Matheran
-
మాథేరాన్ టాయ్‌ట్రైన్ వచ్చేస్తోంది..
దాదర్: పర్యాటకులకు ఎంతో ఇష్టమైన నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ సేవలు నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16 నుంచి సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా ఆకస్మిక వర్షాల కారణంగా ఇది వాయిదా పడింది. కాని రైల్వే అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేరల్–మాథేరాన్ మధ్య నడిచే టాయ్ ట్రైన్ రైలు మార్గం 80% కొండ అంచుల మీదుగా ఉంది. నేలపై ఉన్న నేరల్ నుంచి కొండపై ఉన్న మాథేరాన్ మధ్య 21 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ (అప్, డౌన్లో) గమ్యస్థానానికి చేరుకోవాలంటే రెండు గంటలపైనే సమయం పడుతుంది.ముఖ్యంగా వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, కల్వర్టులు కొట్టుకుపోవడం, పట్టాల కిందున్న మట్టి, కంకర వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతుంది. ఫలితంగా అనేక చోట్ల రైలు పట్టాలు గాలిలో వేలాడుతుంటాయి. దీంతో ప్రమాదాలు జరగక ముందే ముందు జాగ్రత్త చర్యగా ఏటా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యే వరకు అంటే జూన్ 15వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు ఈ రైలు మార్గం పూర్తిగా మూసి వేస్తారు. ఈ సమయంలో రైల్వే ఇంజిన్లు, కోచ్‌లు మరమ్మతుల నిమిత్తం పరేల్‌లోని రైల్వే వర్క్ షాపునకు తరలిస్తారు. అలాగే ఈ నాలుగు నెలల కాలవ్యవధిలో రైల్వే ట్రాక్స్‌కు మరమ్మతు పనులు పూర్తిచేసి అక్టోబరు 16 నుంచి రైలు సేవలు పునరుద్ధరిస్తారు. ఆ ప్రకారం అక్టోబరు 16 నుంచి టాయ్ ట్రైన్ సేవలు వినియోగంలోకి రావాల్సి ఉంది. పర్యాటకులు కూడా మాథేరాన్ రావడానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ ఏడాది అక్టోబరులో 15 తర్వాత కూడా భారీ వర్షాలు కురవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టాయ్ ట్రైన్ సేవల ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందిప్రారంభించి వందేళ్లు దాటినా...ఈ రైలు మార్గాన్ని ప్రారంభించి వందేళ్లు దాటినప్పటికీ ఇంకా పర్యాటకుల మన్ననలు పొందుతూనే ఉంది. రోడ్డు మార్గం కంటే రైలు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకునే అనుభూతి పర్యాటకులు ఎన్నటి మరిచిపోరు. ఏటా లక్షలాది పర్యాటకులు మాథేరాన్‌ను సందర్శిస్తారు. వంద శాతం పర్యాటకులు టాయ్ ట్రైన్‌ను ఎక్కి ప్రయాణం చేయాలని కోరుకుంటారు. టికెట్లు దొరకని వారు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకుంటారు. చదవండి: మహారాష్ట్ర చూపంతా ఈ నియోజకవర్గంపైనే...నవంబర్ 1కి వాయిదా పడిన విషయం కొందరు పర్యాటకులకు తెలియలేదు. ఎప్పటిలాగే అనేకమంది పర్యాటకులు ఎంతో ఉత్సాహంతో తమ కుటుంబ సభ్యులతో ఈ నెల 16, 17వ తేదీన నేరల్‌కు చేరుకున్నారు. వర్షాల కారణంగా నవంబర్ ఒకటో తేదీకి వాయిదా పడినట్లు తెలియగానే కొందరు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రోడ్డు మార్గం ద్వారా మాథేరాన్ చేరుకున్నారు. -
హనీమూన్‌లో విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ నవ వరుడు
ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్‌కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు. ఇంతియాజ్‌ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. ఇదే తొలిసారి.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు. మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు.. -
దారుణ హత్య: తల, మొండెం వేరుచేసి తలతో పారిపోయి..
Matheran Crime News: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌లో ఓ మహిళా పర్యాటకురాలు దారుణ హత్యకు గురైన సంఘటనలో రాయ్‌గఢ్ పోలీసులు ఒక ఐటీ ఇంజనీర్‌ను అరెస్ట్ చేశారు. పన్వేల్‌కు చెందిన రామ్‌పాల్ అనే వ్యక్తి తన భార్య పూనమ్‌పై అనుమానంతోనే ఆమెను లాడ్జిలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. మాథేరాన్‌లోని ఇందిరానగర్‌లో ఉన్న ఓ లాడ్జ్‌లో గది కావాలని శనివారం సాయంత్రం ఓ జంట వచ్చింది. లాడ్జ్ సిబ్బంది నియమాల ప్రకారం ఆ జంట వివరాలు రిజిస్టర్లో రాసుకొని వారికి గది ఇచ్చారు. ఆదివారం ఉదయం లాడ్జ్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి గది లోపలికి వెళ్లగా, బెడ్ కింద తల లేని మొండెం కనపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని చూసి భయపడిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ అంతటా సోదా చేశారు. కానీ తల దొరకలేదు. దీంతో శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం పన్వేల్‌లోని ఉప జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా, దర్యాప్తులో భాగంగా తనిఖీ చేస్తుండగా, రిజిస్టర్లో రాసిన పేరు, చిరునామా తప్పుడు వివరాలని తేలింది. ఈ జంట నుంచి లాడ్జ్ యజమాని కేతన్ రమాణే ఆధార్ కార్డు, పాన్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకోలేదు. దీంతో ఈ హత్య కేసు చేధించడం పోలీసులకు సవాలుగా మారింది. మరోవైపు, లాడ్జింగులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. చదవండి: (రైల్వే కోచ్ రెస్టారెంట్ సూపర్ సక్సెస్) మాస్క్ ధరించి ఉండటంతో ఆ మహిళ భర్త ముఖం గుర్తించడం కష్టతరంగా మారింది. ఇదిలావుండగా, సోమవారం ఉదయం మాథేరాన్‌లో ఓ చోట ఓ హ్యాండ్ బ్యాగ్ లభించింది. సీసీ టీవీ ఫుటేజ్‌లో మహిళ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగు, పోలీసులకు దొరికిన బ్యాగు ఒకటేనని తేలింది. దీంతో ఆ బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను ముంబైలోని గోరేగావ్‌కు చెందిన 30 ఏళ్ల పూనమ్ పాల్గా గుర్తించారు. అదే సమయంలో ఆమె కుటుంబ సభ్యులు కూడా తమ కూతురు అదృశ్యమైనట్లు గోరేగావ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ మృతదేహం పూనమ్‌దేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. -
మార్వెలస్ మాథేరాన్
టూర్‌దర్శన్ ప్రకృతి అందాలకు నెలవైన పడమటి కనుమల్లో మాథేరాన్ చాలా చిన్న పట్టణం. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం మన దేశంలోనే అతి చిన్న హిల్‌స్టేషన్. ఇక్కడి జనాభా పట్టుమని పదివేలు కూడా ఉండదు. వాహనాల రణగొణలు ఏమాత్రం వినిపించవు. ఎలాంటి హడావుడీ కనిపించదు. చుట్టూ నింగిని తాకే కొండలు... పచ్చదనం నింపుకున్న లోయలు... పక్షుల కిలకిలలు... వనవిహారంపై మక్కువ గలవారు మాథేరాన్‌ను చూస్తే... ‘మార్వెలస్’ అనకుండా ఉండలేరు. మాథేరాన్‌ను 1850లో అప్పటి థానే కలెక్టర్ హఫ్ పాయింజ్ మాలెట్ తొలిసారిగా గుర్తించాడు. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఈ ప్రదేశాన్ని పట్టణంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి బాంబే గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్‌స్టోన్ దీనికి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఇక్కడ జనావాసాలు ఏర్పడ్డాయి. తర్వాత 1907లో వ్యాపారవేత్త సర్ అదామ్జీ పీర్‌భోయ్ సమీపంలోని నేరల్ వరకు మాథేరాన్ హిల్ రైల్వే లైన్‌ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఈ రెండు పట్టణాల మధ్య టాయ్ ట్రెయిన్‌ను నడుపుతున్నారు. ఏం చూడాలి? * పడమటి కనుమల అందాలను తనివితీరా చూసి తీరాల్సిందే. కొండ శిఖరాలపై ఉన్న లూయిసా పాయింట్, పనోరమా పాయింట్, హనీమూన్ పాయింట్, పోర్కుపైన్ పాయింట్, అలెగ్జాండర్ పాయింట్, ఎకో పాయింట్, వన్ ట్రీ పాయింట్ వంటి ప్రదేశాల నుంచి తిలకిస్తే మాథేరాన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, పచ్చదనంతో నిండిన లోయల అందాలు కనువిందు చేస్తాయి. * నెరల్-మాథేరాన్‌ల మధ్య కొండ మార్గంలో నడిచే టాయ్ ట్రెయిన్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. * మాథేరాన్ మెయిన్ రోడ్డుకు కేవలం కిలోమీటరు దూరంలోనే షార్లట్ సరస్సు వర్షాకాలంలో జలకళతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సుకు సమీపంలోనే పురాతనమైన పిశర్నాథ్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇందులోని స్వయంభూ లింగాన్ని సిందూరంతో అర్చిస్తారు. ఆలయం వద్ద నుంచి తిలకిస్తే సరస్సు పరిసరాలు ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. * మాథేరాన్ మెయిన్‌రోడ్డుపై ఉన్న సెంట్రల్ బజారులోని దుకాణాలు స్థానిక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ బజారు మీదుగా నడక సాగించడం ఆహ్లాదభరితంగా ఉంటుంది. * మాథేరాన్‌లోని అంబర్నాథ్ ఆలయం మరో పురాతన శివాలయం. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళా సౌందర్యం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఏం చేయాలి? * మాథేరాన్ పట్టణంలోకి కార్లు తదితర మోటారు వాహనాలను అనుమతించరు. పట్టణంలో తిరగాలంటే కాలినడకను ఆశ్రయించాలి. నడిచే ఓపిక లేకుంటే రిక్షాలపై ప్రయాణించవచ్చు. మరో విశేషమేమిటంటే ఇక్కడ గుర్రాలను అద్దెకిస్తారు. ఆసక్తి ఉన్న వారు గుర్రాలపై సవారీ చేస్తూ వీధులన్నీ చుట్టి రావచ్చు. * షార్లెట్ సరస్సు, లూయిసా పాయింట్, హనీమూన్ పాయింట్, ఎకో పాయింట్, కింగ్ జార్జి పాయింట్ తదితర వ్యూ పాయింట్ల వద్ద సరదాగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. * అంబర్నాథ్ ఆలయం, పిశర్నాథ్ మహాదేవ మందిరం వంటి పురాతన ఆలయాలతో పాటు కొండ శిఖరంపై నిర్మించిన ప్రబాల్ కోటను సందర్శించవచ్చు. * ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడ అడుగడుగునా తారసపడే కొండలపైకి, లోయల్లోకి దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల అడవుల్లో వనవిహారాలు చేయవచ్చు. ఏం కొనాలి? * చిన్న పట్టణం కావడంతో మాథేరాన్‌లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఏవీ ఉండవు. అయితే, మెయిన్ రోడ్డులో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే చిన్న చిన్న దుకాణాల్లో షాపింగ్ చేసుకోవచ్చు. * ఈ దుకాణాల్లో తోలు వస్తువులు, టోపీలు, షూస్, స్థానిక కళాకారులు పేము, ఎండిన పూలు వంటి వాటితో రూపొందించిన హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే మిఠాయి ‘చిక్కీ’ రుచిని ఆస్వాదించేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కొనుక్కుని తీసుకువెళతారు. * ఇక్కడి దుకాణాల్లో తేనె, వనమూలికలు, గాజు బొమ్మలు వంటివి కూడా చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు ముంబై విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి మాథేరాన్‌కు సమీపంలోని నేరల్ వరకు రైలులో రావచ్చు. * నేరల్ నుంచి మాథేరాన్‌కు టాయ్ ట్రెయిన్ అందుబాటులో ఉంటుంది. చాలా తాపీగా సాగే ఈ రైలు ప్రయాణాన్ని అడుగడుగునా ఆస్వాదించవచ్చు. * ఒకవేళ ముంబై మీదుగా రోడ్డుమార్గంలో రావాలనుకున్నా నేరల్ వరకు మాత్రమే బస్సులు లేదా ట్యాక్సీల్లో వచ్చి, అక్కడి నుంచి టాయ్ ట్రెయిన్ ద్వారా మాత్రమే మాథేరాన్‌కు రావాల్సి ఉంటుంది. * పుణే, ఔరంగాబాద్‌ల నుంచి కూడా నేరల్ వరకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.