Hill station
-
టూరు.. భలే జోరు..
నగరంలో సగటు వ్యక్తి సమయం ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్ తంటాలతోనే సగం గడిచిపోతోంది. డిసెంబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సెలవులకు ముగిరిపోయే సమయం ఆసన్నమైందని లెక్కలేసుకుంటారు. మరో వైపు క్రిస్మస్ సెలవులు.. దీంతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎత్తయిన కొండల్లో దాగిన సరస్సులు, భూమికి పచ్చని చీరకట్టినట్లుండే టీ, కాఫీ ఎస్టేట్లు, భూతల స్వర్గంలా పొగమంచు కమ్మిన ప్రాంతాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు హిల్ స్టేషన్స్ తమ డెస్టినేషన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలకూ డిమాండ్ ఉందని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగే టూర్ రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు శీతాకాలంలో దట్టమైన పొగ మంచు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణం.. రహదారులు, గుహల్లోంచి దూసుకుపోయే అద్దాల రైలు ప్రయాణం, రంగురంగుల పూల తోటలు, టీ, కాఫీ ఎస్టేట్స్, వంజంగి కొండపై నుంచి కనిపించే పొగ మంచు పొరలు కన్నులకు విందుగా అనిపిస్తుంది. దేశంలోనే అతి పెద్ద గుహలలో ఒకటైన బొర్రా గుహలు ఇక్కడ చూడొచ్చు. సుమారు 80 మీటర్ల లోతు గుహలో దిగొచ్చు. విశాఖపట్నంలో కైలాసగిరి, ఆర్కే బీచ్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మండువేసవిలో దట్టమైన మేఘాలు.. ప్రిన్సెస్ ఆఫ్ ది హిల్‌గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ తమిళనాడులోనే ఉంది. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాల నడుమ సాగే ప్రయాణం, సరస్సులు, జలపాతాలు, పిల్లర్ రాక్, బ్రయంట్ పార్క్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పర్వతాలపై మండే వేసవిలో సైతం దట్టమైన మేఘాలు మనల్ని కమ్మేస్తాయి. కొడైకెనాల్ల్లో ప్రయాణం చేస్తుంటే.. మేఘాల్లో తేలిన ఫీల్ ఉంటుంది. శీతాకాలంలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది. ముచ్చటగొలిపే మున్నార్.. కేరళలోని మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ప్రసిద్ధ ఎరవికులం జాతీయ పార్క్ మున్నార్ సమీపంలోనే ఉంటుంది. టీ ఎస్టేట్స్, మట్టుపెట్టి డ్యాం, ఆహ్లాదరకమైన గ్రీనరీ, ఎత్తయిన కొండలు చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. కేరళలోని మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వయనాడ్. పడమర కనుమలు, వివిధ రకాల పక్షలు, జంతువులు, కొండల మధ్య ప్రయాణం ఆకట్టుకుంటుంది. చెంబ్రా, బాణాసుర సాగర్ డ్యాం పర్యాటకులకు డెస్టినేషన్‌గా నిలుస్తాయి. కూర్గ్‌లో ట్రెక్కింగ్.. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ, మిరియాలు, యాలుకల తోటలతో సుమనోహరంగా ఉంటుంది. వైల్డ్ లైఫ్, అబ్బే జలపాతం, నగర్‌హోళె నేషనల్ పార్క్‌లు చూడదగ్గ ప్రదేశాలు. అదే సమయంలో నంది హిల్స్‌పై నుంచి సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. బెంగళూరు సమీపంలోని ఈ కొండల్లో భోగనందీశ్వరాలయం ఉంటుంది. నంది కోట ప్రధాన ఆకర్షణ.క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్.. తమిళనాడులోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా పిలుస్తారు. స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్, నీలగిరి కొండలు, పర్వతాల మధ్య సరస్సులు, పచ్చని తోటలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఊటీని కొత్త జంటలు హనీమూన్ డెస్టినేషన్‌గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీకి సమీపంలోనే కూనూర్ ఉంటుంది. ఇక్కడ డాలి్ఫన్ నోస్, ల్యాంబ్స్ రాక్, టీ ఎస్టేట్స్ చూడొచ్చు. ఐదు రోజుల ప్రయాణం అద్భుతం.. ఈ సీజన్లో హిల్ స్టేషన్స్ చూడటానికి బాగుంటాయని ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేద్దామని అడిగారు. కొడైకెనాల్ డెస్టినేషన్. మధ్యలో కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వెళ్లి రావడానికి 5 రోజులు పట్టింది. కొడైకెనాల్ ప్రయాణం మేఘాల్లో తేలినట్లుంది. మధ్యాహ్నం 12 అయినా అక్కడ రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించే పరిస్థితి లేదు. ఈ టూర్ మంచి అనుభూతినిచ్చింది. – సాయి హర్ష, మణికొండఆహ్లాదం.. ఆధ్యాత్మికం రెండూ..ఈ సీజన్లో వెకేషన్,ఆధ్యాత్మికం కలిపి మిక్సడ్ టూర్ ప్లాన్స్ ఉంటున్నాయి. గోవా, రామేశ్వరం, ఊటి, కొడైకెనాల్, పాండిచ్చేరి, మున్నార్, మదురై, అరుణాచలం, శభరిమలై వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది ప్యాకేజీలు అడుగుతున్నారు. కొన్ని కుటుంబాలు వాహనం మాట్లాడుకుంటున్నారు. – భాస్కర్‌రెడ్డి, శ్రీసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ -
10 Best Hill Stations In India: భారతదేశంలోని అందమైన హిల్ స్టేషన్లు (ఫోటోలు)
-
ఇదు శ్రీలంక: సీతా ఎలియా
శ్రీలంకలో పరిపాలన విభాగాలుగా బ్రిటిష్ వాళ్లు అనుసరించిన ప్రావిన్స్ విధానమే ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ‘సీతా ఎలియా’ అనే చిన్న గ్రామం శ్రీలంక సెంట్రల్ ప్రావిన్స్‌లో ఉంది. శ్రీలంకలో అందమైన హిల్ స్టేషన్ నువారా ఎలియాకు కిలోమీటరు దూరంలోనే ఉంది సీతా ఎలియా. ఎలియా అనే పదానికి సింహళలో వెలుతురు, కాంతి అనే అర్థాలు చెబుతారు. రామాయణ కాలంలో సీతాదేవి వనవాసం చేసిన అశోక వాటిక ఇదని చెబుతారు. ఇక్కడి ఆలయాన్ని ‘సీతా అమ్మన్ టెంపుల్’ అంటారు. అశోకవాటిక సీతాదేవిని రావణాసురుడు తన రాజ్యం శ్రీలంకకు అపహరించుకుని వెళ్లి అతడి రాజమందిరంలో ఆమెకు బస ఏర్పాటు చేస్తాడు. రావణాసురుడి రాజమందిరంలో నివసించడానికి సీతాదేవి అంగీకరించకపోవడంతో పైగా ఆమె ఎప్పుడూ అశోక చెట్టు కిందనే ఎక్కువ సమయం గడపడాన్ని గమనించిన రావణాసురుడు ఆమె ప్రకృతి ప్రేమికురాలని, ఆమెకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోరుకుంటోందని గ్రహించి ఈ ప్రదేశంలో బస ఏర్పాటు చేసినట్లు చెబుతారు. రావణాసురుడి భార్య మండోదరి కూడా ఈ వనానికి వచ్చి సీతాదేవిని కలిసేదని కూడా చెబుతారు. అశోకవాటిక నిజానికి మనసులోని శోకాన్ని దూరం చేసే అందమైన ప్రదేశమే. ప్రకృతి సౌందర్యానికి నెలువెత్తు నిదర్శనం. రావణాసురుడు మంచి కళాభిరుచి కలిగిన వాడని, సీతాపహరణం తప్ప మరేరకమైన అవగుణం లేదని చదివే వాళ్లం. అశోకవాటికను చూసినప్పుడు నిజమేననిపించింది. సీత అభిరుచిని గ్రహించడంతోపాటు ఆమె కోసం ఇలాంటి అందమైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం... రావణాసురుడి కళాహృదయానికి అద్దం పడుతోంది. ఇక్కడి సెలయేరు నిరంతరం ప్రవహిస్తుంటుంది. సెలయేటి తీరాన సీతాదేవి స్నానం చేసేదని చెప్పడానికి ఆనవాలుగా సిమెంటు నిర్మాణం ఉంది. సీతాన్వేషణలో భాగంగా శ్రీలంకకు వచ్చిన హనుమంతుడు... సీతాదేవిని కలిసింది ఇక్కడే. ఆ ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ సెలయేటి తీరాన శిల్పాలున్నాయి. భారతీయులు కట్టిన ఆలయం అశోకవాటికలో ఉన్న సీతా అమ్మన్ ఆలయం దక్షిణ భారత నిర్మాణశైలిలో ఉంది. తమిళనాడు నుంచి శ్రీలంకకు వలస కూలీలుగా వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయం లోపలి విగ్రహాల శిల్పనైపుణ్యం అద్భుతంగా ఉంది. కానీ ఆలయగోపురం మీద ఉన్న విగ్రహాలు శిల్పశాస్త్ర గణితానికి లోబడి ఉన్నట్లు అనిపించదు. విగ్రహం ఎత్తును అనుసరించి తల, మెడ, భుజాలు, దేహం, కాళ్ల పొడవులకు శాస్త్రబద్ధమైన కొలతలుంటాయి. శిల్పాన్ని చెక్కడానికి అవే ప్రధాన ఆధారం.ఆ తర్వాత ఎవరి విగ్రహాన్ని చెక్కుతుంటే సాహిత్యంలో వర్ణించిన ఆ వ్యక్తి దేహాకృతి, రూపలావణ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఆలయ గోపురం మీదున్న విగ్రహాలను చూస్తే శాస్త్రబద్ధమైన పొంతన సరిగ్గా కుదరలేదనిపిస్తుంది. మరి కొంత పరిశీలనగా చూస్తే మాత్రం... శ్రీలంక వాసుల దేహసౌష్ఠవం ప్రభావం ఈ శిల్పాల మీద ఉన్నట్లనిపిస్తుంది. అయితే కూలీలుగా వలస వెళ్లిన వాళ్లు తమకున్న పరిమితమైన వనరుసలతో చేసిన ప్రయత్నాన్ని గౌరవించకుండా ఉండలేం. యూ ట్యూబర్ల షూటింగ్ ఇక్కడ పర్యటనకు వచ్చే వాళ్లలో భారతీయులే ఎక్కువ. నేను వెళ్లినప్పుడు ఒక ఉత్తరాది మహిళ తన స్మార్ట్ ఫోన్లో ఆ ప్రదేశాన్ని షూట్ చేస్తూ కామెంటరీ ఇస్తూ కనిపించింది. మరికొంత మంది ఆకాశాన్నంటుతున్న మహావృక్షాలను, సెలయేటి జలప్రవాహ శబ్దాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రదేశం సౌందర్యాన్ని అచ్చంగా కళ్లకు కట్టాలంటే డ్రోన్ కెమెరాతో షూట్ చేయాల్సిందే. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!) ఈ లింక్‌పై క్లిక్‌చేసి వాట్సాప్ ఛానెల్‌ని ఫాలోకండి -
మెట్రోలు, హిల్ స్టేషన్లకే మొగ్గు
ముంబై: దేశీయంగా మెట్రో నగరాలు, హిల్స్టేషన్లతో కూడిన పర్యాటక ప్రదేశాల సందర్శనకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలలపై ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ‘బుకింగ్ డాట్ కామ్’ నివేదిక విడుదల చేసింది. హైదరాబాద్, న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, మనాలీ, రిషికేశ్, వారసత్వ సంపదకు నిలయమైన జైపూర్ తదితర ప్రాంతాలను ఎక్కువ మంది సందర్శించేందుకు ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా చూస్తే, దుబాయి, బ్యాంకాక్, లండన్, సింగపూర్, కౌలాలంపూర్, హోచిమిన్హ్, ప్యారిస్, హనోయ్ ప్రాంతాలను సందర్శించేందుకు భారత పర్యాటకులు ఎక్కువ మంది బుకింగ్ చేసుకున్నారు. హోటళ్లకు అదనంగా, రిసార్ట్లు, గెస్ట్ హౌస్‌లు, ఆతిథ్య గృహాలు పర్యాటకుల ప్రాధాన్యంగా ఉన్నాయి. ఈ దేశాల నుంచి ఎక్కువగా.. మొదటి ఆరు నెలల్లో యూఎస్, బంగ్లాదేశ్, రష్యా, యూఏఈని నుంచి ఎక్కువ మంది భారత్‌ను సందర్శించారు. అలాగే, విదేశీ పర్యాటకులు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు మెట్రోలను ఎక్కువగా చూశారు. 86 శాతం భారత పర్యాటకులు వచ్చే 12 నెలల్లో తమ పర్యటనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘‘స్థూల ఆర్థిక సమస్యలను పర్యాటక రంగం ఎదుర్కొంటున్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం ఎంతో ఆదరణకు నోచుకుంటోంది. హోటళ్లే కాకుండా పర్యాటకులు ప్రత్యామ్నాయ ఆతిథ్యాలను కూడా ఎంపిక చేసుకుంటున్నారు’’అని బుకింగ్ డాట్ కామ్ కంట్రీ మేనేజర్ సంతోష్ కుమార్ తెలిపారు. -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన హిల్ స్టేషన్లు
-
ఇండియాలోనూ మినీ స్విట్జర్లాండ్... ఎక్కడో తెలుసా!
ఇంటి మీద కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా కట్టిన ఏటవాలు పై కప్పు నిర్మాణాలు... బరువైన ఉన్నితో దేహాన్ని భారంగా కదిలించే గొర్రెలు... లేత ఆకుపచ్చని నేల...ముదురు ఆకుపచ్చని చెట్లు... పారాషూట్లో నేలకు దిగే అమ్మాయిలు... హార్స్ రైడింగ్‌కి సిద్ధమవుతున్న కుర్రాళ్లు... చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడిచే హనీమూన్ కపుల్. ఈ ప్రదేశం స్విట్జర్లాండేమో అనే భ్రమ కల్పిస్తోంది... కానీ ఇది ఇండియానే... ఇండియాలో ఉన్న మినీ స్విట్జర్లాండ్. ఖజ్జైర్ చిన్న హిల్ స్టేషన్. హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఆరువేల ఐదు వందల అడుగుల ఎత్తులో విశాలమైన ప్రదేశంలో ఓ సరస్సు, ఆ సరస్సు మధ్యలో నీటి మీద తేలుతున్న ఓ దీవి. ఎగిరి దూకినా సరే... దెబ్బ తగలని మెత్తటి పచ్చిక బయళ్లు... పిల్లలు ముచ్చపడడానికి ఇంకేం కావాలి. ఆహ్లాదకరమైన వాతావరణం కావడంతో హనీమూన్ కపుల్ మనసులను దోచుకుంటోంది. పదాలు రాని వాళ్ల చేత కవిత్వం చెప్పించగలిగించే అందమైన ప్రదేశం ఖజై్జర్. ప్రకృతి ప్రేమికులైతే ఈ ప్రదేశాన్ని చూస్తూ దివి నుంచి భువికి దిగి వచ్చిన స్వర్గం అంటారు. మంచులో తడిసిన చెట్లను చూస్తూ... మంచు తివాచీ పరుచుకున్న తెల్లటి నేల మీద నడవాలంటే శీతాకాలంలో వెళ్లాలి. ఖజ్జైర్ సరస్సు నుంచి కొద్ది దూరం నడిస్తే బంగారు గోపురం ఉన్న పన్నెండవ శతాబ్దం నాటి ఆలయం కనిపిస్తుంది. చంబాను ఏలిన రాజు పృథ్వీసింగ్ కట్టించిన ఆలయం అది. ఖజై్జర్ నుంచి దైన్‌కుండ్ వరకు మూడున్నర కిలోమీటర్ల ట్రెకింగ్ పాథ్ ఉంది. ఇది దేహదారుఢ్యానికి పరీక్ష పెట్టే ట్రెకింగ్ కాదు. చాలా సునాయాసంగా పూర్తి చేయవచ్చు. కాబట్టి పిల్లలతో వెళ్లిన వాళ్లు కూడా ప్రయత్నించవచ్చు. -
కరోనా పొంచి ఉన్నా నిర్లక్ష్యమేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు, నిపుణులు పదేపదే సూచిస్తున్నప్పటికీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. హిల్ స్టేషన్లతో పాటు మార్కెట్లలో జనం విచ్చలవిడిగా సంచరిస్తున్నారని, నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆక్షేపించింది. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా బుధవారం ప్రత్యేకంగా లేఖ రాశారు. ప్రజా రవాణాలో కోవిడ్–19 ప్రోటోకాల్‌కు ఏమాత్రం కట్టుబడి ఉండడం లేదని, భారీ సంఖ్యలో జనాలు బహిరంగ ప్రదేశాలకు వస్తున్నారని, అక్కడ సామాజిక దూరం సైతం పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం కోవిడ్–19 రెండో వేవ్ ఇంకా ముగియలేదని, ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాల్సిందేనని అజయ్ భల్లా సూచించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజా రవాణా, హిల్ స్టేషన్లలో కోవిడ్–19 నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్లే కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని, ఇది ఆందోళనకరమైన విషయమని భల్లా తెలిపారు. అన్ని ప్రదేశాల్లో కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలను పాటించని పక్షంలో కఠిన ఆంక్షలు విధించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించేవారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కరోనా ఆంక్షలను సడలించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించారు. -
Ponmudi: కేరళ బంగారం.. పొన్ ముడి
కశ్మీరు లోయ... కన్యాకుమారి చెంతకు వచ్చినట్లుంది. సముద్రం అంటే ఏమిటో ఎరుగని కశ్మీర్ పశ్చిమ కనుమలను ఆసరాగా చేసుకుంటూ అరేబియా తీరం వెంబడే దక్షిణాదికి నడిచి వచ్చినట్లు ఉంటుంది పొన్ముడి. పొన్ముడి అంటే బంగారు శిఖరం అని అర్థం. ఇక్కడి వాతావరణాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వాళ్లు ఈ ప్రదేశాన్ని కశ్మీర్‌తో పోలుస్తారు. కేరళలోని ఈ హిల్స్టేషన్లో ఏడాదంతా ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయి. పర్వత శిఖరాలను తాకుతూ ప్రయాణించే మబ్బులను దక్షిణాదిలో చూడాలంటే ఈ పొన్ముడిలోనే సాధ్యం. ఈ కేరళ కాశ్మీరం ఆ రాష్ట్ర రాజధాని త్రివేండ్రం నగరానికి డెబ్బై కిలోమీటర్ల దూరాన ఉంది. జ్ఞాపకంగా ఓ రాయి త్రివేండ్రం నుంచి మొదలైన రోడ్డు ప్రయాణంలో నగరాన్ని వదిలినప్పటి నుంచి పశ్చిమ కనుమల పచ్చదనం ఆహ్వానిస్తుంది. రోడ్డు మలుపులు తిరుగుతూ ఉంటుంది. కొంతసేపటికి ఏ దిక్కుగా ప్రయాణిస్తున్నామో కూడా అర్థం కాదు. ఈ మధ్యలో కల్లేరు నది పలకరిస్తుంది. ఈ నదిలో రాళ్లు నీటి ప్రవాహానికి అరిగిపోయి నునుపుదేలి ఉంటాయి. బాగా నునుపుదేలిన ఒక రాయిని వెంట తెచ్చుకుంటే పొన్ ముడి టూర్ జ్ఞాపకంగా ఉంటుంది. పొన్ ముడి శిఖరం మీద నిలబడి ఆత్మప్రదక్షిణం చేసుకుంటే ప్రకృతి విజయం కనువిందు చేస్తుంది. గ్లోబల్ వార్మింగ్‌లు, సునామీలు ఎన్ని విపత్తులు వచ్చినా ప్రకృతి తిరిగి చిగురించడం మానదు. అదే ప్రకృతి సాధించే విజయం. ఇక పొన్ ముడి టూర్లో తీరాల్సిన అద్భుతం అందమైన సూర్యోదయం. పశ్చిమ కోన వరయాడు అంటే నీలగిరి థార్. నీలగిరి థార్ ఉండే ఎల్తైన ప్రదేశమే వరయాడు మొట్ట. ఇది మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తు ఉంటుంది. కల్లేరు నదికి పొన్ ముడి పర్వత శిఖరానికి మధ్యలో వరయాడు మొట్ట వస్తుంది. ఇది పదమూడు శిఖరాల సమూహం. ఇందులో సెకండ్ హయ్యస్ట్ వరయాడు మొట్ట. సౌత్ ఇండియాలో అడ్వంచరస్ ట్రెక్కింగ్ పాయింట్. ట్రెకింగ్ మొదలైన అరగంటకే ఉచ్ఛ్వాశ నిశ్వాసల వేగం పెరుగుతుంది, శబ్దం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ట్రెకింగ్‌కి రెండు నెలలు ముందు బుక్ చేసుకోవాలి. జంతుప్రేమికులు, పక్షి ప్రేమికులు వాళ్ల ఆసక్తిని బట్టి వరయాడు మొట్ట, సీతతీర్థం మీదుగా పొన్ ముడి చేరుకోవచ్చు. ట్రావెల్ టిప్ ట్రెకింగ్‌కి వెళ్లే వాళ్లు షూస్ పట్ల ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి. పాదానికి, మడమకు అదనపు ఒత్తిడి కలగకుండా సౌకర్యంగా ఉండాలి. అలాగే ట్రెకింగ్ మొదలు పెట్టేటప్పుడు సాక్స్ ధరించడానికి ముందు పాదానికి, వేళ్ల సందుల్లో టాల్కమ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల రోజంతా షూస్‌తోనే ఉన్నప్పటికీ పాదాలు తాజాగా ఉంటాయి. చెమటతో చిరాకు కలగదు. వరయాడు మొట్టకు పర్యాటకుల ట్రెకింగ్ -
కోవిడ్ ముప్పు తొలిగిపోలేదు.. జాగ్రత్త: కేంద్రం హెచ్చరిక
న్యూఢిల్లీ: కోవిడ్ నిబంధనలను ఖాతరు చేయకుండా జనం పర్యాటక హిల్ స్టేషన్లు, మార్కెట్లలో పెద్ద సంఖ్యలో సంచరిస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి తీరుతో ఇప్పటి వరకు కోవిడ్ మహమ్మారిపై దేశం సాధించిన ఫలితం వృథాగా పోతుందని పేర్కొంది. కోవిడ్ ముప్పు ఇంకా తొలగి పోలేదని పేర్కొన్న ప్రభుత్వం.. ప్రముఖ హిల్ స్టేషన్లకు పెద్ద సంఖ్యలో జనం పోటెత్తడం ఆందోళ నకరమని వ్యాఖ్యానించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటించకపోవడం కేసులను మరింతగా పెంచడానికి కారణమవుతుందని హెచ్చరించింది. ‘చాలా రాష్ట్రాల్లో సెకండ్‌వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ సెకండ్ వేవ్‌తో పాజిటివిటీ రేటు ఇప్పటికీ 10%పైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంక్షలను అమలు చేయడం/ కొనసాగించడం చేయాల్సి రావచ్చు. దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 73 జిల్లాల్లో జూన్ 29–జూలై 5వ తేదీ మధ్యలో పాజిటివిటీ రేటు 10% పైగానే నమో దైంది. జూలై 4వ తేదీ నాటికి 91 జిల్లాల్లో రోజువారీ కేసులు 100కు పైగానే ఉంటున్నాయి. దేశంలో నమోదవుతున్న 80% కేసులు 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 90 జిల్లాల నుంచే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కోవిడ్ అప్రమత్తత కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తోంది’ అని ఓ అధికారి అన్నారు. కాగా, అండమాన్ నికోబార్ దీవుల్లో 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇక్కడ మొత్తం 7,482 కేసులు నమోదు కాగా, 128 మరణాలు సంభవించాయి. 3 నెలల్లో కనిష్ట స్థాయికి రోజువారీ మరణాలు దేశంలో కోవిడ్ బాధిత మరణాలు 90 రోజుల్లోనే అతి తక్కువగా ఒక్క రోజులో 553 నమోదైనట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 4,03,281కి చేరుకుందని మంగళవారం పేర్కొంది. అదేవిధంగా, 111 రోజుల తర్వాత రోజువారీ కోవిడ్ 24 గంటల్లో 34,703 నమోదయ్యాయి. దీంతో, మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది. దీంతోపాటు, 101 రోజుల తర్వాత అతి తక్కువగా 4,64,357 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. -
ఈ రాయి పేరు లవ్రాక్ ఎందుకంటే...
రాజస్థాన్‌లోని హిల్‌స్టేషన్ మౌంట్ అబూ. ఈ కొండ మీద పెద్ద సరస్సు, పేరు నక్కీ లేక్. ఈ సరస్సును చుట్టినట్లున్న రోడ్డు వెంట ముందుకు వెళ్తే... హనీమూన్ స్పాట్‌కు చేరుతాం. అక్కడ కొండ రాయి పేరు లవ్రాక్. ఈ పేరు ఎందుకంటే... దూరం నుంచి చూస్తే ఒక అబ్బాయి, అమ్మాయిని ఆలింగనం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రేమికులకు ప్రకృతి కల్పించిన ఏకాంత సౌధం ఇది. ఆ రాయి దగ్గర జంట ఏకాంతంగా కూర్చుని మౌంట్ అబూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించవచ్చు. సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి కూడా ఇది చక్కటి పాయింట్. సూర్యుడు త్రీడీ ఎఫెక్ట్‌లో ముందుకు జరుగుతూ మనకు దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే మౌంట్ అబూ టూర్ ప్యాకేజ్‌లో చూపించే సన్‌సెట్ పాయింట్ ఇది కాదు. మౌంట్ అబూలో మరో సన్‌సెట్ పాయింట్ కూడా ఉంది. ఈ రాయి ఏ ఆధారమూ లేకుండా గాల్లో నిలిచి ఉండడంతో అనాధార శిఖరం అంటారు. మౌంట్ అబూ ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలోనే అయినా, విమానంలో వెళ్లే వాళ్లు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగడమే సౌకర్యం. అక్కడి నుంచి మౌంట్ అబూ 225 కిమీల దూరం. ( చదవండి: ఐదేళ్ల చిన్నారి.. రీడింగ్ రికార్డు ) -
వరుస సెలవులు.. ఎంచక్కా చెక్కేద్దాం
సాక్షి, హైదరాబాద్: కరోనా కారణంగా గడిచిన ఏడాదంతా దాదాపు ఇళ్లకే పరిమితమైన హైదరాబాద్ నగర పౌరులు ప్రస్తుత రిలాక్స్ అయ్యేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. కనీసం రెండు, మూడు రోజుల పాటైనా బిజీ, రొటీన్లైఫ్కు, నగర రణగొణ ధ్వనులకు దూరంగా గడపాలని గట్టిగా కోరుకుంటున్నారు. వరుసగా రెండు వారాంతాల్లో మూడేసి రోజులు సెలవులు రావడంతో ‘మినీ వెకేషన్’ప్లాన్ చేసుకున్నారు. 29న (సోమవారం) హోలీ ఉండటంతో ఈ వీకెండ్లో వరుస మూడురోజులు సెలవులు వచ్చాయి. అలాగే వచ్చే వీకెండ్లో కూడా... ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే, 3న శనివారం, 4న ఆదివారం (ఈస్టర్) ఇలా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. దీంతో పట్టణాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో సేదదీరేందుకు సిద్ధమయ్యారు. వేసవి కావడంతో హిల్స్టేషన్లు, చెట్లు చేమలతో పచ్చటి వాతావరణం ఉన్న ప్రదేశాలకు చెక్కేస్తున్నారు. తాముంటున్న పట్టణాలు, నగరాల నుంచి సుదూర ప్రాంతాలకు కాకుండా తమ సొంత వాహనాల్లో వెళ్లి మూడు రోజుల గడిపేలా సమీపంలోని అహ్లాదకరమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం దేశంలోని పట్టణ ప్రజలు తమకు దగ్గరలోని విల్లాలు, రిసార్ట్లు, హాలిడే స్పాట్లు, హిల్స్టేషన్లు, తదితరాలను ముందుగానే బుక్ చేసుకున్నట్టుగా వివిధ రిసార్ట్స్, హాలిడే నిర్వహణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. గత ఏడాది కాలంగా తీసుకుంటే ప్రస్తుత ‘హోలీ, గుడ్ ఫ్రైడే వీకెండ్స్’లోనే అత్యధిక హాలిడే బుకింగ్‌లు వచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడెక్కడికి వెళుతున్నారంటే... ► నైనిటాల్, మనాలీ, గ్యాంగ్‌టక్, డార్జిలింగ్, లోనావాలా, రిషికేష్ వంటి హిల్స్టేషన్లను అత్యధికులు బుక్ చేసుకున్నట్టుగా మేక్ మై ట్రిప్ ప్రతినిధి తెలిపారు. ► మినీ వెకేషన్ల సందర్భంగా కరోనా వైరస్ బారినపడకుండా ఎక్కువగా రద్దీ లేని ప్రాంతాలు, హిల్స్టేషన్లు, పరిమితంగా అతిధులకు ఆతిధ్యమిచ్చే పర్యాటక కేంద్రాలను ఎంచుకున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ► లగ్జరీల కోసం కొంత ఎక్కువ డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధపడే వారు ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అకామిడేషన్స్, విల్లాలను ఎంచుకుంటున్నారు. ► ముందస్తుగా హాలిడే బుకింగ్ కోసం ఎంక్వైవరీ చేసే వారి సంఖ్య 50 శాతం పెరిగినట్టు యాత్ర డాట్ కామ్ తెలిపింది. ► గోవా, జైపూర్, పాండిచ్చేరి, షిమ్లా, నైనిటాల్, అమృత్సర్ వంటి ప్రాంతాల్లోని హాలిడే స్పాట్లలో గడిపేందుకు ఉత్సుకత ప్రదర్శించినట్టు యాత్రా.కామ్ ప్రతినిధి శ్వేతా సింఘాల్ తెలిపారు. ► మహాబలేశ్వరం, కార్బేట్, ముస్సోరీ, కందాఘాట్, నాల్డెహ్రా, గోవా వంటి ప్రాం తాల్లోని రిసార్ట్‌లలో దాదాపు వందశాతం ఆక్యుపెన్సీ వచ్చినట్లు మహీంద్రా హాలిడేస్ అండ్ రిసార్ట్స్ చీఫ్ వర్కింగ్ ఆఫీసర్ వివేక్ ఖన్నా వివరించారు. ► స్విమ్మింగ్ పూల్స్, ఇతర అత్యాధునిక సదుపాయాలు, వసతులున్న పర్సనల్ విల్లాల్లో ఉండాలని కోరుకుంటున్న వారి సంఖ్య కూడా పెరిగినట్టు థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్ అధ్యక్షుడు రాజీవ్ కాలే తెలిపారు. ► కొందరు మాత్రం ఈ మినీ వెకేషన్ కోసం మరీ సుదీర్ఘ ఫ్లైట్ టైమ్ కాకుండా తక్కువ సమయంలో విమానంలో వెళ్లగలిగే అండమాన్ నికోబార్, శ్రీనగర్ వంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నట్టు మేక్ మై ట్రిప్ వెల్లడించింది. -
విసిగిపోయిన కూలీ.. ఇప్పుడు హీరో!!
పాలకుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఊరి సమస్యను పరిష్కరించేందుకు తానే నడుం బిగించాడు. కిలోమీటరు మేర స్వయంగా రోడ్డు నిర్మించి అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. కెన్యాలోని కగండా గ్రామానికి చెందిన రోజూవారీ కూలీ నికోలస్ ముచామి.. పొదలతో నిండిపోయిన రోడ్డును బాగు చేయాలంటూ ప్రభుత్వాధికారులకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టాడు. కొండప్రాంతంలో ఉన్న తమ గ్రామం నుంచి బాహ్య ప్రపంచానికి వెళ్లడానికి మహిళలు, పిల్లలు, వృద్ధులు పడుతున్న అగచాట్ల గురించి వివరించాడు. కానీ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించకుండా.. అసలు ఇదొక సమస్యే కాదన్నట్లు తేలిగ్గా తీసుకున్నారు. ఉదయం 6 గంటలకే మొదలు.. ఈ విషయం గురించి ముచామి మాట్లాడుతూ.. ‘ మట్టిరోడ్డు సరిగ్గా లేక ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడ్డాం. స్థానిక నాయకులు, అధికారులకు లెక్కలేనన్ని వినతి పత్రాలు ఇచ్చాను. కానీ ఫలితం మాత్రం శూన్యం. అందుకే నేనే రంగంలోకి దిగాను. రోజూ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకా శ్రమించాను. నా దగ్గరున్న పనిముట్ల సాయంతో రోడ్డు నిర్మించా. దగ్గర్లోని షాపింగ్ సెంటర్, చర్చికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసమే నేను ఈ పనికి పూనుకున్నా’ అని చెప్పుకొచ్చాడు. కష్టాల నుంచి తమకు విముక్తి కలిగించిన ముచామికి రుణపడి ఉంటామని కగండా గ్రామస్తులు అతడిని ప్రశంసిస్తున్నారు. -
వేసవిలో చల్లగా...విహరిద్దాం హాయిగా..
ఏప్రిల్ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అనిపిస్తుంది కదా. ఎండ తీవ్రతని ఎలాను తగ్గించలేము కాబట్టి ఓ వారం రోజులు అలా చల్లటి ప్రదేశాల్లో విహరించొద్దాము. మళ్లీ దీని కోసం దేశం దాటి వెళ్లాల్సిన పనిలేదు. ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న బడ్జెట్లోనే దేశ రాజధాని చుట్టూ ఉన్న అందాలను సందర్శించుకుందా, చల్లగా సేద తీరుదాము. ఒక్కో ప్రదేశానికి ఒక వారంతం సరిపోతుంది. లాన్స్‌డౌన్... ఢిల్లీ నుంచి కేవలం 260కిమీ దూరాన ఉన్న లాన్స్‌డౌన్‌ను చేరుకోవడానికి 6-7 గంటల ప్రయాణం చేయాలి. ఇక్కడ బస చేయడానికి ఖరీదైన హోటల్లు రిసార్టులు ఉండవు. మన బడ్జెట్లోనే ఇంటి వాతవరణాన్ని తలపించే వసతి లభిస్తుంది. ట్రెక్కింగ్ ఆసక్తి ఉన్న వారికి సరిగ్గ సరిపోయే ప్రదేశం లాన్సడౌన్. హిమాలాయాలను సందర్శించడానకి ప్రసిద్ధికెక్కిన టిపి టాప్ పాయింట్లకు నెలవు ఈ ప్రదేశం. ఇవే కాక భీమ్ పకోర, తారకేశ్వర్ మహాదేవ్ ఆలయం, భుల్ల తాల్ ఇక్కడి దర్శనీయ ప్రదేశాలు. కసౌలి... ఢిల్లీ నుంచి సుమారు 290కి.మీ. దూరాన హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడానికి అయిదారు గంటల సమయం పడుతుంది. సిమ్లాకు సమీపాన ఉన్న కసౌలి చల్లని ప్రాంతమే కాక హిమాచల్‌లో ఉన్న మిగితా వేసవి విడిది ప్రాంతాల కన్నా చాలా అందమైన ప్రదేశం. నేటికి చెక్కుచెదరకుండా ఉన్న కాలనీల నిర్మాణాలు అలనాటి నిర్మాణ కౌశాలనికి నిదర్శనం. గ్రామీణ వాతావరణాన్ని, అనేక ఆలయాలను, అందమైన ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. ప్రసిద్ధ మోహన్ మెయ్కిన్ బ్రేవరీ ఇక్కడే ఉంది. ముస్సోరి... ఢిల్లీకి 285 కి.మీ. దూరాన ఉన్న ముస్సోరిని చేరుకోవడానికి ఏడు గంటల సమయం పడుతుంది. అత్యంత రద్దీగా ఉండే ముస్సోరిని చేరుకోవడానికి రోడ్డు మార్గం కన్నా శివారు ప్రాంతాల గుండా వెళ్తే ముస్సోరి అసలు సౌందర్యం కనిపిస్తుంది. భోజన ప్రియులకు స్వర్గధామం ఈ ప్రాంతం. రెస్టారెంట్లు, కేఫేలు కొకొల్లలుగా ఉంటాయి. ఇక్కడ స్థానిక హిమాలయ ప్రాంత ఆహారమే కాకుండా యూరోపియన్ ఆహారం కూడా లభిస్తుంది. రస్కిన్ బాండ్ ప్రముఖ పుస్తకాల దుకాణం ఇక్కడే ఉంది. నౌకుచైతాల్... ఢిల్లీకి 320కి.మీ. దూరాన ఉన్న నౌకుచైతాల్ ప్రాంతాన్ని చేరుకోవడానికి సుమారు ఏడు గంటల ప్రయాణం చేయాలి. నైనితాల్ - భీమ్‌తాల్‌కు సమీపాన ఉండటంతో ఈ ప్రాంతానికి యాత్రికుల రద్దీ తక్కువ. జనావాసాలకు దూరంగా, ఒంటరిగా, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం సరిగ్గా సరిపోతుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ నౌకుచైతాల్ సరస్సు. చుట్టూ కొండలతో ఉండే ఈ సరసుకు తొమ్మిది మూలలు ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతానికి నౌకుచైతాల్ అనే పేరు వచ్చింది. సాహసాలు ఇష్టపడే వారికి ట్రెక్కింగ్‌తో పాటు పారాగ్లైడింగ్, పారాసెయిలింగ్ చేయడానకి కూడా అవకాశం ఉంటుంది. నహాన్... శివాలిక్ పర్వత శ్రేణులకు, హిమాలయాలకు మధ్య ఉన్న ప్రదేశం నహాన్. ఢిల్లీ నుంచి 250కి.మీ. దూరాన ఉన్న ఈ ప్రదేశాన్ని చేరడానికి 4 నుంచి 5గంటల పాటు ప్రయాణం చేయాలి. చుట్టూ పచ్చని పచ్చదనం పరుచుకున్న ప్రదేశం కావడంతో ఇక్కడికి వచ్చే వారు ఎక్కువగా హోటల్లలో కన్నా శివారు ప్రాంతాల్లోఉండటానికి ఇష్టపడతారు. మనలో నూతనోత్సహం నింపే సరైన యాత్రా ప్రదేశం ఇదే. రేణుక సరస్సు, పౌంతా సాహిబ్, త్రిలోక్‌పూర్ ఆలయం, సుకేతి శిలాజాల పార్కు ఇక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాలు. -
మార్వెలస్ మాథేరాన్
టూర్‌దర్శన్ ప్రకృతి అందాలకు నెలవైన పడమటి కనుమల్లో మాథేరాన్ చాలా చిన్న పట్టణం. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న ఈ ప్రదేశం మన దేశంలోనే అతి చిన్న హిల్‌స్టేషన్. ఇక్కడి జనాభా పట్టుమని పదివేలు కూడా ఉండదు. వాహనాల రణగొణలు ఏమాత్రం వినిపించవు. ఎలాంటి హడావుడీ కనిపించదు. చుట్టూ నింగిని తాకే కొండలు... పచ్చదనం నింపుకున్న లోయలు... పక్షుల కిలకిలలు... వనవిహారంపై మక్కువ గలవారు మాథేరాన్‌ను చూస్తే... ‘మార్వెలస్’ అనకుండా ఉండలేరు. మాథేరాన్‌ను 1850లో అప్పటి థానే కలెక్టర్ హఫ్ పాయింజ్ మాలెట్ తొలిసారిగా గుర్తించాడు. ఇక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై, విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో ఈ ప్రదేశాన్ని పట్టణంగా అభివృద్ధి చేసేందుకు అప్పటి బాంబే గవర్నర్ లార్డ్ ఎల్ఫిన్‌స్టోన్ దీనికి శంకుస్థాపన చేశాడు. అప్పటి నుంచి ఇక్కడ జనావాసాలు ఏర్పడ్డాయి. తర్వాత 1907లో వ్యాపారవేత్త సర్ అదామ్జీ పీర్‌భోయ్ సమీపంలోని నేరల్ వరకు మాథేరాన్ హిల్ రైల్వే లైన్‌ను నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఈ రెండు పట్టణాల మధ్య టాయ్ ట్రెయిన్‌ను నడుపుతున్నారు. ఏం చూడాలి? * పడమటి కనుమల అందాలను తనివితీరా చూసి తీరాల్సిందే. కొండ శిఖరాలపై ఉన్న లూయిసా పాయింట్, పనోరమా పాయింట్, హనీమూన్ పాయింట్, పోర్కుపైన్ పాయింట్, అలెగ్జాండర్ పాయింట్, ఎకో పాయింట్, వన్ ట్రీ పాయింట్ వంటి ప్రదేశాల నుంచి తిలకిస్తే మాథేరాన్ పట్టణంతో పాటు చుట్టుపక్కల కొండలు, పచ్చదనంతో నిండిన లోయల అందాలు కనువిందు చేస్తాయి. * నెరల్-మాథేరాన్‌ల మధ్య కొండ మార్గంలో నడిచే టాయ్ ట్రెయిన్లో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను తిలకించడం అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. * మాథేరాన్ మెయిన్ రోడ్డుకు కేవలం కిలోమీటరు దూరంలోనే షార్లట్ సరస్సు వర్షాకాలంలో జలకళతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సరస్సుకు సమీపంలోనే పురాతనమైన పిశర్నాథ్ మహాదేవ్ ఆలయం ఉంది. ఇందులోని స్వయంభూ లింగాన్ని సిందూరంతో అర్చిస్తారు. ఆలయం వద్ద నుంచి తిలకిస్తే సరస్సు పరిసరాలు ఆహ్లాదభరితంగా కనిపిస్తాయి. * మాథేరాన్ మెయిన్‌రోడ్డుపై ఉన్న సెంట్రల్ బజారులోని దుకాణాలు స్థానిక సంస్కృతికి అద్దం పడతాయి. ఈ బజారు మీదుగా నడక సాగించడం ఆహ్లాదభరితంగా ఉంటుంది. * మాథేరాన్‌లోని అంబర్నాథ్ ఆలయం మరో పురాతన శివాలయం. పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళా సౌందర్యం సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఏం చేయాలి? * మాథేరాన్ పట్టణంలోకి కార్లు తదితర మోటారు వాహనాలను అనుమతించరు. పట్టణంలో తిరగాలంటే కాలినడకను ఆశ్రయించాలి. నడిచే ఓపిక లేకుంటే రిక్షాలపై ప్రయాణించవచ్చు. మరో విశేషమేమిటంటే ఇక్కడ గుర్రాలను అద్దెకిస్తారు. ఆసక్తి ఉన్న వారు గుర్రాలపై సవారీ చేస్తూ వీధులన్నీ చుట్టి రావచ్చు. * షార్లెట్ సరస్సు, లూయిసా పాయింట్, హనీమూన్ పాయింట్, ఎకో పాయింట్, కింగ్ జార్జి పాయింట్ తదితర వ్యూ పాయింట్ల వద్ద సరదాగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. * అంబర్నాథ్ ఆలయం, పిశర్నాథ్ మహాదేవ మందిరం వంటి పురాతన ఆలయాలతో పాటు కొండ శిఖరంపై నిర్మించిన ప్రబాల్ కోటను సందర్శించవచ్చు. * ట్రెక్కింగ్‌పై ఆసక్తి గలవారు ఇక్కడ అడుగడుగునా తారసపడే కొండలపైకి, లోయల్లోకి దిగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. చుట్టుపక్కల అడవుల్లో వనవిహారాలు చేయవచ్చు. ఏం కొనాలి? * చిన్న పట్టణం కావడంతో మాథేరాన్‌లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ఏవీ ఉండవు. అయితే, మెయిన్ రోడ్డులో స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే చిన్న చిన్న దుకాణాల్లో షాపింగ్ చేసుకోవచ్చు. * ఈ దుకాణాల్లో తోలు వస్తువులు, టోపీలు, షూస్, స్థానిక కళాకారులు పేము, ఎండిన పూలు వంటి వాటితో రూపొందించిన హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే మిఠాయి ‘చిక్కీ’ రుచిని ఆస్వాదించేందుకు చాలామంది ఇష్టపడతారు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కొనుక్కుని తీసుకువెళతారు. * ఇక్కడి దుకాణాల్లో తేనె, వనమూలికలు, గాజు బొమ్మలు వంటివి కూడా చౌకగా దొరుకుతాయి. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు ముంబై విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి మాథేరాన్‌కు సమీపంలోని నేరల్ వరకు రైలులో రావచ్చు. * నేరల్ నుంచి మాథేరాన్‌కు టాయ్ ట్రెయిన్ అందుబాటులో ఉంటుంది. చాలా తాపీగా సాగే ఈ రైలు ప్రయాణాన్ని అడుగడుగునా ఆస్వాదించవచ్చు. * ఒకవేళ ముంబై మీదుగా రోడ్డుమార్గంలో రావాలనుకున్నా నేరల్ వరకు మాత్రమే బస్సులు లేదా ట్యాక్సీల్లో వచ్చి, అక్కడి నుంచి టాయ్ ట్రెయిన్ ద్వారా మాత్రమే మాథేరాన్‌కు రావాల్సి ఉంటుంది. * పుణే, ఔరంగాబాద్‌ల నుంచి కూడా నేరల్ వరకు రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. -
నైనిటాల్.. నయన మనోహరం!
వేసవి మొదలైందంటే చాలు.. మండే ఎండల నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు చల్లటి ప్రాంతాల సందర్శనకు టూర్లు ప్లాన్లు మొదలు పెడతారు. వాటిలో హిల్స్టేషన్లదే అగ్రస్థానం. అలాంటి వాటిలో ఉత్తరాంచల్‌లో ఉన్న అతి సుందర ప్రాంతం నైనిటాల్ ఒకటి. హిమాలయ ప్రాంతంలో అందమైన ప్రకృతి సోయగాలతో 12 చ.కిమీ విస్తీర్ణంలో 6000 అడుగల ఎత్తులో ఉన్న ఈ హిల్‌స్టేషన్ విశేషాల గురించి మనమూ తెలుసుకుందామా..! భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలిచే నైనిటాల్ హిమాలయ శ్రేణుల్లో ఉంది. కుమావోస్ హిల్స్ మధ్య భాగంలో అందమైన సరస్సులతో నిండి ఉంది. నైనిటాల్ను పూర్వం నైనితాల్ అని పిలిచేవారు. నైనీ అంటే నయనం, తాల్ అంటే సరస్సు అని అర్థం. ఇది ప్రసిద్ధ హిల్‌స్టేషన్ గానేకాక పుణ్యక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. పర్యాటక ఆకర్షణలు.. కిల్బరీ.. నైనిటాల్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న అందమైన పిక్నిక్ స్పాట్ ఇది. పచ్చని ఓక్, పైన్, రోడోడెండ్రాడ్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశంగా మార్చాయి. ఈ అడవుల్లో సుమారు 580 జాతులకు పైగా పలు రకాల వృక్ష జాతులు, రంగురంగుల పక్షులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2481 అడుగుల ఎత్తున ఉన్న లరికంత పర్యాటకులకు ఎన్నో అందమైన హిమాలయ దృశ్యాలను చూపుతుంది. ఇది నైనిటాల్లో రెండో ఎత్తై ప్రాంతం. నైనాదేవి ఆలయం.. నైనాదేవి ఆలయం ఒక శక్తి పీఠం. నైని సరస్సుకు ఉత్తర దిశగా ఉంది. ఈ గుడిలో హిందువుల దేవత నైనాదేవి కొలువై ఉంది. ఈమె విగ్రహంతో పాటు గణపతి, కాలి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న పెద్ద రావిచెట్టు ఎంతో పురాతనమైంది. చైనా శిఖరం.. నైనా శిఖరాన్నే చైనా శిఖరం అంటారు. ఇది నైనిటాల్లో ఎత్తై శిఖరం. సముద్ర మట్టానికి 2611 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని చేరుకోవాలంటే గుర్రంపై వెళ్లాలి. టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం. ఇక్కడ చాలా ఆహ్లాదంగా గడపొచ్చు. ఇక్కడే ఒక ఎకోకేవ్ గార్డెన్ కూడా ఉంది. రోప్.. నైనిటా రోప్ వే ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. దీన్ని కుమావొస్ మండల వికాస్ నిగం నిర్వహిస్తుంది. ఇది ఇండియాలో స్థాపించిన తొలి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీటర్ల ఎత్తులో కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 825 కిలోల బరువు మోయగలదు. ఈ రోప్ వే స్నోవ్యూను కలుపుతుంది. రోప్ వే సెకనుకు 6 మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో టూరిస్టులు అద్భుత దృశ్యాలు చూసేందుకు అవకాశం ఉంటుంది. నైనీ సరస్సు.. నైనిటాల్లో నైనీ సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలతో కన్ను ఆకారంతో ఉంటుంది. దీన్నే ‘ముగ్గురు రుషుల సరస్సు’ అని కూడా అంటారు. ఈ పేరు స్కందపురాణంలోని మానస్‌ఖండ్ అధ్యాయంలో ఉంది. ఈ సరస్సు చాలా పొడవైంది. దీని ఉత్తరపు కొనను ‘మల్లితాల్’ అని, దక్షిణపు కొనను ‘తల్లితాల్’ అనీ అంటారు. స్నో వ్యూ.. స్నో వ్యూ అనేది సముద్ర మట్టానికి 2270 మీటర్ల ఎత్తున ఉన్న ఒక సుందర ప్రదేశం. ఇది నైనిటాల్ సిటీకు 2.5 కి.మీల దూరంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు చేరుకోవాలంటే రోప్‌వే, వాహనాల ద్వారా ప్రయాణించొచ్చు. ఇది షేర్ క దండ అనే ఎత్తై చిన్న కొండపై ఉంది. గుహల తోట.. గుహలతోటను ఇకో గుహ గార్డెన్ అనికూడా పిలుస్తారు. ఈ గార్డెన్ పర్యావరణాన్ని ఆరాధించే వారికి ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ గుహలు పెట్రోమాక్స్ దీపాలతో ఒక మ్యూజికల్ ఫౌంటెన్‌తో ఉంటాయి. ఈ గుహలను టైగర్ కేవ్, పాంథర్ కేవ్, బాట్ కేవ్, స్క్విరాల్ కేవ్, ఫ్లై ఇంగ్ ఫాక్స్ కేవ్, ఏప్ కేవ్.. అని రకరకాల పేర్లతో పిలుస్తారు. హార్స్ రైడింగ్.. నైనిటాల్లో హార్స్‌రైడింగ్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వివిధ ప్రదేశాలను వీక్షించేందుకు గుర్రాలను రవాణాకు వినియోగిస్తారు. సిటీలో గుర్రపుస్వారీని నిషేధించినప్పటికీ బారాపత్తర్ వద్ద దీన్ని ఆనందించొచ్చు. గుర్రాల పేడ సరస్సును కలుషితం చేస్తోందన్న కారణంతో నగరంలో గుర్రాల వినియోగం నిషేధించారు. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్’ నైనిటాల్లో ప్రధాన ఆకర్షణ. ఈ సంస్థ మనోర శిఖరంపై నైనిటాల్‌కు 9 కి.మీ దూరంలో ఉంది. ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఈ సంస్థ ఆసక్తి కలవారికి ముందస్తు అనుమతులతో వారి టెలిస్కోప్‌లలో గ్రహాలు, నక్షత్రాలు పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సంస్థను 1955లో స్థాపించారు. చరిత్ర.. బ్రిటిష్ వ్యాపారి బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఇక్కడ ఒక బ్రిటిష్ కాలనీని స్థాపించి ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తర్వాత కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. దీని పూర్తి స్థాయి అభివృద్ధి మాత్రం 1841 తర్వాతే ప్రారంభమయింది. షాజాన్వూరుకు చెందిన ఒక చక్కెర వ్యాపారి భక్తుల వసతి గృహం స్థాపించడంతో ఇక్కడ తొలి నిర్మాణం ప్రారంభమయింది. 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ అర్టిల్లరీ నైనిటాల్ను సందర్శించాడు. తర్వాత యునెటైడ్ ప్రొవిన్స్ గవర్నర్‌కు వేసవి విడిదిగా మారింది. -
భారీ పొడవైన గిరి నాగుపాము కలకలం!
చీడికాడ: విశాఖ జిల్లాలో అరుదైన ఓ సర్పం కనిపించింది. ఈ ఫొటోలో కనిపిస్తున్నది 12 అడుగుల పొడవైన గిరినాగు. విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో మంగళవారం ఇది ప్రత్యక్షమైంది. కోటి కల్లంలో గల కోళ్లను తరుముతుండగా ఈ అరుదైన గిరి నాగుపాము ప్రత్యక్షం కావడంతో రైతులు మొదట కాసేపు పరుగులు పెట్టారు. అయితే, కొంత మంది ధైర్యం చేసి ఎలాగోలా చివరికి దాన్ని కొట్టి చంపేశారు. పాము శరీరమంతా లేత ఆకుపచ్చ రంగులో ఉండగా తోక భాగంలో అడుగు మేర నల్లటి రంగు, తెల్లటి చారలతో ఉందని, దాన్ని గిరి నాగుపాము అంటారని పామును చంపిన వారు వివరించారు. -
తేనీటీ తోటల్లో...
ఈ నెల 15న టీ డే తేయాకు తోటల స్వర్గం... డార్జిలింగ్! భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన హిల్‌స్టేషన్ డార్జిలింగ్! ఈ ప్రాంతం చుట్టూ ఎటు చూసినా అబ్బురపరిచే తేయాకుతోటల సౌందర్యం కళ్లారా చూసి తీరాల్సిందే! సందర్శన కోసం: ‘హ్యాపీ వ్యాలీ టీ ఎస్టేట్’ డార్జిలింగ్ ఉత్తర పట్టణం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో 1854లో ఆంగ్లేయులు తేయాకు తోటల పెంపకం చేపట్టారు. ఆ తర్వాత కలకత్తాలోని ధనికులైన కొంతమంది ఈ తోటల పెంపకాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. సముద్రమట్టానికి 2,750 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద టీ గార్డెన్. మంగళవారం నుంచి శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఈ తేయాకు తోటల సందర్శనకు వెళ్లవచ్చు.ఎప్పుడు వెళ్లవచ్చంటే: జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు అధికం కాబట్టి ఈ మాసాలలో ఈ ప్రాంతానికి వెళ్లకపోవడమే మంచిది. మార్చ్ నుంచి నవంబర్ వరకు తేయాకు సేకరణలో మునిగిపోతారు. కాబట్టి ఈ మాసాలు అనుకూలం. తేయాకు తోటలకు రాజధాని... అస్సాం... మన దేశంలోని ఉత్తర ఈశాన్యంలో మారుమూల ప్రాంతంలో ఉన్న అస్సాం తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి బ్రహ్మపుత్ర లోయలో అతి విస్తారమైన తేయాకు తోటలు ఉన్నాయి. అస్సాంలో ముఖ్య ప్రాంతమైన జొర్హాట్ లోయ మధ్య ప్రాంతాన్ని ‘ప్రపంచపు తేయాకు తోటలకు రాజధాని’గా అభివర్ణిస్తారు. సందర్శన కోసం: జొర్హ్హాట్కు దగ్గరలో గల గటూంగా టీ ఎస్టేట్‌కు చేరుకోవాలి. ఈ ప్రాంతంలో 100 ఏళ్లుగా పర్యాటకుల కోసం గెస్ట్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ వసతి సదుపాయాలు పొందుతూనే తేయాకు తోటల పెంపకాన్ని వీక్షించవచ్చు. ఇక్కడి తేయాకు పరిశ్రమలో టీ పొడులు ఎలా తయారవుతున్నదీ తెలుసుకోవచ్చు. ఎప్పుడు వెళ్లవచ్చంటే: మే నుంచి జూన్ చివరి వరకు ఇక్కడి తేయాకు తోటల సందర్శనకు మంచి అనువైన కాలం. డిసెంబర్ మొదటి వారం నుంచి ఇక్కడ తోయాకు తోటల పెంపకాన్ని మొదలుపెడతారు. ప్రతి యేటా నవంబర్‌లో జొర్హాట్‌లో ‘తేయాకు ఉత్సవం’ జరుపుతారు. మది దోచే తేనీటి పరిమళం... మున్నార్... భూతల స్వర్గంగా అంతా అభివర్ణించే రాష్ట్రం కేరళలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం మున్నార్! మైళ్ల కొద్ది విస్తారంగా ఉండే ఇక్కడి తేయాకు తోటల వీక్షణకు పర్యాటకులు అధికంగా వెంచేస్తుంటారు. సందర్శన కోసం: మున్నార్‌లోని ‘నల్లతన్ని ఎస్టేట్ టీ మ్యూజియమ్’ అత్యద్భుతమైనదిగా పేరుగాంచింది. సోమవారం మినహా మిగతా అన్ని రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎస్టేట్‌ను సందర్శించవచ్చు. కుండలే టీ ప్లాంటేషన్ చుట్టూ అందమైన సరస్సు, రిసార్టులు ఉన్నాయి.ఎప్పుడు వెళ్లవచ్చంటే: ఆగస్టు నుంచి మే వరకు మంచి అనువైన సమయం. డిసెంబర్ నుంచి జనవరి చివరి వరకు ఇక్కడ చలి చాలా ఎక్కువ. నిగారింపైన తోటలు... నీలగిరి పర్వతాలు... దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో నీలగిరి పర్వతశ్రేణులు దట్టమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ సువాసనభరితమైన తేయాకు తోటల పెంపకానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. సందర్శన కోసం: ఇక్కడి సిమ్స్ పార్క్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ‘హై ఫీల్డ్ టీ ఫ్యాక్టరీ’ ఉంది. ఇది కూనూర్‌లోని అత్యద్భుతమైన తేయాకు పరిశ్రమగా పేరొందింది. ఇక్కడ ఇళ్లలో తయారు చేసిన తేయాకు పొడులు లభిస్తాయి. ‘తేయాకు గూడు’ అనే పేరు పొందిన ‘సింగర టీ ఎస్టేట్’ కూనూరులోనే ఉంది. నీలగిరి పర్వతశ్రేణులలోని తేయాకు తోటలను వీక్షించడానికి ఇక్కడ టాయ్ ట్రైన్ సౌలభ్యం ఉంది. కోయంబత్తూరు నుంచి కూనూర్ వెళ్లి, తిరిగి కోయంబత్తూరు చేరుకోవచ్చు. ఎప్పుడు వెళ్లవచ్చంటే: నీలగిరిలో సంవత్సరం పొడవునా తేయాకు తోటల పెంపకం ఉంటుంది. మంచి తేయాకు కావాలనుకుంటే మాత్రం చలికాలం (నవంబర్ నుంచి ఫిబ్రవరి) అనువైన సమయం. తేయాకు దేశం... వయనాడ్ కొండలపై వ్యవసాయానికే కాదు తేయాకు తోటలకూ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం కేరళ రాష్ట్రంలోని వయనాడ్. (ఇక్కడ అదనంగా కాఫీ ఇతర సుగంధ ద్రవ్యపు తోటలు కూడా ఉన్నాయి.) దక్షిణ కల్పెట్టలో ఎక్కువ తేయాకు తోటలు ఉన్నాయి. రోడ్డు మార్గాన చెంబ్రా పర్వత ప్రాంతంలో గల ప్రైవేట్ ఎస్టేట్‌నూ సందర్శించవచ్చు. సందర్శన కోసం: వయనాడు తేయాకు దేశంలో మనంతవాడిలోని ప్రియదర్శిని టీ ఎస్టేట్ పర్యాటకులకు విడిది కేంద్రంగా ఉంది. ఇక్కడి కొండలలో చెట్ల మీద గిరిజనుల ఇళ్లు కనిపిస్తాయి. అక్కడికి చేరుకోవాలంటే ట్రెక్కింగ్ తప్పనిసరి. అత్యంత ఎత్తులో ఉండే గిరిజనుల ఇళ్లు మనల్ని విస్మయానికి లోనుచేస్తాయి. ఎప్పుడు వెళ్లవచ్చంటే: సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం. మిగతా రుతువుల్లో ఈ ప్రాంతం సందర్శనకు అనువైనది. మణిరామ్ దేవన్ అనే వ్యాపారి అస్సాంలో తేయాకు పరిశ్రమను నెలకొల్పాడు. విదేశాలకు ఎగుమతి చేయాలని ఇక్కడ మొదటిసారి తోటల పెంపకం చేపట్టాడు. ఆ విధంగా 19వ శతాబ్దిలో మనకు తేయాకు పరిచయం అయ్యింది.తేయాకు పరిశ్రమలో అగ్రగామిగా చలామణి అవుతున్న చైనాకు బ్రిటన్ అడ్డుకట్టవేసింది. తేయాకు తోటల పెంపకంలో చైనా విత్తనాలు, వారి పెంపకం పద్ధతులనే ఆంగ్లేయులు అవలంబించారు. తేనీరు... నోరూరు ఈ నెల 10న ఓస్లోలో ప్రపంచ ప్రముఖులంతా ఏడాదికొకసారి కలిసి చేసే విందు భోజనంలో మన దేశ పరిమళం గుబాళించింది. నోబెల్ ప్రైజ్ వేడుకల గొప్పదనం అందరికీ తెలిసిందే! ఈ ప్రత్యేక వేడుకలో ఓప్రత్యేక తేనీటిని అక్కడి అతిరథులందరికీ సర్వ్ చేశారు. ఆ ప్రత్యేకత గల తేనీరు మన దేశంలోని ఈశాన్యరాష్ట్రమైన అస్సాంకు చెందినది. ఆ విధంగా ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ వేడుకలో అస్సాం టీ వార్తల్లోకెక్కింది. ఈ విందులో వడ్డించిన ప్రపంచంలోని పేరెన్నికగన్న 10,000 రకాల పదార్థాలలో మన దేశ సౌరభం అందరి ప్రశంసలు అందుకోవడం గర్వకారణం.