తిమ్మమ్మ మర్రిమాను.. చూసొద్దాం రండి
మండు వేసవిలో పచ్చని చెట్టు కింద కూర్చొని చుట్టూ ఉన్న కొండల నుంచి వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉంటే... ఆహా మజానే వేరు! ఔనని ఒప్పుకుంటారు కదూ... ఇలాంటి అనుభూతులను పంచుతోంది జిల్లాలోని తిమ్మమ్మ అమ్మవారు కొలువైన తిమ్మమ్మ మర్రిమాను. చుట్టూ ఈశ్వరమలై కొండల నడుమ సుమారు తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మహా వృక్షం 1989లో గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుంది.
ఆరు శతాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మహావృక్షం ఎన్‌పీకుంట మండలంలోని ఎదురొన పంచాయతీలోని గూటిబైలు గ్రామ సమీపంలో ఉంది. మండల కేంద్రం ఎన్‌పీ కుంటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రిమాను వద్దకు చేరుకోవాలంటే కదిరి నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలోని రెక్కమాను వద్ద దిగి అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కదిరి–మదనపల్లి జాతీయ రహదారిపై కొక్కంటి క్రాస్‌లో దిగి ఆటోలో ప్రయాణించినా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
చరిత్ర ఇలా..
14వ శతాబ్దంలో పాలెగాళ్ల పాలనలో ఉన్న గంగరాజుల కోటలో ఉన్న బాలవీరయ్యకు బుక్కపట్నం గ్రామానికి చెందిన తిమ్మమ్మతో వివాహమైంది. కాలక్రమంలో కుష్టు వ్యాధి బారిన పడ్డ బాలవీరయ్య... ఊరి శివారులో చిన్న పూరిగుడెసె వేసుకుని జీవనం సాగించారు. ఆ సమయంలో తన భర్తకు తిమ్మమ్మ సేవలు చేస్తూ వచ్చింది. బాలవీరయ్య తనువు చాలిస్తే.. కొక్కటి పాలెగాళ్ల అనుమతితో తిమ్మమ్మ సతీసహగమనం చేసింది. ఆ సమయంలో ఆమె చెప్పిన మాట ప్రకారం అగ్నిగుండానికి ఈశాన్యంలో నాటిన మర్రికొమ్మ ఇగురు వేసి.. నేడు మహా వృక్షమైంది. అప్పటి నుంచి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తిమ్మమ్మను భక్తులు కొలుస్తూ వచ్చారు. కాగా, మర్రిమాను వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. ఇందులో నెమళ్లు, పావురాలు, కుందేళ్లు, జింకలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకులు సేదతీరేందుకు పచ్చికబయళ్లు ఉన్నాయి.
- ఎన్‌పీకుంట (కదిరి)