summer special
-
చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచే పంచే చెట్లు ఇవిగో..
వేసవి సూరీడి కన్ను పడకుండా భద్రంగా ఉండే చోటు ఇల్లే! ఇంట్లో ఉండి ఎండ నుంచి తప్పించుకుంటాం సరే.. వేడి నుంచి ఉపశమనం పొందడమెలా?! ఇండోర్ ప్లాంట్స్‌తో! అవును.. చక్కగా ఇంట్లో కొలువుదీరి ప్యూర్ ఆక్సిజన్, చల్లదనంతోపాటు ఆహ్లాదాన్నీ పంచేవి ఇవిగో ఈ మొక్కలే!అలోవెరా.. కలబంద ఆకులలో నీటిని నిల్వ చేసే గుణం ఉంటుంది. నిర్వహణా సులువే! ఔషధ గుణాలు పుష్కలం. దీని ఆకుల్లోని జెల్.. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఇది.. వడదెబ్బతో సహా చిన్న చిన్న చర్మ సమస్యలకూ ఉపశమనం కలిగిస్తుంది.పీస్ లిల్లీ..ఈ మొక్క సూర్యకాంతి పడని ప్లేస్‌లో చక్కగా ఎదుగుతుంది. గాలిలోని విషపదార్థాలను తొలగిస్తూ ఇంట్లో గాలిని ప్యూరిఫై చేస్తుంది. వేసవిలో ఈ మొక్కలకు అందమైన తెల్లని పువ్వులు పూస్తాయి. వాటితో ఇంటి అందమూ రెట్టింపవుతుంది.స్నేక్ ప్లాంట్..వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ మొక్కకు ఉంటుంది. టాక్సిన్లను తొలగిస్తూ ఇవీ ఇంట్లో గాలిని శుద్ధి చేసి ఆరోగ్యాన్నందిస్తాయి.బోస్టన్ ఫెర్న్..అధిక తేమ, పరోక్ష సూర్యరశ్మిలో ఇది బాగా ఎదుగుతుంది. వేసవికి సరైనవి. ఈ మొక్కలు ఇండోర్ వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికడతాయి.గోల్డెన్ పోథోస్..దీన్ని డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. వేసవిని తట్టుకోవడంలో ఇది ఫస్ట్. ఇండోర్ ఎయిర్ని చక్కగా ఫిల్టర్ చేసి నాణ్యతను మెరుగుపరుస్తుంది.జెడ్ జెడ్ ప్లాంట్..దీని పెంపకం చాలా సులువు. వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని జీవించగలదు. దీనికి గాలిని శుభ్రపరచే, కాలుష్యాన్ని నివారించే లక్షణాలు మెండు.స్పైడర్ ప్లాంట్..ఇది వేసవిలో బాగా పెరుగుతుంది. ప్యూర్ ఆక్సిజన్‌కి ప్రసిద్ధి. -
వావ్.. మనసు దోచే టెక్స్టైల్ జ్యుయల్లరీ! (ఫోటోలు)
-
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
-
Sreeleela: సమ్మర్ స్పెషల్ లుక్‌లో శ్రీలీల (ఫోటోలు)
-
Summer Special: ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగుతున్నారా? జాగ్రత్త!
ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ లోనుంచి బాటిల్ తీసుకుని చల్లని నీళ్లు గటగటా తాగడం చాలా మందికి అలవాటే. విపరీతమైన వేడిలో మన శరీరానికి రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీరు కొంత ఉపశమనం కలిగించేమాట నిజమే అయినా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎండలోనుంచి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతు నొప్పి, టాన్సిలైటిస్ సమస్య మాత్రమే కాదు.. జీర్ణక్రియ నుంచి రోగనిరోధక వ్యవస్థ వరకు... చివరకు గుండెపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని తాగడం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత చల్లటి నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఘన ఆహారం సరిగా జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం వస్తుంది.అంతేకాదు, చల్లటి నీటిని తాగడం వల్ల ఈ నాడి చల్లబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే వేగం ఒక్కసారిగా తగ్గితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్లోని చల్లటి నీటిని ఎక్కువగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా శరీరంలో వివిధ రకాల సమస్యలు సంభవిస్తాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు గట్టిపడుతుంది. ఇది బరువు పెరిగేందుకు దారితీస్తుంది.అందువల్ల వీలయినంత వరకు ఎండలో నుంచి రాగానే చల్లటి నీళ్లు తాగకూడదు. అందులోనూ ఫ్రిజ్‌లోని నీళ్లు తాగడం అసలు మంచిది కాదు. కొంచెంసేపు ఆగిన తర్వాత కుండలోని నీళ్లు లేదా నార్మల్ వాటర్ ముందు తాగి, ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగినా ఫరవాలేదు.ఇవి చదవండి: Summer Special: పిల్లల్లో... వ్యాధి నిరోధకత పెంచండిలా! -
మండే ఎండల్లో.. మీరు మెచ్చే, మీకు నప్పే దుస్తులు (ఫొటోలు)
-
ఈ సమ్మర్లో ఎనీ టైమ్.. ఎనీ వేర్.. అనిపించే డ్రెస్సులు ఇవే
ఎండలు రోజు రోజూ తమ ప్రతాపాన్ని పెంచుతూనే ఉన్నాయి. రానున్న రోజులను ఎలా తట్టుకోవాలా అని ఆలోచించే వారు తమ డ్రెస్సింగ్‌లో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు. క్యాజువల్ వేర్‌గా రోజంతా సౌకర్యంగా ఉండేలా సరైన డ్రెస్ ఎంపికగా ఈ కో–ఆర్డ్ సెట్స్ బాగా సూటవుతాయి. ఈ సమ్మర్లో కూల్ అండ్ కంఫర్ట్‌తో పాటు ఎనీ టైమ్ ఎనీ వేర్ అనిపించే ఈ డ్రెస్సులు బాగా నప్పుతాయి. టాప్ డిజైన్స్‌లో మార్పులు ఈ డ్రెస్ సెట్లో టాప్–బాటమ్ రెండూ ఒకే ప్రింట్, ఒకే కలర్‌తో ఉంటాయి. అయితే, టాప్‌గా షార్ట్ కుర్తీ, పెప్లమ్, జాకెట్ స్టైల్.. ఇలా డిజైన్స్‌లో మార్పులు చేయించుకోవచ్చు. లేదా అలాంటివి మార్కెట్లో రెడీమేడ్‌గా ఉన్నవి ఎంచుకోవచ్చు. డిజైన్స్ కూడా సులువే! టాప్ అండ్ బాటమ్ ఒకే మెటీరియల్‌తో డిజైన్ చేసుకోవచ్చు. కాబట్టి, బడ్జెట్‌కు తగినవిధంగా మెటీరియల్‌ను ఎంచుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఈ వేసవిని ఎదుర్కోవడానికి కూల్‌గా.. కంఫర్ట్‌గా.. సొగసుగా రెడీ అయి పోవచ్చు. కాటన్ ఫ్యాబ్రిక్ కో–ఆర్డ్ సెట్స్‌లో ఈ కాలం కాటన్ మెటీరియల్‌కే మొదటి ్రపాధాన్యత. వీటిలో ఖాదీ, ఇక్కత్, ప్రింటెడ్ కాటన్స్ని ఎంచుకోవచ్చు. ఆహ్లాదకరమైన రంగులు ముదురు, లేత రంగుల్లోనే కాదు డిజైన్స్‌లో ఆహ్లాదకరంగా అనిపించేవి ఎంచుకోవాలి. వేసవి వేడి నుంచి మన కంటికి హాయిగొలిపే డిజైన్స్, రంగులపై దృష్టి పెట్టడం మంచిది. -
సమ్మర్ స్పెషల్ : మ్యాంగో పులిహోర అదరిపోయేలా!
వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలు నోరూరిస్తాయి. వగరు.. పులుపు కలయికతో లేత మామిడి తొక్కు పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, మామిడి కాయ పప్పు ఇలా ఒకటేమిటి రకరకాల వంటకాలు ఘుమ ఘుమ లాడి పోవాల్సిందే. అసలు మామిడికాయతో ఏమి చేసినా ఆ రుచే వేరు కదా. మరి సమ్మర్ స్పెషల్‌గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా! మామిడికాయ పులిహోర చేసిపెడితే. పిల్లలు,పెద్దా అంతా ఇష్టంగా తింటారు. ఇది చదువుతుంటేనే మీకూ నోరు ఊరుతోంది కదా. మరింకెందుకు ఆలస్యం ఎలా చేయాలో, కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. కావల్సి పదార్థాలు: తోలు తీసేసి సన్నగా తురిమిన పచ్చిమామిడికాయ తురుము వేయించి పెట్టుకున్న పల్లీలు, లేదా వేరుశెనగలు నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఉప్పు రుచికి సరిపడా కొద్దిగా కరివేపాకు ఎండు మిర్చి, పచ్చి మిర్చి తురిమిన అల్లం ఇంగువ పసుపు ముందుగా మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేయాలి. ఆవాలు చిటపలాడే వరకూ వేయించుకోవాలి. ఎండు మిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి వేగుతుండగా, మధ్యకు చీల్చి పెట్టుకన్న పచ్చిముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, అల్లం వేయాలి. పసుపు ,ఇంగువ వేసి ఇంకొంచెం సేపు వేగించు కోవాలి. పోపు కమ్మటి వాసన వస్తూ ఉంటుంది కదా. అపుడు ముందుగానే తరిమి పెట్టుకున్న మామిడికాయ తురుము వేసి 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక చివరగా రోస్ట్ చేసి పెట్టుకొన్నవేరుశెనగలు, జీడిపప్పు వేయాలి. ముందుగా వండి పెట్టుకొన్న అన్నం పోపులో వేసి, అందులోనే ఉప్పుకూడా వేసి అన్నం చితికి పోకుండా బాగా కలపాలి. పులుపు, ఉప్పు సరిచూసుకుంటే..నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ. బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, సాయంత్రం పూటగానీ, లంచ్‌లోగానీ దీన్ని తీసుకోవచ్చు. -
ఇంద్రకీలాద్రిపై సమ్మర్ ప్రేత్యేక ఏర్పాట్లు
-
నువ్వు విజిలేస్తే.. ఆంధ్రా సోడా బుడ్డీ
పిఠాపురం: ఓ సినిమాలో ‘నువ్వు విజిలేస్తే.. ఆంధ్రా సోడా బుడ్డీ’ అనే పాట ఎంత ట్రెండ్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.. అచ్చం అలానే అనేక సంవత్సరాలు గోళీ సోడా ఒక ఊపు ఊపింది.. అది తాగితేనే గాని ఉపశమనం పొందే పరిస్థితి ఉండేది కాదు. కడుపు ఉబ్బరంగా.. పట్టేసినట్టు.. అన్నం అరగలేనట్టు.. తేన్పు రాలేనట్టు ఉన్నా ఒక్క గోళీ సోడా తాగితే వీటన్నింటికీ సమాధానం చెప్పేది. ఇప్పుడా గోళీ సోడా ఖాళీ అయ్యింది. రోజుకో రకం సోడా మెషీన్లు అందుబాటులోకి రావడంతో గోళీ సోడాలు కనుమరుగయ్యాయి. కానీ అదే సోడా కొత్తదనంతో పునర్దర్శనమిచ్చింది. మారుతున్న వ్యాపారానికి అనుగుణంగా రంగులద్దుకుని మార్కెట్లో కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కిళ్లీ షాపుల్లో మాత్రమే కనిపించే గోళీ సోడాలు కనుమరుగు కాగా, ఇప్పుడు ప్రత్యేక వాహనాల్లో కొత్త రూపంలో దర్శనమిస్తున్నాయి. గతంలో ప్రత్యేకంగా తయారు చేసిన గాజు సీసా తయారీలోనే గోళీ ఉండేది. దానిపై రబ్బరు వాషర్ ఏర్పాటు చేసి సగం వరకూ నీళ్లు పోసి మెషీన్ ద్వారా గ్యాస్ ఎక్కించి, సోడా తయారు చేసేవారు. దీనికి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో కష్టపడాల్సి వచ్చేది. మెషీన్‌పై సోడాలు తయారు చేయడం కొన్ని సమయాల్లో ప్రమాదాలకు దారి తీసేది. రాను రానూ కొత్త రకం యంత్రాలు అందుబాటులోకి రావడంతో సోడాతో పాటు డ్రింక్‌లు సైతం నిమిషాల్లో తయారవుతున్నాయి. గతంలో వచ్చిన యంత్రాలు (సోడా హబ్‌లు) సీసాలతో పని లేకుండా కేవలం గ్లాసులు మాత్రమే ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రమాదాలు లేకపోగా త్వరితగతిన తయారవుతుండడంతో ఎక్కువ మంది వాటిపై మొగ్గు చూపారు. దీంతో అప్పటి వరకూ అందుబాటులో ఉన్న గోళీ సోడా కనుమరుగైంది. గ్రామీణ ప్రాంతాల్లో కీచ్... మంటూ శబ్దాలు వినిపించగానే గోళీ సోడా తాగుతున్నారనుకొనేవారు. ప్రత్యేకంగా తయారు చేసిన బండ్లపై సోడాలు అమ్ముతూ అనేక మంది జీవనం సాగించేవారు. ప్రస్తుతం వారందరూ కనిపించకుండా పోయారు. వారి స్థానంలో కొత్త ట్రెండ్‌లో వచ్చిన గోళీ సోడాలు ఆటోలు, ప్రత్యేక వాహనాల ద్వారా విక్రయిస్తున్నారు. రంగోళీ సోడా ప్రస్తుత ప్రపంచంలో పాత వాటికి కొత్త రంగులు వేసి మార్కెట్లోకి తీసుకువస్తే అదే నయా ట్రెండ్‌గా మారిపోతోంది. అదే విధంగా గోళీ సోడా వచ్చేసింది. పాత సోడాకు కొత్త రంగులు కలిపి ఆకర్షణీయంగా తయారు చేసి, మార్కెట్లోకి తీసుకురావడంతో అందరూ వాటిని ఆస్వాదించడానికి ఉర్రూతలూగుతున్నారు. రండి.. బాబూ రండి.. పూర్వం పది పైసల నుంచి ప్రారంభమైన గోళీ సోడాలు రూ.1 వరకూ అమ్మకాలు జరగగా.. ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రంగుల సోడా రూ.20కి విక్రయిస్తున్నారు. అయినప్పటికీ పలువురు ఈ సోడాలను తాగుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో ఎక్కువ మంది వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కాకినాడ నుంచి వస్తున్న సోడా వ్యాపారులు పలు పట్టణాల్లో ప్రత్యేక వాహనాలపై వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. కూలింగ్ పెట్టి మరీ అమ్ముతుండడంతో అందరూ వీటిని తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. -
పోనీ టెయిల్‌కి సెకండ్ వెర్షన్
వేసవిలో జుట్టును లూజ్‌గా వదిలేయడం ఇబ్బందిగానే ఉంటుంది. వెంట్రుకలు మెడమీద పడకుండా, నీటుగా హెయిర్‌స్టైల్ ఉండాలనుకుంటే ఈ స్టైల్‌ను ఫాలో అవ్వచ్చు. ఇది పోనీటెయిల్‌కి సెకండ్ వెర్షన్‌గా చెప్పచ్చు. ► జుట్టును చిక్కుల్లేకుండా దువ్వాలి. తర్వాత అటూ ఇటూ రెండు పాయలు తీసి ఒక పాయగా కలిపేసి, మధ్యన రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రబ్బర్ బ్యాండ్ వేసిన పాయకు దిగువ భాగాన మరొక రబ్బర్ బ్యాండ్ వేయాలి. ► రెండు రబ్బర్ బ్యాండ్స్ మధ్యలో ఉన్న హెయిర్‌ను ఓవెల్ షేప్ ఖాళీ ఉంచి, ఆ మధ్యలో నుంచి మిగతా హెయిర్‌ను బయటకు తీసి, ఒకసారి దువ్వెనతో దువ్వి, వదిలేయాలి. ► జుట్టు మందంగా ఉన్నవారు మధ్య నుంచి ఒక పాయగా తీసి, మెడమీద మిగతా హెయిర్‌తో కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. దీనివల్ల మెడ మీద చెమట కు వెంట్రుకలు చికాకు పెట్టకుండా, హెయిర్‌స్టైల్ నీటుగా ఉంటుంది. – సత్యశ్రీ సుతారి హెయిర్ స్టైలిస్ట్, ఫస్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ -
బాకీ ఎంత?
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా ఎప్పటిలానే పరిగెట్టడానికి వార్మప్ అవుతోంది. కరోనా వల్ల ఈ ఏడాది సమ్మర్లో థియేటర్స్‌లోకి ఒక్క సినిమా రాలేదు. సమ్మర్ అంటేనే సినిమాకు పెద్ద పండగ. మనం జరుపుకునే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్. వారం తర్వాత వారం కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తూనే ఉంటుంది. కానీ సినిమాలను ల్యాబుల్లోనూ, ప్రేక్షకులను ఇళ్లల్లోనూ కట్టిపారేసింది కరోనా. దాంతో సినిమా సీజన్ లేకుండానే సమ్మర్ గడిచిపోతోంది. ఇంకా ఎన్నాళ్లిలా? అనుకుంటున్న సమయంలో ‘ఇంకొన్ని రోజుల్లో షూటింగులు మొదలుపెట్టుకోవచ్చు’ అనే మాట కూసింత ఊరట అయింది. సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. మొదలవ్వాల్సిన సినిమాలు, మధ్య వరకూ వచ్చి ఆగిన సినిమాలు, ఇంకా పదీ పదిహేను శాతం చేస్తే చాలనే స్థితిలో ఉన్న సినిమాల పనులు త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఏయే సినిమా షూటింగ్ ఎంత శాతం బాకీ ఉంది? ఆ షూటింగ్ మీటర్ మీకోసం. ఇలా మొదలై... లాక్‌డౌన్‌కు ముందు కొన్ని సినిమాలు ప్రారంభమయ్యాయి. ఇలా షూటింగ్ మొదలైందో లేదో అలా లాక్డౌన్ వాటి ప్రయాణాన్ని ఆపింది. జస్ట్ పదీ పదిహేను రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదలైన సినిమా షూటింగ్ పదమూడు రోజులు మాత్రమే జరిగింది. అలాగే అల్లు అర్జున్ నటిస్తోన్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. కేరళలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఆరు రోజులు జరిగింది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఇది. వరుణ్‌తేజ్ తొలిసారి ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో 15 రోజుల పాటు జరిగింది. నాగశౌర్య హీరోగా సౌజన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ పది రోజులే జరిగింది. మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక షూటింగ్ మొదలుపెడదామనుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఆగింది. ఇంకా ఐదూ పది శాతం మాత్రమే షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి. గమనిక: ఏయే సినిమా ఎంత శాతం షూటింగ్ బాకీ ఉందో ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ మీద జతపరిచాం. ఇండస్ట్రీ విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఇచ్చిన డేటా ఇది. -
ఇండిగో ‘వేసవి ఆఫర్’..999కే టికెట్
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. ‘స్పెషల్ సమ్మర్ సేల్’ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా రూ.999కే టికె ట్ అందిస్తోంది. జూన్ 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుండగా.. జూన్ 16 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరిగే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఇక అంతర్జాతీయ ప్రయాణాల ప్రారంభ టికెట్ ధర రూ.3,499గా ఉండనున్నట్లు సంస్థ ప్రకటించింది. ‘గతనెల్లో ఇచ్చిన ఆఫర్‌కు ప్రయాణికుల నుంచి అద్భుత సానుకూల స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 4–రోజుల ప్రత్యేక వేసవి ఆఫర్‌ను ప్రకటించాం’ అని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. -
గురుకులాల్లో ‘ సమ్మర్ సమురాయ్’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యార్థులకు శారీరక దృఢత్వం, మానసికోల్లాసం కోసం ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు ‘సమ్మర్ సమురాయ్’పేరుతో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. వేసవి సెలవుల్లో సమయం వృ«థా చేయకుండా క్రీడలపై దృష్టిని సారించేందుకు సొసైటీ యంత్రాంగం వీటికి రూపకల్పన చేశాయి. దీంతో తల్లిదండ్రులకు భారం కాకుండా ఉపయోగకరంగా ఉంటాయనేది అధికారుల భావన. ఈ శిక్షణల్లో పోటీపరీక్షలకు సన్నద్ధం కావడం, క్రీడా నైపుణ్యాలు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ తదితర అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ శిబిరాలను నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి 2013 నుంచే 3 చోట్ల ‘సమ్మర్ సమురాయ్’ని అందుబాటులోకి తెచ్చినప్పటికీ దాన్ని విస్తరిస్తూ 2019లో 88 క్యాంపులను ఏర్పాటు చేశారు. తల్లిదండ్రుల కోసం అమ్మానాన్న హల్చల్.. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులు నిర్వహించాలని సొసైటీలు నిర్ణయించాయి. ‘అమ్మా–నాన్న హల్చల్ ’పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పిల్లల పెంపకం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు తదితర వాటిపై అవగాహన కల్పిస్తారు. ఏప్రిల్, మే నెలలో దశల వారీగా ఈ క్యాంపులను నిర్వహిస్తారు. శిబిరాలను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ‘సమ్మర్ సమురాయ్’, అమ్మానాన్న హల్చల్ కార్యక్రమాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భం గా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ ప్రభుత్వం రాష్ట్రంలో గురుకులాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా తయారు చేసిందన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 3వేల మంది విద్యార్థులతో ఈ శిబిరం ప్రారంభమైందని, ప్రస్తుతం 2లక్షలకు పెరిగిందన్నారు. ఈ క్యాంపుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు భోజన సౌకర్యాలతో పాటు వసతి కూడా కల్పిస్తోందని, శిక్షణ పొంది న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు చెప్పారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘అమ్మా–నాన్న హల్ చల్’పేరుతో కార్యక్రమా లు చేపట్టామన్నారు. గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. రెండు లక్షల మంది విద్యార్థులకు... ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలకు చెందిన దాదాపు రెండు లక్షల మందికి వేసవి శిబిరాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఎస్సీ గురుకులాలకు చెందిన 1.5లక్షలు, గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 50వేల మంది విద్యార్థులున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సంబంధిత సెట్(ప్రవేశ పరీక్ష)లకు శిక్షణ ఇస్తారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి నిర్దేశిత వాటిలో కోచ్‌లతో శిక్షణ ఇస్తారు. స్పోకెన్ ఇంగ్లీష్, మొబైల్ యాప్స్, డ్రోన్ తయారీ, మల్టీ మీడియా, లైఫ్ కెరీర్ కోడింగ్, కంప్యూటర్ కోర్సుల్లో నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. గుర్రపుస్వారీ, మార్షల్ ఆర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్, స్టాక్ మార్కెట్‌పై అవగాహన, శాస్త్రీయ, పాప్ సంగీతం, స్కేటింగ్ తదితరాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. -
అద్భుతాల ‘లేపాక్షి’
శిల్ప కళలకు కాణాచిగా మారిన జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం లేపాక్షిలో అడుగడుగునా అద్భుతాలే కనిపిస్తుంటాయి. ఇందులో తైలవర్ణ చిత్రాలు ప్రముఖమైనవి. ఆలయంలోని నాట్య మంటపానికి తూర్పున పైకప్పులో ఒక రావి ఆకుపై చిన్నికృష్ణుడు పడుకున్నట్లున్న చిత్రపటం దేశవిదేశీ పర్యాకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో విశేషమేమంటే మనం ఎటు వైపు నుంచి చూసినా.. చిన్నికృష్ణుడు మనలే్న చూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంకా నాట్య మంటపంలో అంతరిక్ష స్తంభం, రంభ నాట్యం చేస్తున్నట్లుగా ఉన్న శిల్పం, సంగీత కళాకారులు, పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి అలంకరణలు, విరుపణ్ణ అన్నదమ్ముల చిత్రాలు.. అబ్బుర పరుస్తుంటాయి. - లేపాక్షి (హిందూపురం) -
దక్షిణ కాశీ.. కోనమల్లేశ్వర క్షేత్రం
అనంపురము – వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో వెలసిన కోనమల్లేశ్వర క్షేత్రం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. కొలిచిన భక్తులకు కొంగు బంగారం ఇచ్చే ఇలవేల్పుగా ఇక్కడ పరమ శివుడు విరాజిల్లుతున్నాడు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. పూర్వం భృగు మహర్షి ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్టించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ, ఇక్కడ తపస్సు చేస్తుండేవాడని, కాలక్రమంలో జయమేజయుడు అనే చక్రవర్తి ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. సీతారామలక్ష్మణులు వనవాస కాలంలో ఆలయ పరిసరాల్లో సంచరించినందున భక్తులు ఆలయ పరిసరాల్లోకి చేరగానే సీతాదేవి వర్ణం పసుపు రంగుగా మారడం విశేషం. ఇక్కడ ఐదు శివ లింగాలు ఉండటం, నంది విగ్రహం నోట్లో నుంచి కోనేటిలోకి నీరు రావడం ప్రత్యేకత. ఆలయంలో ప్రతి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేస్తారు. భక్తులు ముందుగా కోనేటిలో స్నానాలు చేసి దేవుని దర్శనం చేసుకుంటారు. కార్తీక మాసంలో మహిళలు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగిస్తారు. కార్తీక మాసం నాల్గవ సోమవారం ఆలయంలో గొప్ప జాతర నిర్వహిస్తారు. ఇక్కడ వివాహ, శుభకార్యాలు నిర్వహించేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ వంట గదులు, భోజనశాల నిర్మించారు. ఈ జాతరకు అటు వైఎస్సార్ జిల్లా, ఇటు అనంతపురము జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. - తాడిమర్రి (ధర్మవరం) -
అక్కడ రాళ్లే నైవేద్యం
లేపాక్షి మండలంలోని కోడిపల్లి నుంచి హిందూపురానికి వెళ్లే రహదారిలో ఒక కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే కొత్తపల్లిక్రాస్ వద్ద ఉన్న బట్ల బైరవేశ్వర స్వామికి రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ దేవుడికి జంతుబలులు, అభిషేకాలు, అర్చనలు అంటూ ప్రత్యేకించి ఏవీ ఉండవు. ఆ దారి గుండా ప్రయాణించే వారు మూడు రాళ్లను నైవేద్యంగా సమర్పించి వెళుతుంటారు. ఇలా చేయడం వల్ల తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇలా భక్తులు సమర్పించిన రాళ్లు ఓ గుట్టగా పోగయ్యాయి. అయితే దీనికి ఓ ప్రాచీన కథను స్థానికులు నేటికీ వినిపిస్తున్నారు. అదేమంటే పూర్వం తిరుపతికి పాదయాత్రగా కుటుంబసభ్యులతో బయలుదేరిన బైరవేశ్వరుడనే భక్తుడు.. ఈ ప్రాంతానికి చేరుకునే సమయానికి చీకటి పడింది. దీంతో ఆ రాత్రికి అక్కడే విడిది చేశారు. తెల్లవారే సరికి భైరవేశ్వరుడు చనిపోయినట్లు గుర్తించి, అక్కడే ఖననం చేశారు. ఆ సమయంలో అతని సమాధిపై ఒక్కొక్కరు మూడు రాళ్లు వేసి వెళ్లారు. మనసులో ఏదైనా కోరుకుని ఇక్కడ మూడు రాళ్లు వేస్తే అవి నెరవేరుతూ వస్తుండడంతో ఆ మరుసటి రోజున కోడి పుంజులను ఇక్కడ బలివ్వడం మొదలు పెట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. - లేపాక్షి (హిందూపురం) -
సర్వదేవతల సంగమం.. సంగమేశ్వరం
బత్తలపల్లి (ధర్మవరం) : ఎత్తైన కొండలు.. పచ్చదనం సంతరించుకున్న పంట పొలాలు.. ఆహ్లాదకర వాతావరణం నడుమ సర్వదేవతలు కొలువై ఉన్నారు. వివిధ ఆలయాలతో నిండిన ఈ క్షేత్రం సంగమేశ్వరంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం బత్తలపల్లి మండలం అప్రాచెరువు పంచాయతీ పరిధిలో ఉంది. ప్రతి దేవాలయం వద్ద సరస్సులు ఉన్నట్లుగానే ఇక్కడ కూడా చిత్రావతి, దూబిలేరు, పాలేరు నదులు కలుస్తాయి. ప్రతి సంగమం వద్ద ఈశ్వరాలయం ఉన్నట్లుగానే ఇక్కడా కూడా శివుడిని ప్రతిష్టించారు. ఈ క్షేత్రాన్ని సంగరామేశ్వరంగా కూడా పిలుస్తారు. ఇలాంటివి ఉత్తర భారతదేశంలో దేవ ప్రయాగ, రుద్రప్రయాగ, నందిప్రయాగ, త్రివేణì సంగమంలో ఉన్నాయి. వాటి సరసన ఈ క్షేత్రం కూడా చేరుతుంది. ఈశ్వరాలయం చరిత్ర : సంగమేశ్వరంలోని ఈశ్వరాలయానికి సంబంధించి కొన్ని చారిత్రాత్మక ఆధారాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు పాలనలో ఆస్థాన మంత్రికి భరణంగా ఇచ్చి అప్పాజీ పేరుతో అప్పరాజుచెర్ల గ్రామాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈశ్వరాలయం వెనుక దేవనాగర లిపిలో ఒక శాసనం ఉంది. ఆ శాసనాన్ని ఆర్కియాలజీ శాఖవారు సర్వేచేసి ఈ శాసనం రాయల కాలం నాటిదని తేల్చారు. ఆలయంలోని పంచలింగాలు, ఆలయగోపురం కూడా రాయలనాటి కాలానివే. నదుల సంగమంలో కొన్ని దశాబ్ధాల క్రితం నదులు వెల్లువెత్తి విలయతాండవం చేసినప్పుడు చామండేశ్వరి విగ్రహం బయటపడింది. అది ఇప్పటికీ నదులు కలిసే ప్రాంగణంలో ఉంది. స్థల మహత్యాన్ని బట్టి పంచలింగాల ప్రతిష్ట జరిగింది. ఈ ఈశ్వరాలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలతో పంచలింగాలను అభిషేకిస్తారు. ప్రతియేడాది శివరాత్రి, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల్లో వేడుకలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో విశాలంగా నిర్మించిన సత్రముంది. ఇది వివాహాది శుభకార్యాలకు సౌకర్యంగా ఉంది. ఎన్నెన్నో ఆలయాలు.. ఈశ్వరాలయం చుట్టూ గుట్టలు, పెద్దపెద్దరాళ్లు ఉండేవి. ఆ ప్రదేశంలో ఇద్దరు అవధూతలు తిరుగుతుండేవారు. వారిని ప్రజలు తిక్కమల్లప్ప, ఎర్రిచెన్నప్పలుగా పిలిచేవారు. గుట్టపై రామాలయాన్ని నిర్మించి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి కొందరు వ్యక్తులు వస్తారని వారు జోస్యం చెప్పారట. వారి జోస్యం ఫలించి రామకృష్ణానందస్వామి ఈ క్షేత్రానికి వచ్చి మహాయజ్ఞం నిర్వహించి రామాలయం నిర్మించినట్లు చెబుతారు. 1974లో రామకోటి మహాయజ్ఞం జరిగింది. సకల వెంకటసుబ్బమ్మ, రంగలమ్మ ఆర్థికసాయంతో శ్రీసీతారామలక్ష్మణ, హనుమాన్ విగ్రహాలను ప్రతిష్టించారు. అదేవిధంగా దేవాలయ నిర్మాణానికి రావులచెరువు రామిరెడ్డి ఎంతో సహాయం చేశారు. రామాలయం పక్కనున్న గుట్టపై శ్రీవెంకటేశ్వస్వామి, పద్మావతిదేవీ ఆలయాలను కూడా విరాళాలతో నిర్మించారు. శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం వెనుకనే శ్రీరామకోటి స్థూపం ఉంది. ఇంకా ఈక్షేత్రంలో నవగ్రహాలు, చిన్నచిన్న దేవాలయాలున్నాయి. పచ్చని చెట్లనడుమ ఎల్తైన గుట్టపై కొన్ని ఆలయాలు, కళ్యాణమండపాలు నిర్మించారు. ఈ ప్రదేశం భక్తులను ఎంతో ఆకర్షిస్తోందని చెప్పవచ్చు. ఎలా వెళ్లాలంటే : ఈ క్షేత్రానికి వెళ్లాలంటే బత్తలపల్లి నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ధర్మవరం నుంచి పది కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఆటోలలో వెళ్లవచ్చు. బస్సు సౌకర్యం లేదు. -
తిమ్మమ్మ మర్రిమాను.. చూసొద్దాం రండి
మండు వేసవిలో పచ్చని చెట్టు కింద కూర్చొని చుట్టూ ఉన్న కొండల నుంచి వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉంటే... ఆహా మజానే వేరు! ఔనని ఒప్పుకుంటారు కదూ... ఇలాంటి అనుభూతులను పంచుతోంది జిల్లాలోని తిమ్మమ్మ అమ్మవారు కొలువైన తిమ్మమ్మ మర్రిమాను. చుట్టూ ఈశ్వరమలై కొండల నడుమ సుమారు తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మహా వృక్షం 1989లో గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుంది. ఆరు శతాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మహావృక్షం ఎన్పీకుంట మండలంలోని ఎదురొన పంచాయతీలోని గూటిబైలు గ్రామ సమీపంలో ఉంది. మండల కేంద్రం ఎన్పీ కుంటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రిమాను వద్దకు చేరుకోవాలంటే కదిరి నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలోని రెక్కమాను వద్ద దిగి అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కదిరి–మదనపల్లి జాతీయ రహదారిపై కొక్కంటి క్రాస్‌లో దిగి ఆటోలో ప్రయాణించినా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. చరిత్ర ఇలా.. 14వ శతాబ్దంలో పాలెగాళ్ల పాలనలో ఉన్న గంగరాజుల కోటలో ఉన్న బాలవీరయ్యకు బుక్కపట్నం గ్రామానికి చెందిన తిమ్మమ్మతో వివాహమైంది. కాలక్రమంలో కుష్టు వ్యాధి బారిన పడ్డ బాలవీరయ్య... ఊరి శివారులో చిన్న పూరిగుడెసె వేసుకుని జీవనం సాగించారు. ఆ సమయంలో తన భర్తకు తిమ్మమ్మ సేవలు చేస్తూ వచ్చింది. బాలవీరయ్య తనువు చాలిస్తే.. కొక్కటి పాలెగాళ్ల అనుమతితో తిమ్మమ్మ సతీసహగమనం చేసింది. ఆ సమయంలో ఆమె చెప్పిన మాట ప్రకారం అగ్నిగుండానికి ఈశాన్యంలో నాటిన మర్రికొమ్మ ఇగురు వేసి.. నేడు మహా వృక్షమైంది. అప్పటి నుంచి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తిమ్మమ్మను భక్తులు కొలుస్తూ వచ్చారు. కాగా, మర్రిమాను వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. ఇందులో నెమళ్లు, పావురాలు, కుందేళ్లు, జింకలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకులు సేదతీరేందుకు పచ్చికబయళ్లు ఉన్నాయి. - ఎన్పీకుంట (కదిరి) -
కొటిపి చౌడేశ్వరీ ఆలయం.. చూసొద్దాం రండి
భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా హిందూపురం మండలంలోని కొటిపి చెరువు వద్ద వెలసిన చౌడేశ్వరీ దేవి ఆలయం విరాజిల్లుతోంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాక పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. తమ కోర్కెలు తీర్చాలని చీర, సారే, గాజులు సమర్పించి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ప్రతి మంగళ, శుక్రవారాలు, పౌర్ణమి రోజుల్లో ఆలయం వద్ద భక్తులు నిద్ర చేస్తుంటారు. ఈ ఆలయాన్ని సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చోళులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రత్యేకత ఏమంటే అమ్మవారికి సమర్పించిన కానుకలను బహిరంగంగా పెట్టి ఉంటారు. వీటిని ఎవరూ తీసుకెళ్లారు. సంవత్సరాల తరబడి ఆలయం ముఖద్వారం వద్ద ఎడమవైపున ఉన్న నాగుల కట్ట వద్ద గుట్టగుట్టలుగా గాజులు, చీరలు పడేసి ఉంటారు. ఆలయానికి చేరుకోవాలంటే హిందూపురం నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించి కొటిపి చెరువును చేరుకోవాల్సి ఉంటుంది. హిందూపురం నుంచి ప్రత్యేకంగా ఆటోలు తిరుగుతుంటాయి. లేదంటే సొంత వాహనాల్లో వెళ్లి రావచ్చు. - హిందూపురం రూరల్ -
తిరుమల దేవర ఆలయం.. చూసొద్దాం రండి
జిల్లాలోని ప్రముఖ చూడదగ్గ ఆలయాల్లో తిరుమల దేవర ఆలయం ఒకటి. వందల ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఈ ఆలయం చెన్నేకొత్తపల్లి మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న ఎన్ఎస్గేట్ నుంచి రామగిరి మండలంలోని పేరూరుకు వెళ్లే రహదారి పక్కనే గంగంపల్లి వద్ద ఉంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఈ మార్గం గుండా ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. నసనకోట పంచాయతీలోని ముత్యాలంపల్లిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా తిరుమల దేవర ఆలయాన్ని సందర్శించుకుంటుంటారు. వారంలో మూడురోజులు భక్తులతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొని ఉంటుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 70కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడకు వచ్చిన తర్వాత సమీపంలోనే నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. అటు నుంచి మరో 15 కిలోమీటర్లు ప్రయాణించి పేరూరు డ్యాంను కూడా చూడవచ్చు. - రామగిరి (రాప్తాడు) -
ఇస్కాన్ మందిరం.. చూసొద్దాం రండి
భువిపై వెలసిన భూతల స్వర్గంగా భాసిల్లుతున్న అనంతపురంలోని ఇస్కాన్ మందిరం భక్తుల సుందర స్వప్న సాకారమై విరాజిల్లుతోంది. అరుదైన ఈ అపురూప కట్టడం అనంతపురం శివారులోని గుత్తి రోడ్డులో సోములదొడ్డి వద్ద ఉంది. భారతీయ శిల్పకళకు, సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ మనోహర కట్టడం జిల్లాకే తలమానికంగా నిలిచింది. మందిర ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక చింతన భక్తులను వెన్నాడుతుంది. శ్రీరాధాపార్థసారధుల మనోహర ప్రతిమలు జీవకళ ఉట్టిపడుతూ వింత శోభతో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పురాణ ఇతిహాసాల్లోని వివిధ ఘట్టాలు మందిరం చుట్టూ నేత్ర పర్వం చేస్తున్నాయి. సుమారు 60 అడుగుల ఎత్తుతో నిర్మించిన నాలుగు అశ్వాలు రథాన్ని లాగుతున్నట్లు నిర్మితమైన ఇస్కాన్ మందిరం ఏ మూల నుంచి చూసినా.. ఓ మధురానుభూతిని మిగుల్చుతోంది. రాత్రి వేళలల్లో విద్యుద్దీప కాంతులతో వెలుగులు విరజిమ్మే ఈ కృష్ణ మందిరాన్ని చూసేందుకు జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తున్న వారు ఆసక్తి చూపుతుంటారు. - అనంతపురం కల్చరల్ -
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి
ప్రపంచ దేశాల్లోని అశేష భక్త కోటితో ఆధ్మాత్మిక గురువుగా కొలువబడుతున్న సత్యసాయి నడయాడిన పుణ్యభూమి పుట్టపర్తి. ప్రశాంతతకు మారుపేరుగా ప్రశాంతి నిలయంగా పేరొందిన పుట్టపర్తిలో నిత్య ఆధ్యాత్మిక శోభతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సత్యసాయి మహానిర్యాణం అనంతరం రూపుదిద్దుకున్న సత్యసాయి మహాసమాధి, సత్యసాయి నెలకొల్పిన కట్టడాలు, ఆయన జీవిత చరిత్రతో ముడిపడిన అంశాలు ఇక్కడికు వచ్చే పర్యాటకులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. ఇక్కడ సత్యసాయి ఆశ్రమం, ప్రశాంతి మందిరంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో అరుదైన పాలరాతితో నిర్మితమైన సత్యసాయి మహాసమాధి, చారిత్రక కట్టడమైన సర్వధర్మ స్థూపం, గడ్డి మైదానాలు, సత్యసాయి చరిత్రను తెలిపే పుస్తక విక్రయశాలలు, ప్రశాంతి నిలయానికి అనుకుని ఉన్న కొండపై మూడు అంతస్తుల్లో నిర్మితమైన సత్యసాయి పూర్వపు మ్యూజియం, సత్యసాయి యూనివర్శిటీ, కొండపై కల్పవృక్షం (చింత చెట్టు), సత్యసాయికి జన్మనిచ్చిన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ పుణ్య దంపతుల సమాధులు, హనుమాన్ సర్కిల్లోని శివాలయం, సత్యసాయి నిర్మించిన అద్బుతమైన హిల్వ్యూవ్ క్రికెట్ మైదానం, కొండపై 66 అడుగుల హనుమంతుడు, షిరిడీ సాయి, ఏసుక్రీస్తు, శ్రీకృష్ణుడు, బుద్దుడు, జోరాస్టర్ల ప్రతిమలు, గోకులం వద్ద సత్యసాయి నిర్మించిన మిరుపురి సంగీత కళాశాల, ఇండోర్ స్టేడియంను చూడవచ్చు. జిల్లా కేంద్రమైన అనంతపురం నుంచి సుమారు 84 కిలోమీటర్లు ప్రయాణించి పుట్టపర్తి చేరుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి. - పుట్టపర్తి టౌన్ -
గొల్లపల్లి జలాశయం చూసొద్దాం రండి
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టి చిరస్థాయిగా నెలకొల్పిన గొల్లపల్లి హంద్రీ-నీవా జలాశయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. వేసవి సెలవుల్లో జిల్లా నుంచే కాక పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. గొల్లపల్లి జలాశయం నుంచి చంద్రగిరి, దుద్దేబండ, గొందిపల్లి మీదుగా అటవీ ప్రాంతంలోకి వెళితే ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన శ్రీకైలాశానికి చేరుకోవచ్చు. చుట్టూ ఎతైన కొండల మధ్య పురాతన శ్రీకైలాశ రామలింగేశ్వరస్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. రెండు కొండల మధ్యలో నిలిపిన పార్వతీపరమేశ్వరులు, ఆ పక్కనే ఈశ్వరుని జట నుంచి జాలు వారుతున్న గంగను చూడవచ్చు. భీమలింగేశ్వరస్వామి, అక్కమ్మ గార్లు కొలువైన క్షేత్రంగాను ఈ ప్రాంతానికి పేరుంది. అయ్యప్ప స్వామి, శివలింగాలు, కోనేరు ఇక్కడి ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. 44వ జాతీయ రహదారిపై జిల్లా కేంద్రం నుంచి వచ్చే ప్రయాణికులు గుట్టూరులో దిగి అక్కడ నుంచి ఆటోల ద్వారా మక్కాజీపల్లి తండా మీదుగా వెంకటగిపాళ్యం, చంద్రగిరి, గొల్లపల్లి మీదుగా జలాశయానికి చేరుకోవచ్చు. సొంత వాహనాల్లో వచ్చే వారు జాతీయ రహదారిపై దుద్దేబండ క్రాస్ వద్ద తిరిగితే గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేరుకోవచ్చు. శ్రీకైలాసÔ¶ క్షేత్రంలో పర్యాటకులు విడది చేసేందుకు చక్కటి వసతి ఉంది. - పెనుకొండ రూరల్ -
మీకు తెలుసా? నిమ్మలకుంట
హాయ్ పిల్లలూ.. ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామం గురించి మీకు తెలుసా? ఎందుకంటే ఈ ఊరు పేరు అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ఎలాగంటే ఇక్కడ తోలుబొమ్మలను తయారు చేస్తుంటారు. మన ప్రాచీన సంస్కృతిలో భాగమైన తోలుబొమ్మలాటలో ఇక్కడి వారు దేశ, విదేశాల్లో పేరుప్రఖ్యాతులు గడించారు. ధర్మవరం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో పుట్టపర్తికి వెళ్లే దారిలో ఉన్న ఈ గ్రామానికి బస్సులు, ఆటోలలో వెళ్లవచ్చు. ఈ గ్రామంలో కాలుపెడితే ఆరుబయటే అరుగులపై తోలుతో బొమ్మలను తయారు చేస్తుండడం చూడవచ్చు. 150 కుటంబాలు ఉన్న ఈ గ్రామంలో 80 కుటుంబాలు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. మేక చర్మాన్ని బాగా శుభ్రం చేసి ఎండబెడతారు. అలా ఎండిన చర్మంపై పెన్సిల్‌తో బొమ్మను గీస్తారు. స్కెచ్‌పై చిన్నచిన్న రంద్రాలు వేసి మిగిలిన భాగాన్ని తీసివేసి, రంగులు వేస్తారు. ఇలా ఒక్కొక్క బొమ్మ చేసేందుకు వారం పది రోజులు పడుతుంది. ఈ బొమ్మలు గృహాలంకరణలోనూ బాగుంటాయి. అంతేకాదండోయ్.. ఎంచక్కా టేబుల్ ల్యాప్ షెడ్స్, పార్టిసన్స్, వాల్ హ్యాంగిల్స్, పెన్స్టాండ్లు, బుక్ స్టాండ్లు, బ్యాగ్‌లు కూడా ఆకర్షణీయంగా తయారు చేసి, విక్రయిస్తుంటారు. ఇక్కడి కళాకారులు హస్తకళల్లో జాతీయ స్థాయిలో అవార్డులు కూడా పొందారు. ఇంతటి ప్రాచీన కళను నేటికీ సజీవంగా ఉంచినందుకు గ్రామానికి చెందిన దళవాయి చలపతి, శ్రీరాములు తదితరులకు రాష్ట్రపతి పురస్కారాలు కూడా దక్కాయి. - ధర్మవరం రూరల్ -
‘అనంత’ మ్యూజియం చూసొద్దాం.. రండి
సందర్భం : నేడు మ్యూజియం దినోత్సవం హాయ్ ఫ్రెండ్స్.. గతకాల వైభవానికి ప్రతీకగా నిలిచిన చరిత్రను తెలుసుకోవాలంటే మనం మ్యూజియంలకు వెళ్లాల్సిందే. గత చరిత్రకు సంబంధించిన విజ్ఞానాన్ని చిన్నారులకు అందించాలనే లక్ష్యంతో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ మ్యూజియంలను నిర్వహిస్తుంటారు. కాలగర్భంలో కలసిపోయిన మన పూర్వీకులు వినియోగించిన వస్తుసామగ్రి, నాటి శాసనాలు, నాణేలు, శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు. జిల్లా కేంద్రం అనంతపురంలోని ఆదిమూర్తినగర్‌లో పురావస్తు శాఖ ప్రదర్శన శాల (మ్యూజియం) మనకు అందుబాటులో ఉంది. ‘మ్యూజియం డే’ని పురస్కరించుకుని గురువారం ఇక్కడ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. రాయలేలిన సీమలోని అనంత ఘన చరిత్రను ఇక్కడ తెలుసుకునేందుకు వీలవుతుంది. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో లభ్యమైన గత వైభవాన్ని చాటే పలు సుందరశిల్పాలు, పురాతన విగ్రహాలు, శాసనాలు, నాణేలు ఇక్కడ భద్రపరిచారు. ప్రాచీన యుగానికి చెందిన వస్తువులు, తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన తెలుగులిపిలో వచ్చిన మార్పులు సూచించే పట్టిక, జైన, బౌద్ధ విశేషాలు తెలుసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం... రండి ‘అనంత’ మ్యూజియంను ఒకసారి చూసొద్దాం. - అనంతపురం కల్చరల్ -
రాయలేలిన ‘దుర్గం’
రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. అయినా ఆ నాటి మధుర జ్ఞాపకాలు మాత్రం కనువిందు చేస్తున్నాయి. రాయలు ఏలిన దుర్గంగా రాయదుర్గం చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించే రోజుట్లో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేశారు. నాడు వారు నిర్మించిన ఆలయాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. రాయదుర్గం కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణ స్వామి, జంబుకేశ్వర స్వామి, విశిష్ట దశభుజ గణపతి, కొండపై లక్ష్మీ నరసింహస్వామి, కోదండ రామస్వామి, మాధవరాయస్వామి, రస సిద్ధేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర చారిత్రక కట్టడాలను ఇక్కడ చూడవచ్చు. పట్టణంలోని బళ్లారి రోడ్డులో అపురూపమైన పాదరస శివలింగాన్ని దర్శించుకోవచ్చు. సతీసహగమనానికి ప్రతీకగా నిలిచిన లక్షుమమ్మ సమాధి కూడా ఇక్కడ ఉంది. జిల్లా కేంద్రం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గంకు ప్రతి గంటకు ఒక బస్సు చొప్పున అనంతపురం ఆర్టీసీ బస్టాండు నుంచి బయలుదేరుతుంటాయి. ఇక్కడ ఉండేందుకు మంచి వసతి సౌకర్యాలు ఉన్నాయి. - రాయదుర్గం టౌన్ -
రాయలసీమలోనే అతి పెద్ద ఆంజనేయుడు
హాయ్ పిల్లలూ.. 22 అడుగుల ఎత్తు ఉన్న భక్తాంజనేయస్వామి ఏకశిలా విగ్రహాన్ని మీరెప్పుడైనా చూశారా? అనంతపురంలో కొలువైన ఈ భారీ భక్తాంజనేయుడు ఎవరినైనా సూదంటు రాయిలా ఆకర్షిస్తాడు. దాదాపు రూ.4 కోట్ల వ్యయంతో హౌసింగు బోర్డులోని సమర్థసద్గురు సాయిసేవాశ్రమం ప్రాంగణంలో నిర్మాణమైన నిలువెత్తు ఆంజనేయ విగ్రహానికి అనేక ప్రత్యేకతలున్నాయి. భూమి నుంచి 46 అడుగుల ఎత్తులో రెండు అంతస్తులుగా నిర్మించబడిన ఇలాంటి ఆలయం రాయలసీమలోనే మొదటిది కావడం విశేషం. తొలిసారిగా దివ్యమంగళ స్వరూపమైన ఆంజేయుడి భారీ విగ్రహానికి అభిషేకం చేయడానికి ప్రత్యేకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు. కంచి వాస్తవ్యులు పద్మశ్రీ గణపతి స్థపతి పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం ఆద్యంతం రాజుల కాలాన్ని తలపించింది. భారతీయ శిల్పశైలికి అనుగుణంగా, చూడముచ్చటగా ఆలయ గోపురంతోపాటు ఇతర నిర్మాణాలు ఒక్కసారి చూడగానే ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తాయి. భారతీయ వాస్తు శిల్పాన్ని ప్రతిబింబిస్తూ ఆలయ ప్రాంగణంలో సాగిన నిర్మాణాలు కూడా అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. భక్తిభావం నింపే షిరిడి సాయినాథుడు, భారీ అశ్వంపై మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను చూసి తీరాల్సిందే. దీనికి తోడు ఈనెల 21న రానున్న హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఇప్పటికే ఆలయంలో సందడి నెలకొంది. ఇంకెందుకు ఆలశ్యం ఇంకా చూడనివారెవరైనా ఉంటే వెంటనే చూసొద్దాం రండి. - అనంతపురం కల్చరల్ -
ములకనూరు.. చూసొద్దాం రండి
హాయ్ ఫ్రెండ్స్.. కంబదూరు మండలంలోని ములకనూరు గ్రామంలోని కొండపై వెలసిన తిమ్మప్పస్వామి ఆలయంలో ప్రతి ఏటా జాతర వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ ఇక్కడ జాతర జరుగుతోంది. గ్రామాల్లో జాతరలంటే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. 16వ తేదీ ఉదయం దాసంగాలు పెడతారు. అదే రోజు రాత్రి స్వామికి పల్లకీ ఉత్సవం, ముత్యాల తేరు ఊరేగింపు ఉంటుంది. 17వ తేదీ గ్రామ నడిబొడ్డున గావుల ఉత్సవం ఉంటుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు వస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి స్వామి జాతర ఉంటుంది. ఇక ఈ జాతరలో ప్రత్యేకాకర్షణగా 16వ తేదీ రాతిదూలం లాగుడు పోటీలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ జాతర చూసేందుకు మీరందరూ మా ఊరికి రండి.. - కంబదూరు (కళ్యాణదుర్గం) -
కోన కణ్వాశ్రమం చూసొద్దాం.. రండి
చెన్నేకొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న కోన కణ్వాశ్రమం ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్యన పురాతన ఆలయాలను ఇక్కడ చూడవచ్చు. జాతీయ రహదారి నుంచి దాదాపు ఐదు కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతం లోపలకు వెళితే కణ్వ మహర్షి తపమాచరించిన ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతాన్నే కోన కణ్వాశ్రమమని భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ మల్లికార్జున స్వామి, రుక్మిణి సమేత పాండురంగ విఠలుడి ఆలయాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. శివకేశవులు కొలువైన క్షేత్రంగానూ ఈ ప్రాంతానికి పేరుంది. ఇంకా అయ్యప్పస్వామి, ఆంజనేయ స్వామి, వేంకటేశ్వర, అక్క మహా దేవతల ఆలయాలూ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే.. మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై 45 కిలో మీటర్ల ప్రయాణించి చెన్నేకొత్తపల్లి చేరుకుంటే ఇక్కడి నుంచి ఆటోల ద్వారా జాతీయ రహదారిపై పెనుకొండ మార్గంలో రెండు కిలోమీటర్లు వెళ్లి అక్కడి నుంచి కుడివైపుగా ఐదు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణించి కోన క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఇక్క పర్యాటకులు విడిది చేసేందుకు చక్కటి వసతి సౌకర్యం కూడా - చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) -
చూసొద్దాం రండి
‘సీమ’కే తలమానికం రత్నగిరి క్షేత్రం రొళ్ల (మడకశిర) : చెక్కుచెదరని కోటలు, కొండపై ఎత్తైన బురుజు, గజశాలలు, రాతి ఏనుగులు, కల్యాణిబావులు, మంటపాలు, పురాతన కట్టడాలతో రత్నగిరి క్షేత్రం రాయలసీమకే తలమానికంగా నిలుస్తోంది. రత్నగిరికి 1900 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. రత్నగిరి సంస్థానాన్ని మొదట రాజుగ తిమ్మప్పనాయక పాలించారు. అతని తాత మాదప్పనాయక ఆనేగొందిని పాలించారు.ఆయనకు నలుగురు సంతానం మొదటి రాజు అయిన కెంపు లక్ష్మణనాయక, లక్ష్మణనాయక, మంద నాగనాయక, రత్రాంబిక అనే వారు ఉండేవారని చరిత్ర చెబుతోంది. క్రీ.శ.1799లో ఇక్కడికి వచ్చిన కర్ణాటక ప్రాంత మైసూరు శ్రీరంగపట్టణం టిప్పుసుల్తాన్రాజు రత్నగిరికి ‘ముస్తాఫాబాద్’ అని నామకరణం కూడా చేశారు. అలనాటి రాజుల పాలనకు గుర్తుగా ఎన్నో దేవాలయాలు, భవనాలు, కోట ముఖద్వారాలు, ఇరు పక్కల రాతి ఏనుగులు, కల్యాణి బావులు నిర్మించారు. రాజులు నిర్మించిన శత్రుదుర్బేధ్యమైన కోటలు, రాణులు స్నానం ఆచరించడానికి ప్రత్యేకంగా నిర్మించిన ఈత కొలనులు, కొండ పైకి ఎక్కేందుకు బండపై చెక్కిన మెటికెలు, ఇక్కడ శత్రువుల రాకను పసిగట్టి రాజును, సైనికులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన స్థలం, రాణి నివసించేందుకు ఏర్పాటు చేసిన విశాలమైన భవంతి, శత్రువులు ప్రవేశించడానికి వీలుకాకుండా కొండపైన చుట్టూ 35 అడుగుల ఎత్తులో ప్రహరీ నిర్మించారు. రత్నగిరి కొండను చేరుకునేందుకు చుట్టూ ఏడు కోటలు ఉన్నాయి. గ్రామంలో అక్కడక్కడ కనిపించే జైన దేవాలయాను బట్టి చూస్తే రత్నగిరి ప్రాంతాల్లో జైనమతం విలసిల్లినట్లు తెలుస్తోంది. రాజవంశస్తులు పూజించే కులదేవత శ్రీకొల్లాపురిమహాలక్ష్మిదేవి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాదీ చైత్రమాసంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. ఆలయ సమీపంలో గల పాలబావిలో గంగ పూజ చేస్తే సంతానం లేనివారికి సంతానభాగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాధులు నయం అవుతాయని భక్తుల నమ్మకం. ఇలా చేరుకోవచ్చు.. రొళ్ల మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గల కర్ణాటక ప్రాంతం మధుగిరి పట్టణానికి వెళ్లే మార్గంలో ఈ క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి అయితే 139 కిలోమీటర్ల దూరం ఉంది. పెనుకొండ వయా మడకశిర నుంచి రొళ్ల మీదుగా రత్నగిరి చేరుకోవచ్చు. -
హుషారెత్తించే ‘గోలీ’మార్
హలో ఫ్రెండ్స్ మీ పట్టణ, నగర ప్రాంతాల్లో ఏమో గానీ మా ఊళ్లో మాత్రం ఈ ఎండాకాలం సెలవుల్లో ఎన్నో ఆటలు ఆడుకుంటున్నాం. మేము ఆడుకునే ఆటల్లో ముఖ్యమైనది గోలీల ఆట. ఈ ఆట ఆడుతున్న కొద్దీ హుషారుగా ఉంటుంది. ఎందుకంటే మనతో పాటు ఆడేవారి గోలీలను గెలుచుకోవడం నిజంగా థ్రిల్లే కదా! ఆట అయిపోయే లోపు జేబు నిండా గోలీలు వేసుకుని నడుస్తుంటే వచ్చే గళగళ శబ్ధం వింటే ఏనుగు ఎక్కినంత సంబరంగా ఉంటుంది. మీరూ ఈ ఆట ఆడాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీ స్నేహితులంతా కలిసి ఓ జట్టుగా ఏర్పడాలి. ముందుగా ఓ బొద్దిని (చిన్నపాటి గుంత) ఏర్పాటు చేసుకుని కొద్ది దూరం నుంచి బొద్ది వైపుగా గోలీలు వేయాలి. బొద్దికి దగ్గరగా ఉన్న వారు ఫస్ట్ ఆడాలి అన్నమాట. గోళీని మన చూపుడు వేలుకు ఆనించి వెనక్కు లాగి వదిలితే అది రాకెట్లా ముందుకు పోతుంది. ఇలా బొద్దిలోకి గోలీ వేసుకుంటే బోనస్ ఆట వస్తుంది. మనతో పాటు ఆడుతున్న వారి గోలీలను టార్గెట్ చేసి కొట్టుకుంటూ పోవాలి. తక్కువ పాయింట్లు తెచ్చుకున్న వారు బొద్ది వైపుగా తన గోలీని దోకాల్సి ఉంటుంది. లేదంటే ఒప్పందం మేరకు గోలీ ఇచ్చేయాల్సి ఉంటుంది. భలే గమ్మత్తుగా ఉంది కదూ...ఇంకెందుకు ఆలస్యం రండి గోలీలు ఆడుకుందాం. – గుమ్మఘట్ట -
చూసొద్దాం.. రండి
గుంతకల్లు పేరు వినగానే ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం ఠక్కున గుర్తుకువస్తుంది. ఇక్కడి ఆంజనేయస్వామిని కొలిస్తే సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి మూలవిరాట్ ఆంజనేయస్వామి స్వయంభూ అని ఆలయ చరిత్ర చెబుతోంది. క్రీ.శ. 1521న వ్యాసరాయలవారు ఆంజేయస్వామి విగ్రహాలను ప్రతిష్టిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారని, ఆ సమయంలో స్వప్పదర్శనం మిచ్చిన స్వామి ఆదేశాల మేరకు ఓ వేపచెట్టు సమీపంలో తవ్వించగా పది అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఆంజనేయస్వామి విగ్రహం బయటపడినట్లు తెలుస్తోంది. తొలుత ఈ ప్రాంతాన్ని నెట్టికల్లు అని పిలుస్తుండేవారు. దీంతో నెట్టికంటి ఆంజనేయస్వామిగా పేరు వచ్చింది. కాలక్రమేణ నెట్టికల్లు కాస్తా కసాపురంగా మారిపోయింది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. బస చేసేందుకు ఆలయ నిర్వహణలోని గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రైవేట్ వసతి గృహాలు కూడా ఉన్నాయి. - గుంతకల్లు రూరల్ ఆలయంలో చూడదగ్గవి.. ఆలయ ముఖద్వారం గుండా లోపలకు వెళ్లగానే భక్తులకు ముందుగా కనిపించేంది ధ్వజస్తంభం వద్ద ఉంచిన స్వామివారి పాదుకలు. ప్రతి రోజూ స్వామివారు ఈ పాదుకలను వేసుకుని లోక సంచారం చేస్తుంటారని భక్తుల నమ్మకం. అందుకే మరుసటి రోజు ఈ చెప్పులకు ముళ్లు, రాళ్లు, దుమ్ముధూళీ అంటుకుని అరిగిపోతుంటాయని ప్రతీతి. ఆలయానికి వచ్చే భక్తులు కొంతమంది స్వామివారి పాదుకలను నెత్తిన పెట్టుకొని తమను కష్టాల కడలినుంచి గట్టెక్కించాలని ప్రార్థిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. రామసేతు శిల తన ధర్మపత్ని సీతాదేవిని రావణుడి చెర నుంచి విడిపించుకుని వచ్చేందుకు లంకకు బయలుదేరిన శ్రీరాముడు.... సముద్రంపై వానరసైన్యం సాయంతో ఓ సేతువు (బ్రిడ్జి) నిర్మించారు. సేతువు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు నీటిలో మునిగిపోకుండా పైకి తేలాడుతుంటాయి. అలాంటి ఓ రాతిని ఇక్కడకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అద్దాల పెట్టెలో భక్తుల దర్శనార్థం ఉంచారు. -
అబ్బుర పరిచే ‘హేమావతి’
అమరాపురం మండలంలోని హేమావతి గ్రామం పేరు వినగానే 12 ఎకరాల్లో విస్తరించి ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం గుర్తుకు వస్తుంది. ఈ ఆలయం అందాలను అక్కడికెళ్లి చూడాల్సిందే. 8వ శతాబ్దంలో నొళంబులు పాలిస్తున్న సమయంలో నిర్మితమైన ఈ ఆలయంలోని ప్రతి స్తంభాన్ని ప్రత్యేక శ్రద్ధతో చెక్కారు. స్తంభాలపై శిల్పాలు అబ్బుర పరుస్తుంటాయి. ఇక్కడ ప్రధానంగా సిద్దేశ్వర స్వామి మూలవిరాట్ లింగాకారంలో కాకుండా మానవరూపంలో దర్శనమిస్తుంటారు. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి అరుదైన ఆలయం మరెక్కడా లేదు. ఆలయ ఆవరణంలో దొడ్డేశ్వరస్వామి శివలింగాకారంలోను, దీనికి ఎదురుగా ఐదు అడుగుల ఎత్తు ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తారు. అలాగే కాలభైరవేశ్వర, పంచలింగేశ్వర ఆలయాలు కూడా ఇక్కడున్నాయి. ఇక్కడకు వచ్చే భక్తులకు సువిశాలమైన పార్క్ ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. భక్తులకు అన్నదాసోహ కేంద్రంలో అన్నదానం చేస్తుంటారు. రోజూ ఉదయం ఐదు నుంచి సాయంత్రం 8 గంటల వరకూ పూజలు చేస్తుంటారు. ఈ ఆలయానికి సందర్శించాలనుకుంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి పెనుకొండ, మడకశిర, బసవనపల్లి మీదుగా 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హేమావతికి చేరుకోవచ్చు. లేదంటే అనంతపురం నుంచి కళ్యాణదుర్గం, కుందుర్పి, నాగేపల్లిగేట్ మీదుగా 120 కి.మీ ప్రయాణించి అమరాపురం, ఇక్కడి నుంచి 12 కి.మీ ప్రయాణిస్తే హేమావతి ఆలయం వస్తుంది. ప్రతి రోజూ అమరాపురం నుంచి ఆటోలు, బస్సులు హేమావతికి వెళుతుంటాయి. - అమరాపురం (మడకశిర) -
చూసొద్దాం.. రండి
హిందూపురం నుంచి గౌరిబిదనూరుకు వెళ్లేదారిలో తొలి స్టేజ్‌లోనే బసవన్నపల్లి గ్రామం వస్తుంది. ఇక్కడ సుమారు 200 అడుగుల ఎత్తున ఉన్న భారీ శివుడి రూపాన్ని చూడవచ్చు. రోడ్డు పక్కనే ఉన్న ఈ ఆలయంలో నీలపు ఛాయతో తపోదీక్షలో ఉన్న శివుడి విగ్రహాన్ని చూడగాన్నే భక్తిభావంతో మనసు పరవశించిపోతుంది. ఈ విగ్రహం ఎదుట భారీ రూపంలో ఉన్న నంది, చుట్టూ వివిధ ఆకృతుల్లో ఉన్న వందలాది శివలింగాలు ఉంటాయి. నిత్యపూజలతో శోభాయమానంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి పండుగకూ ఇక్కడ విశేష పూజలు ఉంటాయి. ఇక మహా శివరాత్రి నాడు చెప్పనలవి కాదు. కార్తీక మాసంలో వేకువ జాము, సాయంత్రం వేళల్లో దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటుంటారు. ఆ మాసంలో జరిగే లక్ష దీపార్చన చూసేందుకు రెండు కనులు చాలవు. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్లు ప్రయాణించి హిందూపురం మీదుగా మరో ఐదు కిలోమీటర్లు గౌరిబదనూరు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. - హిందూపురం అర్బన్ -
చూసొద్దాం..
అరుదైన చిత్ర, శిల్ప కళలతో.. ఆధ్యాత్మిక చింతనతో పాటు నేటికీ అంతు చిక్కని సాంకేతిక నైపుణ్యానికి పట్టుకొమ్మగా విరాజిల్లుతోంది లేపాక్షి. సజీవశిల్ప సౌందర్యానికి ప్రతీకగా దేశవిదేశీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన వీరభద్రస్వామి ఆలయంలోని శిల్పాలు, తైలవర్ణ చిత్రాలు చూడముచ్చటగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, జటాయు మోక్షఘాట్, నంది విగ్రహం, ఏడుశిరసుల నాగేంద్రుడు, అంతరిక్ష స్తంభం, సీతమ్మ పాదం, విరుపణ్ణ కళ్లు పెకలించి గోడకు తాపడం చేసిన చోట అంటిన రక్తపు మరకలు, నాట్య మంటపం, లతా మంటపం, కల్యాణమంటపం తదితర విశేషాలు ఎన్నో అబ్బురపరుస్తున్నాయి. ఇక్కడి ఆలయం పైకప్పును రామాయణ, మహాభారత, మనునీతి, భూకైలాస్, కిరాతార్జునీయం తదితర ఘట్టాలను తైలవర్ణాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ఆలయం వద్ద ఇటీవల శుద్ధి చేసిన కోనేరు, పార్కులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆలయంలోని నాట్యమంటపం ఈశాన్య మూలలో నేలను తాకకుండా సుమారు ఎనిమిది అడుగుల స్తంభం పైకప్పు నుంచి నేలను తాకకుండా వేలాడబడి ఉంది. అంతరిక్ష స్తంభం అని పిలువబడుతున్న ఈ వేలాడే స్తంభం గుట్టు తెలుసుకునేందుకు అప్పట్లో దేశాన్ని పాలించిన తెల్లదొరలు నానా అగచాట్లు పడ్డారు. ఇందులోని రహస్యం నేటికీ అంతు చిక్కడం లేదు. ఈ ఆలయాన్ని చూడాలనుకుంటే జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూపురం చేరుకుని అక్కడి నుంచి తూర్పు దిశగా 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడకు నిరంతర బస్సు సౌకర్యం ఉంది. - లేపాక్షి (హిందూపురం) -
చరిత్ర పుటల్లో విదురాసత్త్వం
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న విదురాసత్థ్వం ఆధ్యాత్మికకు ప్రతిరూపంగానే కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో తెల్లదొరలనెదిరించి అసువులు బాసిన అమరుల నెత్తుటి ధారలతో తడిసిన పుణ్యభూమిగా ఖ్యాతిగడించింది. అనంతపురం నుంచి 130 కిలోమీటర్ల దూరంలోని హిందూపురం మీదుగా మరో 18 కిలోమీటర్లు బెంగళూరు రహదారిపై ప్రయాణిస్తే విదురాసత్థ్వం వస్తుంది. 1938 ఏప్రిల్ 25న ధ్వజ సత్యగ్రహంలో భాగంగా విదురాసత్థ్వం వద్ద 30 మంది స్థానిక యువత బ్రిటీష్ సైనికులను అడ్డుకుంటారు. ఆ సమయంలో ఆంగ్లేయులు తుపాకీలతో గుళ్ల వర్షం కురిపించడంతో వారు అసువులు బాసారు. వీరిలో ఓ గర్భిణి కూడా ఉన్నారు. ఇప్పటికీ వారి సమాధులు అక్కడ ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే మహాభారత సంగ్రామం తర్వాత విదురుడు వైరాగ్యంతో ఈ ప్రాంతానికి చేరుకుని తపోదీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పెన్నానదిలో కొట్టుకువచ్చిన అశ్వత్థ వృక్షం కొమ్మను తీసుకెళ్లి అతను నాటి దానిని పెంచి పోషించడంతో ఈ ప్రాంతానికి విదరాసత్థ్వం అనే పేరు వచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న అశ్వత్థనారాయణస్వామి ఆలయం చుట్లూ వందలాది నాగశిలలను ప్రతిష్టించారు. దేశవ్యాప్తంగా యాత్రికులు ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా చేయడం వల్ల నాగదోష నివారణ, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. - హిందూపురం అర్బన్ -
అబ్బో... అబ్బబ్బో అబూ...
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - మౌంట్ అబు ఎడారి రాష్ట్రంలో ఎత్తయిన కొండలతో నిండిన ప్రదేశం... పక్షుల కిలకిలలతో కనువిందు చేసే పచ్చని అడవులు... ఉరకలేసే జలపాతాలు... ప్రశాంతమైన సరోవరాలు... గత వైభవాన్ని చాటి చెప్పే కోట గోడలు.. కొండలపై వెలసిన పురాతన ఆలయాలు... వీటన్నింటినీ తనివితీరా చూసి ఆనందించాలంటే రాజస్థాన్‌లోని మౌంట్ అబు వెళ్లాల్సిందే! రాజస్థాన్‌లోని ఏకైక వేసవి విడిది మౌంట్ అబు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో గుజరాత్ సరిహద్దులకు చేరువలో ఆరావళి పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ పట్టణం. దీనికి చుట్టుపక్కల విస్తరించి ఉన్న దట్టమైన అడవిని పురాణాలు అర్బుదారణ్యంగా పేర్కొన్నాయి. నాటి కాలంలో ‘మౌంట్ అబు’ను అర్బుదాచలం అనేవారు. విశ్వామిత్రుడితో విభేదించిన వశిష్టుడు అర్బుదాచలంపై యజ్ఞం చేసినట్లు ప్రతీతి. ఇదేచోట అర్బుదమనే సర్పం శివుడి వాహనమైన నందిని రక్షించడం వల్ల ఈ పర్వతానికి అర్బుదాచలమనే పేరు వచ్చిందని, దీని చుట్టూ విస్తరించిన అరణ్యానికి అర్బుదారణ్యమనే పేరు వచ్చిందని కూడా మరో గాథ ఉంది. ఇక చారిత్రిక నేపథ్యాన్ని గురించి చెప్పుకుంటే, మొఘల్ పాలనకు ముందు ఈ ప్రాంతాన్ని ఎక్కువ కాలం గుర్జరులు, రాజపుత్రులు పాలించారు. ఏం చూడాలి? మౌంట్ అబులో అడుగడుగునా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాల్లో వేసవి తాకిడి భరించలేనంతగా ఉన్నా, మౌంట్ అబులో వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. మౌంట్ అబు పట్టణంలోను, పరిసరాల్లోనూ పలు చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు చూసి తీరాల్సినవే. * మేవార్ రాజు రాణా కుంభ 14వ శతాబ్దంలో నిర్మించిన అచలగఢ్ కోట శిథిలావస్థకు చేరుకున్నా, నాటి చారిత్రక వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ కట్టడం నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. * అచలగఢ్ కోట సమీపంలోని నక్కీ సరస్సులో ఈదులాడే బాతులను చూస్తూ బోటింగ్ చేయడం ఒక వింత అనుభూతి. ఈ సరస్సుకు సమీపంలోనే కప్ప ఆకారంలో ఉండే సహజమైన భారీ కొండరాతి వద్ద ఫొటోలు దిగుతుంటారు. * మౌంట్ అబు పరిసరాల్లో ధ్రుధియా జలపాతం, గోముఖ జలపాతం వంటి పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. జలపాతాల వద్దకు పర్యాటకులు పిక్నిక్లకు వస్తుంటారు. * అచలగఢ్ కోటకు అతి చేరువలోనే ఉన్న శైవక్షేత్రమైన అచలేశ్వర ఆలయానికి దూరప్రాంతాల భక్తులు కూడా వస్తూ ఉంటారు. స్థానికులు ‘అధర్‌దేవి’గా పిలుచుకునే అర్బుదాదేవి ఆలయం, గురుశిఖర్ పర్వత శిఖరంపై వెలసిన దత్తాత్రేయ ఆలయం, రఘునాథ ఆలయం, కాంతినాథ్ ఆలయం వంటి పురాతన హిందూ ఆలయాలతో పాటు 11-13 శతాబ్దాల మధ్య నిర్మించిన విమల్ వశాహీ ఆలయం, దిల్వారా ఆలయం వంటి పలు జైన ఆలయాల్లోని శిల్పసౌందర్యం చూసి తీరాల్సిందే. * మౌంట్ అబు చుట్టూ 290 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ప్రభుత్వం 1960లో మౌంట్ అబు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో చాలా రకాల అరుదైన పక్షులు, జింకలు, దుప్పులు, పులులు, చిరుతలు, సింహాలు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఇందులో సఫారీ గొప్ప అనుభూతినిస్తుంది. ఏం చేయాలి? * ఔత్సాహిక పర్వతారోహకులకు మౌంట్ అబులోని పర్వతశిఖరాలు సవాలుగా నిలుస్తాయి. ఆరావళి పర్వతశ్రేణుల్లోని అతి ఎత్తయిన శిఖరం ‘గురుశిఖర్’ పైనుంచి తిలకిస్తే మౌంట్ అబు అందాలు అబ్బురపరుస్తాయి. * మౌంట్ అబు పరిసరాల్లో జలపాతాలు గల అటవీ ప్రాంతాలు పిక్నిక్లకు అనువుగా ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రికులకు ఇక్కడి ప్రాచీన ఆలయాలు ఆనందానుభూతిని కలిగిస్తాయి. * బ్రహ్మకుమారీల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం ఇక్కడే ఉంది. ఆధ్యాత్మిక చింతన గల పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఏం కొనాలి? * రాజస్థానీ సంప్రదాయ హస్తకళా వస్తువులు ఇక్కడ విరివిగా దొరుకుతాయి. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో వీటిని తక్కువ ధరలకే కొనుక్కోవచ్చు. * నాణ్యమైన ఖద్దరు వస్త్రాలు, రాజస్థానీ చేనేత వస్త్రాలు, తేలికగా ఉండే దుప్పట్లు, రజాయిలు వంటివి కొనుక్కోవచ్చు. * లెదర్ బెల్టులు, హ్యాండ్‌బ్యాగ్స్, జాకెట్స్, రాజస్థానీ పెయింటింగ్స్ ఇక్కడి బజారులో తక్కువ ధరలకే దొరుకుతాయి. * ఇక్కడి రెస్టారెంట్లు, రోడ్డు పక్క ధాబాల్లో దొరికే రాజస్థానీ సంప్రదాయక వంటకాలను ఆస్వాదించవచ్చు. మీగడ నిండుగా వేసి తయారుచేసే ‘మఖానియా లస్సీ’, గోధుమపిండితో తయారు చేసే మిఠాయి ‘ఘెవార్’ వంటివి భోజనప్రియులకు మంచి అనుభూతినిస్తాయి. ఎలా చేరుకోవాలి? * ఇతర ప్రాంతాల వారు గుజరాత్ మీదుగా ఇక్కడకు చేరుకోవడం తేలిక. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి అబు రోడ్‌కు రైలు ద్వారా చేరుకోవచ్చు. * న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, ముంబై వంటి నగరాల నుంచి అబు రోడ్ వరకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉంటాయి. * అబు రోడ్ రైల్వేస్టేషన్ నుంచి మౌంట్ అబు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అబు రోడ్ నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. -
పాండవులు పాండవులు పచ్‌మఢీ
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పచ్‌మఢీ నలువైపులా విస్తరించిన ఎత్తయిన కొండలు... కొండల నడుమ లోతైన లోయలు... దట్టమైన అడవులు... అడవుల్లో యథేచ్ఛగా సంచరించే వన్యప్రాణాలు... కొండల పైనుంచి ఉధృత వేగంతో నేలపైకి ఉరకలు వేసే జలపాతాలు... సహజ సరోవరాలు... కొండ గుహలలో ప్రాచీన మానవులు చిత్రించిన చిత్రాలు... ఎటు చూసినా ప్రకృతి గీసిన సజీవ చిత్రాల్లాంటి దృశ్యాలను ఒకే చోట చూసి ఆనందించాలని ఉందా..? అయితే పదండి పచ్‌మఢీకి. ఏం చూడాలి? దేశానికి నడిబొడ్డున సత్పురా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం పచ్‌మఢీ. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉండేది. పచ్‌మఢీకి ఈ పేరు ‘పాంచ్’ (ఐదు), ‘మఢీ’ (గుహలు) అనే అర్థంలో వచ్చిందని చెబుతారు. ‘పాంచ్మఢీ’ కాలక్రమంలో పచ్‌మఢీగా మారిందని అంటారు. సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న పచ్‌మఢీ వాతావరణం వేసవిలోనూ చల్లగానే ఉంటుంది. వేసవిలో జూన్ నెలాఖరు వరకు ఈ ప్రాంతంలోని వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పంచ పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడి ఐదు గుహలలో ఉండేవారని ప్రతీతి. ఇక్కడి జలపాతాల దిగువన ఏర్పడిన కొలనును ‘ద్రౌపదీ కుండం/పాంచాలీ కుండం’ అంటారు. మహాభారత గాథతో ముడిపడిన ఈ ప్రదేశాలను పచ్‌మఢీకి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు. సత్పురా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం ‘ధూప్‌గఢ్’ ఇక్కడే ఉంది. ఈ శిఖరం పైనుంచి చూస్తే పచ్‌మఢీ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, లోయలు కనువిందు చేస్తాయి. పర్వతారోహణపై మక్కువ గలవారిని ఈ శిఖరం ఎంతో ఆకట్టుకుంటుంది. సత్పురా పర్వతశ్రేణుల్లో ఎక్కడికక్కడ కనిపించే జలపాతాలు పచ్‌మఢీలోనూ చాలానే కనిపిస్తాయి. పచ్‌మఢీ కొండల మీదుగా దూకే బీ, డచెస్, రజత్ ప్రపాత్, అప్సరా జలపాతాల అందాలను చూసి తీరాల్సిందే. వేసవిలో ఈ జలపాతాల వద్ద పర్యాటకులు జలకాలాడటానికి ఇష్టపడతారు. ధూప్‌గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు బోటింగ్‌కు అనువుగా ఉంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. పచ్‌మఢీ చుట్టూ విస్తరించుకున్న సత్పురా జాతీయ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, మొక్కలు, లతలు, వన్యప్రాణులు కనిపిస్తాయి. ‘ఇండియన్ జెయింట్ స్క్విర్రల్’గా పిలుచుకునే భారీ ఉడుతలు, పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, కణుజులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఈ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ అడవిలో పాములు కూడా విరివిగానే కనిపిస్తాయి. సత్పురా అభయారణ్యంలో సఫారీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పురాతన నేపథ్యం గల పచ్‌మఢీ పరిసరాల్లో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో జటాశంకర్ గుహలో వెలసిన శైవక్షేత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే, చౌరాగఢ్ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇవే కాకుండా, బాబా మహాదేవ్, గుప్త్ మహాదేవ్ వంటి పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా సందర్శకులకు చక్కని అనుభూతిని ఇస్తాయి. పచ్‌మఢీ సమీపంలోని భీమ్బెట్కా, బాఘ్, ఉదయగిరి గుహలలో గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. చరిత్ర పూర్వయుగానికి చెందినవిగా భావిస్తున్న ఈ చిత్రాలు కనీసం పదివేల ఏళ్ల నాటివని పరిశోధకులు తేల్చారు. ఏం కొనాలి? * పచ్‌మఢీ అడవులు స్వచ్ఛమైన తేనెకు పెట్టింది పేరు. ఇక్కడి గిరిజనులు సేకరించిన తేనె పచ్‌మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతుంది. * బస్తర్ ప్రాంత గిరిజనులు తయారు చేసిన హస్తకళాకృతులు, వెదురు బుట్టలు, గిరిజన చిత్రకారులు తీర్చిదిద్దిన సంప్రదాయ చిత్రాల పెయింటింగ్స్ ఇక్కడ విరివిగా దొరుకుతాయి. * సత్పురా అడవుల్లో లభించే పలు ఆయుర్వేద వనమూలికలు, అటవీ ఉత్పత్తులు కూడా పచ్‌మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి. ఏం చేయాలి? * నగరాల్లోని కృత్రిమ జలవిహారాల్లోని జలకాలాటల కంటే, వేసవిలో పచ్‌మఢీ పరిసరాల్లోని జలపాతాల్లో జలకాలాటలు గొప్ప అనుభూతినిస్తాయి. * పచ్‌మఢీ పరిసరాల్లో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంచక్కా వనవిహారం చేయవచ్చు. * ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడి కొండ శిఖరాలను అధిరోహించి, అక్కడి నుంచి కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. * ఇక్కడి సహజసిద్ధమైన కొలనులు, సరస్సుల్లో పడవ ప్రయాణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. * సత్పురా అభయారణ్యంలో సఫారీ అద్భుతంగా ఉంటుంది. స్వేచ్ఛగా సంచరించే పులులు, చిరుతలు వంటి భారీ జంతువులతో పాటు ఉడుతలు, కుందేళ్లు వంటి చిన్న చిన్న జంతువులను, రక రకాల పక్షులను ఇక్కడ దగ్గరగా తిలకించవచ్చు. ఎలా వెళ్లాలి? * విమానంలో రావాలనుకుంటే దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు విమానాలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. * పచ్‌మఢీకి 47 కిలోమీటర్ల దూరంలోని పిపారియా వరకు దేశంలోని అన్ని మార్గాల నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. పిపారియా నుంచి బస్సు లేదా ట్యాక్సీలో పచ్‌మఢీకి చేరుకోవచ్చు. * మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్‌మఢీకి విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి. -
మన దేశంలోనే... మరో కాశ్మీరం
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పితోరాగఢ్ ఉదయం వేళ హిమగిరుల ధవళకాంతుల ధగధగలు కనువిందు చేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో అంతా విస్తరించుకున్న ఆకుపచ్చదనం ఆనంద పరవశులను చేస్తుంది. ఘనచరిత్రకు సాక్షీభూతంగా నిలిచి ఉన్న కోట... వీర సైనికులకు నివాళిగా వెలసిన తోట... ఎన్నెన్నో గాథలు చెబుతాయి. పరిసర ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, మందిరాలు వాతావరణానికి పవిత్రతను అద్దుతూ ఉంటాయి. ఇలాంటి చాలా వింతలు, విశేషాలు గల ప్రదేశం పితోరాగఢ్. పర్వతశిఖరాల నడుమ వెలసిన ఈ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వేసవి యాత్రలో విహార, వినోదాలతో పాటు కొంత విజ్ఞానం, కొంత పరమార్థం కూడా కావాలనుకుంటే పితోరాగఢ్‌కు వెళ్లాల్సిందే! హిమాలయాల దిగువన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చందక్, ధ్వజ్, కుమ్దార్, తల్ కేదార్ కొండల నడుమ వెలసిన పట్టణం పితోరాగఢ్. ఉదయం వేళ ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాల్లోని పంచ్‌చులి, నందాదేవి, నంద కోట్ శిఖరాలు తెల్లగా తళతళలాడుతూ కనువిందు చేస్తాయి. ఈ మూడు శిఖరాల నడుమనున్న లోయను స్థానికంగా ‘సోర్’లోయ అంటారు. అంటే చల్లని లోయ అని అర్థం. ఈ లోయ పరిసరాలన్నీ కశ్మీర్ లోయను తలపిస్తాయి. అందుకే ఈ లోయలో కాళీనది ఒడ్డున వెలసిన పితోరాగఢ్‌ను ‘మినీ కశ్మీర్’గా అభివర్ణిస్తారు. ట్రెక్కింగ్ చేసే యాత్రికులు ఇక్కడి నుంచి కైలాస పర్వతానికి, మానస సరోవరానికి చేరుకోవచ్చు. అందుకే దీనిని ‘హిమాలయాలకు ప్రవేశమార్గం’గా కూడా అభివర్ణిస్తారు. ఏం చూడాలి? చారిత్రక పట్టణమైన పితోరాగఢ్ రాజపుత్ర వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏలుబడిలో రాజధానిగా ఉండేది. పద్నాలుగో శతాబ్దంలో ఇదే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాల్ వంశపు రాజులు మూడు తరాల పాటు పరిపాలించారు. వారి తర్వాత నేపాల్‌కు చెందిన బ్రహ్మ వంశపు రాజులు, చాంద్ వంశపు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. పాత కోట నాశనమైపోవడంతో చాంద్ వంశపు రాజులు 1790లో ఇక్కడ కొత్తగా కోటను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న ఆ కోటను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు. * చాంద్ వంశీకులు ఎక్కువకాలం పరిపాలించిన పితోరాగఢ్‌లో ఇప్పటికీ పలు చిన్నా చితకా కోటలు, పురాతన మందిరాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. అప్పటి కోటల్లో ఒకదాంట్లో ప్రస్తుతం ట్రెజరీ, తహశిల్ కార్యాలయాలు పనిచేస్తుండగా, మరో కోటను పడగొట్టి, ఆ స్థలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నిర్మించారు. * కశ్మీర్లో మరణించిన వీర సైనికుల జ్ఞాపకార్థం ఇండియన్ ఆర్మీ ఈ పట్టణంలో నిర్మించిన మహారాజా పార్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అరుదైన మొక్కలతో, పచ్చని పరిసరాలతో కనువిందు చేస్తుంది. * పితోరాగఢ్‌కు 54 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 5412 అడుగుల ఎత్తున కుమావోన్ హిమాలయాల్లో ఏర్పాటు చేసిన ‘అస్కోట్ అభయారణ్యం’ మరో ప్రత్యేక ఆకర్షణ. మంచు చిరుతలు, హిమాలయన్ నల్ల ఎలుగులు, కస్తూరి మృగాలు, మంచు కాకులు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులను ఇక్కడ చూసి ఆనందించవచ్చు. * పితోర్‌గఢ్‌కు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకోరీ హిల్‌స్టేషన్ ట్రెక్కర్లకు స్వర్గధామంలా ఉంటుంది. మంచుకొండలు, కొండల దిగువన తేయాకు తోటలతో కనువిందు చేసే చకోరీ నుంచి మూడు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. * వేసవి వినోదంతో పాటు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించుకోవాలనుకునే పర్యాటకులకు పితోరాగఢ్ చాలా అనువైన ప్రదేశం. ఇక్కడకు చేరువలోనే శైవ క్షేత్రాలైన పాతాళ భువనేశ్వర్, తల్ కేదార్, నకుల సహదేవులు నిర్మించారనే ప్రతీతి గల నకులేశ్వర ఆలయం, పురాతన ధ్వజ ఆలయం, కాళీ మందిరం వంటి పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. * పితోరాగఢ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని ఝులాఘాట్ పట్టణం షాపింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ పట్టణంలో కాళీ నదిపై నిర్మించిన వేలాడే కలప వంతెన నేపాల్‌ను కలుపుతుంది. ఈ వంతెన మీదుగా ఇక్కడి ప్రజలు నేపాల్‌కు, నేపాలీలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. ఏం కొనాలి? * పితోరాగఢ్‌లో స్థానికంగా తయారయ్యే సంప్రదాయ హస్తకళా వస్తువులు చౌకగా దొరుకుతాయి. * ఇక్కడి బజారులో దొరికే ఉన్ని శాలువలు, కంబళ్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు వంటివి కొనుక్కోవచ్చు. * ఉద్యాన ఉత్పత్తులకు పితోరాగఢ్ పెట్టింది పేరు. ఇక్కడ స్థానికంగా పండే నారింజలు, ద్రాక్షలు, యాపిల్స్ రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పండే భారీ దోసకాయలు నీటి శాతంలో పుచ్చకాయలను తలపిస్తాయి. ఏం చేయాలి? * సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే పితోరాగఢ్ పరిసర ప్రదేశాలన్నీ పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. వేసవిలో ట్రెక్కింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది. * చరిత్ర, వారసత్వ సంపద గురించి ఆసక్తి గల వారు ఇక్కడి పురాతన కోటలను, ఇతర కట్టడాలను సందర్శించుకోవచ్చు. * తీర్థయాత్రలపై ఆసక్తి గల వారు పితోరాగఢ్ పరిసరాల్లోని ప్రాచీన ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఎలా చేరుకోవాలి? ఇతర ప్రాంతాల వారు దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు విమాన మార్గంలో లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి మరో రైలులో హల్ద్వానీ లేదా తనక్‌పూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. హల్ద్వానీ నుంచి, తనక్‌పూర్ నుంచి పితోరాగఢ్ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. -
గిరుల్... తరుల్... ఝరుల్ చలో కూనూర్!
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - కూనూర్ నీలగిరుల సొగసులను నిండుగా చూడాలని ఉందా..? నింగిని నిటారుగా తాకే కొండలు... కొండలను చీల్చుకుంటూ నేలవైపు పరుగులు తీసే జలపాతాల పరవళ్లను చూస్తూ పరవశించాలని ఉందా..? ఆకుపచ్చని లోకంలో ఆనందంగా విహరించాలని ఉందా..? వేసవి వేడికి దూరంగా... మనసుకు ఉపశమనం కలిగించే చల్లచల్లని ప్రదేశంలో గడపాలని ఉందా..? అయితే, చలో కూనూర్... అక్కడ ఇవన్నీ ఉంటాయి. ఊటీకి కూతవేటు దూరంలోనే ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్, సమ్మర్ డెస్టినేషన్ కూనూర్. నీలగిరి కొండల నడుమ వెలిసిన చిన్న పట్టణం ఇది. ఎటుచూసినా తేయాకు తోటల పచ్చదనం... నిటారుగా నింగిని తాకే నీలగిరుల సొగసులు...పరవళ్లు తొక్కే జలపాతాల గలగలలు... సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న చల్లచల్లని ప్రశాంత ప్రదేశం కూనూర్. నిప్పులు చెరిగే ఎండలు ఇక్కడ ఉండనే ఉండవు. ఎంతటి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించవు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ ప్రాంతంలో పూర్వం టోడా తెగకు చెందిన గిరిజనులు నివాసం ఉండేవారు. బ్రిటిష్ పాలకులు నీలగిరి ప్రాంతంలో చల్లని వాతావరణాన్ని గమనించి, ఊటీ మాదిరిగానే కూనూర్‌ను కూడా హిల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. ఒక బ్రిటిష్ అధికారి 1819లో ఈ ప్రదేశాన్ని తొలిసారిగా గుర్తించాడు. ఆ మరుసటి ఏడాదే ఆయన ఇక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. ఆ తర్వాత సంపన్న బ్రిటిష్ అధికారులు, వ్యాపారులు ఇక్కడ తమ తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్రమంగా కూనూర్ పట్టణంగా ఎదిగింది. బ్రిటిష్‌వారి హయాంలోనే ఇక్కడకు రైలుమార్గం ఏర్పడింది. ఏం చూడాలి? కూనూర్‌లోని సిమ్స్ పార్క్ చూసి తీరాల్సిన ప్రదేశం. వెయ్యికి పైగా వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లతో కనువిందు చేసే ఈ ఉద్యానవనం నందనవనాన్ని తలపిస్తుంది. అప్పట్లో మద్రాస్ క్లబ్ కార్యదర్శిగా పనిచేసిన బ్రిటిష్ అధికారి జె.డి.సిమ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఏటా మే నెలలో జరిగే పండ్లు, కూరగాయల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కూనూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కూనూర్ పట్టణం, పరిసరాల్లోని పచ్చని తేయాకు తోటలు సహా నీలగిరుల అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. కూనూర్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డాల్ఫిన్ నోస్ వ్యూపాయింట్ నుంచి నీలగిరులను తిలకించాలని తహతహలాడతారు. కూనూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ల్యాంబ్స్ రాక్ కూడా మరో అద్భుతమైన వ్యూ పాయింట్. ఇది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్‌కు వెళ్లే దారిలో ఉంటుంది. దీని పైనుంచి చూస్తే కూనూర్ పరిసరాలే కాదు, కోయంబత్తూరు మైదాన ప్రాంతంలో విస్తరించిన పచ్చదనం కూడా కనువిందు చేస్తుంది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రదేశం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు ఇష్టపడతారు. కూనూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని లాస్ జలపాతం చూసి తీరాల్సిన ప్రదేశం. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే మార్గంలో ఉండే ఈ జలపాతం నీలగిరి కొండల మీదుగా దాదాపు 180 అడుగుల ఎత్తు నుంచి ఉరకలేస్తూ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే దారిలోనే కోటగిరి పట్టణానికి సమీపంలో కేథరీన్ జలపాతం కూడా చూసి తీరాల్సిందే. ఇది దాదాపు 250 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తుంది. ఈ జలపాతానికి కోటగిరి ప్రాంతంలో కాఫీ సాగును పరిచయం చేసిన బ్రిటిష్ అధికారి ఎండీ కాక్బర్న్ భార్య పేరు పెట్టారు. ఏం కొనాలి? * శ్రేష్టమైన తేయాకు చౌకగా దొరుకు తుంది. రకరకాల టీ పొడిని కొనుక్కోవచ్చు. * గోర్మెట్ చీజ్‌కు కూనూర్ బాగా ఫేమస్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా దీనిని కొనుక్కుంటారు. * స్వచ్ఛమైన తేనె, స్థానికంగా తయారయ్యే రకరకాల జామ్స్ ఇక్కడి దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి. * ఇక్కడి దుకాణాల్లో స్థానికంగా తయారయ్యే హస్తకళాకృతులు, ఎంబ్రాయిడరీ చేసిన దిండు కవర్లు, కుషన్ కవర్లు, బెడ్‌షీట్స్, టీ సెట్లు కొనుక్కోవచ్చు. ఏం చేయాలి? * బోటింగ్, ట్రెక్కింగ్, వాకింగ్, షాపింగ్ వంటి వాటికి కూనూర్ చాలా అనువుగా ఉంటుంది. సిమ్స్ పార్కులోని కొలనులో బోటింగ్‌ను పిల్లలు బాగా ఆస్వాదిస్తారు. * కూనూర్ నుంచి ఊటీ మధ్య నడిచే హెరిటేజ్ ట్రైన్లో ప్రయాణం కూడా గొప్ప అనుభూతి కలిగిస్తుంది. దాదాపు రెండు గంటలు సాగే ఈ ప్రయాణంలో తాపీగా ప్రకృతి అందాలను తిలకించవచ్చు. * డాల్ఫిన్ నోస్, ల్యాంబ్స్ రాక్ ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటాయి. ట్రెక్కర్లను ఆకర్షించే మరో ప్రదేశం కూనూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బకాసుర కొండ. దీనిపై శిథిలావస్థలో ఉన్న డ్రూగ్ కోట శతాబ్దాల చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కోట 18వ శతాబ్దిలో టిప్పు సుల్తాను బలగాలకు స్థావరంగా ఉండేది. * కూనూర్ శివార్లలో నలువైపులా విస్తరించి ఉన్న టీ తోటల్లో వాకింగ్ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌కు ఓపిక లేనివారు టీ తోటల్లో విహరిస్తూ నీలగిరుల అందాలను తిలకించవచ్చు. ఎలా వెళ్లాలి? * కోయంబత్తూరు వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనూర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. * కూనూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. * తమిళనాడు, కేరళలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి. -
నాన్నా... చూసొద్దామా!
సమ్మర్ స్పెషల్ హైదరాబాద్‌లో ఉన్న పిల్లలకు హైదరాబాద్‌లో ఉన్న విశేషాలు చూసే టైమ్ ఉండదు. హైదరాబాద్‌లో లేని పిల్లలకు అక్కడకు చేరే వీలు ఉండదు. సమ్మర్ సెలవలు అందుకే వస్తాయి. ఉన్న ఊళ్లోనివి తెలియని ఊళ్లల్లోనివి చూసి రమ్మంటాయి. పిల్లలూ... పెద్దల వెంటపడండి. బస్సెక్కండి... ఆటో ఎక్కండి... రైలు ఎక్కండి... కానీ ఇవి మాత్రం మిస్ కాకండి. సాలార్జంగ్ మ్యూజియం గంటకోసారి గంటకొట్టే అబ్బాయికి ఆకలెయ్యదా నాన్నా? ఈ ప్రశ్నకు మీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? రెబెకాకు ముసుగు ఎవరు కప్పారు? ఏమో! వీటికి సమాధానాలు మీ దగ్గర లేకపోయినా ఏం ఫరవాలేదు. ఓ సారి పిల్లల్ని సాలార్జంగ్ మ్యూజియానికి తీసుకెళ్లండి. అలాగే మీకు దగ్గరున్న ఇతర మ్యూజియాలనూ చూపించండి. కళాజగత్తును, శాస్త్రసాంకేతిక ప్రపంచాన్ని ఏకకాలంలో అర్థం చేసుకుంటారు. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్‌లోని దివాన్దేవుడీలో ఉండేది. ఇప్పుడు దారుషిఫా చౌరస్తాకు సమీపంలో మూసీనది పక్కన 1968లో నూతనంగా నిర్మించిన భవనంలోకి సాలార్జంగ్ మ్యూజియాన్ని మారింది. 1,2,3 సాలార్‌జంగ్‌లు భారతదేశంతో పాటు విదేశాల నుంచి సేకరించిన దాదాపు 48 వేల కళాఖండాలను మ్యూజియంలో పొందుపరిచారు. రెబేకా (పాలరాతి ముసుగు సుందరి), గంటలు కొట్టే గడియారంలతోపాటు చైనా, జపానీస్, యూరోపియన్ పెయింటింగ్‌లతో కూడిన గ్యాలరీలు, అరుదైన కళాఖండాలు మ్యూజియంలో సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఎప్పుడు వెళ్లవచ్చు?: శుక్రవారం సెలవు. మిగిలిన రోజుల్లో ఉదయుం 10 గంటల నుంచి సాయుంత్రం 5 గంటల మధ్య. టిక్కెట్లు: పెద్దలకు -రూ.20, పిల్లలకు-రూ.10 (12 ఏళ్లలోపు చిన్నారులకు ఉచితం), విదేశీయుులకు- రూ.500. సాలార్జంగ్ మ్యూజియం ఆవరణలో పార్కించ్ చార్జ్... ద్విచక్ర వాహనానికి రూ.5, కారుకు రూ. 30, బస్సుకు, రూ.50. బిర్లా ప్లానిటోరియం నక్షత్రాలు ఆకాశంలోనే ఉంటాయా? గ్రహాలను మనం చూడలేమా? డైనోసార్ మన ఇల్లంత ఉంటుందా? ఇన్నింటికి జవాబుల కోసం బుర్రగోక్కోవడం కంటే ఓసారి ప్లానిటోరియానికి తీసుకెళ్తే సరి. హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియంలో పిల్లలకి సైన్స్ నాలెడ్జ్‌కి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నాయి. డైనోసార్‌లో పుట్టుకను శాస్త్ర రీత్యా చూడవచ్చు. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన వెలకట్టలేని అంశాలు ఎన్నో ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. శాస్త్రీయ ఆలోచనలు ఒంటపట్టించేందుకు సైన్స్ సిద్ధాంతాలకు ప్రాచుర్యం కల్పించేందుకు బిర్లా సైన్స్ మ్యూజియం ఓ గొప్ప వేదిక. జీవ పరిణామ క్రమాన్ని తెలియజేసేలా శిలాజాలు, అంతరిక్ష రహస్యాలను అద్దం కంటే ప్లానిటోరియం ప్రదర్శన పిల్లలకు విజ్ఞానదాయకంగా, పెద్దలకు వినోదంగా ఉంటుంది. ఓసారి పిల్లల్ని తీసుకెళ్తే పై ప్రశ్నలకు సమాధానాలు వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడు ఆ చిట్టి బుర్రల్లో కొత్త ప్రశ్నలు మొదలవుతాయి. కొత్త క్వశ్చన్ బ్యాంకులన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. బిర్లా ప్లానిటోరియం, మ్యూజియం నౌబత్ పహడ్‌లో... ఖైరతాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు కేవలం ఒకటి, రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఎప్పుడు వెళ్లవచ్చు?: వారాంతపు సెలవు లేదు. ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల మధ్య వెళ్లవచ్చు. ప్రవేశ రుసుము: రూ.80. ఫోన్ నెంబర్లు: 040- 23241067, 23235081. నెహ్రూ జూలాజికల్ పార్కు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కు పాతబస్తీ బహదూర్‌పురాలో 380 ఎకరాల సువిశాల వైశాల్యంతో విస్తరించి ఉంది. ఇది అరుదైన వన్యప్రాణులకు అభయారణ్యం. అడవిని పోలిన సపారీ పార్కులతో ఇది వైవిధ్యమైన ప్రాణిప్రపంచం. రంగురంగుల చిలకల ప్రపంచం, వివిధ రకాల కీటకాలశాల, రకరకాల సీతాకోక చిలకలతో సంద ర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తూ ఆలోచింపజేస్తుంది ఈ జూ. దేశంలో పూర్తిగా కనుమరుగవుతున్న ఆసియా సింహాల పరిరక్షణను విజయవంతంగా నిర్వహిస్తోంది ఈ జూ. వాటి పునరుత్పత్తికి దేశంలోనే రికార్డులెక్కిన జూలలో జన్యు ప్రయోగాల ద్వారా తెల్ల పులుల సంతానోత్పత్తి నిలయం అయింది. జీబ్రా, కంగారు వంటి అరుదైన విదేశీ జంతువులు కనుమరుగయ్యాయి. హార్న్‌బిల్, ఫెలికాన్, ప్లెమింగ్ ఘోష్, సారాస్ క్వెన్, లవ్‌బర్డ్స్, తెల్ల చిలకల వంటి అరుదైన పక్షులతో పాటు దేవాంగపిల్లి, జంగిలికాట్, ముళ్ల పంది, కస్తూరి పిల్లులు, ఆసియా సింహాలు, తెల్లపులులు, చిరుత, ఆఫ్రికా సింహం, జాగ్వార్ రకం చిరుత పులి, సరిసృపాల జగత్తులో రస్సల్ ఫైపర్, రాక్ఫైథాస్, లెటిక్యూలేటెడ్ ఫైథాస్ రకాల కొండచిలువలు, ఆఫ్రికన్ చింపాంజి, జంట ఖడ్గమగాలు, నీటి గుర్రాలు ఈ జూకు ప్రత్యేకఆకర్షణ. ఉదయం వెళ్తే సాయంత్రం వరకు ఎలా గడిచిపోయిందో తెలియదు. ఎలా వెళ్లాలంటే... నగరంలో అన్ని ప్రదేశాల నుంచి సిటీబస్సులు ఉన్నాయి. ఎప్పుడు వెళ్లాలి?: ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. సోమవారం జూకు సెలవు. ప్రవేశ రుసుం: పెద్దలకు రూ.30, చిన్నారులకు రూ.15. బ్యాటరీ వాహనం డ్రైవ్: పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25. చిట్టి రైలు ప్రయాణం: పెద్దలకు రూ.15, చిన్నారులకు రూ.5లు. బొటానికల్ గార్డెన్..! ప్రకృతి మనకు ఎన్ని చెట్లనిచ్చిందో పిల్లలకు చెప్పడం ఎలా? కష్టం మీద పది పేర్లు చెబితే పదకొండవ చెట్టు పేరు గుర్తు రాదు. గూగుల్ సెర్చ్‌లో చెట్ల పేర్లను వెతకడం మాని బొటానికల్ గార్డెన్ బాట పట్టండి. చెట్లను చూడడంతోపాటు ఆరోగ్యకరమైన గాలని పీల్చుకోవచ్చు. హైదరాబాద్‌లోని బొటానికల్ గార్డెన్ ఇప్పుడు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉంది. ఇది 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గార్డెన్ అటవీప్రాంతాన్ని తలపిస్తుంది. చూడచక్కనైన చల్లటి వాతావరణం గార్డెన్ సొంతం. దీనిని ‘కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్, కొత్తగూడ’ అంటారు. ఇందులో రోజ్ గార్డెన్, ఎంటర్టైన్ పార్క్ ఉండేవి. వేసవి కారణంగా వాటిని నిర్వహించడం లేదు. పెద్ద పెద్దపార్టీలు, గెట్‌టూ గెదర్స్, ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తారు. దట్టమైన ఆటవీ ప్రాంతంలో ఉండే వృక్షాలను ఇందులో చూడవచ్చు. సైన్స్‌కు సంబంధించి ఎన్నో శాస్త్రీయ నామాలు గల ఔషధమొక్కలు ఇందులో ఉన్నాయి. ఇది సైన్స్ విద్యార్థులకు రిసెర్చ్ కేంద్రం, పర్యాటకులకు వినోదం. పిల్లలకు రోజంతా ఉత్సాహంగా గడపడానికి చక్కటి ప్రదేశం. ‘ఆడుకుంటూ నేర్చుకోవడం’ అంటే ఏమిటో ఇక్కడకు వెళ్తే తెలుస్తుంది. ఎప్పుడు వెళ్లవచ్చు: ఉదయం 9 గం॥నుంచి సాయంత్రం 5 గం॥( ఏప్రిల్, మే నెలల్లో సాయంత్రం 6.30 వరకు). వారాంతపు సెలవులు: లేవు. ప్రతిరోజూ వెళ్లవచ్చు. ప్రవేశ రుసుం: పిల్లలకు రూ.5 , పెద్దలకు రూ. 15. మరిన్ని వివరాలకు: రాజేంద్ర కుమార్, అసిస్టెంట్ ప్లాంటేషన్ మేనేజర్‌ను (9533068033) సంప్రదించవచ్చు. -
శ్రీన'హీ'గరం!
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ కశ్మీర్ అంటే కల్లోలాలు కాదు. ప్రకృతి అందాలకు నెలవు. కశ్మీర్ అంటే అశాంతి కాదు. ఆనందాల కొలువు. కశ్మీర్ అంటే తుపాకీ మోతలు, ఆర్తుల హాహాకారాలు కాదు. సరదాల సందళ్లు. సంతోషపు కేరింతలు. సరిహద్దు తగాదాలతో అలజడితో ఉంటుందని కశ్మీర్‌కి పేరుంది. కానీ ఆ పేరును శ్రీనగర్ మార్చేసింది. వివాదాల వేడి సంగతి ఎంతా ఉన్నా... వేసవి వేడి మాత్రం శ్రీనగర్‌లో అడ్రస్ లేకుండా పోతుంది. మే నెలలో సైతం చల్లగాలులతో ఆహ్లాదాన్ని పంచుతుంది. నా పేరు శ్రీనగరం, నా దగ్గరుంటే నహీ గరం అంటుంది. మనోల్లాసాన్ని హద్దులు దాటిస్తాను రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది. అందమైన అనుభూతులను పంచిస్తానంటూ పిలుస్తుంది. మన దేశంలోని బెస్ట్ సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటైన శ్రీనగర్ పరిచయం... ఈవారం మీకోసం! ఏం చూడాలి? శ్రీనగర్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్... దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిష్షింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికా భివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘షికారాలు’. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయా ణించడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి. భారతదేశంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ శ్రీనగర్‌లోనే ఉంది. కూరగాయలు, పండ్లు, పూలు అన్నిటినీ పడవల్లోకెక్కించి, దాల్ సరస్సు నీటిపై తేలియాడుతూ అమ్ముతుం టారు. ఈ పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో సాగు చేసినవే. రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తూ అన్నీ కొనుక్కోవడం భలే ఉంటుంది కదూ! శ్రీనగర్‌లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు. 17వ శతాబ్దంలో కట్టిన షాలిమార్ బాగ్... శ్రీనగర్‌లో ఉన్న మూడు మొఘల్ గార్డెన్స్లోనూ పెద్దది. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ప్రతి రోజూ సాయంత్రం ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. శుక్రవారం సెలవు. నిషాత్ గార్డెన్ కూడా ఫేమస్. ఈ రెండూ పర్షియన్ పద్ధతిలో నిర్మితమయ్యాయి. శరదృతువు (ఆకులు రాలే కాలం)లో ఈ మొఘల్ గార్డెన్స్ రాలిపడిన ఎరుపు-బంగారం రంగు ఆకులతో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఇక మొక్కలపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్‌ను చూడాల్సిందే. ఇక్కడ లేని మొక్క ఉండదు. 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఈ గార్డెన్లో... 17 హెక్టార్ల మేర ఓ అందమైన సరస్సు ఉంటుంది. అలాగే నసీం బాగ్. ఇది ప్రశాంతతకు మారు పేరు. 1586లో అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించా రట. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి, అలసిన మనసును శాంతపర్చుకోడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉన్న వారికి శ్రీనగర్ ఎంతో నచ్చుతుంది. అక్కడ ఉన్న గుళ్లు, మసీదులు చూస్తే మనసులో భక్తి అలలై ఎగసిపడుతుంది. కశ్మీర్ మధ్య భాగంలో విస్తరించి ఉన్న జబర్వాన్ పర్వతాన్ని శంకరా చార్య హిల్ అంటారు. పూర్వం దీనికి ఎన్నో పేర్లుండేవి. అయితే వెయ్యేళ్ల కిందట ఆది శంకరాచార్యుడు ఇక్కడికి వచ్చి, కొన్ని రోజులు ఉన్నాడట. అందుకే ఆ కొండకు ఆయన పేరును పెట్టారు. ఈ కొండపై 11వ శతాబ్దంలో నిర్మించిన శివుడి గుడి ఉంది. ఆ గుడి ఆవరణ లోకి సెల్ఫోన్లను, కెమెరాలను అనుమతించరు. అలాగే క్రీ.శ 1400లో నిర్మించిన జామియా మసీదు. ఇందులో 370 చెక్క స్తంభాలున్నాయి. ఒకేసారి 33,333 మంది నమాజ్ చేసుకునేం దుకు వీలుంది ఈ మసీదులో. ఇక ఖీర్ భవానీ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది శ్రీనగర్ దగ్గర్లోని తుల్లా ముల్లా గ్రామంలో ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న దేవతని దుర్గా దేవి అవతారంగా చెబుతుంటారు. నైవేద్యంగా ఖీర్ (పాయసం) పెడుతుంటారు. అందుకే ఆ ఆలయానికి ఖీర్ భవానీ టెంపుల్‌గా పేరొచ్చింది. ఈ ఆలయంలో శుక్ల పక్ష అష్టమి నాడు వేలమంది భక్తులు చేరి యాగాలు, హోమాలు చేస్తుంటారు. శ్రీనగర్ శివార్లలో ఉంది సోనామార్గ్. అంటే అర్థం ‘మెడోస్ ఆఫ్ గోల్డ్’ అని. దీని చుట్టూ ఉండే కొండలపై ట్రెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. పచ్చదనానికి, ఆల్పైన్ పూలకు ఇది ప్రసిద్ధి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2,740 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గ్ చుట్టుపక్కల చాలా సరస్సులు ఉంటాయి. సరదా ఉన్నవారు ఫిషింగ్ చేయవచ్చు. శ్రీనగర్‌లోని సింథన్ టాప్ గురించి చాలామందికి తెలియదు. ఇది శ్రీనగర్ శివార్లలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించ డానికి రెండు కళ్లూ చాలవు. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉండటంతో, ఆ ప్రదేశం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచుతో పర్వతం మొత్తం కప్ప బడి ఉండటం వల్ల మరింత అందంగా ఉంటుంది. ఇక్కడి అందాలను ఆస్వాదించా లంటే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలమే సరైన సమయం. చలికాలం వస్తే మంచు విపరీతంగా కురుస్తుంది కాబట్టి పర్యాటకులను అనుమతించరు. యాపిల్ కొనుక్కు తినడమే తెలిసిన మనకు యాపిల్ పండ్ల తోటల్లో తిరుగాడుతూ, వాటిని స్వయంగా కోసుకుని తినే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆ అవకాశాన్ని ఎవరైనా జారవిడుచుకుంటారా? అందుకే శ్రీనగర్‌లోని యాపిల్ తోటలు ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. పండ్లను కోయడం మీద ఎటువంటి ఆంక్షలూ లేకపోవ డంతో అక్కడి పనివాళ్లతో పాటు సందర్శకులు కూడా కాయలను తెంపి మురిసిపోతుంటారు. సినిమా పాటల్లో టులిప్ తోటల్ని చూసినప్పుడు... ఇలాంటి ప్రదేశానికి మనమూ వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అయితే దానికోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీనగర్ వెళ్తే చాలు. ‘ఇందిరాగాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్స్’ ఆసియాలోనే అతి పెద్ద టులిప్ గార్డెన్. ఇక్కడ మనం ఒకేసారి 20 లక్షల పూలను చూడొచ్చు. యేటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ‘టులిప్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఏం తినాలి? శ్రీనగర్‌లో వాజ్వాన్ తిని తీరాలి. వాజ్వాన్ అంటే వంటకం పేరు కాదు. 36 రకాల వంటకాలతో కూడిన మీల్స్. ఇది తింటే కశ్మీర్ ఫుడ్ మొత్తాన్నీ రుచి చూసినట్టే లెక్క. అలాగే ‘తుజ్జీ’ చాలా ఫేమస్. అంటే మటన్ బాల్స్‌ని ఐరన్ రాడ్ మీద పెట్టి కాల్చి చేసే వంటకం. దీన్ని స్థానికంగా దొరికే బ్రెడ్, చట్నీతో సర్వ్ చేస్తారు. ఖావా అనే స్పెషల్ గ్రీన్ టీ రుచి నాలుకను వదలదు. నూన్ చాయ్ అని పిలిచే సాల్టీ టీ అయితే ఇక్కడ తప్ప ఎక్కడా దొరకదు. పాలు, గ్రీన్ టీ, ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపి చేసే ఈ టీ గులాబి రంగులో ఉంటుంది. ఒక్కసారి దీన్ని రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేం అంటారు దాన్ని టేస్ట్ చూసినవాళ్లు! ఏం కొనాలి? శ్రీనగర్‌లో షాపింగ్ చేయాలంటే షాపులకి వెళ్లడం కంటే... స్ట్రీట్ మార్కెట్స్‌కి వెళ్లడం మంచిది. ఎందుకంటే ఆ మార్కెట్లలో షాపుల్లో కంటే విభిన్నమైన, వైవిధ్యమైన వస్తువులు దొరుకుతాయి. పైగా వెల కూడా అందుబాటులో ఉంటుంది. అన్నిటికంటే ముందు కొనాల్సింది... శాలువాలు, కార్పెట్లు. అక్కడ దొరికేంత అందమైన శాలువాలు, అద్భుతంగా రూపొందించిన కార్పెట్లు మన దేశంలో మరెక్కడా దొరకవు. లాల్ చౌక్, బాద్షా చౌక్ ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో కని, పష్మినా శాలువాలు తప్పక కొనాల్సిందే. అలాగే పోలో వ్యూ మార్కెట్లో యాంటిక్ సిల్వర్ జ్యూయెలరీ, వూడెన్ జ్యూయెలరీ బాగా దొరుకుతుంది. ఫ్లవర్‌వాజ్‌లు, ఆర్టిఫీషియల్ పువ్వులు కూడా బాగుంటాయి. కశ్మీర్ గవర్నమెంట్ ఆర్ట్స్ ఎంపోరియంలో బ్యాగులు, టేబుల్ ల్యాంప్స్ లాంటివి అతి తక్కువ ధరకు దొరకుతాయి. ఇక రెసిడెన్సీ రోడ్లో అడుగుపెడితే డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల వాసన గుప్పుమంటుంది. ఆపైన అవి కొనకుండా రావడం మనవల్ల కాదు. ఎలా వెళ్లాలి? హైదరాబాద్ నుంచి శ్రీ నగర్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌కి నేరుగా ఫ్లయిట్స్ ఉన్నాయి. గంటన్నర నుంచి రెండు గంటల్లో వెళ్లిపో వచ్చు. బస్సులో వెళ్తే ఇరవై గంటల పైనే పడుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్లు ఉన్నాయి. వాటిలో వెళ్లినా బానే ఉంటుంది. అక్కడికెళ్లాక ఉండటానికి బోలెడు హోటళ్లున్నాయి. మన బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు. ఏం చేయాలి? ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వింతలు, విశేషాలను చూసి రావడం అందరూ చేస్తారు. కానీ ఏదైనా కొత్తగా చేయడంలోనే ఉంటుంది మజా. శ్రీనగర్ వెళ్తే అలాంటి కొత్త అడ్వెంచర్స్ చాలా చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనది పారా గ్లైడింగ్. తేలికైన గ్లైడర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వీపునకు కట్టుకుని, గాల్లో ఎగురుతూ కశ్మీర్ అందాలను చూస్తుంటే మనసు కూడా విహంగమై ఎగిరిపోతుంది. ఎయిర్ బెలూన్స్లో కూర్చుని ఎగురుతూ సిటీని చూసే అవకాశం కూడా ఉంది. పర్వత సానువులపై ట్రెక్కింగ్ చేస్తూ, వాటి ఎత్తుల్ని కొలిచే అనుభూతిని మిస్సవ్వడానికి లేదు. అలాగే రివర్ ర్యాఫ్టింగ్ కూడా. నదీ అలలపై తేలియాడుతూ, చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తుంటే మనసు మరో లోకంలోకి వెళ్లిపోవడం ఖాయం. -
సమ్మర్లో సందడే సందడి!
వేసవి కాలం... సినీ ప్రియులకు పండగ కాలం. ఏసీథియేటర్లో తమ ఫేవరెట్ స్టార్ లేటెస్ట్ మూవీ చూస్తూ రీఛార్జ్ కావాలని చాలామంది కోరుకుంటారు. ఎప్పుడూ ప్రీ ప్లాన్డ్గా ఉండే బాలీవుడ్ సమ్మర్‌ని క్యాష్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 20న నుంచి మొదలుపెట్టి జూన్ 5 వరకు దాదాపు డజను హిందీ సినిమాల వరకూ విడుదల కానున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం... ప్లేబోయ్ ఇబ్బందులు! ప్రేమలో పడ్డ ఓ ప్లేబోయ్ కథ ‘హంటర్’. ప్రేయసి వచ్చాక ఈ ప్లేబోయ్ని గత జీవితం తాలూకు ఆనవాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాయి? అనే కథాంశంతో నూతన దర్శకుడు హర్షవర్ధన్ కులకర్ణి ఈ సినిమా తీశాడు. గుల్షన్ దేవయ్య హీరో. రాధికా ఆప్టే, సాయి తమంకర్ కథానాయికలు. ప్రేయసి కోసం అప్పులు ఐపీయస్ ఆఫీసర్ కావాలనే ఆశయం ఉన్న ఓ యువకుడు ప్రేమలో పడతాడు. ప్రేయసి మెప్పు పొందడానికి బ్యాంక్‌లో లోన్ తీసుకుని కారు కొంటాడు. ఆ అప్పు తీర్చలేక, డబ్బు మనిషి అయిన ఆ ప్రేయసికి అసలు విషయం చెప్పలేక అతను పడే బాధలు ఎలాంటివి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఢిల్లీవాలీ జాలీమ్ గాళ్‌ఫ్రెండ్’. జపీందర్ కౌర్ దర్శకుడు. దివ్యేందు శర్మ, ప్రచీ మిశ్రా జంటగా నటించారు. దుష్టశక్తిని అడ్డుకునే డిటెక్టివ్ 1940లలో కోల్‌కతా నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందిన చిత్రం ‘డిటెక్టివ్ బ్యోమకేష్ భక్షి’. ఫక్తు క్రైమ్ థ్రిల్లర్. ప్రపంచాన్ని అంతం చేయడానికి ఓ దుష్టశక్తి పన్నిన కుట్రను ఓ యువ ప్రైవేట్ డిటెక్టివ్ ఎలా అడ్డుకున్నాడు? అనేది చిత్రకథ. డిటెక్టివ్ పాత్రను సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్ చేయగా, డిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. లీలా.. భలే హాట్ గురూ హాట్ గాళ్ సన్నీ లియోన్ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘ఏక్ పహేలీ లీలా’. ఈ చిత్రం ప్రచార చిత్రాలు, పాటలు ఇప్పటికే భారీ ఎత్తున అంచనాలు పెంచాయి. సన్నీ హద్దు మీరి అంగాంగ ప్రదర్శన చేసిన వైనం ఫొటోల్లో చూసి, ఈ చిత్రాన్ని మిస్ కాకూడదని చాలామంది ఫిక్సయ్యారు. పూర్వ జన్మల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో 300 ఏళ్ల క్రితం అమ్మాయిగా, నేటి తరం యువతిగా.. ఇలా సన్నీ పలు అవతారాల్లో కనిపించనున్నారు. బాబీఖాన్ దర్శకుడు. ముంబై నుంచి గోవా ప్రయాణం విడుదల: ఏప్రిల్ 10 ఇద్దరు పిల్లలు... చిన్నప్పటి నుంచి అమ్మా, నాన్న, స్కూలు.. ఇదే లోకం. అనుకోకుండా ‘వాళ్లకో నానమ్మ ఉందనీ, కేన్సర్‌తో బాధపడుతోందనీ తెలిసింది. ఆ జబ్బుకు అర్థం తెలియని ఆ పసి మససులు... డి క్షనరీలో చూసి అర్థం తెలుసుకున్నారు. తెగ బాధపడిపోయారు. నానమ్మను తీసుకొద్దామని అమ్మా, నాన్నలను అడిగారు.. వాళ్లు ఒప్పుకోలేదు... కుదరదన్నారు.. అంతే... ఎలాగైనా నానమ్మని చూడాలని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ముంబై నుంచి గోవా బయలుదేరారు. తమకు ఏమాత్రం తెలీని ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆ ప్రయాణంలో ఏమైంది..? వాళ్లిద్దరూ నానమ్మను చేరుకున్నారా....? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ‘బేర్ ఫుట్ టూ గోవా’ను చూడాల్సిందే. అత్యంత సున్నితమైన భావోద్వేగాలను స్పృశించిన ఈ సినిమాకి దర్శకుడు ప్రవీణ్ మోర్చాలే. సినిమా విడుదల కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా 18 మంది నుంచి 50 లక్షలు సేకరించారు. మిస్టర్ ఎక్స్ థ్రిల్‌కి గురి చేస్తాడా? హారర్ చిత్రాలు, సైన్స్ ఫిక్షన్ చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుడు విక్రమ్‌భట్. ఆయన రూపొందించిన తాజా త్రీడీ చిత్రం ‘మిస్టర్ ఎక్స్’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే సూపర్ హీరో మూవీ ఇది. మిస్టర్ ఎక్స్‌గా ఇమ్రాన్ హష్మీ, ఆయన సరసన అమైరా దస్తూర్ నటించారు. అదృశ్య శక్తులు పొందే వ్యక్తి తనను తప్పుదోవ పట్టించినవారిపై ఎలా పగ తీర్చుకున్నాడు? అనేది కథాంశం. ఇందులో నిర్మాత మహేశ్ భట్ టైటిల్ సాంగ్ కూడా పాడటం విశేషం. గబ్బర్ మళ్లీ వస్తున్నాడు అక్షయ్‌కుమార్, శ్రుతీహాసన్ జంటగా తెలుగు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’. తమిళ చిత్రం ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’)కి రీమేక్ ఇది. అవినీతిని అంతం చేయాలనే లక్ష్యంతో సాగే గబ్బర్ అనే వ్యక్తి కథ ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఈ రీమేక్‌పై భారీ అంచనాలున్నాయి. డబుల్ మస్తీ సన్నీ లియోన్ అభిమానులకు ఈ వేసవి డబుల్ ధమాకా ఇచ్చినట్లే. ‘ఏక్ పహేలీ లీలా’లో కనిపించిన కొన్ని రోజులకే మళ్లీ ‘మస్తీజాదే’తో తెరను కనువిందు చేయనున్నారు సన్నీ. శృంగార ప్రధానంగా సాగే వినోదాత్మక చిత్రం ఇది. ఇందులో సన్నీ రెండు పాత్రల్లో కనిపించనున్నారు. మిలాప్ జవేరీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తండ్రీ, కూతుళ్ల అనుబంధం మంచి కథాంశాలను ఎన్నుకుని, తెరకెక్కించే దర్శకుడిగా సూజిత్ సర్కార్‌కి పేరుంది. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పీకు’. తండ్రీ, కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. తండ్రిగా అమితాబ్ బచ్చన్, కూతురిగా దీపికా పదుకొనె నటించారు. మరోసారి సన్నీ.. మే 1న కనిపించి, వారం తిరిగేసరికల్లా మళ్లీ సన్నీ లియోన్ కనిపించబోతున్న చిత్రం ‘కుచ్ కుచ్ లోచా హై’. ఇందులో సన్నీ సినిమా తార పాత్రలో కనిపించనున్నారు. గుజరాత్‌కి చెందిన బడా వ్యాపారవేత్త పాత్రను రామ్‌కపూర్ చేశారు. ప్రధానంగా ఈ ఇద్దరి చుట్టూ కథ తిరుగుతుంది. దేవంగ్ ధోలాకియా దర్శకత్వం వహించారు. ముంబయ్ చరిత్రతో... 1960ల్లో సాగే కథతో రూపొందిన చిత్రం ‘బాంబే వెల్వట్’. బాక్సర్‌గా చేసే యువకుడు, జాజ్ సింగర్‌గా సాగే అమ్మాయి తమ కలలను సాకారం చేసుకోవడానికి ఏం చేశారు? అనేది ఈ చిత్రకథ. ముంబయ్ చరిత్రను కూడా చూపించే చిత్రం కావడంతో బాంబే వెల్వట్ అని టైటిల్ పెట్టారు. రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ జంటగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మరోసారి స్వాగతం ‘వెల్కమ్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ఇది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో జాన్ అబ్రహాం, శ్రుతీహాసన్, నానా పటేకర్, అనిల్ కపూర్ తదితరులు నటించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన అనీస్ బజ్మీ దర్శకత్వంలోనే మలి భాగం కూడా రూపొందింది. తను, మనూ మళ్లీ వస్తున్నారు మాధవన్, కంగనా రనౌత్ జంటగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందిన ‘తను వెడ్స్ మను’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇదే కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ కామెడీ మూవీ ‘తను వెడ్స్ మను రిటర్న్స్’. ఇందులో తమిళ నటుడు ధనుష్ అతిథి పాత్ర చేయడం విశేషం. నౌకలో ఏం జరిగింది? నౌకలో ప్రయాణం చేస్తున్న ఓ పంజాబీ కుటుంబం, ఇతర ప్రయాణీకుల చుట్టూ సాగే కథతో రూపొందిన చిత్రం ‘దిల్ దడక్నే దో’. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క శర్మ, ప్రియాంకా చోప్రా, రణ్వీర్ సింగ్, షెఫాలీ షా, అనిల్ కపూర్ తదితరులు నటించారు. - డి.జి. భవాని -
సస్పెన్స్ థ్రిల్లర్
ఒక్క రోజులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం కడవుల్ పాది మిరుగం పాది అని దర్శకుడు రాజ్ తెలిపారు. ఇంతకు ముందు అన్వర్, పైసా పైసా తదితర మలయాళ చిత్రాలను నిర్మించి ఈయన తొలిసారిగా తన సినిప్స్ అండ్ రెడ్ కార్పెట్, బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తమిళ చిత్రం కడవుల్ పాది మిరుగం పాది. ఈ చిత్రం వివరాలను ఆయన వెల్లడిస్తూ, ఇది ఒక రోడ్డులో జరిగే సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. చెన్నై-హైదరాబాద్ ఓల్డ్ హైవేలో ఒక రోజు రాత్రి ప్రారంభమై, మరుసటి రోజు రాత్రి ముగిసే సంఘటనల సమాహారమే చిత్ర కథ అని తెలిపారు. ఒక ప్రేమ జంట, పోలీసులు, ఒక విచిత్ర వ్యక్తి మధ్య నడిచే కథే కడవుల్ పాది మిరుగంపాది చిత్రం అని వివరించారు. చిత్రంలో ఆ విచిత్ర వ్యక్తి పాత్రను తానే పోషిస్తున్నానని, ప్రేమ జంటగా అభిషేక్, మిస్ ఇండియా శ్వేతా విజయ్ నటిస్తున్నారని తెలిపారు. రాహుల్ రాజ్ సంగీ తాన్ని కిషోర్ మణి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 90 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు. చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత రాజ్ వెల్లడించారు.