవులు. వ్యవసాయం తప్ప మరో పని తెలీదు. అనేక ఏళ్లుగా నేలతల్లినే నమ్ముకున్నారు. కష్టమైనా, నష్టమైనా పంటల సాగుపైనే ఆధారపడ్డారు. అలాంటి రైతుల్లో ఒక్కసారిగా కుదుపు. ‘భూములు మీవి కాదు..సర్కారువి’ అంటూ నిర్ధాక్షిణ్యంగా లాగేసుకున్నారు. అయ్యా..తరతరాలుగా సాగు చేస్తున్నామని రైతులు మొత్తుకున్నా..అధికారులు విన్పించుకోలేదు. ‘రికార్డు ప్రకారం మీవి కాదు..అయినా ఎంతోకొంత ఇస్తాం లే..’ అంటూ ‘ఉదారత’ ప్రదర్శించారు. తీరా భూములు లాగేసుకున్నాక, వాటిలో సోలార్‌ప్లాంటు కూడా ఏర్పాటు చేశాక..ఇప్పుడు పరిహారం ఊసే ఎత్తడం లేదు. దీంతో జీవనాధారం కోల్పోయిన రైతులు తీవ్ర మానసిక వేదనతో కుంగిపోతున్నారు. కదిరి : ఎన్పీకుంటకు చెందిన మౌలాసాబ్ (68)కు అదే పంచాయతీ పరిధిలోని కావమ్మ ఆలయానికి సమీపంలో పదెకరాల సాగుభూమి ఉండేది. అందులో బోరు వేయించి.. వేరుశనగతో పాటు పలు రకాల పంటలు పండించేవాడు. ఆ భూమికి పట్టాతో పాటు పాసుపుస్తకాలు కూడా మంజూరు చేయాలని అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసమని ఆ భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంది. మౌలాసాబ్ను సాగుదారుడిగా గుర్తించి.. పదెకరాలకు కలిపి రూ.లక్ష పరిహారం ఇస్తామని ప్రకటించింది. అయితే.. మూడేళ్లు గడిచినా చిల్లి గవ్వ కూడా చెల్లించలేదు. గతంలో వరుస పంట నష్టాలతో అప్పుల పాలు కావడంతో పాటు పరిహారం అందక, కుటుంబ పోషణ సైతం భారమై మౌలాసాబ్ చివరకు ఇల్లు కూడా అమ్మేశాడు. అయినా అప్పులు తీరలేదు. తనకు వేరేదారి లేక ఈ నెల 9వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క మౌలాసాబ్ మాత్రమే కాదు.. ఎన్పీకుంట సోలార్ ప్లాంటు బాధిత రైతులలో చాలామంది పరిస్థితి దయనీయంగా మారింది. సాగుభూములు కోల్పోయి పరిహారం కోసం ఎదురు చూస్తున్న రైతులు 1,156 మంది ఉన్నట్లు అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ఇక పరిహారం అందేది అనుమానమేనని సంబంధిత అధికారులే అంటుండడంతో రైతులు కుంగిపోతున్నారు. ఎన్పీకుంట మండల కేంద్రానికి సమీపాన దేశంలోనే పెద్ద సోలార్ పవర్ ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు చాలావరకు పూర్తయ్యాయి. వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన ఈ ప్లాంటు బా«ధ్యతను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తీసుకుంది. దీనికోసం ఎన్పీకుంట పంచాయతీ పరిధిలో 2,079.38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు కలిపి మొత్తం 7,174.25 ఎకరాలను మూడు విడతల్లో సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతు పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,302.30 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మరో 1,840.77 ఎకరాల రైతుల సాగుభూమిని బలవంతంగా లాక్కున్నారు. నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ప్రభుత్వం ఇస్తోంది. ఎన్పీకుంటలో మాత్రం తీరని అన్యాయం చేసింది. పట్టా భూమికి రూ.3 లక్షల నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూమికి రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షల చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ.44.44 కోట్లు చెల్లించారు. ఇంకా పట్టా, అసైన్డ్ భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. ఇదంతా ఓ ఎత్తయితే.. ఏళ్ల తరబడి భూములు సాగుచేసుకుంటూ వివిధ కారణాలతో పట్టాలు పొందని 1,156 మంది రైతుల పరిస్థితి మరో ఎత్తు. ఈ రైతులకు ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించలేదు. ఎకరాలతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు సాగు చేసుకుంటున్నప్పటికీ సాగు రైతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చెల్లిస్తామని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ డబ్బు కూడా ఎగ్గొట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 6 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారు – రైతు కేశవరెడ్డి, పి.కొత్తపల్లి, ఎన్పీకుంట మండలం మాకు పి.కొత్తపల్లి పరిధిలో ఆరెకరాల సాగుభూమి ఉంది. ఈ భూమి మొత్తం సోలార్ ప్రాజెక్టు కోసమని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంది. అంతటికీ కలిపి రూ.లక్ష ఇస్తామన్నారు కానీ.. ఇప్పటి దాకా ఒక్క రూపాయి చెల్లించలేదు. ఉన్న భూమిని లొక్కొని, పరిహారం కూడా ఇవ్వకపోతే మా గతి ఏం కావాలి?రైతుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలక తప్పదు. సాగుభూమికి పరిహారం రాకపోవచ్చు – ఎ.వెంకటేశు, ఆర్డీఓ, కదిరి నాకు తెలిసి పట్టా, అసైన్డ్ భూములకు పరిహారం వస్తుంది కానీ ఎటువంటి పత్రాలూ లేని సాగుభూములకు పరిహారం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవు. గతంలో అధికారులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఎన్పీకుంట సోలార్ ప్రాజెక్టు బాధిత రైతులకు పరిహారం చెల్లించే విషయం ఇప్పుడు నా పరిధిలో లేదు. జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంది. మెడలు వంచి ఇప్పిస్తాం - డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త సోలార్ ప్లాంటు కోసం తీసుకున్న భూములు బాగా సారవంతమైనవి. వాటికి ఎగువన పెడబల్లి ప్రాజెక్టు, దిగువన వెలిగల్లు ప్రాజెక్టు ఉన్నాయి. ఆ భూముల మధ్యలోనే హంద్రీ-నీవా కాలువ కూడా వెళ్తోంది. అలాంటి భూములను బలవంతంగా లాక్కున్నదే కాకుండా ఇప్పుడు సాగుదారులకు పరిహారం ఇవ్వకపోతే ఎలా? ఈ సర్కారు మెడలు వంచైనా పరిహారం ఇప్పిస్తాం. రైతుల కోసం అవసరమైతే న్యాయ పోరాటానికీ సిద్ధం. సాగురైతు మౌలాసాబ్ మృతికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. -
తిమ్మమ్మ మర్రిమాను.. చూసొద్దాం రండి
మండు వేసవిలో పచ్చని చెట్టు కింద కూర్చొని చుట్టూ ఉన్న కొండల నుంచి వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉంటే... ఆహా మజానే వేరు! ఔనని ఒప్పుకుంటారు కదూ... ఇలాంటి అనుభూతులను పంచుతోంది జిల్లాలోని తిమ్మమ్మ అమ్మవారు కొలువైన తిమ్మమ్మ మర్రిమాను. చుట్టూ ఈశ్వరమలై కొండల నడుమ సుమారు తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మహా వృక్షం 1989లో గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుంది. ఆరు శతాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మహావృక్షం ఎన్పీకుంట మండలంలోని ఎదురొన పంచాయతీలోని గూటిబైలు గ్రామ సమీపంలో ఉంది. మండల కేంద్రం ఎన్పీ కుంటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రిమాను వద్దకు చేరుకోవాలంటే కదిరి నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలోని రెక్కమాను వద్ద దిగి అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కదిరి–మదనపల్లి జాతీయ రహదారిపై కొక్కంటి క్రాస్‌లో దిగి ఆటోలో ప్రయాణించినా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. చరిత్ర ఇలా.. 14వ శతాబ్దంలో పాలెగాళ్ల పాలనలో ఉన్న గంగరాజుల కోటలో ఉన్న బాలవీరయ్యకు బుక్కపట్నం గ్రామానికి చెందిన తిమ్మమ్మతో వివాహమైంది. కాలక్రమంలో కుష్టు వ్యాధి బారిన పడ్డ బాలవీరయ్య... ఊరి శివారులో చిన్న పూరిగుడెసె వేసుకుని జీవనం సాగించారు. ఆ సమయంలో తన భర్తకు తిమ్మమ్మ సేవలు చేస్తూ వచ్చింది. బాలవీరయ్య తనువు చాలిస్తే.. కొక్కటి పాలెగాళ్ల అనుమతితో తిమ్మమ్మ సతీసహగమనం చేసింది. ఆ సమయంలో ఆమె చెప్పిన మాట ప్రకారం అగ్నిగుండానికి ఈశాన్యంలో నాటిన మర్రికొమ్మ ఇగురు వేసి.. నేడు మహా వృక్షమైంది. అప్పటి నుంచి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తిమ్మమ్మను భక్తులు కొలుస్తూ వచ్చారు. కాగా, మర్రిమాను వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. ఇందులో నెమళ్లు, పావురాలు, కుందేళ్లు, జింకలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకులు సేదతీరేందుకు పచ్చికబయళ్లు ఉన్నాయి. - ఎన్పీకుంట (కదిరి) -
ఎన్పీకుంట టీడీపీ ఎంపీపీ రాజీనామా
కదిరి : తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్పీ కుంట ఎంపీపీ ఎద్దుల వేదవతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను జెడ్పీ సీఈఓ మీసాల రామచంద్రకు అందజేశారు. అందులో ఆమె తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె రాజీనామా లేఖను జెడ్పీ సీఈఓ కూడా ధ్రువీకరించారు. టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ రాజీనామా చేయాలని ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతోనే ఆమె రాజీనామా చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఎన్పీకుంట ఎంపీపీకి పదవీ గండం’ అన్న శీర్షికన బు«ధవారం ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆమె చేత బలవంతంగా నేడో, రేపో రాజీనామా చేయించవచ్చనే విషయం కూడా ‘సాక్షి’ అందులో పేర్కొన్న విషయం పాఠకులకు విదితమే. తదుపరి ఎంపీపీ రేసులో మర్రికొమ్మదిన్నె ఎంపీటీసీ నాగమ్మ పేరు వినబడుతోంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నంబులపూలకుంట : నంబులపూలకుంట మండలం కొత్త రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టి.ఎన్.కొత్తపల్లెకు చెందిన రామ్మోహన్‌రెడ్డి(30) దుర్మరణం చెందగా, మహేంద్రరెడ్డి అనే వ్యక్తి గాయపడినట్లు ఎస్ఐ రమేశ్‌బాబు తెలిపారు. వారిద్దరూ స్వగ్రామం నుంచి స్కూటీలో నంబులపూలకుంటకు బయలుదేరారన్నారు. మార్గమధ్యంలోని కొత్త రోడ్డు వద్దకు రాగానే ముందుపోతున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేయబోయి అదుపుతప్పి పడిపోయినట్లు వివరించారు. దీంతో రామ్మోహన్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, వెనుక కూర్చున్న మహేంద్రరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. వారిని ప్రైవేటు వాహనలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే రామ్మోహన్‌రెడ్డి మరణించినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
మండే ఎండలు
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఎండలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. గాలివేగం కూడా పెరగడంలో వడగాల్పులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా ఎన్పీ కుంట మండలంలో సోమవారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 42 మండలాల్లో 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వేసవితాపం తారాస్థాయికి చేరుకుంది. ఎన్పీ కుంటలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా పామిడి 43.4 డిగ్రీలు, శింగనమల 42.8 డిగ్రీలు, యల్లనూరు 42.2 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 42 డిగ్రీలు, పుట్లూరు 41.6 డిగ్రీలు, కూడేరు 41.5 డిగ్రీలు, కొత్తచెరువు 41.2 డిగ్రీలు, కనగానపల్లి 41.2 డిగ్రీలు, పెద్దవడుగూరు 41.2 డిగ్రీలు, తాడిమర్రి 41.1 డిగ్రీలు, కంబదూరు 41 డిగ్రీలు, తనకల్లు 41 డిగ్రీలు, గార్లదిన్నె, గుత్తి, గుంతకల్లు, గుడిబండ, కనేకల్లు, పుట్టపర్తి, చెన్నేకొత్తపల్లి, రామగిరి, ధర్మవరం, బత్తలపల్లి, రాయదుర్గం, కళ్యాణదుర్గం,నార్పల, కదిరి తదితర మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 38, 39 డిగ్రీలు ఉండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 44 నుంచి 74, మధ్యాహ్నం 13 నుంచి 23 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రాప్తాడు, బత్తలపల్లి, ఆత్మకూరు, కనేకల్లు, పుట్లూరు, పామిడి, బొమ్మనహాల్, పెద్దవడుగూరు, తనకల్లు, ధర్మవరం, అమడగూరు, నల్లచెరువు, గోరంట్ల, ఓడీ చెరువు, అమరాపురం తదితర మండలాల్లో గాలివేగం ఎక్కువగా ఉండటంతో వేసవిగాలులు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. -
పేరులో ప్రథమం.. సౌకర్యాలలో అధమం
ఎన్పీకుంట : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ప్రాంతం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో అధమంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తూనే ఉంటారు. విడిది సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులకే కాకుండా తిమ్మమ్మ భక్తుల సైతం అసంతృప్తి చెందుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పర్యాటకులతో పాటు తిమ్మమ్మ భక్తులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. అయితే తిమ్మమ్మ భక్తులు తలనీలాలు సమర్పించిన అనంతరం స్నానాలు చేసేందుకు గదులు లేకపోవడంతో ఆరుబయటే చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళల ఇబ్బందులు వర్ణణాతీతం. తమ ఇంటిల్లిపాదీ భోజనం వండుకోవడానికి వంట గదుల లేకపోవడంతో చెట్లకిందే వంట చేసుకుంటున్నారు. తిమ్మమ్మమర్రిమాను దుకాణాలు ఉండే ప్రాంతంలో సిమెంటు రోడ్లు లేకపోవడంతో కొండల నుంచి వచ్చిన నీటితో నిల్వ ఉండి, మడుగుల్ని తలపిస్తుంటాయి. దీంతో పర్యాటకులు దుకాణాల వద్దకు రావడం లేదు. పర్యాటక శాఖ వారు విడిది గృహాన్ని నిర్మించి పదేళ్లయినా నేటికీ అది ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే విడిది గృహం తలుపులు తెరుచుకుంటాయి. దీంతో ఒకసారి వచ్చిన పర్యాటకులు మరోసారి రావడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మమర్రిమాను వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పర్యాటకులు కోరుతున్నారు. -
పెరిగిన వేసవి తాపం
అనంతపురం అగ్రికల్చర్ : గత మూడు రోజులుగా కాస్తంత తగ్గిన ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం జిల్లా అంతటా వేసవితాపం కొనసాగింది. శింగనమల మండలం తరిమెల, ఎన్పీ కుంటలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు, చెన్నేకొత్తపల్లి 40 డిగ్రీలు, తాడిపత్రి, పుట్టపర్తి, తాడిమర్రి, పుట్లూరు, పామిడి, నార్పల, కదిరిలో 39 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలుగా కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 65 నుంచి 85, మధ్యాహ్నం 35 నుంచి 45 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కాగా శుక్రవారం రామగిరి, కనగానపల్లి, కనేకల్లు, బొమ్మనహాల్, రాయదుర్గం, చెన్నేకొత్తపల్లి, కంబదూరు తదితర మండలాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు లేవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ఎన్పీకుంటలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేసవితాపం కొనసాగుతోంది. ఆదివారం ఎన్పీకుంటలో 41.6 డిగ్రీలు, శింగనమల 41.1 డిగ్రీలు, తాడిపత్రి, చెన్నేకొత్తపల్లి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 35 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 50 నుంచి 80, మధ్యాహ్నం 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది. -
ఎన్పీ కుంటలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : వేసవి తాపం రోజురోజుకు అధికమవుతోంది. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 10 గంటలకే చెమటలు పట్టేలా ఎండలు కాస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు, శ్రామికుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. మంగళవారం ఎన్పీ కుంట మండలంలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. యల్లనూరు 41 డిగ్రీలు, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, పెద్దవడుగూరు, పామిడి, పెద్దపప్పూరు, గుడిబండ మండలాల్లో 40 డిగ్రీలు, రాయదుర్గం, విడపనకల్, తాడిపత్రి, బత్తలపల్లి, బుక్కపట్టణం, ఉరవకొండ, పెనుకొండ, కనగానపల్లి, కళ్యాణదుర్గం, నల్లచెరువు, రొద్దం, ధర్మవరం, నల్లమాడ మండలావల్లో 39 డిగ్రీల మేర నమోదైంది. మిగతా మండలాల్లో 36 డిగ్రీల నుంచి 38 నుంచి డిగ్రీలు కొనసాగింది. జిల్లా అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 24 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 55 నుంచి 75, మధ్యాహ్నం 22 నుంచి 32 శాతం మధ్య రికార్డయింది. గంటకు 7 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
ఎన్పీ కుంటలో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో వేసవి తాపం కొనసాగుతోంది. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఎన్పీ కుంటలో 41.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పామిడి 40.4 డిగ్రీలు, తనకల్లు 40.2 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 60 నుంచి 80, మధ్యాహ్నం 15 నుంచి 25 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. -
ఎన్పీ కుంటలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం ఎన్పీ కుంట మండలంలో 42.2 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. పామిడి 41.6 డిగ్రీలు, యల్లనూరు 40.4 డిగ్రీలు, గుంతకల్లు 40.3 డిగ్రీలు, తనకల్లు 40.2 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరు కొనసాగింది. జిల్లా అంతటా కనిష్ట ఉష్ణోగ్రత 17 నుంచి 22 డిగ్రీల మధ్య నమోదయ్యింది. గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఉదయం పూట 50 నుంచి 75 శాతం ఉండగా మధ్యాహ్న సమయానికి 12 నుంచి 20 శాతం మధ్య పరిమితమైంది. గాలివేగం కొంత పెరగడంతో 7 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో వీచాయి. ఫిబ్రవరిలోనే ఉదయం 10 గంటలకే ఉక్కపోత మొదలు కావడంతో జనం అప్పుడే ఇబ్బందులు పడుతున్నారు. -
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
ఎన్పీకుంట (కదిరి) : మండల కేంద్రంలోని మల్లిఖార్జునస్వామి ఆలయంలోని శివలింగాన్ని గురువారం సూర్యకిరణాలు తాకాయి. ఆలయ అర్చకులు నాగేశ్వరస్వామి యథావిధిగా స్వామివారి తలుపులు తెరిచి పూజలు చేస్తుండగా ఈ దృశ్యం చోటు చేసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా రెండుసార్లు ఇలా జరుగుతుందన్నారు. ఉత్తరాయణం నుంచి దక్షిణాయానికి వెళ్లేటప్పుడు.. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యడు పయనించేటప్పుడు ఇలా జరుగుతుందని అర్చకులు తెలిపారు. -
ప్రైవేటు ఏటీఎం కేంద్రంలో నకిలీ నోటు
ఎన్పీకుంట (కదిరి) : ఎన్పీకుంట మండల కేంద్రంలోని ప్రైవేటు ఏటీఎం కేంద్రంలో నకిలీ నోట్లు వస్తున్నాయి. కదిరి – రాయచోటి రహదారిలో ఉన్న ఇండియా ఏటీఎం కేంద్రంలో నకిలీ నోటు వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం రూ.2వేలు డ్రా చేశాడు. రూ.2వేల నోటు వచ్చింది. ఆ డబ్బును తన కూతురుకు ఫీజు కట్టడానికి ఇచ్చాడు. కాలేజీ యాజమాన్యం అది నకిలీనోటు అంటూ తిప్పి పంపారు. ఈ ఘటనతో ఈ ఏటీఎం కేంద్రంలోకి వెళ్లడానికి ఖాతాదారులు జంకుతున్నారు. -
సీపీఎం నేత రాఘవులు అరెస్ట్
–ఎన్పీకుంట సోలార్‌ప్లాంట్ బాధితులకు మద్దతుగా ఆందోళన –పోలీసులకు, సీపీఎం నేతల మధ్య తోపులాట –సీపీఎం నాయకుడి కాలు విరగ్గొట్టిన పోలీసులు –సీఐ రవికుమార్‌ను అరెస్ట్ చేయాలని స్టేషన్లో నిరసన కదిరి : రైతులకు పరిహారం ఇవ్వకుండానే చేపడుతున్న సోలార్ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి రైతుల పక్షాన వెళ్లిన సీపీఎం జాతీయ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, అనంతపురం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌తో సహా పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా ఎన్పీ కుంట మండలంలో గురువారం జరిగిన ఈ సంఘటన కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. మండల కేంద్రంలో బహిరంగ సభ ముగిసిన వెంటనే ప్రాజెక్టు వద్దకు ర్యాలీగా బయలుదేరారు. పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకష్ణ కాలు విరిగింది. జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ను సైతం పోలీసులు విచక్షణారహితంగా కొట్టారు. కదిరి రూరల్ సీఐ రవికుమార్ దగ్గరుండి ఆదేశించడంతోనే పోలీసులు తమపై దాడి చేశారని, ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ రాఘవులతో పాటు వారంతా ఎన్పీకుంట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిరసనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులను పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. గాయపడి కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించిన రామకష్ణను సీపీఎం నేత రాఘవులతో పాటు వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, ఇతర నాయకులు పరామర్శించారు. చంద్రబాబుకు రాజకీయ సమాధే : రాఘవులు ‘ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక్కో ప్రాంతం పట్ల ఒక్కో రకంగా వివక్ష చూపుతూ పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు 2019లో ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమ’ని బీవీ రాఘవులు అన్నారు. ఎన్పీకుంటలో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘కోస్తాలో పట్టిసీమ కాలువల ద్వారా భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.48 లక్షలిచ్చారు. అదే ఇక్కడైతే కేవలం రూ.లక్ష ఇస్తామంటున్నారు. ఈ భూములు చంద్రబాబు అబ్బ సొత్తేంకాదు. తరతరాలుగా రైతులు సాగుచేసుకుంటున్నవి. ఎకరాకు కనీసం రూ.10 లక్షలివ్వాలి. ఇది దోపిడీ ప్రభుత్వం. రైతులను ముంచే ప్రభుత్వం. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతో పాటు భూమికి భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. ఆ చట్టం అమలు చేయమని మేము రైతుల పక్షాన అడిగితే అరెస్ట్ చేస్తారా? చట్టం అమలు చేయలేని సర్కారు పెద్దలను మొదట అరెస్ట్ చేయండి’ అని ఆయన డిమాండ్ చేశారు. -
పరిహారం ఏదీ?
– సోలార్ బాధిత రైతుల ఆవేదన – శరవేగంగా సాగుతున్న సోలార్ ప్రాజెక్టు పనులు – రైతుల ఆవేదనను పట్టించుకోని సర్కారు – నేడు సీపీఎం నేత బీవి రాఘవులు పర్యటన దశలు సేకరించిన భూమి రైతులు తొలి విడత 6,721.92 ఎకరాలు 791 మంది రెండో విడత 53.21 ఎకరాలు 42 మంది మూడో విడత 399.12 ఎకరాలు 132 మంది మొత్తం 7,174.25 ఎకరాలు 965 మంది ఎన్పీ కుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టుతో తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆ ప్రాంత రైతులు మొదట్లో కొంత సంతోషపడ్డారు. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఆఖరుకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కూడా చెల్లించకుండానే చంద్రబాబు సర్కారు ఆ భూములను ఎన్టీపీసీ సంస్థకు అప్పగించేసింది. అక్కడ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దొంగలూ దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా కొందరు రెవెన్యూ అధికారులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి రైతులకు అందాల్సిన పరిహారం అప్పనంగా స్వాహా చేశారన్న విమర్శలున్నాయి. భూములు కోల్పోయిన రైతులకు ఆ భూముల్లో ఇప్పుడు అడుగుపెట్టేందుకు అనుమతి లేదు. ఎందుకంటే చుట్టూ కంచె వేశారు. ఒక వేళ అనుమతించినా ఎవరి భూమి ఎక్కడుందో గుర్తించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే భూములను స్వాధీనం చేసుకున్న ఎన్టీపీసీ సంస్థ ఇప్పటికే వాటిని చదును చేసి ప్రాజెక్టు పనులు సగం పూర్తి చేసింది. ఒకవేళ బాధిత రైతులు తమ భూముల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తే వారిపై పోలీసు కేసు పెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. ఇప్పటికే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్పీ కుంటకు విచ్చేసి బాధిత రైతుల కష్టాలను కళ్లారా చూశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చి వెళ్లారు. సీపీఎం జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్, రాష్ట్ర కార్యదర్శి మధు కూడా వచ్చి వెళ్లారు. తాజాగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు గురువారం(20న) ఇక్కడకు రానున్నారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా దేశంలోనే అతి పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును ఎన్పీ కుంట మండలంలో నిర్మిస్తున్నారు. 1000 మెగావాట్ల సౌరవిద్యుత్ ఇక్కడ ఉత్పత్తి చేసే బాధ్యతను స్వీకరించిన ఎన్టీపీసీ సంస్థ, ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్పీ కుంట పంచాయతీ పరిధిలో 2,079.38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు మొత్తం కలిపి 7,174.25 ఎకరాల భూమిని మూడు విడతల్లో సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతుల పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్ భూమి 2,331.39 ఎకరాలు ఉంది. ఇది కాకుండా ఇంకా 1840.77 ఎకరాల సాగు భూములను సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంది. ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు? సోలార్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతుల పట్టా భూములకు ఎకరాకు రూ.3 లక్షలు నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్ భూములకు రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ.44.44 కోట్లు చెల్లించారు. ఇంకా పట్టా, అసైన్డ్ భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఎలాంటి రైతు పట్టా లేకుండా తరతరాలుగా అక్కడ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం చెల్లించలేదు. ఇలాంటి వారు పి.కొత్తపల్లి పరిధిలో 592 మంది, ఎన్పీ కుంట పంచాయతీ పరిధిలో 205 మంది, పక్కనున్న కడప, చిత్తూరు జిల్లా వాసులు 249 మంది, సీపీఐ నాయకులు 110 మంది ఇలా మొత్తం 1156 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరిలో కూడా అనర్హులున్నట్లు విచారణకు వెళ్లిన రెవెన్యూ బందాలు తమ నివేదికలో పేర్కొన్నాయి. ఎకరాలు, కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలకు సాగుచేసుకుంటున్నా సరే, కుటుంబానికి కేవలం రూ.1 లక్ష ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరూ ఒకే ఇంటి నంబర్లో కాపురముంటున్నారని, అందరికీ కలిపి ఒకే రేషన్ కార్డు ఉందని, ఇలా పలు కారణాలతో కుటుంబంలో ఒకరిని మాత్రం గుర్తించి, నిజమైన సాగు దారులకు అన్యాయం చేస్తున్నారు. బాధిత రైతుల గుర్తింపులో చేతి వాటం! తరతరాలుగా సాగుచేసుకుంటున్న అమాయక రైతుల దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. దీంతో పరిహారానికి నోచుకోకుండా పోతున్నారు. అయితే కొందరు రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు, ఇంకా కొన్ని ఉద్యమ పార్టీలు వచ్చిన పరిహారంలో మీకు సగం..మాకు సగం లెక్కన ఒప్పందం కుదుర్చుకొని సాగు రైతుల జాబితాలో పేర్లు చేర్చారని స్థానికులు చెబుతున్నారు. అసైన్డ్, పట్టా భూములు కోల్పోయి ఇప్పటికే పరిహారం అందుకున్న జాబితాలో కూడా పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తి నట్లు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నిజాలు నిగ్గుతేలాలంటే నిజాయితీ గల అధికారి చేత విచారణ జరిపించి, అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని భూములు కోల్పోయిన నిజమైన రైతులు కోరుతున్నారు. -
10 కేసుల నకిలీ మద్యం పట్టివేత
ఎన్పీకుంట : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మినరసింహ మద్యం దుకాణంపై శనివారం అనంతపురానికి చెందిన స్పెషల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడి చేసి 10 నకిలీ మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు. షాపును తనిఖీ చేసిన ఎక్సైజ్ సిబ్బందికి నకిలీ లిక్విడ్ కలిపిన మద్యం బాటిళ్లను గుర్తించారు. దీంతో షాపును షీజ్ చేశారు. ఆయన వెంట ఎక్సైజ్ ఎస్ఐ కార్తీక్సాగర్, సిబ్బంది ఉన్నారు. -
దళితవాడకు కరెంట్ కట్: ఆందోళన
ఎన్పీకుంట: అనంతపురం జిల్లా ఎన్పీకుంట మండల కేంద్రంలోని దళితవాడకు విద్యుత్ అధికారులు గురువారం కరెంటు సరఫరా నిలిపివేశారు. ఎవరూ మీటర్లు లేకుండా విద్యుత్‌ను వినియోగించుకుంటుండటంతో అధికారులు కనెక్షన్ తొలగించారు. దీంతో ఆగ్రిహించిన దళితులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమకు కాంగ్రెస్ హయాంలో ఉచితంగా కరెంటు అందించారు. ఇప్పుడూ కూడా అలాగే ఇవ్వాలని ధర్నాకు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఈ, స్థానిక ఎస్ఐ దళితులను శాంతింపజేశారు. ఒక్కొక్కరు రూ.120 చెల్లించి మీటర్ బిగించుకునే విధంగా వారితో మాట్లాడి ఒప్పించారు. -
'భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయండి'
అనంతపురం: అనంతపురం ఎన్పీకుంటలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్ బాషా కలెక్టర్‌ని కోరారు. ఈ సందర్భంగా ఎన్పీకుంటలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా భూములుసాగు చేసుకుంటున్న రైతులకు నష్ట పరిహారం దక్కలేదని కలెక్టర్ కి వివరించారు. రాజకీయ ఒత్తిళ్లతో ప్రైవేట్ వ్యక్తులను జాబితాలో చేర్చి నిజమైన రైతుల పొట్టకొడుతున్నారన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.5లక్షల పరిహారం చెల్లించాలని చాంద్ బాషా కలెక్టర్‌ని కోరారు.