Tour Darshan
-
పరమాద్భుతం...పంచముఖేశ్వరాలయం
పవిత్రమైన కావేరీ పుష్కరాలు మొదలవుతున్నాయి త్వరలో. పుష్కర స్నానంతోపాటు అక్కడే ఉన్న పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడం అధిక పుణ్యప్రదం, ఫలప్రదం. కావేరీ నది ప్రవహించే కర్ణాటక, కేరళ, తమిళనాడులలో కావేరీ పుష్కరఘాట్లకు చేరువలో ఉన్న పుణ్యక్షేత్రాలలో కర్ణాటకలోని తలకాడ్ వైద్యేశ్వర స్వామి వారి ఆలయం సుప్రసిద్ధమైనది. ఎందుకంటే ఇక్కడ శివుని పంచముఖాలూ, పంచనామాలతో, పంచ ఆవరణలలో పంచలింగాలుగా కొలువుదీరి, భక్తులను అబ్బురపరుస్తూ, అనుగ్రహిస్తుంటాయి. అవే వైద్యేశ్వర, అర్కేశ్వర, వాసుకేశ్వర, సైకతేశ్వర, మల్లికార్జున లింగాలు. అలాగే ఇక్కడ పాతాళేశ్వర, మరాళేశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రతి ఆలయ దర్శనానికి ముందూ కావేరీ నదిలో స్నానం చేసి, ఆ తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ఆచారం. అయిదు ఆలయాలూ 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి కాబట్టి, మార్గాయాసం కూడా ఉండదు. ఒకవేళ ఏమైనా బడలిక కలిగినా, నదీస్నానంతో ఒళ్లు తేలికపడుతుంది కూడా. ఈ పంచముఖలింగాలనూ దర్శించుకున్నాక అక్కడకు చేరువలోనే ఉన్న కీర్తినారాయణస్వామి వారి ఆలయానికి వెళ్లి, స్వామివారిని సందర్శించుకోవాలి. అలా చేస్తేనే యాత్రాఫలం దక్కుతుందని అంటారు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆలయాలున్నాయి. అయిదూ శివాలయాలే. తలకాడు చాలా చిన్న గ్రామం. అయినప్పటికీ పంచముఖ ఆలయాల కారణంగా ప్రసిద్ధికెక్కింది. ప్రతి సోమవారమూ ఇక్కడ ఇసక వేస్తే రాలనంత మంది భక్తజన సందోహం స్వామివారిని అర్చిస్తూ... శివనామస్మరణ చేస్తుంటారు. ప్రత్యేకించి పౌర్ణమినాడు, మరీ విశేషంగా చెప్పాలంటే శ్రావణ పున్నమి, కార్తీక పున్నములలో ఇక్కడికి వచ్చే భక్తజన కోటితో ఊరంతా నిండిపోతుంది. నిజానికి అసలీ గ్రామమంతా ఆలయాలతో నిండి ఉండేదట. అయితే, విదేశీయుల దండయాత్రలలో ఆలయాలన్నీ ఇసుక మేటవేసినట్లయిపోయాయి. అందుకే ఇక్కడ ఎండ మాడ్చేస్తున్నా, కాళ్లు కాలిపోతున్నా, పాదరక్షలతో నడవడం అపచారంగా భావిస్తుంటారు భక్తులు. వైద్యనాథేశ్వర స్వామివారిని సందర్శించడం, అభిషేకం చేసుకోవడం వల్ల దీర్ఘరోగాలు, మొండివ్యాధులు తొలగిపోయి, ఆరోగ్యవంతులవుతారన్న నమ్మకంతో ఎక్కడెక్కడినుంచో భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. తమ నమ్మకం వమ్ముకానట్లుగా ఆరోగ్యభాగ్యంతో వెళుతుంటారు. ఇతర సందర్శనీయ స్థలాలుభక్తులు పవిత్రమైన పుష్కరస్నానం చేయడంతోపాటు ఆ చుట్టుపక్కలనున్న ఆలయాలను, చారిత్రక, ప్రకృతి రమణీయ ప్రదేశాలను సందర్శించడం వల్ల ఆ దివ్యానుభూతులను మళ్లీ పుష్కరాలొచ్చేవరకూ మదిలో పదిలంగా మూటగట్టుకోవచ్చు. మైసూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నానం చేసే భక్తులకు అవశ్య సందర్శనీయం. భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో రాష్ట్రకూటుల కాలంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది అత్యంత తలమానికమైనదిగా పేరు పొందింది. అదేవిధంగా ఇక్కడకు దగ్గరలోని సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, చెన్నకే వ స్వామి ఆలయాలు రెండూ తప్పక చూడదగ్గ ప్రాచీన ఆలయాలు. శిల్పసంపద కలబోసుకున్న పురాతన కట్టడాలు. – డి.వి.ఆర్. భాస్కర్ -
శివమెత్తిన గంగ...
చరిత్ర... విష్ణువర్ధనుని పట్టపురాణి అయిన శాంతల దేవి తనకు కుమారుడు కలగలేదనే కారణంతో ఈ పర్వతం మీదే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతాన్ని ఆవిడ పేరుతోనే పిలుస్తారు. హొయసాల ప్రభువైన విష్ణువర్ధనుడు శివగంగ దేవాలయ పునరుద్ధరణకు కృషి చేశాడు. తరువాత ఏలుబడిలోకి వచ్చిన కెంపెగౌడ రెండు గాలిగోపురాలను నిర్మించాడు. బెంగళూరుకు 34 మైళ్ల దూరంలో, తుముకూరు దగ్గర దక్షిణానికి రోడ్డు చిన్నదిగా చీలి, శివగంగ గ్రామం చేరుతుంది. దాబస్‌పేట్ రైల్వే స్టేషను నుంచి శివగంగ నాలుగు మైళ్ల దూరంలో ఉంది. ఈ పర్వతం... ఉత్తర దిక్కు నుండి శివలింగాకారంలో, తూర్పు దిక్కు నుంచి వృషభాకృతిలో, దక్షిణం నుంచి మహాసర్పంగా, పశ్చిమం నుంచి మహాగణపతి ఆకారంలో దర్శనమిస్తుంది. ఈ పర్వతం మీద అనేక నీటి బుగ్గలు, తటాకాలు, పెద్ద దేవాలయాలతో కూడిన గుహలు ఉన్నాయి. పురాణాలలో ఈ పర్వతాన్ని కకుద్గిరి అని పిలిచారు. కకుత్ అంటే ఎద్దు మూపురం అని అర్థం.ఈ శిఖరంపైన పరిశుద్ధమైన గంగాజలంతో నిండిన నీటిబుగ్గలున్న కారణంగా, ఈ పర్వతానికి శివగంగ అనే పేరు సార్థకమైనదని చెబుతారు. ఇక్కడి స్వామి గంగాధరేశ్వరుడు. శివగంగ గ్రామం నుంచి పర్వత ప్రాంతం చేరుతుండగా మానవ నిర్మితాలైన నున్నటి మెట్లు కనిపిస్తాయి. మార్గంలో పెద్ద రాతితో మలచబడిన గణపతి విగ్రహం, నంది మంటపం, పాదెకల్ వీరభద్ర విగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం కనిపిస్తాయి. ఇక్కడ రెండు పెద్ద గుహలలో శివాలయం, అమ్మవారి ఆలయాలు దర్శన మిస్తాయి. రెండు ద్వారాలకు పైన ఉన్న రెండు గోపురాలలో తూర్పు గోపురం హొయసాల కాలం నాటిది, ఉత్తర గోపురం విజయనగర కాలంనాటిది. లోపలకు వెళ్తే గిరిజా కల్యాణ మంటపం, ఏక స్తంభాధారంగా ఉన్న నవరంగం కనిపిస్తాయి. నవరంగ దక్షిణ భాగం నుంచి గుహకు చేరుకోవాలి. గంగాధరేశ్వరుని ముఖ్య ఉత్సవమూర్తికి గంగాపార్వతీ మూర్తులు ఇరుపక్కల కనువిందు చేస్తాయి. ఆలయంలో శాసనాలతో నిండిన అనేక గంటలు ఉన్నాయి. ఏటా జనవరిలో సంక్రాంతి రోజున, గంగాధరేశ్వరుడు, హొన్నమ్మదేవిల కల్యాణోత్సవం జరుగుతుంది. కొండ శిఖరం మీద నుంచి జాలువారే గంగాజలంతో కల్యాణోత్సవంలో దేవతామూర్తులను అభిషేకిస్తారు. గంగాధరేశ్వర శివలింగం దివ్యమైనది. ఈ లింగం మీద పూత పూయబడిన నెయ్యి మరుక్షణం వెన్నగా మారిపోతుంది. ఓషధీ శక్తుల కారణంగానే ఈ విధంగా జరుగుతోందని, ఈ వెన్న వల్ల అనేక రుగ్మతలు తగ్గుతాయని చెబుతారు. ఆలయ గుహకు ఉత్తరంగా మరొక చిన్న గుహాలయంలో హొన్నదేవి కొలువుతీరి ఉంది. కొద్దిగా ముందుకు వెళితే ఐదడుగుల ఎత్తులో అమ్మవారి విగ్రహం సాక్షాత్కరిస్తుంది. సాక్షాత్తు శంకరాచార్యులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని చెబుతారు. శ్రీచక్ర ప్రభావంతో హొన్నదేవి మహాత్మ్యం వృద్ధి చెందుతోంది. ఈ మందిరానికి పడమరగా గల పాతాళగంగ నీరు కొబ్బరినీళ్లలా మధురంగా ఉంటాయి. కొండ మీద చక్రతీర్థం, శంకరాచార్య తీర్థం, శంకర గుహ, శంకర పాద చిహ్నాలు, శంకరాచార్య విగ్రహం ఉన్నాయి. అగస్త్యేశ్వరునికి ప్రత్యేకం మందిరం ఉంది. మఠ సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దివ్యశక్తి ఉన్నట్లుగా చెబుతారు. సుబ్రమ్మణ్యేశ్వరునికి క్షీరాభిషేకం చేస్తుండగా, పాలు సర్పాకృతిలో దర్శనమిచ్చాయట. అంతేకాదు, ఈ స్వామిని కొలిచిన వారికి సంతానం కలుగుతుందని కూడా స్థానికులు చెబుతారు. వాలుగా ఉన్న ఒక కొండ శిఖరం మీద చెక్కిన నంది లేదా బసవన్న మూర్తి అద్భుత శిల్ప నైపుణ్యానికి ప్రతీక. వెళ్ళే మార్గం... బెంగళూరు నుంచి దోబస్‌పేట వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. దోబాస్‌పేట నుంచి శివగంగ ఎనిమిది కిలోమీటర్ల దూరం. ఇక్కడ నుంచి బస్సులు, టాక్సీలు నిత్యం అందుబాటులో ఉంటాయి. దోబస్పేట్ రైలు స్టేషన్ అతి సమీపంగా ఉంది. బెంగళూరు వరకు విమానంలో వచ్చి, అక్కడ నుంచి టాక్సీ లేదా మినీ బస్సుల ద్వారా పర్వతశిఖరం చేరుకోవచ్చు. ♦ ఇక్కడ వినాయకుని దేవాలయం, అగస్త్య తీర్థానికి సమీపంలో 108 శివలింగాలు ఉన్నాయి. శిఖరం మీద ఉన్న నంది విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్లేవారు తమ వెంట తప్పనిసరిగా మంచినీళ్లు ఉంచుకోవాలి. పైన చాలా వేడిగా ఉంటుంది. ♦ కొండ మీద గంగాధరేశ్వరుడు, స్వర్ణాంబ, శాంతేశ్వర, ఓంకారేశ్వర, రేవన సిద్ధేశ్వర, కుంభేశ్వర, సోమేశ్వర, ముద్దు వీరేశ్వర అనే అష్ట శివలింగాలు ఉన్నాయి. ♦ నంది వృషభ, మకర వృషభ, మహిష బసవ, గారే బసవ, దొడ్డ బసవ, కొడుగళ్లు అనే బసవ అష్ట వృషభాలు, అగస్త్య తీర్థం, శంకర తీర్థం, కణ్వతీర్థం, కదంబ తీర్థం, మైథల తీర్థం, పాతాళగంగ, ఒలకల్లు తీర్థం, కపిల తీర్థం అనే అష్టతీర్థాలు ఉన్నాయి. – డా. వైజయంతి -
దురలవాట్లను దూరం చేసే అమ్మవారు
ఆ ఆలయంలో అడుగుపెడితే దురలవాట్లు దూరం అవుతాయని, ఆమె సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే... చక్కటి విద్యాబుద్ధులు అలవడతాయని భక్తుల నమ్మకం. ఆ తల్లికి నివేదన చేసిన ప్రసాదం స్వీకరిస్తే చాలు మహాపండితులవుతారనీ, అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సకల సౌభాగ్యాలూ సిద్ధిస్తాయనీ అందరూ అనుకుంటారు. జగద్గురువు ఆదిశంకరులవారే స్వయంగా ప్రతిష్ఠించిన ఆ అమ్మవారే మూకాంబికాదేవి. కొల్లూరులో కొలువైన ఆ అమ్మ చల్లటి సన్నిధి సకల సంపదలకూ పెన్నిధి.కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో... దట్టమైన అడవుల మధ్యన నెలకొని ఉంది మూకాంబికాలయం. ఆ రాష్ట్రంలోని ఏడు మోక్షపురాల్లో కొల్లూరు మూకాంబిక గుడి ఒకటి. ఆలయం ఉన్నది కర్ణాటక రాష్ట్రంలో అయినా, ఆమెను ఎక్కువగా సందర్శించుకునేది కేరళీయులే కావడం విశేషం. క్షేత్రపురాణం: జగద్గురు ఆదిశంకరులు కుడజాద్రి పర్వతంపై ఉండి అమ్మవారి కోసం తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి, అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆమెను తనతోబాటు తన జన్మస్థలమైన కేరళకు రావలసిందిగా శంకరులు చేసిన ప్రార్థనకు అంగీకరించిన దేవి, అందుకు ఒక షరతు విధిస్తుంది. అదేమంటే, తాను వచ్చేటప్పుడు శంకరులు వెనక్కు తిరిగి చూడకూడదని, ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే అక్కడే తాను శిలలా మారిపోతానంటుంది. అందుకు అంగీకరిస్తాడు శంకరులు. ముందుగా శంకరులు, వెనుక అమ్మవారు వెళ్తూ ఉంటారు. కొల్లూరు ప్రాంతానికి రాగానే అమ్మవారి కాలి అందెల రవళి వినిపించకపోవడంతో, వెనక్కు తిరిగి చూస్తాడు శంకరులు. ఇచ్చిన మాట తప్పి వెనక్కు తిరిగి చూడడంతో అమ్మవారు అక్కడే శిలలా మారిపోతుంది. తన తప్పిదాన్ని మన్నించమని ప్రార్థించిన శంకరులతో తనను అక్కడే ప్రతిష్ఠించమని చెబుతుంది. దీంతో ఆదిశంకరులు శ్రీ చక్రంతోపాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. శంకరుల వెంట వచ్చేటప్పుడు అమ్మవారు మాట్లాడనందువల్ల ఆమెకు మూకాంబిక అనే పేరు వచ్చింది. నాటినుంచి అమ్మవారికి ఆదిశంకరులు సూచించిన విధానంలోనే పూజాదికాలు జరుగుతున్నాయి. మూకాంబిక ఆలయాన్ని సందర్శించుకున్నవారు ఒక్కసారైన హార తి సమయంలో అమ్మవారి దివ్యమంగళరూపాన్ని సందర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అమ్మవారికి ప్రదోష కాలంలో ఇచ్చే హారతికి ప్రత్యేకమైనది. సౌపర్ణికానది: ఆలయానికి సమీపంలో సౌపర్ణికా నది ప్రవహిస్తుంటుంది. ఈ నది లోతు తక్కువ. కుడజాద్రి పర్వతం నుంచి ఉద్భవించే ఈ నదిలో ఇతర నదీపాయలు కూడా కలుస్తాయి. ఈ నది ఒడ్డున సుపర్ణుడు అంటే గరుత్మంతుడు తన తల్లి దుఃఖాన్ని పోగొట్టమని కోరుతూ అమ్మవారిని గురించి ఘోర తపస్సు చేసి వరం పొందాడట. ఆ నాటినుంచి ఈ నదికి సౌపర్ణికానది అని పేరు వచ్చింది. ఈ నదిలో అనేక వనమూలికలు ఉంటాయని, అందువల్ల ఈ నదిలో స్నానం చేస్తే చర్మరోగాలు నయం అవుతాయని చెబుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు: ఆలయ బయటి ప్రాకారంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి తదితర దేవతల సన్నిధులున్నాయి. కొల్లూరు చుట్టుపక్కల మంగుళూరు మంగళాదేవి, ఉడిపి కృష్ణుడు, కుందాపూర్, భత్కల్, షిమోగా, ధర్మస్థల, శృంగేరీ శారదాపీఠాలు సందర్శనీయ స్థలాలు. ఇక్కడ గల కుటచాద్రి పర్వత శ్రేణి అందమైన అటవీ సంపదతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతశ్రేణి ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? మంగుళూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు కొల్లూరుకు వెళుతుంటుంది. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. మంగుళూరుకు నేరుగా అన్ని ప్రధాన నగరాలనుంచి బస్సులు, రైళ్లు ఉన్నాయి. మంగుళూరులో విమానాశ్రయం కూడా ఉంది. – డి.వి.ఆర్.భాస్కర్ -
మహిమాన్వితం.. మనోహరం గురువాయూర్ ఆలయం
ప్రకృతి అందాలకు, ఆయుర్వేద పంచకర్మ చికిత్సకు, అనేకమైన అపురూపమైన ఆలయాలకు నెలవు కేరళ. అటువంటి కేరళలో స్వర్గ మర్త్య పాతాళలోకాలూ కలసిన భూలోక వైకుంఠం గురువాయూర్. అసలు ఈ పేరు వినగానే శంఖచక్ర గదా పద్మాలతో కూడి, విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడి దివ్యమంగళ స్వరూపం కనుల ముందు కదలాడుతుంది. దేవతల గురువైన బృహస్పతి అంటే గురువు, వాయుదేవుడు కలిసి పరశురాముడి సాయంతో సముద్రగర్భంలోకి చేరకుండా కాపాడిన శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన దివ్యస్థలి ఇది. అంతకుముందు వరకు రుద్రతీర్థం అనే పేరుతో విలసిల్లిన ఈ క్షేత్రానికి వారి పేరు మీదుగానే గురువాయూరు అనే పేరొచ్చింది. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక చేత శంఖం మరో చేత చక్రం మరో రెండు చేతులలోనూ గదాపద్మాలను, మెడలో తులసి మాలను ధరించిన స్వామి విగ్రహం చూడటానికి రెండు కన్నులూ చాలవేమో అన్నంత నయన మనోహరంగా ఉంటుంది. మీ మనసులోని భావాలన్నీ నాకు తెలుసు, మీరు కోరకుండానే నేనే తీరుస్తానుగా మీ కోర్కెలను అన్నట్లు చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఆ సుందర స్వరూపాన్ని చూడగానే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. అన్నట్లు ఐదువేల సంవత్సరాల చరిత్ర గల ఈ విగ్రహం తక్కిన అన్ని విగ్రహాలలాగా రాతితో లేదా పంచలోహాలతో తయారైనది కాదు. పాతాళాంజనమనే విశిష్టమైన వనమూలికలతో రూపొందించినది. ఇక్కడ పరిణయమాడితే జీవితమంతా పరిమళభరితమే అనే విశ్వాసంతో భక్తులు ఎంతో వ్యయప్రయాసలకోర్చి మరీ ఈ ఆలయ ప్రాంగణంలో పెళ్లి చేసుకోవడానికి ఉవ్విళ్లూరతారు. నామకరణాలు, అన్నప్రాశనలు, అక్షరాభ్యాసాలు, ఉపనయనాల వంటి శుభకార్యాలన్నీ ఇక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆపదలు, గండాలు, దీర్ఘవ్యాధులు తొలగాలని స్వామికి మొక్కుకుని, ఆయా ఆపదలన్నీ హారతి కర్పూరంలా కరిగిపోగానే తమ బరువుకు సరిపడా బంగారం, వెండి, రూపాయి కాసులు, ఆకుకూరలు, కూరగాయలు, వెన్న, పటికబెల్లం... ఇలా ఒకటేమిటి, తమ స్తోమతకు తగ్గట్టుగా తులాభారం తూగుతూ కనిపిస్తారు. కొందరు భక్తులు స్వామివారికి అమూల్యమైన ఆభరణాలనూ సమర్పిస్తుంటారు. ఆయా ఆభరణాలను భద్రపరచేందుకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిని అనునిత్యం అంటిపెట్టుకుని పంచనాగులనే పేరుగల ఐదుసర్పాలు సంరక్షిస్తుంటాయి. సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆలయానికి చేరువలో రుద్రతీర్థమనే పేరుగల పెద్ద కోనేరు ఉంది. స్వామికి ఈ కోనేటి నీటితోనే నిత్యం అభిషేకం చేస్తారు అర్చకులు. ఏకాదశి, రోహిణీ నక్షత్ర వేడుకలు ఇక్కడ విశేషంగా జరుగుతుంటాయి. ఏనుగులకు ఈ ఆలయంలో ఎంతో ప్రత్యేకత, గౌరవాభిమానాలూ దక్కుతాయి. ఏనుగు పందేలు కూడా జరుగుతాయి. అవి అల్లాటప్పాగా కాదు.. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉల్లాసోత్సాహాలతో నిర్వహిస్తారు. ఇది చాలా మహిమాన్విత క్షేత్రం కాబట్టి ఆలయంలో మడీ తడీ శుచీ శుభ్రతలకు ప్రాముఖ్యతనిస్తారు. చుట్టుపక్కల చూడదగ్గ స్థలాలు: మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్ క్యాంప్ శాంక్చువరీ, పున్నతూర్ కొట్ట, పార్థసారథి ఆలయం, వెంకటాచలపతి ఆలయం, చోవళూర్ శివాలయం, పళయూర్ చర్చ్, గురువాయూర్ దేవస్థాన దారుశిల్ప కళాసంస్థ, నవముకుందాలయం, చాముండేశ్వరి ఆలయం, హరికన్యక ఆలయం, నారాయణంకులాంగర ఆలయం మొదలైనవి. – డి.వి.ఆర్. భాస్కర్ -
హంపీ విరూపాక్షాలయం
అతి పురాతనం... అత్యంత రమణీయం సిరులు పొంగిపొరలిన సీమ అది. రతనాలను రాశులుగా పోసి అమ్మిన నేల అది. సంగీతం, సాహిత్యం రెండు కన్నులుగా విలసిల్లి, కవులు, రచయితలకు వేదికగా భాసిల్లిన భుజన విజయమది. లేళ్లు, పులులు కలసి సఖ్యతగా మెలిగిన చోటు అది. రాయలు పాలించిన సువిశాల సామ్రాజ్యమది. శిలలపై శిల్పాలు చెక్కి, సృష్టికే సొబగులు అద్దిన నగరమది. అదే హంపీ. అక్కడి విరూపాక్ష స్వామి ఆలయాన్ని చూడాలంటే రెండు కన్నులూ చాలవనిపిస్తుంది. సుమారు పదిహేను వందల ఏళ్లనాటి ఆ ఆలయం అలనాటి అపురూప శిల్పకళావైభవానికి అద్దం పట్టినట్లనిపిస్తుంది. విరూపాక్షాలయంతో బాటు విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆద్యుడైన విద్యారణ్యస్వామి వారి ఆలయం, గణపతి దేవాలయం, కోదండ రామాలయం, అచ్యుతరాయల గుడి, బదివి లింగం, ఉగ్రనరసింహస్వామి ఆలయాలతోపాటు గజశాల, రాణిస్నానపు గది, కమల మహల్, రాతిరథం, రామాయణ మహా కావ్యంలో వర్ణించిన పంపా సరోవరం, రుష్యమూక పర్వతం చూస్తుంటే వేల ఏళ్లనాటి సాంస్కృతిక వారసత్వం కనుల ముందు సాక్షాత్కరించి నట్లనిపిస్తుంది. అపురూపమైన చరిత్ర: విరూపాక్ష దేవాలయం ప్రత్యేకత అంతా అత్యున్నతమైన ఆలయ గోపురాలలోనూ, ప్రాకారాలలోనూ, సజీవ శిల్పాలలోనూ కనిపించి కనువిందు చేస్తుంది. విదేశీ యాత్రికులు, చరిత్రకారులు సైతం హంపీ విజయనగర సామ్రాజ్యంలోని విరూపాక్ష దేవాలయపు వైభోగాన్ని వేనోళ్ల పొగిడారంటే... ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారంటేనే ఈ కట్టడం ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. తుంగభద్రానదికి దక్షిణ తీరాన ఎత్తయిన రాతిగుట్టలపై ఉన్న హంపీ గొప్ప పౌరాణిక క్షేత్రం. అనేక పేర్ల హంపి: హంపీ నగరానికి అనెగొంది, విరూపాక్షపురం, హోసపట్టణం, హోస పంపా పట్టణం, హస్తినాపతి, హంపీ, విద్యానగరం తదితర పేర్లున్నట్లు ఇక్కడి శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందే విరూపాక్షస్వామి ఆలయం, బేలూరులోని చెన్నకేశవస్వామి ఆలయాలు ఉన్నాయి. అతి ఎల్తైన దీ, ప్రధానమైనదీ అయిన 165 అడుగుల తూర్పు రాజగోపురంలోనుంచి లోనికి అడుగు పెట్టగానే ఎడమ చేతివైపు మూడు తలల చిన్న నంది విగ్రహం అగుపిస్తుంది. అసలు గోపురమే పదకొండు అంతస్తులుగా ఉంటుంది. ప్రాకారం కూడా అతి పెద్దది. ప్రథమ ప్రాకారం పశ్చిమ దిశన కనిపించే మరో గోపురానికి రాయగోపురమని పేరు. ప్రాకారంలో ధ్వజస్తంభాలు, దీపస్తంభాలు, అనేక చిన్న దేవాలయాలున్నాయి. ఈ ప్రాకారంలో ఎదురుగా కనిపించేదే విరూపాక్షాలయం. హంపీలో అత్యంత ప్రాచీన ఆలయం. ఈ ఆలయంలోని కొన్ని కట్టడాలను మొదటి హరిహర రాయలు కట్టించగా, ఆలయంలోగల రంగమంటపాన్ని శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడైన సమయంలో కట్టించాడు. గుడిలోపలి భాగంలో పంపాదేవి, భువనేశ్వరీ మూర్తి నవగ్రహ సన్నిధులున్నాయి. ఆలయానికి ఉత్తర దిక్కున రత్నగిరి గోపురం, ఆ గోపురాన రత్నగర్భ వినాయకుడితో సహా మరికొన్ని సన్నిధులున్నాయి. విరూపాక్షాలయానికి వెనుకవైపున విద్యారణ్యస్వామివారి సన్నిధి ఉంది. ఇక్కడ ఒక చిత్రమేమిటంటే... విద్యారణ్యస్వామి ఆలయం ముందువైపున ఉన్న రాతిగుహలో శ్రీ విరూపాక్షస్వామి ముఖద్వార గోపురం తలకిందులుగా కనపడుతుంది. సూర్యుడెక్కడున్నా, ఏ వేళప్పుడైనా గోపుర బింబం మాత్రం చెక్కుచెదరకుండా స్థాణువులా అలాగే నిలిచి కనిపిస్తుంది. ఇక్కడికి సమీపంలోనే ఉండే విఠలాలయం శిల్పకళకు సిసలైన సంపదగా శోభిల్లుతుంది. ఆలయంలో గల స్తంభాలును తాకితే చాలు... సప్తస్వరాలూ పలుకుతూ సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ఇవేగాదు, ఈ ఆలయంలోని అనేక స్తంభాలపైన చెక్కిన పక్షులు, చేపలు, హంసలు ఊపిరి పోసుకుని వచ్చి మన మీద దూకుతాయేమో అన్నంత సజీవంగా... ఉండటం అలనాటి పనితనానికి, శిల్పకళాచాతుర్యానికి నిదర్శనం. ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి? కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిజిల్లా హోస్పేటకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది హంపీ. అంటే బెంగళూరు నుంచి 350 కిలోమీటర్లు పైగా ఉంటుంది. హైదరాబాద్ వాసులు బెంగళూరు నుంచి వెళ్లేబదులు నేరుగా అక్కడి నుంచే హోస్పేట వెళ్లడమే సులువు. దగ్గర కూడా. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి బెంగళూరుకు రైళ్లు, విమానాలు ఉన్నాయి. అక్కడినుంచి హోస్పేటకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. కొన్ని బస్సులు, రైళ్లు నేరుగా హోస్పేటకు వెళ్లేవి ఉన్నాయి. హోస్పేటనుంచి హంపీకి క్యాబ్‌లు లేదా ట్యాక్సీలలో వెళ్లవచ్చు. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. హంపీలో బస, వసతి కొంచెం ఖరీదుతో కూడుకున్న వ్యవహారమే. అయితే ఒక మోస్తరు హోటళ్లు, లాడ్జీలు కూడా ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
రామాయణ చిత్రకూటం
పచ్చటి కొండలు, ఆ కొండల మీద ఏపుగా పెరిగిన చెట్లు, గుబురుగా పెరిగిన పొదలు, దారుల వెంట పారే వాగులు, మధ్యమధ్యలో కంటికి కనిపించకుండా చెవులకు వినిపించే గుప్త గోదారి, కొండల న డుమ సప్తస్వరాలతో కచేరీ చేస్తున్నట్లు పారే మందాకినీ నది... ప్రకృతి సౌందర్యానికి దర్పణం పట్టినట్టున్న అద్భుతమైన, అరుదైన చిత్రాలు... ఇదంతా ఎక్కడో అనుకుంటున్నారా... కాదు... మన దేశంలోనే..! సీతారామలక్ష్మణుల అడుగుజాడలను, వారి పరమ పావనమైన పాదధూళిని తనలో నిక్షిప్తం చేసుకున్న ఈ పవిత్రమయిన, సుందరమైన ప్రదేశమే చిత్రకూటం. పద్నాలుగేళ్ల వనవాసం చేయాలన్న పితృవాక్యపాలనలో భాగంగా రాముడు తన సోదరుడైన లక్ష్మణుడు, ప్రియసతి అయిన సీతాసాధ్వితో కలసి తొలుత చిత్రకూటాన్నే చేరి, అక్కడే కొద్దికాలం నివసించాడని వాల్మీకి రామాయణం చెబుతోంది. కేవలం సీతారామలక్ష్మణులు సంచరించినందువల్లే కాదు, చిత్రకూటానికి ఈ ప్రాముఖ్యత... అంతకు మునుపే చిత్రకూటం ఎంతో పుణ్యస్థలిగా, ఎన్నో తీర్థాలను ఇముడ్చుకున్న పుణ్యతీర్థంగా పేరు పొందింది. అందుకే వాల్మీకి, భరద్వాజుడు చిత్రకూటం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌లోని సత్నాజిల్లాలో గల చిత్రకూటం ప్రకృతి సౌందర్యానికే కాదు... ఎందరో రుషుల తపోదీక్షకు ఆనవాళ్లు. అత్రి, అనసూయ, మార్కండేయుడు వంటి మునిపుంగవులు, గురువులకే గురువు దత్తాత్రేయుడు వంటి వారు తపస్సు ఆచరించేందుకు ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మైమరచిపోయి, పర్ణశాలలు నిర్మించుకుని, ఇక్కడి మందాకినీ నదిలో స్నానమాచరించి, నది ఒడ్డునే తపస్సు చేసుకున్నట్లు స్థలపురాణ ం చెబుతోంది. మధ్యప్రదేశ్ అడవులలో ఉత్తరప్రదేశ్ సరిహద్దులలో ఉన్న ఈ పవిత్రస్థలిలో ప్రతి కొండా, గుట్టా, రాయీ రప్పా, చెట్టూ పుట్టా, వాగూ వంకా, తీర్థమూ జలపాతమూ... ఇలా ప్రతి ఒక్కటీ కూడా సీతారామ లక్ష్మణులు, వారి దాసుడైన హనుమంతుడి పేర్లతోనే ముడిపడి ఉంటాయి. కేవలం జీవంలేని ప్రదేశాలే కాదు.. ఇక్కడ జీవం పోసుకున్న ప్రతి వారి పేర్లలో సీతా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, హనుమంతుడూ ఉంటారు. వారి పిలుపులు కూడా రామ్ రామ్ అనే ఉంటాయి. తమకు తారసపడిన ప్రతి వారినీ రామ్ అనే పిలవడం వీరి ఆచారం. కొండగుహలన్నీ రామనామ జపంతో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద బండరాళ్లమీద సీతమ్మ చీరలు ఆరవేసుకున్నట్లుగా... రామయ్య శయనించినట్లుగా... లక్ష్మణుడు సేదదీరినట్లుగా... హనుమంతుడు గంతులు వేసినట్లుగా ఆనవాళ్లుంటాయి. తండ్రి మృతివార్త విన్న రాముడు ఇక్కడే ఆయనకు పితృశ్రాద్ధం నిర్వహించాడట. పితృకార్యం నిర్వహిస్తున్నది సాక్షాత్తూ కోదండరాముడే కావడంతో ఆయన ను సేవించుకునేందుకు అనేకానేకమంది దేవతలు వివిధ రూపాలలో ఇక్కడకు వచ్చి, ఆ కార్యక్రమాన్ని జరిపించి, స్వయంగా తర్పణలు స్వీకరించారని స్థలపురాణం చెబుతోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ అవతారాలు ధరించినట్లుగా కథనాలు వినిపిస్తాయి. మంధర పర్వతంతో పోటీపడి ఆకాశానికి అంటుతున్నట్లుగా పెరుగుతూ పోతున్న వింధ్యపర్వతాన్ని నేను వచ్చేవరకు నువ్వు ఇంక పెరగకుండా ఇలాగే ఉండు అని ఒకే ఒక్కమాటతో అగస్త్యుడు అడ్డుకట్ట వేసింది ఇక్కడేనంటారు.సీతారామలక్ష్మణులు నడయాడిన ఈ పవిత్రస్థలిలో తమ జీవితాలను కూడా పావనం చేసుకోవాలన్న తపనతో దేశం నలుమూలల నుంచి ఎందరో సాధుసజ్జనులు ఇక్కడకు వచ్చి ఏ చెట్టునీడనో, కొండగుహలోనో తపోదీక్షలో లీనమై యాత్రికులకు దర్శనమిస్తుంటారు. అంతర్వాహినిగా గుప్తగోదావరి: మందాకినీ నదితోపాటూ యమునా నది కూడా ఇక్కడికి దాపులలోనే ఉంది. ‘మీరే కాదు, నేనూ ఇక్కడే ఉన్నాను’ అన్నట్లుగా ఇక్కడ అడుగుపెట్టిన పాదచారులకు తన చల్లని స్పర్శతో, గలగల శబ్దాలతో అంతర్వాహినిగా ప్రయాణిస్తూ ఓ గోదావరీ పాయ గుప్తగోదావరిగా పేరు తెచ్చుకుంది. రామ్‌ఘాట్: మందాకినీ నది ఒడ్డున గల ఈ స్నానఘట్టంలోనే రాముడు రోజూ స్నానం చేసేవాడట. రామలక్ష్మణులు స్నానం చేసి వస్తున్నట్లుగా తులసీదాసు తన మనోనేత్రాలతో దర్శించాడట. అందుకే దీనిని తన రామచరిత్ మానస్‌లో రామ్‌ఘాట్ అని ప్రత్యేకంగా పేర్కొన్నాడు. కామద్గిరి: మందాకినీ నది పరిక్రమ చేసే భక్తులు ఇక్కడ గల రామాలయాన్ని సందర్శించి, మొక్కులు మొక్కుకుంటారు. ఎందుకంటే కామదనాథుడనే పేరుగల రాముడు కోరిన కోరికలు తీర్చే వేల్పుగా ప్రసిద్ధిపొందాడు. ఇక్కడే అనేక ఆలయాలున్నాయి. భరత్ మిలాప్: తన అన్నగారు ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న భరతుడు వేలాదిమంది సైనికులను, పరివారాన్ని వెంటబెట్టుకుని వచ్చి, రాముణ్ణి కలిసిన ప్రదేశమిది. వనవాసం చేయమని చెప్పిన తండ్రిగారు మరణించారు కాబట్టి, ఇక ఆ ఆజ్ఞను పాలించవలసిన అవసరం లేదని, వచ్చి, అయోధ్యను ఏలుకొనమని భరతుడు బతిమాలుతాడు రాముణ్ణి. రాముడు అందుకు అంగీకరించకపోయేసరికి ఆయన పాదుకలను తీసుకుని, నెత్తిన పెట్టుకుని వెళ్లి, ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి, రాజ్యపాలన చేశాడు. రాముణ్ణి భరతుడు కలిసిన ప్రదేశం కాబట్టి, భరత్ మిలాప్ అనే పేరొచ్చింది. ఇక్కడ భరతుడికి చిన్న మందిరం ఉంది. జానకి కుండ్: రాముడు స్నానం చేసిన ప్రదేశానికి కొద్దిదూరంలోనే సీతాదేవి స్నానం చేసేదట. అందుకే ఈ ఘట్టానికి జానకి కుండ్ అనే పేరొచ్చింది. సతీ అనసూయ ఆశ్రమం: సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అనసూయాశ్రమాన్ని సందర్శించారట. అప్పుడు అనసూయ సీతకు పాతివ్రత్య ధర్మాలను బోధించడంతోపాటు, రకరకాల లేపనాలను, రుచిగల పండ్లను, చీరలను కానుకగా ఇచ్చిందట. హనుమాన్ ధార: చిత్రకూటానికి 25 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రదేశానికి చేరాలంటే కనీసం రెండువేల మెట్లను ఎక్కవలసిందే! ఎంతో ప్రయాసకు ఓర్చి ఇక్కడ వరకు వచ్చిన వారి అలసట, మార్గాయాసం అంతా తీరిపోయేలా పురాతన హనుమద్విగ్రహం దర్శనమిస్తుంది. ఎక్కడినుంచి పడుతోందో తెలియని విధంగా నిత్యం జలధార పడుతూ, విగ్రహాన్ని అభిషేకిస్తుంటుంది. హనుమను అభిషేకించిన జలాన్ని తీర్థంలా సేవిస్తారు యాత్రికులు. హనుమాన్ ధారలో హనుమంతుని విగ్రహంతోపాటు ఇంకా అనేక గుడులుంటాయి. భరత్ కూప్: రాముడిని ఆహ్వానించడానికి విచ్చేసిన భరతుడు ఆయనను అక్కడే చక్రవర్తిగా అభిషేకించాలన్న సంకల్పంతో ఐదునదుల నీటిని తీసుకు వచ్చి, ఒక బావిలా తవ్వి, ఆ నీటితో నింపాడట. అదే భరతుడి కూపంగా పేరు పొందింది. రామశయ్య: సీతారామలక్ష్మణులు తాము శయనించేందుకు వీలుగా ఒక పెద్ద చెట్టునీడన గల రాతిప్రదేశాన్ని శయ్యలా చెక్కారట. ఈ రాతిపరుపు పైనే సీతారాములు శయనించేవారట. అదే రామశయ్యస్ఫటిక శిల: సీతారాములు కూర్చున్న ఒక రాతితిన్నెకే స్ఫటిక శిల అని పేరు. సీతారాముల పాదముద్రలు ఈ శిలపై మెరుస్తూ కనిపిస్తాయి. ఉత్సవాలు... పర్వదినాలు: చిత్రకూటంలో ప్రతి అమావాస్యకూ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇంకా దసరా, దీపావళి, సంక్రాంతి, హోలీ, ఉగాది వంటి అన్ని హిందూ సంప్రదాయ పండుగలప్పుడూ ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రత్యేకించి దీపావళి సమయంలో జరిగే దీపదానోత్సవానికి భక్తులు వేలాదిగా హాజరవుతారు. ఇతర సందర్శనీయ స్థలాలు: చిత్రకూటాన్ని సందర్శించవచ్చే భక్తులు అలహాబాద్, వారణాసి, ఖజురహో, బాంధవ్ గర్, పన్నా నేషనల్ పార్క్ తదితరాలను కూడా సందర్శిస్తారు. భోజన, వసతి సదుపాయాలు: చిత్రకూటాన్ని సందర్శించే యాత్రికుల కోసం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పర్యాటక మంత్రిత్వ శాఖలవారు విడివిడిగా అందుబాటు ధరలలో భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇవిగాక ప్రైవేటుగా బడ్జెట్ హోటళ్లు కూడా ఉన్నాయి. – డి.వి.ఆర్. భాస్కర్ -
త్రిమూర్త్యాత్మకం... త్రిప్రయార్ రామాలయం
టూర్‌దర్శన్ గుండె గుండెకో గుడి ఉంటే, ఆ గుడిలో రాముడుంటాడట. అందుకే ఊరూరా రామాలయాలుంటాయి. అలాగే పరశురాముడు నడయాడిన కేరళలో రామునికి 30 గుడులున్నాయి. రామునికే కాదు, ఆయనతోబాటు ఆయన సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా గుడులున్నాయి. ఈ ఆలయాలన్నీ అలాంటిలాంటివి కావు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటన్నింటికీ మించిన ప్రత్యేకత త్రిప్రయార్ ఆలయానిది. అదేమంటే, రామచంద్రమూర్తి చతుర్భుజాలతో దర్శనమిస్తాడక్కడ. అదేంటీ, రాముడు దేవుడు కదా, అందులోనూ సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారం కదా, ఆయనకు నాలుగు చేతులుండటంలో వింతేముంది, అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే రాముడు మానవుడిగా పుట్టాడు కాబట్టి ఆయనకూ మనలాగే రెండుచేతులే ఉంటాయి. నాలుగు చేతులుండవు. అందుకే ఆయన ఆలయాలన్నిటిలోనూ రెండు చేతులతోనే దర్శనమిస్తాడు. కేవలం రెండే రెండుచోట్ల మాత్రం నాలుగు చేతులతో విష్ణుమూర్తిలా కనిపిస్తాడు. వాటిలో మొదటిది భద్రాద్రి అయితే, రెండవది త్రిప్రయార్. ఇలా ఆయన నాలుగు చేతులతో దర్శనమివ్వడానికి కారణాలు ఇలా చెబుతున్నారు... అరణ్యవాస సమయంలో శ్రీరామచంద్రుని సమక్షంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూచెవులూ కోయగా, ఆమె ఏడ్చుకుంటూ తన పినతల్లి కుమారులైన ఖరదూషణులకు చెప్పింది. దాంతో వారు క్రోధావేశాలకు లోనై, తమ స్నేహితుడు త్రిశిరుడిని కలుపుకొని మరో పద్నాలుగువేల మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని సీతారామ లక్ష్మణులపైకి దండెత్తాడు. అప్పుడు వారిమధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రామచంద్రమూర్తి వారందరినీ మట్టుబెట్టాడు. అయితే ఆ ఖరదూషణాదులను సంహరించే సమయంలో రాముడు నాలుగు చేతులతో విష్ణుమూర్తిలా దర్శనమిచ్చాడట. అందుకే ఈ రామునికి నాలుగు చేతులున్నాయని స్థానికుల కథనం. ఆ యుద్ధం జరిగిన స్థలమే ఇది. ద్వారక నుంచి శ్రీకృష్ణుడు ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి శ్రీరాముని సేవించేవాడట. అయితే ద్వారక సముద్రగర్భంలో కలసిపోవడంతో ఈ విగ్రహాలు కూడా సముద్రంలోనే ఉన్నాయట. చాలాకాలం తర్వాత కొందరు జాలరులు చేపలు పట్టుకుంటుండగా, వారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహాలు దొరికాయట. దివ్యతేజస్సుతో ఉన్న ఆ విగ్రహాలను ఏం చేయాలో తెలియక అక్కడి రాజుకు అప్పగించారు. ఆ రాజు పండితుల సలహా మేరకు ఆలయం కట్టిద్దామని సన్నాహాలు చేస్తుండగా, అక్కడి వారిలో ఒకరికి పూనకం వచ్చి, రాముడి విగ్రహాన్ని మాత్రం నెమళ్లు నడయాడే చోటే ప్రతిష్ఠించాలని, లేకుంటే ఆలయం కట్టించిన ఫలం ఉండదని చెప్పడంతో రాజు, స్వయంగా నెమళ్లకోసం చాలాదూరం పాటు వెదికాడట. అయితే ఎంత వెదికినా నెమళ్లు కనిపించకపోవడంతో విసిగి వేసారిన రాజుకు ఒకచోట నెమలీకలు కనిపించాయట. ఇక్కడ తప్పనిసరిగా నెమళ్లు ఉండి ఉంటాయని నమ్మి, ఆలయాన్ని నిర్మించి, ఆ ఆలయంలో రాముణ్ణి ప్రతిష్ఠించారట. అలాగే ఇరింజక్కుడ అనే చోట భరతుడికీ, మూఝిక్కుళంలో లక్ష్మణుడికీ, అక్కడికి చేరువలోగల పాయమ్మేళులో శత్రుఘ్నుడికీ ఆలయాలను నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆలయ ఉనికి: కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో తీవ్రా నది ఒడ్డున గురువాయూర్కు సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. అద్భుతమైన నిర్మాణం: ఈ ఆలయం త్రిశూర్‌లోని వడక్కునాథన్ ఆలయాన్ని పోలి ఉంటుంది. వృత్తాకారపు ఆలయ ప్రాంగణం అద్భుతంగా అనిపిస్తుంది. ఆలయ గోడలపై రామాయణ కావ్యదృశ్యాలు మనోజ్ఞంగా మలచబడ్డాయి. పదకొండో శతాబ్దికి చెందిన ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి, అయ్యప్ప, గణపతి ఆలయ సన్నిధులున్నాయి. అయితే రామభక్త హనుమాన్ సన్నిధి మాత్రం ఆలయం లేదు. అయినప్పటికీ, హనుమకు కూడా ఆలయ పూజారులు అర్చనవిధులు నిర్వర్తించడం విశేషం. దక్షిణామూర్తి సన్నిధి ముందు అఖండదీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం దుష్టశక్తులను దూరం చేస్తుందంటారు. ఈ ఆలయ మూలమూర్తి త్రిమూర్త్యాత్మకం అని చెబుతారు. దక్షిణామూర్తి విగ్రహాన్ని సాధారణంగా శివాలయాలలోనే ప్రతిష్ఠిస్తారు. అయితే ఇక్కడ దక్షిణామూర్తి కూడా కొలువై ఉంటాడు. అలాగే చేతిలో పుష్పమాల ఉండటం బ్రహ్మకు ప్రతీక. అందుకే ఈ రాముడికి త్రిప్రయార్ రామర్ అని పేరొచ్చింది. ఉత్సవాల వేలుపు: స్వామికి రోజూ ఐదుపూటలా పూజలు జరుగుతుంటాయి. స్వామివారి ఉత్సవమూర్తిని రోజూ గుడిచుట్టూ మూడుమార్లు ఊరేగిస్తారు. నిత్యపూజలతోబాటు ఏకాదశి, అరట్టు, పూరం అంటూ మూడు ఉత్సవాలు నిర్వర్తిసారు. ఏకాదశి ఉత్సవంలో వెనకాల 20 ఏనుగులు వరసుగా రాగా, ముందు ఒక ఏనుగుపై స్వామివారు తన సతీమణి సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడితో కలసి ఊరేగుతారు. సేతుబంధనోత్సవం పెద్ద ఎత్తున చేస్తారు. శ్రీరామ నవమి ఉత్సవాల సంగతి ఇక ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. మూలవిరాట్టు: ఆలయంలోని మూలమూర్తి ఒకచేతిలో విల్లు, మరో చేతిలో పుష్పం, మిగతా రెండు చేతులలో శంఖు, చక్రాలను ధరించి, అత్యంత రమణీయంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని రామచంద్రమూర్తి విగ్రహాన్ని శ్రీకృష్ణుడు పూజించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆలయానికి ముందు నమస్కార మండపం... ఆ మండపంలో నవగ్రహ సన్నిధి కనిపిస్తుంది. రాగితో నిర్మించిన నమస్కార మండప గోడలకు బంగారు తాపడం చేశారు. ఎలా చేరుకోవాలి? రైలుమార్గం: త్రిప్రయార్ శ్రీరామాలయానికి వెళ్లేందుకు దగ్గరలో గల రైల్వే స్టేషన్ త్రిస్సూర్. ఇక్కడినుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే స్వామివారి ఆలయాన్ని చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులతోబాటు ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. విమానంలో అయితే కొచ్చిన్ వరకు వెళ్లవచ్చు. అక్కడినుంచి 55 కిలోమీటర్ల దూరంలోని ఆలయాన్ని చేరుకోవడానికి రైళ్లు, బస్సులూ ఉన్నాయి. కొత్తదిల్లీ, చెన్నై, ముంబాయి, కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్, పూణే, భోపాల్, పట్నాల నుంచి గురువాయూర్‌కి వెళ్లేందుకు బస్సులు, రైళ్లూ ఉన్నాయి. గురువాయూర్ వెళ్తే అక్కడినుంచి త్రిప్రయార్ రామాలయానికి వెళ్లడం చాలా సులువు. – డి.వి.ఆర్. భాస్కర్ -
సర్వ సంపదల ప్రదాయిని
కొల్హాపూర్ మహాలక్ష్మి సకల ఐశ్వర్యాలు ఆమె చెంతే! సమస్త లోకాలు ప్రణమిల్లేది ఆమె చరణాల వద్దే! సర్వ సమ్మోహన ముగ్ధ మనోహర రూపంతో విలసిల్లే ఆ దేవతామూర్తి శ్రీ మహాలక్ష్మి. పాలసంద్రంలోన జనించి నారాయణుని వరించి నరులను తరింపజేసే లోకపావని అమరపురులను దాటి అవనికి ఏతెంచి కోరి కొలువున్న చోటు కొల్హాపురి. ‘దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం..’ అంటూ సమస్త లోకాలు కీర్తించే అమ్మ భౌతిక, ఆధ్యాత్మిక సంపదలకు, సమృద్ధి, తేజస్సు, జ్ఞానము, అదృష్టము, సంతానము, ధైర్యము మొదలైన లక్షణాలకు నిలయమైన విష్ణుపత్ని శ్రీమహాలక్ష్మి. అలాంటి అమ్మవారు నరులకు సకల ఐశ్యర్యాలను సిద్ధింపజేసేందుకు మహారాష్ట్రలోని సహ్యాద్రి కనుమలలో పంచగంగా తీరంలో కొల్హాపూర్ క్షేత్రంలో కొలువుదీరి ఉంది. సతీదేవి అష్టాదశ శక్తిపీఠాలలో కామ్యమోక్ష కారక పీఠంగానూ ఈ క్షేత్రం పేరుగాంచింది. ప్రళయకాలంలో కూడా లక్ష్మీనారాయణులు ఈ క్షేత్రాన్ని విడువకుండా ఇక్కడే ఉంటారని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి అవిముక్త క్షేత్రమని పేరు. ఈ ప్రాంతం జగన్మాత కుడిచేతిన ఉన్నది కాబట్టి ప్రళాయాతీతమైనదిగా ప్రతీతి. శ్రీమహాలక్ష్మి ఇక్కడ నివసించటం వలన శ్రీహరి నిరంతరం ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ప్రాంతం అనేకమంది రుషులను, యోగులను, మహాపురుషులను ఆకర్షించి వారికి మోక్షకారకమైంది. త్రిమూర్తి రూపుడైన దత్తాత్రేయుడు ప్రతి మధ్యాహ్నం ఇక్కడ భిక్షకు వస్తాడని అనేక స్తుతులలో చెప్పబడింది. షిర్డీసాయి ఆరతులలో కాశీలో స్నానం, జపం, కొల్హాపూరులో భిక్ష అనే దత్తస్తుతి ఈ విశ్వాసాన్ని మరింత చాటుతుంది. అమ్మవారు చంపిన కొల్హాసురుడనే రాక్షసుడి పేరు మీదుగానే ఈనగరం వెలియడం ఈ ప్రాంత విశేషమని కథనం. మరాఠీయులు ప్రేమతో ‘అంబాబాయి’గా పిలుచుకునే శ్రీమహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్‌కి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. కలువపువ్వు ఆలయం మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మి, తుల్జాపూర్ భవాని, మహూర్ రేణుక, వణిసప్తశృంగిమాత ఇవి నాలుగూ మహిమాన్వితమైన శక్తిపీఠాలు. అయినా కొల్హాపూర్ మహాలక్ష్మికి అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా పేరు. అతి పురాతనమైన ఈ ఆలయం క్రీస్తుపూర్వం 4-5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమై ఉండవచ్చని, క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చాళుక్యరాజు కరణ్దేవ్, 8వ శతాబ్దంలో యాదవరాజులు పునర్నిర్మించారని ఇక్కడి శాసనాలు తెలుపుతున్నాయి. విశాల ప్రాంగణంలో నిర్మితమైన ఈ ఆలయం హేమాడ్‌పంత్ శైలిలో కనువిందు చేస్తుంది. నాలుగు దిక్కులా నాలుగు ముఖద్వారాలు ఉండగా గర్భాలయం 5 గోపురాల కింద ఉంటుంది. మధ్యలో ఒక గోపురం నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు.. పైన నుంచి చూస్తే తెల్లని కలువ పువ్వులా గోచరిస్తుంది. తూర్పు గోపురం కింద మహాలక్ష్మి, మధ్య కుమార మండపం, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి కొలువుతీరి ఉన్నారు. ఉపాలయాలలో వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవాని తదితర దేవతలు కొలువుదీరి ఉన్నారు. ఆలయం ప్రాంగణంలో అమ్మకు అర్పించడానికి పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, పుష్పాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంగణంలోనే మేడి చెట్టు, దాని వెనుక భగవాన్ శ్రీధరులు స్థాపించిన దశావతార మూర్తులు, అమ్మవారు ఉంటారు. మరోపక్క ఖండోబా మందిరం, శివాలయం ఉన్నాయి. ప్రధాన ఆలయ తూర్పుద్వారం వైపు శేషశాయి మందిరం అష్టభుజాకారంలో అద్భుతంగా ఉంటుంది. ప్రాంగణంలోని అన్ని బయట గోడలపై సురసుందరీమణులు, నృత్య అప్సరసలు, చతుష్షష్టి యోగినులు నల్లని రాతిపై అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. కాశీతో సమానమైన ప్రాశస్త్యం ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా, నీటిలో మునిగిన కొల్హాపురి క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన చేతులతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి ‘కరవీర’ క్షేత్రమనే పేరు వచ్చిందని కథనం. ఈ క్షేత్రంలో అధిష్టాన దేవత మహాలక్ష్మి కాగా, శివుడు నీరుగా, విష్ణువు రాయిగా, మహర్షులు ఇసుకగా, దేవతలు చెట్లుగా, మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని, అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానమాచరిస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయని పద్మ, స్కాంద, దేవీభాగవతాలు చెబుతున్నాయి. శివుని ఆనతి మేరకు అగస్త్యమహాముని కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాని ఆ విధంగా క్షేత్రానికి కాశీతో సమానమైన ప్రాశస్త్యం గలదని స్థలపురాణం. ఈ నగరాన్ని ‘కోల్పూర్’, ‘కోల్‌గిరి’, ‘కోలదిగిరి పట్టణ్’ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే లోయ’, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రంలో విలసిల్లింది. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వరకు శివాజీ పూర్వీకులు పాలించగా 17వ శతాబ్దిలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రర్ధమానమైందని తెలుస్తోంది. అమ్మ మోమున సూర్యకిరణాల సొగసు గర్భగుడిలో అమ్మవారి విగ్రహం దాదాపు ఐదువేల ఏళ్లనాటిదని తెలుస్తోంది. అరఅడుగు చదరంగా ఉన్న వేదిక, రెండడుగల పీఠం మీద మూడడుగుల ఎత్తున ఉంటుంది అమ్మవారి మూర్తి. నాలుగు చేతులలో పండు, గద, డాలు, పానపాత్ర ధరించి ఉంటుంది. కిరీటంపై నాగపడగ, కింద శివలింగం, యోని ఆకారాలు ఉంటాయి. అందుకే ఈ మూర్తిని మూలప్రకృతిగా, విష్ణుమాయా స్వరూపిణిగా భావిస్తారు. వెలకట్టలేని ఆభరణాలతో అత్యంత అందంగా ఆకర్షణీయంగా ఉండే అమ్మవారి వెనుక సింహవాహనం కనపడుతుంది. దేశంలోని మిగిలిన క్షేత్రాలకు భిన్నంగా మూలవిరాట్ పడమర ముఖంగా ఉంటుంది. ఏడాదిలో 2 మార్లు 3 రోజుల పాటు సూర్యస్తమయ వేళలో సూర్య కిరణాలు పడమటి దిక్కులో గల చిన్న కిటికీ గుండా అమ్మవారి ముఖాన్ని తాకుతాయి. ఆమె చీర అంచులో కాంతులను పొదుగుతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. గర్భగుడి గోడపై శ్రీచక్రం, మూలవిరాట్-మహాకాళికి మధ్య మహాలక్ష్మి యంత్రం స్థాపించబడ్డాయి. ఆది శంకరులు ఈ క్షేత్రాన్ని సందర్శించి, తపస్సు చేసి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారట. ఆ తర్వాత కాలంలో విద్యాశంకర భారతి కొల్హాపూర్ క్షేత్రానికున్న ధార్మిక విశిష్టతను గుర్తించి 13వ శతాబ్దంలో ఓ మఠం నిర్మించారు. ఈ ఆలయానికి దగ్గరలో 35 చిన్న పెద్ద గుళ్లు ఉన్నాయి. ప్రత్యేక పూజలు శ్రావణ, చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి, నవరాత్రి ఉత్సవాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరుపుతారు. కొల్హాపూర్‌లో చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంతటి ఫలాలనిస్తుందని పురాణోక్తి. ఆలయగుండంలో జ్యోతి ప్రజ్వలనం చేస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ నశించి శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయని స్థలపురాణం. శ్రీచక్రపూజలతో జీవితం నందనవనం ఇక్కడ అమ్మవారిని సేవిస్తే సంతానం లేని వారికి సంతు కలుగుతుందట. పిల్లలను అమ్మవారి సమక్షంలో ఉంచితే వారి భవిష్యత్తు అమోఘంగా ఉంటుందట. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి పాయసాన్ని సమర్పిస్తే రోగాలు నయమైపోతాయట. అవివాహితులు శ్రీచక్రపూజలు జరిపిస్తే వివాహయోగం కలిగి వారి జీవితం నందనవనంలా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఇతర దర్శనీయ స్థలాలు కొల్హాపూర్‌లోని ప్రతి కోటకీ అబ్బురపరిచే చారిత్రక వారసత్వం ఉంది. మహారాజ భవనం 200 గదులతో 3 అంత స్తులతో విశాలమైన మైదానం మధ్యలో ఉంటుంది. నాటి ఆయుధాలు, రాజరికపు సామగ్రి ఇందులో పొందుపరిచారు. చరిత్ర ప్రేమికులు శాహూ ప్రదర్శనశాల తప్పక సందర్శించాలి. సంప్రదాయ కుస్తీ కళను ఇప్పటికీ సాధన చేసే ఖుష్బాగ్ మైదానంలో ఒకేసారి 30 వేల మందికి కూర్చునే వసతి ఉంది. ప్రకృతి ప్రేమికులు ఇక్కడి చెరువుల ఒడ్డున కాలక్షేపం చేయవచ్చు. పిల్లలను అలరించే చోటు ‘రంకాల చౌపాటే.’ దత్తాత్రేయుడి రెండవ అవతారం నృసింహ సరస్వతి ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో కృష్ణ, పంచగంగల సంగమ క్షేత్రమైన నర్సోబావాడిలో తపస్సు చేసుకున్నారట. అక్కడ వారి పాదుకల మందిరం ఉంది. పన్హాలా కొండలపై శివాజీ కొట, జ్యోతిబా మందిరం ప్రసిద్ధి చెందినవి. వడాపావ్ టేస్ట్! ‘దేశపు చక్కెర పాత్ర’గా పేరు గల కొల్హాపూర్‌లో వడాపావ్, పావ్ మిశాల్ ప్రసిద్ధ వంటకాలు. ఇక కొల్హాపూర్ చెప్పుల జతలు కొనకుండా తిరుగుముఖం పట్టలేం. మహారాష్ట్రీయన్ స్టైల్లోని ఆర్టిఫిషియల్ నగలు, వెండి వస్తువులు మంచి డిజైన్లలో లభిస్తాయి. ఇలా చేరుకోవచ్చు! ముంబై నుంచి 387, పుణే నుంచి 240 హైదరాబాద్ నుంచి 540 కిలోమీటర్లు. కొల్హపూర్కి బస్సు, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. విమాన, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఈ నగరం ఇతర ప్రధాన నగరాలకు కలపబడి ఉంది. వాయు మార్గం అయితే.. ఉజలాయివాడిలో విమానాశ్రయం ఉంది. రైలు మార్గం ముంబై, పుణేల నుంచి చేరుకోవచ్చు. రోడ్డుమార్గంలో ప్రభుత్వ, ప్రైవేటు బస్సుసర్వీసుల ద్వారా చేరుకోవచ్చు. - చిలుకమర్రి నిర్మలారెడ్డి -
మూషికాలయం
టూర్‌దర్శన్ : కర్ణిమాత ఆలయంలో ఎక్కడ చూసినా ఎలుకలే ఎలుకలు... వేల సంఖ్యలో ఎలుకలు... గుంపులు గుంపులుగా ఎలుకలు.. ఎవరి పాదాల మీదుగా ఆ ఎలుకలు పరుగులు తీస్తాయో వారికి అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు, అదృష్టం కలిసొచ్చే కాలం దగ్గర్లోనే ఉన్నట్టు భక్తుల నమ్మకం. ఎలుకలు ఉన్న ప్రసాదమే భక్తులకు పంపకాలు.. ఇలా ఎన్నో వింతలు గల ఈ ఆలయానికి వెళ్లొద్దాం రండి... ప్రపంచంలో ఎలుకలకు ఆలయం ఉన్న ఒకే ఒక్క ప్రాంతం మన దేశంలోని రాజస్థాన్‌లోని దేష్నోక్ గ్రామం. ఇది రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. బికనీర్ జిల్లాను ఒంటెల దేశంగా పిలుస్తారు. దేష్నోక్ గ్రామాన్ని గతంలో ‘దస్నోక్’ అని పిలిచేవారు. ఈ గ్రామం పది చిన్నగ్రామాల మూలల భాగాల నుంచి ఏర్పడింది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ గ్రామమే కర్ణిమాత దేవాలయానికి ప్రసిద్ధి. పాలరాతి గోడలు.. వెండి ద్వారాలు... హిందువుల దేవతైన దుర్గామాత మరో అవతారమే కర్ణిమాతగా కొలుస్తారు. సిందూరం రాసిన ఏకశిల మీద అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఒక చేత త్రిశూలం, మరో చేత రాక్షస తల పట్టుకొని సింహవాహినిగా భక్తుల చేత పూజలందుకుంటుంది. జోధ్‌పూర్, బికనీర్ రాజవంశీయులకు కర్ణిమాత కులదైవం. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి. ఈ ఆలయానికి వెండి ద్వారాలు, నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్‌కు చెందిన కర్ణి ఆభరణ తయారీదారులు ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి. భక్తుల రాకపోకలకు ఏమాత్రం జంకకుండా అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. భక్తుల పాదాల మీదుగా పరుగులు తీస్తుంటాయి. భక్తులు పెట్టిన నైవేద్యాలను, పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లు ఆరగిస్తుంటాయి. కథలకు నెలవు కర్ణిమాత కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం. తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి, నాటి నుంచి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట. ఆ సమయంలో కర్ణిమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తర్వాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట. ఆలయం వద్ద దాదాపు 20 వేల ఎలుకలు తిరుగాడుతుండటం వెనక మరో జానపద కథ కూడా వినిపిస్తుంది. 20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది. ఆ ప్రాంతానికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలు అని తెలుసుకున్న వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు. ఇక్కడ ఎలుకల రెట్టలు గానీ, వాటి నుంచి ఎటువంటి వాసన కూడా రాకపోవడం విచిత్రం. తెల్లని ఎలుకలు దేవతాస్వరూపాలు... వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపించడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్‌లో పడి చనిపోయాడు. కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట. ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని, ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక. అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం. వివిధ ప్రాంతాలలో కర్ణిమాత ఉదయపూర్ మచ్లా హిల్స్‌లో మరో కర్ణిమాత దేవాలయం ఉంది. అలాగే రాజస్థాన్ చారిత్రక పట్టణమైన అల్వార్‌లో కర్ణిమాత దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి మూర్తిని దర్శించుకోవచ్చు గానీ, ఎలుకలు మాత్రం ఉండవు. వెండి ఎలుక ఎలుకలకు ఆహారం ఇవ్వడం గొప్ప వరంగా భక్తులు భావిస్తారు. అయితే, ఈ ఆలయంలో పొరపాటున ఎవరి వల్లనైనా ఎలుక చనిపోతే వారు అంతే బరువు గల వెండి ఎలుకలను ఆలయానికి ఇచ్చి దోషాన్ని పోగొట్టుకోవాలి. అమ్మవారి ఎదుట ఎలుకలున్న నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఏడాదికి రెండుసార్లు ఉత్సవాలు కర్ణిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి, మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ, ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో మొదటి వేడుక చైత్ర మాసంలో (మార్చ్-ఎప్రిల్) లో, రెండవ వేడుక ఆశ్వీయిజ మాసం( సెప్టెంబర్ - అక్టోబరు)లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ నవరాత్రుల సందర్భంగా వేలాది భక్తులు కాలినడకన అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఎలా వెళ్లాలంటే ⇒ బికనీర్ ప్రాంతానికి దేష్నోక్ 30 కిలోమీటర్ల దూరం ⇒ బికనీర్ నుంచి దేష్నోక్ చేరుకోవడానికి బస్సు సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి టికెట్ రూ.20 ⇒ దేష్నోక్ కి విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలలో తేలికగా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం జోధ్‌పూర్‌లో ఉంది. ఇక్కడ నుంచి కలకత్తా, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు విమాన సదుపాయాలున్నాయి ⇒ జోధ్‌పూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది ఆగ్రా, ఢిల్లీ, అజ్మీర్, జోధ్‌పూర్, అహ్మదాబాద్, జైపూర్, జైసల్మేర్, ఉదయపూర్, బర్మార్.. నగరాల నుండి ప్రతిరోజూ బస్సు సదుపాయాలున్నాయి ⇒ అన్ని కాలాలలోనూ ఉష్ణోగ్రతలు అధికమే. సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి నెలలు సందర్శనకు అనుకూలం ⇒ ఇక్కడ విజయ్స్ గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. వీటిని క్యామెల్ మ్యాన్స్ గెస్ట్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇందులో గది రూ.500 నుంచి రూ. 800లకు లభిస్తాయి. అల్పాహారం రూ.125, లంచ్ 150, డిన్నర్ 150. వైఫై సదుపాయం ఉంటుంది. కంప్యూటర్ ఉపయోగించుకోవాంటే గంటకు రూ. 60. సమీప దర్శనీయ స్థలాలు: బికనీర్ జిల్లాలో జునాగఢ్ కోటతో పాటు పెద్ద పెద్ద మహల్లు ఉన్నాయి. లాల్‌గడ్ ప్యాలెస్, శివ్బరి ఆలయం, గంగా గోల్డెన్ జూబ్లీ మ్యూజియమ్, గజ్నేర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, ప్రాచీన మ్యూజియమ్, కోట్ గేట్, భండాసర్ జైన్ టెంపుల్, ఒంటెల జాతీయ పరిశోధన కేంద్రం, లక్ష్మీనారాయణ దేవాలయం, ఎర్రటి రాతి కోటలు, కట్టడాలు .. ఇలా ఎన్నో సందర్శించదగినవి ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. - నిర్మలా రెడ్డి -
మూడు తొండాల గణేశుడు
టూర్‌దర్శన్ జై జై గణేశా... మూడు తొండాల గణేశా... జయములిమ్ము బొజ్జ గణేశా.. వినాయకుడి ఆలయాల్లో సాధారణంగా ఒక తల, ఒక తొండం, నాలుగు చేతులతో స్వామి కనిపిస్తాడు. అదే, పుణేలోని సోమ్వార్‌లేన్‌లో గల త్రిశుండ్ మయూరేశ్వర మందిరానికి వెళితే మూడు తొండాలు, ఆరు చేతులతో నెమలి వాహనంపై ఆశీనుడైన గణేశుడు మనకు దర్శనమిస్తాడు. జీవితంలో విజయావకాశాలు అందుకోవాలని తపించే భక్తులకు అభయముద్రలో ఆశీస్సులు అందిస్తుంటాడు. మహారాష్ట్రలోని పుణే పట్టణంలోని రైల్వేస్టేషన్‌కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్నదే అయినా ఎంతో చారిత్రక నేపథ్యంతో పాటు అతి ప్రాచీన ఆలయంగా త్రిశుండ్ మయూరేశ్వర గణపతి మందిరానికి ఘనమైన పేరుంది. దీర్ఘచతురస్రాకారంలో నిటారుగా ఉండే నల్లని రాతి గోడలతో ఈ ఆలయం అలరారుతుంటుంది. రాజస్థానీ, మాల్వా, దక్షిణ భారతీయ శైలులకు చెందిన శిల్పకళతో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. రాతి గొడలపై నెమళ్లు, చిలకలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, రక్షకభటుల బొమ్మలు, పురాణగాథల శిల్పాలు అత్యంత సహజంగా కనిపిస్తుంటాయి. గణనాథుడి ద్వారపాలకులు... అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఈ దేవాలయాన్ని 1754లో భీమ్జిగిరి గోసవి అనే స్థానికుడు కట్టించాడని ప్రతీతి. నల్లటి పెద్ద పెద్ద రాళ్లను ఈ నిర్మాణానికి ఉపయోగించారు. ఎక్కడా మట్టిగానీ, కాంక్రీట్ కానీ కనిపించని ఈ ఆలయాన్ని పూర్తి రాతిమయంగానే రూపొందించారు. రాళ్ల మీదనే చెక్కిన అపురూపమైన కుడ్యాలలో ఆలయ మహాద్వారంపైన మధ్యలో గజలక్ష్మి ఆసీనురాలై ఉంటుంది. ఆ పైన ప్రసన్నవదనంతో అనుగ్రహిస్తున్నట్లు కనిపించే వినాయక విగ్రహం ఇట్టే ఆకర్షిస్తుంది. కుంకుమపువ్వు రంగులో కనిపించే మరో చిట్టి గణపతి ద్వారం మీదుగా ఉంటుంది. ద్వారం గుండా నేరుగా గర్భగుడిలో స్వామి దర్శించుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి పదహారేళ్లు పట్టింది. 1770లో ఏకశిలతో చెక్కబడిన మూడు తొండాలు గల గణపతిని ఈ ఆలయంలో ప్రతిష్టించారు. సిందూర రూపుడై... గర్భగుడిలో కనిపించే గణపతి సిందూరాన్ని నిలువెల్లా పులుముకొని, ప్రత్యేకంగా కనిపిస్తాడు. మూడు తొండాలు (త్రి-శుండ్), ఆరు చే తులతో, నెమలి వాహనం (సాధారణంగా ఎలుక వాహనంగా ఉంటుంది) మీద ఆసీనుడై ఉండే స్వామి దర్శన భాగ్యం చేతనే భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఎటువంటి క్లిష్టమైన పనినైనా విజయవంతంగా పూర్తిచేయవచ్చు అనే నమ్మకం ఇక్కడి భక్తులలో ఉంది. నాటి శాసనాలే ఆధారాలు... గర్భగృహం లోపలి రాతి గోడలను పరిశీలిస్తే అబ్బురపరచే శిల్పకళాకృతి కళ్లకు కడుతుంది. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కి ఉన్నాయి. రెండు శాసనాలు దేవనాగరి లిపి, మూడోది పర్షియన్ లిపిలో ఉంది. దేవనాగరి లిపిలో ఉండే రెండు శాసనాలలో ఒకదానిమీద రామేశ్వర ఆలయ స్థాపన, రెండవది సంస్కృత శాసనంలో భగవద్గీతశ్లోకాలను చెక్కారు. మూడవ శాసనం పర్షియన్ భాషలో ఉండగా, అది ఈ దేవాలయ చరిత్రను తెలియజేస్తోంది. త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి మందిరానికి సమీపంలో 8వ శతాబ్దికి చెందిన పాటలేశ్వర గుహలు ఉన్నాయి. ఇవి రాష్ట్రకూటుల కాలానికి చెందినవి. ఇక్కడి గుహలలో దేవాలయాలూ ఉన్నాయి. లాల్‌మహల్ ఇక్కడ తప్పక చూడవలసింది. ఛత్రపతి శివాజీ తండ్రి షహాజీ భోంస్లే 1630లో లాల్ మహల్‌ని నిర్మింపజేశాడు. ఆయన భార్య జిజియాబాయి, కుమారుడితో సహా ఈ లాల్మాల్లో నివసించేవారు. దీనిని పునరుద్ధరించి మ్యూజియమ్‌గా మార్చి పర్యాటకుల సందర్శనం కోసం ఉంచారు. శనివార్వాడలో గల కస్బా గణపతి ఆలయం అతి ప్రాచీనమైనది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బాల్ గంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. ఎలా వెళ్లాలి? * హైదరాబాద్ నుంచి పుణేకి బస్సు, రైలు సదుపాయాలున్నాయి. పుణే జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి సోమ్వార్‌పేట్‌కి 2 కి.మీ దూరం. * పుణేలో విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి సోమ్వార్‌పేట్‌కి 10 కిలోమీటర్లు. * అన్ని హోటల్ వసతి సదుపాయాలు ఉన్నాయి. -
మబ్బులతో మాట్లాడవచ్చు!
టూర్‌దర్శన్ మంచుకొండల మనోహర సోయగాలు... మైమరపించే పచ్చని వనాల సొగసులు... గుర్రపు జీను ఆకారంలో ఉన్న కొండల మీద వెలసిన అందమైన ఊరు అల్మోరా. అక్కడి కొండల మీదకు వెళ్లి చూస్తే మబ్బులు చేతికందుతాయా అనిపిస్తాయి. ఊరికి ఇరువైపులా పారే కోసీ, సుయాల్ నదుల జలకళ నయనానందం కలిగిస్తుంది. ఇక్కడి కొండలపై కనిపించే ‘కిల్మోరా’ మొక్క కారణంగా ఈ ఊరికి అల్మోరా అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడి పురాతన ఆలయాల శిల్పసౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. ఏం చూడాలి? * హిమగిరి సొగసులను తనివితీరా చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తున ఉండే అల్మోరాలో వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. * అల్మోరా పట్టణంలోను, సమీప పరిసర ప్రదేశాల్లోనూ సుప్రసిద్ధ పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. కాసర్‌దేవి, నందాదేవి, జాఖన్దేవి, పాతాళదేవి, చితాయి గోలుదేవత, బనరీదేవి వంటి పురాతన శాక్తేయ ఆలయాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. * దేశంలో అతి తక్కువగా కనిపించే సూర్యదేవాలయాల్లో ఒకటి అల్మోరాకు చేరువలోని కటార్మల్ గ్రామంలో ఉంది. కట్యూరి వంశానికి చెందిన కటారమల్ క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ కుడ్యాలపై కనిపించే శిల్పకళా సంపద సందర్శకులను ఆకట్టుకుంటుంది. * అల్మోరాకు చేరువలోని చితాయి గ్రామంలో గోలుదేవత ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడి అమ్మవారికి తమ కోరికలను దరఖాస్తులుగా సమర్పించుకుంటారు. అవి తీరితే తిరిగి ఇక్కడకు వచ్చి, తీరిన కోరికకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో గంటలు కడతారు. * అల్మోరా చేరువలోని పాండుఖోలి మరో ప్రసిద్ధ ఆలయం. లాక్షాగృహ దహనం తర్వాత దుర్యోధనుడి బారి నుంచి తప్పించుకోవడానికి పాండవులు కొన్నాళ్లు ఇక్కడ తలదాచుకున్నారని ప్రతీతి. * అల్మోరాలోనే పుట్టిపెరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గోవిందవల్లభ్ పంత్ జ్ఞాపకార్థం ఇక్కడ ఆయన పేరిట నిర్మించిన మ్యూజియంలోని పురాతన వస్తువులను, కళాఖండాలను చూసి తీరాల్సిందే. * ఇక్కడకు చేరువలోని లఖుడియా ప్రాంతంలోని కొండగుహలలో చరిత్రపూర్వయుగం నాటి కుడ్యచిత్రాలు ఇక్కడి పురాతన నాగరికతకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచి ఉన్నాయి. * అల్మోరాలోని కొండ శిఖరాలపై ఉన్న జీరోపాయింట్, బ్రైట్ ఎండ్ కార్నర్ వంటి ప్రదేశాలకు చేరుకుని సూర్యాస్తమయ దృశ్యాలను, చుట్టుపక్కల కనిపించే దట్టమైన అడవుల పచ్చదనాన్ని తిలకించడం పర్యాటకులకు మధురానుభూతినిస్తుంది. * ఇక్కడకు చేరువలోని బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో విహరిస్తూ ఇక్కడ సంచరించే అరుదైన వన్యప్రాణులను తిలకించవచ్చు. పులులు, చిరుతలు, జింకలు వంటి అరుదైన జంతువులతో పాటు రకరకాల అరుదైన పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏం చేయాలి? * ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునే పర్యాటకులకు ఇది పూర్తిగా అనువైన ప్రదేశం. ఇక్కడి హోటళ్లలో, రిసార్టుల్లో ఎక్కడ బస చేసినా ఆరుబయటకు చూస్తే కనుచూపు మేర చుట్టూ పరుచుకున్న పచ్చదనం, సుదూరాన మంచుకొండల ధవళకాంతులు కనువిందు చేస్తాయి. * పర్వతారోహకులకు ఇక్కడి కొండలు సవాలుగా నిలుస్తాయి. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడి కొండలపైకి ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతారు. * ఆలయ సందర్శనంపై ఆసక్తిగల పర్యాటకులకు ఇక్కడ అడుగడుగునా కనిపించే అత్యంత పురాతన ఆలయాలు, ఆ ఆలయాల్లోని ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. * అల్మోరాలోను, ఇక్కడి పరిసరాల్లోని గోవిందవల్లభ్ పంత్ మ్యూజియం, కుమావో రెజిమెంటల్ మ్యూజియం, జగేశ్వర్ ఆర్కియాలాజికల్ మ్యూజియం వంటివి చూసి తీరాల్సిందే. వీటిలో భద్రపరచిన పురాతన వస్తువులు, కళాఖండాల ద్వారా ఇక్కడి ప్రాచీన నాగరికతా వికాసాన్ని ఆకళింపు చేసుకోవచ్చు. ఏం కొనాలి? * మంచుకొండలకు చేరువగా ఉండటంతో అల్మోరాలో ఊలు దుస్తుల వాడకం ఎక్కువ. ఇక్కడి నేతగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువలు వంటి ఊలు దుస్తులు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. * అల్మోరా రాగి వస్తువులకు కూడా ప్రసిద్ధి పొందిన ఊరు. ఇక్కడి కళాకారులు రాగితో తయారు చేసిన పాత్రలు, సంప్రదాయ కళాకృతులు, విగ్రహాలు వంటివి సరసమైన ధరలకే దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే సింగొరా, బాల్ మిఠాయి వంటి నోరూరించే మిఠాయిలను కూడా కొనుక్కోవచ్చు. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు డెహ్రాడూన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా అల్మోరా చేరుకోవచ్చు. * రైళ్లలో వచ్చేవారు అల్మోరాకు సమీపంలోని కఠ్గోదాం స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. * ఉత్తరాదిలో ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని పట్టణాల నుంచి అల్మోరా వరకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. -
మస్త్ మస్త్ మాండూ
టూర్‌దర్శన్ భారతదేశం నడిబొడ్డున మధ్యప్రదేశ్‌లో గతవైభవ ఘనచరిత్రకు నిలువెత్తు సాక్షీభూతం మాండూ. మాల్వా ప్రాంతంలోని ధార్ జిల్లాలో ఉన్న ఈ పట్టణాన్ని మాండవ్‌గఢ్ అనేవారు. ఈ పట్టణంలో ఎక్కడ చూసినా ఎత్తయిన గుట్టలపై రాతితో నిర్మించిన పురాతనమైన కోటలు, రాజప్రాసాదాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కనిపిస్తాయి. వింధ్యపర్వత శ్రేణుల్లో వెలసిన ఈ పట్టణం సముద్ర మట్టానికి 633 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పీఠభూమి ప్రాంతపు సహజ ప్రకృతి సౌందర్యంతో పాటు, చారిత్రక విశేషాలను కూడా ఆస్వాదించాలనుకునే వారికి మాండూ చక్కని విడిది ప్రదేశం. ఏం చూడాలి? * క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే ఈ పట్టణం ఉనికిలో ఉందనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే, క్రీస్తుశకం పదో శతాబ్దం నాటికి ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పరమార్ వంశపు రాజులు నిర్మించిన మాండవ్‌గఢ్ కోట, పట్టణానికి గల పన్నెండు ప్రవేశ ద్వారాలు నేటికీ నిలిచి ఉన్నాయి. ఈ కోటను, ఇందులోని శ్రీ సుపార్శ్వనాథుని ఆలయాన్ని, ఆలయం ఒడ్డునే ఉన్న ‘మాండవ్‌గఢ్ తీర్థ్’ కోనేరును తప్పక చూసి తీరాల్సిందే. * భారతదేశంలోనే మొట్టమొదటి పాలరాతి కట్టడమైన హోషంగ్ షా టోంబ్ ఇక్కడే ఉంది. మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి ముస్లిం రాజు హోషంగ్ షా ఘోరీ (ఆల్ఫ్ ఖాన్) మరణానంతరం 15వ శతాబ్దిలో ఆయన వారసులు దీనిని నిర్మించారు. తాజ్‌మహల్ కంటే ముందే నిర్మించిన ఈ పాలరాతి కట్టడం ఆనాటి అఫ్ఘాన్ శిల్పకళా శైలిలో కనువిందు చేస్తుంది. * రాణీ రూప్మతి, సుల్తాన్ బాజ్ బహదూర్ ఖాన్ల ప్రేమగాథకు నిలువెత్తు సాక్ష్యం మాండూ పట్టణం. మాండూ రాజధానిగా మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన చిట్టచివరి స్వతంత్ర పరిపాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్ ఖాన్ సామాన్య గాయని అయిన రూప్మతిని ప్రేమించి పెళ్లాడాడు. రూప్మతి అందచందాలు తెలుసుకుని ఆమెను సొంతం చేసుకునేందుకు అక్బర్ చక్రవర్తి తన సేనాని ఆదమ్ ఖాన్‌ను మాండూపై దండయాత్రకు పంపాడు. యుద్ధంలో బహదూర్ ఖాన్ మరణించగా, రూప్మతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కోసం బాజ్ బహదూర్ ఖాన్ నిర్మించిన రూప్మతి ప్యాలెస్, ఆ ప్యాలెస్‌కు నిరంతరం నీటి సరఫరా చేసేందుకు నిర్మించిన రేవా కుండ్ రిజర్వాయర్, బాజ్ బహదూర్ కొలువుతీరిన బాజ్ బహదూర్ ప్యాలెస్ నేటికీ వారి ప్రేమకు నిదర్శనంగా నిలిచి ఉన్నాయి. * మాండూలో జహాజ్ మహల్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఓడను తలపించే ఈ భారీ రాతికోట వాస్తు చాతుర్యం, శిల్పకళా నైపుణ్యం తనివితీరా చూసి తీరాల్సిందే. రెండు తటాకాల మధ్య ఘిజాజుద్దీన్ ఖిల్జీ నిర్మించిన జహాజ్ మహల్‌ను దూరం నుంచి చూస్తే నీటిలో తేలుతున్న ఓడలాగానే కనిపిస్తుంది. * హోషంగ్ షా హయాంలో నిర్మించిన మరో అద్భుతమైన రాతి కట్టడం హిందోలా మహల్. ఏటవాలు రాతిగోడలతో నిర్మించిన ఈ కోట అప్పట్లో రాజప్రాసాదంగా ఉపయోగపడేది. * జమీ మసీదు, దరియాఖాన్ టోంబ్, మాలిక్ ముగిత్ టోంబ్ వంటి కట్టడాలు కూడా సందర్శకులను ఆకట్టుకుంటాయి. డమాస్కస్ మసీదు రీతిలో నిర్మించిన జమీ మసీదు పదిహేనో శతాబ్ది నాటి వాస్తుశైలికి నిదర్శనంగా నేటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. * లొహానీ గుహలు, బాఘ్ గుహలు వంటి పురాతన కొండ గుహలలోని పురాతన కుడ్యశిల్పాలను, కుడ్య చిత్రాలను చూడాల్సిందే. లోహానీ గుహలలో క్రీస్తుశకం పదో శతాబ్దంలో శైవయోగులు ఉండేవారని చెబుతారు. బాఘ్ గుహలలో బౌద్ధ సన్యాసులు ఉండేవారనేందుకు ఇక్కడి కుడ్యచిత్రాలే ఆధారాలు. ఏం చేయాలి? * రూప్మతి మహల్ పైభాగంలో ఉన్న రూప్మతి పెవిలియన్‌కు చేరుకుని అక్కడి నుంచి మాండూ పట్టణాన్ని, చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలను వీక్షించడం ఒక మధురానుభూతి. ఇక్కడ నిలుచునే రాణీ రూప్మతి ఇక్కడకు దక్షిణాన కనిపించే బాజ్ బహదూర్ ప్యాలెస్‌ను, నర్మదా నదిని చూస్తూ గంటల తరబడి గడిపేదని ప్రతీతి. * బాజ్ బహదూర్ ప్యాలెస్, జహాజ్ మహల్, హోషంగ్ టోంబ్, జైన మందిరం వంటి అరుదైన కట్టడాలను అడుగడుగునా తిలకించడం గొప్ప అనుభూతినిస్తుంది. దిగువన ఏర్పాటు చేసిన రేవాకుండ్ నుంచి ఎగువన ఉన్న రూప్మతి మహల్‌కు నీటి సరఫరా జరిగేది. అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తే ఇప్పటి వారికీ ఆశ్చర్యం కలుగుతుంది. * ఉజాలి బవుడి ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన మరో ఇంజనీరింగ్ అద్భుతం. పురాతనమైన ఈ బావి చాలా విశాలంగా ఉండటమే కాకుండా, నీటి మట్టం వరకు చేరుకునేందుకు అనువుగా రెండువైపులా రాతి మెట్లు ఉంటాయి. నీటిని మోసుకొచ్చేవారు అక్కడక్కడా బరువును దించుకునేందుకు వీలుగా చదునైన గట్లు ఉంటాయి. * గుట్టలెక్కుతూ కోటలను సందర్శించడమే కాకుండా, జన సమ్మర్దం తక్కువగా ఉండే మాండూ వీధులు వాకింగ్‌కు, సైక్లింగ్‌కు అనువుగా ఉంటాయి. ఇక్కడి వాతావరణం కూడా దాదాపు ఏడాది పొడవునా ఆహ్లాదభరితంగానే ఉంటుంది. ఏం కొనాలి? * గృహాలంకరణ వస్తువులు, స్థానిక మాల్వా గిరిజన కళాకారులు రూపొందించిన హస్తకళాకృతులు మాండూ మార్కెట్లో చౌకగా లభిస్తాయి. వీటిని ఇక్కడి నుంచి కొని తీసుకుపోవచ్చు. * చేనేత వస్త్రాలు, దుప్పట్లు వంటివి కూడా ఇక్కడ తక్కువ ధరలకే దొరుకుతాయి. * అటుకులతో తయారు చేసే అల్పాహారం, దాల్ కచోడీలు, పనీర్ వంటకాలు వంటి మాల్వా ఆహారాన్ని ఇక్కడ రుచి చూడాల్సిందే. ఎలా చేరుకోవాలి? * విమానాల్లో వచ్చేవారు ఇండోర్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. ఇండోర్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ద్వారా మాండూ చేరుకోవచ్చు. * రైళ్లలో వచ్చేవారు రత్లాం స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. దేశంలోని దాదాపు అన్ని మార్గాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఇక్కడి నుంచి 124 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం ద్వారా మాండూ చేరుకోవాల్సి ఉంటుంది. బస్సులు, ట్యాక్సీలు విరివిగా అందుబాటులో ఉంటాయి. * ధార్, రత్లాం, ఇండోర్, ఉజ్జయిని, భోపాల్ వంటి ప్రధాన పట్టణాలు, నగరాల నుంచి మాండూకు బస్సులు అందుబాటులో ఉంటాయి. -
మార్వెలస్ మాథేరాన్
టూర్‌దర్శన్ ప్రకృతి అందాలకు నెలవైన పడమటి కనుమల్లో మాథేరాన్ చాలా చిన్న పట్టణం. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం మన దేశంలోనే అతి చిన్న హిల్‌స్టేషన్. ఇక్కడి జనాభా పట్టుమని పదివేలు కూడా ఉండదు. వాహనాల రణగొణలు ఏమాత్రం వినిపించవు. ఎలాంటి హడావుడీ కనిపించదు. చుట్టూ నింగిని తాకే కొండలు... పచ్చదనం నింపుకున్న లోయలు... పక్షుల కిలకిలలు... వనవిహారంపై మక్కువ గలవారు మాథేరాన్‌ను చూస్తే... ‘మార్వెలస్’ అనకుండా ఉండలేరు. మాథేరాన్‌ను 1850లో అప్పటి థానే కలెక్టర్ హఫ్ పాయింజ్ మాలెట్ తొలిసారిగా గుర్తించాడు. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఈ ప్రదేశాన్ని పట్టణంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి బాంబే గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్‌స్టోన్ దీనికి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఇక్కడ జనావాసాలు ఏర్పడ్డాయి. తర్వాత 1907లో వ్యాపారవేత్త సర్ అదామ్జీ పీర్‌భోయ్ సమీపంలోని నేరల్ వరకు మాథేరాన్ హిల్ రైల్వే లైన్‌ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఈ రెండు పట్టణాల మధ్య టాయ్ ట్రెయిన్‌ను నడుపుతున్నారు. ఏం చూడాలి? * పడమటి కనుమల అందాలను తనివితీరా చూసి తీరాల్సిందే. కొండ శిఖరాలపై ఉన్న లూయిసా పాయింట్, పనోరమా పాయింట్, హనీమూన్ పాయింట్, పోర్కుపైన్ పాయింట్, అలెగ్జాండర్ పాయింట్, ఎకో పాయింట్, వన్ ట్రీ పాయింట్ వంటి ప్రదేశాల నుంచి తిలకిస్తే మాథేరాన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, పచ్చదనంతో నిండిన లోయల అందాలు కనువిందు చేస్తాయి. * నెరల్-మాథేరాన్‌ల మధ్య కొండ మార్గంలో నడిచే టాయ్ ట్రెయిన్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. * మాథేరాన్ మెయిన్ రోడ్డుకు కేవలం కిలోమీటరు దూరంలోనే షార్లట్ సరస్సు వర్షాకాలంలో జలకళతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సుకు సమీపంలోనే పురాతనమైన పిశర్నాథ్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇందులోని స్వయంభూ లింగాన్ని సిందూరంతో అర్చిస్తారు. ఆలయం వద్ద నుంచి తిలకిస్తే సరస్సు పరిసరాలు ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. * మాథేరాన్ మెయిన్‌రోడ్డుపై ఉన్న సెంట్రల్ బజారులోని దుకాణాలు స్థానిక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ బజారు మీదుగా నడక సాగించడం ఆహ్లాదభరితంగా ఉంటుంది. * మాథేరాన్‌లోని అంబర్నాథ్ ఆలయం మరో పురాతన శివాలయం. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళా సౌందర్యం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఏం చేయాలి? * మాథేరాన్ పట్టణంలోకి కార్లు తదితర మోటారు వాహనాలను అనుమతించరు. పట్టణంలో తిరగాలంటే కాలినడకను ఆశ్రయించాలి. నడిచే ఓపిక లేకుంటే రిక్షాలపై ప్రయాణించవచ్చు. మరో విశేషమేమిటంటే ఇక్కడ గుర్రాలను అద్దెకిస్తారు. ఆసక్తి ఉన్న వారు గుర్రాలపై సవారీ చేస్తూ వీధులన్నీ చుట్టి రావచ్చు. * షార్లెట్ సరస్సు, లూయిసా పాయింట్, హనీమూన్ పాయింట్, ఎకో పాయింట్, కింగ్ జార్జి పాయింట్ తదితర వ్యూ పాయింట్ల వద్ద సరదాగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. * అంబర్నాథ్ ఆలయం, పిశర్నాథ్ మహాదేవ మందిరం వంటి పురాతన ఆలయాలతో పాటు కొండ శిఖరంపై నిర్మించిన ప్రబాల్ కోటను సందర్శించవచ్చు. * ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడ అడుగడుగునా తారసపడే కొండలపైకి, లోయల్లోకి దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల అడవుల్లో వనవిహారాలు చేయవచ్చు. ఏం కొనాలి? * చిన్న పట్టణం కావడంతో మాథేరాన్‌లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఏవీ ఉండవు. అయితే, మెయిన్ రోడ్డులో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే చిన్న చిన్న దుకాణాల్లో షాపింగ్ చేసుకోవచ్చు. * ఈ దుకాణాల్లో తోలు వస్తువులు, టోపీలు, షూస్, స్థానిక కళాకారులు పేము, ఎండిన పూలు వంటి వాటితో రూపొందించిన హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే మిఠాయి ‘చిక్కీ’ రుచిని ఆస్వాదించేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కొనుక్కుని తీసుకువెళతారు. * ఇక్కడి దుకాణాల్లో తేనె, వనమూలికలు, గాజు బొమ్మలు వంటివి కూడా చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు ముంబై విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి మాథేరాన్‌కు సమీపంలోని నేరల్ వరకు రైలులో రావచ్చు. * నేరల్ నుంచి మాథేరాన్‌కు టాయ్ ట్రెయిన్ అందుబాటులో ఉంటుంది. చాలా తాపీగా సాగే ఈ రైలు ప్రయాణాన్ని అడుగడుగునా ఆస్వాదించవచ్చు. * ఒకవేళ ముంబై మీదుగా రోడ్డుమార్గంలో రావాలనుకున్నా నేరల్ వరకు మాత్రమే బస్సులు లేదా ట్యాక్సీల్లో వచ్చి, అక్కడి నుంచి టాయ్ ట్రెయిన్ ద్వారా మాత్రమే మాథేరాన్‌కు రావాల్సి ఉంటుంది. * పుణే, ఔరంగాబాద్‌ల నుంచి కూడా నేరల్ వరకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. -
వారెవ్వా... వాయనాడ్
టూర్‌దర్శన్ ప్రకృతి అందాలకు నెలవైన కేరళ రాష్ట్రానికి ‘దేవుడి సొంత రాజ్యం’ అనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రాజ్యం అన్నాక రాజధాని ఉండాలి కదా! రాజకీయంగా చెప్పుకుంటే కేరళకు తిరువనంతపురమే రాజధాని కావచ్చు కాని, ‘దేవుని సొంత రాజ్యానికి’ రాజధాని ఏది? అంటే వాయనాడ్ పేరునే చెప్పుకోవాలి. పడమటి కనుమల్లో ఉన్న వాయనాడ్ జిల్లాలో ప్రకృతి అందాలన్నీ రాశి పోసినట్లుగా కనువిందు చేస్తాయి. వాయనాడ్ అడవుల్లో సంచరించే అరుదైన వన్యప్రాణులు, విహంగాలు సరేసరి! వీటన్నింటినీ ఒక్కసారి చూస్తే చాలు... ‘వారెవ్వా... వాయనాడ్’ అనక తప్పదు. ఏం చూడాలి? వాయనాడ్‌లో చూసి తీరాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. కొత్త రాతియుగం నుంచే ఇక్కడ జనావాసాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు తమ వాణిజ్య అవసరాల కోసం వాయనాడ్ కొండలపై రోడ్లు వేయడంతో ఇక్కడకు పర్యాటకుల రాకపోకలకు మార్గం సుగమమైంది. * పడమటి కనుమల్లో అడుగడుగునా కనిపించే జలపాతాలు వాయనాడ్‌లోనూ కనిపిస్తాయి. సూచిపరా, మీన్ముట్టి, కాంతన్‌పరా, చెతాలయం వంటి జలపాతాల సొగసులను చూసి తీరాల్సిందే. వానాకాలంలో ఇవి మరింత ఉధృతంగా ఉరకలేస్తూ సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఇక పాపనాశిని, పంచతీర్థ వంటి పుష్కరిణులు, సరోవరాలు కూడా ఇక్కడ చూడాల్సినవే. * వాయనాడ్ కొండలపై ఉన్న లక్కిడి వ్యూపాయింట్, నీలిమల వ్యూపాయింట్ నుంచి చూస్తే కొండలు, లోయలు, పచ్చని అడవుల అందాలు కనివిందు చేస్తాయి. ఈ ప్రదేశాల నుంచి ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. * వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో వనవిహారం మరపురాని అనుభూతినిస్తుంది. ఈ అభయారణ్యంలో ఎక్కడ చూసినా ఏనుగులు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. జింకలు, దుప్పులు, కుందేళ్లు, పులులు ఇక్కడ యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు కేరళ అటవీ శాఖ ఏనుగులపై సవారీ అవకాశం కూడా కల్పిస్తోంది. * బ్రహ్మగిరి కొండలపై కీకారణ్యంలో ఉన్న పక్షిపాతాళం పక్షుల అభయారణ్యంలో పక్షులను తిలకించడం వింత అనుభూతినిస్తుంది. నెమళ్లు, రకరకాల కొంగలు, మైనాలు, పిచ్చుకలు వంటి పక్షుల కిలకిలరావాలు పర్యాటకులను ఆహ్లాదపరుస్తాయి. * వాయనాడ్ జిల్లాలో పురాతనమైన ఎడక్కల్ గుహలలోని కుడ్యచిత్రాలు క్రీస్తుపూర్వం 6 వేల సంవత్సరాల నాటివని చెబుతారు. ఈ గుహలను తిలకించడంతో పాటు చీన్‌గిరిమల, చెంబ్రా వంటి శిఖరాలను అధిరోహించేందుకు పర్వతారోహకులు ఉబలాటపడతారు. * తిరునెల్లిలోని ప్రాచీన విష్ణుభగవానుడి ఆలయం, కాల్పెట్టలోని వారంబెట్ట మసీదు వంటి పురాతన కట్టడాలు కూడా ఇక్కడ చూసి తీరాల్సినవే. ఏం చేయాలి? * పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవారికి ఇక్కడి కొండలు, గుట్టలు చాలా అనువుగా ఉంటాయి. కొండలపెకైక్కి దిగువ కనిపించే లోయలను, అడవులను తిలకించడం మరపురాని అనుభూతినిస్తుంది. * జలపాతాల ఒడ్డున పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ఉధృతి తక్కువగా ఉన్న జలపాతాల దిగువన జలకాలాటల్లో సేదదీరవచ్చు. * వాయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఏనుగులపై ఊరేగవచ్చు. పక్షిపాతాళంలోని పక్షుల అభయారణ్యంలో పక్షుల కిలకిలలను ఆలకిస్తూ తన్మయత్వం చెందవచ్చు. పక్షిపాతాళంలోని పురాతన గుహలను కూడా సందర్శించవచ్చు. * వాహనాల రొదలేని వాయనాడ్ రోడ్లపై వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలతో ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలక్షేపం చేయవచ్చు. ఏం కొనాలి? * వాయనాడ్ జిల్లాలో పలుచోట్ల చిన్న చిన్న దుకాణాలతో పాటు అధునాతనమైన షాపింగ్ మాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కొబ్బరిచిప్పలతో స్థానిక కళాకారులు రూపొందించిన సంప్రదాయ కళాకృతులు ఇక్కడి దుకాణాల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇవి సరసమైన ధరల్లోనే దొరుకుతాయి. * ఏనుగు దంతాలు, పేము, వెదురు, కలపతో తయారు చేసిన కళాకృతులు, చైనా సిరామిక్ వస్తువులు కూడా ఇక్కడి దుకాణాల్లో విరివిగా దొరుకుతాయి. * వాయనాడ్ కాఫీ గింజలు, కాఫీ పొడి, మున్నార్ తేయాకుతో పాటు ఇక్కడి అడవుల్లో విరివిగా పండే యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలు వంటివి తక్కువ ధరల్లోనే దొరుకుతాయి. * స్వచ్ఛమైన తేనె, కరక్కాయలు, వనమూలికలు, ఇక్కడి అడవుల్లో పండే పండ్లు చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * దూరప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు. * వాయనాడ్ జిల్లా కేంద్రం కాల్పెట్టకు సమీపంలోని రైల్వేస్టేషన్ కూడా కోజికోడ్‌లోనే ఉంది. కోజికోడ్ నుంచి 72 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి కాల్పెట్ట చేరుకోవాల్సి ఉంటుంది. * కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్‌ల మీదుగా బస్సులు లేదా ట్యాక్సీల్లో వాయనాడ్ జిల్లాకు చేరుకోవచ్చు. -
మాన్సూన్ స్పాట్
మాల్షేజ్ ఘాట్ : టూర్‌దర్శన్ పడమటి కనుమల మిట్టపల్లాలు నిండిన కొండలు, గుట్టలు... కొండల మీదుగా వడివడిగా దూకే జలపాతాలు... కొండల మీద కట్టిన పురాతన కోటలు... కొండలెక్కి చూస్తే కనుచూపు మేరలో అంతా ఆకుపచ్చని లోకంగా కనిపించే దట్టమైన అడవులు... అడవుల్లో స్వేచ్ఛగా సంచరించే అరుదైన పక్షులు, వన్యమృగాలకు ఆలవాలం మాల్షేజ్ ఘాట్... ప్రకృతి సౌందర్యానికి ఇది కేరాఫ్ అడ్రస్. చాలా పర్యాటక ప్రదేశాలు వేసవిలో లేదా శీతాకాలంలో మాత్రమే పర్యటనలకు అనుకూలంగా ఉంటాయి. వానాకాలంలో సైతం పర్యాటకులకు అనుకూలంగా ఉండటం మాల్షేజ్ ఘాట్ విశేషం. ఏం చూడాలి? మహారాష్ట్రలోని మాల్షేజ్ ఘాట్‌లో కొండలు కోనల అందాలను చూసి తీరాల్సిందే. కొండల మీదుగా దూకే జలపాతాల సవ్వడిని, ఇక్కడ సంచరించే అరుదైన విహంగాల కిలకిలరావాలను ఆలకించాల్సిందే. ప్రకృతి సౌందర్యానికే కాదు, చారిత్రక నేపథ్యానికీ, పౌరాణిక ప్రాశస్త్యానికీ కూడా ఆలవాలమైన మాల్షేజ్ ఘాట్‌లో తప్పనిసరిగా చూడాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి. ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన శివనేరి కోట మాల్షేజ్ ఘాట్‌లోనే పుణే జిల్లాలోని జున్నార్ సమీపంలో ఉంది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దిలో ఈ ప్రదేశం బౌద్ధుల అధీనంలో ఉండేది. ఇక్కడి రాతి గుహల్లోని రాతి నిర్మాణాలు, శిల్పకళా చాతుర్యం బౌద్ధుల వైభవానికి అద్దం పడుతుంది. కోట లోపల శివాయిదేవి ఆలయం ఉంది. ఈ దేవత పేరిటే జిజియాబాయి తన తనయుడికి శివాజీ అనే పేరు పెట్టారట! అహ్మద్‌నగర్ జిల్లాలోని కొథాలే గ్రామంలో ఉన్న హరిశ్చంద్రగడ్ మరో పురాతనమైన కోట. పలు పురాణాల్లో ప్రస్తావించిన ఈ కోట క్రీస్తుశకం ఆరో శతాబ్దికి చెందనదని భావిస్తారు. కొండపై నిర్మించిన ఈ రాతి కోటలో సప్తతీర్థ పుష్కరిణి, ఈ పుష్కరిణి ఒడ్డునే విష్ణువాలయం ఉంటాయి. హరిశ్చంద్రేశ్వరాలయం, దానికి చేరువలోనే కేదారేశ్వర ఆలయంలోని భారీ శివలింగం సందర్శకులను ఆకట్టుకుంటాయి. మాల్షేజ్ ఘాట్ మీదుగా ఉరకలు వేసే మాల్షేజ్ జలపాతం వంటి ఉధృత జలపాతాలతో పాటు పలు చిన్నా పెద్దా జలపాతాలు కనువిందు చేస్తాయి. ఎత్తై కొండ మీదుగా సన్నని ధారలా కురిసే చిన్న చిన్న జలపాతాల దిగువన పర్యాటకులు స్నానాలు కూడా చేస్తుంటారు. పింపల్గావ్ వద్ద పుష్పావతి నదిపై నిర్మించిన జోగా డ్యామ్ వద్దకు వచ్చే వలసపక్షుల సందడిని ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. ఇక్కడకు సైబీరియా నుంచి పెలికాన్ కొంగలతో పాటు పలు అరుదైన విదేశీ పక్షులు వస్తుంటాయి. మాల్షేజ్ ఘాట్ కొండలపైనే నిర్మించిన అజోబా కోటకు పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది. ఆదికవి వాల్మీకి ఈ ప్రదేశంలోనే తపస్సు చేసుకున్నాడని ప్రతీతి. ఈ కోటలో వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి సమాధి సందర్శకులను ఆకట్టుకుంటాయి. మాల్షేజ్ ఘాట్ కొండలు సముద్ర మట్టానికి దాదాపు 700 మీటర్ల ఎత్తున ఉండటంతో వేసవిలో సైతం ఇక్కడ వాతావరణం చల్లగానే ఉంటుంది. అయితే వర్షాకాలంలో ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇక్కడకు పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలోనే ఇక్కడకు వలస పక్షుల రాక మొదలవుతుంది. ఏం చేయాలి? * మాల్షేజ్ ఘాట్ కొండలు పర్వతారోహణపై ఆసక్తిగల ఔత్సాహిక ట్రెక్కర్లకు అనుకూలంగా ఉంటాయి. అడుగడుగునా తారసపడే శిఖరాలపైకి ఎక్కి చూస్తే పచ్చదనంతో నిండిన పరిసరాలు కనువిందు చేస్తాయి. * ఇక్కడి వాల్మీకి ఆశ్రమం, హరిశ్చంద్రేశ్వరాలయం, కేదారేశ్వర ఆలయం, విష్ణు మందిరం వంటి పురాతన దేవాలయాలు ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆకట్టుకుంటాయి. చరిత్ర, పురాతత్వ పరిశోధనలపై మక్కువ గలవారు ఇక్కడి కోటలను, వాటిలోని విశేషాలను చూసి తీరాల్సిందే. * ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారు ఇక్కడి జలపాతాల ఒడ్డున లేదా జోగా డ్యామ్ వద్ద పిక్నిక్లు చేసుకోవచ్చు. ఇక్కడ సంచరించే వన్యప్రాణులను, సీజన్లో వచ్చే వలసపక్షులను తిలకించవచ్చు. స్వేచ్ఛగా వన విహారాలు చేయవచ్చు. ఏం కొనాలి? * కొండలు, కోనలతో నిండిన మాల్షేజ్ ఘాట్‌లో అక్కడక్కడా చిన్న గ్రామాలు తప్ప షాపింగ్ చేయడానికి అనువైన బజారులేవీ ఉండవు. * ఘాట్‌పై సాగే ప్రయాణంలో తోవలో అక్కడక్కడా దొరికే మల్బరీ పండ్లు, సీతాఫలాలు వంటివి కొనుక్కోవచ్చు. * కరక్కాయలు, వనమూలికలు, తేనె వంటివి కూడా ఇక్కడి గిరిజనుల వద్ద చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు ముంబై, లేదా పుణే చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మాల్షేజ్ ఘాట్ చేరుకోవచ్చు. ముంబై నుంచి అయితే 154 కిలోమీటర్లు, పుణే నుంచి అయితే 130 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. * ఇక్కడకు సమీప రైల్వేస్టేషన్ కల్యాణ్‌లో ఉంది. కల్యాణ్ నుంచి మాల్షేజ్ ఘాట్‌కు బస్సులు, ట్యాక్సీలు విరివిగా దొరుకుతాయి. కల్యాణ్ నుంచి మాల్షేజ్ ఘాట్‌కు 84 కిలోమీటర్ల దూరం ఉంటుంది. -
థ్రిల్లింగ్ షిల్లాంగ్...
టూర్‌దర్శన్ - షిల్లాంగ్ వెండిమబ్బులను తాకే కొండల తీరు... కొండల మీదుగా జోరుగా దూకే జలపాతాల హోరు... పచ్చని పరిసరాల్లోంచి తలపెకైత్తి చూస్తే నింగీ నేలా కలుసుకున్నాయా అనిపించే ప్రకృతి వర్ణవైవిధ్యం... బాతులు ఈదులాడే కొలనులు, కొంగలు వాలే సరస్సులు సరేసరి... సముద్ర మట్టానికి దాదాపు ఐదువేల అడుగుల ఎత్తున వెలసిన పట్టణం షిల్లాంగ్... పట్టణానికి చుట్టూ దట్టమైన అరణ్యం... ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి సేదదీరాలనుకునే పర్యాటకులకు ఇది సాక్షాత్తు స్వర్గధామాన్నే తలపిస్తుంది. అస్సాం నుంచి మేఘాలయ 1972లో విడిపోయేంత వరకు షిల్లాంగ్ అస్సాం రాజధానిగా ఉండేది. ఇక్కడి చల్లని వాతావరణానికి, చూడచక్కని ప్రకృతి అందాలకు ముగ్ధులైన బ్రిటిష్ పాలకులు ఇక్కడ తరచుగా విడిది చేసేవారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఇక్కడ ఒక వేసవి విడిది గృహాన్ని నిర్మించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత సుందర నగరంగా పేరుపొందిన షిల్లాంగ్, నేటికీ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. ఏం చూడాలి? చిన్న పట్టణమే అయినా షిల్లాంగ్‌లో చూసి తీరాల్సిన ప్రదేశాలు, విశేషాలు చాలానే ఉన్నాయి. షిల్లాంగ్ శిఖరం పైనుంచి పరిసరాల పచ్చదనాన్ని తిలకించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే షిల్లాంగ్ పట్టణం, పరిసర ప్రాంతాలు చక్కగా కనిపిస్తాయి. తూర్పు ఖాసీ కొండలపై వెలసిన షిల్లాంగ్ పరిసరాల్లో ఎక్కడికక్కడ జలపాతాలు కనిపిస్తాయి. వీటిలో ఎలిఫెంట్ జలపాతం, స్ప్రెడ్ ఈగల్ జలపాతం, స్వీట్ జలపాతం, క్రినోలిన్ జలపాతాల వద్దకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఉరకలేసే ఈ జలపాతాల సొగసును చూసి తీరాల్సిందే. ఈశాన్య సంస్కృతికి ఆలవాలమైన షిల్లాంగ్‌లో తప్పనిసరిగా చూడాల్సినవి మ్యూజియమ్స్. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కాంప్లెక్స్‌లోని కెప్టెన్ విలియమ్సన్ సంగ్మా స్టేట్ మ్యూజియం, డాన్‌బాస్కో ఆదిమ సంస్కృతుల మ్యూజియంలలో ఈశాన్య సంస్కృతికి సంబంధించిన రకరకాల పురాతన వస్తువులను చూడవచ్చు. ఎంటమాలజీ మ్యూజియంలో రంగురంగుల సీతాకోకలు, అరుదైన కీటకాలను తిలకించవచ్చు. లేడీ హైదరీ పార్కు నందనవనాన్నే తలపిస్తుంది. ఈ పార్కులోనే ఉన్న ఫారెస్ట్ మ్యూజియంలో అటవీ సంపదకు సంబంధించిన అరుదైన వస్తువులను తిలకించవచ్చు. ఎగువ షిల్లాంగ్‌లో ఎయిర్‌ఫోర్స్ మ్యూజియం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడి వార్డ్స్ లేక్, ఉమియమ్ లేక్ వంటి సుందర సరోవరాలు బాతులు, కొంగలు వంటి పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఈ సరస్సుల్లో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు ఇష్టపడతారు. ఇక్కడి పురాతన మహాదేవ్ ఖోలా ధామ్ శైవక్షేత్రం, కేథలిక్ కెథడ్రల్, ఆల్ సెయింట్స్ చర్చి వంటివి ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆకట్టుకుంటాయి. ఇక క్రిసాలిస్ ఆర్ట్ గ్యాలరీని కళాభిమానులు చూసి తీరాల్సిందే. ఏం చేయాలి? జనసమ్మర్దం తక్కువగా ఉండే షిల్లాంగ్ వీధుల్లో జాలీగా షికారు చేస్తూ, షాపింగ్ చేయవచ్చు. షిల్లాంగ్ పీక్ పెకైక్కి ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. ఉరకలేసే జలపాతాల వద్ద ఉత్సాహంగా, ఉల్లాసంగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారు కొండలు, గుట్టలు ఎక్కవచ్చు. సరస్సుల్లో బోటు షికార్లు చేయవచ్చు. ఈశాన్య సంస్కృతి, ఇక్కడి ఆదిమ తెగలు, అరుదైన జీవజాతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఇక్కడి మ్యూజియమ్స్ను చూసి తీరాల్సిందే. షిల్లాంగ్ శివార్లలోనే దట్టంగా విస్తరించి ఉన్న మాఫ్లాంగ్ అరణ్యంలో వనవిహారం చేయవచ్చు. ఈ అరణ్యాన్ని ‘సేక్రెడ్ ఫారెస్ట్’ (పవిత్రారణ్యం) అంటారు. ఎలా చేరుకోవాలి? షిల్లాంగ్‌కు వెలుపల ఉన్న ఉమ్రాయ్లో విమానాశ్రయం ఉంది. అయితే, కోల్‌కతా నుంచి మాత్రమే ఇక్కడకు విమానాల రాకపోకలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోల్‌కతాలో మరో విమానం ద్వారా ఇక్కడకు రావచ్చు. విమానాశ్రయం నుంచి షిల్లాంగ్ పట్టణానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వచ్చేవారు గువాహటి రైల్వేస్టేషన్లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో షిల్లాంగ్ చేరుకోవాల్సి ఉంటుంది. గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బస్సులు, ట్యాక్సీలు విరివిగా అందుబాటులో ఉంటాయి. ఏం కొనాలి? ఇక్కడి అడవుల్లో విస్తారంగా దొరికే స్థానిక కళాకారులు రూపొందించిన వెదురు అలంకరణ వస్తువులు, బుట్టలు, పూలసజ్జలు, వెదురు కర్టెన్లు వంటివి కొనుక్కోవచ్చు. నాగా, మణిపురి నేతగాళ్లు నేసిన ఊలు దుప్పట్లు, శాలువలు, తేలికపాటి ఊలుతో ప్రత్యేకంగా నేసిన మణిపురి లుంగీలు, షర్టులు కొనుక్కోవచ్చు. బడాబజార్ అని ఇక్కడి స్థానికులు పిలుచుకునే ల్యూడహ్ మార్కెట్లో పండ్లు, కూరగాయలు, చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. ఈ బజారులోని దుకాణదారులందరూ మహిళలే కావడం విశేషం. పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు ఇక్కడ బజార్లలో చౌకగా దొరుకుతాయి. ఇక్కడ మాత్రమే దొరికే ‘ఖాసీ స్క్రబ్’ను కొని తీరాల్సిందే. పాత్రలు తదితరమైన వాటిని శుభ్రం చేసుకునేందుకు వాడవచ్చు. చాలా పెద్ద సైజులో దొరికే ఈ స్క్రబ్‌ను కావలసిన రీతిలో ముక్కలుగా కత్తిరించుకుని వాడుకోవచ్చు. -
కళింగ కశ్మీర్
టూర్‌దర్శన్ - దారింగిబాడి నింగిని తాకే కొండలు... కొండల దిగువన ఆకుపచ్చని లోయలు... కొండలను ముద్దాడుతున్నాయా అనిపించే నీలిమబ్బులు... కొండల మీదుగా ఉరకలేస్తూ జాలువారే జలపాతాలు... కనుచూపు మేరలో కనిపించే పచ్చని కాఫీ తోటలు, మిరియాల తోటలు... పక్షుల కిలకిలలు తప్ప వాహనాల రణగొణలు వినిపించని ప్రశాంత వాతావరణం... వేసవిలోనూ చెమటలు పట్టనివ్వని చల్లని వాతావరణం... ఇటీవలి కాలం వరకు పెద్దగా ప్రాచుర్యంలోకి రాని అద్భుత ప్రదేశం దారింగిబాడి. ఒడిశా రాష్ట్రంలో వెనుకబడిన కొంధొమాల్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామం దారింగిబాడి. సముద్ర మట్టానికి దాదాపు 3 వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రదేశం వేసవిలోనూ చల్లగా ఉంటుంది. శీతాకాలం ఇక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతాయి. కొండలన్నీ మంచుతో కప్పబడి కనిపిస్తాయి. అందుకే ‘కశ్మీర్ ఆఫ్ ఒడిశా’గా పేరుపొందింది. దారింగిబాడి ఉన్న కొంధొమాల్ ప్రాంతం చాలాకాలం వరకు ఆటవికుల రాజ్యంగానే ఉండేది. క్రీస్తుశకం నాలుగో దశాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏ రాజులూ జయించిన దాఖలాల్లేవు. క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో సముద్రగుప్తుడు కోసలకు దక్షిణాన ఉన్న కొంధొమాల్ ప్రాంతం మీదుగా దక్షిణాపథానికి జైత్రయాత్ర సాగించాడని చెబుతారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో ఈ ప్రాంతం ఘుముసుర రాజ్యాన్ని పాలించిన భంజ వంశీయుల అధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతిలోకి వచ్చింది. ఏం చూడాలి? * దారింగిబాడిలో పచ్చదనం నిండిన కొండలు, లోయల అందాలను చూసి తీరాల్సిందే. ఇక్కడి కొండలలో రుషికుల్యా నది మొదలైన ప్రదేశం, పుతుడి, పకడాఝర్ జలపాతాలతో పాటు ఊరికి చేరువలోనే జలకళ ఉట్టిపడే డోలూరి నది ప్రవాహ మార్గంలో పలుచోట్ల కనిపించే జలపాతాలు కనువిందు చేస్తాయి. * దారింగిబాడి పరిసరాల్లో విరివిగా కనిపించే కాఫీ తోటలు, మిరియాల తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. * దారింగిబాడి కొండలపైన హిల్‌వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని చూస్తే, దారింగిబాడి ఊరితో పాటు కనుచూపు మేరలోని పరిసరాలన్నీ పచ్చదనంతో అలరారుతూ నయనానందం కలిగిస్తాయి. * ఇక్కడకు చేరువలోనే చకాపడాలోని ప్రాచీన విరూపాక్ష దేవాలయం, బాలాస్కుంపాలోని బరలాదేవి ఆలయం ప్రశాంత వాతావరణంతో సందర్శకులను ఆకట్టుకుంటాయి. * దారింగిబాడికి చేరువలోని బేల్గఢ్ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన పక్షులు, వన్యప్రాణులు, వృక్షసంపద కనువిందు చేస్తాయి. దాదాపు 16 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన ఈ అభయారణ్యంలోనే ఆదిమ తెగకు చెందిన డోగ్రియా కొంధొలు నివసిస్తూ ఉంటారు. ఏం కొనాలి? * ఇక్కడి తోటల్లో విస్తారంగా పండే శ్రేష్టమైన కాఫీ గింజలను, మిరియాలను చౌకగా కొనుక్కోవచ్చు. * పసుపు సాగుకు కొంధొమాల్ జిల్లా పెట్టింది పేరు. ఇక్కడి పసుపు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక్కడ నాణ్యమైన పసుపు కొమ్ములను కొనుక్కోవచ్చు. * ఇక్కడ విరివిగా పండే అల్లం, వెల్లుల్లి, ఆవాలు వంటివి కూడా చాలా చౌకగా దొరుకుతాయి. * స్థానిక గిరిజనులు సేకరించే స్వచ్ఛమైన తేనె, వనమూలికలు, ఇతర అటవీ ఉత్పత్తులు కూడా ఇక్కడ చాలా చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * విమాన మార్గంలో వచ్చేవారు ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే దారింగిబాడికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. * కొంధొమాల్ జిల్లాలో ఇప్పటికీ కనీసం రైల్వేస్టేషన్ కూడా లేదు. రైళ్లలో వచ్చేవారు బరంపురం రైల్వేస్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో దారింగిబాడికి చేరుకోవాల్సి ఉంటుంది. * బరంపురం నుంచి సురడా మీదుగా లేదా మోహనా, బ్రాహ్మణిగావ్ల మీదుగా లేదా భంజనగర్, జి.ఉదయగిరిల మీదుగా దారింగిబాడి చేరుకోవచ్చు. -
అబ్బో... అబ్బబ్బో అబూ...
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - మౌంట్ అబు ఎడారి రాష్ట్రంలో ఎత్తయిన కొండలతో నిండిన ప్రదేశం... పక్షుల కిలకిలలతో కనువిందు చేసే పచ్చని అడవులు... ఉరకలేసే జలపాతాలు... ప్రశాంతమైన సరోవరాలు... గత వైభవాన్ని చాటి చెప్పే కోట గోడలు.. కొండలపై వెలసిన పురాతన ఆలయాలు... వీటన్నింటినీ తనివితీరా చూసి ఆనందించాలంటే రాజస్థాన్‌లోని మౌంట్ అబు వెళ్లాల్సిందే! రాజస్థాన్‌లోని ఏకైక వేసవి విడిది మౌంట్ అబు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో గుజరాత్ సరిహద్దులకు చేరువలో ఆరావళి పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ పట్టణం. దీనికి చుట్టుపక్కల విస్తరించి ఉన్న దట్టమైన అడవిని పురాణాలు అర్బుదారణ్యంగా పేర్కొన్నాయి. నాటి కాలంలో ‘మౌంట్ అబు’ను అర్బుదాచలం అనేవారు. విశ్వామిత్రుడితో విభేదించిన వశిష్టుడు అర్బుదాచలంపై యజ్ఞం చేసినట్లు ప్రతీతి. ఇదేచోట అర్బుదమనే సర్పం శివుడి వాహనమైన నందిని రక్షించడం వల్ల ఈ పర్వతానికి అర్బుదాచలమనే పేరు వచ్చిందని, దీని చుట్టూ విస్తరించిన అరణ్యానికి అర్బుదారణ్యమనే పేరు వచ్చిందని కూడా మరో గాథ ఉంది. ఇక చారిత్రిక నేపథ్యాన్ని గురించి చెప్పుకుంటే, మొఘల్ పాలనకు ముందు ఈ ప్రాంతాన్ని ఎక్కువ కాలం గుర్జరులు, రాజపుత్రులు పాలించారు. ఏం చూడాలి? మౌంట్ అబులో అడుగడుగునా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాల్లో వేసవి తాకిడి భరించలేనంతగా ఉన్నా, మౌంట్ అబులో వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. మౌంట్ అబు పట్టణంలోను, పరిసరాల్లోనూ పలు చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు చూసి తీరాల్సినవే. * మేవార్ రాజు రాణా కుంభ 14వ శతాబ్దంలో నిర్మించిన అచలగఢ్ కోట శిథిలావస్థకు చేరుకున్నా, నాటి చారిత్రక వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ కట్టడం నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. * అచలగఢ్ కోట సమీపంలోని నక్కీ సరస్సులో ఈదులాడే బాతులను చూస్తూ బోటింగ్ చేయడం ఒక వింత అనుభూతి. ఈ సరస్సుకు సమీపంలోనే కప్ప ఆకారంలో ఉండే సహజమైన భారీ కొండరాతి వద్ద ఫొటోలు దిగుతుంటారు. * మౌంట్ అబు పరిసరాల్లో ధ్రుధియా జలపాతం, గోముఖ జలపాతం వంటి పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. జలపాతాల వద్దకు పర్యాటకులు పిక్నిక్లకు వస్తుంటారు. * అచలగఢ్ కోటకు అతి చేరువలోనే ఉన్న శైవక్షేత్రమైన అచలేశ్వర ఆలయానికి దూరప్రాంతాల భక్తులు కూడా వస్తూ ఉంటారు. స్థానికులు ‘అధర్‌దేవి’గా పిలుచుకునే అర్బుదాదేవి ఆలయం, గురుశిఖర్ పర్వత శిఖరంపై వెలసిన దత్తాత్రేయ ఆలయం, రఘునాథ ఆలయం, కాంతినాథ్ ఆలయం వంటి పురాతన హిందూ ఆలయాలతో పాటు 11-13 శతాబ్దాల మధ్య నిర్మించిన విమల్ వశాహీ ఆలయం, దిల్వారా ఆలయం వంటి పలు జైన ఆలయాల్లోని శిల్పసౌందర్యం చూసి తీరాల్సిందే. * మౌంట్ అబు చుట్టూ 290 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ప్రభుత్వం 1960లో మౌంట్ అబు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో చాలా రకాల అరుదైన పక్షులు, జింకలు, దుప్పులు, పులులు, చిరుతలు, సింహాలు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఇందులో సఫారీ గొప్ప అనుభూతినిస్తుంది. ఏం చేయాలి? * ఔత్సాహిక పర్వతారోహకులకు మౌంట్ అబులోని పర్వతశిఖరాలు సవాలుగా నిలుస్తాయి. ఆరావళి పర్వతశ్రేణుల్లోని అతి ఎత్తయిన శిఖరం ‘గురుశిఖర్’ పైనుంచి తిలకిస్తే మౌంట్ అబు అందాలు అబ్బురపరుస్తాయి. * మౌంట్ అబు పరిసరాల్లో జలపాతాలు గల అటవీ ప్రాంతాలు పిక్నిక్లకు అనువుగా ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రికులకు ఇక్కడి ప్రాచీన ఆలయాలు ఆనందానుభూతిని కలిగిస్తాయి. * బ్రహ్మకుమారీల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం ఇక్కడే ఉంది. ఆధ్యాత్మిక చింతన గల పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఏం కొనాలి? * రాజస్థానీ సంప్రదాయ హస్తకళా వస్తువులు ఇక్కడ విరివిగా దొరుకుతాయి. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో వీటిని తక్కువ ధరలకే కొనుక్కోవచ్చు. * నాణ్యమైన ఖద్దరు వస్త్రాలు, రాజస్థానీ చేనేత వస్త్రాలు, తేలికగా ఉండే దుప్పట్లు, రజాయిలు వంటివి కొనుక్కోవచ్చు. * లెదర్ బెల్టులు, హ్యాండ్‌బ్యాగ్స్, జాకెట్స్, రాజస్థానీ పెయింటింగ్స్ ఇక్కడి బజారులో తక్కువ ధరలకే దొరుకుతాయి. * ఇక్కడి రెస్టారెంట్లు, రోడ్డు పక్క ధాబాల్లో దొరికే రాజస్థానీ సంప్రదాయక వంటకాలను ఆస్వాదించవచ్చు. మీగడ నిండుగా వేసి తయారుచేసే ‘మఖానియా లస్సీ’, గోధుమపిండితో తయారు చేసే మిఠాయి ‘ఘెవార్’ వంటివి భోజనప్రియులకు మంచి అనుభూతినిస్తాయి. ఎలా చేరుకోవాలి? * ఇతర ప్రాంతాల వారు గుజరాత్ మీదుగా ఇక్కడకు చేరుకోవడం తేలిక. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి అబు రోడ్‌కు రైలు ద్వారా చేరుకోవచ్చు. * న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, ముంబై వంటి నగరాల నుంచి అబు రోడ్ వరకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉంటాయి. * అబు రోడ్ రైల్వేస్టేషన్ నుంచి మౌంట్ అబు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అబు రోడ్ నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. -
పాండవులు పాండవులు పచ్‌మఢీ
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పచ్‌మఢీ నలువైపులా విస్తరించిన ఎత్తయిన కొండలు... కొండల నడుమ లోతైన లోయలు... దట్టమైన అడవులు... అడవుల్లో యథేచ్ఛగా సంచరించే వన్యప్రాణాలు... కొండల పైనుంచి ఉధృత వేగంతో నేలపైకి ఉరకలు వేసే జలపాతాలు... సహజ సరోవరాలు... కొండ గుహలలో ప్రాచీన మానవులు చిత్రించిన చిత్రాలు... ఎటు చూసినా ప్రకృతి గీసిన సజీవ చిత్రాల్లాంటి దృశ్యాలను ఒకే చోట చూసి ఆనందించాలని ఉందా..? అయితే పదండి పచ్‌మఢీకి. ఏం చూడాలి? దేశానికి నడిబొడ్డున సత్పురా పర్వతాల నడుమ వెలసిన అద్భుత ప్రదేశం పచ్‌మఢీ. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. బ్రిటిష్ కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉండేది. పచ్‌మఢీకి ఈ పేరు ‘పాంచ్’ (ఐదు), ‘మఢీ’ (గుహలు) అనే అర్థంలో వచ్చిందని చెబుతారు. ‘పాంచ్మఢీ’ కాలక్రమంలో పచ్‌మఢీగా మారిందని అంటారు. సముద్రమట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న పచ్‌మఢీ వాతావరణం వేసవిలోనూ చల్లగానే ఉంటుంది. వేసవిలో జూన్ నెలాఖరు వరకు ఈ ప్రాంతంలోని వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పంచ పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడి ఐదు గుహలలో ఉండేవారని ప్రతీతి. ఇక్కడి జలపాతాల దిగువన ఏర్పడిన కొలనును ‘ద్రౌపదీ కుండం/పాంచాలీ కుండం’ అంటారు. మహాభారత గాథతో ముడిపడిన ఈ ప్రదేశాలను పచ్‌మఢీకి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు. సత్పురా పర్వతశ్రేణుల్లోనే అత్యంత ఎత్తయిన శిఖరం ‘ధూప్‌గఢ్’ ఇక్కడే ఉంది. ఈ శిఖరం పైనుంచి చూస్తే పచ్‌మఢీ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, లోయలు కనువిందు చేస్తాయి. పర్వతారోహణపై మక్కువ గలవారిని ఈ శిఖరం ఎంతో ఆకట్టుకుంటుంది. సత్పురా పర్వతశ్రేణుల్లో ఎక్కడికక్కడ కనిపించే జలపాతాలు పచ్‌మఢీలోనూ చాలానే కనిపిస్తాయి. పచ్‌మఢీ కొండల మీదుగా దూకే బీ, డచెస్, రజత్ ప్రపాత్, అప్సరా జలపాతాల అందాలను చూసి తీరాల్సిందే. వేసవిలో ఈ జలపాతాల వద్ద పర్యాటకులు జలకాలాడటానికి ఇష్టపడతారు. ధూప్‌గఢ్ శిఖరానికి దిగువన చేరిన జలపాతాల నీటితో సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సు బోటింగ్‌కు అనువుగా ఉంటుంది. ఈ సరస్సులో పడవ ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. పచ్‌మఢీ చుట్టూ విస్తరించుకున్న సత్పురా జాతీయ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, మొక్కలు, లతలు, వన్యప్రాణులు కనిపిస్తాయి. ‘ఇండియన్ జెయింట్ స్క్విర్రల్’గా పిలుచుకునే భారీ ఉడుతలు, పులులు, చిరుతలు, జింకలు, దుప్పులు, కణుజులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఈ అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ అడవిలో పాములు కూడా విరివిగానే కనిపిస్తాయి. సత్పురా అభయారణ్యంలో సఫారీ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. పురాతన నేపథ్యం గల పచ్‌మఢీ పరిసరాల్లో అనేక చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వీటిలో జటాశంకర్ గుహలో వెలసిన శైవక్షేత్రం భక్తులను ఆకట్టుకుంటుంది. అలాగే, చౌరాగఢ్ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇవే కాకుండా, బాబా మహాదేవ్, గుప్త్ మహాదేవ్ వంటి పురాతన ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా సందర్శకులకు చక్కని అనుభూతిని ఇస్తాయి. పచ్‌మఢీ సమీపంలోని భీమ్బెట్కా, బాఘ్, ఉదయగిరి గుహలలో గుహాకుడ్యాలపై ప్రాచీన మానవులు చిత్రించిన అపురూప చిత్రాలు సందర్శకులను అబ్బురపరుస్తాయి. చరిత్ర పూర్వయుగానికి చెందినవిగా భావిస్తున్న ఈ చిత్రాలు కనీసం పదివేల ఏళ్ల నాటివని పరిశోధకులు తేల్చారు. ఏం కొనాలి? * పచ్‌మఢీ అడవులు స్వచ్ఛమైన తేనెకు పెట్టింది పేరు. ఇక్కడి గిరిజనులు సేకరించిన తేనె పచ్‌మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతుంది. * బస్తర్ ప్రాంత గిరిజనులు తయారు చేసిన హస్తకళాకృతులు, వెదురు బుట్టలు, గిరిజన చిత్రకారులు తీర్చిదిద్దిన సంప్రదాయ చిత్రాల పెయింటింగ్స్ ఇక్కడ విరివిగా దొరుకుతాయి. * సత్పురా అడవుల్లో లభించే పలు ఆయుర్వేద వనమూలికలు, అటవీ ఉత్పత్తులు కూడా పచ్‌మఢీ దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి. ఏం చేయాలి? * నగరాల్లోని కృత్రిమ జలవిహారాల్లోని జలకాలాటల కంటే, వేసవిలో పచ్‌మఢీ పరిసరాల్లోని జలపాతాల్లో జలకాలాటలు గొప్ప అనుభూతినిస్తాయి. * పచ్‌మఢీ పరిసరాల్లో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఎంచక్కా వనవిహారం చేయవచ్చు. * ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడి కొండ శిఖరాలను అధిరోహించి, అక్కడి నుంచి కనిపించే ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. * ఇక్కడి సహజసిద్ధమైన కొలనులు, సరస్సుల్లో పడవ ప్రయాణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. * సత్పురా అభయారణ్యంలో సఫారీ అద్భుతంగా ఉంటుంది. స్వేచ్ఛగా సంచరించే పులులు, చిరుతలు వంటి భారీ జంతువులతో పాటు ఉడుతలు, కుందేళ్లు వంటి చిన్న చిన్న జంతువులను, రక రకాల పక్షులను ఇక్కడ దగ్గరగా తిలకించవచ్చు. ఎలా వెళ్లాలి? * విమానంలో రావాలనుకుంటే దేశంలోని ప్రధాన నగరాలన్నింటి నుంచి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు విమానాలు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. * పచ్‌మఢీకి 47 కిలోమీటర్ల దూరంలోని పిపారియా వరకు దేశంలోని అన్ని మార్గాల నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. పిపారియా నుంచి బస్సు లేదా ట్యాక్సీలో పచ్‌మఢీకి చేరుకోవచ్చు. * మధ్యప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల నుంచి పచ్‌మఢీకి విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి. -
మన దేశంలోనే... మరో కాశ్మీరం
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పితోరాగఢ్ ఉదయం వేళ హిమగిరుల ధవళకాంతుల ధగధగలు కనువిందు చేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో అంతా విస్తరించుకున్న ఆకుపచ్చదనం ఆనంద పరవశులను చేస్తుంది. ఘనచరిత్రకు సాక్షీభూతంగా నిలిచి ఉన్న కోట... వీర సైనికులకు నివాళిగా వెలసిన తోట... ఎన్నెన్నో గాథలు చెబుతాయి. పరిసర ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, మందిరాలు వాతావరణానికి పవిత్రతను అద్దుతూ ఉంటాయి. ఇలాంటి చాలా వింతలు, విశేషాలు గల ప్రదేశం పితోరాగఢ్. పర్వతశిఖరాల నడుమ వెలసిన ఈ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వేసవి యాత్రలో విహార, వినోదాలతో పాటు కొంత విజ్ఞానం, కొంత పరమార్థం కూడా కావాలనుకుంటే పితోరాగఢ్‌కు వెళ్లాల్సిందే! హిమాలయాల దిగువన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చందక్, ధ్వజ్, కుమ్దార్, తల్ కేదార్ కొండల నడుమ వెలసిన పట్టణం పితోరాగఢ్. ఉదయం వేళ ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాల్లోని పంచ్‌చులి, నందాదేవి, నంద కోట్ శిఖరాలు తెల్లగా తళతళలాడుతూ కనువిందు చేస్తాయి. ఈ మూడు శిఖరాల నడుమనున్న లోయను స్థానికంగా ‘సోర్’లోయ అంటారు. అంటే చల్లని లోయ అని అర్థం. ఈ లోయ పరిసరాలన్నీ కశ్మీర్ లోయను తలపిస్తాయి. అందుకే ఈ లోయలో కాళీనది ఒడ్డున వెలసిన పితోరాగఢ్‌ను ‘మినీ కశ్మీర్’గా అభివర్ణిస్తారు. ట్రెక్కింగ్ చేసే యాత్రికులు ఇక్కడి నుంచి కైలాస పర్వతానికి, మానస సరోవరానికి చేరుకోవచ్చు. అందుకే దీనిని ‘హిమాలయాలకు ప్రవేశమార్గం’గా కూడా అభివర్ణిస్తారు. ఏం చూడాలి? చారిత్రక పట్టణమైన పితోరాగఢ్ రాజపుత్ర వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏలుబడిలో రాజధానిగా ఉండేది. పద్నాలుగో శతాబ్దంలో ఇదే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాల్ వంశపు రాజులు మూడు తరాల పాటు పరిపాలించారు. వారి తర్వాత నేపాల్‌కు చెందిన బ్రహ్మ వంశపు రాజులు, చాంద్ వంశపు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. పాత కోట నాశనమైపోవడంతో చాంద్ వంశపు రాజులు 1790లో ఇక్కడ కొత్తగా కోటను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న ఆ కోటను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు. * చాంద్ వంశీకులు ఎక్కువకాలం పరిపాలించిన పితోరాగఢ్‌లో ఇప్పటికీ పలు చిన్నా చితకా కోటలు, పురాతన మందిరాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. అప్పటి కోటల్లో ఒకదాంట్లో ప్రస్తుతం ట్రెజరీ, తహశిల్ కార్యాలయాలు పనిచేస్తుండగా, మరో కోటను పడగొట్టి, ఆ స్థలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నిర్మించారు. * కశ్మీర్లో మరణించిన వీర సైనికుల జ్ఞాపకార్థం ఇండియన్ ఆర్మీ ఈ పట్టణంలో నిర్మించిన మహారాజా పార్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అరుదైన మొక్కలతో, పచ్చని పరిసరాలతో కనువిందు చేస్తుంది. * పితోరాగఢ్‌కు 54 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 5412 అడుగుల ఎత్తున కుమావోన్ హిమాలయాల్లో ఏర్పాటు చేసిన ‘అస్కోట్ అభయారణ్యం’ మరో ప్రత్యేక ఆకర్షణ. మంచు చిరుతలు, హిమాలయన్ నల్ల ఎలుగులు, కస్తూరి మృగాలు, మంచు కాకులు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులను ఇక్కడ చూసి ఆనందించవచ్చు. * పితోర్‌గఢ్‌కు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకోరీ హిల్‌స్టేషన్ ట్రెక్కర్లకు స్వర్గధామంలా ఉంటుంది. మంచుకొండలు, కొండల దిగువన తేయాకు తోటలతో కనువిందు చేసే చకోరీ నుంచి మూడు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. * వేసవి వినోదంతో పాటు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించుకోవాలనుకునే పర్యాటకులకు పితోరాగఢ్ చాలా అనువైన ప్రదేశం. ఇక్కడకు చేరువలోనే శైవ క్షేత్రాలైన పాతాళ భువనేశ్వర్, తల్ కేదార్, నకుల సహదేవులు నిర్మించారనే ప్రతీతి గల నకులేశ్వర ఆలయం, పురాతన ధ్వజ ఆలయం, కాళీ మందిరం వంటి పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. * పితోరాగఢ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని ఝులాఘాట్ పట్టణం షాపింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ పట్టణంలో కాళీ నదిపై నిర్మించిన వేలాడే కలప వంతెన నేపాల్‌ను కలుపుతుంది. ఈ వంతెన మీదుగా ఇక్కడి ప్రజలు నేపాల్‌కు, నేపాలీలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. ఏం కొనాలి? * పితోరాగఢ్‌లో స్థానికంగా తయారయ్యే సంప్రదాయ హస్తకళా వస్తువులు చౌకగా దొరుకుతాయి. * ఇక్కడి బజారులో దొరికే ఉన్ని శాలువలు, కంబళ్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు వంటివి కొనుక్కోవచ్చు. * ఉద్యాన ఉత్పత్తులకు పితోరాగఢ్ పెట్టింది పేరు. ఇక్కడ స్థానికంగా పండే నారింజలు, ద్రాక్షలు, యాపిల్స్ రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పండే భారీ దోసకాయలు నీటి శాతంలో పుచ్చకాయలను తలపిస్తాయి. ఏం చేయాలి? * సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే పితోరాగఢ్ పరిసర ప్రదేశాలన్నీ పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. వేసవిలో ట్రెక్కింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది. * చరిత్ర, వారసత్వ సంపద గురించి ఆసక్తి గల వారు ఇక్కడి పురాతన కోటలను, ఇతర కట్టడాలను సందర్శించుకోవచ్చు. * తీర్థయాత్రలపై ఆసక్తి గల వారు పితోరాగఢ్ పరిసరాల్లోని ప్రాచీన ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఎలా చేరుకోవాలి? ఇతర ప్రాంతాల వారు దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు విమాన మార్గంలో లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి మరో రైలులో హల్ద్వానీ లేదా తనక్‌పూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. హల్ద్వానీ నుంచి, తనక్‌పూర్ నుంచి పితోరాగఢ్ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. -
గిరుల్... తరుల్... ఝరుల్ చలో కూనూర్!
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - కూనూర్ నీలగిరుల సొగసులను నిండుగా చూడాలని ఉందా..? నింగిని నిటారుగా తాకే కొండలు... కొండలను చీల్చుకుంటూ నేలవైపు పరుగులు తీసే జలపాతాల పరవళ్లను చూస్తూ పరవశించాలని ఉందా..? ఆకుపచ్చని లోకంలో ఆనందంగా విహరించాలని ఉందా..? వేసవి వేడికి దూరంగా... మనసుకు ఉపశమనం కలిగించే చల్లచల్లని ప్రదేశంలో గడపాలని ఉందా..? అయితే, చలో కూనూర్... అక్కడ ఇవన్నీ ఉంటాయి. ఊటీకి కూతవేటు దూరంలోనే ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్, సమ్మర్ డెస్టినేషన్ కూనూర్. నీలగిరి కొండల నడుమ వెలిసిన చిన్న పట్టణం ఇది. ఎటుచూసినా తేయాకు తోటల పచ్చదనం... నిటారుగా నింగిని తాకే నీలగిరుల సొగసులు...పరవళ్లు తొక్కే జలపాతాల గలగలలు... సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న చల్లచల్లని ప్రశాంత ప్రదేశం కూనూర్. నిప్పులు చెరిగే ఎండలు ఇక్కడ ఉండనే ఉండవు. ఎంతటి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించవు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ ప్రాంతంలో పూర్వం టోడా తెగకు చెందిన గిరిజనులు నివాసం ఉండేవారు. బ్రిటిష్ పాలకులు నీలగిరి ప్రాంతంలో చల్లని వాతావరణాన్ని గమనించి, ఊటీ మాదిరిగానే కూనూర్‌ను కూడా హిల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. ఒక బ్రిటిష్ అధికారి 1819లో ఈ ప్రదేశాన్ని తొలిసారిగా గుర్తించాడు. ఆ మరుసటి ఏడాదే ఆయన ఇక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. ఆ తర్వాత సంపన్న బ్రిటిష్ అధికారులు, వ్యాపారులు ఇక్కడ తమ తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్రమంగా కూనూర్ పట్టణంగా ఎదిగింది. బ్రిటిష్‌వారి హయాంలోనే ఇక్కడకు రైలుమార్గం ఏర్పడింది. ఏం చూడాలి? కూనూర్‌లోని సిమ్స్ పార్క్ చూసి తీరాల్సిన ప్రదేశం. వెయ్యికి పైగా వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లతో కనువిందు చేసే ఈ ఉద్యానవనం నందనవనాన్ని తలపిస్తుంది. అప్పట్లో మద్రాస్ క్లబ్ కార్యదర్శిగా పనిచేసిన బ్రిటిష్ అధికారి జె.డి.సిమ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఏటా మే నెలలో జరిగే పండ్లు, కూరగాయల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కూనూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కూనూర్ పట్టణం, పరిసరాల్లోని పచ్చని తేయాకు తోటలు సహా నీలగిరుల అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. కూనూర్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డాల్ఫిన్ నోస్ వ్యూపాయింట్ నుంచి నీలగిరులను తిలకించాలని తహతహలాడతారు. కూనూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ల్యాంబ్స్ రాక్ కూడా మరో అద్భుతమైన వ్యూ పాయింట్. ఇది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్‌కు వెళ్లే దారిలో ఉంటుంది. దీని పైనుంచి చూస్తే కూనూర్ పరిసరాలే కాదు, కోయంబత్తూరు మైదాన ప్రాంతంలో విస్తరించిన పచ్చదనం కూడా కనువిందు చేస్తుంది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రదేశం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు ఇష్టపడతారు. కూనూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని లాస్ జలపాతం చూసి తీరాల్సిన ప్రదేశం. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే మార్గంలో ఉండే ఈ జలపాతం నీలగిరి కొండల మీదుగా దాదాపు 180 అడుగుల ఎత్తు నుంచి ఉరకలేస్తూ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే దారిలోనే కోటగిరి పట్టణానికి సమీపంలో కేథరీన్ జలపాతం కూడా చూసి తీరాల్సిందే. ఇది దాదాపు 250 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తుంది. ఈ జలపాతానికి కోటగిరి ప్రాంతంలో కాఫీ సాగును పరిచయం చేసిన బ్రిటిష్ అధికారి ఎండీ కాక్బర్న్ భార్య పేరు పెట్టారు. ఏం కొనాలి? * శ్రేష్టమైన తేయాకు చౌకగా దొరుకు తుంది. రకరకాల టీ పొడిని కొనుక్కోవచ్చు. * గోర్మెట్ చీజ్‌కు కూనూర్ బాగా ఫేమస్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా దీనిని కొనుక్కుంటారు. * స్వచ్ఛమైన తేనె, స్థానికంగా తయారయ్యే రకరకాల జామ్స్ ఇక్కడి దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి. * ఇక్కడి దుకాణాల్లో స్థానికంగా తయారయ్యే హస్తకళాకృతులు, ఎంబ్రాయిడరీ చేసిన దిండు కవర్లు, కుషన్ కవర్లు, బెడ్‌షీట్స్, టీ సెట్లు కొనుక్కోవచ్చు. ఏం చేయాలి? * బోటింగ్, ట్రెక్కింగ్, వాకింగ్, షాపింగ్ వంటి వాటికి కూనూర్ చాలా అనువుగా ఉంటుంది. సిమ్స్ పార్కులోని కొలనులో బోటింగ్‌ను పిల్లలు బాగా ఆస్వాదిస్తారు. * కూనూర్ నుంచి ఊటీ మధ్య నడిచే హెరిటేజ్ ట్రైన్లో ప్రయాణం కూడా గొప్ప అనుభూతి కలిగిస్తుంది. దాదాపు రెండు గంటలు సాగే ఈ ప్రయాణంలో తాపీగా ప్రకృతి అందాలను తిలకించవచ్చు. * డాల్ఫిన్ నోస్, ల్యాంబ్స్ రాక్ ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటాయి. ట్రెక్కర్లను ఆకర్షించే మరో ప్రదేశం కూనూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బకాసుర కొండ. దీనిపై శిథిలావస్థలో ఉన్న డ్రూగ్ కోట శతాబ్దాల చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కోట 18వ శతాబ్దిలో టిప్పు సుల్తాను బలగాలకు స్థావరంగా ఉండేది. * కూనూర్ శివార్లలో నలువైపులా విస్తరించి ఉన్న టీ తోటల్లో వాకింగ్ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌కు ఓపిక లేనివారు టీ తోటల్లో విహరిస్తూ నీలగిరుల అందాలను తిలకించవచ్చు. ఎలా వెళ్లాలి? * కోయంబత్తూరు వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనూర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. * కూనూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. * తమిళనాడు, కేరళలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి. -
శ్రీన'హీ'గరం!
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ కశ్మీర్ అంటే కల్లోలాలు కాదు. ప్రకృతి అందాలకు నెలవు. కశ్మీర్ అంటే అశాంతి కాదు. ఆనందాల కొలువు. కశ్మీర్ అంటే తుపాకీ మోతలు, ఆర్తుల హాహాకారాలు కాదు. సరదాల సందళ్లు. సంతోషపు కేరింతలు. సరిహద్దు తగాదాలతో అలజడితో ఉంటుందని కశ్మీర్‌కి పేరుంది. కానీ ఆ పేరును శ్రీనగర్ మార్చేసింది. వివాదాల వేడి సంగతి ఎంతా ఉన్నా... వేసవి వేడి మాత్రం శ్రీనగర్‌లో అడ్రస్ లేకుండా పోతుంది. మే నెలలో సైతం చల్లగాలులతో ఆహ్లాదాన్ని పంచుతుంది. నా పేరు శ్రీనగరం, నా దగ్గరుంటే నహీ గరం అంటుంది. మనోల్లాసాన్ని హద్దులు దాటిస్తాను రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది. అందమైన అనుభూతులను పంచిస్తానంటూ పిలుస్తుంది. మన దేశంలోని బెస్ట్ సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటైన శ్రీనగర్ పరిచయం... ఈవారం మీకోసం! ఏం చూడాలి? శ్రీనగర్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్... దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిష్షింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికా భివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘షికారాలు’. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయా ణించడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి. భారతదేశంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ శ్రీనగర్‌లోనే ఉంది. కూరగాయలు, పండ్లు, పూలు అన్నిటినీ పడవల్లోకెక్కించి, దాల్ సరస్సు నీటిపై తేలియాడుతూ అమ్ముతుం టారు. ఈ పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో సాగు చేసినవే. రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తూ అన్నీ కొనుక్కోవడం భలే ఉంటుంది కదూ! శ్రీనగర్‌లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు. 17వ శతాబ్దంలో కట్టిన షాలిమార్ బాగ్... శ్రీనగర్‌లో ఉన్న మూడు మొఘల్ గార్డెన్స్లోనూ పెద్దది. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ప్రతి రోజూ సాయంత్రం ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. శుక్రవారం సెలవు. నిషాత్ గార్డెన్ కూడా ఫేమస్. ఈ రెండూ పర్షియన్ పద్ధతిలో నిర్మితమయ్యాయి. శరదృతువు (ఆకులు రాలే కాలం)లో ఈ మొఘల్ గార్డెన్స్ రాలిపడిన ఎరుపు-బంగారం రంగు ఆకులతో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఇక మొక్కలపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్‌ను చూడాల్సిందే. ఇక్కడ లేని మొక్క ఉండదు. 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఈ గార్డెన్లో... 17 హెక్టార్ల మేర ఓ అందమైన సరస్సు ఉంటుంది. అలాగే నసీం బాగ్. ఇది ప్రశాంతతకు మారు పేరు. 1586లో అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించా రట. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి, అలసిన మనసును శాంతపర్చుకోడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉన్న వారికి శ్రీనగర్ ఎంతో నచ్చుతుంది. అక్కడ ఉన్న గుళ్లు, మసీదులు చూస్తే మనసులో భక్తి అలలై ఎగసిపడుతుంది. కశ్మీర్ మధ్య భాగంలో విస్తరించి ఉన్న జబర్వాన్ పర్వతాన్ని శంకరా చార్య హిల్ అంటారు. పూర్వం దీనికి ఎన్నో పేర్లుండేవి. అయితే వెయ్యేళ్ల కిందట ఆది శంకరాచార్యుడు ఇక్కడికి వచ్చి, కొన్ని రోజులు ఉన్నాడట. అందుకే ఆ కొండకు ఆయన పేరును పెట్టారు. ఈ కొండపై 11వ శతాబ్దంలో నిర్మించిన శివుడి గుడి ఉంది. ఆ గుడి ఆవరణ లోకి సెల్ఫోన్లను, కెమెరాలను అనుమతించరు. అలాగే క్రీ.శ 1400లో నిర్మించిన జామియా మసీదు. ఇందులో 370 చెక్క స్తంభాలున్నాయి. ఒకేసారి 33,333 మంది నమాజ్ చేసుకునేం దుకు వీలుంది ఈ మసీదులో. ఇక ఖీర్ భవానీ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది శ్రీనగర్ దగ్గర్లోని తుల్లా ముల్లా గ్రామంలో ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న దేవతని దుర్గా దేవి అవతారంగా చెబుతుంటారు. నైవేద్యంగా ఖీర్ (పాయసం) పెడుతుంటారు. అందుకే ఆ ఆలయానికి ఖీర్ భవానీ టెంపుల్‌గా పేరొచ్చింది. ఈ ఆలయంలో శుక్ల పక్ష అష్టమి నాడు వేలమంది భక్తులు చేరి యాగాలు, హోమాలు చేస్తుంటారు. శ్రీనగర్ శివార్లలో ఉంది సోనామార్గ్. అంటే అర్థం ‘మెడోస్ ఆఫ్ గోల్డ్’ అని. దీని చుట్టూ ఉండే కొండలపై ట్రెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. పచ్చదనానికి, ఆల్పైన్ పూలకు ఇది ప్రసిద్ధి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2,740 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గ్ చుట్టుపక్కల చాలా సరస్సులు ఉంటాయి. సరదా ఉన్నవారు ఫిషింగ్ చేయవచ్చు. శ్రీనగర్‌లోని సింథన్ టాప్ గురించి చాలామందికి తెలియదు. ఇది శ్రీనగర్ శివార్లలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించ డానికి రెండు కళ్లూ చాలవు. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉండటంతో, ఆ ప్రదేశం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచుతో పర్వతం మొత్తం కప్ప బడి ఉండటం వల్ల మరింత అందంగా ఉంటుంది. ఇక్కడి అందాలను ఆస్వాదించా లంటే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలమే సరైన సమయం. చలికాలం వస్తే మంచు విపరీతంగా కురుస్తుంది కాబట్టి పర్యాటకులను అనుమతించరు. యాపిల్ కొనుక్కు తినడమే తెలిసిన మనకు యాపిల్ పండ్ల తోటల్లో తిరుగాడుతూ, వాటిని స్వయంగా కోసుకుని తినే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆ అవకాశాన్ని ఎవరైనా జారవిడుచుకుంటారా? అందుకే శ్రీనగర్‌లోని యాపిల్ తోటలు ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. పండ్లను కోయడం మీద ఎటువంటి ఆంక్షలూ లేకపోవ డంతో అక్కడి పనివాళ్లతో పాటు సందర్శకులు కూడా కాయలను తెంపి మురిసిపోతుంటారు. సినిమా పాటల్లో టులిప్ తోటల్ని చూసినప్పుడు... ఇలాంటి ప్రదేశానికి మనమూ వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అయితే దానికోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీనగర్ వెళ్తే చాలు. ‘ఇందిరాగాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్స్’ ఆసియాలోనే అతి పెద్ద టులిప్ గార్డెన్. ఇక్కడ మనం ఒకేసారి 20 లక్షల పూలను చూడొచ్చు. యేటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ‘టులిప్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది. ఏం తినాలి? శ్రీనగర్‌లో వాజ్వాన్ తిని తీరాలి. వాజ్వాన్ అంటే వంటకం పేరు కాదు. 36 రకాల వంటకాలతో కూడిన మీల్స్. ఇది తింటే కశ్మీర్ ఫుడ్ మొత్తాన్నీ రుచి చూసినట్టే లెక్క. అలాగే ‘తుజ్జీ’ చాలా ఫేమస్. అంటే మటన్ బాల్స్‌ని ఐరన్ రాడ్ మీద పెట్టి కాల్చి చేసే వంటకం. దీన్ని స్థానికంగా దొరికే బ్రెడ్, చట్నీతో సర్వ్ చేస్తారు. ఖావా అనే స్పెషల్ గ్రీన్ టీ రుచి నాలుకను వదలదు. నూన్ చాయ్ అని పిలిచే సాల్టీ టీ అయితే ఇక్కడ తప్ప ఎక్కడా దొరకదు. పాలు, గ్రీన్ టీ, ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపి చేసే ఈ టీ గులాబి రంగులో ఉంటుంది. ఒక్కసారి దీన్ని రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేం అంటారు దాన్ని టేస్ట్ చూసినవాళ్లు! ఏం కొనాలి? శ్రీనగర్‌లో షాపింగ్ చేయాలంటే షాపులకి వెళ్లడం కంటే... స్ట్రీట్ మార్కెట్స్‌కి వెళ్లడం మంచిది. ఎందుకంటే ఆ మార్కెట్లలో షాపుల్లో కంటే విభిన్నమైన, వైవిధ్యమైన వస్తువులు దొరుకుతాయి. పైగా వెల కూడా అందుబాటులో ఉంటుంది. అన్నిటికంటే ముందు కొనాల్సింది... శాలువాలు, కార్పెట్లు. అక్కడ దొరికేంత అందమైన శాలువాలు, అద్భుతంగా రూపొందించిన కార్పెట్లు మన దేశంలో మరెక్కడా దొరకవు. లాల్ చౌక్, బాద్షా చౌక్ ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో కని, పష్మినా శాలువాలు తప్పక కొనాల్సిందే. అలాగే పోలో వ్యూ మార్కెట్లో యాంటిక్ సిల్వర్ జ్యూయెలరీ, వూడెన్ జ్యూయెలరీ బాగా దొరుకుతుంది. ఫ్లవర్‌వాజ్‌లు, ఆర్టిఫీషియల్ పువ్వులు కూడా బాగుంటాయి. కశ్మీర్ గవర్నమెంట్ ఆర్ట్స్ ఎంపోరియంలో బ్యాగులు, టేబుల్ ల్యాంప్స్ లాంటివి అతి తక్కువ ధరకు దొరకుతాయి. ఇక రెసిడెన్సీ రోడ్లో అడుగుపెడితే డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల వాసన గుప్పుమంటుంది. ఆపైన అవి కొనకుండా రావడం మనవల్ల కాదు. ఎలా వెళ్లాలి? హైదరాబాద్ నుంచి శ్రీ నగర్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌కి నేరుగా ఫ్లయిట్స్ ఉన్నాయి. గంటన్నర నుంచి రెండు గంటల్లో వెళ్లిపో వచ్చు. బస్సులో వెళ్తే ఇరవై గంటల పైనే పడుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్లు ఉన్నాయి. వాటిలో వెళ్లినా బానే ఉంటుంది. అక్కడికెళ్లాక ఉండటానికి బోలెడు హోటళ్లున్నాయి. మన బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు. ఏం చేయాలి? ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వింతలు, విశేషాలను చూసి రావడం అందరూ చేస్తారు. కానీ ఏదైనా కొత్తగా చేయడంలోనే ఉంటుంది మజా. శ్రీనగర్ వెళ్తే అలాంటి కొత్త అడ్వెంచర్స్ చాలా చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనది పారా గ్లైడింగ్. తేలికైన గ్లైడర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వీపునకు కట్టుకుని, గాల్లో ఎగురుతూ కశ్మీర్ అందాలను చూస్తుంటే మనసు కూడా విహంగమై ఎగిరిపోతుంది. ఎయిర్ బెలూన్స్లో కూర్చుని ఎగురుతూ సిటీని చూసే అవకాశం కూడా ఉంది. పర్వత సానువులపై ట్రెక్కింగ్ చేస్తూ, వాటి ఎత్తుల్ని కొలిచే అనుభూతిని మిస్సవ్వడానికి లేదు. అలాగే రివర్ ర్యాఫ్టింగ్ కూడా. నదీ అలలపై తేలియాడుతూ, చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తుంటే మనసు మరో లోకంలోకి వెళ్లిపోవడం ఖాయం. -
చియాంగ్ మాయ్ : ప్రతిరోజూ పర్వదినమే!
టూర్‌దర్శన్ ప్రకృతికాంత సోయగం... సాగర అలల నిశ్శబ్ద భాషణం... మలయ సమీరపు శీతలం... పచ్చపచ్చగా మెరిసిపోయే భూతలం... ఇవన్నీ కలగలసిన స్వర్గం చియాంగ్ మాయ్. అక్కడ గడపడం అంటే నిజంగా ఓ సంబరం. చియాంగ్ మాయ్లో చెప్పలేనన్ని విశేషాలు, చూసే కొద్దీ చూడాలనిపించే అందాలు ఎన్నో ఉన్నాయి. మనల్ని కట్టి పడేస్తాయి. చూసే కనులుంటే... ఆస్వాదించే మనసుంటే... ఒక్కసారైనా చియాంగ్ మాయ్‌కు వెళ్లాల్సిందే! థాయ్ల్యాండ్ని ఒక్క మాటలో నిర్వచించమంటే ఎవరైనా ఏం చెబుతారు? బహుశా ఒక పెద్ద రిలీఫ్ సెంటర్ అంటారేమో! సినిమాల ప్రభావమో ఏమో కానీ... విశ్రాంతి తీసుకోడానికి, ఒత్తిడిని వదిలించుకోవడానికి థాయ్‌ల్యాండ్ ఓ చక్కని ప్రదేశం అన్న ముద్ర అందరి మనసుల్లోనూ పడిపోయింది. ఒక రకంగా అది నిజమే. కానీ థాయ్‌ల్యాండ్ అంటే కేవలం విశ్రాంతికి విడిది కాదు. సంప్రదాయ సంగీత సాహిత్యాలకు కూడా విడిదే. అది కేవలం మసాజుల కేంద్రం కాదు. మనసును శాంతి వైపునకు మళ్లించే ఆధ్యాత్మిక కేంద్రం కూడా. సరదాలు తీర్చుకునే ఆధునిక లోకం మాత్రమే కాదు. సంతోషానికి అసలైన అర్థం తెలుసుకునేందుకు పనికొచ్చే సరికొత్త ప్రపంచం కూడా. ఈ వాస్తవం... ఒక్కసారి చియాంగ్ మాయ్ నగరానికి వెళ్తే మనకు బోధపడుతుంది. థాయ్‌ల్యాండ్‌లోని అతి పెద్ద నగరాల్లో ఐదవది చియాంగ్ మాయ్. ఆ పేరుకు కొత్త నగరం అని అర్థం. ఒకప్పుడు లానా అనే రాజ్యానికి రాజధాని ఈ నగరం. అప్పట్లో దీన్ని చియాంగ్ రాయ్ అనేవారు. థాయ్‌ల్యాండ్‌కు ఉత్తరాన ఉండే ఈ నగరం చుట్టూ ఓ పెద్ద ప్రహారీ గోడ కూడా ఉండేది. కాలక్రమంలో రాజరికం అంతరించింది. జీవన విధానంతో పాటు నగర రూపురేఖలు కూడా బాగా మారిపోయాయి. మెల్లగా ఆ గోడ శిధిలమయ్యి అవశేషాలు మాత్రం మిగిలాయి. చివరికి నగరం పేరు కూడా చియాంగ్ మాయ్గా మారింది. సంద్రపు అలలూ ఇసుక తిన్నెలూ... మలయ పవనాలూ మత్తెక్కించే పూల పరిమళాలూ... పర్వత సానువులూ పుడమి కాగితంపై ప్రకృతి గీసిన పచ్చని చిత్రాలూ... ఆధ్మాత్మిక కేంద్రాలూ అంబరాన్నంటే సంబరాలూ... చియాంగ్ మాయ్లో ప్రతిదీ ప్రత్యేకమే. ప్రతిచోటా అందమే. ప్రతి క్షణమూ ఆనందమే. ఎటు చూసినా బుద్ధుని జాడలే.... చియాంగ్ మాయ్లో ముఖ్యంగా చెప్పుకోవా ల్సింది అక్కడి ఆలయాల గురించి. ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా బౌద్ధాలయాలు. ఏడు వందల యేళ్ల పురాతనమైన బౌద్ధాలయం నుంచి, అత్యాధునికంగా నిర్మించిన ఆలయాల వరకూ ఎన్నో ఉన్నాయక్కడ. వాటిలో బౌద్ధ సన్యాసులు నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాషాయపు వస్త్రాలు ధరించిన ఆ సాధువులు దారంట నడిచివెళ్తూ ఉంటే... బుద్ధుడే కనుల ముందు నడయాడుతున్నట్టుగా అనిపిస్తుంది. గుండెల నిండా ఆధ్యాత్మికత నిండిపోతుంది. ఏదో చెప్పలేని ప్రశాంతత మనసంతా పరచుకుంటుంది. ఏడాదంతా పండుగే పండుగ... ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ పండుగలు ఉంటాయి. కానీ చియాంగ్ మాయ్లో ఉండేటన్ని పండుగలు మరెక్కడా ఉండవు. సంవత్సరం పొడవునా అక్కడ ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. అంబ్రెల్లా ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్, ల్యాటర్న ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్, బెలూన్ ఫెస్టివల్ అంటూ ప్రతి విషయాన్నీ ఓ పండుగలా చేసుకోవడం చియాంగ్ మాయ్ వారికే చెల్లింది. ఫ్లవర్ ఫెస్టివల్ నాడు థాయ్‌ల్యాండ్‌లో పూచే ప్రతి రకమైన పువ్వూ చియాంగ్మాయ్కి చేరుకుంటుంది. వాటితో రకరకాల ఆకృతులు తయారు చేశారు. అలంకారాలు చేస్తారు. మనుషులు సైతం పూలతో అలంకరించుకుంటారు. కొందరైతే పూలతో చేసిన దుస్తులనే వేసుకుంటారు. ఆ రోజంతా చియాంగ్ మాయ్లో పూల పరిమళం గుప్పుమంటుంది. ఇక యేటా ఫుడ్ ఫెస్టివల్‌కి తప్పకుండా హాజరై తీరాల్సిందే. స్థానిక వంటకాలతో పాటు చైనీస్, జపనీస్ వంటకాలు కూడా అందులో ఉంటాయి. విభిన్నమైన రుచులు, వైవిధ్యభరితమైన వంటకాలను ఆరగించడానికి భోజన ప్రియులకు అంతకంటే మంచి అవకాశం దొరకదు. అంబ్రెల్లా ఫెస్టివల్ నాడు నగరమంతా ఎక్కడ చూసినా గొడుగులే కనిపిస్తాయి. వీధుల్లో వెదురు బొంగులు పాతి, కరెంటు తీగలు వేసినట్టుగా వీధులన్నిటిలో అంత ఎత్తున తీగలు కడతారు. వాటికి రంగురంగుల గొడుగులను వేళ్లాడదీస్తారు. ప్రతి ఒక్కరూ గొడుగు చేతబట్టే బయటికి వెళ్తారు. రంగు రంగుల గొడుగులను అందరూ చేతబూని తిరగడం చూస్తుంటే... ఇలపై వేల ఇంద్రధనుస్సులుఒక్కసారే వెలిశాయా అనిపిస్తుంది. ఇక ల్యాటర్న ఫెస్టివల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ పండుగను ఇ-పెంగ్ అంటారు. ‘ఇ’ అంటే రెండు, ‘పెంగ్’ అంటే నెల అని అర్థం. రెండో నెలలో వచ్చే పండుగ కనుక ఆ పేరుతో పిలుస్తారన్నమాట. ఆ పండుగ రోజున నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. చీకటి పడగానే ప్రతి ఇల్లూ దీపాలతో వెలిగిపోతుంది. అందరూ ల్యాటర్న్స (గాలిలో ఎగిరే విధంగా తయారు చేసిన లాంతర్లు) పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వస్తారు. ఒక్కచోట చేరి, ప్రార్థనలు చేసి, ఆపైన ఆ లాంతర్లను గాల్లోకి ఎగరేస్తారు. ఆ లాంతర్లు ఆకాశానికి ఎగసి, చుక్కలతో పోటీపడుతూ మెరుస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఇలా చేయడం వల్ల కీడు మొత్తం పోయి శుభం జరుగుతుందని అక్కడివారి విశ్వాసం. అలాగే బెలూన్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్ తదితర ఎన్నో పండుగలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. వీటన్నిటినీ చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తూ ఉంటారు. చియాంగ్ మాయ్ టూరిజం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, థాయ్‌ల్యాండ్‌లోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో ప్రముఖమైనదిగా చియాంగ్ మాయ్ మారడానికి ఈ పండుగలే కారణం అంటుంది అక్కడి ప్రభుత్వం. నగరం నిద్రపోదు... సాధారణంగా ప్రపంచం పగలు మేలుకుంటుంది. రాత్రిపూట నిద్రలోకి జారుకుంటుంది. కానీ చియాంగ్ మాయ్లో అలా కాదు. పగలు ప్రజలు పనుల్లో నిమగ్నమై పోతారు. రాతిరైతే షాపింగ్‌లు, విందులు, వినోదాలు, సరదాలు సంతోషాలంటూ బిజీ అయిపోతారు. ముఖ్యంగా షాపింగ్ అంతా చాలావరకూ రాత్రి పూటే చేస్తుంటారు. అందుకే చియాంగ్ మాయ్ నైట్ బజార్ చాలా ఫేమస్. ఈ బజార్లో షాపింగ్ చేయడం కోసం విదేశీ సందర్శకులు పని గట్టుకుని వస్తుంటారు కూడా. ఈ విశేషాలన్నీ ఒకెత్తయితే అక్కడి ప్రకృతి సౌందర్యం ఒకెత్తు. ఎప్పుడూ చల్లగా వీచే గాలి హాయిపరుస్తుంది. వృక్ష సంపద కన్నులవిందు చేస్తూ ఉంటుంది. దానికితోడు యోగా, మసాజ్ సెంటర్లు కూడా ఉండటంతో మనసుతో పాటు శరీరానికి కూడా ఆహ్లాదమే! * చియాంగ్ మాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడికి నేరుగా వెళ్లవచ్చు. సీజన్‌ను బట్టి మనిషికి ఇరవై నుంచి ముప్ఫై వేల వరకూ ఉంటుంది టిక్కెట్ వెల. వెళ్లేటప్పుడే రిటర్న్ టిక్కెట్ కూడా చేయించుకుంటే కాస్త తక్కువకు వచ్చే అవకాశం ఉంటుంది! * థాయ్‌ల్యాండ్ కరెన్సీని థాయి భట్ అంటారు. మన వంద రూపాయలు యాభై మూడు థాయి భట్స్కి సమానం! * చియాంగ్ మాయ్లో అతి పెద్ద జూ ఒకటి ఉంది. దీనిలో విస్తారమైన జంతు సంపద ఉంది. దాంతో జంతు ప్రేమికులకు మంచి టైమ్‌పాస్. దానికి తోడు ప్రత్యేకంగా ఎలిఫెంట్ నేచర్ పార్క ఒకటుంది. ఇక్కడ ఏనుగులను సంరక్షించడమే కాదు... మావటి కావాలనుకునే వారికి ట్రెయినింగ్ కూడా ఇస్తుంటారు. వైల్డ్ లైఫ్ టూర్ ప్యాకేజీలు ఉంటాయి. బుక్ చేసుకుంటే మొత్తం అన్నిటినీ ఒకేసారి చూసేయొచ్చు. * బో సంగ్ అనే ప్రాంతం హస్త కళలకు ప్రసిద్ధి. ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది గొడుగుల తయారీదారులే. వీరు ఓ ప్రత్యేక పద్ధతిలో తయారుచేసే గొడుగులు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి!