గిరుల్... తరుల్... ఝరుల్ చలో కూనూర్! | Tour Darshan Summer Special Coonoor | Sakshi
Sakshi News home page

గిరుల్... తరుల్... ఝరుల్ చలో కూనూర్!

Published Sun, May 15 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

గిరుల్... తరుల్... ఝరుల్ చలో కూనూర్!

గిరుల్... తరుల్... ఝరుల్ చలో కూనూర్!

టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - కూనూర్
నీలగిరుల సొగసులను నిండుగా చూడాలని ఉందా..? నింగిని నిటారుగా తాకే కొండలు... కొండలను చీల్చుకుంటూ నేలవైపు పరుగులు తీసే జలపాతాల పరవళ్లను చూస్తూ పరవశించాలని ఉందా..? ఆకుపచ్చని లోకంలో ఆనందంగా విహరించాలని ఉందా..? వేసవి వేడికి దూరంగా... మనసుకు ఉపశమనం కలిగించే చల్లచల్లని ప్రదేశంలో గడపాలని ఉందా..? అయితే, చలో కూనూర్... అక్కడ ఇవన్నీ ఉంటాయి.
 
ఊటీకి కూతవేటు దూరంలోనే ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్, సమ్మర్ డెస్టినేషన్ కూనూర్. నీలగిరి కొండల నడుమ వెలిసిన చిన్న పట్టణం ఇది. ఎటుచూసినా తేయాకు తోటల పచ్చదనం... నిటారుగా నింగిని తాకే నీలగిరుల సొగసులు...పరవళ్లు తొక్కే జలపాతాల గలగలలు... సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న చల్లచల్లని ప్రశాంత ప్రదేశం కూనూర్. నిప్పులు చెరిగే ఎండలు ఇక్కడ ఉండనే ఉండవు. ఎంతటి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించవు.
 
తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ ప్రాంతంలో పూర్వం టోడా తెగకు చెందిన గిరిజనులు నివాసం ఉండేవారు. బ్రిటిష్ పాలకులు నీలగిరి ప్రాంతంలో చల్లని వాతావరణాన్ని గమనించి, ఊటీ మాదిరిగానే కూనూర్‌ను కూడా హిల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. ఒక బ్రిటిష్ అధికారి 1819లో ఈ ప్రదేశాన్ని తొలిసారిగా గుర్తించాడు. ఆ మరుసటి ఏడాదే ఆయన ఇక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. ఆ తర్వాత సంపన్న బ్రిటిష్ అధికారులు, వ్యాపారులు ఇక్కడ తమ తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్రమంగా కూనూర్ పట్టణంగా ఎదిగింది. బ్రిటిష్‌వారి హయాంలోనే ఇక్కడకు రైలుమార్గం ఏర్పడింది.
 
ఏం చూడాలి?
కూనూర్‌లోని సిమ్స్ పార్క్ చూసి తీరాల్సిన ప్రదేశం. వెయ్యికి పైగా వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లతో కనువిందు చేసే ఈ ఉద్యానవనం నందనవనాన్ని తలపిస్తుంది. అప్పట్లో మద్రాస్ క్లబ్ కార్యదర్శిగా పనిచేసిన బ్రిటిష్ అధికారి జె.డి.సిమ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఏటా మే నెలలో జరిగే పండ్లు, కూరగాయల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
 
కూనూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కూనూర్ పట్టణం, పరిసరాల్లోని పచ్చని తేయాకు తోటలు సహా నీలగిరుల అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. కూనూర్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డాల్ఫిన్ నోస్ వ్యూపాయింట్ నుంచి నీలగిరులను తిలకించాలని తహతహలాడతారు.
 
కూనూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ల్యాంబ్స్ రాక్ కూడా మరో అద్భుతమైన వ్యూ పాయింట్. ఇది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్‌కు వెళ్లే దారిలో ఉంటుంది. దీని పైనుంచి చూస్తే కూనూర్ పరిసరాలే కాదు, కోయంబత్తూరు మైదాన ప్రాంతంలో విస్తరించిన పచ్చదనం కూడా కనువిందు చేస్తుంది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రదేశం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు ఇష్టపడతారు.
 
కూనూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని లాస్ జలపాతం చూసి తీరాల్సిన ప్రదేశం. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే మార్గంలో ఉండే ఈ జలపాతం నీలగిరి కొండల మీదుగా దాదాపు 180 అడుగుల ఎత్తు నుంచి ఉరకలేస్తూ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే దారిలోనే కోటగిరి పట్టణానికి సమీపంలో కేథరీన్ జలపాతం కూడా చూసి తీరాల్సిందే. ఇది దాదాపు 250 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తుంది. ఈ జలపాతానికి కోటగిరి ప్రాంతంలో కాఫీ సాగును పరిచయం చేసిన బ్రిటిష్ అధికారి ఎండీ కాక్‌బర్న్ భార్య పేరు పెట్టారు.

ఏం కొనాలి?
* శ్రేష్టమైన తేయాకు చౌకగా దొరుకు తుంది. రకరకాల టీ పొడిని కొనుక్కోవచ్చు.
* గోర్మెట్ చీజ్‌కు కూనూర్ బాగా ఫేమస్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా దీనిని కొనుక్కుంటారు.
* స్వచ్ఛమైన తేనె, స్థానికంగా తయారయ్యే రకరకాల జామ్స్ ఇక్కడి దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి.
* ఇక్కడి దుకాణాల్లో స్థానికంగా తయారయ్యే హస్తకళాకృతులు, ఎంబ్రాయిడరీ చేసిన దిండు కవర్లు, కుషన్ కవర్లు, బెడ్‌షీట్స్, టీ సెట్లు కొనుక్కోవచ్చు.
 
ఏం చేయాలి?
* బోటింగ్, ట్రెక్కింగ్, వాకింగ్, షాపింగ్ వంటి వాటికి కూనూర్ చాలా అనువుగా ఉంటుంది. సిమ్స్ పార్కులోని కొలనులో బోటింగ్‌ను పిల్లలు బాగా ఆస్వాదిస్తారు.
* కూనూర్ నుంచి ఊటీ మధ్య నడిచే హెరిటేజ్ ట్రైన్‌లో ప్రయాణం కూడా గొప్ప అనుభూతి కలిగిస్తుంది. దాదాపు రెండు గంటలు సాగే ఈ ప్రయాణంలో తాపీగా ప్రకృతి అందాలను తిలకించవచ్చు.
* డాల్ఫిన్ నోస్, ల్యాంబ్స్ రాక్ ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటాయి. ట్రెక్కర్లను ఆకర్షించే మరో ప్రదేశం కూనూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బకాసుర కొండ. దీనిపై శిథిలావస్థలో ఉన్న డ్రూగ్ కోట శతాబ్దాల చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కోట 18వ శతాబ్దిలో టిప్పు సుల్తాను బలగాలకు స్థావరంగా ఉండేది.
* కూనూర్ శివార్లలో నలువైపులా విస్తరించి ఉన్న టీ తోటల్లో వాకింగ్ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌కు ఓపిక లేనివారు టీ తోటల్లో విహరిస్తూ నీలగిరుల అందాలను తిలకించవచ్చు.
 
ఎలా వెళ్లాలి?
* కోయంబత్తూరు వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనూర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది.
* కూనూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
* తమిళనాడు, కేరళలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement