కూల్ వెదర్‌లో నగరవాసుల ప్రయాణాలు
ప్రకృతి సోయగాలకు యువత దాసోహం
సెలవుల్లో హిల్ స్టేషన్లకు పరుగులు
దక్షిణాదిలోని ఆయా ప్రదేశాలపై స్పెషల్ ఫోకస్
నగరంలో సగటు వ్యక్తి సమయం ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్ తంటాలతోనే సగం గడిచిపోతోంది. డిసెంబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సెలవులకు ముగిరిపోయే సమయం ఆసన్నమైందని లెక్కలేసుకుంటారు. మరో వైపు క్రిస్మస్ సెలవులు.. దీంతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎత్తయిన కొండల్లో దాగిన సరస్సులు, భూమికి పచ్చని చీరకట్టినట్లుండే టీ, కాఫీ ఎస్టేట్‌లు, భూతల స్వర్గంలా పొగమంచు కమ్మిన ప్రాంతాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు హిల్ స్టేషన్స్ తమ డెస్టినేషన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలకూ డిమాండ్ ఉందని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగే టూర్ రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు శీతాకాలంలో దట్టమైన పొగ మంచు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణం.. రహదారులు, గుహల్లోంచి దూసుకుపోయే అద్దాల రైలు ప్రయాణం, రంగురంగుల పూల తోటలు, టీ, కాఫీ ఎస్టేట్స్, వంజంగి కొండపై నుంచి కనిపించే పొగ మంచు పొరలు కన్నులకు విందుగా అనిపిస్తుంది. దేశంలోనే అతి పెద్ద గుహలలో ఒకటైన బొర్రా గుహలు ఇక్కడ చూడొచ్చు. సుమారు 80 మీటర్ల లోతు గుహలో దిగొచ్చు. విశాఖపట్నంలో కైలాసగిరి, ఆర్‌కే బీచ్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
మండువేసవిలో దట్టమైన మేఘాలు..
ప్రిన్సెస్ ఆఫ్ ది హిల్‌గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ తమిళనాడులోనే ఉంది. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాల నడుమ సాగే ప్రయాణం, సరస్సులు, జలపాతాలు, పిల్లర్ రాక్, బ్రయంట్ పార్క్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పర్వతాలపై మండే వేసవిలో సైతం దట్టమైన మేఘాలు మనల్ని కమ్మేస్తాయి. కొడైకెనాల్‌ల్లో ప్రయాణం చేస్తుంటే.. మేఘాల్లో తేలిన ఫీల్ ఉంటుంది. శీతాకాలంలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది.
ముచ్చటగొలిపే మున్నార్..
కేరళలోని మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ప్రసిద్ధ ఎరవికులం జాతీయ పార్క్ మున్నార్ సమీపంలోనే ఉంటుంది. టీ ఎస్టేట్స్, మట్టుపెట్టి డ్యాం, ఆహ్లాదరకమైన గ్రీనరీ, ఎత్తయిన కొండలు చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. కేరళలోని మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వయనాడ్. పడమర కనుమలు, వివిధ రకాల పక్షలు, జంతువులు, కొండల మధ్య ప్రయాణం ఆకట్టుకుంటుంది. చెంబ్రా, బాణాసుర సాగర్ డ్యాం పర్యాటకులకు డెస్టినేషన్‌గా నిలుస్తాయి.
కూర్గ్‌లో ట్రెక్కింగ్..
కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ, మిరియాలు, యాలుకల తోటలతో సుమనోహరంగా ఉంటుంది. వైల్డ్ లైఫ్, అబ్బే జలపాతం, నగర్‌హోళె నేషనల్ పార్క్‌లు చూడదగ్గ ప్రదేశాలు. అదే సమయంలో నంది హిల్స్‌పై నుంచి సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. బెంగళూరు సమీపంలోని ఈ కొండల్లో భోగనందీశ్వరాలయం ఉంటుంది. నంది కోట ప్రధాన ఆకర్షణ.
క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్..
తమిళనాడులోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా పిలుస్తారు. స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్, నీలగిరి కొండలు, పర్వతాల మధ్య సరస్సులు, పచ్చని తోటలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఊటీని కొత్త జంటలు హనీమూన్ డెస్టినేషన్‌గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీకి సమీపంలోనే కూనూర్ ఉంటుంది. ఇక్కడ డాలి్ఫన్ నోస్, ల్యాంబ్స్ రాక్, టీ ఎస్టేట్స్ చూడొచ్చు.
ఐదు రోజుల ప్రయాణం అద్భుతం..
ఈ సీజన్‌లో హిల్ స్టేషన్స్ చూడటానికి బాగుంటాయని ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేద్దామని అడిగారు. కొడైకెనాల్ డెస్టినేషన్. మధ్యలో కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వెళ్లి రావడానికి 5 రోజులు పట్టింది. కొడైకెనాల్ ప్రయాణం మేఘాల్లో తేలినట్లుంది. మధ్యాహ్నం 12 అయినా అక్కడ రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించే పరిస్థితి లేదు. ఈ టూర్ మంచి అనుభూతినిచ్చింది.
– సాయి హర్ష, మణికొండ
ఆహ్లాదం.. ఆధ్యాత్మికం రెండూ..
ఈ సీజన్‌లో వెకేషన్,ఆధ్యాత్మికం కలిపి మిక్సడ్ టూర్ ప్లాన్స్ ఉంటున్నాయి. గోవా, రామేశ్వరం, ఊటి, కొడైకెనాల్, పాండిచ్చేరి, మున్నార్, మదురై, అరుణాచలం, శభరిమలై వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది ప్యాకేజీలు అడుగుతున్నారు. కొన్ని కుటుంబాలు వాహనం మాట్లాడుకుంటున్నారు.
– భాస్కర్‌రెడ్డి, శ్రీసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్
Comments
Please login to add a commentAdd a comment