మార్వెలస్ మాథేరాన్ | Tour Darshan of Matheran | Sakshi
Sakshi News home page

మార్వెలస్ మాథేరాన్

Published Sun, Jul 17 2016 2:16 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

మార్వెలస్ మాథేరాన్ - Sakshi

మార్వెలస్ మాథేరాన్

టూర్‌దర్శన్
ప్రకృతి అందాలకు నెలవైన పడమటి కనుమల్లో మాథేరాన్ చాలా చిన్న పట్టణం. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం మన దేశంలోనే అతి చిన్న హిల్‌స్టేషన్. ఇక్కడి జనాభా పట్టుమని పదివేలు కూడా ఉండదు. వాహనాల రణగొణలు ఏమాత్రం వినిపించవు. ఎలాంటి హడావుడీ కనిపించదు. చుట్టూ నింగిని తాకే కొండలు... పచ్చదనం నింపుకున్న లోయలు... పక్షుల కిలకిలలు... వనవిహారంపై మక్కువ గలవారు మాథేరాన్‌ను చూస్తే... ‘మార్వెలస్’ అనకుండా ఉండలేరు.
 
మాథేరాన్‌ను 1850లో అప్పటి థానే కలెక్టర్ హఫ్ పాయింజ్ మాలెట్ తొలిసారిగా గుర్తించాడు. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఈ ప్రదేశాన్ని పట్టణంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి బాంబే గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్‌స్టోన్ దీనికి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఇక్కడ జనావాసాలు ఏర్పడ్డాయి. తర్వాత 1907లో వ్యాపారవేత్త సర్ అదామ్జీ పీర్‌భోయ్ సమీపంలోని నేరల్ వరకు మాథేరాన్ హిల్ రైల్వే లైన్‌ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఈ రెండు పట్టణాల మధ్య టాయ్ ట్రెయిన్‌ను నడుపుతున్నారు.
 
ఏం చూడాలి?
* పడమటి కనుమల అందాలను తనివితీరా చూసి తీరాల్సిందే. కొండ శిఖరాలపై ఉన్న లూయిసా పాయింట్, పనోరమా పాయింట్, హనీమూన్ పాయింట్, పోర్కుపైన్ పాయింట్, అలెగ్జాండర్ పాయింట్, ఎకో పాయింట్, వన్ ట్రీ పాయింట్ వంటి ప్రదేశాల నుంచి తిలకిస్తే మాథేరాన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, పచ్చదనంతో నిండిన లోయల అందాలు కనువిందు చేస్తాయి.
 
* నెరల్-మాథేరాన్‌ల మధ్య కొండ మార్గంలో నడిచే టాయ్ ట్రెయిన్‌లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది.
 
* మాథేరాన్ మెయిన్ రోడ్డుకు కేవలం కిలోమీటరు దూరంలోనే షార్లట్ సరస్సు వర్షాకాలంలో జలకళతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సుకు సమీపంలోనే పురాతనమైన పిశర్‌నాథ్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇందులోని స్వయంభూ లింగాన్ని సిందూరంతో అర్చిస్తారు. ఆలయం వద్ద నుంచి తిలకిస్తే సరస్సు పరిసరాలు ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి.
 
* మాథేరాన్ మెయిన్‌రోడ్డుపై ఉన్న సెంట్రల్ బజారులోని దుకాణాలు స్థానిక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ బజారు మీదుగా నడక సాగించడం ఆహ్లాదభరితంగా ఉంటుంది.
 
* మాథేరాన్‌లోని అంబర్‌నాథ్ ఆలయం మరో పురాతన శివాలయం. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళా సౌందర్యం సందర్శకులను ఆకట్టుకుంటుంది.
 
ఏం చేయాలి?
* మాథేరాన్ పట్టణంలోకి కార్లు తదితర మోటారు వాహనాలను అనుమతించరు. పట్టణంలో తిరగాలంటే కాలినడకను ఆశ్రయించాలి. నడిచే ఓపిక లేకుంటే రిక్షాలపై ప్రయాణించవచ్చు. మరో విశేషమేమిటంటే ఇక్కడ గుర్రాలను అద్దెకిస్తారు. ఆసక్తి ఉన్న వారు గుర్రాలపై సవారీ చేస్తూ వీధులన్నీ చుట్టి రావచ్చు.
 
* షార్లెట్ సరస్సు, లూయిసా పాయింట్, హనీమూన్ పాయింట్, ఎకో పాయింట్, కింగ్ జార్జి పాయింట్ తదితర వ్యూ పాయింట్ల వద్ద సరదాగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు.
 
* అంబర్‌నాథ్ ఆలయం, పిశర్‌నాథ్ మహాదేవ మందిరం వంటి పురాతన ఆలయాలతో పాటు కొండ శిఖరంపై నిర్మించిన ప్రబాల్ కోటను సందర్శించవచ్చు.
 
* ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడ అడుగడుగునా తారసపడే కొండలపైకి, లోయల్లోకి దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల అడవుల్లో వనవిహారాలు చేయవచ్చు.
ఏం కొనాలి?
* చిన్న పట్టణం కావడంతో మాథేరాన్‌లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఏవీ ఉండవు. అయితే, మెయిన్ రోడ్డులో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే చిన్న చిన్న దుకాణాల్లో షాపింగ్ చేసుకోవచ్చు.
 
* ఈ దుకాణాల్లో తోలు వస్తువులు, టోపీలు, షూస్, స్థానిక కళాకారులు పేము, ఎండిన పూలు వంటి వాటితో రూపొందించిన హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి.
 
* ఇక్కడ ప్రత్యేకంగా దొరికే మిఠాయి ‘చిక్కీ’ రుచిని ఆస్వాదించేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కొనుక్కుని తీసుకువెళతారు.
 
* ఇక్కడి దుకాణాల్లో తేనె, వనమూలికలు, గాజు బొమ్మలు వంటివి కూడా చౌకగా దొరుకుతాయి.
 
ఎలా చేరుకోవాలి?

* దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు ముంబై విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి మాథేరాన్‌కు సమీపంలోని నేరల్ వరకు రైలులో రావచ్చు.
 
* నేరల్ నుంచి మాథేరాన్‌కు టాయ్ ట్రెయిన్ అందుబాటులో ఉంటుంది. చాలా తాపీగా సాగే ఈ రైలు ప్రయాణాన్ని అడుగడుగునా ఆస్వాదించవచ్చు.
 
* ఒకవేళ ముంబై మీదుగా రోడ్డుమార్గంలో రావాలనుకున్నా నేరల్ వరకు మాత్రమే బస్సులు లేదా ట్యాక్సీల్లో వచ్చి, అక్కడి నుంచి టాయ్ ట్రెయిన్ ద్వారా మాత్రమే మాథేరాన్‌కు రావాల్సి ఉంటుంది.
 
* పుణే, ఔరంగాబాద్‌ల నుంచి కూడా నేరల్ వరకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement