పేరులో ప్రథమం.. సౌకర్యాలలో అధమం
ఎన్‌పీకుంట : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ప్రాంతం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో అధమంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తూనే ఉంటారు. విడిది సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులకే కాకుండా తిమ్మమ్మ భక్తుల సైతం అసంతృప్తి చెందుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పర్యాటకులతో పాటు తిమ్మమ్మ భక్తులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. అయితే తిమ్మమ్మ భక్తులు తలనీలాలు సమర్పించిన అనంతరం స్నానాలు చేసేందుకు గదులు లేకపోవడంతో ఆరుబయటే చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళల ఇబ్బందులు వర్ణణాతీతం.
తమ ఇంటిల్లిపాదీ భోజనం వండుకోవడానికి వంట గదుల లేకపోవడంతో చెట్లకిందే వంట చేసుకుంటున్నారు. తిమ్మమ్మమర్రిమాను దుకాణాలు ఉండే ప్రాంతంలో సిమెంటు రోడ్లు లేకపోవడంతో కొండల నుంచి వచ్చిన నీటితో నిల్వ ఉండి, మడుగుల్ని తలపిస్తుంటాయి. దీంతో పర్యాటకులు దుకాణాల వద్దకు రావడం లేదు. పర్యాటక శాఖ వారు విడిది గృహాన్ని నిర్మించి పదేళ్లయినా నేటికీ అది ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే విడిది గృహం తలుపులు తెరుచుకుంటాయి. దీంతో ఒకసారి వచ్చిన పర్యాటకులు మరోసారి రావడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మమర్రిమాను వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పర్యాటకులు కోరుతున్నారు.