చియాంగ్ మాయ్ : ప్రతిరోజూ పర్వదినమే! | Tour Darshan on Thailand | Sakshi
Sakshi News home page

చియాంగ్ మాయ్ : ప్రతిరోజూ పర్వదినమే!

Published Sat, Apr 9 2016 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

చియాంగ్ మాయ్ : ప్రతిరోజూ పర్వదినమే!

చియాంగ్ మాయ్ : ప్రతిరోజూ పర్వదినమే!

టూర్‌దర్శన్
ప్రకృతికాంత సోయగం... సాగర అలల నిశ్శబ్ద భాషణం... మలయ సమీరపు శీతలం... పచ్చపచ్చగా మెరిసిపోయే భూతలం... ఇవన్నీ కలగలసిన స్వర్గం చియాంగ్ మాయ్. అక్కడ గడపడం అంటే నిజంగా ఓ సంబరం. చియాంగ్ మాయ్‌లో చెప్పలేనన్ని విశేషాలు, చూసే కొద్దీ చూడాలనిపించే అందాలు ఎన్నో ఉన్నాయి. మనల్ని కట్టి పడేస్తాయి. చూసే కనులుంటే... ఆస్వాదించే మనసుంటే... ఒక్కసారైనా చియాంగ్ మాయ్‌కు వెళ్లాల్సిందే!
 
థాయ్‌ల్యాండ్‌ని ఒక్క మాటలో నిర్వచించమంటే ఎవరైనా ఏం చెబుతారు? బహుశా ఒక పెద్ద రిలీఫ్ సెంటర్ అంటారేమో! సినిమాల ప్రభావమో ఏమో కానీ... విశ్రాంతి తీసుకోడానికి, ఒత్తిడిని వదిలించుకోవడానికి థాయ్‌ల్యాండ్ ఓ చక్కని ప్రదేశం అన్న ముద్ర అందరి మనసుల్లోనూ పడిపోయింది. ఒక రకంగా అది నిజమే. కానీ థాయ్‌ల్యాండ్ అంటే కేవలం విశ్రాంతికి విడిది కాదు. సంప్రదాయ సంగీత సాహిత్యాలకు కూడా విడిదే.

అది కేవలం మసాజుల కేంద్రం కాదు. మనసును శాంతి వైపునకు మళ్లించే ఆధ్యాత్మిక కేంద్రం కూడా. సరదాలు తీర్చుకునే ఆధునిక లోకం మాత్రమే కాదు. సంతోషానికి అసలైన అర్థం తెలుసుకునేందుకు పనికొచ్చే సరికొత్త ప్రపంచం కూడా. ఈ వాస్తవం... ఒక్కసారి చియాంగ్ మాయ్ నగరానికి వెళ్తే మనకు బోధపడుతుంది. థాయ్‌ల్యాండ్‌లోని అతి పెద్ద నగరాల్లో ఐదవది చియాంగ్ మాయ్. ఆ పేరుకు కొత్త నగరం అని అర్థం. ఒకప్పుడు లానా అనే రాజ్యానికి రాజధాని ఈ నగరం. అప్పట్లో దీన్ని చియాంగ్ రాయ్ అనేవారు.

థాయ్‌ల్యాండ్‌కు ఉత్తరాన ఉండే ఈ నగరం చుట్టూ ఓ పెద్ద ప్రహారీ గోడ కూడా ఉండేది. కాలక్రమంలో రాజరికం అంతరించింది. జీవన విధానంతో పాటు నగర రూపురేఖలు కూడా బాగా మారిపోయాయి. మెల్లగా ఆ గోడ శిధిలమయ్యి అవశేషాలు మాత్రం మిగిలాయి. చివరికి నగరం పేరు కూడా చియాంగ్ మాయ్‌గా మారింది. సంద్రపు అలలూ ఇసుక తిన్నెలూ... మలయ పవనాలూ మత్తెక్కించే పూల పరిమళాలూ... పర్వత సానువులూ పుడమి కాగితంపై ప్రకృతి గీసిన పచ్చని చిత్రాలూ... ఆధ్మాత్మిక కేంద్రాలూ అంబరాన్నంటే సంబరాలూ... చియాంగ్ మాయ్‌లో ప్రతిదీ ప్రత్యేకమే. ప్రతిచోటా అందమే. ప్రతి క్షణమూ ఆనందమే.
 
ఎటు చూసినా బుద్ధుని జాడలే....
చియాంగ్ మాయ్‌లో ముఖ్యంగా చెప్పుకోవా ల్సింది అక్కడి ఆలయాల గురించి. ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా బౌద్ధాలయాలు. ఏడు వందల యేళ్ల పురాతనమైన బౌద్ధాలయం నుంచి, అత్యాధునికంగా నిర్మించిన ఆలయాల వరకూ ఎన్నో ఉన్నాయక్కడ. వాటిలో బౌద్ధ సన్యాసులు నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాషాయపు వస్త్రాలు ధరించిన ఆ సాధువులు దారంట నడిచివెళ్తూ ఉంటే... బుద్ధుడే కనుల ముందు నడయాడుతున్నట్టుగా అనిపిస్తుంది. గుండెల నిండా ఆధ్యాత్మికత నిండిపోతుంది. ఏదో చెప్పలేని ప్రశాంతత మనసంతా పరచుకుంటుంది.     
 
ఏడాదంతా పండుగే పండుగ...
ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ పండుగలు ఉంటాయి. కానీ చియాంగ్ మాయ్‌లో ఉండేటన్ని పండుగలు మరెక్కడా ఉండవు. సంవత్సరం పొడవునా అక్కడ ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. అంబ్రెల్లా ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్, ల్యాటర్‌‌న ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్, బెలూన్ ఫెస్టివల్ అంటూ ప్రతి విషయాన్నీ ఓ పండుగలా చేసుకోవడం చియాంగ్ మాయ్ వారికే చెల్లింది.

ఫ్లవర్ ఫెస్టివల్ నాడు థాయ్‌ల్యాండ్‌లో పూచే ప్రతి రకమైన పువ్వూ చియాంగ్‌మాయ్‌కి చేరుకుంటుంది. వాటితో రకరకాల ఆకృతులు తయారు చేశారు. అలంకారాలు చేస్తారు. మనుషులు సైతం పూలతో అలంకరించుకుంటారు. కొందరైతే పూలతో చేసిన దుస్తులనే వేసుకుంటారు. ఆ రోజంతా చియాంగ్ మాయ్‌లో పూల పరిమళం గుప్పుమంటుంది.
 ఇక యేటా ఫుడ్ ఫెస్టివల్‌కి తప్పకుండా హాజరై తీరాల్సిందే. స్థానిక వంటకాలతో పాటు చైనీస్, జపనీస్ వంటకాలు కూడా అందులో ఉంటాయి.

విభిన్నమైన రుచులు, వైవిధ్యభరితమైన వంటకాలను ఆరగించడానికి భోజన ప్రియులకు అంతకంటే మంచి అవకాశం దొరకదు. అంబ్రెల్లా ఫెస్టివల్ నాడు నగరమంతా ఎక్కడ చూసినా గొడుగులే కనిపిస్తాయి. వీధుల్లో వెదురు బొంగులు పాతి, కరెంటు తీగలు వేసినట్టుగా వీధులన్నిటిలో అంత ఎత్తున తీగలు కడతారు. వాటికి రంగురంగుల గొడుగులను వేళ్లాడదీస్తారు. ప్రతి ఒక్కరూ గొడుగు చేతబట్టే బయటికి వెళ్తారు. రంగు రంగుల గొడుగులను అందరూ చేతబూని తిరగడం చూస్తుంటే... ఇలపై వేల ఇంద్రధనుస్సులుఒక్కసారే వెలిశాయా అనిపిస్తుంది.
 
ఇక ల్యాటర్‌‌న ఫెస్టివల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ పండుగను ఇ-పెంగ్ అంటారు. ‘ఇ’ అంటే రెండు, ‘పెంగ్’ అంటే నెల అని అర్థం. రెండో నెలలో వచ్చే పండుగ కనుక ఆ పేరుతో పిలుస్తారన్నమాట. ఆ పండుగ రోజున నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. చీకటి పడగానే ప్రతి ఇల్లూ దీపాలతో వెలిగిపోతుంది. అందరూ ల్యాటర్‌‌న్స (గాలిలో ఎగిరే విధంగా తయారు చేసిన లాంతర్లు) పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వస్తారు.

ఒక్కచోట చేరి, ప్రార్థనలు చేసి, ఆపైన ఆ లాంతర్లను గాల్లోకి ఎగరేస్తారు. ఆ లాంతర్లు ఆకాశానికి ఎగసి, చుక్కలతో పోటీపడుతూ మెరుస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఇలా చేయడం వల్ల కీడు మొత్తం పోయి శుభం జరుగుతుందని అక్కడివారి విశ్వాసం. అలాగే బెలూన్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్ తదితర ఎన్నో పండుగలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. వీటన్నిటినీ చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తూ ఉంటారు. చియాంగ్ మాయ్ టూరిజం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, థాయ్‌ల్యాండ్‌లోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో ప్రముఖమైనదిగా చియాంగ్ మాయ్ మారడానికి ఈ పండుగలే కారణం అంటుంది అక్కడి ప్రభుత్వం.
 
నగరం నిద్రపోదు...
సాధారణంగా ప్రపంచం  పగలు మేలుకుంటుంది. రాత్రిపూట నిద్రలోకి జారుకుంటుంది. కానీ చియాంగ్ మాయ్‌లో అలా కాదు. పగలు ప్రజలు పనుల్లో నిమగ్నమై పోతారు. రాతిరైతే షాపింగ్‌లు, విందులు, వినోదాలు, సరదాలు సంతోషాలంటూ బిజీ అయిపోతారు. ముఖ్యంగా షాపింగ్ అంతా చాలావరకూ రాత్రి పూటే చేస్తుంటారు. అందుకే చియాంగ్ మాయ్ నైట్ బజార్ చాలా ఫేమస్. ఈ బజార్లో షాపింగ్ చేయడం కోసం విదేశీ సందర్శకులు పని గట్టుకుని వస్తుంటారు కూడా.
 
ఈ విశేషాలన్నీ ఒకెత్తయితే అక్కడి ప్రకృతి సౌందర్యం ఒకెత్తు. ఎప్పుడూ చల్లగా వీచే గాలి హాయిపరుస్తుంది. వృక్ష సంపద కన్నులవిందు చేస్తూ ఉంటుంది. దానికితోడు యోగా, మసాజ్ సెంటర్లు కూడా ఉండటంతో మనసుతో పాటు శరీరానికి కూడా ఆహ్లాదమే!

* చియాంగ్ మాయ్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడికి నేరుగా వెళ్లవచ్చు. సీజన్‌ను బట్టి మనిషికి ఇరవై నుంచి ముప్ఫై వేల వరకూ ఉంటుంది టిక్కెట్ వెల. వెళ్లేటప్పుడే రిటర్న్ టిక్కెట్ కూడా చేయించుకుంటే కాస్త తక్కువకు వచ్చే అవకాశం ఉంటుంది!

* థాయ్‌ల్యాండ్ కరెన్సీని థాయి భట్ అంటారు. మన వంద రూపాయలు యాభై మూడు థాయి భట్స్‌కి సమానం!

* చియాంగ్ మాయ్‌లో అతి పెద్ద జూ ఒకటి ఉంది. దీనిలో విస్తారమైన జంతు సంపద ఉంది. దాంతో జంతు ప్రేమికులకు మంచి టైమ్‌పాస్. దానికి తోడు ప్రత్యేకంగా ఎలిఫెంట్ నేచర్ పార్‌‌క ఒకటుంది. ఇక్కడ ఏనుగులను సంరక్షించడమే కాదు... మావటి కావాలనుకునే వారికి ట్రెయినింగ్ కూడా ఇస్తుంటారు. వైల్డ్ లైఫ్ టూర్ ప్యాకేజీలు ఉంటాయి. బుక్ చేసుకుంటే మొత్తం అన్నిటినీ ఒకేసారి చూసేయొచ్చు.

* బో సంగ్ అనే ప్రాంతం హస్త కళలకు ప్రసిద్ధి. ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది గొడుగుల తయారీదారులే. వీరు ఓ ప్రత్యేక పద్ధతిలో తయారుచేసే గొడుగులు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement