పరిహారం ఏదీ? | solar hub victim farmers suffers | Sakshi
Sakshi News home page

పరిహారం ఏదీ?

Published Wed, Oct 19 2016 10:48 PM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM

పరిహారం ఏదీ? - Sakshi

పరిహారం ఏదీ?

– సోలార్‌ బాధిత రైతుల ఆవేదన
– శరవేగంగా సాగుతున్న సోలార్‌ ప్రాజెక్టు పనులు
– రైతుల ఆవేదనను పట్టించుకోని సర్కారు
– నేడు సీపీఎం నేత బీవి రాఘవులు పర్యటన


దశలు        సేకరించిన భూమి         రైతులు    
తొలి విడత    6,721.92 ఎకరాలు        791 మంది     
రెండో విడత    53.21 ఎకరాలు        42 మంది    
మూడో విడత    399.12 ఎకరాలు        132 మంది    
మొత్తం        7,174.25 ఎకరాలు        965 మంది    


ఎన్‌పీ కుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్‌ పవర్‌ ప్రాజెక్టుతో తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆ ప్రాంత రైతులు మొదట్లో కొంత సంతోషపడ్డారు. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఆఖరుకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కూడా చెల్లించకుండానే చంద్రబాబు సర్కారు ఆ భూములను ఎన్‌టీపీసీ సంస్థకు అప్పగించేసింది. అక్కడ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దొంగలూ దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా కొందరు రెవెన్యూ అధికారులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి రైతులకు అందాల్సిన పరిహారం అప్పనంగా స్వాహా చేశారన్న విమర్శలున్నాయి.

భూములు కోల్పోయిన రైతులకు ఆ భూముల్లో ఇప్పుడు అడుగుపెట్టేందుకు అనుమతి లేదు. ఎందుకంటే చుట్టూ కంచె వేశారు. ఒక వేళ అనుమతించినా ఎవరి భూమి ఎక్కడుందో గుర్తించే అవకాశం కూడా లేదు. ఎందుకంటే భూములను స్వాధీనం చేసుకున్న ఎన్‌టీపీసీ సంస్థ ఇప్పటికే  వాటిని చదును చేసి ప్రాజెక్టు పనులు సగం పూర్తి చేసింది. ఒకవేళ బాధిత రైతులు తమ భూముల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తే వారిపై పోలీసు కేసు పెట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్‌పీ కుంటకు విచ్చేసి బాధిత రైతుల కష్టాలను కళ్లారా చూశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చి వెళ్లారు. సీపీఎం జాతీయ నాయకులు ప్రకాష్‌కారత్, రాష్ట్ర కార్యదర్శి మధు కూడా వచ్చి వెళ్లారు. తాజాగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు గురువారం(20న) ఇక్కడకు రానున్నారు.

వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా
దేశంలోనే అతి పెద్ద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టును ఎన్‌పీ కుంట మండలంలో నిర్మిస్తున్నారు. 1000 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఇక్కడ ఉత్పత్తి చేసే బాధ్యతను స్వీకరించిన ఎన్‌టీపీసీ సంస్థ, ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎన్‌పీ కుంట పంచాయతీ పరిధిలో 2,079.38 ఎకరాలు, పి.కొత్తపల్లి పరిధిలో 5,094.87 ఎకరాలు మొత్తం కలిపి 7,174.25 ఎకరాల భూమిని మూడు విడతల్లో సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,581.84 ఎకరాలు, రైతుల పట్టా భూమి 290.11 ఎకరాలు, అసైన్డ్‌ భూమి 2,331.39 ఎకరాలు ఉంది. ఇది కాకుండా ఇంకా 1840.77 ఎకరాల సాగు భూములను సోలార్‌ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంది.

ఎదురు చూపులు ఇంకెన్నాళ్లు?
సోలార్‌ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతుల పట్టా భూములకు ఎకరాకు రూ.3 లక్షలు నుంచి రూ.3.20 లక్షలు, అసైన్డ్‌ భూములకు రూ.2 లక్షల నుంచి రూ.2.10 లక్షలు చొప్పున మొత్తం 741 మంది రైతులకు రూ.44.44 కోట్లు చెల్లించారు. ఇంకా పట్టా, అసైన్డ్‌ భూములు కోల్పోయిన 103 మంది రైతులకు రూ.6.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. కోర్టు కేసులు ఇతరత్రా కారణాలతో ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఎలాంటి రైతు పట్టా లేకుండా తరతరాలుగా అక్కడ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా నష్ట పరిహారం చెల్లించలేదు. ఇలాంటి వారు పి.కొత్తపల్లి పరిధిలో 592 మంది, ఎన్‌పీ కుంట పంచాయతీ పరిధిలో 205 మంది, పక్కనున్న కడప, చిత్తూరు జిల్లా వాసులు 249 మంది, సీపీఐ నాయకులు 110 మంది ఇలా మొత్తం 1156 మంది ఉన్నారని అధికారులు గుర్తించారు. వీరిలో కూడా అనర్హులున్నట్లు విచారణకు వెళ్లిన రెవెన్యూ బందాలు తమ నివేదికలో పేర్కొన్నాయి.  ఎకరాలు, కుటుంబ సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలకు సాగుచేసుకుంటున్నా సరే, కుటుంబానికి కేవలం రూ.1 లక్ష ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరూ ఒకే ఇంటి నంబర్‌లో కాపురముంటున్నారని, అందరికీ కలిపి ఒకే రేషన్‌ కార్డు ఉందని, ఇలా పలు కారణాలతో కుటుంబంలో ఒకరిని మాత్రం గుర్తించి, నిజమైన సాగు దారులకు అన్యాయం చేస్తున్నారు.

బాధిత రైతుల గుర్తింపులో చేతి వాటం!
తరతరాలుగా సాగుచేసుకుంటున్న అమాయక రైతుల దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. దీంతో పరిహారానికి నోచుకోకుండా పోతున్నారు. అయితే కొందరు రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు, ఇంకా కొన్ని ఉద్యమ పార్టీలు వచ్చిన పరిహారంలో మీకు సగం..మాకు సగం లెక్కన  ఒప్పందం కుదుర్చుకొని సాగు రైతుల జాబితాలో పేర్లు చేర్చారని స్థానికులు చెబుతున్నారు. అసైన్డ్, పట్టా భూములు కోల్పోయి ఇప్పటికే పరిహారం అందుకున్న జాబితాలో కూడా పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తి నట్లు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నిజాలు నిగ్గుతేలాలంటే నిజాయితీ గల అధికారి చేత విచారణ జరిపించి, అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని భూములు కోల్పోయిన నిజమైన రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement