మన దేశంలోనే... మరో కాశ్మీరం | Tour Darshan Summer Special pithoragarh | Sakshi
Sakshi News home page

మన దేశంలోనే... మరో కాశ్మీరం

Published Sun, May 22 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:37 AM

మన దేశంలోనే... మరో కాశ్మీరం

మన దేశంలోనే... మరో కాశ్మీరం

టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పితోరాగఢ్
ఉదయం వేళ హిమగిరుల ధవళకాంతుల ధగధగలు కనువిందు చేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో అంతా విస్తరించుకున్న ఆకుపచ్చదనం ఆనంద పరవశులను చేస్తుంది. ఘనచరిత్రకు సాక్షీభూతంగా నిలిచి ఉన్న కోట... వీర సైనికులకు నివాళిగా వెలసిన తోట... ఎన్నెన్నో గాథలు చెబుతాయి. పరిసర ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, మందిరాలు వాతావరణానికి పవిత్రతను అద్దుతూ ఉంటాయి. ఇలాంటి చాలా వింతలు, విశేషాలు గల ప్రదేశం పితోరాగఢ్. పర్వతశిఖరాల నడుమ వెలసిన ఈ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వేసవి యాత్రలో విహార, వినోదాలతో పాటు కొంత విజ్ఞానం, కొంత పరమార్థం కూడా కావాలనుకుంటే పితోరాగఢ్‌కు వెళ్లాల్సిందే!
 
హిమాలయాల దిగువన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చందక్, ధ్వజ్, కుమ్దార్, తల్ కేదార్ కొండల నడుమ వెలసిన పట్టణం పితోరాగఢ్. ఉదయం వేళ ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాల్లోని పంచ్‌చులి, నందాదేవి, నంద కోట్ శిఖరాలు తెల్లగా తళతళలాడుతూ కనువిందు చేస్తాయి. ఈ మూడు శిఖరాల నడుమనున్న లోయను స్థానికంగా ‘సోర్’లోయ అంటారు. అంటే చల్లని లోయ అని అర్థం. ఈ లోయ పరిసరాలన్నీ కశ్మీర్ లోయను తలపిస్తాయి. అందుకే ఈ లోయలో కాళీనది ఒడ్డున వెలసిన పితోరాగఢ్‌ను ‘మినీ కశ్మీర్’గా అభివర్ణిస్తారు. ట్రెక్కింగ్ చేసే యాత్రికులు ఇక్కడి నుంచి కైలాస పర్వతానికి, మానస సరోవరానికి చేరుకోవచ్చు. అందుకే దీనిని ‘హిమాలయాలకు ప్రవేశమార్గం’గా కూడా అభివర్ణిస్తారు.
 
ఏం చూడాలి?
చారిత్రక పట్టణమైన పితోరాగఢ్ రాజపుత్ర వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏలుబడిలో రాజధానిగా ఉండేది. పద్నాలుగో శతాబ్దంలో ఇదే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాల్ వంశపు రాజులు మూడు తరాల పాటు పరిపాలించారు. వారి తర్వాత నేపాల్‌కు చెందిన బ్రహ్మ వంశపు రాజులు, చాంద్ వంశపు రాజులు ఈ ప్రాంతాన్ని  పాలించారు. పాత కోట నాశనమైపోవడంతో చాంద్ వంశపు రాజులు 1790లో ఇక్కడ కొత్తగా కోటను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న ఆ కోటను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు.
 
* చాంద్ వంశీకులు ఎక్కువకాలం పరిపాలించిన పితోరాగఢ్‌లో ఇప్పటికీ పలు చిన్నా చితకా కోటలు, పురాతన మందిరాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. అప్పటి కోటల్లో ఒకదాంట్లో ప్రస్తుతం ట్రెజరీ, తహశిల్ కార్యాలయాలు పనిచేస్తుండగా, మరో కోటను పడగొట్టి, ఆ స్థలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నిర్మించారు.
* కశ్మీర్‌లో మరణించిన వీర సైనికుల జ్ఞాపకార్థం ఇండియన్ ఆర్మీ ఈ పట్టణంలో నిర్మించిన మహారాజా పార్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అరుదైన మొక్కలతో, పచ్చని పరిసరాలతో కనువిందు చేస్తుంది.
* పితోరాగఢ్‌కు 54 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 5412 అడుగుల ఎత్తున కుమావోన్ హిమాలయాల్లో ఏర్పాటు చేసిన ‘అస్కోట్ అభయారణ్యం’ మరో ప్రత్యేక ఆకర్షణ. మంచు చిరుతలు, హిమాలయన్ నల్ల ఎలుగులు, కస్తూరి మృగాలు, మంచు కాకులు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులను ఇక్కడ చూసి ఆనందించవచ్చు.
* పితోర్‌గఢ్‌కు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకోరీ హిల్‌స్టేషన్ ట్రెక్కర్లకు స్వర్గధామంలా ఉంటుంది. మంచుకొండలు, కొండల దిగువన తేయాకు తోటలతో కనువిందు చేసే చకోరీ నుంచి మూడు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి.
* వేసవి వినోదంతో పాటు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించుకోవాలనుకునే పర్యాటకులకు పితోరాగఢ్ చాలా అనువైన ప్రదేశం. ఇక్కడకు చేరువలోనే శైవ క్షేత్రాలైన పాతాళ భువనేశ్వర్, తల్ కేదార్, నకుల సహదేవులు నిర్మించారనే ప్రతీతి గల నకులేశ్వర ఆలయం, పురాతన ధ్వజ ఆలయం, కాళీ మందిరం వంటి పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
* పితోరాగఢ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని ఝులాఘాట్ పట్టణం షాపింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ పట్టణంలో కాళీ నదిపై నిర్మించిన వేలాడే కలప వంతెన నేపాల్‌ను కలుపుతుంది. ఈ వంతెన మీదుగా ఇక్కడి ప్రజలు నేపాల్‌కు, నేపాలీలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు.
 
ఏం కొనాలి?
* పితోరాగఢ్‌లో స్థానికంగా తయారయ్యే సంప్రదాయ హస్తకళా వస్తువులు చౌకగా దొరుకుతాయి.
* ఇక్కడి బజారులో దొరికే ఉన్ని శాలువలు, కంబళ్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు వంటివి కొనుక్కోవచ్చు.
* ఉద్యాన ఉత్పత్తులకు పితోరాగఢ్ పెట్టింది పేరు. ఇక్కడ స్థానికంగా పండే నారింజలు, ద్రాక్షలు, యాపిల్స్ రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పండే భారీ దోసకాయలు నీటి శాతంలో పుచ్చకాయలను తలపిస్తాయి.
 
ఏం చేయాలి?
* సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే పితోరాగఢ్ పరిసర ప్రదేశాలన్నీ పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. వేసవిలో ట్రెక్కింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది.
* చరిత్ర, వారసత్వ సంపద గురించి ఆసక్తి గల వారు ఇక్కడి పురాతన కోటలను, ఇతర కట్టడాలను సందర్శించుకోవచ్చు.
* తీర్థయాత్రలపై ఆసక్తి గల వారు పితోరాగఢ్ పరిసరాల్లోని ప్రాచీన ఆలయాలను సందర్శించుకోవచ్చు.
 
ఎలా చేరుకోవాలి?
ఇతర ప్రాంతాల వారు దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు విమాన మార్గంలో లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి మరో రైలులో హల్ద్వానీ లేదా తనక్‌పూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. హల్ద్వానీ నుంచి, తనక్‌పూర్ నుంచి పితోరాగఢ్ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement