అబ్బో... అబ్బబ్బో అబూ... | Tour Darshan Summer Special Mount Abu | Sakshi
Sakshi News home page

అబ్బో... అబ్బబ్బో అబూ...

Published Sat, Jun 4 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:40 AM

మౌంట్ అబులోనే అతి ఎత్తయిన శిఖరం గురుశిఖర్

మౌంట్ అబులోనే అతి ఎత్తయిన శిఖరం గురుశిఖర్

టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - మౌంట్ అబు
ఎడారి రాష్ట్రంలో ఎత్తయిన కొండలతో నిండిన ప్రదేశం... పక్షుల కిలకిలలతో కనువిందు చేసే పచ్చని అడవులు... ఉరకలేసే జలపాతాలు... ప్రశాంతమైన సరోవరాలు... గత వైభవాన్ని చాటి చెప్పే కోట గోడలు.. కొండలపై వెలసిన పురాతన ఆలయాలు... వీటన్నింటినీ తనివితీరా చూసి ఆనందించాలంటే రాజస్థాన్‌లోని మౌంట్ అబు వెళ్లాల్సిందే!
 
రాజస్థాన్‌లోని ఏకైక వేసవి విడిది మౌంట్ అబు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో గుజరాత్ సరిహద్దులకు చేరువలో ఆరావళి పర్వతశ్రేణుల్లో  సముద్రమట్టానికి దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ పట్టణం. దీనికి చుట్టుపక్కల విస్తరించి ఉన్న దట్టమైన అడవిని పురాణాలు అర్బుదారణ్యంగా పేర్కొన్నాయి. నాటి కాలంలో ‘మౌంట్ అబు’ను అర్బుదాచలం అనేవారు. విశ్వామిత్రుడితో విభేదించిన వశిష్టుడు అర్బుదాచలంపై యజ్ఞం చేసినట్లు ప్రతీతి.

ఇదేచోట అర్బుదమనే సర్పం శివుడి వాహనమైన నందిని రక్షించడం వల్ల ఈ పర్వతానికి అర్బుదాచలమనే పేరు వచ్చిందని, దీని చుట్టూ విస్తరించిన అరణ్యానికి అర్బుదారణ్యమనే పేరు వచ్చిందని కూడా మరో గాథ ఉంది. ఇక చారిత్రిక నేపథ్యాన్ని గురించి చెప్పుకుంటే, మొఘల్ పాలనకు ముందు ఈ ప్రాంతాన్ని ఎక్కువ కాలం గుర్జరులు, రాజపుత్రులు పాలించారు.
 
ఏం చూడాలి?
మౌంట్ అబులో అడుగడుగునా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాల్లో వేసవి తాకిడి భరించలేనంతగా ఉన్నా, మౌంట్ అబులో వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. మౌంట్ అబు పట్టణంలోను, పరిసరాల్లోనూ పలు చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు చూసి తీరాల్సినవే.
 
* మేవార్ రాజు రాణా కుంభ 14వ శతాబ్దంలో నిర్మించిన అచలగఢ్ కోట శిథిలావస్థకు చేరుకున్నా, నాటి చారిత్రక వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ కట్టడం నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
* అచలగఢ్ కోట సమీపంలోని నక్కీ సరస్సులో ఈదులాడే బాతులను చూస్తూ బోటింగ్ చేయడం ఒక వింత అనుభూతి. ఈ సరస్సుకు సమీపంలోనే కప్ప ఆకారంలో ఉండే సహజమైన భారీ కొండరాతి వద్ద ఫొటోలు దిగుతుంటారు.
* మౌంట్ అబు పరిసరాల్లో ధ్రుధియా జలపాతం, గోముఖ జలపాతం వంటి పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. జలపాతాల వద్దకు పర్యాటకులు పిక్నిక్‌లకు వస్తుంటారు.
* అచలగఢ్ కోటకు అతి చేరువలోనే ఉన్న శైవక్షేత్రమైన అచలేశ్వర ఆలయానికి దూరప్రాంతాల భక్తులు కూడా వస్తూ ఉంటారు. స్థానికులు ‘అధర్‌దేవి’గా పిలుచుకునే అర్బుదాదేవి ఆలయం, గురుశిఖర్ పర్వత శిఖరంపై వెలసిన దత్తాత్రేయ ఆలయం, రఘునాథ ఆలయం, కాంతినాథ్ ఆలయం వంటి పురాతన హిందూ ఆలయాలతో పాటు 11-13 శతాబ్దాల మధ్య నిర్మించిన విమల్ వశాహీ ఆలయం, దిల్వారా ఆలయం వంటి పలు జైన ఆలయాల్లోని శిల్పసౌందర్యం చూసి తీరాల్సిందే.
* మౌంట్ అబు చుట్టూ 290 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ప్రభుత్వం 1960లో మౌంట్ అబు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో చాలా రకాల అరుదైన పక్షులు, జింకలు, దుప్పులు, పులులు, చిరుతలు, సింహాలు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఇందులో సఫారీ గొప్ప అనుభూతినిస్తుంది.
 
ఏం చేయాలి?
* ఔత్సాహిక పర్వతారోహకులకు మౌంట్ అబులోని పర్వతశిఖరాలు సవాలుగా నిలుస్తాయి. ఆరావళి పర్వతశ్రేణుల్లోని అతి ఎత్తయిన శిఖరం ‘గురుశిఖర్’ పైనుంచి తిలకిస్తే మౌంట్ అబు అందాలు అబ్బురపరుస్తాయి.
* మౌంట్ అబు పరిసరాల్లో జలపాతాలు గల అటవీ ప్రాంతాలు పిక్నిక్‌లకు అనువుగా ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రికులకు ఇక్కడి ప్రాచీన ఆలయాలు ఆనందానుభూతిని కలిగిస్తాయి.
* బ్రహ్మకుమారీల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం ఇక్కడే ఉంది. ఆధ్యాత్మిక చింతన గల పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఇది.
 
ఏం కొనాలి?
* రాజస్థానీ సంప్రదాయ హస్తకళా వస్తువులు ఇక్కడ విరివిగా దొరుకుతాయి. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో వీటిని తక్కువ ధరలకే కొనుక్కోవచ్చు.
* నాణ్యమైన ఖద్దరు వస్త్రాలు, రాజస్థానీ చేనేత వస్త్రాలు, తేలికగా ఉండే దుప్పట్లు, రజాయిలు వంటివి కొనుక్కోవచ్చు.
* లెదర్ బెల్టులు, హ్యాండ్‌బ్యాగ్స్, జాకెట్స్, రాజస్థానీ పెయింటింగ్స్ ఇక్కడి బజారులో తక్కువ ధరలకే దొరుకుతాయి.
* ఇక్కడి రెస్టారెంట్లు, రోడ్డు పక్క ధాబాల్లో దొరికే రాజస్థానీ సంప్రదాయక వంటకాలను ఆస్వాదించవచ్చు. మీగడ నిండుగా వేసి తయారుచేసే ‘మఖానియా లస్సీ’, గోధుమపిండితో తయారు చేసే మిఠాయి ‘ఘెవార్’ వంటివి భోజనప్రియులకు మంచి అనుభూతినిస్తాయి.
 
ఎలా చేరుకోవాలి?
* ఇతర ప్రాంతాల వారు గుజరాత్ మీదుగా ఇక్కడకు చేరుకోవడం తేలిక. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి అబు రోడ్‌కు రైలు ద్వారా చేరుకోవచ్చు.
* న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, ముంబై వంటి నగరాల నుంచి అబు రోడ్ వరకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉంటాయి.
అబు రోడ్ రైల్వేస్టేషన్ నుంచి మౌంట్ అబు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అబు రోడ్ నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement